220. రెండువందల ఇరువదియవ అధ్యాయము
(హరణాహరణ పర్వము)
సుభద్రవివాహము, అభిమన్యుని పుట్టుక, విద్యాభ్యాసము.
వైశంపాయన ఉవాచ
ఉక్తవంతో యథా వీర్యమ్ అసకృత్ సర్వవృష్ణయః ।
తతోఽబ్రవీత్ వాసుదేవః వాక్యం ధర్మార్థసంయుతమ్ ॥ 1
వైశంపాయనుడు అన్నాడు-జనమేజయా! యాదవులందరు ఆ సమయంలో తమతమ శక్త్యనుసారం ప్రతీకారేచ్చతో అర్జునుని లొంగదీయాలని విన్నవించారు. శ్రీకృష్ణుడు మాత్రం ధర్మంతో, అర్థంతో నిండైన వాక్యాలను ఇలా పలికాడు. (1)
నావమానం కులస్యాస్య గుడాకేశః ప్రయుక్తవాన్ ।
సమ్మానోఽభ్యధికస్తేన ప్రయుక్తోఽయం న సంశయః ॥ 2
అర్జునుడు మన కులాన్ని అవమానించలేదు. మనయాదవులపై గౌరవభావాన్ని ప్రకటించాడు. ఈ విషయంలో సందేహం లేదు. (2)
అర్థలుబ్థాన్ న వః పార్థః మన్యతే సాత్వతాన్ సదా ।
స్వయంవరమనాధృష్యం మన్యతే చాపి పాండవః ॥ 3
సాత్వతులకు ధనలోభం లేదు కావున ధనమిచ్చి కన్యకను పరిగ్రహింప వీలుకాదు. స్వయంవరంలో కన్యను గెలిచినా ఆమె అభిప్రాయం తెలుసుకోలేం. ఈ అంశాలన్ని అర్జునుడు ఆలోచించాడు. (3)
ప్రదానమపి కన్యాయాః పశువత్ కోఽనుమన్యతే ।
విక్రయం చాప్యపత్యస్య కః కుర్యాత్ పురుషో భువి ॥ 4
కన్యాదానం చేయించుకొన్న పౌరుషహీనుడు పరాక్రమహీనుడై పశుతుల్యుడు అవుతాడు. ధనం గ్రహించి తన సంతానాన్ని అమ్ముకొనేవాడు అధముడుగా పరిగణింపబడతాడు. (4)
ఏతాన్ దోషాంస్తు కౌంతేయః దృష్టవానితి మే మతిః ।
అతః ప్రసహ్య హృతవాన్ కన్యామ్ ధర్మేణ పాండవః ॥ 5
ఈ దోషాలను అర్జునుడు మనస్సులో ఆలోచించాడు. అందుకే బలవంతంగా ఈ కన్యను క్షత్రియధర్మానుసారం అపహరించి తీసుకుపోయాడు. (5)
ఉచితశ్చైవ సంబంధః సుభద్రాం చ యశస్వినీమ్ ।
ఏష చాపీదృశః పార్థః ప్రసహ్య హృతవానితి ॥ 6
నా అభిప్రాయంలో ఈ సంబంధం ఉచితమైంది. యశస్విని సుభద్రను యశస్వి అర్జునుడు పరిగ్రహించాడు. కావున 'రత్నహారీ తు పార్థివః' అనే న్యాయాన్ని పాటించి బలవంతంగా ఆమెను హరించాడు. (6)
భరతస్యాన్వయే జాతం శంతనోశ్చ యశస్వినః ।
కుంతిభోజాత్మజాపుత్రం కో బుభూషేత నార్జునమ్ ॥ 7
భరతవంశంలో జన్మించి, కీర్తి గడించిన శంతను వంశజుడై, కుంతిభోజుని దౌహిత్రుడైన అర్జునుని సంబంధాన్ని ఎవడు కోరడు? (7)
న చ పశ్యామి యః పార్థం విజయేత రణే బలాత్ ।
వర్జయిత్వా విరూపాక్షం భగనేత్రహరం హరమ్ ॥ 8
అపి సర్వేషు లోకేషు సేంద్రరుదేషు మారిష ।
అర్యుడా! ఇంద్రరుద్రలోకాలలో శంకరుడు తప్ప మరొకడు అర్జునుని జయించగలవాడు నాకు కన్పించటంలేదు. యుద్ధంలో అర్జునుని గెలవడం అసాధ్యం. (8 1/2)
స చ నామ రథస్తాదృక్ మదీయాస్తే చ వాజినః ॥ 9
యోద్ధా పార్థశ్చ శీఘ్రాస్త్రః కో ను తేన సమో భవేత్ ।
తమభిద్రుత్య సాంత్యేన పరమేణ ధనంజయమ్ ॥ 10
న్యవర్తయత సంహృష్టాః మమైషా పరమా మతిః ।
