10. పదియవ అధ్యాయము
మైత్రేయుడు దుర్యోధనుని శపించుట.
ధృతరాష్ట్ర ఉవాచ
ఏవమేతన్మహాప్రాజ్ఞ యథా వదసి నో మునే ।
అహం చైవ విజానామి సర్వే చేమే నరాధిపాః ॥ 1
ధృతరాష్ట్రుడిలా అన్నాడు.
మహాప్రాజ్ఞా! మునివరా! నీవు మాకు చెప్పినమాట యథార్థం. నేనూ ఎరుగుదును. ఇక్కడున్న ఈ నరాధిపులందరూ ఎరుగుదురు. (1)
భవాంశ్చ మన్యతే సాధు యత్ కురూణాం మహోదయమ్ ।
తదేవ విదురోఽప్యాహ భీష్మో ద్రోణశ్చ మాం మునే ॥ 2
నీవు కూడా కురువంశీయులందరి అభివృద్ధిని కోరుతున్నావు. బాగుంది. అదే విషయాన్ని విదుర, భీష్మ, ద్రోణులు కూడ నాకు చెప్పారు. (2)
యది త్వహమనుగ్రాహ్యః కౌరవ్యేషు దయా యది ।
అన్వశాధి దురాత్మానం పుత్రం దుర్యోధనం మమ ॥ 3
నేను నీకు అనుగ్రహింపదగినవాడినయితే, కురువంశీయుల పట్ల దయ ఉంటే, దుర్మార్గుడైన నా కుమారుని దుర్యోధనుని శాసించు. (3)
వ్యాస ఉవాచ
అయమాయాతి వై రాజన్ మైత్రేయో భగవానృషిః ।
అన్విష్య పాండవాన్ భ్రాతౄన్ ఇహైత్యస్మద్దిదృక్షయా ॥ 4
వ్యాసుడిలా అన్నాడు - రాజా! పూజ్యుడగు మైత్రేయ మహర్షి వస్తున్నాడు. పాండవ సోదరులను కలిసి, మనలను చూడాలని ఇక్కడకు వస్తున్నాడు. (4)
ఏష దుర్యోధనం పుత్రం తవ రాజన్ మహానృషిః ।
అనుశాస్తా యథాన్యాయం శమాయాస్య కులస్య చ ॥ 5
రాజా! ఈ వంశం యొక్క శాంతి కొరకై ఈ మహర్షి నీకుమారుని యథాన్యాయంగా శాసిస్తాడు. (5)
బ్రూయాద్ యదేష కౌరవ్య తత్ కార్యమవిశంకయా ।
అక్రియాయాం తు కార్యస్య పుత్రం తే శప్స్యతే రుషా ॥ 6
కురునందనా! అతడు చెప్పిన దాన్ని శంకించకుండా చేయాలి. అతడు చెప్పిన పని చేయకపోతే, కోపంతో నీ కుమారుని శపిస్తాడు. (6)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా యయౌ వ్యాసః మైత్రేయః ప్రత్యదృశ్యత ।
పూజయా ప్రతిజగ్రాహ నపుత్రస్తం నరాధిపః ॥ 7
వైశంపాయనుడిలా అన్నాడు - జనమేజయా! ఈ విధంగా చెప్పి వ్యాసుడు వెళ్ళాడు. మైత్రేయుడు వస్తూ కనబడ్డాడు. ధృతరాష్ట్రుడు తనకొడుకుతో కలిసి అతనికి సగౌరవంగా స్వాగతం పలికాడు. (7)
అర్ఘ్యాద్యాభిః క్రియాభిర్వై విశ్రాంతం మునిసత్తమమ్ ।
ప్రశ్రయేణా బ్రవీద్ రాజా ధృతరాష్ట్రోంబికాసుతః ॥ 8
