39. ముప్పది తొమ్మిదవ అధ్యాయము
సహదేవుని కోపము.
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా తతో భీష్మః విరరామ మహాబలః ।
వ్యాజహారోత్తరం తత్ర సహదేవోఽర్థవద్ వచః ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు - ఈవిధంగా చెప్పిన తర్వాత మహాబలుడైన భీష్ముడు విరమించాడు. అనంతరం సహదేవుడు శిశుపాలునికి సమాధానంగా అర్థవంతమైన మాటనిలా చెప్పాడు.
కేశవం కేశిహంతారమ్ అప్రమేయపరాక్రమమ్ ।
పూజ్యమానం మయా యో వః కృష్ణం న సహతే వృపాః ॥ 2
సర్వేషాం బలినాం మూర్ధ్ని మయేదం నిహితం పదమ్ ।
ఏవముక్తే మయా సమ్యక్ ఉత్తరం ప్రబ్రవీత్ సః ॥ 3
స ఏవ హి మయా వధ్యః భవిష్యతి న సంశయః ।
రాజులారా! 'కేశి' అనే రాక్షసుని సంహరించి, పోలికలేని పరాక్రమంగల శ్రీకృష్ణుని పూజించడమ్ ఎవరైనా సహించలేకపోతే, బలవంతులైన మీ అందరి శిరస్సులపై ఇదే నా పాదాన్ని మోపుతున్నాను. ఈ నా మాటకు ఎవరు సమాధానం ఇస్తారో అతడే నాకు ముందుగా చంపదగిన వాడవుతాడు. ఇందులో సందేహం లేదు. (2,3 1/2)
మతిమంతశ్చ యే కేచిద్ ఆచార్యం పితరం గురుమ్ ॥ 4
అర్చ్యమర్చితమర్ఘార్హమ్ అనుజానంతు తే నృపాః ।
బుద్ధిమంతులైన రాజులు ఏ కొందరున్నా వారు ఆచార్యుడు, తండ్రి, గురువు, పూజనీయుడు, అర్ఘ్యాన్ని పొందటానికి సర్వధా అర్హుడు అయిన శ్రీకృష్ణునికి చేసిన గౌరవాన్ని ఆమోదించండి. (4 1/2)
తతో న వ్యాజహారైషాం కశ్చిద్ బుద్ధిమతామ్ సతామ్ ॥ 5
మానినాం బలినామ్ రాజ్ఞాం మధ్యే వై దర్శితే పదా ।
ఈ విధంగా సహదేవుడు పాదాన్ని చూపిస్తే, అక్కడ బుద్ధిమంతులూ, గౌరవనీయులూ, బలవంతులైన రాజులలో ఒక్కడూ ఏమీ మాట్లాడలేదు. (5 1/2)
తతోఽపతత్ పుష్పవృష్టిః సహదేవస్య మూర్ధని ॥ 6
అదృశ్యరూపా వాచశ్చాప్యబ్రువన్ సాధు సాధ్వితి ।
అనంతరం సహదేవుని శిరస్సుపై పూలవాన పడింది. సాధు సాధు (బాగు, బాగు) అని అదృశ్యవాణి పలికింది. (6 1/2)
ఆవిధ్యదజితమ్ కృష్ణం భవిష్యద్భూతజల్పకః ॥ 7
సర్వసంశయనిర్మోక్తా నారదః సర్వలోకవిత్ ।
ఉవాచాఖిలభూతానాం మధ్యే స్పష్టతరం వచః ॥ 8
భూతభవిష్యత్తుల గురించి చెప్పగలవాడూ, సర్వసంశయాలనూ తీర్చగలవాడూ, సకలలోకవేత్త అయిన నారదుడు సర్వభూతసమక్షంలో కృష్ణుని గురించి స్పష్టంగా ఇలా చెప్పాడు. (7,8)
కృష్ణం కమలపత్రాక్షం నార్చయిష్యంతి యే నరాః ।
జీవన్మృతాస్తు తే జ్ఞేయాః న సంభాష్యాః కదాచన ॥ 9
కమల పత్రాల వంటి కన్నులు గల శ్రీకృష్ణుని అర్చించని మానవులు బ్రతికున్నా మరణించినట్లే భావించాలి. వారితో ఎప్పుడూ మాట్లాడటం కూడ చేయరాదు. (9)
వైశంపాయన ఉవాచ
పూజయిత్వా చ పూజార్హాన్ బ్రహ్మక్షత్రవిశేషవిత్ ।
సహదేవో నృణాం దేవః సమాపద్యత కర్మ తత్ ॥ 10