ఈ సమయంలో అర్జునుని వద్ద నారథం, గుఱ్ఱాలు ఉన్నాయి. అంతేగాక వాటిని సమర్థంగా నడిపించగలిగిన యోధుడు అర్జునుడు. ఈ దశలో అర్జునునికి సమానుడు లేడు. మీరు ప్రసన్నులై తొందరగా అతనిని అనుసరించి సాంత్వనతో మరల్చటమే ఉచితం. ఇది నాకు సమ్మతం. (9, 10 1/2)
యది నిర్జిత్య వః పార్థః బలాద్ గచ్ఛేత్ స్వకం పురమ్ ॥ 11
ప్రణశ్యేద్ వో యశః సద్యః న తు సాంత్వే పరాజయః ।
అర్జునుడు మనల్ని జయించి తన నగరానికి వెళ్లితే మనకీర్తి నశిస్తుంది. సాంత్వనంలో పరాజయ శంకలేదు. (11 1/2)
తచ్ర్ఛుత్వా వాసుదేవస్య తథా చక్రుర్జనాధిప ॥ 12
జనమేజయా! వాసుదేవుని మాటలను విని వారు అదేవిధంగా ఆచరించారు. (12)
నివృత్తశ్చార్జునస్తత్ర వివాహం కృతవాన్ ప్రభుః ।
ఉషిత్వా తత్ర కౌంతేయః సంవత్సరపరాః క్షపాః ॥ 13
పరాక్రమవంతుడు అర్జునుడు ద్వారకకు తిరిగి వచ్చి, సుభద్రను వివాహం చేసికొని సంవత్సరం పైని అక్కడనే గడిపాడు. (13)
విహృత్య చ యథాకామం పూజితో వృష్ణినందనైః ।
పుష్కరే తు తతః శేషం కాలం వర్తితవాన్ ప్రభుః ॥ 14
ద్వారకలో స్వేచ్ఛగా విహరించి యాదవ వంశీయులచే పూజలందుకొని అక్కడ నుండి బయలుదేరి పుష్కర తీర్థంలో మిగిలిన కాలాన్ని గడిపాడు. (14)
పూర్ణేతు ద్వాదశే వర్షే ఖాండవప్రస్థమాగతః ।
(వవందే ధౌమ్యమాసాద్య మాతరం చ ధనంజయః ॥
పండ్రెండు సంవత్సరాలు పూర్తికాగానే ఖాండవప్రస్థానికి తిరిగివచ్చాడు. పురోహితుడు ధౌమ్యుని వద్దకు వెళ్ళి నమస్కరించి అటుపైన తల్లికి కూడ నమస్కరించాడు. (14 1/2)
స్వృష్ట్వా చ చరణౌ రాజ్ఞో భీమస్య చ ధనంజయః ।
యమాభ్యాం వందితో హృష్టః సస్వజే తౌ ననంద చ ॥)
అభిగమ్య చ రాజానం నియమేన సమాహితః ॥ 15
అభ్చర్చ్య బ్రాహ్మణాన్ పార్థో ద్రౌపదీమభిజగ్మివాన్ ।
అర్జునుడు ధర్మజ. భీములకు నమస్కరించి, నకులసహదేవుల నమస్కారాలు పొంది వారిని కౌగిలించుకొని మిక్కిలి ప్రసన్నుడయ్యాడు. ధర్మరాజును చేరి ఏకాగ్రచిత్తుడై విధిపూర్వకంగా బ్రాహ్మణులను అర్చించాడు. పిమ్మట ద్రౌపది సమీపానికి చేరాడు. (15 1/2)
తం ద్రౌపదీ ప్రత్యువాచ ప్రణయాత్ కురునందనమ్ ॥ 16
తత్రైవ గచ్ఛ కౌంతేయ యత్ర సా సాత్వతాత్మజా ।
సుబద్ధస్యాపి భారస్య పూర్వబంధః శ్లథాయతే ॥ 17
ప్రణయ కోపంతో ద్రౌపది కురునందనునితో అంది. ఇక్కడి కేల వచ్చావు? సాత్వత కుమార్తె సుభద్ర ఉన్నచోటికే పొమ్ము. రెండవసారి బంధం బిగించేటపుడు పూర్వబంధం వదులవడం లోకసహజం. (16,17)
తథా బహువిధం కృష్ణాం విలపంతీం ధనంజయః ।
సాంత్వయామాస భూయశ్చ క్షమయామాస చాసకృత్ ॥ 18
ఇలా ద్రౌపది అనేక రకాలుగా విలపించసాగింది. ధనంజయుడు ఆమెను ఊరడించాడు. మరల మరల ఊరుకోబెట్టాడు. (18)
సుభద్రాం త్వరమాణశ్చ రక్తకౌశేయవాసినీమ్ ।
పార్థః ప్రస్థాపయామాస కృత్వా గోపాలికావపుః ॥ 19
అర్జునుడు ఎఱ్ఱటి పట్టువస్త్రాలు ధరించిన సుభద్రను గోపాలికావేషం ధరింపజేసి ఇంటిలో ప్రవేశపెట్టాడు. (19)
