223. రెండువందల ఇరువది మూడవ అధ్యాయము
అర్జునుడు అగ్ని నుండి దివ్యధనుస్సు, రథము పొందుట.
వైశంపాయన ఉవాచ
స తు నైరాశ్యమాపన్నః సదా గ్లానిసమన్వితః ।
పితామహముపాగచ్ఛత్ సంక్రుద్ధో హవ్యవాహనః ॥ 1
వైశంపాయనుడు పలికాడు - జనమేజయా! నిరాశచే ఆవరింపబడి, మానసికశ్రమ పొంది, కోపంతో అగ్నిదేవుడు బ్రహ్మమందిరానికి చేరాడు. (1)
తచ్చ సర్వం యథాన్యాయం బ్రహ్మణే సంన్యవేదయత్ ।
ఉవాచ చైనం భగవాన్ ముహూర్తం స విచింత్య తు ॥ 2
అక్కడ బ్రహ్మతో అన్నివిషయాలు జరిగినవి జరిగినట్లు నివేదించాడు. ఆ బ్రహ్మ కొద్దిసేపు ఆలోచించి ఇలా అన్నాడు. (2)
ఉపాయః పరిదృష్టో మే యథా త్వం లక్ష్యసేఽనఘ ।
కాలం చ కంచిత్ క్షమతామ్ తతస్త్వం ధక్ష్యసేఽనల ॥ 3
పుణ్యాత్మా! నీవు ఖాండవవనాన్ని దహింపచేయడానికి తగిన ఉపాయం తెలిసింది. కొంత సమయం నీవు ఎదురు చూడాలి. అటుపైన ఖాండవవనాన్ని దహిస్తావు. (3)
భవిష్యతః సహాయౌ తే నరనారాయణౌ తదా ।
తాభ్యాం త్వం సహితో దావం ధక్ష్యసే హవ్యవాహన ॥ 4
ఆ దహించే సమయంలో నరనారాయణ ఋషులిరువురు నీకు సహాయపడతారు. వారితో కూడి నీవు ఖాండవవనాన్ని దహిస్తావు. (4)
ఏవమస్త్వితి తం వహ్నిః బ్రహ్మాణం ప్రత్యభాషత ।
సంభూతౌ తౌ విదిత్వా తు నరనారాయణావృషీ ॥ 5
కాలస్య మహతో రాజన్ తస్య వాక్యం స్వయంభువః ।
అనుస్మృత్య జగామాథ పునరేవ పితామహమ్ ॥ 6
అగ్ని సంతసించి 'అలాగే కానివ్వండి' అని బ్రహ్మతో పలికాడు. కొంతకాలం పిమ్మట నరనారాయణులు భూమిపై అవతరించారని తెలిసి బ్రహ్మగారిచ్చిన మాట గుర్తుకువచ్చింది. తిరిగి అగ్ని బ్రహ్మ సమీపానికి వెళ్ళాడు. (5,6)
అబ్రవీచ్చ తదా బ్రహ్మా యథా త్వం ధక్ష్యసేఽనల ।
ఖాండవం దాహమద్యైవ మిషతోఽస్య శచీపతేః ॥ 7
ఆ సమయంలో బ్రహ్మ అగ్నితో అన్నాడు - అగ్నీ! ఇంద్రుడు చూస్తూ ఉండగానే ఖాండవవనాన్ని నీవెలా దహిస్తావో ఆ ఉపాయాన్ని ఇపుడే చెబుతాను. విను. (7)
నరనారాయణౌ యౌ తౌ పూర్వదేవౌ విభావసో ।
సంప్రాప్తౌ మానుషే లోకే కార్యార్థం హి దివౌకసామ్ ॥ 8
అగ్నీ! ఆదిదేవులైన నరనారాయణులిరువురు దేవతల కార్యనిర్వహణకై మనుష్యలోకంలో అవతరించారు. (8)
అర్జునం వాసుదేవం చ యౌ తౌ లోకోఽభిమన్యతే ।
తావేతౌ సహితావేహి ఖాండవస్య సమీపతః ॥ 9
అక్కడి జనులు వారిని అర్జునుడని, వాసుదేవుడని పిలుస్తుంటారు. వారు ఇప్పుడు ఖాండవవనానికి సమీపాన ఉన్నారు. (9)
తౌ త్వం యాచస్య సాహాయ్యే దాహార్థం ఖాండవస్య చ ।
తతో ధక్ష్యసి తం దావం రక్షితం త్రిదశైరపి ॥ 10
ఆ వీరులిద్దరినీ ఖాండవనదహనంలో సహాయం చేయమని అర్థించు. అప్పుడు నీవు ఇంద్రాదిదేవతలను కూడ ఎదిరించి వనదహనం చేయగలవు. (10)
తౌ తు సత్త్వాని సర్వాణి యత్నతో వారయిష్యతః ।
దేవరాజం చ సహితౌ తత్ర మే నాస్తి సంశయః ॥ 11
