41. నలుబది ఒకటవ అధ్యాయము
శిశుపాలుడు బీష్ముని ఉపాలంభించుట.
శిశుపాల ఉవాచ
విభీషికాభిర్బహ్వీభిః భీషయన్ సర్వపార్థివాన్ ।
న వ్యపత్రపసే కస్మాద్ వృద్ధః సన్ కులపాంసన ॥ 1
శిశుపాలుడు అన్నాడు. కులం కళంకితం చేసిన భీష్మా! భయంకరమైన శపథాలతో/ నిందలతో రాజులందరినీ భయపెడుతున్నావు. పెద్దవాడవై ఉండి ఇటువంటి పనులు చేయటానికి నీవు ఎందుకు సిగ్గుపడటం లేదు? (1)
యుక్తమేతత్ తృతీయాయాం ప్రకృతౌ వర్తతా త్వయా ।
వక్తుమ్ ధర్మాదపేతార్థం త్వం హి సర్వకురూత్తమః ॥ 2
నపుంసకప్రవృత్తితో ఉన్న నీకు ఇలా అధర్మవాక్యాలు పలకడం తగినదే. పైగా మరో ఆశ్చర్యకరవిషయం ఏమంటే .... నీవు కురువంశంలో ఉత్తముడవు. (2)
నావి నౌరివ సంబద్ధా యథాంధో వాంధమన్వియాత్ ।
తథా భూతా హి కౌరవ్యాః యేషాం భీష్మ త్వమగ్రణీః ॥ 3
ఒక నావకు మరో నావను కట్టినట్లు, ఒక గ్రుడ్డివాని వెనుక మరో గ్రుడ్డివాడు వెడుతున్నట్లు ఈ కౌరవులంతా నిన్ను ముందుంచుకొని నీవెంట పడుతున్నారు. (3)
పూతనాఘాత పూర్వాణి కర్మాణ్యస్య విశేషతః ।
త్వయా కీర్తయతాస్మాకం భూయః ప్రవ్యథితం మనః ॥ 4
పూతనను చంపిన దగ్గర నుండి కృష్ణుని పనులన్నీ గొప్పగా కీర్తిస్తున్నావు. అవి వింటే నా మనస్సు ఎంతో వ్యథ చెందుతోంది. (4)
అవలిప్తస్య మూర్ఖస్య కేశవం స్తోతుమిచ్ఛతః ।
కథం భీష్మ న తే జిహ్వా శతధేయం విదీర్యతే ॥ 5
గర్వితుడు, మూర్ఖుడూ అయిన కృష్ణుని ఇలా పొగడుతున్న నీ నాలుక ఇంకా నూరుముక్కలు ఎందుకు కాలేదా అని సందేహం! (5)
యత్ర కుత్సా ప్రయోక్తవ్యా భీష్మ బాలతరైర్నరైః ।
తమిమం జ్ఞానవృద్ధః సన్ గోపం సంస్తోతుమిచ్ఛసి ॥ 6
చిన్న పిల్లలు కూడా నిందింప దగినవాని విషయంలో జ్ఞానవృద్ధుడైన నీవు కూడా ఆ గోపాలకుని పొగడుతున్నావేమిటి? (6)
యద్యనేన హతో బాల్యే శకునిశ్చిత్ర మత్ర కిమ్ ।
తౌ వాశ్వవృషభౌ భీష్మ యే న యుద్ధ విశారదే ॥ 7
చిన్నతనంలో అతడు ఒకపక్షిని (బకాసురుని) చంపితే అందులో విచిత్రమేముంది? అలాగే ఒక అశ్వాన్ని (కేశిని), ఒక వృషభాన్ని (అరిష్టాసురుని) చంపితే అదేమయినా ఆశ్చర్యకరవిషయమా? (7)
చేతనారహితం కాష్ఠం యద్యనేన నిపాతితమ్ ।
పాదేన శకటం భీష్మ తత్ర కిం కృతమద్భుతమ్ ॥ 8
చైతన్యం లేని కర్రముక్కలతో కూర్చిన బండిని కాలితో పడగొట్టితే భీష్మా! అదేమయినా అద్భుత కార్యమా? (8)
(అర్కప్రమాణౌ తౌ వృక్షౌ యద్యనేన నిపాతితౌ ।
నాగశ్చ పాతితోఽనేన తత్ర కో విస్మయః కృతః ॥)
(జిల్లేడు చెట్ల వంటి రెండు అర్జున వృక్షాలు కృష్ణుడు పడగొట్టాడంటే అది ఆశ్చర్యకరమైన విషయమా? ఒకపామును చంపాడు కృష్ణుడు - ఇది కూడా ఆశ్చర్యమేనా?)