సాధికం తేన రూపేణ శోభమానా యశస్వినీ ।
భవనం శ్రేష్ఠమాసాద్య వీరపత్నీ వరాంగనా ॥ 20
వవందే పృథుతామ్రాక్షీ పృథాం భద్రా యశస్వినీ ।
తాం కుంతీ చారుసర్వాంగీమ్ ఉపాజిఘ్రత మూర్ధని ॥ 21
వీరపత్ని, వీరాంగన, యశస్విని సుభద్ర ఆ వేషంలో మిక్కిలి శోభించింది. విశాలమయిన ఆమె కళ్లు ఎఱ్ఱగా ఉన్నాయి. సుభద్ర కుంతిదేవికి నమస్కరించింది. ఆమె సుభద్రను దగ్గరకు తీసికొని నుదుటిపై చుంబించి ఆశీర్వదించింది. (20,21)
ప్రీత్యా పరమయా యుక్తా ఆశీర్భిర్యుంజతాతులామ్ ।
తతోఽభిగమ్య త్వరితా పూర్ణేందుసదృశాననా ॥ 22
వవందే ద్రౌపదీం భద్రా ప్రేష్యాహమితి చాబ్రవీత్ ।
మిక్కిలి ప్రసన్నురాలై కుంతి ఆ సౌందర్యవతికి ఎన్నో ఆశీర్వచనా లిచ్చింది. పూర్ణచంద్రబింబం వంటి ముఖంతో ఆమె ద్రౌపదిదేవి చరణాలకు నమస్కరించి "నేను మీదాసిని" అంది. (22 1/2)
ప్రత్యుత్థాయ తదా కృష్ణా స్వసారం మాధవస్య చ ॥ 23
పరిష్వజ్యావదత్ ప్రీత్యా నిఃసపత్నోస్తు తే పతిః ।
తథైవ ముదితా భద్రా తామువాచైవమస్త్వితి ॥ 24
ద్రౌపదీ దేవి వెంటనే లేచి శ్రీకృష్ణుని చెల్లెలు సుభద్రను కౌగిలించుకొని ప్రసన్నతతో "నీభర్త శత్రురహితుడగుగాక" అని దీవించింది. సుభద్ర ఆనందంలో మునిగి "మీ ఆశీర్వాదం ఫలించాలి" అని అంది. (23,24)
తతస్తే హృష్టమనసః పాండవేయా మహారథాః ।
కుంతీ చ పరమప్రీతా బభూవ జనమేజయ ॥ 25
శ్రుత్వా తు పుండరీకాక్షః సంప్రాప్తం స్వం పురోత్తమామ్ ।
అర్జునం పాండవశ్రేష్ఠమ్ ఇంద్రప్రస్థగతం తదా ॥ 26
ఆజగామ విశుద్ధాత్మా సహ రామేణ కేశవః ।
వృష్ణ్యంధకమహామాత్రైః సహ వీరైర్మహారథైః ॥ 27
జనమేజయా! మహారథులు పాండవులు, కుంతి మిక్కిలి ఆనందించారు. పాండవశ్రేష్ఠుడు అర్జునుడు ఇంద్రప్రస్థనగరానికి చేరాడని పుండరీకాక్షుడు విన్నాడు. శ్రీకృష్ణుడు విశుద్ధాత్ముడై బలరామ, వృష్ణి, అంధక వంశప్రధానులైన మహారథులతో కలిసి అక్కడికి చేరాడు. (25-27)
భ్రాతృభిశ్చ కుమారైశ్చ యోధైశ్చ బహుభిర్వృతః ।
సైన్యేన మహతా శౌరిః అభిగుప్తః పరంతపః ॥ 28
శత్రుతాపనుడు, శూరుడైన శ్రీకృష్ణుడు సోదరులతో, పుత్రులతో, యోధులతో, గొప్పసైన్యంతో ఇంద్రప్రస్థనగరానికి వచ్చాడు. (28)
తత్ర దానపతిర్ధీమాన్ ఆజగామ మహాయశాః ।
అక్రూరో వృష్ణివీరాణాం సేనాపతిరరిందమః ॥ 29
అక్కడకు యాదవ వీరుల సేనాపతి, శత్రుపీడకుడు, గొప్ప కీర్తి గల దానపతి అక్రూరుడు కుడ వచ్చాడు. (29)
అనాధృష్టిర్మహాతేజాః ఉద్ధవశ్చ మహాయశాః ।
సాక్షాద్ బృహస్పతేః శిష్యః మహాబుద్ధిర్మహామనాః ॥ 30
తేజస్వి, కీర్తిమంతుడు, బుద్ధిమంతుడు, మనస్వి, బృహస్పతి శిష్యుడు అయిన ఉద్ధవుడు, తేజోవంతుడైన అనాధృష్టి అక్కడకు వచ్చారు. (30)
సత్యకః సాత్యకిశ్చైవ కృతవర్మా చ సాత్వతః ।
ప్రద్యుమ్నశ్చైవ సాంబశ్చ నిశఠః శంకురేవ చ ॥ 31
చారుదేష్ణశ్చ విక్రాంతః ఝిల్లీ విపృథురేవ చ 7.