వారిరువురు వీరులు ఒక్కటై ప్రయత్నంతో వనమందలి ప్రాణులను నివారించగలరు. ఇంద్రుడు దేవతల రాజైనా సరే! వారు ఎదుర్కొంటారు. సందేహం లేదు. (11)
ఏతచ్ఛ్రుత్వా తు వచనం త్వరితో హవ్యవాహనః ।
కృష్ణపార్థావుపాగమ్య యమర్థం త్వభ్యభాషత ॥ 12
తం తే కథితవానస్మి పూర్వమేవ నృపోత్తమ ।
తచ్ఛ్రుత్వా వచనం త్వగ్నేఃబీభత్సుర్జాతవేదసమ్ ॥ 13
అబ్రవీన్నృపశార్దూల తత్కాలసదృశం వచః ।
దిధక్షుం ఖాండవ దావమ్ అకామస్య శతక్రతోః ॥ 14
ఇది విని హవ్యవాహనుడు వెంటనే కృష్ణార్జునుల సమీపానికి వెళ్లి నివేదించిన కార్యాన్ని నీకు ముందే నేను వినిపించాను. అగ్నిప్రార్థన విని అర్జునుడు ఇంద్రుని కోరికకు విరుద్ధంగా ఖాండవవనదాహాభిలాషగల అగ్నితో ఆ సమయానికి అనుకూలంగా మాట్లాడాడు. (12-14)
అర్జున ఉవాచ
ఉత్తమాస్త్రాణి మే సంతి దివ్యాని చ బహూని చ ।
యై రహం శక్నుయాం యోద్ధుమపి వజ్రధరాన్ బహూన్ ॥ 15
అర్జునుడు పలికాడు - నా వద్ద దివ్యాస్త్రాలు చాలా ఉన్నాయి. వాటితో నేను ఎందరు ఇంద్రులు వచ్చినా ఎదిరించగలను. (15)
ధనుర్మే నాస్తి భగవన్ బాహువీర్యేణ సమ్మతమ్ ।
కుర్వతః సమరే యత్నం వేగం యద్ విషహేన్మమ ॥ 16
నా బాహువీర్యానికి తగిన ధనుస్సు లేదు. సమరభూమిలో నా వేగానికి తగిన యుద్ధసామగ్రి లేదు. (16)
శరైశ్చ మేఽర్థో బహుభిః అక్షయైః క్షిప్రమస్యతః ।
న హి వోఢుం రథః శక్తః శరాన్ మమ యథేప్సితాన్ ॥ 17
శీఘ్రగాములయిన అక్షయబాణాలు నాకు చాలా కావాలి. అన్ని బాణాలను మోయగల రథం నా దగ్గర లేదు. (17)
అశ్వాంశ్చ దివ్యానిచ్ఛేయం పాండురాన్ వాతరంహసః ।
రథం చ మేఘనిర్ఘోషం సూర్యప్రతిమతేజసమ్ ॥ 18
తథా కృష్ణస్య వీర్యేణ నాయుధం విద్యతే సమమ్ ।
యేన నాగాన్ పిశాచాంశ్చ నిహన్యాన్మాధవో రణే ॥ 19
వాయుసమానవేగం కల తెల్లటి గుర్రాలు కావాలి. మేఘధ్వని సూర్యతేజస్సు కల రథం కావాలి. అలాగే కృష్ణుని పరాక్రమానికి తగిన ఆయుధం లేదు. దానితో ఈ యుద్ధంలో నాగులనూ, పిశాచాలను అతడు సంహరించాలి. (18,19)
ఉపాయం కర్మసిద్ధౌ చ భగవన్ వక్తుమర్హసి ।
నివారయేయం యేనేంద్రం వర్షమాణం మహావనే ॥ 20
భగవంతుడా! ఈ కార్యసిద్ధిలో ఉపాయం అవసరమై ఉంది. అది నీవు చెప్పాలి. ఖాండవవనంలో వర్షిమ్చే ఇంద్రుని నివారించే రథం, బాణాలు అవసరం. (20)
పౌరుషేణ తు యత్ కార్యం తత్ కర్తారౌ స్వ పావక ।
కరణాని సమర్థాని భగవన్ దాతుమర్హసి ॥ 21
అగ్నిదేవా! పౌరుషంతో సిద్ధించే దానిని మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి తగిన సాధనాలను నీవు ఇవ్వవలసి ఉంది. (21)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఖాండవదాహపర్వణి అర్జునాగ్ని సంవాదే త్రయోవింశత్యధిక ద్విశతతమోఽధ్యాయః ॥ 223 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఖాండవదాహపర్వమను
ఉపపర్వమున అర్జునాగ్ని సంవాదమను రెండువందల ఇరువది మూడవ అధ్యాయము. (223)