217. రెండువందల పదునేడవ అధ్యాయము
ప్రభాసతీర్థమున కృష్ణార్జునుల కలయిక, ద్వారకానగరాగమనము.
వైశంపాయన ఉవాచ
సోఽపరాంతేషు తీర్థాని పుణ్యాన్యాయతనాని చ ।
సర్వాణ్యేవానుపూర్వ్యేణ జగామామితవిక్రమః ॥ 1
వైశంపాయనుడు చెపుతున్నాడు.
జనమేజయా! పిమ్మట పరాక్రమవంతుడైన అర్జునుడు క్రమంగా పశ్చిమసముద్రతీరంలో ఉన్న పుణ్యతీర్థాలకు, మందిరాలకు వెళ్ళాడు. (1)
సముద్రే పశ్చిమే యాని తీర్థాన్యాయతనాని చ ।
తాని సర్వాణి గత్వా స ప్రాభాసముపజగ్మివాన్ ॥ 2
పశ్చిమసముద్రతీరాన ఉన్న అన్ని తీర్థాలను, మందిరాలను చూసి అర్జునుడు ప్రభాస తీర్థానికి చేరాడు. (2)
ప్రభాసదేశం సంప్రాప్తం బీభత్సుమపరాజితమ్ ।
సుపుణ్యం రమణీయం చ శుశ్రావ మధుసూదనః ॥ 3
తతోఽభ్యగచ్ఛత్ కౌంతేయం సఖాయం తత్ర మాధవః ।
దదృశాతే తదాన్యోన్యం ప్రభాసే కృష్ణ పాండవౌ ॥ 4
శ్రీకృష్ణుడు చారుల ద్వారా "ఎదురులేని అర్జునుడు ప్రభాసతీర్థానికి చేరాడు" అని విని అతనిని కలియటానికి వెళ్ళాడు. కృష్ణార్జునులిరువురు ప్రభాసతీర్థాన ఒకరిని ఒకరు సందర్శించారు. (3,4)
తావన్యోన్యం సమాశ్లిష్య పృష్ట్వా చ కుశలం వనే ।
ఆస్తాం ప్రియసఖాయౌ తౌ నరనారాయణావృషీ ॥ 5
ప్రియసఖులైన ఆ నరనారాయణులు ఇరువురు ఒకరినొకరు గాఢంగా కౌగిలించుకొని, క్షేమాలు పరస్పరం తెలిసికొని ఒకచోట ఆసీనులయ్యారు. (5)
తతోఽర్జునమ్ వాసుదేవః తాం చర్యాం పర్యపృచ్ఛత ।
కిమర్థం పాండవైతాని తీర్థాన్యనుచరస్యుత ॥ 6
ఆ తరువాత శ్రీ కృష్ణుడు "అర్జునా! ఈ తీర్థయాత్రనెందుకు చేస్తున్నావు" అని అర్జునునితో తీర్థయాత్ర ప్రస్తావన చేశాడు. (6)
తతోఽర్జునో యథావృత్తం సర్వమాఖ్యాతవాంస్తదా ।
శ్రుత్వోవాచ చ వార్ష్ణేయః ఏవమేతదితి ప్రభుః ॥ 7
ఆ ప్రశ్నను విని అర్జునుడు జరిగిన వృత్తాంతమును శ్రీకృష్ణునికి తెలిపాడు. విన్న శ్రీకృష్ణుడు "ఓహో అదా విషయం" అని పలికి అబినందించాడు. (7)
తౌ విహృత్య యథాకామం ప్రభాసే కృష్ణపాండవౌ ।
మహీధరం రైవతకం వాసాయైవాభిజగ్మతుః ॥ 8
శ్రీకృష్ణార్జును లిరువురు స్వేచ్ఛగా ప్రభాసతీర్థంలో విహరించి రాత్రివేళకు రైవతకపర్వతానికి చేరారు. (8)
పూర్వమేవ తు కృష్ణస్య వచనాత్ తం మహీధరమ్ ।
పురుషా మండయాంచక్రుః ఉపజహ్రుశ్చ భోజనమ్ ॥ 9
శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం ఆయన సేవకులు ముందుగా అక్కడకు చేరి ఆ ప్రదేశం అలంకరించి, భోజనాదులను తయారుచేసి ఉంచారు. (9)
ప్రతిగృహ్యార్జునః సర్వమ్ ఉపభుజ్య చ పాండవః ।
సహైవ వాసుదేవేన దృష్టవాన్ నటనర్తకాన్ ॥ 10
అభ్యనుజ్ఞాయ తాన్ సర్వాన్ అర్చయిత్వా చ పాండవః ।
సత్కృతం శయనం దివ్యమ్ అభ్యగచ్ఛన్మహామతిః ॥ 11
అర్జునుడు శ్రీకృష్ణునితో కలిసి సిద్ధం కావించిన భోజనాలను తన ఇష్టానుసారం భుజించి నటనర్తకుల నృత్యాలను చూశాడు. పిమ్మట వారినందరినీ కానుకలతో సత్కరించి పంపించి తెలివైన అర్జునుడు పాన్పుపై నిద్రించాడు. (10,11)
