225. రెండువందల ఇరువది అయిదవ అధ్యాయము
ఖాండవమున ప్రాణులగగ్గోలు, ఇంద్రుడు వర్షము కురిపించుట.
వైశంపాయన ఉవాచ
తౌ రథాభ్యాం రథశ్రేష్ఠౌ దావస్యోభయతః స్థితౌ ।
దిక్షు సర్వాసు భూతానాం చక్రాతే కదనం మహత్ ॥ 1
వైశంపాయనుడు చెప్పాడు - రథికులలొ శ్రేష్ఠులైన వారిరువురు ఖాండవవనానికి రెండు వైపుల నిలబడి, అన్నిదిక్కులా సంచరిస్తూ, అక్కడి ప్రాణులతో గొప్ప యుద్ధం సాగించారు. (1)
యత్ర యత్ర చ దృశ్యంతే ప్రాణినః ఖాండవాలయాః ।
పలాయంతః ప్రవీరౌ తౌ తత్ర తత్రాభ్యధావతామ్ ॥ 2
ఖాండవవనంలోని ప్రాణులు దిక్కుతోచక ఎటువైపు పరుగులు తీస్తున్నాయో ఆ వైపు వీరువురు వారిని అనుసరించారు. (2)
ఛిద్రం న స్మ ప్రపశ్యంతి రథయోరాశుచారిణోః ।
ఆవిద్ధావేవ దృశ్యేతే రథినౌ తౌ రథోత్తమౌ ॥ 3
శీఘ్రంగా సంచరించే ఖాండవవనప్రాణులకు తప్పించుకొనటానికి చిన్న సందుకూడ చిక్కలేదు. రథశ్రేష్ఠులు శ్రీకృష్ణార్జునులు రెండువైపుల కాలే కర్రవలె అటుఇటు తిరుగసాగారు. (3)
ఖాండవే దహ్యమానే తు భూతాః శతసహస్రశః ।
ఉత్పేతుః భైరవాన్ నాదాన్ వినదంతః సమంతతః ॥ 4
ఖాండవవనాన్ని అగ్ని దహిస్తూ ఉంటే లక్షలకొలదీ ప్రాణులు అన్నివైపుల నుంచి భయంకరంగా ఆక్రందనలు చేశాయి. (4)
దగ్ధైకదేశా బహవః నిష్టప్తాశ్చ తథాపరే ।
స్ఫుటితాక్షా విశీర్ణాశ్చ విలుప్తాశ్చ తథాపరే ॥ 5
కొందరికి శరీరం తగులబడిపోయింది. కొందరు ఉడికిపోయారు. కొందరికి కన్నులు చిట్లిపోయాయి. ఇంద్రియవైకల్యం పొంది, తలో దిక్కుకూ పరుగులు తీశారు. (5)
సమాలింగ్య సుతానన్యే పితౄన్ భ్రాతౄనథాపరే ।
త్యక్తుం న శేకుః స్నేహేన తత్రైవ నిధనం గతాః ॥ 6
కొన్ని పుత్రులను కౌగిలించుకొని విడువలేక కొన్ని తల్లిదండ్రులను, సోదరులను విడవలేక ప్రేమతో అక్కడే ఉండి చనిపోయాయి. (6)
సందష్టదశనాశ్చాన్యే సముత్పేతురనేకశః ।
తతస్తేఽతీవ ఘూర్నంతః పునరగ్నౌ ప్రపేదిరే ॥ 7
కొందరు పళ్ళు కొరుకుతూ అనేక ప్రదేశాలకు దూకి అటునిటు దిక్కులు కానక సంచరిస్తూ తిరిగి అగ్నిలో పడ్డారు. (7)
దగ్ధపక్షాక్షిచరణా విచేష్టంతో మహీతలే ।
తత్ర తత్ర స్మ దృశ్యంతే వినశ్యంతః శరీరిణః ॥ 8
కొన్ని పక్షులు రెక్కలు, కళ్ళు, పాదాలు తగులబడగా భూమిపై పడి కొట్టుకుంటున్నాయి. కొన్ని శరీరాలు తగులబడిపోయి కనపడ్డాయి. (8)
జలాశయేషు తప్తేషు క్వాథ్యమానేషు వహ్నినా ।
గతసత్త్వాః స్మ దృశ్యంతే కూర్మమత్న్యాః సమంతతః ॥ 9
జలాశయాలు వేడెక్కిపోయాయి. సలసలమరుగుతున్న నీటితో అందులో నివసించే ప్రాణులు తాబేళ్లు, చేపలు చనిపోయి కనిపించాయి. (9)
శరీరైరపరే దీప్తైః దేహవంత ఇవాగ్నయః ।
అదృశ్యంత వనే తత్ర ప్రాణినః ప్రాణిసంక్షయే ॥ 10
ప్రాణుల సంహార స్థలమైన ఖాండవవనంలో శరీరాలు తగులబడుతుంటే ప్రాణులన్ని రూపుదాల్చిన అగ్నిదేవతవలె కనబడ్డాయి. (10)
కాంశ్చిదుత్పతతః పార్థః శరైః సంఛిద్య ఖండశః ।
పాతయామాస విహగాన్ ప్రదీప్తే వసురేతసి ॥ 11
ఎగిరి పారిపోయే పక్షులను అర్జునుడు ముక్కలుగా ఖండించి భగభగమండే అగ్నిలో పడేటట్లు చేశాడు. (11)
తే శరాచితసర్వాంగాః నినదంతో మహారవాన్ ।