వల్మీకమాత్రః సప్తాహం యద్యనేన ధృతోఽచలః ।
తదా గోవర్ధనో భీష్మ న తచ్చిత్రం మతం మమ ॥ 9
చీమల పుట్టంత గోవర్ధనమనే గుట్టను వారం రోజులు ఎత్తి పట్టుకొన్నాడు. అది నాకేమీ ఆశ్చర్యంగా అనిపించటం లేదు. (9)
భుక్తమేతేన బహ్వన్నం క్రీడతా నగమూర్ధని ।
ఇతి తే భీష్మ శృణ్వానాః పరే విస్మయమాగతాః ॥ 10
భీష్మా! ఆటలాడుకొనేటప్పుడు కృష్ణుడు పర్వతం మీద కూర్చుని కాస్త ఎక్కువ అన్నమ్ తిన్నాడని నీవు చెపితే అది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోందేమో (కాని నాకేమీ ఆశ్చర్యం కలగటం లేదు.) (10)
యస్య చానేన ధర్మజ్ఞ భుక్తమన్నం బలీయసః ।
స చానేన హతః కంస ఇత్యేతన్న మహాద్భుతమ్ ॥ 11
బలవంతుడయిన కంసుని అన్నం తిన్నందువల్లనే కృష్ణుడు కంసుని చంపాడనేది పెద్ద ఆశ్చర్యకర విషయం కాదు. (11)
న తే శ్రుతమిదం భీష్మ నూనం కథయతాం సతామ్ ।
యద్ వక్ష్యే త్వామధర్మజ్ఞం వాక్యం కురుకులాధమ ॥ 12
కురుకులాధమా! నీకు నిజంగా ఏధర్మమూ తెలియదని సజ్జనులు చెప్పుకొంటున్నారు - నీకీ విషయం తెలియదు. (12)
స్రీషు గోషు న శస్త్రాణి పాతయేద్ బ్రాహ్మణేషు చ ।
యస్య చాన్నాని భుంజీత యత్ర చ స్యాత్ ప్రతిశ్రయః ॥ 13
స్రీల మీద, ఆవుల మీద, బ్రాహ్మణుల మీద, అన్నం పెట్టిన వాని మీద, ఆశ్రయం ఇచ్చినవాడి మీద ఆయుధాలు ప్రయోగింపకూడదు. (13)
ఇతి సంతోఽనుశాసంతి సజ్జనం ధర్మిణః సదా ।
భీష్మలోకే హి తత్ సర్వం వితథం త్వయి దృశ్యతే ॥ 14
భీష్మా! సజ్జనులయిన ధార్మికులు ప్రజలకు సదా ఇలా బోధిస్తూ ఉంటారు. కాని నీ దగ్గర అదంతా అబద్ధమయినట్లు కనిపిస్తోంది. (14)
జ్ఞానవృద్ధం చ వృద్ధం చ భూయాంసం కేశవం మమ ।
అజానత ఇవాఖ్యాసి సంస్తువన్ కౌరవాధమ ॥ 15
కౌరవాధమా! నా ఎదుట కృష్ణుని జ్ఞానవృద్ధుడనీ, వృద్ధుడనీ స్తుతిస్తున్నావు. నాకేదో తెలియనట్లు. (15)
గోఘ్నః స్త్రీఘ్నశ్చ సన్ భీష్మ త్వద్వాక్యాద్ యది పూజ్యతే ।
ఏవం భూతశ్చ యో భీష్మ కథం సంస్తవమర్హతి ॥ 16
భీష్మా! గోవులను చంపినవాడూ, స్త్రీలను చంపినవాడూ నీమాట వల్ల పూజింపబడుతున్నాడు. ఇటువంటివడు ఎలా పూజార్హుడవుతాడు? (16)
అసౌ మతిమతాం శ్రేష్ఠః య ఏష జగతః ప్రభుః ।
సంభావయతి చాప్యేవమ్ త్వ ద్వాక్యాచ్చ జనార్దనః ।
