227. రెండువందల ఇరువది ఏడవ అధ్యాయము
(మయ దర్శనపర్వము)
దేవతల పరాజయము, ఖాండవవనవినాశము, మయాసురరక్షణ.
వైశంపాయన ఉవాచ
తథా శైలనిపాతేన భీషితాః ఖాండవాలయాః ।
దానవా రాక్షసా నాగాః తరక్ష్వృక్షవనౌకసః ॥ 1
వైశంపాయనుడు పలికాడు. - అలా పర్వతశిఖరపాతంతో ఖాండవ వనంలోని దానవులు, రాక్షసులు, ఏనుగులు, తరక్షులు, భల్లూకాలు భయభ్రాంతాలయ్యాయి. (1)
ద్విపాః ప్రభిన్నాః శార్దూలాః సింహాః కేసరినస్తథా ।
మృగాశ్చ మహిషాశ్చైవ శతశః పక్షిణస్తథా ॥ 2
సముద్విగ్నా విససృషుః తథాన్యా భూతజాతయః ।
మదాన్ని స్రవించే ఏనుగులు, పెద్దపులులు, సింహాలు, సివంగులు, మృగాలు, దున్నపోతులు, అనేకరకాలైన పక్షులు, మిగిలిన ప్రాణులు అన్నీ భయవిహ్వలాలై ఇటు అటు పరుగులు తీశాయి. (2 1/2)
తం దానం సముదైక్షంత కృష్ణౌ చాభ్యుద్యతాయుధౌ ॥ 3
ఉత్పాతనాదశబ్దేన త్రాసితా ఇవ చ స్థితాః ।
తే వనం ప్రసమీక్ష్యాథ దహ్యమానమనేకధా ॥ 4
కృష్ణమభ్యుద్యతాస్త్రం చ నాదం ముముచురుల్బణమ్ ।
మండే వనాన్ని, ఆయుధాలు పైకెత్తి నిలుచున్న కృష్ణార్జునులను, ఆ ప్రాణులన్నీ చూశాయి. ఉత్పాత, ఆర్తనాదాలతో భయపడినట్లు ఉన్నాయి. అనేకవిధాలుగా దహింపబడ్డ ఆ వనాన్ని, ఉద్యతాయుధుడైన శ్రీకృష్ణుని చూచి ఆర్తనాదాలు చేశాయి. (3, 4 1/2)
తేన నాదేన రౌద్రేణ నాదేన చ విభావసోః ॥ 5
రరాస గగనం కృత్స్నమ్ ఉత్పాతజలదైరివ ।
భయంకరమైన ఆ ఆర్తనాదాలచే, అగ్ని గర్జనలచే ఆకాశంలో ప్రళయ కాలమేఘాలు గర్జించినట్లు ధ్వని పుట్టింది. (5 1/2)
తతః కృష్ణో మహాబాహుః స్వతేజోభాస్వరం మహత్ ॥ 6
చక్రం వ్యసృజదత్యుగ్రం తేషాం నాశాయ కేశవః ।
అపుడు శ్రీకృష్ణుడు వారి వినాశనం కోసం తన తేజంతో ప్రకాశించే చక్రాన్ని వదిలాడు. (6 1/2)
తేనార్తా జాతయః క్షుద్రాః సదానవనిశాచరాః ॥ 7
నికృత్తాః శతశః సర్వాః నిపేతురనలే క్షణాత్ ।
ఆ చక్రప్రహారంచే దానవ నిశాచర క్షుద్రప్రాణులన్నీ ఖండఖండాలుగా తెగి క్షణకాలంలో అగ్నిలో పడ్డాయి. (7 1/2)
తత్రాదృశ్యంత తే దైత్యాః కృష్ణచక్రవిదారితాః ॥ 8
వసారుధిరసంపృక్తాః సంధ్యాయామివ తోయదాః ।
శ్రీకృష్ణుని చక్రం చీల్చివేయగా క్రొవ్వు, రక్తంతో కూడిన ఆ రాక్షసులు సంధ్యాకాలంలోని ఎఱ్ఱటి మేఘాల్లా కనిపించారు. (8 1/2)
పిశాచాన్ పక్షిణో నాగాన్ పశూంశ్చైవ సహస్రశః ॥ 9
నిఘ్నంశ్చరతి వార్ష్ణేయః కాలవత్ తత్ర భారత ।
శ్రీకృష్ణుడు అక్కడ పిశాచాలను, పక్షులను, సర్పాలను, పశువులను వేలకొద్దీ చంపుతూ యముని వలె సంచరించాడు. (9 1/2)
