45. నలువది ఐదవ అధ్యాయము

శిశుపాల వధ - రాజసూయసమాప్తి.

వైశంపాయన ఉవాచ
తతః శ్రుత్వైవ భీష్మస్య చేదిరాడురువిక్రమః ।
యుయుత్సుర్వాసుదేవేన వాసుదేవమువాచ హ ॥ 1
వైశంపాయనుడు చెప్పాడు. మహాపరాక్రమశాలి శిశుపాలుడు భీష్ముని మాటలు విని వాసుదేవునితో యుద్ధం చేయాలని అతనితో ఇలా అన్నాడు. (1)
ఆహ్వయే త్వాం రణం గచ్ఛ మయా సార్ధం జనార్దన ।
యావదద్య నిహన్మి త్వామ్ సహితం సర్వపాండవైః ॥ 2
జనార్దనా! నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాను. నాతో యుద్ధం చెయ్యి. పాండవులందరితో నిన్ను ఇపుడే చంపుతాను. (2)
సహ త్వయా హి మే వధ్యాః సర్వథా కృష్ణపాండవాః ।
నృపతీన్ సమతిక్రమ్య యైరరాజా త్వమర్చితః ॥ 3
నీతోపాటు పాండవులు కూడా అన్నివిధాలా వధింపదగినవారే. ఎందుకంటే రాజులందరినీ కాదని పాండవులు నిన్ను అర్చించారు. (3)
యే త్వాం దాసమరాజానం బాల్యాదర్చంతి దుర్మతిమ్ ।
అనర్హమర్హవత్ కృష్ణ వధ్యాస్త ఇతి మే మతిః ॥ 4
ఆ పాండవులు రాజయినా కాని దాసుడయిన దుర్మతిని నిన్ను చిన్నతనం నుండీ పుజిస్తున్నారు. కృష్ణా! అనర్హుని అర్హునిగా పూజిస్తున్నారు. అందుచేత వారు వధింపదగిన వారని నా అభిప్రాయం. (4)
ఇత్యుక్త్వా రాజశార్దూలః తస్థౌ గర్జన్నమర్షణః ।
రాజశార్దూలుడయిన శిశుపాలుడు కోపంతో ఇలా గర్జిస్తూ ఉన్నాడు.
ఏవముక్తస్తతః కృష్ణః మృదుపూర్వమిదం వచః ।
ఉవాచ పార్థివాన్ సర్వాన్ స సమక్షం చ వీర్యవాన్ ॥ 5
శిశుపాలుడిలా అనగానే కృష్ణుడు సామవచనాలతో రాజులందరితో అందరి ఎదుట మధురంగా ఇలా అన్నాడు. (5)
ఏష నః శత్రురత్యంతం పార్థివాః సాత్వతీసుతః ।
సాత్వతానాం నృశంసాత్మా న హితోఽనపకారిణామ్ ॥ 6
రాజులారా! వీడు మాకు మిక్కిలి శత్రువు. మామేనత్త సాత్వతికి కొడుకు. సాత్వతులలో క్రూరుడు. ఏ అపకారమూ చేయనివారికి కూడా హితుడు కాడు, శత్రువే. (6)
ప్రాగ్జ్యోతిషపురం యాతాన్ అస్మాం జ్ఞాత్వా నృశంసకృత్ ।
అదహద్ ద్వారకామేషః స్వస్రీయః సన్ నరాధిపాః ॥ 7
రాజులారా! మేమంతా ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్లామని తెలిసి మా మేనత్త కొడుకై ఉండి కూడా ఈ క్రూరుడు ద్వారకా నగరాన్ని తగులబెట్టాడు. (7)
క్రీడతో భోజరాజస్య ఏష రైవతకే గిరౌ ।
హత్వా బద్ధ్వా చ తాన్ సర్వాన్ అపాయాత్ స్వపురం పురా ॥ 8
రైవతకపర్వతం మీద భీజరాజు క్రీడిస్తూ ఉంటే వీడు వాళ్లలో కొందరిని చంపి, కొందరిని బంధించి తన పురానికి వెళ్లిపోయాడు. (8)
అశ్వమేధే హయం మేధ్యమ్ ఉత్సృష్టం రక్షిభిర్వృతమ్ ।
పితుర్మే యజ్ఞవిఘ్నార్థమ్ అహరత్ పాపనిశ్చయః ॥ 9
నాతండ్రి అశ్వమేధం చేసి రక్షకులతో గుర్రాన్ని వదలితే ఈ పాపి యజ్ఞానికి విఘ్నం చేయటానికి గుర్రాన్ని అపహరించాడు. (9)
సౌవీరాన్ ప్రతి యాతాం చ బభ్రోరేష తపస్వినః ।
భార్యామభ్యహరన్మోహత్ అకామాం తామితో గతామ్ ॥ 10
సౌవీరదేశానికి వెళ్లే తపస్వియైన బభ్రుని భార్యను, తనను కోరని దానిని, ఇక్కడి నుండి వెడుతున్న దానిని, మోహంతో అపహరించాడు. (10)
ఏష మాయాప్రతిచ్ఛన్నః కరూషార్థే తపస్వినీమ్ ।
జహార భద్రాం వైశాలీం మాతులస్య నృశంసకృత్ ॥ 11
ఈ క్రూరకర్ముడు మాయారూపం దాల్చి, కరూష దేశాధిపతికోసం తపస్సు చేస్తున్న తన మేనమామ విశాలరాజు కూతురు భద్రను అపహరించి తీసుకుపోయాడు. (11)
పితృష్వసుః కృతే దుఃఖమ్ సుమహన్మర్షయామ్యహమ్ ।
దిష్ట్యా హీదం సర్వరాజ్ఞాం సంనిధావద్య వర్తతే ॥ 12
