7. ఏడవ అధ్యాయము

దుష్టచతుష్టయము పాండవులను చంపబూనుట - వ్యాసాగమనము.

వైశంపాయన ఉవాచ
శ్రుత్వా చ విదురం ప్రాప్తం రాజ్ఞా చ పరిసాంత్వితమ్ ।
ధృతరాష్ట్రాత్మజో రాజా పర్యతప్యత దుర్మతిః ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు - విదురుడు తిరిగిరావడమూ, అతనిని ఊరడించటమూ విని దుర్బుద్ధియైన దుర్యోధనుడు మిక్కిలి పరితపించాడు. (1)
స సౌబలేయమానాయ్య కర్ణదుఃశాసనౌ తథా ।
అబ్రవీద్ వచనం రాజా ప్రవిశ్యాబుద్ధిజం తమః ॥ 2
అతడు శకుని, దుఃశాసన, కర్ణులను రప్పించి, వారితో అజ్ఞానంతోనూ, మోహంతోను ఇలా పలికాడు. (2)
ఏష ప్రత్యాగతో మంత్రీ ధృతరాష్ట్రస్య ధీమతః ।
విదురః పాండుపుత్రాణాం సుహృద్ విద్వాన్ హితే రతః ॥ 3
బుద్ధిమంతుడైన విదురుడు తిరిగివచ్చాడు. అతడు విద్వాంసుడు, పాండవులకు స్నేహితుడు, హితుడూను. (3)
యావదస్య పునర్బుద్ధిం విదురో నాపకర్షతి ।
పాండవానయనే తావద్ మంత్రయధ్వం హితం మమ ॥ 4
ఈ విదురుడు మా తండ్రి బుద్ధిని పాండవులను తిరిగి తీసికొని వచ్చే విషయంలోకి తీసుకురాకముందే నాకు హితమైన దాన్ని ఆలోచించండి. (4)
అథ పశ్యామ్యహం పార్థాన్ ప్రాప్తానిహ కథంచన ।
పునః శోషం గమిష్యామి నిరంబుర్నిరవగ్రహః ॥ 5
ఏవిధంగానైనాసరే ఇక్కడకు తిరిగి వచ్చిన పాండవులను చూసినట్లయితే, నేను నీటిని కూడ తీసికోకుండా స్వేచ్ఛగా నా శరీరాన్ని శుష్కింపజేసుకొంటాను. (5)
విషముద్బంధనం చైవ శస్త్రమగ్నిప్రవేశనమ్ ।
కరిష్యే న హి తానృద్ధాన్ పునర్ధ్రష్టుమిహోత్సహే ॥ 6
విషాన్ని తీసికొంటాను లేదా ఉరివేసికొంటాను, లేదా ఆయుధంతో ప్రాణాలు తీసికొంటాను. లేదా అగ్నిలో ప్రవేశిస్తాను. అంతేకాని మరల ఇక్కడ సంపదలతో ఉండే పాండవులను మాత్రం చూడలేను. (6)
శకునిరువాచ
కిం బాలిశమతిం రాజన్ ఆస్థితోఽసి విశాంపతే ।
గతాస్తే సమయం కృత్వా నైతదేవం భవిష్యతి ॥ 7
శకుని ఇలా అన్నాడు - రాజా! బాలునిలా ఆలోచిస్తున్నావేమిటి? వారు ప్రతిజ్ఞ చేసి వెళ్ళారు. కనుక ఈ విధంగా ఏమీ జరుగదు. (7)
సత్యవాక్యస్థితాః సర్వే పాండవా భరతర్షభ ।
పితుస్తే వచనం తాత న గ్రహీష్యంతి కర్హిచిత్ ॥ 8
పాండవులంతా సత్యవచనాన్ని పాలించేవారు. కావున నాయనా! నీ తండ్రి మాటను వారెప్పుడూ స్వీకరించరు. (8)
అథవా తే గ్రహీష్యంతి పునరేష్యంతి వా పురమ్ ।
