35. ముప్పది అయిదవ అధ్యాయము
రాజసూయ యాగవర్ణనము.
వైశంపాయన ఉవాచ
పితామహం గురుం చైవ ప్రత్యుద్గమ్య యుధిష్ఠిరః ।
అభివాద్య తతో రాజన్నిదం వచనమబ్రవీత్ ॥ 1
భీష్మం ద్రోణం కృపం ద్రౌణిం దుర్యోధనవివింశతీ ।
అస్మిన్ యజ్ఞే భవంతో మామ్ అనుగృహ్ణంతు సర్వశః ॥ 2
వైశంపాయనుడు అన్నాడు - పితామహుడు బీష్మునికి, గురువు ద్రోణాచార్యునికి ఎదురుగా వచ్చి యుధిష్ఠిరుడు వారి పాదాలకు నమస్కరించాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు వివింశతి మొదలైన వారితో 'ఈ యజ్ఞంలో మీరంతా అన్నివిధాలా నన్ను అనుగ్రహించండి' అని అన్నాడు ధర్మరాజు. (1,2)
ఇదం వః సుమహచ్చైవ యదిహాస్తి ధనం మమ ।
ప్రణమంతు భవంతో మాం యథేష్టమభిమంత్రితాః ॥ 3
ఈ నా అధికధనాన్ని అంతటిని నా ప్రార్థనచే మీరు మీ ఇష్టానుసారం సత్కర్మలకు వినియోగించండి. (3)
ఏవముక్త్వా స తాన్ సర్వాన్ దీక్షితః పాండవాగ్రజః ।
యుయోజ స యతాయోగమ్ అధికారేష్వనంతరమ్ ॥ 4
యజ్ఞదీక్షితుడైన ధర్మరాజు ఇలా వారందరికి చెప్పి అందరికీ అర్హమైన అధికారాలను అప్పగించాడు. (4)
భక్ష్యభోజ్యాధికారేషు దుఃశాసనమయోజయత్ ।
పరిగ్రహే బ్రాహ్మణానామ్ ఆశ్వత్థామానముక్తవాన్ ॥ 5
భక్ష్యభోజ్యాలను చూచి వాటిని సరిగా పంచటానికి దుఃశాసనుని నియమించాడు. బ్రాహ్మణుల స్వాగతసత్కార బాధ్యతను అశ్వత్థామకు అప్పగించాడు. (5)
రాజ్ఞాం తు ప్రతిపూజార్థం సంజయం స న్యయోజయత్ ।
కృతాకృతపరిజ్ఞానే భీష్మద్రోణౌ మహామతీ ॥ 6
రాజన్యుల సత్కారానికి సంజయుని నియమించాడు. 'ఈ పనిని చేయి. ఈ పనిని చేయవద్దు' అనే శాసనాధికారాన్ని బుద్ధిమంతులయిన భీష్మద్రోణుల భుజస్కంధాలపై ఉంచాడు. (6)
హిరణ్యస్య సువర్ణస్య రత్నానాం చాన్వవేక్షణే ।
దక్షిణానాం చ వైదానే కృపం రాజా న్యయోజయత్ ॥ 7
తథాన్యాన్ పురుషవ్యాఘ్రాన్ తస్మింస్తస్మిన్ న్యయోజయత్ ।
బాహ్లికో ధృతరాష్ట్రశ్చ సోమదత్తో జయద్రథః ।
నకులేన సమానీతాః స్వామివత్ తత్ర రేమిరే ॥ 8
ఉత్తమ బంగారాన్ని రత్నాలను రక్షించటం, దానమ్ చేయటం అనే పనుల భారాన్ని కృపాచార్యునిపై పెట్టాడు. ఈ విధంగా శ్రేష్ఠపురుషులను వారి అర్హతల ననుసరించి నియోగించాడు. నకులునిచే ఆహ్వానింపబడిన బాహ్లీక, సోమదత్త, ధృతరాష్ట్ర, జయద్రథులకు ఇంటియజమానుల వలె ఉండే అధికారం అప్పగించాడు. (7,8)
క్షత్తా వ్యయకరస్త్వాసీద్ విదురః సర్వధర్మవిత్ ।
దుర్యోధన స్త్వర్హణాని ప్రతిజగ్రాహ సర్వశః ॥ 9
సర్వధర్మాలూ తెలిసిన విదురునికి ధనవ్యయమనే కార్యాన్ని అప్పగించాడు. దుర్యోధనునికి కానుకలు స్వికరించటం, వాటిని ఉచితప్రదేశాలకు తరలించటం అనే కార్యాలను ఆదేశించాడు. (9)
చరణక్షాళనే కృష్ణః బ్రాహ్మణానాం స్వయం హ్యభూత్ ।
సర్వలోకసమావృత్తః పిప్రోషుః ఫలముత్తమమ్ ॥ 10
శ్రీకృష్ణభగవానుడు యుధిష్ఠిరుని ఆజ్ఞానుసారం అందరినీ సంతోషపరచే నెపంతో బ్రాహ్మణుల పాదప్రక్షాళనం చేయసాగాడు. దీనివల్ల ఆయనకు ఉత్తమఫలం లభించింది. (10)
ద్రష్టుకామాః సభాం చైవ ధర్మరాజం యుధిష్ఠిరమ్ ।
