52. ఏబది రెండవ అధ్యాయము
దుర్యోధనుని సంతాపము.
దుర్యోధన ఉవాచ
దాయం తు వివిధం తస్మై శృణు మే గదతోఽనఘ ।
యజ్ఞార్థం రాజభిర్దత్తం మహాంతం ధనసంచయమ్ ॥ 1
అనఘా! యజ్ఞం కోసం రాజులు ఇచ్చిన మహాధనసమూహాలు అక్కడ ఎన్నోరకాలు ఉన్నాయి. వానిని చెపుతాను. విను. (1)
మేరుమందరయోర్మధ్యే శైలోదామభితో నదీమ్ ।
యే తే కీచకవేణూనాం ఛాయాం రమ్యాముపాసతే ॥ 2
ఖసా ఏకాసనా హ్యర్హాః ప్రదరా దీర్ఘవేణవః ।
పారదాశ్చ కుళిందాంశ్చ తంగణాః పరతంగణాః ॥ 3
తద్ వై పిపీలికం నామ ఉద్థృతం యత్ పిపీలికైః ।
జాతరూపం ద్రోణమేయమ్ అహార్షుః పుంజశో నృపాః ॥ 4
మేరుమందరపర్వతాల మధ్య ప్రవహించే శైలోదమనే నదికి ఇరువైపుల ఉన్న వెదురుబొంగుల అందమైన నీడలలో నివసించే ఖస, ఏకాసన, అర్హ, ప్రదర, దీర్ఘవేణు, పారద, కుళింద, తంగణ, పరతంగణ దేశాధిపతులైన రాజులు చీమలు కూడబెట్టిన "పిపీలికం" అనే బంగారాన్ని ద్రోనపరిమాణం కలదానిని కుప్పలుకుప్పలుగా తెచ్చారు. (2-4)
కృష్ణాన్ లలామాన్ చమరాన్ శుక్లాంశ్చాన్యాన్ శశిప్రభాన్ ।
హిమవత్పుష్పజం చైవ స్వాదు క్షౌద్రం బహు ॥ 5
ఉత్తరేభ్యః కురుభ్యశ్చాప్యపోఢం మాల్యమంబుభిః ।
ఉత్తరాదపి కైలాసాత్ ఓషధీః సుమహాబలాః ॥ 6
పర్వతీయా బలిం చాన్యమ్ ఆహృత్య ప్రణతాః స్థితాః ।
అజాతశత్రోర్నృపతేః ద్వారి తిష్ఠంతి వారితాః ॥ 7
శ్రేష్ఠమైన నల్లని చామరాలను, చంద్రకాంతి గల తెల్లని చామరాలను, హిమాలయపుష్పాల నుండి పుట్టిన రుచికరమైన మధువును, మిక్కిలిగా తెచ్చారు. మహాబలసంపన్నులైన పర్వతప్రాంతపు రాజులు ఇంకా ఉత్తరకురు దేశాలవారు గంగాజల సముద్భూతమై హారాలుగా కూర్చదగిన రత్నాలను, ఉత్తరకైలాసం నుండి ఓషధులను, కానుకలుగా తెచ్చి అజాతశత్రువు అయిన ఆ యుధిష్ఠిరుని ద్వారం వద్ద వినీతులై నిలిచిపోయారు. (5-7)
యే పరార్ధే హిమవతః సూర్యోదయగిరౌ నృపాః ॥
కారూషే చ సముద్రాంతే లౌహిత్యమభితశ్చ యే ॥ 8
ఫలమూలాశనా యే చ కిరాతాశ్చర్మవాససః ।
క్రూరశస్త్రాః క్రూరకృతః తాంశ్చ పశ్యామ్యహం ప్రభో ॥ 9
రాజా! హిమవత్పర్వతానికి ఆవలివైపు సూర్యోదయగిరిపై నివసించే రాజులు; సముద్రతీరమందున్న కారూషదేశపు వాసులు, లౌహిత్య పర్వతవాసులు - వీరంతా ఫలమూలాలు తినేవారు, చర్మవస్త్రధారులు, క్రూరశస్త్రాలు ధరించేవారు, క్రూరకర్ములు అయిన కిరాతులు - వీరిని కూడా అక్కడ నేను చూశాను. (8,9)