మామేనత్త కోసం ఈ అపరాధ దుఃఖం సహిస్తున్నాను. ఇది దైవవశాత్తు ఇప్పుడు రాజులందరి సమక్షంలో జరిగింది. (12)
పశ్యంతి హి భవంతోఽద్య మయ్యతీవ వ్యతిక్రమమ్ ।
కృతాని తు పరోక్షమ్ మే యాని తాని నిబోధత ॥ 13
ఇపుడు నామీద ఎంతటి వ్యతిరేకత ప్రదర్శించాడో ప్రత్యక్షంగా మీరు చూశారు కదా! ఇక పరోక్షంలో ఏమేమి చేశాడో మీకు ఇంతకుముందే చెప్పాను. (13)
ఇమమ్ త్వస్య న శక్ష్యామి క్షంతుమద్య వ్యతిక్రమమ్ ।
అవలేపాద్ వధార్హస్య సమగ్రే రాజమండలే ॥ 14
గర్వితుడైన ఈతడు రాజులందరి సమక్షంలో నామీద చూపిన వ్యతిక్రమమ్ క్షమింపరానిది. (14)
రుక్మిణ్యామస్య మూఢస్య ప్రార్థనాఽఽసీన్ముమూర్షతః ।
న చ తాం ప్రాప్తవాన్ మూఢః శూద్రో వేదశ్రుతీమివ ॥ 15
వీడిపుడు మరణమ్ కోరుకొంటున్నాడు. ఈ మూఢుడు పూర్వం రుక్మిణిని కోరాడు. కాని పొందలేకపోయాడు, శూద్రుడు వేదశ్రుతిని పొందలేకపోయినట్లుగా - (15)
వైశంపాయన ఉవాచ
ఏవమాది తతః సర్వే సహితాస్తే నరాధిపాః ।
వాసుదేవవచః శ్రుత్వా చేదిరాజం వ్యగర్హయన్ ॥ 16
వైశంపాయనుడు అన్నాడు - వాసుదేవుని మాటలు విని రాజులంతా శిశుపాలుని నిందించారు. (16)
తస్య తద్ వచనం శ్రుత్వా శిశుపాలః ప్రతాపవాన్ ।
జహాస స్వనవద్ధాసం వాక్యం చేదమువాచ హ ॥ 17
వారి నిందావాక్యాలు విని ప్రతాపశాలి అయిన శిశుపాలుడు బిగ్గరగా నవ్వి ఇలా అన్నాడు. (17)
మత్పూర్వాం రుక్మిణీం కృష్ణ సంసత్సు పరికీర్తయన్ ।
విశేషతః పార్థివేషు వ్రీడామ్ న కురుషే కథమ్ ॥ 18
ముందు నాకిస్తానన్న రుక్మిణిని సభల్లో అందునా రాజసభల్లో కీర్తిస్తూ కృష్ణా! నీకు సిగ్గు కలగటం లేదెందుకు? (18)
మన్యమానో హి కః సత్సు పురుషః పరికీర్తయేత్ ।
అన్యపూర్వాం స్త్రియం జాతు త్వదన్యో మధుసూదన ॥ 19
ముందు ఇతరుని కిస్తానన్న వనితను సభల్లో అందులోనూ రాజసభల్లో గొప్పగా చెప్పుకొనేవాడు నీవు తప్ప మరెవడూ లేడు. (19)
క్షమ వా యది తే శ్రద్ధా మా వా కృష్ణ మమ క్షమ ।
క్రుద్ధాద్ వాపి ప్రసన్నాద్ వా కిం మే త్వత్తో భవిష్యతి ॥ 20
నీకు ఇష్టమయితే క్షమించు - లేకపోతే మానుకో - నీకు కోపం వస్తే ఏమి? సంతోషం కలిగితే ఏమి? నీ వల్ల నాకు ఏమి జరుగుతుంది? (20)
తథా బ్రువత ఏవాస్య భగవాన్ మధుసూదనః ।
మనసాచింతయచ్చక్రం దైత్యవర్గనిఘాదనమ్ ॥ 21
శిశుపాలుడు ఇలా అంటూనే ఉన్నాడు.... భగవంతుడయిన కృష్ణుడు దానవులను సంహరించే చక్రాన్ని మనసులో తలచుకొన్నాడు. (21)
ఏతస్మిన్నేవ కాలే తు చక్రే హస్తగతే సతి ।
ఉవాచ భగవానుచ్చైః వాక్యం వాక్యవిశారదః ॥ 22
వెంటనే అపుడే చక్రం కృష్ణుని చేతిలోకి వచ్చింది. వాక్యవిశారదుడయిన కృష్ణ భగవానుడు ఉచ్చైస్స్వరంతో ఇలా అన్నాడు. (22)
శృణ్వంతు మే మహీపాలాః యేనైతత్ క్షమితం మయా ।
అపరాధశతమ్ క్షామ్యం మాతురస్యైవ యాచనే ॥ 23
దత్తం మయా యాచితం చ తాని పూర్ణాని పార్థివాః ।
అధునా వధయిష్యామి పశ్యతాం వో మహీక్షితామ్ ॥ 24
రాజులారా! అంతా వినండి. ఈతని తల్లి "వీని నూరు తప్పులు క్షమించమని అడిగింది. నేను 'సరే' అన్నాను - అలాగే నూరు తప్పులు ఇప్పటితో పూర్తి అయ్యాయి. అందుచేత మీరంతా చూస్తూ ఉండగానే ఇపుడు వీనిని చంపుతాను." (23,24)
ఏవముక్త్వా యదుశ్రేష్ఠః చేదిరాజస్య తత్షణాత్ ।
వ్యపాహరచ్ఛిరః క్రుద్ధః చక్రేణామిత్రకర్షణః ॥ 25
ఇలా చప్పి తత్ క్షణమే శ్రీకృష్ణుడు చక్రంతో శిశుపాలుని శిరస్సును ఖండించాడు. (25)
స పపాత మహాబాహుః వజ్రాహత ఇవాచలః ।