అర్ఘ్యపాద్యాది - ఉపచారాలయి మునిశ్రేష్ఠుడు విశ్రాంతి పొందిన అపుడు మైత్రేయునితో అంబికాసుతుడైన ధృతరాష్ట్రమహారాజు సవినయంగా ఇలా అన్నాడు. (8)
సుఖేనాగమనం కచ్చిద్ భగవన్ కురుజాంగలాన్ ।
కచ్చిత్ కుశలినో వీరాః భ్రాతరః పంచపాండవాః ॥ 9
పూజ్యుడా! కురుదేశాలకు నీవు సుఖంగా వచ్చావా? వీరులు, సోదరులైన పంచపాండవులు కుశలంగా ఉన్నారా? (9)
సమయే స్థాతుమిచ్ఛంతి కచ్చిచ్చ భరతర్షభాః ।
కచ్చిత్ కురూణాం సౌభ్రాత్రమ్ అవ్యుచ్ఛిన్నం భవిష్యతి ॥ 10
ఆ భరతశ్రేష్ఠులు ప్రతిజ్ఞాపాలనలో స్థిరంగా ఉండాలనుకొంటున్నారా? కౌరవులలో భ్రాతృభావం అవిచ్ఛన్నంగా ఉంటుందా? (10)
మైత్రేయ ఉవాచ
తీర్థయాత్రామనుక్రామన్ ప్రాప్తోఽస్మి కురుజాంగలాన్ ।
యదృచ్ఛయా ధర్మరాజం దృష్టవాన్ కామ్యకే వనే ॥ 11
మైత్రేయుడిలా అన్నాడు - తీర్థయాత్రలు చేస్తూ ఈ కురు దేశాలకు చేరాను. అనుకోకుండగా కామ్యకవనంలో ధర్మరాజును చూశాను. (11)
తం జటాజినసంవీతం తపోవననివాసినమ్ ।
సమాజగ్ముర్మహాత్మానం ద్రష్టుం మునిగణాః ప్రభో ॥ 12
రాజా! జటాజినాలు ధరించి, తపోవనంలో నివసిస్తూన్న మహాత్ముడైన ఆ ధర్మరాజును చూడ్డానికి మునుల సమూహాలు వచ్చాయి. (12)
తత్రాశ్రౌషం మహారాజ పుత్రాణాం తవ విభ్రమమ్ ।
అనయం ద్యూతరూపేణ మహాభయముపస్థితమ్ ॥ 13
మహారాజా! నీ పుత్రుల యొక్క అనీతికరమైన బుద్ధి చాంచల్యాన్ని గురించి అక్కడ విన్నాను. జూదరూపంలో మహాభయం దాపురించింది. (13)
తతోఽహం త్వామనుప్రాప్తః కౌరవాణామవేక్షయా ।
సదా హ్యభ్యధికః స్నేహః ప్రీతిశ్చ త్వయి మే ప్రభో ॥ 14
అనంతరం అక్కడ నుండి కౌరవులను చూడాలనే ఉద్దేశ్యంతో నీ దగ్గరకు వచ్చాను. రాజా! నీ యందు నాకెల్లప్పుడు మిక్కిలి స్నేహమూ, ప్రీతీ ఉన్నాయి. (14)
నైతదౌపయికం రాజన్ త్వయి భీష్మే చ జీవతి ।
యదన్యోన్యేన తే పుత్రాః విరుధ్యంతే కథంచన ॥ 15
రాజా! నీవూ, భీష్ముడూ జీవించి ఉండగా నీ పుత్రులు కౌరవపాండవులు పరస్పరం ఏదోవిధంగా విరోధించుకోవటం యుక్తంగా లేదు. (15)
మేఢీభూతః స్వయం రాజన్ నిగ్రహే ప్రగ్రహే భవాన్ ।
కిమర్థమనయం ఘోరమ్ ఉత్పద్యంతముపేక్షసే ॥ 16
రాజా! నీవు స్వయంగా అందరినీ బంధించి నిగ్రహించడంలో (నియంత్రించడంలో) స్తంభంలాంటివాడవు. జరుగుతున్న మహాఘోరమైన అనీతిని నీవెందుకు ఉపేక్షిస్తున్నావు? (16)