క్షిప్తం క్షిప్తం పునశ్చక్రం కృష్ణస్యామిత్రఘాతినః ॥ 10
ఛిత్త్వానేకాని సత్త్వాని పాణిమేతి పునః పునః ।
శత్రుసంహారకుడు శ్రీకృష్ణుడు మాటిమాటికి చక్రం విసురుతున్నాడు. అనేక ప్రాణులను చంపి చక్రం మళ్ళీ మళ్ళీ చేతికి చేరుతోంది. (10 1/2)
తథా తు నిఘ్నతస్తస్య పిశాచోరగరాక్షసాన్ ॥ 11
బభూవ రూపమత్యుగ్రం సర్వభూతాత్మనస్తదా ।
ఆ విధంగా పిశాచ, రాక్షస, సర్పాలను చంపే సర్వభూతాత్మకుడైన శ్రీకృష్ణుని రూపం భయంకరంగా మారిపోయింది. (11 1/2)
సమేతానాం చ సర్వేషాం దానవానాం చ సర్వశః ॥ 12
విజేతా నాభవత్ కశ్చిత్ కృష్ణపాండవయోర్మృధే ।
ఆ కలసిన దానవగణమ్ అంతలోను శ్రీకృష్ణార్జునులను గెలిచే విజేత ఎవడూ కానరాలేదు. (12 1/2)
తయోర్బలాత్ పరిత్రాతుం తం చ దావం యదా సురాః ॥ 13
నాశక్నువన్ శమయితుం తదాభూవన్ పరాఙ్ముఖాః ।
దేవతలందరు వారి బలంతో ఖాండవ వనాన్ని రక్షించలేక దావాగ్నిని ఆర్పలేక ఓడిపోయి వెనుకకు తిరిగారు. (13 1/2)
శతక్రతుస్తు సంప్రేక్ష్య విముఖానమరాంస్తథా ॥ 14
బభూవ ముదితో రాజన్ ప్రశంసన్ కేశవార్జునౌ ।
ఇంద్రుడు వెనుతిరిగిన దేవతలను, పరికించి చూచి శ్రీకృష్ణార్జునుల్ని ప్రశంసిస్తూ మిక్కిలి సంతోషించాడు. (14 1/2)
నివృత్తేష్వథ దేవేషు వాగువాచాశరీరణౌ ॥ 15
శతక్రతుం సమాభాష్య మహాగంభీరనిఃస్వనా ।
దేవతలందరూ తిరుగుముఖమ్ పట్టిన పిదప అశరీరవాణి గంభీరస్వరంతో ఇంద్రునితో ఇలా అంది. (15 1/2)
న తే సఖా సంనిహితః తక్షకో భుజగోత్తమః ॥ 16
దాహకాలే ఖాండవస్య కురుక్షేత్రం గతో హ్యసౌ ।
ఇంద్రా! నీ స్నేహితుడు తక్షకుడు ఖాండవవన దహనసమయంలో ఇక్కడలేడు. కురుక్షేత్రానికి చేరాడు. (16 1/2)
న చ శక్యౌ యుధా జేతుం కథంచిదపి వాసవ ॥ 17
వాసుదేవార్జునావేతౌ నిబోధ వచనాన్మమ ।
నరనారాయణావేతౌ పూర్వదేవౌ దివి శ్రుతౌ ॥ 18
భవానప్యభిజానాతి యద్వీర్యౌ యత్పరాక్రమౌ ।
నైతౌ శక్యౌ దురాధర్షౌ విజేతుమజితౌ యుధి ॥ 19
వాసవా! కృష్ణార్జునులిరువురు యుద్ధంలో జయింపశక్యం కాని వారు అని నా మాటగా తెలుసుకో. వీరు పూర్వదేవతలైన నరనారాయణులు, వీరి ఖ్యాతి స్వర్గం దాకా వ్యాపించింది. వీరి పరాక్రమం, బలం నీకూ తెలుసు. వీరిని ముల్లోకాలలో జయింపగల వారు లేరు. (17-19)
అపి సర్వేషు లోకేషు పురాణావృషిసత్తమౌ ।
పూజనీయతమావేతౌ అపి సర్వైః సురాసురైః ॥ 20
యక్షరాక్షస గంధర్వనరకిన్నరపన్నగైః ।