ఏవమేతత్ సర్వమితి తత్ సర్వం వితథం ధ్రువమ్ ॥ 17
ఇతడే బుద్ధిమంతులలో ఉత్తముడనీ, లోకానికంతటికీ ప్రభువనీ, సర్వమూ కృష్ణుడే అనీ నీవు చెపుతున్న మాటలన్నీ నిశ్చయంగా అసత్యాలే. (17)
న గాథాగాధినం శాస్తి బహు చేదపి గాయతి ।
ప్రకృతిం యాంతి భూతాని భూలింగశకునిర్యథా ॥ 18
కథలు ఏవీ కథలు చెప్పేవానిని శాసించవు - అనగా చెప్పేవారి ఆచరించరు. స్వభావాన్నే అనుసరిస్తారు. భూలింగ పక్షిలాగా. (భూమి మిద పడుకొని ఉండే పక్షి ఇతరులకు "ఎన్నడూ సాహసం చెయ్యకండి" అని చెపుతూ ఉండేదిట - తాను మాత్రం సింహం నోట్లో మాంసాన్ని లాక్కునేది. అనగా తాను చెప్పినట్లు తానే ఆచరించేది కాదు. భీష్ముడూ అటువంటివాడే అని భావం.) (18)
నూనం ప్రకృతిరేషా తే జఘన్యా నాత్ర సంశయః ।
అతి పాపీయసీ చైషా పాండవనామపీష్యతే ॥ 19
నీ ఈ స్వభావం చాలా నీచమయింది. సందేహం లేదు. చాలా పాపమయింది. పాండవుల స్వభావం కూడా అంతె. (19)
యేషామర్చ్యతమః కృష్ణః త్వం చ యేషాం ప్రదర్శకః ।
ధర్మవాంస్త్వమధర్మజ్ఞః సతాం మార్గాదవప్లుతః ॥ 20
అధర్మపరుడవయిన నీవు ఆ పాండవులకు ధర్మజ్ఞుడవు. కృష్ణుడు పూజనీయుడని నీవు చెప్పుతున్నావు. అందుచేత వారూ అటువంటివారే. (20)
కో హి ధర్మిణమాత్మానం జానం జ్ఞానవిదాం వరః ।
కుర్యాద్ యథా త్వయా భీష్మ కృతం ధర్మమవేక్షతా ॥ 21
జ్ఞానులలో ఉత్తముడయిన ఈ ధర్మరాజు కూడా ఎలా అయ్యాడో చూడు. ధర్మమెరిగిన ఇతడు నీ వల్ల ఎలా అయ్యాడో చూడు. (21)
చేత్ త్వం ధర్మం విజానాసి యది ప్రాజ్ఞా మతిస్తవ ।
అన్యకామా హి ధర్మజ్ఞా కన్యకా ప్రాజ్ఞమానినా ।
అంబానామేతి భద్రం తే కథం సాపకృతా త్వయా ॥ 22
నీకు ధర్మం తెలిస్తే, నీబుద్ధి ఉత్తమమయినదయితే మరొకనిని కోరిన ధర్మజ్ఞురాలయిన కన్యక అంబను తెలివిగలవాడననుకొనే నీవు ఎలా అపహరించావు? (22)
తాం త్వయాపి హృతాం భీష్మ కన్యాం నైషితవాన్ యతః ।
భ్రాతా విచిత్రవీర్యస్తే సతాం మార్గమనుష్ఠితః ॥ 23
భీష్మా! నీవపహరించిన కన్యను నీ తమ్ముడు విచిత్రవీర్యుడు ఎందుకు వివాహం చేసుకోలేదో తెలుసా? అతడు సన్మార్గవర్తి కాబట్టి. (23)
దారయోర్యస్య చాన్యేన మిషతః ప్రాజ్ఞమానినః ।
తవ జాతాన్యపత్యాని సజ్జనాచరితే పథి ॥ 24