దస్యూనామివ యద్ వృత్తం సభాయాం కురునందన ।
తేన న భ్రాజసే రాజన్ తాపసానాం సమాగమే ॥ 17
కురునందనా! సభలో దోపిడీదారుల వ్యవహారం జరగడం చేత తపస్వుల సమూహంలో నీవు ప్రకాశించడం (గౌరవింపబడడం) లేదు. (17)
వైశంపాయన ఉవాచ
తతో వ్యావృత్య రాజానం దుర్యోధనమమర్షణమ్ ।
ఉవాచ శ్లక్ ష్ణయా వాచా మైత్రేయో భగవానృషిః ॥ 18
వైశంపాయనుడిలా అన్నాడు - అనంతరం పూజ్యుడైన మైత్రేయ మహర్షి అసహనంతో ఉన్న దుర్యోధనుని వైపుకు తిరిగి మధురంగా ఇలా అన్నాడు. (18)
మైత్రేయ ఉవాచ
దుర్యోధన మహాబాహో నిబోధ వదతాం వర ।
వచనం మే మహాభాగ బ్రువతో యద్ధితం తవ ॥ 19
మహాబాహూ దుర్యోధనా! వక్తలలో శ్రేష్ఠుడా! మహాభాగా! నేను నీకు చెప్పే హితవచనాన్ని బాగా అర్థం చేసుకో. (19)
మా ద్రుహః పాండవాన్ రాజన్ కురుష్వ ప్రియమాత్మనః ।
పాండవానాం కురూణాం చ లోకస్య చ నరర్షభ ॥ 20
రాజా! నరశ్రేష్ఠా! పాండవులకు ద్రోహం చేయకు. నీకు, పాండవులకు, కురువంశీయులకు, జనులకు ప్రియమైన దాన్ని చెయ్యి. (20)
తే హి సర్వే నరవ్యాఘ్రాః శూరా విక్రాంతయోధినః ।
సర్వే నాగాయుతప్రాణాః వజ్రసంహననా దృఢాః ॥ 21
నరశ్రేష్ఠులైన ఆ పాండవులందరూ శూరులు, పరాక్రమం గల యోధులూను, వారంతా వేలఏనుగుల బలమూ, వజ్రసమానమైన దేహమూ కలవారు. (21)
సత్యవ్రతధరాః సర్వే సర్వే పురుషమానినః ।
హంతారో దేవశత్రూణాం రక్షసాం కామరూపిణామ్ ॥ 22
హిడింబబకముఖ్యానాం కిర్మీరస్య చ రక్షసః ।
వారు సత్యవ్రతాన్ని పూనినవారు. పౌరుషాన్ని అభిమానించేవారు. దేవశత్రువులై, స్వేచ్ఛారూపం ధరించగల హిడింబాది రాక్షసులను, కిర్మీరుడనే రాక్షసునీ చంపినవారు. (22 1/2)
ఇతః ప్రద్రవతాం రాత్రౌ యః స తేషాం మహాత్మనామ్ ॥ 23
ఆవృత్య మార్గం రౌద్రాత్మా తస్థౌ గిరిరివాచలః ।
తం భీమః సమరశ్లాఘీ బలేన బలినాం వరః ॥ 24
జఘాన పశుమారేణ వ్యాఘ్రః క్షుద్రమృగం యథా ।
పశ్య దిగ్విజయే రాజన్ యథా భీమేన పాతితః ॥ 25
జరాసంధో మహేష్వాసః నాగాయుతబలో యుధి ।
సంబంధీ వాసుదేవశ్చ శ్యాలాః సర్వే చ పార్షతాః ॥ 26