సారణశ్చ మహాబాహుః గదశ్చ విదుషాం వరః ॥ 32
ఏతే చాన్యే చ బహవః వృష్ణిభోజాంధకాస్తథా ।
ఆజగ్ముః ఖాండవప్రస్థమ్ ఆదాయ హరణం బహు ॥ 33
సత్యకుడు, సాత్యకి, సాత్వతీయుడు కృతవర్మ, ప్రద్యుమ్నుడు, సాంబుడు, నిశఠుడు, శంకువు, చారుదేష్ణుడు, ఝిల్లి, విపృథువు, సారణుడు, విద్వాంసుడు గదుడు, ఇతరులైన యాదవులందరు ఖాండవప్రస్థానికి అరణం తీసుకొని ఎంతో వేడుకగా వచ్చారు. (31-33)
తతో యుధిష్ఠిరో రాజా శ్రుత్వా మాధవమాగతమ్ ।
ప్రతి గ్రహార్థం కృష్ణస్య యమౌ ప్రస్థాపయత్ తదా ॥ 34
మహారాజు యుధిష్ఠిరుడు మాధవుని రాక విని ఆదరపూర్వకంగా తీసుకొని రావటానికి నకుల సహదేవులను పంపాడు. (34)
తాభ్యాం ప్రతిగృహీతం తు వృష్ణిచక్రం మహర్థిమత్ ।
వివేశ ఖాండవప్రస్థం పతాకాధ్వజశోభితమ్ ॥ 35
నకుల సహదేవులతో స్వాగతపూర్వకంగా ఆహ్వానింపబడిన యాదవగణం పతాక, ద్వజాలతో అలంకరింపబడిన ఖాండవప్రస్థంలో ప్రవేశించింది. (35)
సమ్మృష్టసిక్తపంథానం పుష్పప్రకరశోభితమ్ ।
చందనస్య రసైః శీతైః పుణ్యగంధైర్నిషేవితమ్ ॥ 36
ఇంద్రప్రస్థంలోని మార్గాలు శుభ్రంచేయబడి నీటితో కళ్ళాపి చల్లబడ్డాయి. పూలు చల్లబడ్డాయి. వ్రేలాడదీయబడ్డాయి. చల్లని చందన, సుగంధద్రవ్యాలతో పరిమళభరితాలు అయ్యాయి. (36)
దహ్యతాగురుణా చైవ దేశే దేశే సుగంధినా ।
హృష్టపుష్టజనాకీర్ణం వణిగ్భిరుపశోభితమ్ ॥ 37
ప్రతిప్రదేశంలో అగరుగంధాలు వ్యాపించాయి. నగరమంతా ఆనందభరితులైన జనులతో నిండిపోయింది. వ్యాపారులు ఆ నగరశోభలను పెంచారు. (37)
ప్రతిపేదే మహాబాహుః సహ రామేణ కేశవః ।
వృష్ణ్యంధకైస్తథా భోజైః సమేతః పురుషోత్తమః ॥ 38
కేశవుడు బలరామునితో వృష్ణి, అంధక, భోజ, యాదవ వీరులతో కలిసి ఆ నగరిలోకి ప్రవేశించాడు. (38)
సంపూజ్యమానః పౌరైశ్చ బ్రాహ్మణైశ్చ సహస్రశః ।
వివేశ భవనం రాజ్ఞః పురందరగృహోపమమ్ ॥ 39
పురవాసులచే, బ్రాహ్మణులచే గౌరవింపబడిన శ్రీకృష్ణుడు ఇంద్రభవనసౌందర్యం గల ధర్మజుని భవనంలో ప్రవేశించాడు. (39)
యుధిష్ఠిరస్తు రామేణ సమాగచ్ఛద్ యథావిధి ।
మూర్థ్ని కేశవమాఘ్రాయ బాహుభ్యాం పరిషస్వజే ॥ 40
యుధిష్ఠిరుడు బలరామునితో యథావిధిగా కలిసి, శిరస్సుపై శ్రీకృష్ణుని చుంబించి కౌగిలించుకున్నాడు. (40)
తం ప్రీయమాణో గోవిందః వినయేనాభిపూజయన్ ।
భీమం చ పురుషవ్యాఘ్రం విధివత్ ప్రత్యపూజయత్ ॥ 41
శ్రీకృష్ణుడు ప్రసన్నుడై వినయభావంతో యుధిష్ఠిరుని సమ్మానించాడు. నరశ్రేష్ఠుడైన భీమునికూడ విధిప్రకారం సమ్మానించాడు. (41)
తాంశ్చ వృష్ణ్యంధకశ్రేష్ఠాన్ కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
ప్రతిజగ్రాహ సత్కారైః యథావిధి యథాగతమ్ ॥ 42
వృష్ణి, అంధక యదువీరు లందరికి కుంతీనందనుడు ధర్మరాజు యథాయోగ్యంగా, యథావిధిగా స్వాగతసత్కారాలు కల్పించాడు. (42)
గురువత్ పూజయామాస కాంశ్చిద్ కాంశ్చిద్ వయస్యవత్ ।
కాంశ్చిదభ్యవదత్ ప్రేమ్ణా కైశ్చిదప్యభివాదితః ॥43
కొందరిని గురువును వలె పూజించాడు. కొందరిని స్నేహితునివలె కౌగిలించుకొన్నాడు. కొందరిని ప్రేమతో పలుకరించాడు. కొందరు ధర్మజునికి నమస్కరించారు. (43)