వీరిరువురు పురాతనులైన ఋషిశ్రేష్ఠులు. సుర,అసుర, యక్ష, రాక్షస, కిన్నర, పన్నగ, నరసముదాయాలకు పూజ్యులు. (20 1/2)
తస్మాదితః సురైః సార్ధం గంతుమర్హసి వాసవ ॥ 21
దిష్టం చానుపశ్యైతత్ ఖాండవస్య వినాశనమ్ ।
దేవతలతో కలిసి ఇక్కడి నుంచి వెళ్లటం నీకి ఉచితం. ఖాండవవనదహనాన్ని దైవసంకల్పం అనుకో. (21 1/2)
ఇతి వాక్యముపశ్రుత్య తథ్యమిత్యమరేశ్వరః ॥ 22
క్రోధామర్షౌ సముత్సృజ్య సంప్రతస్థే దివం తదా ।
ఆకాశవాణి మాటలను విని, అది నిజమని గుర్తించి, క్రోధాసూయలను వీడి ఇంద్రుడు స్వర్గానికి అప్పుడే బయలుదేరాడు. (22 1/2)
తం ప్రస్థితం మహాత్మానం సమవేక్ష్య దివౌకసః ॥ 23
సహితాః సేనయా రాజన్ అనుజగ్ముః పురందరమ్ ।
మహాత్ముడైన ఇంద్రుడు బయలుదేరగా చూచి దేవతలందరు సేనలతో సహా అతనిని అనుసరించారు. (23 1/2)
దేవరాజం తదా యాంతం సహ దేవైరవేక్ష్య తు ॥ 24
వాసుదేవార్జునౌ వీరౌ సింహనాదం వినేదతుః ।
సేనలతో బయలుదేరిన ఇంద్రుని చూచి వీరశ్రేష్ఠులైన శ్రీకృష్ణార్జునులు సింహనాదం చేశారు. (24 1/2)
దేవరాజే గతే రాజన్ ప్రహృష్టౌ కేశవార్జునౌ ॥ 25
నిర్విశంకం వనే వీరౌ దాహయామాసత్తుసదా ।
ఇంద్రుడు ఆ ప్రదేశాన్ని వీడి స్వర్గానికి బయలుదేరగా ఆనందించిన కృష్ణార్జునులు అత్యంతప్రసన్నులై అడ్డులేకుండా ఖాండవాన్ని దహింపచేశారు. (25 1/2)
స మారుత ఇవాభ్రాణి నాశయిత్వార్జునః సురాన్ ॥ 26
వ్యధమచ్ఛరసంఘాతైః దేహినః ఖాండవాలయాన్ ।
బలమైన వాయువు మేఘాలను చెల్లాచెదరు చెసినట్లు అర్జునుడు దేవతలందరినీ, ఖాండవవనప్రాణులనూ తన బాణాలతో చంపసాగాడు. (26 1/2)
న చ స్మ కించిచ్ఛక్నోతి భూతమ్ నిశ్చరితుం తతః ॥ 27
సంభిద్యమానమిషుభిః అస్యతా సవ్యసాచినా ।
సవ్యసాచి బాణాలు వేసేటప్పుడు అతని బాణాల నుండి ఏ ప్రాణీ బయట పడలేకపోయింది. (27 1/2)
నాశక్నువంశ్చ భూతాని మహాంత్యపి రణేఽర్జునమ్ ॥ 28
నిరీక్షితుమమోఘాస్త్రం యోద్ధుం చాపి కుతో రణే ।
శతం చైకేన వివ్యాధ శతేనైకం పతత్త్రిణామ్ ॥ 29
మహాప్రాణులు కూడా అమోఘాస్త్రాలు గల అర్జునుని యుద్ధంలో చూడలేకపోయాయి. యుద్ధం ఎలా చేయగలవు. ఒక్కొక్కసారి అర్జునుడు ఒకే బాణంతో వందలకొద్దీ ప్రాణులను, చంపేవాడు, ఒక్కొక్కప్రాణిని వందలకొద్దీ బాణాలతో తుత్తునియలు చేసేవాడు. (28,29)
వ్యవస్యతేఽపతన్నగ్నౌ సాక్షాత్ కాలహతా ఇవ ।
న చాలభంత తే శర్మ రోధస్సు విషమేషు చ ॥ 30