చందనాగురుకాష్ఠానాం భారాన్ కాళీయకస్య చ ।
చర్మరత్నసువర్ణానాం గంధానాం చైవ రాశయః ॥ 10
కైరాతకీనామయుతం దాసీనాం చ విశాంపతే ।
ఆహృత్య రమణీయార్థాన్ దూరజాన్ మృగపక్షిణః ॥ 11
నిచితం పర్వతేభ్యశ్చ హిరణ్యం భూరివర్చసమ్ ।
బలిం చ కృత్స్నమాదాయ ద్వారి తిష్ఠంతి వారితాః ॥ 12
చందనకాష్ఠాలు, అగురుకాష్ఠాలు, కృష్ణాగురుకాష్ఠాలు - వీటియొక్క మోపులను, చర్మాలు, రత్నాలు, బంగారం, గంధద్రవ్యాలు - వీటి రాశులను, కిరాత దేశవాసినులైన దాసీలను పదివేలమందిని, పర్వతప్రాంతాలలో దొరికే మిక్కిలి కాంతి గల బంగారాన్ని సంగ్రహించి సమస్తకానుకలతో వచ్చిన రాజులు ద్వారం వద్ద నిలిచి ఉండేవారు. (10-12)
కైరాతా దరదా దర్వాః శూరా వై యమకాస్తథా ।
ఔదుంబరా దుర్విభాగాః పారదా బాహ్లికైః సహ ॥ 13
కాశ్మీరాశ్చ కుమారాశ్చ ఘోరకా హంసకాయనాః ।
శిబిత్రిగర్తయౌధేయాః రాజన్యా భద్రకేకయాః ॥ 14
అంబష్ఠాః కౌకురాస్తార్ష్యాః వస్త్రపాః పహ్లవైః సహ ।
వశాతలాశ్చ మాలేయాః సహ క్షుద్రకమాలవైః ॥ 15
శౌండికాః కుకురాశ్చైవ శకాశ్చైవ విశాంపతే ।
అంగా వంగాశ్చ పుండ్రాశ్చ శాణవత్యా గయాస్తథా ॥ 16
సుజాతయః శ్రేణిమంతః శ్రేయాంసః శస్త్రధారిణః ।
అహార్షుః క్షత్రియా విత్తం శతశోఽజాతశత్రవే ॥ 17
కిరాత, దరద, దర్వ, శూర, యమక, ఔదుంబర, దుర్విభాగ, పారద, బాహ్లిక, కాశ్మీర, కుమార, ఘొరక, హంసకాయన, శిబి, త్రిగర్త, యౌధేయ, భద్ర, కేకయ, అంబష్ఠ, కౌకుర, తార్ష్య, వస్త్రవ, పహ్లవ, వశాతల, మౌలేయ, కుద్రక, మాలవ, శౌండిక, కుకుర, శాక, అంగ, వంగ, పుండ్ర, శాణవత్య, గయ-ఈ ఉత్తమకుల సంజాతులు, శ్రేష్ఠులు, శస్త్రధారులు అయిన క్షత్రియులు వందలకొద్దీ బారులు తీరి యుధిష్ఠిరునికి ధనాన్ని సమర్పించుకొన్నారు. (13-17)
వంగాః కళింగా మగధాస్తామ్రలిప్తాః సపుండ్రకాః ।
దౌవాలికాః సాగరకాః పత్రోర్ణాః శైశవాస్తథా ॥ 18
కర్ణప్రావరణాశ్చైవ బహవస్తత్ర భారత ।
తత్రస్థా ద్వారపాలైస్తే ప్రోచ్యంతే రాజశాసనాత్ ।
కృతకాలాః సుబలయః తతో ద్వారమవాప్స్యథ ॥ 19
