54. ఏబది నాలుగవ అధ్యాయము
ధృతరాష్ట్రుడు దుర్యోధనునికి నచ్చజెప్పుట.
ధృతరాష్ట్ర ఉవాచ
త్వం వై జ్యేష్ఠో జ్యైష్ఠినేయః పుత్ర మా పాండవాన్ ద్విషః ।
ద్వేష్టా హ్యసుఖమాదత్తే యథైవ నిధనం తథా ॥ 1
ధృతరాష్ట్రుడు అంటున్నాడు - పుత్రా! నీవు నా పెద్దకొడుకువు. పట్టపురాణి గర్భాన పుట్టినవాడవు. పాండవులను ద్వేషించకు. ద్వేషించే మనిషి మృత్యువువలె అసుఖాన్ని పొందుతావు. (1)
అవ్యుత్పన్నం సమానార్థం తుల్యమిత్రం యుధిష్ఠిరమ్ ।
అద్విషంతం కథమ్ ద్విష్యాత్ త్వాదృశో భరతర్షభ ॥ 2
భరతసత్తమా! యుధిష్ఠిరుడు కపటం తెలియనివాడు. సంపదలు సమానంగా ఉండాలని కోరుకొనేవాడు. నీ మిత్రులపట్ల తుల్యభావం కలవాడు. నిన్ను ద్వేషించనివాడు. నీవంటి వాడు అతనిని ఎలా ద్వేషిస్తాడు? (2)
తుల్యాభిజనవీర్యశ్చ కథమ్ భ్రాతుః శ్రియం నృప ।
పుత్ర కామయసే మోహాన్మైవం భూః శామ్య మా శుచః ॥ 3
రాజా! నీవూ, యుధిష్ఠిరుడూ తుల్యమైన ఆభిజాత్యం, పరాక్రమం కలవారు. నాయనా! మోహవశుడవై సోదరుని సంపదను ఎందుకు కోరుకొంటావు? అలా ఎన్నడూ (అధముడవు) కాకు. శాంతించు. శోకించకు. (3)
అథ యజ్ఞవిభూతిం తాం కాంక్షసే భరతర్షభ ।
ఋత్విజస్తవ తన్వంతు సప్తతంతుం మహాధ్వరమ్ ॥ 4
భరతశ్రేష్ఠా! నీవు ఆ యజ్ఞవైభవమే కావాలనుకొంటే, ఋత్విజులు సప్తతంతువులతో కూడిన మహాయజ్ఞాన్ని నీకోసం అనుష్ఠింపచేస్తారు. (4)
ఆహరిష్యంతి రాజానః తవాపి విపులం ధనమ్ ।
ప్రీత్యా చ బహుమానాచ్చ రత్నాన్యాభరణాని చ ॥ 5
రాజులు నీకు కూడా ప్రీతితో, ఆదరంతో రత్నాలను, ఆభరణాలను, విస్తారమైన ధనాన్ని తెచ్చి ఇస్తారు. (5)
(మహీకామదుఘా సా హి వీరపత్నీతి చోచ్యతే ।
తథా వీర్యశ్రితా భూమిః తనుతే హి మనోరథమ్ ॥
తవాప్యస్తి హి చేద్ వీర్యం భోక్ష్యసే హి మహీమిమామ్ ॥)
భూమి కోరికలీడేర్చే కామధేనువని, అది వీరపత్ని అని చెప్తారు. భూమి పరాక్రమాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది, మనోరథాలు తీరుస్తుంది అని కూడా అంటారు. నీకు పరాక్రమమ్ ఉంటే ఈ భూమిని అనుభవిస్తావు.
అనార్యాచరితం తాత పరస్వ స్పృహణం భృశమ్ ।
స్వసంతుష్టః స్వధర్మస్థః యః స వై సుకమేధతే ॥ 6
అవ్యాపారః పరార్థేషు నిత్యోద్యోగః స్వకర్మసు ।
రక్షణం సముపాత్తానామ్ ఏతద్ వైభవలక్షణమ్ ॥ 7
తండ్రీ! ఇతరుల ధనాన్ని అపేక్షించడం అనార్యలక్షణం, తనకు ఉన్నదానితో తృప్తిపడుతూ, తన ధర్మాన్ని ఆచరించేవాడు సుఖంగా వృద్ధిలోకి వస్తాడు. ఇతరుల సంపదను పొందటానికి ప్రయత్నించకపోవడం, తాను చేయవలసిన పనులయందు నిరంతర ప్రయత్నశీలుడై ఉండడం, తనకు లభించిన దానిని రక్షించుకోవడం ఇదీ వైభవానికి లక్షణం. (6,7)
విపత్తిష్వవ్యధో దక్షః నిత్యముత్థానవాన్ నరః ।
అప్రమత్తో వినీతాత్మా నిత్యం భాద్రాణి పశ్యతి ॥ 8
ఆపదలలో క్రుంగిపోనివాడు, నిత్యమూ ప్రయత్నశీలుడైనవాడు, పొరపాట్లు చేయనివాడు, వినయం కలవాడు అయిన దక్షుడే ఎల్లప్పుడూ శుభాలను పొందగలుగుతాడు. (8)
బాహునివైతాన్ మా ఛేత్సీః పాండుపుత్రాస్తథైవ తే ।
భ్రాతౄణాం తద్ధనార్థం వై మిత్రద్రోహం చ మా కురు ॥ 9
పాండుపుత్రులు నీ బాహువుల వంటివారు. ఆ బాహువులను నరికివేయకు. సోదరుల సంపదను ఆశించి మిత్రద్రోహం చేయకు. (9)
పాండోఃపుత్రాన్ మా ద్విషస్వేహ రాజన్
తథైవ తే భ్రాతృధనం సమగ్రమ్ ।
మిత్రద్రోహే తాత మహానధర్మః
పితామహా యే తవ తేఽపి తేషామ్ ॥ 10
రాజా! పాండుపుత్రులను ద్వేషించకు. సోదరులయిన వారి సంపద అంతా నీది కూడా కదా! తండ్రీ! మిత్రద్రోహం చాలా అధర్మం సుమా! నీ తాతలు వారికీ తాతలే కదా! (10)
అంతర్వేద్యాం దదద్ విత్తం కామాననుభవన్ ప్రియాన్ ।
క్రీడన్ స్త్రీభిర్నిరాతంకః ప్రశామ్య భరతర్షభ ॥ 11
భరతశ్రేష్ఠా! యజ్ఞాలలో ధనం దానం చెయ్యి. ఇష్టమైన కోరికలను అనుభవించు. నిర్భయంగా స్త్రీలతో క్రీడించు. ఇలా ఉంటూ శాంతిని పొందు. (11)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి దుర్యోధనసంతాపే చతుః పంచాశత్తమోఽధ్యాయః ॥ 54 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున ద్యూతపర్వమను ఉపపర్వమున దుర్యోధనునకు నచ్చచెప్పుట అను ఏబది నాలుగవ అధ్యాయము. (54)
(దాక్షిణాత్య అధికపాఠము 1 1/2 శ్లోకములు కలిపి మొత్తము 12 1/2 శ్లోకాలు)