ఆ ప్రాణులన్నీ విగతజీవులై యమునిచే ప్రత్యక్షంగా చంపబడినట్లు అగ్నిలో పడ్డాయి. దుర్గమస్థానాలలో ఉన్నా, వనం సమీపాననున్నా శాంతిమాత్రం వాటికి లభించలేదు. (30)
పితృదేవనివాసేషు సంతాపశ్చాప్యజాయత ।
భూతసంఘాశ్చ బహవో దీనాశ్చక్రుర్మహాస్వనమ్ ॥ 31
పితృ, దేవలోకాలలోనికి ఖాండవవనదాహంచే పుట్టిన వేడి ప్రవేశించింది. ప్రాణి సంఘాలన్నీ భయంతో దీనంగా ఆక్రోశించసాగాయి. (31)
రురుదుర్వారణాశ్చైవ తథా మృగతరక్షవః ।
తేన శబ్దేన విత్రేసుః గంగోదధిచరా ఝుషాః ॥ 32
ఎదిరింప శక్యంకాని ఏనుగులు, తరక్షువులు, మృగాలు అన్నీ రోదించసాగాయి. ఆ గగ్గోలుతో గంగలోను, సముద్రాల లోను సంచరించే చేపలన్నీ భయపడ్డాయి. (32)
విద్యాధరగణాశ్చైవ యే చ తత్ర వనౌకసః ।
న చార్జునం మహాబాహూ నాపి కృష్ణం జనార్దనమ్ ॥ 33
నిరీక్షితుం వై శక్నోతి కశ్చిత్ యోద్ధుం కుతః పునః ।
ఆ వనంలో నివసించే విద్యాధరులు కూడ భయపడ్డారు. ఆ సమయాన అర్జునుని, శ్రీకృష్ణుని ఎవ్వరును కన్నెత్తి చూడలేకపోయారు. ఇంక యుద్ధానికి శక్తి ఎక్కడుంది? (33 1/2)
ఏకాయనగతా యేఽపి నిష్పేతుస్తత్ర కేచన ॥ 34
రాక్షసా దానవా నాగాః జఘ్నే చక్రేణ తాన్ హరిః ।
రాక్షస, దానవ సర్పజాతులతో ఎవరైనా గుంపుకట్టి బయటకు వస్తుంటే శ్రీకృష్ణుడు వారినందరిని చక్రంతో ఖండించారు. (34 1/2)
తే తు భిన్నశిరోదేహాః చక్రవేగాద్ గతాసవః ॥ 35
పేతురన్యే మహాకాయాః ప్రదీప్తే వసురేతసి ।
పెద్దపెద్ద శరీరాలు గల ఆ ప్రాణులు అన్నీ చక్రవేగం వల్ల ప్రాణాలు కోల్పోయి శరీరం ముక్కలై అగ్నిలో పడ్డాయి. (35 1/2)
సమాంసరుధిరౌఘైశ్చ వసాభిశ్చాపి తర్పితః ॥ 36
ఉపర్యాకాశగో భూత్వా విధూమః సమపద్యత ।
దీప్తాక్షో దీప్తజిహ్వాశ్చ సంప్రదీప్తమహాననః ॥ 37
ఆ జీవుల క్రొవ్వు, రక్తం, మాంసాలతో తృప్తి నొందిన అగ్నిదేవుడు ఆకాశచారియై ధూమం లేకుండా ప్రకాశించాడు. ఆయన కన్నులు, నాలుక, ముఖం గొప్పతేజంతో వెలిగిపోయాయి. (36,37)
దీప్తోర్ధ్వకేశః పింగాక్షః పిబన్ ప్రాణభృతాం వసామ్ ।
తాం స కృష్ణార్జునకృతాం సుధాం ప్రాప్య హుతాశనః ॥ 38
బభూవ ముదితస్తృప్తః పరాం నిర్వృతిమాగతః ।
పైకిలేచిన కేశాలతో అగ్ని ప్రకాశించాడు. పింగళవర్ణనేత్రుడయ్యాడు. ప్రాణులక్రొవ్వును త్రాగాడు. కృష్ణార్జునులిచ్చిన ఆ భోజనరూపమైన అమృతం గ్రోలి అగ్ని మరింతగా తృప్తిచెందాడు. గొప్ప శాంతిని పొందాడు. (38 1/2)
తథాసురం మయం నామ తక్షకస్య నివేశనాత్ ॥ 39
విప్రద్రవంతం సహసా దదర్శ మధుసూదనః ।