భారతా! వంగ, కళింగ, మగధ, తామ్రలిప్త, పుండ్రక, దౌవాలిక, సాగరక, పత్రోర్ణ, శైశవ, కర్నప్రావరణ - మొదలైన అనేక క్షత్రియ భూపతులు ద్వారం వద్ద నిలుచుండగా రాజాజ్ఞపై ద్వారపాలురు వారికి "మంచి కానుకలను తెచ్చిన మీకందరికీ నిశ్చిత సమయంలో ప్రవేశం లభిస్తుంది" అని చెపుతున్నారు. (18,19)
ఈషాదంతాన్ హేమకక్షాన్ పద్మవర్ణాన్ కుథావృతాన్ ।
శైలాభాన్ నిత్యమత్తాంశ్చాప్యభితః కామ్యకం సరః ॥ 20
దత్వైకైకో దశశతాన్ కుంజరాన్ కవచావృతాన్ ।
క్షమావంతః కులీనాశ్చ ద్వారేన ప్రావిశంస్తదా ॥ 21
క్షమాశీలులు, కులీనులు అయిన రాజులు ఒక్కొక్కరు వేయి చొప్పున కామ్యకసరోవరసమీపంలో లభించే ఏనుగులను బహూకరించి లోపలకు ప్రవేశం పొందారు. ఆ ఏనుగులు పొడవైన దంతాలు కలిగి, బంగారు సూత్రాలతో కట్టబడి, పద్మవర్ణంతో, పైన వస్త్రాలు కప్పబడి, కవచావృతాలై, కొండలవలె, మదించి ఉన్నాయి. (20,21)
ఏతే చాన్యే చ బహవః గణా దిగ్భ్యః సమాగతాః ।
అన్యైశ్చోపాహృతాన్యత్ర రత్నానీహ మహాత్మభిః ॥ 22
వీరేకాక ఇంకా ఇతర భూపాలగణాలు అనేక దిక్కుల నుండి కానుకలను తెచ్చారు. మహాత్ములైన ఇతరులనేకులు కూడా అక్కడకు వచ్చి రత్నాలను కానుకలుగా సమర్పించారు. (22)
రాజా చిత్రరథో నామ గంధర్వో వాసవానుగః 7.
శతాని చత్వార్యదత్ హయానాం వాతరంహసామ్ ॥ 23
ఇంద్రుని స్నేహితుడు అయిన చిత్రరథుడనే గంధర్వరాజు వాయువేగం కలిగిన నాలుగువందల దివ్యాశ్వాలను ఇచ్చాడు. (23)
తుంబురుస్తు ప్రముదితః గంధర్వో వాజినాం శతమ్ ।
ఆమ్రపత్రసవర్ణానామ్ అదదాద్ధేమమాలినామ్ ॥ 24
తుంబురుడనే గంధర్వరాజు మహాసంతోషంతో - మామిడాకుల రంగుకలిగి, బంగారు హారాలతో అలంకరింపబడిన వంద గుఱ్ఱాలను ఇచ్చాడు. (24)
కృతీ రాజా చ కౌరవ్య శూకరాణామ్ విశాంపతే ।
అదదాద్ గజరత్నానాం శతాని సుబహూన్యథ ॥ 25
మహారాజా! కౌరవ్యా! పుణ్యాత్ముడైన శూకరదేశపు రాజు ఉత్తమమైన వంద ఏనుగులను ఇచ్చాడు. (25)
విరాటేన తు మత్స్యేన బల్యర్థం హేమమాలినమ్ ।
కుంజరాణాం సహస్రే ద్వే మత్తానాం సముపాహృతే ॥ 26
మత్స్యదేశపురాజయిన విరాటుడు బంగారుహారాలు కలిగిన రెండువేల మదపుటేనుగులను కానుకగా సమర్పించాడు. (26)