న కశ్చిదాహరత్ తత్ర సహస్రావరమర్హణమ్ ॥ 11
ధర్మజుని రాజసూయసభను చూడాలని వచ్చిన రాజులలో ఏ ఒక్కడూ వెయ్యి సువర్ణనాణాల కన్న తక్కువ కానుక తీసుకురాలేదు. (11)
రత్నైశ్చ బహుభిస్తత్ర ధర్మరాజమవర్ధయత్ ।
కథం తు మమ కౌరవ్యః రత్నదానైః సమాప్నుయాత్ ॥ 12
ప్రతిరోజు బహుసంఖ్యాకాలైన రత్నాలను ఇచ్చి యుధిష్ఠిరుని ధనం వృద్ధిచేశారు. 'ఏదో విధంగా నాచే ఇవ్వబడిన రత్నాలదానం చేతనే యుధిష్ఠిరుడు యజ్ఞాన్ని పూర్తిగా చేయాలి' అనే గొప్ప ఆలోచనతో రాజులందరూ పోటీపడ్డారు. (12)
యజ్ఞమిత్యేవ రాజానః స్పర్ధమానా దదుర్ధనమ్ ।
భవనైః సవిమానాగ్రైః సోదర్కైర్బలసంవృతైః ॥ 13
లోకరాజవిమానైశ్చ బ్రాహ్మణావసథైః సహ ।
కృతైరావసథైర్దివ్యైః విమానప్రతిమైస్తథా ॥ 14
విచిత్రై రత్నవద్భిశ్చ ఋద్ధ్యాచ పరమయా యుతైః ।
రాజభిశ్చ సమావృత్తైః అతీవ శ్రీసమృద్ధిభిః ।
అశోభత సదో రాజన్ కౌంతేయస్య మహాత్మనః ॥ 15
ఆ యజ్ఞశాలశిఖరాలు యజ్ఞాన్ని చూడవచ్చిన దేవతల విమానాలను తాకుతున్నాయా అన్నట్లు ఉన్నాయి. జలాశయాలచే నిండి సైనికులతో నిండిపోయాయి ఆ భవనాలు. ఆ సుందర భవనాలు అన్నీ ఇంద్రాదిలోకపాలకుల విమానాలతో, బ్రాహ్మణుల నివాసస్థానాలతో, సమృద్ధి గల రత్నరాశులతో, మణిచిత్రితాలై విమానాల వంటి శోభలతో మెరిసిపోయాయి. ఆ రాజసూయ యాగాన్ని చూడవచ్చిన రాజులతో, హద్దులేని సంపదల సమృద్ధితో మహాత్ముడైన యుధిష్ఠిరుని ఆ సభ మిక్కిలిగా శోభిల్లింది. (13-15)
ఋద్ధ్యా తు వరుణం దేవం స్పర్ధమానో యుధిష్ఠిరః ।
షడగ్నినాథ యజ్ఞేన సోఽయజద్ దక్షిణావతా ॥ 16
మహారాజు యుధిష్ఠిరుడు తనసాటిలేని సంపద ద్వారా వరుణునితో పోటీపడుతున్నాడు. అతడు యజ్ఞంలో ఆరు అగ్నులను స్థాపించి, భూరిదక్షిణలనిచ్చి ఆ యాగాన్ని సాగించాడు. (16)
సర్వాంజనాన సర్వకామైః సమృద్ధైః సమతర్పయత్ ।
అన్నవాన్ బహుభక్ష్యశ్చ భుక్తవజ్జనసంవృతః ।
రత్నోపహారసంపన్నః బభూవ స సమాగమః ॥ 17
ఆ యజ్ఞంలో ప్రజలందరి కోరికలను సమృద్ధిగా తీర్చి యుధిష్ఠిరుడు సంతృప్తి కలిగించాడు. అన్నపానీయాలకూ, తినుబండారాలకూ లోటు లేదు. ఎవ్వరిలోనూ ఆకలిలేదు. రత్నాలకానుకలు విరివిగా సమకూరాయి. (17)
ఇడాజ్యహోమాహుతిభిః మంత్రశిక్షావిశారదైః ।
తస్మిన్ హి తతృపుర్దేవాః తతే యజ్ఞే మహర్షిభిః ॥ 18
మంత్రభాగాల్లో నిపుణులైన మంత్రవేత్తలు చేసిన స్తుతులు, ఆజ్యహోమాలు, తిలలు మొదలయిన పదార్థాలతో ఇచ్చిన ఆహుతులతో దేవతాగణం అంతా సంతృప్తిని పొందింది. (18)
యథా దేవాస్తథా విప్రాః దక్షిణాన్నమహాధనైః ।
తతృపుః సర్వవర్ణాశ్చ తస్మిన్ యజ్ఞే ముదాన్వితాః ॥ 19
దేవతలు ఆహుతులచే సంతృప్తులయినట్లు బ్రాహ్మణులు దక్షిణలు, అన్నసామగ్రి, ధనాదులతో సంతృప్తిని పొందారు. ఆ యజ్ఞంలో అన్నివర్ణాల ప్రజలు ఆనందించారు. (19)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి రాజసూయయపర్వణి యజ్ఞకరణే పంచత్రింశోఽధ్యాయః ॥ 35 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున రాజసూయపర్వమను ఉపపర్వమున యజ్ఞకరణమను ముప్పది అయిదవ అధ్యాయము. (35)