నిరస్య సమయం సర్వే పణోఽస్మాకం భవిష్యతి ॥ 9
లేదా ఒకవేళ వారు నీ తండ్రి మాటలు గ్రహించి ప్రతిజ్ఞను విడిచి, తిరిగి హస్తినాపురానికి వస్తే, మన వ్యవహారం ఈ విధంగా ఉండాలి. (9)
సర్వే భవామో మధ్యస్థాః రాజ్ఞశ్ఛందానువర్తినః ।
ఛిద్రం బహు ప్రపశ్యంతః పాండవానాం సుసంవృతాః ॥ 10
మనమంతా రాజు ఆజ్ఞను పాలిస్తూ మధ్యస్థులంగా ఉందాం. రహస్యంగా పాండవుల లొసుగులను కనిపెడదాం. (10)
దుఃశాసన ఉవాచ
ఏవమేతన్మహాప్రాజ్ఞ యథా వదసి మాతుల ।
నిత్యం హి మే కథయతః తవ బుద్ధిర్విరోచతే ॥ 11
దుఃశాసనుడిలా అన్నాడు - మహాప్రాజ్ఞా! మాతులా! ఇది ఈ విధంగానే చేద్దాం. ఎల్లపుడూ సలహా చెప్పే నీ ఆలోచనే నాకు నచ్చుతుంది. (11)
కర్ణ ఉవాచ
కామమీక్షామహే సర్వే దుర్యోధన తవేప్సితమ్ ।
ఐకమత్యం హి నో రాజన్ సర్వేషామేవ లక్షయే ॥ 12
కర్ణుడిలా అన్నాడు - రాజా! దుర్యోధనా! మేమంతా నీకిష్టమైన కోర్కెను తీర్చటానికే నిరీక్షిస్తున్నాం. ఈ విషయంలో మనందరి ఐకమత్యాన్ని గుర్తిస్తున్నాను. (12)
నాగమిష్యంతి తే ధీరాః అకృత్వా కాలసంవిదమ్ ।
ఆగమిష్యంతి చేన్మోహాత్ పునర్ద్యూతేన తాన్ జయ ॥ 13
ధీరులైన పాండవులు ప్రతిజ్ణాకాలాన్ని పూర్తిచేయకుండా తిరిగిరారు. ఒకవేళ అజ్ఞానవశం వల్ల వస్తే మళ్లీ జూదంతో వారిని జయించు. (13)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తస్తు కర్ణేన రాజా దుర్యోధనస్తదా ।
నాతిహృష్టమనాః క్షిప్రమ్ అభవత్ స పరాఙ్ముఖః ॥ 14
వైశంపాయనుడిలా అన్నాడు - కర్ణుడు ఈ విధంగా చెప్పగానే దుర్యోధనుడు అంతగా సంతోషించలేదు. వేగంగా కర్ణుని పట్ల పరాజ్ముఖుడయ్యాడు. ముఖం ప్రక్కకు తిప్పుకొన్నాడు. (14)
ఉపలభ్య తతః కర్ణః వివృత్య నయనే శుభే ।
రోషాద్ దుఃశాసనం చైవ సౌబలం చ తమేవ చ ॥ 15
ఉవాచ పరమక్రుద్ధః ఉద్యమ్యాత్యానమాత్మనా ।
అథో మమ మతం యత్ తు తన్నిబోధత భూమిపాః ॥ 16
అనంతరం అతని అభిప్రాయాన్ని తెలిసికొన్న కర్ణుడు తన కన్నులు పెద్దవి చేసి, రోషంతో మిక్కిలి క్రుద్ధుడై తనకు తానుగా ఉద్యమించి శకుని దుఃశాసనులతోనూ దుర్యోధనునితోనూ 'భూపాలకులారా! ఈ విషయంలో నా అభిప్రాయాన్ని తెలిసికోండి' అని ఇలా అన్నాడు. (15,16)
ప్రియం సర్వే కరిష్యామః రాజ్ఞః కింకరపాణయః ।
న చాస్య శక్నుమః స్థాతుం ప్రియే సర్వే హ్యతంద్రితాః ॥ 17