తతస్తత్ర మహాబాహుః శయానః శయనే శుభే ।
తీర్థానాం పల్వలానాం చ పర్వతానాం చ దర్శనమ్ ।
ఆపగానాం వనానాం చ కథయామాస సాత్వతే ॥ 12
అందమైన పాన్పుపై పడుకొని మహాబాహువైన అర్జునుడు శ్రీకృష్ణునికి తాను చూచిన తీర్థాలు, కుండాలు, పర్వతాలు, నదులు, వనాల విశేషాలను వివరించాడు. (12)
ఏవం స కథయన్నేవ నిద్రయా జనమేజయ ।
కౌంతేఽయోఽపి హృతస్తస్మిన్ శయనే స్వర్గసంనిభే ॥ 13
జనమేజయా! అర్జునుడు ఆ విశేషాలను వినిపిస్తూనే స్వర్గతుల్యమైన ఆ పాన్పుమీద నిద్రలోకి జారాడు. (13)
మధురేణైవ గీతేన వీణాశబ్దేన చైవ హ ।
ప్రబోధ్యమానో బుబుధే స్తుతిభిర్మంగళైస్తథా ॥ 14
ప్రాతఃకాలాన మధురగీతాలు, మంగళవాద్యాలు, స్తోత్రపాఠాలు విని అర్జునుడు నిద్రలేచాడు. (14)
స కృత్వావశ్యకార్యాణి వార్ష్ణేయేనాభినందితః ।
రథేన కాంచనాంగేన ద్వారకామభిజగ్మివాన్ ॥ 15
అతడు కాలకృత్యాల నాచరించి శ్రీకృష్ణుని అభినందనలతో బంగారురథంపై ద్వారకకు బయలుదేరాడు. (15)
అలంకృతా ద్వారకా తు బభువ జనమేజయ ।
కుంతీపుత్రస్య పుజార్థమ్ అపి నిఘ్కటకేష్వపి ॥ 16
జనమేజయా! కుంతీకుమారుని స్వాగతానికి ద్వారకానగరం అంతా తోటలతో సహా అలంకరింపబడింది. (16)
దిదృక్షంతశ్చ కౌంతేయమ్ ద్వారకావాసినో జనాః ।
నరేంద్రమార్గమాజగ్ముః తూర్ణం శతసహస్రకః ॥ 17
కౌంతేయుని చూడటానికి ద్వారకావాసులు అందరు లక్షలకొలది ప్రధానమార్గాల్లొ (రాజవీథుల్లో) చేరారు. (17)
అవలోకేషు నారీణాం సహస్రాణి శతాని చ ।
భోజవృష్ణ్యంధకానాం చ సమవాయో మహానభూత్ ॥ 18
అర్జునుని దర్శనం వీలైనచోట వేలకొలది స్త్రీలు నిలిచియున్నారు. భోజ, వృష్ణి, అంధకవంశ పురుషుల గుంపులు ఒకచోటికి చేరాయి. (18)
స తథా సత్కృతః సర్వైః భోజవృష్ణ్యంధకాత్మజైః ।
అభివాద్యాభివాద్యాంశ్చ సర్వైశ్చ ప్రతినందితః ॥ 19
వృష్ణి, భోజ, అంధకవంశపురుషుల ఆదరసత్కారాలను పొందిన అర్జునుడు పెద్దవారికి నమస్కరించాడు. వారందరు అర్జునునికి స్వాగతవచనాలు పలికారు. (19)
కుమారైః సర్వశో వీరః సత్కారేణాభిచోదితః ।
సమానవయసః సర్వాన్ ఆశ్లిష్య స పునః పునః ॥ 20
యదువీరులందరు అర్జునుని ఎంతో ఆదరించారు. అర్జునుడు సమవయస్కులు అయిన వారిని కౌగిలించుకొని మరీ మరీ ఆనందించాడు. (20)
కృష్ణస్య భవనే రమ్యే రత్నభోజ్యసమావృతే ।
ఉవాస సహ కృష్ణేన బహులాస్తత్ర శర్వరీః ॥ 21
నవరత్నాలు, వివిధ భోజ్యపదార్థాలు అందుబాటులో గల శ్రీకృష్ణుని మందిరాన అర్జునుడు చాలా రాత్రులు శ్రీకృష్ణునితో కూడి నివసించాడు. (21)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి అర్జునవనవాస పర్వణి అర్జునద్వారకాగమనే సప్తదశాధికద్విశతతమోఽధ్యాయః ॥ 217 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున అర్జునవనవాస పర్వమను
ఉపపర్వమున అర్జునద్వారకాగమనము అను రెండువందల పదనేడవ అధ్యాయము. (217)