ఆ సమయంలో తక్షకుని ఇంటదాగి, బయటకు పారిపోయే మయుడనే రాక్షసుని శ్రీకృష్ణుడు చూశాడు. (39 1/2)
తమగ్నిః ప్రార్థయామాస దిధక్షుర్వాతసారథిః ॥ 40
శరీరవాన్ జటీ భూత్వా నదన్నివ బలాహకః ।
గాలి సారథిగా గల అగ్ని మూర్తిమంతుడై జటలు దాల్చి మేఘంతో సమానంగా గర్జిస్తూ వానిని దహిస్తానని ప్రార్థించాడు. (40 1/2)
విజ్ఞాయ దానవేంద్రాణాం మయం వై శిల్పినాం వరమ్ ॥ 41
జిఘాంసుర్వాసుదేవస్తం చక్రముద్యమ్య ధిష్ఠితః ।
స చక్రముద్యతం దృష్వా దిధక్షంతం చ పావకమ్ ॥ 42
అభిధావార్జునేత్యేవమ్ మయస్త్రాహీతి చాబ్రవీత్ ।
మయుడు దానవేంద్రుల ఉత్తమశిల్పి అని గుర్తించి వాసుదేవుడు చక్రమ్ చేతిలోకి తీసుకొని చంపాలని నిలబడ్డాడు. ఒకవైపున శ్రీకృష్ణుని, మరియొకవైపున బూదిచేయసిద్ధమైన అగ్నిని మయుడు చూశాడు. వెంటనే అర్జునుని శరణువేడి రక్షింపుమని ప్రార్థించాడు. (41, 42 1/2)
తస్య భీతస్వనం శ్రుత్వా మా భైరితి ధనంజయః ॥ 43
ప్రత్యువాచ మయం పార్థః జీవయన్నివ భారత ।
భయయుక్తమైన కంఠస్వరాన్ని విన్న అర్జునుడు అతనికి ప్రాణదానం చేస్తూ, 'భయపడవద్దు' అని అన్నాడు. (43 1/2)
తం న భేతవ్యమిత్యాహ మయం పార్థో దయాపరః ॥ 44
అర్జునుని మనస్సులో దయకలిగింది. 'నీవు భయపడవల' దని తిరిగి అర్జునుడు అతనిని ఊరడించాడు. (44)
తమ్ పార్థేనాభయే దత్తే నముచేర్భ్రాతరం మయమ్ ।
న హంతుమైచ్ఛద్ దాశార్హః పావకొ న దదాహ చ ॥ 45
అర్జునుని శరణులో చేరిన నముచిసోదరుడైన మయుని శ్రీకృష్ణుడు చంపటానికి ఇష్టపడలేదు. అగ్నికూడ దహించలేదు. (45)
వైశంపాయన ఉవాచ
తద్ వనం పావకో ధీమాన్ దినాని దశ పంచ చ ।
దదాహ కృష్ణపార్థాభ్యాం రక్షితః పాకశాసనాత్ ॥ 46
వైశంపాయనుడు అన్నాడు - శ్రీ కృష్ణార్జునులచే రక్షింపబడి, ఇంద్రుని ఆక్రమణకు దూరమైన ఆ ఖాండవవనాన్ని అగ్ని పదిహేను రోజులు దహించాడు. (46)
తస్మిన్ వనే దహ్యమానే షడగ్నిర్నదదాహ చ ।
అశ్వసేనం మయం చైవ చతురః శార్ ఙ్గకాంస్తథా ॥ 47
ఈ ఖాండవ దహనంలో అగ్ని ఆరుగురిని దహించలేదు-అశ్వసేనుడు, మయుడు, నాలుగు శార్ ఙ్గకాలు - (47)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి మయదర్శనపర్వణి మయదానవత్రాణే సప్తవింశత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 227 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున మయ దర్శనపర్వమను
ఉపపర్వమున మయదానవత్రాణము అను రెండువందల ఇరువది ఏడవ అధ్యాయము. (227)