ఇక్కడ నుండి వెళుతున్న మహాత్ములైన పాండవుల మార్గాన్ని రాత్రి సమయంలో ఆక్రమించుకొని భయంకరుడైన కిర్మీరుడనే రాక్షసుడు స్థిరమైన కొండలా అడ్డునిల్చాడు. బలిష్ఠులలో శ్రేష్ఠుడై, యుద్ధంలో ఆరితేరిన భీముడు తన బలంతో చిన్నమృగాన్ని పులి చంపినట్లుగా ఆ రాక్షసుని చంపాడు. రాజా! దిగ్విజయానికి వెళ్ళినపుడు భీముడు పదివేల ఏనుగుల బలం గల, జరాసంధుని బాహుయుద్ధంలో ఎలా చంపాడో చూడు. వసుదేవనందనుడు శ్రీకృష్ణుడు వారికి సంబంధించినవాడు. ద్రుపదపుత్రులంతా వారికి బావమరుదులు. (23-26)
కస్తాన్ యుధి సమాసీత జరామరణవాన్ నరః ।
తస్య తే శమ ఏవాస్తు పాండవైర్భరతర్షభ ॥ 27
భరతశ్రేష్ఠా! వారిని యుద్ధంలో జరామరణాలు గల మానవుడెవడు ఎదుర్కోగలడు? కావున పాండవులతో నీకు శాంతిపూర్వక స్నేహం ఉండుగాక. విరోధం వద్దు. (27)
కురు మే వచనం రాజన్ మా మన్యువశమన్వగాః ।
రాజా! నా మాటలను ఆచరించు. క్రోధానికి వశుడవై ప్రవర్తించకు. (27 1/2)
వైశంపాయన ఉవాచ
ఏవం తు బ్రువతస్తస్య మైత్రేయస్య విశాంపతే ॥ 28
ఊరుం గజకరాకారం కరేణాభిజఘాన సః ।
దుర్యోధనః స్మితం కృత్వా చరణేనోల్లిఖన్ మహీమ్ ॥ 29
వైశంపాయనుడిలా అన్నాడు - నరాధిపా! మైత్రేయుడు ఈ విధంగా చెపుతూండగా, దుర్యోధనుడు చిరునవ్వి నవ్వి, కాలితో నేలనురాస్తూ, ఏనుగుతొండం వంటి తనతొడను చేతితో చరిచాడు. (28,29)
న కించిదుక్త్వా దుర్మేధాః తస్థౌ కించిదవాఙ్ముఖః ।
తమశుశ్రూషమాణం తు విలిఖంతం వసుంధరామ్ ॥ 30
దృష్ట్వా దుర్యోధనం రాజన్ మైత్రేయం కోప ఆవిశత్ ।
స కోపవశమాపన్నః మైత్రేయో మునిసత్తమః ॥ 31
రాజా! దుర్బుద్ధి అయిన దుర్యోధనుడు ఏమీ మాట్లాడకుండా ముఖం కొంచెం ప్రక్కకు తిప్పుకొన్నాడు. తన మాటను వినడానికి ఇష్టపడక, నేలను కాలితో రాస్తున్న దుర్యోధనుని చూడగానే మైత్రేయునికి కోపం ఆవహించింది. మునిసత్తముడైన మైత్రేయుడు కోపావిష్టుడయ్యాడు. (30,31)
విధినా సంప్రణుదితః శాపాయాస్య మనో దధే ।
తతః స వార్యుపస్పృశ్య కోపసంరక్తలోచనః ।
మైత్రేయో ధార్తరాష్ట్రం తమ్ అశపద్ దుష్టచేతసమ్ ॥ 32
విధిచే ప్రేరేపింపబడి మైత్రేయుడు అతనిని శపించడానికి సంకల్పించాడు. అనంతరం నీటిని స్పృశించి, కోపంతో ఎర్రబడ్డ కన్నులతో మైత్రేయుడు దురాలోచన గల ధృతరాష్ట్రకుమారుడైన దుర్యోధనుని ఈ విధంగా శపించాడు. (32)
యస్మాత్ త్వం మామనాదృత్య నేమాం వాచం చికీర్షసి ।
తస్మాదస్యాభిమానస్య సద్యః ఫలమవాప్నుహి ॥ 33