తతశ్చేదిపతేర్దేహాత్ తేజోఽగ్ర్యం దదృశుర్నృపాః ॥ 26
ఉత్పతంతం మహారాజ గగనాదివ భాస్కరమ్ ।
తతః కమలపత్రాక్షమ్ కృష్ణమ్ లోకనమస్కృతమ్ ।
వవందే తత్ తదా తేజః వివేశ చ నరాధిప ॥ 27
వెంటనే వజ్రాయుధం దెబ్బతిన్న పర్వతంలా శిశుపాలుడు పడిపోయాడు. శిశుపాలుని శరీరం నుండి సూర్యతేజస్సు వంటి తేజస్సు పైకి రావటం రాజులంతా చూశారు. పద్మనేత్రుడై సర్వలోకాల చేతనూ నమస్కరింపబడే కృష్ణునికి వెంటనే ఆ తేజస్సు నమస్కరించి కృష్ణునిలో కలిసిపోయింది. (26,27)
తదద్భుతమమన్యంత దృష్ట్వా సర్వే మహీక్షితః ।
యద్ వివేశ మహాబాహుం తత్ తేజః పురుషోత్తమమ్ ॥ 28
ఆ తేజస్సు అలా పురుషోత్తమునిలో కలిసిపోవడం రాజులంతా చూసి ఎంతో ఆశ్చర్యపడ్డారు. (28)
అన్యభ్రే ప్రవవర్ష ద్యౌః పపాత జ్వలితాశనిః ।
కృష్ణేన నిహతే చైద్యే చచాల చ వసుంధరా ॥ 29
అలా శిశుపాలుడు వధింపబడినపుడు మేఘాలు లేకుండానే వర్షం కురిసింది. పిడుగులు పడ్డాయి. భూమి అంతా కంపించిపోయింది. (29)
తతః కేచిన్మహీపాలాః నాబ్రువం స్తత్ర కించన ।
అతీతవాక్పథే కాలే ప్రేక్షమాణా జనార్దనమ్ ॥ 30
అపుడు రాజులు కొందరు ఏమీ మాట్లాడకుండా జనార్దనుని చూస్తూ మౌనంగా నిలిచిపోయారు. (30)
హస్తైర్హస్తాగ్రమపరే ప్రత్యపింషన్నమర్షితాః ।
అపరే దశనైరోష్ఠాన్ అదశన్ క్రోధమూర్ఛితాః ॥ 31
కోపంతో మరికొందరు చేతులతో చేతులు అప్పళించారు. ఇంకా కొందరు క్రోధపరవశులై పళ్లతో పెదవులు కొరుక్కున్నారు. (31)
రహశ్చ కేచిద్ వార్ష్ణేయం ప్రశశంసుర్నరాధిపాః ।
కేచిదేవ సుసంరబ్ధాః మధ్యస్థాస్త్వపరే ఽభవన్ ॥ 32
కొంతమంది రాజులు చాటుమాటున కృష్ణుని ప్రశంసించారు. కొందరు క్రోధానికి వశులయ్యారు. మరికొందరు తటస్థంగా ఉన్నారు. (32)
ప్రహృష్టాః కేశవం జగ్ముః సంస్తువంతో మహర్షయః ।
బ్రాహ్మణాశ్చ మహాత్మానః పార్థివాశ్చ మహాబలాః ॥ 33
మహర్షులూ, బ్రాహ్మణులూ, బలిష్ఠులయిన రాజులూ అంతా శ్రీకృష్ణుని పరాక్రమం చూసి సంతోషించి ప్రశంసిస్తూ శ్రీకృష్ణుని శరణు కోరారు. (33)
శశంసుర్నిర్వృతాః సర్వే దృష్ట్వా కృష్ణస్య విక్రమమ్ ।
పాండవస్త్వబ్రవీద్ భ్రాతౄన్ సత్కారేణ మహీపతిమ్ ॥ 34
దమఘోషాత్మజం వీరం సంస్కారయత మా చిరమ్ ।
తథా చ కృతవంతస్తే భ్రాతుర్వై శాసనం తదా ॥ 35
అపుడు ధర్మరాజు తమ్ముళ్లతో "వీరుడయిన ఈ శిశుపాలునికి త్వరగా అంతిమ సంస్కారం సగౌరవంగా చేయించండి" అని ఆజ్ఞాపించాడు. అన్నగారి ఆజ్ఞను తమ్ముళ్లు వెంటనే నిర్వర్తించారు. (34,35)
చేదినామాధిపత్యే చ పుత్రమస్య మహీపతేః ।
అభ్యషించత్ తదా పార్థః సహ తైర్వసుధాధిపైః ॥ 36
అపుడు ధర్మరాజు రాజులందరి ఎదుట ఆ శిశుపాలుని కుమారుని చేదిరాజ్యానికి పట్టాభిషిక్తుని చేశాడు. (36)
తతః స కురురాజస్య క్రతుః సర్వసమృద్ధిమాన్ ।
యూనాం ప్రీతికరో రాజన్ స బభౌ విపులౌజసః ॥ 37
అలా ధర్మరాజు యొక్క యాగం సమృద్ధిమంతమై ప్రజలకు ప్రీతికరమయి ప్రకాశించింది. (37)
శాంతవిఘ్నః సుఖారంభః ప్రభూతధనధాన్యవాన్ ।
అన్నవాన్ బహుభక్ష్యాశ్చ కేశవేన సురక్షితః ॥ 38
అలా ఆ యజ్ఞం శుభారంభంతో విఘ్నాలు లేకుండా ధనధాన్య సంపన్నమై బహుభక్ష్యాన్న సంపూర్ణమై కేశవుని చేత రక్షింపబడి వెలుగొందింది. (38)
(దదృశుస్తం నృపతయః యజ్ఞస్య విధిముత్తమమ్ ।
ఉపేంద్రబుద్ధ్వా విహితం సహదేవేన భారత ॥
కృష్ణుని బుద్ధితో సహదేవుని చేత అమలు పరుపబడిన ఆ ఉత్తమమయిన యజ్ఞవిధానాన్ని రాజులంతా చూశారు.