వైశంపాయనుడిలా అన్నాడు - నరదేవుడైన సహదేవుడు అక్కడున్న బ్రహ్మక్షత్రియుల విశేషాలెరింగి గౌరవింపదగిన వారందరిని యథోచితంగా గౌరవించి, అర్ఘ్యసమర్పణ కార్యాలను పూర్తి చేశాడు. (10)
తస్మిన్నభ్యర్చితే కృష్ణే సునీథః శత్రుకర్షణః ।
అతితామ్రేక్షణః కోపాద్ ఉవాచ మనుజాధిపాన్ ॥ 11
కృష్ణుని గౌరవిస్తే, శత్రుకర్షణుడైన శిశుపాలుడు కోపంతో మిక్కిలి ఎరుపెక్కిన కన్నులతో అచటి రాజులనుద్దేశించి ఇలా అన్నాడు. (11)
స్థితః సేనాపతిర్యోఽహం మణ్యధ్వం కిం తు సాంప్రతమ్ ।
యుధి తిష్ఠామ సంనహ్య సమేతాన్ వృష్ణిపాండవాన్ ॥ 12
రాజులారా! నేను సేనాపతిని అని తెలుసుకోండి. మీరంతా ఏమి ఆలోచిస్తున్నారు? వృష్ణిపాండవులను యుద్ధంలో ఎదరించి నిలుద్దాం. (12)
ఇతి సర్వాన్ సముత్సాహ్య రాజ్ఞస్తాంశ్చేదిపుంగవః ।
యజ్ఞోపఘాతాయ తతః సోఽమంత్రయత రాజభిః ॥ 13
తత్రాహూతా గతాః సర్వే సునీథప్రముఖా గణాః ।
సమదృశ్యంత సంక్రుద్ధాః వివర్ణవదనాస్తథా ॥ 14
అని ఈ విధంగా అక్కడి రాజులందరిని చేదిరాజు శిశుపాలుడు ప్రోత్సాహపరిచి, యుధిష్ఠిరుని యజ్ఞానికి విఘాతం కలిగించాలని రాజులతో మంతనాలు చేశాడు. వెంటనే సునీథ ప్రముఖులైన సైనికగణాలు అక్కడ నుండి వెళ్ళాయి. వారి ముఖాలన్నీ కోపంతో వివర్ణాలయినట్లుగా కనబడ్డాయి. (13,14)
యుధిష్ఠిరాభిషేకమ్ చ వాసుదేవస్య చార్హణమ్ ।
న స్యాద్ యథా తథా కార్యమ్ ఏవం సర్వే తదాబ్రువన్ ॥ 15
యుధిష్ఠిరుని అభిషేకమ్, వాసుదేవుని పూజనం ఈ రెండు పనులు సఫలం కాకుండా చేయాలి అని వారంతా అన్నారు. (15)
నిష్కర్షాన్నిశ్చయాత్ సర్వే రాజానః క్రోధమూర్ఛితాః ।
అబ్రువంస్తత్ర రాజానః నిర్వేదాదాత్మనిశ్చయాత్ ॥ 16
సహదేవుని నిష్కర్షవల్ల, నిర్ణయం వల్ల కోపోద్రిక్తులైన రాజులందరూ నిర్వేదంతో, ఆత్మనిశ్చయంతో ఈ విధంగా పలికారు. (16)
సుహృద్భిర్వార్యమాణానాం తేషాం హి వపురాబభే ।
ఆమిషాదపకృష్టానామ్ సింహానామివ గర్జతామ్ ॥ 17
స్నేహితులచే వారింపబడుతున్న వారి శరీరం మాంసం నుండి దూరం చేస్తే గర్జిస్తూన్న సింహాల శరీరంలా ప్రకాశించింది. (17)
తం బలౌఘమపర్యంతం రాజసాగరమక్షయమ్ ।
కుర్వాణం సమయం కృష్ణః యుద్ధాయ బుబుధే తదా ॥ 18
అక్షయ బలసమూహమై హద్దులేని ఆ రాజసాగరాన్ని చూసిన కృష్ణుడు వారంతా యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నారని తెలిసికొన్నాడు. (18)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి అర్ఘాభిహరణపర్వణి రాజమంత్రణే ఏకోనచత్వారింశోఽధ్యాయః ॥ 39 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున అర్ఘాభిహరణపర్వమను ఉపపర్వమున రాజమంత్రణమను ముప్పది తొమ్మిదవ అధ్యాయము. (39)