ఊర్థ్వముత్పత్య వేగేన నిపేతుః ఖాండవే పునః ॥ 12
ఆ పక్షులన్ని బాణాలతో అవయవాలు తెగి, భయంకరంగా నినాదాలు చేస్తూ పైకివేగంగా ఎగిరి తిరిగి ఖాండవవనంలో పడిపోయాయి. (12)
శరైరభ్యాహతానాం చ సంఘశః స్మ వనౌకసామ్ ।
విరావః శుశ్రువే ఘోరః సముద్రస్యేవ మథ్యతః ॥ 13
బాణాలచే గాయపడి గుంపులు గుంపులుగా ఉన్న ప్రాణుల ఆక్రందనలు మథించే సముద్రం యొక్క ఘోషలాగా వినపడ్డాయి. (13)
వహ్నేశ్చాపి ప్రదీప్తస్య ఖముత్పేతుర్మహార్చిషః ।
జనయామాసురుద్వేగం సుమహాంతం దివౌకసామ్ ॥ 14
మండుతున్న అగ్నిజ్వాలలు ఆకాశానికి ఎగిసి దేవతలకు కూడా భయాన్ని కలిగించాయి. (14)
తేనార్చిషా సుసంతప్తాః దేవాః సర్షిపురోగమాః ।
తతో జగ్ముర్మహాత్మానః సర్వ ఏవ దివౌకసః ।
శతక్రతుం సహస్రాక్షం దేవేశమసురార్దనమ్ ॥ 15
ఆ జ్వాలచే ఉడికిపోయిన దేవతలందరు ఋషులతో కూడి దేవేశుడు, అసురనాశకుడు, సహస్రాక్షుడు అయిన ఇంద్రుని దగ్గరకు చేరాయి. (15)
దేవా ఊచుః
కిం త్విమే మానవాః సర్వే దహ్యంతే చిత్రభానునా ।
కచ్చిన్న సంక్షయః ప్రాప్తః లోకానామమరేశ్వర ॥ 16
దేవతలు పలికారు - దేవేశ్వరా! అగ్ని ఏ కారణంగా మనుష్యులను దహిస్తున్నాడు? ప్రపంచానికి ప్రళయం రాలేదు కదా! (16)
వైశంపాయన ఉవాచ
తచ్ఛ్రుత్వా వృత్రహా తేభ్యః స్వయమేవాన్వవేక్ష్య చ ।
ఖాండవస్య విమోక్షార్థమ్ ప్రయయౌ హరివాహనః ॥ 17
వైశంపాయనుడు అన్నాడు - వారి మాటలు విన్న దేవేంద్రుడు స్వయంగా చూచి ఖాండవవనాన్ని అగ్ని నుంచి రక్షించడానికి బయలుదేరాడు. (17)
మహతా రథవృందేన నానారూపేణ వాసవః ।
ఆకాశం సమవాకీర్య ప్రవవర్ష సురేశ్వరః ॥ 18
ఇంద్రుడు తనతో అనేకరథసముదాయాలను తీసుకొని వెళ్ళి ఆకాశమంతా వ్యాపించి వర్షధారలను కురిపించాడు. (18)
తతోఽక్షమాత్రా వ్యసృజన్ ధారాః శతసహస్రశః ।
చోదితా దేవరాజేన జలదాః ఖాండవం ప్రతి ॥ 19
ఇంద్రుడు పంపిన మేఘాలు రథపుటిరుసుల ప్రమాణంలో వేలకొద్దీ ధారలను ఖాండవంలో కురిపించాయి. (19)
అసంప్రాప్తాస్తు తా ధారాః తేజసా జాతవేదసః ।
ఖ ఏవ సమశుష్యంత న కాశ్చిత్ పావకం గతాః ॥ 20
కాని అగ్ని తేజోబలంచే ఆ ధారలన్నీ భూమిని చేరకముందే ఆకాశంలోనే ఇంకిపోయాయి. ఏ ఒక్కటీ అగ్నిని చేరలేక పొయింది. (20)
తతో నముచిహా క్రుద్ధః భృశమర్చిష్మతస్తదా ।
పునరేవ మహామేఘైః అంభాంసి వ్యసృజద్ బహు ॥ 21
అప్పుడు ఇంద్రుడు కోపించి పెద్ద జ్వాలలు కల అగ్నిపై తిరిగి పెద్దపెద్ద మేఘాల ద్వారా ఎంతో జలాన్ని కురిపించాడు. (21)
అర్చిర్ధారాభిసంబద్ధం ధూమవిద్యుత్సమాకులమ్ ।
బభూవ తద్ వనం ఘోరం స్తనయిత్నుసమాకులమ్ ॥ 22
అగ్నిజ్వాలలచే వ్యాప్తమై జలధారలు కురియటంతో ఒక్కసారిగా ఆ ఖాండవవనం ధూమాన్ని ఎగచిమ్మి మేఘగర్జనలతో మార్ర్మోగిపోయింది. (22)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఖాండవదాహపర్వణి ఇంద్రక్రోధే పంచవింశత్యధిక శతతమోఽధ్యాయః ॥ 225 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఖాండవదాహపర్వమను
ఉపపర్వమున ఇంద్రక్రోధము అను రెండువందల ఇరువది అయిదవ అధ్యాయము. (225)