దదృశుస్తోరణాన్యత్ర హేమతాళమయాని చ ।
దీప్తభాస్కరతుల్యాని ప్రదీప్తానీవ తేజసా ।
స యజ్ఞస్తోరణైస్తైశ్చ గ్రహైర్ద్యౌరివ సంబభౌ ॥
ఆ యజ్ఞమంటపంలో ఎన్నో బంగారు తోరణాలు కట్టారు. బంగారు తాళవాద్యాలున్నాయి. అవి అన్నీ ప్రకాశించే సూర్యుని వలె భాసించాయి. బంగారు తోరణాలతో కూడిన యజ్ఞవాటిక గ్రహాలతో కూడిన ఆకాశంలా భాసించింది.
శయ్యాసనవిహారాంశ్చ సుబహూన్ విత్తసంభృతాన్ ।
ఘటాన్ పాత్రీః కటాహాని కలశాని సమంతతః ।
న తే కిమ్చిదసౌవర్ణమ్ అపశ్యంస్తత్ర పార్థివాః ॥
ఎన్నో శయ్యలు, ఆసనాలు, విహారాలు, ధనసమృద్ధమయిన పాత్రలు, ఘటాలు, గంగాళాలు, చెంబులు అంతటా కనబడ్డాయి. విశేషమేమంటే పాత్రలన్నీ బంగారంతో చేసినవే.
ఓదనానాం వికారాణి స్వాదూని వివిధాని చ ।
సుబహూని చ భక్ష్యాణి పేయాని మధురాణి చ ।
దదుర్ద్విజానామ్ సతతం రాజప్రేష్యా మహాధ్వరే ॥
వివిధభోజనపదార్థాలు, రుచికరములయిన భక్ష్యాలు, మధురపానీయాలు బ్రాహ్మణులకు సదా రాజసేవకులు అందించేవారు.
పూర్ణే శతసహస్రే తు విప్రాణాం భుంజతాం తదా ।
స్థాపితా తత్ర సంజ్ఞాభూత్ శంఖోఽధ్మాయత నిత్యశః ॥
ఒక లక్షమంది బ్రాహ్మణులు భోజనం చేసిన వెంటనే ఒక శంఖం మ్రోగుతుంది. అది సదా మ్రోగేది.
ముహుర్ముహుః ప్రణాదస్తు తస్య శంఖస్య భారత ।
ఉత్తమం శంఖశబ్దం తం శ్రుత్వా విస్మయమాగతాః ॥
మాటిమాటికి నిరంతరంగా మ్రోగే ఆ శంఖనాదం విని అంతా ఆశ్చర్యపోయేవారు.
ఏవం ప్రవ్ఱుత్తే యజ్ఞే తు తుష్టపుష్టజనాయుతే ।
అన్నస్య బహవో రాజన్ ఉత్సేధాః పర్వతోపమాః ।
దధికుల్యాశ్చ దదృశుః సర్పిషాం చ హ్రదాం జనాః ॥
ఇలా భోజనసంతృప్తులయిన జనులతో, పర్వతాల వలె ఉన్న అన్నపురాసులతో, పెరుగు కాల్వలతో, నేతి మడుగులతో యజ్ఞవాటిక నిండుగా వెలుగొందింది.
జంబూద్వీపే హి సకలః నానాజనపదాయుతః ।
రాజన్నదృశ్యతైకస్థః రాజ్ఞస్తస్మిన్ మహాక్రతౌ ॥
ఆ యజ్ఞంలో జంబూద్వీపంలో ఉన్న వారంతా ఒకేచోట కనిపించారు.
రాజానః స్రగ్విణస్తత్ర సుమృష్టమణికుండలాః ।
వివిధాన్యన్నపానాని లేహ్యాని వివిధాని చ ।
తేషాం నృపోపభోగ్యాని బ్రాహ్మణేభ్యో దదుః స్మ తే ॥
చక్కని మణికుండలాలతో, మాల్యాలు ధరించి రాజులంతా కనిపించారు. వారు వివిధాలయిన అన్నపానీయాలు బ్రాహ్మణులకు పెట్టేవారు.
ఏతాని సతతం భుక్త్వా తస్మిన్ యజ్ఞే ద్విజాతయః ।
పరాం ప్రీతిం యయుః సర్వే మోదమానాస్తదా భృశమ్ ॥
ఈవిధంగా ద్విజాతులంతా ఆ యజ్ఞంలో సతతం భుజించి అంతా ఎంతో ప్రీతిని తుష్టిని పొందారు.
ఏవం సముదితం సర్వే బహుగోధనధాన్యవత్ ।
యజ్ఞవాటం నృపా దృష్ట్వా విస్మయం పరమం యయుః ॥
ఇలా ధనధాన్యసమృద్ధమయిన యజ్ఞవాటికను చూసి రాజులంతా ఎంతో ఆశ్చర్యపడ్డారు.
ఋత్విజశ్చ యథాశాస్త్రం రాజసూయం మహాక్రతుమ్ ।
పాండవస్య యథాకాలం జుహువుః సర్వయాజకాః ॥
ధర్మరాజు యొక్క రాజసూయంలో ఋత్విజులు యాజకులు యథావిధిగా, యథాకాలం హోమాలన్నీ చేయించేవారు.
వ్యాసధౌమ్యాదయః సర్వే విధివత్ షోడశర్త్విజః ।
స్వస్వకర్మాణి చక్రుస్తే పాండవస్య మహాక్రతౌ ॥
ఆ రాజసూయంలో వ్యాసుడు, ధౌమ్యుడు మొదలయిన పదహారుమంది ఋత్విజులూ తమ తమ విధులను యథావిధిగా నిర్వర్తించారు.
నాషడంగవిదత్రాసీత్ సదస్యో నాబాహుశ్రుతః ।
నావ్రతో నానుపాధ్యాయః న పాపో వాక్షమోద్విజః ॥
ఆ సదస్సులలో షడంగవేత్తకానివాడు లేడు. బహువేదవేత్తకానివాడు కాని, వ్రతశీలం లేనివాడు కాని, ఉపాధ్యాయుడు కాని వాడు కాని, పాపి కాని, క్షమలేని అసమర్ధుడైన ద్విజుడు కాని మచ్చుకైనా లేడు.
