43. నలువది మూడవ అధ్యాయము
శిశుపాలుని జన్మవృత్తాంతమును భీష్ముడు చెప్పుట.
భీష్మ ఉవాచ
చేదిరాజకులే జాతః త్ర్యక్ష ఏష చతుర్భుజః ।
రాసభారావసదృశం రరాస చ ననాద చ ॥ 1
భీష్ముడిలా చెప్పాడు. చేదివంశంలో ఈతడు మూడు కళ్ళతో, నాలుగు చేతులతో పుట్టాడు. పుట్టిన వెంటనే ఇతడు గాడిద అరిచినట్లు ఏడిచాడు. (1)
తేనాస్య మాతాపితరౌ త్రేసతుస్తౌ సబాంధవౌ ।
వైకృతం తస్య తౌ దృష్ట్వా త్యాగాయాకురుతాం మతిమ్ ॥ 2
దానితో వీని తల్లిదండ్రులూ, బంధువులూ ఎంతో భయపడ్డారు. ఆ వికారరూపం చూసి వీడిని విడిచి పెట్టేద్దా మనుకొన్నారు. (2)
తతః సభార్యం నృపతిం సామాత్యం సపురోహితమ్ ।
చింతాసమ్మూఢహృదయం వాగువాచాశరీరిణీ ॥ 3
అపుడు భార్యతోను, అమాత్యులతోను, పురోహితునితోను చింతాకులుడై ఉన్న రాజుతో అశరీరవాణి ఇలా అంది. (3)
ఏష తే నృపతే పుత్రః శ్రీమాన్ జాతో బలాధికః ।
తస్మాదస్మాన్న భేతవ్యమ్ అవ్యగ్రః పాహి వై శిశుమ్ ॥ 4
రాజా! నీ పుత్రుడు శ్రీమంతుడు బలవంతుడూను. అందుచేత నీవు భయపడనవసరం లేదు. శ్రద్ధగా ఈ శిశువును రక్షించుకో. (4)
న చ వై తస్య మృత్యుర్వై న కాలః ప్రత్యుపస్థితః ।
మృత్యుర్హంతాస్య శస్త్రేణ స చోత్పన్నౌ నరాధిప ॥ 5
ఇప్పుడీతనికి మృత్యువు రాదు. ఇంకా కాలం రాలేదు. రాజా! తన శస్త్రంతో వీనిని చంపేవాడు. ఇప్పటికే పుట్టి ఉన్నాడు. (5)
సంశ్రుత్యోదాహృతం వాక్యం భుతమంతర్హితం తతః ।
పుత్రస్నేహాభిసంతప్తా జననీ వాక్యమబ్రవీత్ ॥ 6
ఈ మాట చెప్పి అశారీరవాణి అంతర్ధానమయింది. అపుడు వీని తల్లి పుత్రవాత్సల్యంతో దుఃఖిస్తూ ఇలా అంది. (6)
యేనేద మీరితం వాక్యం మామైతం తనయం ప్రతి ।
ప్రాంజలిస్తం నమస్యామి బ్రవీతు స పునర్వచః ॥ 7
యథాతథ్యేన భగవాన్ దేవో వా యది వేతరః ।
శ్రోతుమిచ్ఛామి పుత్రస్య కోఽస్య మృత్యుర్భవిష్యతి ॥ 8
నా పుత్రుని గురించి ఈ మాట చెప్పిన వారికి నమస్కరిస్తున్నాను. మళ్లీ ఆ వాణి పలుకుగాక - వీని మృత్యువుకు కారకుడు ఎవరో - అతడు దేవుడైనా ఇతరుడయినా నిజం చెప్పగోరుతున్నాను. (7,8)
అంతర్భూతం తతో భూతం ఉవాచేదం పునర్వచః ।
యస్యోత్సంగే గృహీతస్య భుజావభ్యధికావుభౌ ॥ 9
పతిష్యతః క్షితితలే పంచశీర్షావివోరగౌ ।
తృతీయమేతద్ బాలస్య లలాటస్థం తు లోచనమ్ ॥ 10
నిమజ్జిష్యతి యం దృష్ట్వా సోఽస్య మృత్యుర్భవిష్యతి ।
అపుడా భూతం కనపడకుండానే ఇలా మళ్లీ చెప్పింది. వీనిని ఎవరు ఎత్తుకొన్నప్పుడు వీని అదనపు చేతులు పోతాయో వాడే వీనికి మృత్యువు. అలాగే నుదుటిమిద మూడవ కన్ను పోతుందో అతడే వీనికి మృత్యువవుతాడు. (9, 10 1/2)
త్ర్యక్షం చతుర్భుజం శ్రుతా తథా చ సముదాహృతమ్ ॥ 11
పృథివ్యాం పార్థివాః సర్వే అభ్యాగచ్ఛన్ దిదృక్షవః ।
వీడి మూడుకళ్లూ, నాలుగు చేతులూ చూడాలని భూమి మీది రాజులంతా వచ్చి చూసేవారు. (11 1/2)
తాన్ పూజయిత్వా సంప్రాప్తాన్ యథార్హం స మహీపతిః ॥ 12
ఏకైకస్య నృపస్యాంకే పుత్రమారోపయత్ తదా ।
అలా వచ్చిన రాజులందరినీ పూజించి ఆ రాజు ప్రతీరాజు ఒడిలోను ఆ పుత్రుని కూర్చోపెట్టేవాడు. (12 1/2)
ఏవం రాజసహస్రాణాం పృథక్త్వేన యథాక్రమమ్ ॥ 13
శిశురంకసమారూఢః న తత్ ప్రాప నిదర్శనమ్ ।