చాలాపండితుడ ననుకొంటున్న నీవు నీతమ్ముని క్షేత్రాల్లో మరొకరిచేత సంతానం పొందావు. ఇంకా నీవు సన్మార్గవర్తి ననుకొంటున్నావు. (24)
కో హి ధర్మోఽస్తి తే భీష్మ బ్రహ్మచర్యమిదం వృథా ।
యద్ ధారయసి మోహాద్ వా క్లీబత్వాద్ వా న సంశయః ॥ 25
నీకసలు ధర్మం ఎక్కడుంది? ఈ బ్రహ్మచర్యం వృథా. నీ వీ బ్రహ్మచర్యం అజ్ఞానంతోనో నంపుసకత్వంతోనో మోస్తున్నావు - ఇది నిస్సందేహం. (25)
న త్వహం తవ ధర్మజ్ఞ పశ్యామ్యుపచయం క్వచిత్ ।
న హి తే సేవితా వృద్ధా య ఏవం ధర్మమబ్రవీః ॥ 26
ధర్మజ్ఞా! భీష్మా! నీలో ఎప్పుడూ అటువంటి ధార్మికమైన ఉన్నతిని చూడలేదు. నీవెన్నడూ పెద్దలను సేవించలేదు. అందుకే ఇలా చెపుతున్నావు ధర్మం. (26)
ఇష్టం దత్తమధీతం చ యజ్ఞాశ్చ బహుదక్షిణాః ।
సర్వమేతదపత్యస్య కలాం నార్హంతి షోడశమ్ ॥ 27
భూరిదక్షిణలిచ్చి యజ్ఞాలు చెయ్యడం, వేదాలు అధ్యయనం చెయ్యడం, ఇవన్నీ సంతానప్రాప్తిలో 16 వ వంతు ఫలాన్ని కూడా ఇవ్వవు. (27)
వ్రతోపవాసైర్బహుభిః కృతమ్ భవతి భీష్మ యత్ ।
సర్వం తదనపత్యస్య మోఘం భవతి నిశ్చయాత్ ॥ 28
భీష్మా! ఎన్నో వ్రతాలతో, ఉపవాసాలతో పొందిన పుణ్యం ఎదయినా సంతానం లేనివానికి నిష్ఫలమే అవుతుంది. (28)
సోఽనపత్యశ్చ వృద్ధశ్చ మిథ్యాధర్మానుసారకః ।
హంసవత్ త్వమపీదానం జ్ఞాతిభ్యః ప్రాప్నుయా వధమ్ ॥ 29
అందుచేత అపత్యంలేని ముసలివాడివి, వ్యర్థధర్మాలు అనుసరిస్తున్నావు. నివు హంసలాగా జ్ఞాతులచేత వధింపబడతావు. (29)
ఏవం హి కథయంత్యన్యే నరా జ్ఞానవిదః పురా ।
భీష్మ యత్ తదహం సమ్యగ్ వక్ష్యామి తవ శృణ్వతః ॥ 30
ఇలా అని జ్ఞానులు చెప్పే వారు పూర్వం. అదేమిటో పూర్తిగా చెపుతాను. విను. (30)
వృద్ధః కిల సముద్రాంతే కశ్చిద్ధంసోఽభవత్ పురా ।
ధర్మవాగన్యథావృత్తః పక్షిణః సోఽనుశాస్తి చ ॥ 31
ధర్మం చరత మాధర్మమ్ ఇతి తస్య వచః కిల ।
పక్షిణః శుశ్రువుర్భీష్మ సతతం సత్యవాదినః ॥ 32
భీష్మా! పూర్వం సముద్ర తీరంలో ఒక ముసలి హంస ఉండేది. ధర్మం చెప్పేది. వ్యతిరేకంగా చేసేది. 'ధర్మం ఆచరించండి - అధర్మం చేయకండి' అని బోధించేది. సత్యవాదులయిన పక్షులు ఆ మాటలు వినేవి. (31,32)
అథాస్య భక్ష్యమాజహ్రుః సముద్రజలచారిణః ।
అండజా భీష్మ తస్యాన్యే ధర్మార్థమితి శుశ్రుమ ॥ 33