తేషాం దదౌ హృషీకేశః జన్యార్థే ధనముత్తమమ్ ।
హరణం వై సుభద్రాయాః జ్ఞాతిదేయం మహాయశాః ॥ 44
యశస్వి శ్రీకృష్ణుడు పాండవులకు వధూధనాన్ని అర్పించాడు. కుటుంబీకులకు సుభద్రకారణంగా ఈయతగిన అరణాన్ని అంతటినీ సమర్పించాడు. (44)
రథానాం కాంచనాంగానాం కింకిణీజాలమాలినమ్ ।
చతుర్యుజాముపేతానామ్ సూతైః కుశలశిక్షితైః ॥ 45
సహస్రం ప్రదదౌ కృష్ణః గవామయుతమేవ చ ।
శ్రీమాన్ మాధురదేశ్యానాం దోగ్ర్ఖీణాం పుణ్యవర్చసామ్ ॥ 46
శ్రీ కృష్ణుడు చిరుమువ్వలు, జాలరులతో అలంకరింపబడిన, నాల్గేసి గుఱ్ఱాల్ని పూన్చిన వేయి రథాలను నేర్పరులైన సారథులతో సహా అప్పగించాడు. మాధురదేశ్యసంభవాలైన పదివేల గోవులను కానుకగా ఇచ్చాడు. (45,46)
బడవానాం చ శుద్ధానాం చంద్రాంశుసమవర్చసామ్ ।
దదౌ జనార్దనః ప్రీత్యా సహస్రం హేమభూషితమ్ ॥ 47
చంద్రకాంతితో వెలిగే, మంచి లక్షణాలు గల, బంగారు ఆభరణాలతో కూడిన వేయి గుఱ్ఱాలను ప్రేమతో జనార్దనుడు పాండవులకు ఇచ్చాడు. (47)
తథైవాశ్వతరీణాం చ దాంతానాం వాతరంహసామ్ ।
శతాన్యంజనకేశీనామ్ శ్వేతానాం పంచ పంచ చ ॥ 48
గాలితో సమానవేగం కల, అదుపులో ఉండే వంద కంచర గాడిదలను, ఐదువందల కాటుకరంగు గుఱ్ఱాలను, ఐదువందల తెల్లగుఱ్ఱాలను కానుకగా అప్పగించాడు. (48)
స్నానపానోత్సవే చైవ ప్రయుక్తం వయసాన్వితమ్ ।
స్త్రీణాం సహస్రం గౌరీణాం సువేషాణాం సువర్చసామ్ ॥ 49
సువర్ణశతకంఠీనామ్ అరోమాణాం స్వలంకృతామ్ ।
పరిచర్యాసు దక్షాణాం ప్రదదౌ పుష్కరేక్షణః ॥ 50
స్నాన, పానోత్సవాలలో ఉపయోగపడే పడుచులు, సుందర వేషధారిణులు, మంచి కాంతి గల వంద వంద బంగారు ఆభరణాలు దాల్చి, రోమాలు కనపడని వేయిమంది దాసీజనాన్ని పుండరీకాక్షుడు కృష్ణుడు కానుకగా ఇచ్చాడు. (49,50)
పృష్ఠ్యానామపి చాశ్వానాం బాహ్లికానాం జనార్దనః ।
దదౌ శతసహస్రాఖ్యం కన్యాధనమనుత్తమమ్ ॥ 51
జనార్దనుడు శ్రీకృష్ణుడు బరువుమోయగల లక్ష బాహ్లీకదేశపు అశ్వాలను సాటిలేని కన్యాధనంగా అర్పించాడు. (51)
క్లృతాకృతస్య ముఖ్యస్య కనకస్యాగ్నివర్చసః ।
మనుష్యభారాన్ దాశార్హః దదౌ దశ జనార్దనః ॥ 52
జనార్దనుడు అగ్ని వర్చస్సుగల మొహరీలను, పదిమంది మనుష్యుల బరువున్న విశుద్ధమైన బంగారాన్ని ఇచ్చాడు. (52)
గజానాం తు ప్రభిన్నానాం త్రిధా ప్రసవతాం మదమ్ ।
గిరికూటనికాశానాం సమరేష్వనివర్తినామ్ ॥ 53
క్లప్తానాం పటుఘంటానాం చారూణాం హేమమాలినామ్ ।
హస్త్యారోహైరుపేతానాం సహస్రం సాహసప్రియః ॥ 54
రామః పాణిగ్రహణికం దదౌ పార్థాయ లాంగలీ ।
ప్రీయమాణో హలధరః సంబంధః ప్రతిమానయన్ ॥ 55
సాహసప్రియుడు, హలధరుడైన బలరాముడు ప్రసన్నుడై నూతన బంధుత్వాన్ని పురస్కరించుకొని పెండ్లికానుకగా మదించిన వేయి ఏనుగులను ఇచ్చాడు. అవి మూడు అవయవాల నుంచి మదస్రావం కలవి. పర్వత శిఖరాల వలె ఉన్నతాలు. యుద్ధంలో వెనుకకు తిరగనివి. వాటి పార్శ్వాములందు ఘంటలు వ్రేలాడదీయబడ్డాయి. మెడలో బంగారు హారాలు ఉన్నాయి. వాటన్నింటిపైన మావటివాండ్రు ఉన్నారు. (53-55)
స మహాధనరత్నౌఘః వస్త్రకంబలఫేనవాన్ ।
మహాగజమహాగ్రాహః పతాకాశైవలాకులః ॥ 56
