75. డెబ్బది ఐదవ అధ్యాయము

గాంధారి ప్రబోధమును ధృతరాష్ట్రుడు తిరస్కరించుట.

వైశంపాయన ఉవాచ
అథాబ్రవీన్మహారాజ ధృతరాష్ట్రం జనేశ్వరమ్ ।
పుత్రహార్దాద్ ధర్మయుక్తాం గాంధారీ శోకకర్శితా ॥ 1
మహారాజా! అప్పుడు రాబోయే అనిష్టాన్ని శంకించి ధర్మపరాయణ అయిన గాంధారి పుత్రస్నేహం వలన ఏర్పడిన శోకంతో భీతిల్లి, ధృతరాష్ట్ర మహారాజుతో ఇలా అన్నది. (1)
జాతే దుర్యోధనే క్షత్తా మహామతిరభాషత ।
నీయతాం పరలోకాయ సాధ్వయం కులపాంసనః ॥ 2
దుర్యోధనుడు పుట్టగానే మహామతి అయిన విదురుడు "ఈ బాలుడు వంశనాశకుడు, ఇతనిని వదలి పెట్టుట మంచిది" అని చెప్పాడు. (2)
వ్యనదజ్జాతమాత్రో హి గోమాయురివ భారత ।
అంతో నూనం కులస్యాస్య కురవస్తన్నిబోధత ॥ 3
భారతా! నక్కలాగా అరిచాడు. వీడు తప్పక వంశనాశకుడే. కౌరవులారా మీరు దీన్ని గ్రహించాలి. (3)
మా నిమజ్జీః స్వదోషేణ మహాప్సు త్వం హి భారత ।
మా బాలానామశిష్టానామ్ అభిమంస్థా మతిం ప్రభో ॥ 4
భారతా! వీడుపుట్టగానే స్వదోషంతో ఈ వంశాన్ని సముద్రంలో కలపకండి. ప్రభూ! దుర్మార్గులయిన ఈ బాలకుల మాటలను మన్నించకండి. (4)
మా కులస్య క్షయే ఘోరే కారణం త్వం భవిష్యసి ।
బద్ధం సేతుం కో ను భింద్యాద్ దమేచ్ఛాంతం చ పావకమ్ ॥ 5
శమే స్థితాన్ కో ను పార్థాన్ కోపయేద్ భరతర్షభ ।
స్మరంతం త్వామాజమీఢ స్మారయిష్యామ్యహం పునః ॥ 6
ఈ వంశవినాశానికి మీరు కారణం కాకండి. కట్టిన వంతెనను ఎవరైనా కూలుస్తారా? ఆరిన నిప్పును ఎవరైనా రాజేస్తారా? భరతర్షభా! శాంతించిన కౌంతేయులను మరల రెచ్చగొట్టటమెందుకు? ఆజమీఢా! తమకంతా తెలుసు. గుర్తున్నది కూడా. అయినా మరల గుర్తు చేస్తున్నాను. (5,6)
శాస్త్రం న శాస్తి దుర్బుద్ధిం శ్రేయసే చేతరాయ చ ।
న వై వృద్ధో బాలమతిః భవేద్ రాజన్ కథంచన ॥ 7
రాజా! దుర్బుద్ధికి శాస్త్రం మంచి కానీ, చెడు కానీ నేర్పలేదు. మందమతి అయిన బాలుడు వృద్ధుల వలె వివేకవంతుడు కాలేడు. (7)
త్వన్నేత్రాః సంతు తే పుత్రాః మా త్వాం దీర్ణా ప్రహాసిషుః ।
తస్మాదయం మద్వచనాత్ త్యజ్యతాం కులపాంసనః ॥ 8
తమ పుత్రులను తమరే నడిపించండి. లేకపోతే వారు హద్దుల నతిక్రమించి, భంగపడి బెదరిపోయి తమను వీడిపోతారు. నామాట విని వంశనాశకుడైన వీడిని వదలివేయండి. (8)
తథా తే న కృతం రాజన్ పుత్రస్నేహాన్నరాధిప ।
తస్య ప్రాప్తం ఫలం విద్ధి కులాంతకరణాయ యత్ ॥ 9
మహారాజా! పుత్రస్నేహం కారణంగా తమరు చేయవలసిన పనిని చేయలేదు. దాని ఫలితమే ఇది. ఇప్పుడు వంశమే నాశనం కావలసివస్తోంది. (9)
శమేన ధర్మేణ నయేన యుక్తా
మా తే బుద్ధిః సాస్తు తే మా ప్రమాదీః ।
ప్రధ్వంసినీ క్రూరసమాహితాశ్రీః
మృదుప్రౌఢా గచ్ఛతి పుత్రపౌత్రాన్ ॥ 10
శాంతి, ధర్మం, నీతి - వీటితో కలిసిన తమ బుద్ధిని అలాగే నిలుపుకోండి. పొరపాట్లు చేయకండి. క్రౌర్యంతో సాధించిన సంపద వినాశహేతువు అవుతుంది. మార్దవంతో కూడి ప్రౌఢిమతో సాధించిన లక్షి పుత్రపౌత్రపరంపరగా కొనసాగుతుంది. (10)
అథాబ్రవీన్మహారాజః గాంధారీం ధర్మదర్శినీమ్ ।
అంతః కామం కులస్యాస్తు న శక్నోమి నివారితుమ్ ॥ 11
అప్పుడు ధర్మదర్శిని అయిన గాంధారితో ధృతరాష్ట్ర మహారాజు ఇలా అన్నాడు - ఈ వంశం నాశనమైనా సరే నేను దుర్యోధనుని వారించలేను. (11)
యథేచ్ఛంతి తథైవాస్తు ప్రత్యాగచ్ఛంతు పాండవాః ।
పునర్ద్యూతం చ కుర్వంతు మామకాః పాండవైః సహ ॥ 12
వీరు కోరుకొన్నట్లే జరగనీ! పాండవులు తిరిగి రావలసినదే. నాకుమారులు ఆ పాండవులతో మరల జూదమాడవలసిందే. (12)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి అనుద్యూతపర్వణి గాంధారీవాక్యే పంచసప్తతితమోఽధ్యాయః ॥ 75 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున అనుద్యూతపర్వమను ఉపపర్వమున గాంధారీవాక్యమను డెబ్బది అయిదవ అధ్యాయము. (75)