పాంశురాష్ట్రాద్ వసుదానః రాజా షడ్వింశతిం గజాన్ ।
అశ్వానాం చ సహస్రే ద్వే రాజన్ కాంచనమాలినామ్ ॥ 27
జవసత్త్వోపపన్నానాం వయస్థానాం నరాధిప ।
బలిం చ కృత్స్నమాదాయ పాండవేభ్యో న్యవేదయత్ ॥ 28
రాజా! వసుదానుడనే రాజు పాంశురాష్ట్రం నుండి ఇరవైయారు ఏనుగులను, జవసత్త్వాలు, యుక్తవయసు బంగారుహారాలు కలిగిన, రెండువేల గుఱ్ఱాలను, సమస్త వస్తువులను కానుకలుగా తెచ్చి యుధిష్ఠిరునికి నివేదించాడు. (27,28)
యజ్ణ్యసేనేన దాసీనాం సహస్రాణి చతుర్దశ ।
దాసానామయుతం చైవ సదారాణాం విశాంపతే ।
గజయుక్తా మహారాజ రథాః షడ్వింశతిస్తథా ॥ 29
రాజ్యం చ కృత్స్నం పార్థేభ్యః యజ్ఞార్థం వై నివేదితమ్ ।
రాజా! ద్రుపదుడు దాసీసహస్రాన్ని, భార్యలతోపాటు పదివేల దాసులను, గజాలు పూన్చిన ఇరవైయారు రథాలను, తన సమస్తరాజ్యాన్ని యజ్ఞం కోసం పాండవులకు సమర్పించాడు. (29 1/2)
వాసుదేవోపి వార్ష్ణేయః మానమ్ కుర్వన్ కిరీటినః ॥ 30
అదదాద్ గజముఖ్యానాం సహస్రాణి చతుర్దశ ।
ఆత్మా హి కృష్ణః పార్థస్య కృష్ణస్యాత్మా ధనంజయః ॥ 31
వృష్ణివంశీయుడయిన వాసుదేవుడు కూడా అర్జునుని ఆదరించి పద్నాలుగువేల ఏనుగులను ఇచ్చాడు. అర్జునుని యొక్క ఆత్మకృష్ణుడు. కృష్ణుని యొక్క ఆత్మ అర్జునుడు. (30,31)
యద్ బ్రూయాదర్జునః కృష్ణం సర్వం కుర్యాదసంశయమ్ ।
కృష్ణో ధనంజయస్యార్థే స్వర్గలోకమపి త్యజేత్ ॥ 32
అర్జునుడు ఏది చెప్పినా శ్రీకృష్ణుడు నిస్సంశయంగా అంతా చేస్తాడు. కృష్ణుడు అర్జునుని కోసం స్వర్గలోకాన్ని కూడా విడిచిపెడతాడు. (32)
తథైవ పార్థః కృష్ణార్థే ప్రాణానపి పరిత్యజేత్ ।
సురభీంశ్చందనరసాన్ హేమకుంభసమాస్థితాన్ ॥ 33
మలయాద్ దర్దురాచ్చైవ చందనాగురుసంచయాన్ ।
అలాగే పార్థుడు కూడా కృష్ణుని కోసం ప్రాణాలనైనా ఇస్తాడు. మలయ, దర్దుర పర్వతాల నుండి అక్కడి రాజులు పరిమళభరితమైన చందనరసాన్ని, చందనాన్ని, అగురు ముద్దలను బంగారు కుండలలో పెట్టి తెచ్చారు. (33 1/2)
మణిరత్నాని భాస్వంతి కాంచనం సూక్ష్మవస్త్రకమ్ ॥ 34
చోళపాండ్యా వపి ద్వారం న లేభాతే హ్యుపస్థితౌ ।
మిరుమిట్లు కొలిపే మణిరత్నాలు, బంగారం, సన్నని వస్త్రాలు తెచ్చిన చోళపాండ్యరాజులు కూడా ద్వారమ్ వద్ద ఉండి లోనికి ప్రవేశించలేకపోయారు. (34 1/2)