నన్ను తిరస్కరించి, నా మాటను తిరిస్కరించే ఈ నీ అభిమానానికి (అహంకారానికి) వెంటనే ఫలితం అనుభవిస్తావు. (33)
త్వదభిద్రోహసంయుక్తం యుద్ధముత్పత్స్యతే మహత్ ।
తత్ర భీమో గదాఘాతైః తవోరుం భేత్స్యతే బలీ ॥ 34
నీద్రోహం కారణంగా పెద్ద యుద్ధం జరుగుతుంది. అందులో బలవంతుడైన భీముడు గదాఘాతాలతో నీతొడను (భగ్నం చేస్తాడు) విరక్కొడతాడు. (34)
ఇత్యేవముక్తే వచనే ధృతరాష్ట్రో మహీపతిః ।
ప్రసాదయామాస మునిం నైతదేవం భవేదితి ॥ 35
అతడీ విధంగా పలుకగా, ధృతరాష్ట్రమహారాజు ' ఇది ఈ విధంగా జరుగకూడదు' అని మునిని (ప్రసన్నుణ్ణి చేసికొన్నాడు) వేడుకొన్నాడు. (35)
మైత్రేయ ఉవాచ
శమం యాస్యతి చేత్ పుత్రః తవ రాజన్ యదా తదా ।
శాపో న బావితా తాత విపరీతే భవిష్యతి ॥ 36
మైత్రేయుడిలా అన్నాడు.
రాజా! నీ పుత్రుడు పాండవులతో విరోధించక శాంతిని పొందినట్లయితే ఈ శాపం జరుగదు. అట్లుకాని పక్షంలో జరుగుతుంది. అన్నాడు. (36)
వైశంపాయన ఉవాచ
విలక్షయంస్తు రాజేంద్ర దుర్యోధనపితా తదా ।
మైత్రేయం ప్రాహ కిర్మీరః కథం భీమేన పాతితః ॥ 37
వైశంపాయనుడిలా అన్నాడు - జనమేజయా! ధృతరాష్ట్రమహారాజు భీముని బలాన్ని గురించి విశేషంగా తెలిసికోగోరి, 'కిర్మీరుని భీముడు ఎలా సంహరించాడు'? అని మైత్రేయుని అడిగాడు. (37)
మైత్రేయ ఉవాచ
నాహం వక్ష్యామి తే భూయః న తే శుశ్రూషతే సుతః ।
ఏష తే విదురః సర్వమ్ ఆఖ్యాస్యతి గతే మయి ॥ 38
మైత్రేయుడిలా అన్నాడు - రాజా! నీ కుమారుడు నామాటను వినటం లేదు. అందువల్ల మళ్ళీ ఇపుడు నేను నీకేమీ చెప్పను. నేను వెళ్ళిన తరువాత ఈ విదురుడు నీకంతా చెపుతాడు. (38)
వైశంపాయన ఉవాచ
ఇత్యేవముక్త్వా మైత్రేయః ప్రాతిష్ఠత యథాఽఽగతమ్ ।
కిర్మీరవధసంవిగ్నః బహిర్దుర్యోధనో యయౌ ॥ 39
వైశంపాయనుడిలా అన్నాడు - ఈ విధంగా చెప్పి మైత్రేయుడు వచ్చిన విధంగానే బయలుదేరాడు. కిర్మీరవధ మాటతో ఉద్విగ్నుడైన దుర్యోధనుడు బయటకు వెళ్లిపోయాడు. (39)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అరణ్యపర్వణి మైత్రేయశాపే దశమోఽధ్యాయః ॥ 10 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున అరణ్యపర్వమను ఉపపర్వమున మైత్రేయ శాపమను పదవ అధ్యాయము. (10)