న తత్ర కృపణః కశ్చిద్ దరిద్రో న బభూవ హ ।
క్షుధితో దుఃఖితో వాపి ప్రకృతో వాపి మానుషః ॥
సహజంగా కూడా ఆ యజ్ఞ వాటికలో కృపణుడు కాని, దరిద్రుడు కాని, ఆకలిగొన్నవాడుకాని, దుఃఖితుడు కాని కనపడటం లేదు.
భోజనం భోజనార్థిభ్యః దాపయామాస సర్వదా ।
సహదేవో మహాతేజాః సతతం రాజశాసనాత్ ॥
రాజశాసనాన్ని అనుసరించి మహాతేజస్వి అయిన సహదేవుడు ఎల్లపుడు భోజనార్థులకు భోజనం పెట్టించేవాడు.
సంస్తరే కుశాలాశ్చాపి సర్వకర్మాణి యాజకాః ।
దివసే దివసే చక్రుః యథాశాస్త్రార్థచక్షుషః ॥
యజ్ఞనిపులయిన యాజకులు శాస్త్రవిధుల మీద దృష్టికల్గి అన్నిపనులూ నిత్యమూ చేసేవారు.
బ్రాహ్మణా వేదశాస్త్రజ్ఞాః కథాశ్చక్రుశ్చ సర్వదా ।
రేమిరే చ కథాంతే తుస్ సర్వే తస్మిన్ మహాక్రతౌ ॥
వేదశాస్త్రవేత్తలయిన విప్రులు సదా కథాప్రాచనం చేసేవారు - అందరూ ఆ మహాయజ్ఞంలో కథాంతమందు చాలా సంతోషించేవారు.
దేవైరన్యైశ్చ యక్షైశ్చ ఉరగైర్దివ్యమానుషైః ।
విద్యాధరగణైః కీర్ణః పాండవస్య మహాత్మనః ॥
స రాజ్యసూయః శుశుభే ధర్మరాజస్య ధీమతః ।
దేవతలు, రాక్షసులు, యక్షులు, ఉరగులు, దివ్యమానవులు, విద్యాధరులు - వీరి సమూహాలతో నిండి మహాత్ముడయిన ధర్మరాజు రాజసూయం శోభిల్లింది.
గంధర్వగణసంకీర్ణః శోభితోఽప్సరసామ్ గణైః ॥
దేవైర్మునిగణైర్యక్షైః దేవలోక ఇవాపరః ।
స కింపురుషగీతైశ్చ కిన్నరైరుపశోభితః ॥
గంధర్వగణాలు, అప్సరసల సమూహాలు, దేవ, ముని గణాలు, యక్షులు కిన్నరకింపురుష గీతాలాపనలతో శోభిల్లి వీరితో మరో దేవలోకమా అనిపించింది.
నారదశ్చ జగౌ తత్ర తుంబురుశ్చ మహాద్యుతిః ।
విశ్వావసుశ్చిత్రసేన తథాన్యే గీతకోవిదాః ।
రమయంతి స్మ తాన్ సర్వాన్ యజ్ఞకర్మాంతరేష్వథ ॥
నారదుడు, తేజస్వి అయిన తుంబురుడు, విశ్వావసువు, చిత్రసేనుడు - ఇంకా ఇతర గీత విద్వాంసులు యజ్ఞకర్మాంతరాల్లో పాడి అందరికీ మనోరంజనం చేసేవారు.
ఇతిహాసపురాణాని ఆఖ్యానాని చ సర్వశః ।
ఊచుర్వై శబ్దశాస్త్రజ్ఞాః నిత్యం కర్మాంతరేష్వథ ॥
నిత్యమూ విరామసమయంలో అంతట శబ్దశాస్త్రవేత్తలు ఇతిహాసాలు, పురాణాలు, ఆఖ్యానాలు చెప్పేవారు.
భేరశ్చ మురజాశ్చైవ మడ్డుకా గోముఖాశ్చ యే ।
శృంగవంశాంబుజాశ్చైవ శ్రూయంతే స్మ సహస్రశః ॥
భేరులు, మురజాలు, మడ్డుకాలు, గోముఖాలు, కొమ్ములు, వేణువులు, శంఖాలు - వేలకొద్దీ వినపడేవి.
లోకేఽస్మిన్ సర్వవిప్రాశ్చ వైశ్యాః శూద్రాశ్చ సర్వశః ।
సర్వే మ్లేచ్ఛాః సర్వవర్ణాః సాదిమధ్యాంతజాస్తథా ॥
నానాదేశసముద్భూతైః నానాజాతిభిరాగతైః ।
పర్యాప్త ఇవ లోకోఽయం యుధిష్ఠిరనివేశనే ॥
లోకంలో ఉన్న విప్రులంతా, వైశ్యులు, శూద్రులు, మ్లేచ్ఛులు ఇలా అన్ని వర్ణాల వారూ, నానాదేశాలవారూ, నానాజాతులవారూ అందరూ వచ్చి ధర్మరాజు భవనం నింపేశారు.
భీష్మద్రోణాదయః సర్వే కురవః ససుయోధనాః ।
వృష్ణయశ్చ సమగ్రాశ్చ పంచాలాశ్చాపి సర్వశః ।
యథార్హం సర్వకర్మాణి చక్రుర్దాసా ఇవ క్రతౌ ॥
భీష్మద్రోణాదులు, దుర్యోధనునితో సహా కౌరవులందరూ, వృష్ణివంశస్థులంతా, అన్ని వైపులనున్న పాంచాలురూ వచ్చి ఆ యజ్ఞంలో దాసులవలె తమకు తగిన పనులన్నీ స్వయంగా చేశారు.