పాండుసాగరమావిద్ధః ప్రవివేశ మహాధనః ।
పూర్ణమాపూరయంస్తేషాం ద్విషచ్ఛోకావహోఽభవత్ ॥ 57
నదులన్నీ సాగరంలో కలిసినట్లు ఆ గొప్ప గొప్ప ధనరాసులచే ప్రవాహాలు, వస్త్రకంబళమనే నురుగుముద్దలు, గొప్పగజములనబడే మొసళ్లు, జెండాలనే నాచు సమూహాలు పాండవమహాసాగరాన చేరాయి. ఇదివరకే సమృద్ధమైన పాండవసాగరం వీటికలయికతో పూర్ణతరమై ప్రకాశిస్తూ శత్రుశోకానికి కారణం అయింది. (56,57)
ప్రతిజగ్రాహ తత్ సర్వం ధర్మరాజో యుధిష్ఠిరః ।
పుజయామాస తాంశ్చైవ వృష్ణ్యంధకమహారథాన్ ॥ 58
యుధిష్ఠిరుడు ధర్మరాజు ఆ ధనమంతా స్వీకరించి యాదవశ్రేష్ఠులను ఆదరసత్కారాలతో పూజించాడు. (58)
తే సమేతా మహాత్మానః కురువృష్ణ్యంధకోత్తమాః ।
విజహ్రురమరావాసే నరాః సుకృతినో యథా ॥ 59
ఇంద్రుని నగరాన పుణ్యాత్ములు చేరినట్లు యాదవ వీరులందరూ పాండవులతో కలిసి విహరించారు. (59)
తత్ర తత్ర మహానాదైః ఉత్కృష్టతలనాదితైః ।
యథాయోగం యథాప్రీతి విజహ్రుః కురువృష్ణయః ॥ 60
కురువంశీయులు, వృష్ణివంశీయులు అక్కడక్క్డ గొప్పగానాలతో వాద్యాలతో సమయానుకూలంగా, ఆనందంతో కలిసి విహరించారు. (60)
ఏవముత్తమవీర్యాస్తే విహృత్య దివసాన్ బహూన్ ।
పూజితాః కురుభిర్జగ్ముః పునర్ద్వారవతీం ప్రతి ॥ 61
పరాక్రమవంతులైన యదువీరులు కురువంశీయులతో కలిసి చాలారోజులు గడిపి సమ్మానితులై ద్వారకకు చేరారు. (61)
రామం పురస్కృత్య యుయుః వృష్ణ్యంధకమహారథాః ।
రత్నాన్యాదాయ శుభ్రాణి దత్తాని కురుసత్తమైః ॥ 62
వృష్ణి, అంధకవీరులందరు కురుశ్రేష్ఠులిచ్చిన ఉత్తమ రత్నాలు గ్రహించి బలరాముని తోడ్కొని ద్వారకవైపు ప్రయాణం సాగించారు. (62)
వాసుదేవస్తు పార్థేన తత్రైవ సహ భారత ।
ఉవాస నగరే రమ్యే శక్రప్రస్థే మహాత్మనా ॥ 63
శ్రీకృష్ణుడు మాత్రం మహాత్ముడైన అర్జునునితో కలిసి ఆ నగరమందే కొంతకాలం వసించాడు. (63)
వ్యచరద్ యమునాతీరే మృగయాం స మహాయశాః ।
మృగాన్ విధ్యన్ వరాహాంశ్చ రేమే సార్ధం కిరీటినా ॥ 64
యశస్వి శ్రీకృష్ణుడు అర్జునునితో వేటకు వెళ్ళి యమునాతీరాన మృగాలను, అడవిపందులను వధిస్తూ ఆనందించాడు. (64)
తతః సుభద్రా సౌభద్రం కేశవస్య ప్రియా స్వసా ।
జయంతమివ పౌలోమీ ఖ్యాతిమంతమజీజనత్ ॥ 65
కొంతకాలానికి శ్రీకృష్ణుని ప్రియసోదరి సుభద్ర సౌభద్రుని కన్నది. ఈ సంఘటన శచీదేవి జయంతుని కన్న తీరును తలపించింది. (65)
దీర్ఘబాహుం మహోరస్కం వృషభాక్షమరిందమమ్ ।
సుభద్రా సుషువే వీరమ్ అభిమన్యుం నరర్షభమ్ ॥ 66
సుభద్రాదేవి వీరవరుడు, దీర్ఘభుజసహితుడు, విశాలవక్షఃస్థలం గలవాడు వృషభనేత్రుడు, శత్రుమర్దనుడు అయిన అభిమన్యుని ప్రసవించింది. (66)
అభిశ్చ మన్యుమాంశ్చైవ తతస్తమరిమర్దనమ్ ।
అభిమన్యుమితి ప్రాహుః ఆర్జునిం పురుషర్షభమ్ ॥ 67
నిర్భయంగా క్రోధంతో యుద్ధంచేసేవాడు కనుక అభిమన్యుని పేరు సార్థకమైందే అని నిర్దేశింపబడింది. (67)
స సాత్వత్యామతిరథః సంబభూవ ధనంజయాత్ ।
మఖే నిర్మథనేనేవ శమీగర్భాద్ధుతాశనః ॥ 68
యజ్ఞంలో మథిస్తే శమీగర్భాన తేజోవంతమైన అగ్ని ఏర్పడినట్లు అర్జునుని వలన సుభద్ర యందు తేజోవంతుడు పుట్టాడు. అతడు పరాక్రమంలో అతిరథుడు. (68)