రాజునకు సేవకులమూ, భుజాలమూ అయిన మనమంతా కలిసి రాజునకు ఇష్టాన్ని చేద్దాం. మనం అలసత్వం లేకుండా అతనికిష్టమైన విషయంలో నిలువలేకపోతున్నాం. (17)
వయం తు శస్త్రాణ్యాదాయ రథానాస్థాయ దంశితాః ।
గచ్ఛామః సహితా హంతుం పాండవాన్ వనగోచరాన్ ॥ 18
మనం ఆయుధాలు పట్టి, రథాలెక్కి వనవాసులైన పాండవులను చంపటానికి అంతా కలిసి వెడదాం. (18)
తేషు సర్వేషు శాంతేషు గతేష్వవిదితాం గతిమ్ ।
నిర్వివాదా భవిష్యంతి ధార్తరాష్ట్రాస్తథా వయమ్ ॥ 19
వారంతా మరణించి శాంతిస్తే ఏదో తెలియని (గతికి) లోకానికి వెళ్తే, ధార్తరాష్ట్రులకు వివాదమే లేదు. మనం కూడా అంతే. (19)
యావదేవ పరిద్యూనాః యావచ్ఛోకపరాయణాః ।
యావన్మిత్రవిహీనాశ్చ తావచ్ఛక్యా మతం మమ ॥ 20
వారు కష్టాల్లో ఉన్నంతవరకూ, దుఃఖంతో ఉన్నంతవరకూ, సహాయరహితులయి ఉన్నంత వరకూ యుద్ధంలో మనం వాళ్లను జయింపగలుగుతాం. (20)
తస్య తద్ వచనం శ్రుత్వా పూజయంతః పునః పునః ।
బాఢమిత్యేవ సర్వే ప్రత్యూచుః సూతజం తదా ॥ 21
కర్ణుని ఆ మాటను విని, మరల మరల అతనిని గౌరవిస్తూ, 'చాలబాగుంది' అని వారంతా అతనికి బదులిచ్చారు. (21)
ఏవముక్త్వా సుసంరబ్ధాః రథైః సర్వే పృథక్పృథక్ ।
నిర్యయుః పాండవాన్ హంతుం సహితాః కృతనిశ్చయాః ॥ 22
ఈ విధంగా అనుకొని, మిక్కిలి రోషంతో వారంతా వేరు వేరు రథాలను తీసికొని, పాండవులను చంపడానికి కృతనిశ్చయులై నగరం నుండి బయటకు వెళ్లారు. (22)
తాన్ ప్రస్థితాన్ పరిజ్ఞాయ కృష్ణద్వైపాయనః ప్రభుః ।
ఆజగామ విశుద్ధాత్మా దృష్ట్వా దివ్యేన చక్షుషా ॥ 23
సర్వసమర్ధుడై విశుద్ధాత్ముడైన వ్యాసుడు తన దివ్యదృష్టితో వారావిధంగా బయలుదేరడం తెలిసికొని హఠాత్తుగా అక్కడకు వచ్చాడు. (23)
ప్రతిషిధ్యాథ తాన్ సర్వాన్ భగవాన్ లోకపూజితః ।
ప్రజ్ఞాచక్షుషమాసీనమ్ ఉవాచాభ్యేత్య సత్వరమ్ ॥ 24
లోకపూజితుడైన వ్యాసభగవానుడు వారినందరిని కాదని, కూర్చున్న ప్రజ్ఞాచక్షువయిన ధృతరాష్ట్రుని వద్దకు వేగంగా వచ్చి ఇలా చెప్పాడు. (24)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి అరణ్యపర్వణి వ్యాసాగమనే సప్తమోఽధ్యాయః ॥ 7 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున అరణ్యపర్వమను ఉపపర్వమున వ్యాసాగమనమను ఏడవ అధ్యాయము. (7)