ఏవం ప్రవృత్తో యజ్ఞః స ధర్మరాజస్య ధీమతః ।
శుశుభే చ మహాబాహో సోమస్యేవ క్రతుర్యథా ॥
రాజా! ధీమంతుడయిన ధర్మజుని యజ్ఞం అలా జరిగింది. అది సోముని క్రతువులాగా ప్రకాశించింది.
వస్త్రాణి కంబలాంశ్చైవ ప్రావారాంశ్చైవ సర్వదా ।
నిష్కహేమజభాండాని భూషణాని చ సర్వశః ।
ప్రదదౌ తత్ర సతతం ధర్మరాజో యుధిష్ఠిరః ॥
వస్త్రాలు, కంబళ్ళు, దుప్పట్లు, నిష్కాలు, బంగారు పాత్రలు, భుషణాలు అంతటా ఏ వేళలో అయినా ధర్మరాజు ఇస్తూనే ఉండేవాడు.
యాని తత్ర మహీపేభ్యః లబ్ధం వా ధనముత్తమమ్ ।
తాని రత్నాని సర్వాణి విప్రాణాం ప్రదదౌ తదా ॥
రాజులిచ్చిన రత్నాలు, ధనరాసులు అన్నీ అపుడే ధర్మరాజు విప్రులకు ఇచ్చి వేశాడు.
కోటీసహస్రం ప్రదదౌ బ్రాహ్మణానాం మహాత్మనామ్ ।
మహాత్మలయిన విప్రులకు వెయ్యికోట్లు ఇచ్చాడు.
న కరిష్యతి తం లోకే కశ్చిదన్యో మహీపతిః ॥
యాజకా సర్వకామైశ్చ సతతమ్ తతృపుర్ధనైః ।
ఆ విధంగా యజ్ఞమ్ చెయ్యడం మరోరాజు ఎవరికీ సాధ్యంకాదు. యాజకులను అన్ని విధాల ఎల్లవేళలా సంతృప్తులను చేశాడు ధర్మరాజు.
వ్యాసమ్ ధౌమ్యం చ ప్రయతః నారదం చ మహామతిమ్ ॥
సుమంతుం జైమినిం పైలం వైశంపాయనమేవ చ ।
యాజ్ఞవల్కం కఠం చైవ కలాపం చ మహౌజసమ్ ॥
సర్వాంశ్చ విప్రప్రవరాన్ పూజయామాస సత్కృతాన్ ॥
వ్యాసుని, ధౌమ్యుని, మహాప్రజ్ఞుడు నారదుని, సుమంతుని, జైమినిని, పైలుని, వైశంపాయనుని, యాజ్ఞవల్క్యుని, కఠుని, కలాపుని, మహౌజసుని, ఇంకా విప్రవరులందరినీ శ్రద్ధగా సత్కరించి, పూజించి, ధర్మరాజు ఇలా అన్నాడు.
యుష్మత్ర్పభావాత్ ప్రాప్తోఽయం రాజసూయే మహాక్రతుః ।
జనార్దనప్రభావాశ్చ సంపూర్ణో మే మనోరథః ॥
యుధిష్ఠిరుడు అన్నాడు - మీ ప్రభావం వల్ల రాజసూయ యాగం ఇలా సంపన్నమయింది. శ్రీకృష్ణుని ప్రభావం వల్ల నా కోరిక సంపూర్ణమయింది.
వైశంపాయన ఉవాచ
అథ యజ్ఞం సమాప్యాంతే పూజయామాస మాధవమ్ ।
బలదేవం చ దేవేశం భీష్మాద్యాంశ్చ కురూత్తమాన్ ॥)
వైశంపాయనుడు అన్నాడు - తరువాత యజ్ఞసమాప్తిలో శ్రీకృష్ణుని దేవేశుడయిన బలరాముని, భీష్మాది కురుసత్తములను పూజించాడు.
సమాపయామాస చ తం రాజసూయం మహాక్రతుమ్ ।
తం తు యజ్ఞం మహాబాహుః ఆసమాప్తేర్జనార్దనః ।
రరక్ష భగవాంచ్ఛౌరిః శార్ ఙ్గచక్రగదాధరః ॥ 39
అలా రాజసూయ యాగాన్ని పూర్తిచేశాడు భగవంతుడు, శార్ ఙ్గం చక్రం గదను ధరించిన శ్రీకృష్ణుడు రాజసూయ సమాప్తి దాకా స్వయంగా రక్షించాడు. (39)
తతస్త్వవభృథస్నాతః ధర్మాత్మానం యుధిష్ఠిరమ్ ।
సమస్తం పార్థివం క్షత్రమ్ ఉపగమ్యేదమబ్రవీత్ ॥ 40
ధర్మరాజు అవభృథ స్నానమ్ చేసిన పిదప రాజసముదాయమంతా ధర్మరాజును చేరి ఇలా అన్నారు. (40)
దిష్ట్యా వర్ధసి ధర్మజ్ఞ సామ్రాజ్యం ప్రాప్తవానసి ।
ఆజమీఢాజమీఢానాం యశః సంవర్ధితం త్వయా ॥ 41
కర్మణైతేన రాజేంద్ర ధర్మశ్చ సుమహాన్ కృతః ।
ఆపృచ్ఛామో నరవ్యాఘ్ర సర్వకామైః సుపూజితాః ॥ 42
'ధర్మజ్ఞా! దైవానుగ్రహంతో వృద్ధిపొందావు. సార్వభౌముడవయ్యావు. అజమీఢ వంశోద్భవా? మీ వంశప్రతిష్ఠను ఈ యాగంతో నీవు వృద్ధి పొందించావు. రాజేంద్రా! ఎంతో ధర్మాచరణం చేశావు. మా కోరికలు తీరాయి. నీ సత్కారాలతో సంతృప్తుల మయ్యాము. వెళ్లి వస్తాం అనుమతించు. (41,42)
స్వరాష్ట్రాణి గమిష్యామః తదనుజ్ఞాతుమర్హసి ।
శ్రుత్వా తు వచనమ్ రాజ్ఞాం ధర్మరాజో యుధిష్ఠిరః ॥ 43
యథార్హం పూజ్య నృపతీన్ భ్రాతౄన్ సర్వానువాచ హ ।