అలా కొన్నివేల మంది రాజులు వీనిని తొడమీద కూర్చోబెట్టుకొన్నారు. కాని ఆ నిదర్శనం కనపడలేదు. (13 1/2)
ఏతదేవ తు సంశ్రుత్య ద్వారవత్యాం మహాబలౌ ॥ 14
తతశ్చేదిపురం ప్రాప్తౌ సంకర్షణజనార్దనౌ ।
యాదవౌ యాదవీం ద్రష్టుం స్వసారం తౌ పితుస్తదా ॥ 15
ఈ విషయం విని బలరామకృష్ణులు తమ మేనత్తను చూడటానికి ద్వారపతి నుండి చేదిపురానికి వచ్చారు. (14,15)
అభివాద్య యథాన్యాయం యథాశ్రేష్ఠం నృపం చ తామ్ ।
కుశలానామయం పృష్ట్వా నిషణ్ణౌ రామకేశవౌ ॥ 16
వారిద్దరూ తమమేనత్తకూ, రాజుకూ (దమఘోషుడు) నమస్కరిమ్చి కుశలమడిగి ఆసీనులయ్యారు. (16)
సాభ్యర్చ్య తౌ తదావీరౌ ప్రీత్యా చాభ్యధికం తతః ।
పుత్రం దామోదరోత్సంగే దేవీ సంన్యదధాత్ స్వయమ్ ॥ 17
ఇరువురు మేనల్లుళ్లను ఎంతో ప్రీతితో ఆదరించి స్వయంగా శ్రుతశ్రవ తన కొడుకును కృష్ణుని ఒడిలో ఉంచింది. (17)
న్యస్తమాత్రస్య తస్యాంకే భుజావభ్యధికావుభౌ ।
పేతతుస్తచ్చ నయనం న్యమజ్జత లలాటజమ్ ॥ 18
కృష్ణుని ఒడిలో ఉంచిన వెంటనే అదనపు చేతులు రెండూ రాలిపోయాయి. నుదిటిమీది కన్ను అణగిపోయింది. (18)
తద్ దృష్ట్వా వ్యథితా త్రస్తా వరం కృష్ణమయాచత ।
దదస్వ మే వరం కృష్ణ భయార్తాయా మహాభుజ ॥ 19
ఈ దృశ్యం చూసి భయపడి మేనత్త కృష్ణుని ఇలా కోరింది. కృష్ణా! భయంతో ఆర్తురాలయిన నాకు ఒక వరం ఇవ్వాలి. (19)
త్వం హ్యార్తానాం సమాశ్వాసః భీతానామభయప్రదః ।
ఏవముక్తస్తతః కృష్ణః సోఽబ్రవీద్ యదునందనః ॥ 20
నీవు ఆర్తులకు ఆశ్వాసాన్ని, భీతులకు అభయాన్ని ఇస్తావు. ఈ మాట విని కృష్ణుడు ఇలా అన్నాడు. (20)
మా భైస్త్వం దేవి ధర్మజ్ఞే న మత్తోఽస్తి భయం తవ ।
దదామి కం వరం కిం చ కరవాణి పితృష్వసః ॥ 21
"అత్తా! భయపడకు - నా వల్ల నీకేమీ భయం లేదు. నీకే వరం కావాలి? నేనేం చెయ్యాలి? (21)
శక్యం వా యది వాశక్యం కరిష్యామి వచస్తవ ।
ఏవముక్తా తతః కృష్ణమ్ అబ్రవీద్ యదునందనమ్ ॥ 22
నాకు శక్యమయినా కాకపోయినా నీమాట నెరవేరుస్తాను" కృష్ణుడు ఈ మాట విని ఆమె కృష్ణునితో ఇలా అంది. (22)
శిశుపాలస్యాపరాధాన్ క్షమేథాస్యం మహాబల ।
మత్కృతే యదుశార్దూల విద్ధ్యేనం మే వరం ప్రభో ॥ 23
ఈ శిశుపాలుని అపరాధాలను నాకోసం క్షమించు. యదుశ్రేష్ఠా! ఇదే నా వరం - తెలుసుకో. (23)
శ్రీకృష్ణ ఉవాచ
అపరాధశతం క్షామ్యం మయా హ్యస్య పితృష్వసః ।
పుత్రస్య తే వధార్హస్య మా త్వం శోకే మనః కృథాః ॥ 24
శ్రీకృష్ణుడిలా అన్నాడు - అత్తా! వీని అపరాధాలు నూరు వరకూ క్షమింపదగినవే. వధింపదగిన పుత్రుని కోసం నీవు మనసులో దుఃఖించకు. (24)
భీష్మ ఉవాచ
ఏవమేష నృపః పాపః శిశుపాలః సమందధీః ।
త్వాం సమాహ్వయతే వీర గోవింద వరదర్పితః ॥ 25
భీష్ముడు ఇలా అన్నాడు - ఇదీ జరిగినది. అందుచేత మందబుద్ధీ అయిన శిశుపాలుడు గోవిందా! వరంతో గర్వించి నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు. (25)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి శిశుపాలవధపర్వణి శిశుపాల వృత్తాంతకథనే త్రిచత్వారింశోఽధ్యాయః ॥ 43 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున శిశుపాలవధపర్వమను ఉపపర్వమున శిశుపాల వృత్తాంతకథనమను నలువది మూడవ అధ్యాయము. (43)