యస్మిన్ జాతే మహాతేజాః కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
అయుతం గా ద్విజాతిభ్యః ప్రాదాన్నిష్కాంశ్చ భారత ॥ 69
అతడు పుట్టినవెంటనే కుంతీనందనుడు యుధిష్ఠిరుడు బ్రాహ్మణులకు పదివేలగోవుల్ని, బంగారు నాణాలను దానం చేశాడు. (69)
దయితో వాసుదేవస్య బాల్యాత్ ప్రభృతి చాభవత్ ।
పితౄణామివ సర్వేషాం ప్రజానామివ చంద్రమాః ॥ 70
ప్రజలకు చంద్రుడు ప్రియమైనట్లు బాల్యం నుమ్చి అభిమన్యుడు తన తండ్రులకు వలె శ్రీకృష్ణునికి ప్రీతిపాత్రుడైనాడు. (70)
జన్మప్రభృతి కృష్ణశ్చ చక్రే తస్య క్రియాః శుభాః ।
స చాపి వవృధే బాలః శుక్లపక్షే యథా శశీ ॥ 71
పుట్టినది మొదలు శ్రీకృష్ణుడు జాతకర్మాదిక్రియల్ని అభిమన్యునికి స్వయంగా చేయించాడు. అతడు శుక్లపక్షచంద్రునివలె దినదిన ప్రవర్ధమానుడు అయ్యాడు. (71)
చతుష్పాదం దశవిధం ధనుర్వేదమరిందమాః ।
అర్జునాద్ వేద వేదజ్ఞః సకలం దివ్యమానుషమ్ ॥ 72
శత్రునాశకుడు, వేదవేత్త అయిన అభిమన్యుడు దివ్యమానుషమైన ధనుర్వేదాన్ని అంతటిని నాలుగుభాగాలుగా, పది అంగాలుగా అర్జునునివద్ద అభ్యసించి నేర్చుకొన్నాడు. (72)
విజ్ఞానేష్వసి చాస్త్రాణాం సౌష్ఠవే చ మహాబలః ।
క్రియాస్వపి చ సర్వాసు విశేషానభ్యశిక్ష్యయత్ ॥ 73
మహాబలవంతుడు అర్జునుడు అస్త్రవిజ్ఞానంలో, ప్రయోగపాటవంలో, సంపూర్ణయుద్ధక్రియలలో అభిమన్యునికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాడు. (73)
ఆగమే చ ప్రయోగే చ చక్రే తుల్యమివాత్మనా ।
తుతోష పుత్రం సౌభద్రం ప్రేక్షమాణో ధనంజయః ॥ 74
ధనంజయుడు ఆగమప్రయోగవిషయాల్లో తనపుత్రుని తనతో సమంగా చేశాడు. అతడు తన కుమారుని అభ్యాసాన్ని చూచి మిక్కిలి సంతోషించాడు. (74)
సర్వసంహాననోపేతం సర్వలక్షణలక్షితమ్ ।
దుర్దర్షమృషభస్కంధం వ్యాత్తాననమివోరగమ్ ॥ 75
అభిమన్యుని స్కంధాలు వృషభం వలె గెలువ శక్యం కావు. సద్గుణాలలో, ఉత్తమలక్షణాల్లో ఇతరులను మించినవాడు, నోరుతెరిచిన సర్పం వలె భయంకరుడై గోచరుస్తున్నాడు. (75)
సింహదర్పం మహేష్వాసం మత్తమాతంగవిక్రమమ్ ।
మేఘదుంధుభినిర్ఘోషం పూర్ణచంద్రనిభాననమ్ ॥ 76
సింహతుల్యగర్వం, మదించిన ఏనుగు పరాక్రమం, మేఘదుందుభి సమానకంఠస్వరం, పూర్ణచంద్ర సదృశముఖ శోభలతో గొప్ప ధానుష్కుడై ప్రకాశించాడు. (76)
కృష్ణస్య సదృశం శౌర్యే వీర్యే రూపే తథాఽఽకృతౌ ।
దదర్శ పుత్రం బీభత్సుః మఘవానివ తం యథా ॥ 77
రూపం, శౌర్యం, వీర్యం, ఆకృతుల్లో అన్నివిధాలా శ్రీకృష్ణునితో సమానుడై భాసించడు. ఇంద్రుడు తనను చూచి ప్రసన్నుడైనట్లు అర్జునుడు అభిమన్యుని చుచి ప్రసన్నత పొందాడు. (77)
పాంచాల్యపి తు పంచభ్యః పతిభ్యః శుభలక్షణా ।
లేభే పమ్చ సుతాన్ వీరాన్ శ్రేష్ఠాన్ పంచాచలానివ ॥ 78
శుభలక్షనవతి అయిన పాంచాలి తన ఐదుగురు భర్తల నుండి వీరులు , శ్రేష్ఠులు, అయిన ఐదుగురు పుత్రులను పొందింది. వారు విరులు, పర్వతాలవలె ఆచంచలులు. (78)
యుధిష్టిరాత్ ప్రతివింధ్యం సుతసోమం వృకోదరాత్ ।
అర్జునాచ్ఛ్రుతకర్మాణమ్ శతానీకం చ నాకులిమ్ ॥ 79