రాజానః సర్వ ఏవైతే ప్రీత్యాస్మాన్ సముపాగతాః ॥ 44
ప్రస్థితాః స్వాని రాష్ట్రాణి మామపృచ్ఛ్య పరంతపాః ।
అనివజ్రత భద్రం వః విషయాంతం నృపోత్తమాన్ ॥ 45
మేము మా రాష్ట్రాలకు వెడతాం. అనుజ్ఞ ఇయ్యి, రాజుల ఈ మాటలు విని ధర్మరాజు రాజులందరినీ తగినట్లు సన్మానించి తమ్ములతో ఇలా అన్నాడు. 'ఈ రాజులందరూ మనమీది ప్రీతితో వచ్చారు. తమ రాష్ట్రాలకు వెడుతూ నాకు చెప్పటానికి వచ్చారు. భద్రంగా మన పొలిమేర దాకా ఈ రాజోత్తములను సాగనంపండి.' (43-45)
భ్రాతుర్వచనమాజ్ఞాయ పాండవా ధర్మచారిణః ।
యథార్హం నృపతీన్ సర్వాన్ ఏకైకం సమనువ్రజన్ ॥ 46
అన్నగారి మాట శిరసావహించి ధర్మవర్తనులయిన పాండవులు ఒక్కొక్కరాజునూ ప్రత్యేకంగా సాగనంపారు. (46)
విరాటమన్వయాత్ తూర్ణం ధృష్టద్యుమ్నః ప్రతాపవాన్ ।
ధనంజయో యజ్ఞసేనం మహాత్మానం మహారథమ్ ॥ 47
ప్రతాపశాలి అయిన ధృష్ఠద్యుమ్నుడు విరాటుని అనుసరించి సాగనంపాడు. అర్జునుడు మహాత్ముడూ, మహారథుడూ అయిన ద్రుపదుని సాగనంపాడు. (47)
భీష్మమ్ చ ధృతరాష్ట్రమ్ చ భీమసేనో మహాబలః ।
ద్రోణం తు ససుతం వీరం సహదేవో యుధాంపతిః ॥ 48
మహాబలుడైన భీముడు భీష్ముని, ధృతరాష్ట్రుని సాగనంపాడు. ద్రోణుని, అశ్వత్థామను సహదేవుడు సాగనంపాడు. (48)
నకులః సుబలమ్ రాజన్ సహపుత్రం సమన్వయాత్ ।
ద్రౌపదేయాః ససౌభద్రాః పర్వతీయాన్ మహారథాన్ ॥ 49
రాజా! నకులుడు పుత్రసహితుడయిన శకునిని, ఉపపాండవులూ, అభిమన్యుడూ మహారథులయిన పర్వతీయ రాజులను సాగనంపారు. (49)
అన్వగచ్ఛంస్తథైవాన్యాన్ క్షత్రియాన్ క్షత్రియర్షభాః ।
ఏవం సుపూజితాః సర్వే జగ్ముర్విప్రాః సహస్రశః ॥ 50
గతేషు పార్థివేంద్రేషు సర్వేషు బ్రాహ్మణేషు చ ।
యుధిష్ఠిరమువాచేదం వాసుదేవం ప్రతాపవాన్ ॥ 51
అలాగే మిగిలిన రాజులందరినీ తనవారైన రాజులు సాగనంపారు. వేలకొద్దీ విప్రులమ్తా పూజితులై బయలుదేరారు. ఇలా రాజులూ, విప్రులూ వెళ్లిన తరువాత ప్రతాపశాలి కృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. (50,51)
ఆపృచ్చే త్వాం గమిష్యామి ద్వారకాం కురునందన ।
రాజసూయమ్ క్రతుశ్రేష్ఠం దిష్ట్యా త్వం ప్రాప్తవానపి ॥ 52
కురునందనా! నీ అనుజ్ఞ కోరుతున్నాను. ద్వారకకు వెళ్లి వస్తాను. దైవానుగ్రహంతో ఱాజసూయయాగం చక్కగా చేశావు. (52)
తమువాచైవముక్తస్తు ధర్మరాజో జనార్దనమ్ ।
తవ ప్రసాదాద్ గోవింద ప్రాప్తః క్రతువరో మయా ॥ 53
అపుడు ధర్మరాజు కృష్ణునితో "కృష్ణా! నీ అనుగ్రహంతోనే ఈ రాజసూయం నాకు సంపన్నమయింది. (53)
క్షత్రం సమగ్రమపి చ త్వత్రసాదాద్ వశే స్థితమ్ ।
ఉపాదాయ బలిం ముఖ్యం మామేవ సముపస్థితమ్ ॥ 54
నీ అనుగ్రహం వల్లనే రాజసముదాయమంతా వశమయింది. ఎన్నో కానుకలిచ్చి నన్ను సేవించారు. (54)
కథం త్వద్గమనార్థం మే వాణీ వితరతేఽనఘ ।
న హ్యహం త్వామృతే వీర రతిం ప్రాప్నోమి కర్హిచిత్ ॥ 55
మహాత్మా! నిన్ను వెళ్లవచ్చునని నేనెలా చెప్పగలను? నీవు లేకుండా ఎపుడయినా నాకు ప్రసన్నత కలుగుతుందా? కోరిక తీరుతుందా? (55)
అవశ్యం చైవ గంతవ్యా భవతా ద్వారకాపురీ ।
ఏవముక్తః సధర్మాత్మా యుధిష్ఠిరసహాయవాన్ ॥ 56
అభిగమ్యాబ్రవీత్ ప్రీతః పృథాం పృథుయశా హరిః ।
సామ్రాజ్యం సమనుప్రాప్తాః పుత్రాస్తేఽద్య పితృష్వసః ॥ 57
సిద్ధార్థా వసుమంతశ్చ సా త్వం ప్రీతిమవాప్నుహి ।
అనుజ్ఞాతస్త్వయా చాహం ద్వారకాం గంతుముత్సహే ॥ 58