సముద్రసారం వైదూర్యం ముక్తాసంఘాంస్తథైవ చ ॥ 35
శతశశ్చ కుథాంస్తత్ర సింహళాః సముపాహరన్ ।
సింహళదేశనరేశులు సముద్రంలోని సారభూతమైన వైడూర్యాలను, ముత్యాలప్రోవులను, వందలకొద్దీ ఏనుగుల మీద కప్పే వస్త్రాలను తెచ్చారు. (35 1/2)
సవృతా మణిచీరైస్తు శ్యామాస్తామ్రాంతలోచనాః ॥ 36
తా గృహీత్వా నరాస్తత్ర ద్వారి తిష్ఠంతి వారితాః ।
ప్రీత్యర్థం బ్రాహ్మణాశ్చైవ క్షత్రియాశ్చ వినిర్జితాః ॥ 37
ఉపాజహ్రుర్విశశ్చైవ శూద్రాః శుశ్రూషవస్తథా ।
ఆ సింహళదేశపు రాజులు మణిమయవస్త్రాలు ధరించి ఉన్నారు. నల్లనిశరీరాలతో, ఎఱ్ఱని కనుకొలకులతో ఉన్నారు. వారు కానుకలను తీసుకొని ద్వారం వద్ద నిలబడి ఉన్నారు. బ్రాహ్మణులు, జయించబడిన క్షత్రియులు, వైశ్యులు, శుశ్రూషలు చేసే శూద్రులు యుధిష్ఠిరుని ప్రీతికోసం కానుకలు సమర్పించారు. (36,37 1/2)
ప్రీత్యా చా బహుమానాచ్చాప్యుపాగచ్ఛన్ యుధిష్ఠిరమ్ ॥ 38
సర్వే మ్లేచ్ఛాః సర్వవర్ణాః ఆదిమధ్యాంతజాస్తథా ।
సమస్త మ్లేచ్ఛులు, అగ్ర, మధ్య, అంత్య కులాలలో పుట్టిన సర్వవర్ణాలవారూ ప్రేమతోనూ, గౌరవంతోను యుధిష్ఠిరునికి కానుకలు తెచ్చారు. (38 1/2)
నానాదేశాసముత్థైశ్చ నానాజాతిభిరేవ చ ॥ 39
పర్యస్త ఇవ లోకేఽయం యుధిష్ఠిరనివేశనే ।
నానాదేశాల నుండి వచ్చిన నానాజాతులతో నిండిన యుధిష్ఠిరుని యజ్ఞమండస్థలం - లోకమంతా ఇక్కడే ఉందా అనిపించింది. (39 1/2)
ఉచ్చావచానుపగ్రహాన్ రాజభిః ప్రాపితాన్ బహూన్ ॥ 40
శత్రూణాం పశ్యతీ దుఃఖాద్ ముమూర్షా మే వ్యజాయత ।
భృత్యాస్తు యే పాండవానాం తాంస్తే వక్ష్యామి పార్థివ ॥ 41
యేషామామం చ పక్వమ్ చ సంవిధత్తే యుధిష్ఠిరః ।
నా శత్రువులకు రాజులు ఇచ్చిన చిన్న పెద్ద కానుకలను చూచి నాకు దుఃఖంతో చచ్చిపోవాలనిపించింది. రాజా! పాండవుల సేవకులను గురించి చెపుతాను. విను. యుధిష్ఠిరుడు వారికి పక్వాహారం, అపక్వాహారం కూడా ఏర్పాటు చేశాడు. (40,41 1/2)
అయుతం త్రీణి పద్మాని గజారోహాః ససాదినః ॥ 42
రథానామర్బుదం చాపి పాదాతా బహవస్తథా ।