సముద్రంలో తిరిగే పక్షులు ఈ హంస చెప్పే ధర్మాలు వినటానికి వచ్చి దానికి ఆహారం ఇచ్చేవి. (33)
తే చ తస్య సమభ్యాశే నిక్షిప్యాండాని సర్వశః ।
సముద్రాంభస్యమజ్జంత చరంతో భీష్మ పక్షిణః ।
తేషామండాని సర్వేషాం భక్షయామాస పాపకృత్ ॥ 34
ఆ పక్షులు తమ గుడ్లను అన్నిటిని హంస దగ్గర భద్రంగా పెట్టి సముద్రంలోకి వెళ్లిపోయేవి. రోజూ ఈ పాపి హంస వారి గుడ్లను తినివేసేది. (34)
స హంసః సంప్రమత్తానామ్ అప్రమత్తః స్వకర్మణి ।
తతః ప్రక్షీయమాణేషు తేషు తేష్వండజోఽపరః ।
అశంకత్ మహాప్రాజ్ఞః స కదాచిత్ దదర్శ హ ॥ 35
పక్షులు ఆదమరచి ఉంటే హంస మాత్రం అప్రమత్తంగా ఉండి గుడ్లను భక్షించేది. రోజురోజుకు గుడ్లు తరిగిపోతుంటే ఆ పక్షుల్లో చాలా తెలివి కల పక్షి ఒకటి హంసను అనుమానించింది. ఒక రోజున హంస గుడ్లు తింటుండగా చూసింది. (35)
తతః స కథయామాస దృష్ట్వా హంసస్య కిల్బిషమ్ ।
తేషామ్ పరమదుఃఖార్తః స పక్షీ సర్వపక్షిణామ్ ॥ 36
హంస చేసే ఈ పాపపుపని ఆ పక్షి అన్నిటికీ చెప్పింది. పక్షులన్నీ చాలా దుఃఖించాయి. (36)
తతః ప్రత్యక్షతో దృష్ట్వా పక్షిణస్తే సమీపగాః ।
నిజఘ్నుస్తం తదా హంసమ్ మిథ్యావృత్తం కురూద్వహ ॥ 37
తరువాత ఆ పక్షులన్నీ ప్రత్యక్షంగా హంసచేసే పాపకృత్యం చూసి, మిథ్యాప్రవర్తన కల ఆ హంసను చంపివేశాయి. (37)
తే త్వాం హంససధర్మాణమ్ అపీమే వసుధాధిపాః ।
నిహన్యుర్భీష్మ సంక్రుద్ధాః పక్షిణస్తం యథాండజమ్ ॥ 38
గాథామప్యత్ర గాయంతి యే పురాణవిదో జనాః ।
భీష్మ యా తాం చ తే సమ్యక్ కథయిష్యామి భారత ॥ 39
భీష్మా! పక్షులు హంసను చంపినట్లుగా ఈ రాజులంతా కోపంతో అధర్మపరుడవయిన నిన్ను వధిస్తారు. ఈ విషయమై పౌరాణికులు ఈ గాథను కీర్తిస్తారు. అదేమిటో నీకు వివరిస్తాను. (38,39)
అంతరాత్మన్యభిహతే రౌషి పత్రరథాశుచి ।
అండభక్షణకర్మైతత్ తవ వాచమతీయతే ॥ 40
'హంసా! నీ అంతరాత్మ రాగాది దోషాలతో కూడి ఉంది. నీ ఈ గుడ్లను భక్షించే అని నీ మాటలకు సర్వధా విరుద్ధం.' (40)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి శిశుపాలవధపర్వణి శిశుపాలవాక్యే ఏకచత్వారింశోఽధ్యాయః ॥ 41 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున శిశుపాలవధపర్వమను ఉపపర్వమున శిశుపాలవాక్యమను నలువది యొకటవ అధ్యాయము. (41)