40. నలుబదియవ అధ్యాయము
శంకరుడు అర్జునునకు వరము నిచ్చి తన ధామమునకు బయలుదేరుట.
దేవ దేవ ఉవాచ
నరస్త్వం పూర్వదేహే వై నారాయణసహాయవాన్ ।
బదర్యాం తప్తవానుగ్రహం తపో వర్షాయుతాన్ బహూన్ ॥ 1
దేవదేవుడిలా అన్నాడు - అర్జునా! పూర్వదేహంలో నారాయణుడు తోడుగాగల 'నర' మహర్షివి నీవు. బదరికావనంలో ఎన్నో వేల సంవత్సరాలు నీవు ఉగ్రతపస్సు చేశావు. (1)
త్వయి వా పరమం తేజః విష్ణౌ వా పురుషోత్తమే ।
యువాభ్యాం పురుషాగ్ర్యాభ్యాం తేజపా ధార్యతే జగత్ ॥ 2
నీలోను, పురుషోత్తముడైన విష్ణువులోను, పరమతేజస్సు ఉంది. పురుషశ్రేష్ఠులైన మీ ఇరువురి తేజస్సు చేత ఈ జగత్తు ధరింపబడుతోంది. (2)
శక్రాభిషేకే సుమహద్ ఢహనుర్జలదనిఃస్వనమ్ ।
ప్రగృహ్య దానవాః శస్తాః త్వయా కృష్ణేన చ ప్రభో ॥ 3
ప్రభూ! ఇంద్రుని అభిషేకం సమయంలో నీవు, శ్రీకృష్ణుడూ మేఘం వలె గర్జించే మహాధనువును తీసుకొని దానవులందరిని వధించారు. (3)
తదేతదేవ గాండీవం తవ పార్థ కరోచితమ్ ।
మాయామాస్థాయ యద్ గ్రస్తం మయా పురుషసత్తమ ॥ 4
పురుషసత్తమా! పార్థా! నీ చేతిలో ఉండుటకు తగినది గాండీవధనుస్సే, దాన్నే నేను నామాయచేత నాలో విలీనం చేసికొన్నాను. (4)
తూణౌ చాప్యక్షయౌ భూయః తవ పార్థ యథోచితౌ ।
భవిష్యతి శరీరం చ నీరుజం కురునందన ॥ 5
కురునందనా! పార్థా! అక్షయాలైన తూణీరరాలు కూడ నీచేతిలో ఉండదగినవే. నీ శరీరం రోగరహితమైనది కాగలదు. (5)
ప్రీతిమానస్మి తే పార్థ భవాన్ సత్యపరాక్రమః ।
గృహాణ పరమస్మత్తః కాంక్షితం పురుషోత్తమ ॥ 6
పురుషోత్తమా! పార్థా! నీపట్ల నేను ఆనందించాను. నీది సత్యమైన పరాక్రమం, నీమనోవాంఛితాన్ని నానుండి వరంగా కోరుకో. (6)
న త్వయా పురుషః కశ్చిత్ పుమాన్ మర్త్యేషు మానద ।
దివి వా వర్తతే క్షత్రం త్వత్ర్పధానమరిందమ ॥ 7
మానదా! మానవులలో కాని, స్వర్గంలో కాని నీతో సమానమైన పురుషుడు లేడు, శత్రుదమనా! క్షత్రియజాతిలో అందరికంటె నీవే శ్రేష్ఠుడవు. (7)
అర్జున ఉవాచ
భగవన్ దదాసి చేన్మహ్యం కామం ప్రీత్యా వృషధ్వజ ।
కామయే దివ్యమస్త్రం తద్ ఘోరం పాశుపతం ప్రభో ॥ 8
అర్జునుడిలా అన్నాడు - భగవంతుడా! వృషధ్వజా! నా వాంఛితాన్ని నీవు ప్రీతితో ఇచ్చేటట్లయితే, ప్రభూ! భయంకరమైన దివ్యమైన ఆ పాశుపతాస్త్రాన్ని కోరుకొంటున్నాను. (8)
యత్ తద్ బ్రహ్మశిరో నామ రౌద్రం భీమపరాక్రమమ్ ।
యుగాంతే దారుణే ప్రాప్తే కృత్స్నం సంహరతే జగత్ ॥ 9
దాన్ని బ్రహ్మశిరమని అంటారు. రుద్రుడవైన నీవే దానికి దేవతవు. భయానకమైన పరాక్రమం కల దది. దారుణ ప్రలయకాలంలో అది సమస్తజగత్తును సంహరిస్తుంది. (9)
కర్ణభీష్మకృపద్రోణైః భవితా తు మహాహవః ।
త్వత్రసాదాన్మహాదేవ జయేయం తాన్ యథా యుధి ॥ 10
మహాదేవా! కర్ణ, భీష్మ, కృప, ద్రోణులతో మహాయుద్ధం జరుగబోతోంది. నీ అనుగ్రహం వల్ల వారిని యుద్ధంలో నేను జయించాలి. (10)