నీవు తప్పక ద్వారకకు వెళ్లాలి కదా!" అన్నాడు ధర్మరాజు. ఆమాట అనిపించుకొని ధర్మాత్ముడయిన శ్రీకృష్ణుడు కుంతీదేవీ దగ్గరకు వెళ్లి "అత్తా! నీ పుత్రులు సామ్రాజ్యం పొందారు. ధనవంతులై, కార్యసిద్ధిని పొందారు. చక్కగా సంతోషించు. నేను ఇక ద్వారకకు వెళ్లి వస్తాను అనుమతించు." (56-58)
సుభద్రాం ద్రౌపదీం చైవ సభాజయత కేశవః ।
నిష్క్రమ్యాంతః పురాత్ తస్మాద్ యుధిష్ఠిరసహాయవాన్ ॥ 59
కేశవుడు సుభద్రకూ, ద్రౌపదికీ కూడా మళ్లీ కలుద్దాం అని మధురంగా వీడ్కోలు చెప్పి అంతఃపురం నుండి బయటపడ్డాడు. (59)
స్నాతశ్చ కృతజప్యశ్చ బ్రాహ్మణాన్ స్వస్తివాచ్య చ ।
తతో మేఘవపుః ప్రఖ్యాం స్యందనం చ సుకల్పితమ్ ।
యోజయిత్వా మహాబాహుః దారుకః సముపస్థితః ॥ 60
ఉపస్థితం రథమ్ దృష్ట్వా తార్ష్యప్రవరకేతనమ్ ।
ప్రదక్షిణముపావృత్య సమారుహ్య మహామనాః ॥ 61
ప్రయయౌ పుండరీకాక్షః తతో ద్వారవతీం పురీమ్ ॥ 62
తరువాత కృష్ణుడు స్నానం, జపం, ముగించుకొని విప్రుల ఆశీస్సులు పొందాడు. దారుకుడు మేఘసుందర మయిన రథం సిద్ధం చేసుకొని వచ్చాడు. కృష్ణుడు గరుడకేతనం చూసి, ప్రదక్షిణం చేసి, రథమెక్కి, ద్వారవతికి బయలుదేరాడు. (60-62)
(సాత్యకిః కృతవర్మా చ రథమారుహ్య సత్వరే ।
వీజయామాసతుస్తత్ర చామరాభ్యాం హరిం తథా ॥
బలదేవశ్చ దేవేశః యాదవాశ్చ సహస్రశః ।
ప్రయయూ రాజవత్ సర్వే ధర్మపుత్రేణ పుజితాః ।
తతః ససమ్మతం రాజా హిత్వా సౌవర్ణమాసనమ్ ॥)
భ్రాతృభిః సహితః శ్రీమాన్ వాసుదేవం మహాబలమ్ ॥ 63
సాత్యకి, కృతవర్మ ఇద్దరూ వెంటనే రథమెక్కి చామరాలతో కృష్ణుని వీస్తున్నారు. బలరాముడూ, వేలకొద్దీ యాదవులూ ధర్మరాజు చేత పూజితులై బయలుదేరారు. వెంటనే ధర్మరాజు సువర్ణసింహాసనం విడిచి, తమ్ముళ్లతో కాలినడకతో వాసుదేవుని అనుసరించాడు. (63)
తతో ముహూర్తం సంగృహ్య స్యందన ప్రవరం హరిః ।
అబ్రవీత్ పుండరీకాక్షః కుంతీపుత్రం యుధిష్ఠిరమ్ ॥ 64
ఒక్కక్షణం రథం ఆపి కృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. (64)
అప్రమత్తః స్థితో నిత్యం ప్రజాః పాహి విశాంపతే ।
పర్జన్యమివ భూతాని మహాద్రుమమివ ద్విజాః ॥ 65
బాంధవా స్త్వోపజీవంతు సహస్రాక్షమివామరాః ।
కృత్వా పరస్పరేణైవం సంవిదమ్ కృష్ణపాండవౌ ॥ 66
అన్యోన్యం సమనుజ్ఞాప్య జగ్మతుః స్వగృహాన్ ప్రతి ।
'రాజా! అప్రమత్తుడవై నిత్యమూ నిలిచి ప్రజలను రక్షించు. ప్రాణులు మేఘాన్ని, పక్షులు మహావృక్షాన్ని, దేవతలు ఇంద్రునీ, ఆశ్రయించి జీవిస్తున్నాట్లు నీ బంధువులు కూడా నీ ఆశ్రయంలో జీవించాలి.' ఇలా చెప్పిన పిదప కృష్ణధర్మజులు ఇరువురూ పరస్పరం వీడ్కోలు చెప్పుకొని తమతమ నివాసాలకు వెళ్లిపోయారు. (65,66 1/2)
గతే ద్వారవతీం కృష్ణే సాత్త్వతప్రవరే నృప ॥ 67
ఏకో దుర్యోధనో రాజా శకుని శ్చాపి సౌబలః ।
తస్యాం సభాయాం దివ్యాయామ్ ఊషతుస్తౌ నరర్షభౌ ॥ 68
సాత్త్వతముఖ్యుడయిన కృష్ణుడు ద్వారవతికి వెళ్లిన తరువాత ఇక దుర్యోధనుడు, శకుని మాత్రం ఆ దివ్యసభలో మిగిలారు. (67,68)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి శిశుపాలవధపర్వణి శిశుపాలవధే పంచచత్వారింశోఽధ్యాయః ॥ 45 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున శిశుపాలవధపర్వమను ఉపపర్వమున శిశుపాలవథ అను నలువది అయిదవ అధ్యాయము. (45)
(దాక్షిణాత్య అధికపాఠము 42 శ్లోకములు కలిపికొని మొత్తము 110 శ్లోకములు)