యుధిష్ఠిరుని వద్ద మూడుపద్మాల పదివేల గజారోహకులు, అశ్వారోహకులు, అర్బుదసంఖ్య (పదికోట్లు) కల రథాలు, అసంఖ్యాకమైన కాల్బలం ఉంది. (42 1/2)
ప్రమీయమాణమామం చ పచ్యమానం తథైవ చ ॥ 43
విసృజ్యమానం చాన్యత్ర పుణ్యాహ స్వన ఏవ చ ।
యుధిష్ఠిరుని యజ్ఞంలో ఒకచోట అపక్వాహారం కొలుస్తూ తూస్తున్నారు. ఒక చోట పక్వాహారం వడ్డిస్తున్నారు. ఒకచోట పుణ్యహవాచన ధ్వనులు వినిపిస్తున్నాయి. (43 1/2)
నాభుక్తవంతం నాపీతం నాలంకృతమసత్కృతమ్ ॥ 44
అపశ్యం సర్వవర్ణానాం యుధిష్ఠిరనివేశనే ।
యుధిష్ఠిరుని గృహంలో సర్వవర్ణాలవారిలో తినని వానిని, త్రాగనివానిని, అలంకరింపబడనివానిని, గౌరవం పొందనివానిని ఒక్కరినీ చూడలేదు. (44 1/2)
అష్టాశీతిసహస్రాణి స్నాతకా గృహమేధినః ॥ 45
త్రింశద్దాసీక ఏకైకో యాన్ బిభర్తి యుధిష్ఠిరః ।
యుధిష్టిరుని గృహంలో నివసించే ఎనభై ఎనిమిది వేల స్నాతకులకు అతడు భరణపోషణలు కల్పిస్తున్నాడు. వారికి ఒక్కొక్కరికి ముప్పదిమంది దాసదాసీలున్నారు. (45 1/2)
సుప్రీతాః పరితుష్టాశ్చ తే హ్యాశంసంత్యరిక్షయమ్ ॥ 46
ప్రీతులై, సంతుష్టిచెందిన వారు యుధిష్ఠిరునికి శత్రు నాశనం కలగాలని దీవిస్తూ ఉంటారు. (46)
దశాన్యాని సహస్రాణి యతీనామూర్ధ్వరేతసామ్ ।
భుంజతే రుక్మపాత్రీభిః యుధిష్ఠిరనివేశనే ॥ 47
ఇంకొక పదివేల మంది ఊర్ధ్వరేతసులైన యతీశ్వరులు యుధిష్ఠిరుని గృహంలో బంగారు పళ్లెరాలలో భుజిస్తూ ఉంటారు. (47)
అభుక్తం భుక్తవద్ వాపి సర్వమాకుబ్జవామనమ్ ।
అభుంజానా యాజ్ఞసేనీ ప్రత్యవైక్షద్ విశాంపతే ॥ 48
రాజా! ద్రౌపది తాను తినకముందే మరుగుజ్జులు, వామనులు మొదలైనవారందరూ తిన్నారా లేదా అని చూచుకొంటూ ఉంటుంది. (48)
ద్వే కరౌ న ప్రయచ్ఛేతాం కుంతీపుత్రాయ భారత ।
సంబంధికేన పంచాలాః సఖ్యేనాంధకవృష్ణయః ॥ 49
భారతా! యుధిష్ఠిరునికి కప్పం చెల్లించనివారు ఇద్దరు మాత్రమే. బంధుత్వం కారణంగా పాంచాలురు, మిత్రత్వం కారణంగా అంధకవృష్ణులు. (49)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి దుర్యోధనసంతాపే ద్విపంచాశత్తమోఽధ్యాయః ॥ 52 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున ద్యూతపర్వమను ఉపపర్వమున దుర్యోధన సంతాపమను ఏబది రెండవ అధ్యాయము. (52)