దహేయం యేన సంగ్రామే దానవాన్ రాక్షసాంస్తథా ।
భూతాని చ పిశాచాంశ్చ గంధర్వానథ పన్నగాన్ ॥ 11
యస్మిన్ శూలసహస్రాణి గదాశ్చోగ్రప్రదర్శనాః ।
శరాశ్చాశివిషాకారాః సంభవంత్యనుమంత్రితే ॥ 12
ఆ అస్త్రం చెత యుద్ధంలో దానవులను, రాక్షసులను, భూతపిశాచాలను, గంధర్వులను, నాగులను దహిస్తాను. ఆ అస్త్రాన్ని అభిమంత్రణం చేస్తే వేలకొలది శూలాలు, చూడటానికి భయంకరమైన గదలు, సర్పాకారంలో ఉండే బాణాలు దాని నుండి వెలువడతాయి. (11,12)
యుధ్యేయం యేన భీష్మేణ ద్రోణేన చ కృపేణ చ ।
సూతపుత్రేణ చ రణే నిత్యం కటుకభాషిణా ॥ 13
ఆ అస్త్రంతో యుద్ధంలో భీష్మునితో, ద్రోణునితో, కృపునితో, సూతపుత్రుడూ, నిత్య పరుషభాషణుడూ అయిన కర్ణునితో పోరాడుతాను. (13)
ఏష మే ప్రథమః కామః భగవన్ భగనేత్రహన్ ।
త్వత్రసాదాద్ వినిర్వృత్తః సమర్థః స్యామహం యథా ॥ 14
భగవంతుడా! భగన్త్రనాశకా! ఇది నా మొదటి కోరిక, నీ అనుగ్రహం వల్ల నా కోరిక తీరితే, శత్రువులను జయించడానికి నేను సర్వసమర్థుడను అవుతాను. (14)
భవ ఉవాచ
దదామి తేఽస్త్రం దయితమ్ అహం పాశుపతం విభో ।
సమర్థో ధారణే మోక్షే సంహారే చాసి పాండవ ॥ 15
భవుడిలా అన్నాడు - పరాక్రమశాలీ! పాండునందనా! నాకు మిక్కిలి ఇష్టమైన పాశుపతాస్త్రాన్ని నేను నీకిస్తాను. దాన్ని ధరించడంలో, ప్రయోగించడంలో, ఉపసంహరించడంలో నీవు సమర్థుడవు. (15)
నైతద్ వేద మహేంద్రోఽపి న యమో న చ యక్షరాట్ ।
వరుణోఽప్యథవా వాయుః కుతో వేత్స్యంతి మానవాః ॥ 16
దేవరాజైన ఇంద్రుడుకాని, యమకుబేరులు కాని, వరుణుడు కాని, వాయుదేవుడు కాని, దీన్ని గురించి ఎరుగరు. ఇక సాధారణ మానవులు ఎలా తెలిసికోగలరు? (16)
న త్వేతత్ సహసా పార్థ మోక్తవ్యం పురుషే క్వచిత్ ।
జగద్ వినాశయేత్ సర్వమ్ అల్పతేజసి పాతితమ్ ॥ 17
కానీ కుంతీకుమారా! తొందరపాటుతో దీన్ని ఎవరి మీదా ప్రయోగించకూడదు. అల్పశక్తి గలవారిపై ప్రయోగిస్తే, ఇది జగత్తునంత నాశనం చేస్తుంది. (17)
అవధ్యో నామ నాస్త్యత్ర త్రైలోక్యే సచరాచరే ।
మనసా చక్షుషా వాచా ధనుషా చ నిపాతయేత్ ॥ 18
చరాచరమైన ఈ ముల్లోకాలలో దీనిచే చంపదగని వాడంటూ ఎవడూ లేడు. దీన్ని మనస్సు చేతకాని, దృష్టిచేకాని, వాక్కుచేకాని, ధనుస్సుచే కాని ప్రయోగించి శత్రువును నాశనం చేయవచ్చు. (18)
వైశంపాయన ఉవాచ
తచ్ఛ్రుత్వా త్వరితః పార్థః శుచిర్భూత్వా సమాహితః ।
ఉపసంగమ్య విశ్వేశమ్ అధీష్వేత్యథ సోఽబ్రవీత్ ॥ 19
వైశంపాయనుడిలా అన్నాడు- జనమేజయా! ఆ మాటలను విన్న అర్జునుడు త్వరగా పవిత్రుడై, సమాహిత చిత్తుడై, శిష్యభావంతో విశ్వేశ్వరుని సమీపించి, 'విశ్వేశ్వరా! ఉపదేశించు' అని పలికాడు. (19)
తతస్త్వధ్యాపయామాస సరహస్యనివర్తనమ్ ।
తదస్త్రం పాండవశ్రేష్ఠం మూర్తిమంతమివాంతకమ్ ॥ 20