సహదేవాచ్ఛ్రుతసేనమేతాన్ పంచ మహారథాన్ ।
పాంచాలీ సుషువే వీరాన్ ఆదిత్యానదితిర్యథా ॥ 80
ధర్మరాజు వలన ప్రతివింధ్యుని, వృకోదరుని వలన సుతసోముని, అర్జునుని వలన శ్రుతకర్మను, నకులుని వలన శతానీకుని, సహదేవుని వలన శ్రుతసేనుని ప్రసవించింది. వారందరు మహారథులు. అదితి ఆదిత్యులను ప్రసవించినట్లు ద్రౌపది వారిని కన్నది. (79,80)
శాస్త్రానుసారం బ్రాహ్మణులు ప్రతివింధ్యుడని నిర్దేశించి యుదిష్ఠిరునితో అన్నారు. 'ప్రహారజనితవేదన సహించటంలో వింధ్యపర్వతంతో సమానుడు కనుక ప్రతివింధ్యుడు అగుగాక!' (81)
సుతే సోమ సహస్రే తు సోమార్కసమతేజసమ్ ।
సుతసోమం మహేష్వాసం సుషువే భీమసేనతః ॥ 82
భీమసేనుడు వేయి సోమయాగాలు ఆచరిమ్చిన పిదప చంద్రసూర్యుల తేజస్సు గల పుత్రుడు జనించుటచే అతనికి సుతసోముడు అన్నపేరు నిర్ణయించారు. అతడు గొప్ప ధానుష్కుడై వెలిగిపోసాగాడు. (82)
శ్రుతమ్ కర్మ మహత్ కృత్వా నివృత్తేన కిరీటినా ।
జాతః పుత్రస్తథేత్యేవం శ్రుతకర్మా తతోఽభవత్ ॥ 83
ఇంద్రకిరీటం దాల్చిన అర్జునుడు ప్రసిద్ధకర్మలను ఆచరించిన పిదప పుట్టుటచే శ్రుతకర్మ అన్నపేరు ఆ పుత్రునికి ఏర్పడింది. (83)
శతానీకస్య రాజర్షేః కౌరవ్యస్య మహాత్మనః ।
చక్రే పుత్రం సనామానం నకులః కీర్తివర్ధనం ॥ 84
కౌరవవంశజుడు, రాజర్షి అయిన శతానీకుని పేరు నకులుడు తనకీర్తిని పెంచే కుమారునికి పెట్టాడు. (84)
తతస్త్వజీజనత్ కృష్ణా నక్షత్రే వహ్నిదైవతే ।
సహదేవాత్ సుతం తస్మాచ్ఛ్రుతసేనేతి యం విదుః ॥ 85
అగ్నిదేవత ప్రధానంగా గల కృత్తికానక్షత్రాన ద్రౌపది అయిదవ పుత్రుని కనుటచే శ్రుతసేనుడు అని నామకరణమ్ చేశారు. అగ్నికి మరొకపేరు శ్రుతసేనుడు. (85)
ఏకవర్షాంతరాస్త్వేతే ద్రౌపదేయా యశస్వినః ।
అన్వజాయంత రాజేంద్ర పరస్పరహితైషిణః ॥ 86
రాజా! కీర్తిమంతులైన ఈ అయిదుగురు ద్రౌపదీపుత్రులు ఒక్కొక్క సంవత్సరం వ్యవధిలో పుట్టారు. వీరందరు పరస్పరం ఒకరిహితం ఒకరు కోరుకొనేవారు. (86)
జాతకర్మాణ్యానుపూర్వ్యాత్ చూడోపనయనాని చ ।
చకార విధివత్ ధౌమ్యస్తేషాం భరతసత్తమ ॥ 87
పురోహితుడైన ధౌమ్యుడు వారందరికి శాస్త్రప్రకారం జాతకర్మ, చూడ, ఉపనయనాది సంస్కారాలను క్రమంగా చేయించాడు. (87)
వేదాధ్యయనం పూర్తిచేసి, వారు పరిపూర్ణంగా బ్రహ్మచర్యవ్రతాన్ని పాటించి అర్జునుని వలన దివ్యమానుషాలయిన శస్త్రాస్త్రాలన్నింటిని, ధనుర్వేదాన్ని గ్రహించారు. (88)
దివ్యగర్భోపమైః పుత్రైః వ్యూఢోరస్కైర్మహారథైః ।
అన్వితో రాజశార్దూల పాండవా ముదపాప్నువన్ ॥ 89
రాజా! దేవతల పుత్రులతో సమానులైన మహారథులు, విశాల వక్షం గల ఆ పుత్రులను పొంది పాండవులు అయిదుగురు మిక్కిలి ప్రసన్నత పొందారు. (89)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి హరణాహరణపర్వణి వింశత్యధికశతతమోఽధ్యాయః ॥ 220 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున హరణాహరణపర్వమను
ఉపపర్వమున రెండువందల ఇరువదియవ అధ్యాయము. (220)
(దాక్షిణాత్య అధికపాఠము 1 1/2 శ్లోకములు కలిపి మొత్తం 90 1/2 శ్లోకాలి)