ఉపతస్థే చ తత్ పార్థం యథా త్ర్యక్షముమాపతిమ్ ।
ప్రతిజగ్రాహ తచ్చాపి ప్రీతిమానర్జునస్తదా ॥ 21
అపుడు శివుడు రహస్య, ఉపసంహారాలతో కూడిన పాశుపతాస్త్ర విద్యను ఉపదేశించాడు. మునుపు ఈశ్వరుని వద్ద ఉన్నట్లుగా ఇపుడు ఆ పాశుపతాస్త్రం రూపు దాల్చిన యమునిలా ఉన్న పాండవశ్రేష్ఠుడైన అర్జునుని దగ్గరకు వచ్చింది. అపుడు అర్జునుడు దానిని గ్రహించి మిక్కిలి ఆనందించాడు. (20,21)
తతశ్చచాల పృథివీ సపర్వతవనద్రుమా ।
ససాగరవనోద్దేశా సగ్రామనగరాకరా ॥ 22
అపుడు పర్వతవనద్రుమాలతో, సాగర వన ప్రదేశాలతో, గ్రామనగరాలతో కూడిన భూమి కంపించింది. (22)
శంఖదుందుభిఘోషాశ్చ భేరీణాం చ సహస్రశః ।
తస్మిన్ ముహూర్తే సంప్రాప్తే నిర్ఘాతశ్చ మహానభూత్ ॥ 23
ఆ శుభసమయంలో శంఖదుందుభులు మ్రోగాయి. వేలకొలది భేరులు నినదించాయి. ఆకాశంలో వాయువుల ఒరిపిడి వేగంతో పిడుగులు పడ్డాయి. (23)
అథాస్త్రం జాజ్వలద్ ఘోరం పాండవస్యామితౌజసః ।
మూర్తిమద్ వై స్థితం పార్శ్వే దదృశుర్దేవదానవాః ॥ 24
భయంకరంగా మండుతూన్న ఆ అస్త్రం అమితపరాక్రమం గల అర్జునుని ప్రక్కన రూపుదాల్చి ఉండడం దేవదానవులంతా చూశారు. (24)
స్పృష్టస్య త్ర్యంబకేణాథ ఫాల్గునస్యామితౌజసః ।
యత్ కించిదశుభం దేహే తత్ సర్వం నాశమీయువత్ ॥ 25
అపుడు త్ర్యంబకుడు అర్జునుని దేహాన్ని తాకాడు. అందువల్ల అతని శరీరంలో అంతకుముందున్న అశుభం నశించింది. (25)
స్వర్గం గచ్ఛేత్యనుజ్ఞాతః త్ర్యంబకేణ తదార్జునః ।
ప్రణమ్య శిరసా రాజన్ ప్రాంజలిర్దేవమైక్షత ॥ 26
అటుపై ఈశ్వరుడు 'నీవు స్వర్గలోకానికి వెళ్ళు' అని అర్జునుని ఆజ్ఞాపించాడు. రాజా! అపుడు అర్జునుడు శిరస్సుతో నమస్కరించి, చేతులు జోడించి శివునికేసి చూశాడు. (26)
తతః ప్రభుస్త్రిదివనివాసినాం వశీ
మహామతిర్గిరిశ ఉమాపతిః శివః ।
ధనుర్మహద్ దితిజపిశాచసూదనం
దదౌ భవః పురుషవరాయ గాండివమ్ ॥ 27
ఆ తరువాత దేవతలందరికి ప్రభువు, జితేంద్రియుడు, మహాబుద్ధిమంతుడు, కైలాసగిరినివాసి, ఉమాపతి అయిన శివుడు రాక్షసులను, పిశాచులను సంహరిమ్చే గాండీవ మహాధనువును అర్జునునకు ఇచ్చాడు. (27)
తతః శుభం గిరివరమీశ్వరస్తదా
సహోమయా సితతటసానుకందరమ్ ।
విహాయ తం పతగమహర్షి సేవితం
జగామ ఖం పురుషవరస్య పశ్యతః ॥ 28
అనంతరం అర్జునుడు చూస్తూండగా ఉమాసహితుడైన ఈశ్వరుడు తెల్లని నేల, చరియలు, గుహలు గలిగి, శుభకరమైన పక్షులకు, మహర్షులకు ఆశ్రయమైన ఆ పర్వతాన్ని విడిచి ఆకాశానికి వెళ్ళాడు. (29)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి కైరాతపర్వణి శివప్రస్థానే చత్వారింశోఽధ్యాయః ॥ 40 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున కైరాతపర్వమను
ఉపపర్వమున శివప్రస్థానమను నలుబదియవ అధ్యాయము. (40)