212. రెండువందల పన్నెండవ అధ్యాయము

(అర్జున వనవాసపర్వము)

అర్జునుడు నియమభంగమొనర్చుట.

వైశంపాయన ఉవాచ
ఏవం తే సమయం కృత్వా న్యవసంస్తత్ర పాండవాః ।
వశే శస్త్రప్రపాతేన కుర్వంతోఽన్యాన్ మహీక్షితః ॥ 1
వైశంపాయనుడు చెప్పాడు-జనమేజయా! ఈ నియమాన్ని అనుసరించి పాండవులక్కడ నివసించారు. వారు తమ శస్త్రాస్త్రాలతో మిగిలిన రాజులందరినీ తమ వశంలో ఉంచుకొన్నారు. (1)
తేషాం మనుజసింహానాం పంచానామమితౌజసామ్ ।
బభూవ కృష్ణా సర్వేషాం పార్థానాం వశవర్తినీ ॥ 2
మనుజశ్రేష్ఠులు, అమితతేజస్వులు అయిన వారి ఆజ్ఞకు అధీనమై ఎల్లప్పుడూ ద్రౌపది సంచరించసాగింది. (2)
తే తయా తైశ్చ సా వీరైః పతిభిః సహ పంచభిః ।
బభూవ పరమప్రీతా నాగై ర్భోగవతీ యథా ॥ 3
నాగుల నివాసంచే భోగవతి ప్రకాశించినట్లు పాండవులు ద్రౌపది విషయంలో, ప్రీతి పొంది ఉన్నారు. ద్రౌపది పాండవుల విషయంలో ప్రసన్నురాలై ఉంది. (3)
వర్తమానేషు ధర్మేణ పాండవేషు మహాత్మసు ।
వ్యవర్ధన్ కురవః సర్వే హీనదోషాః సుఖాన్వితాః ॥ 4
మహాత్ములైన పాండవులు ధర్మం ప్రకారం జీవిస్తూ ఉండగా కురువంశీయులు సుఖశాంతులతో, దోషరహితులై వృద్ధిపొందారు. (4)
అథ దీర్ఘేణ కాలేన బ్రాహ్మణస్య విశాంపతే ।
కస్యచిత్ తస్కరా జహ్రుః కేచిత్ గా నృపసత్తమ ॥ 5
పిమ్మట కొంతకాలానికి ఒక బ్రాహ్మణుని గోవులను దొంగలు కొందరు అపహరించి పారిపోయారు. (5)
హ్రియమాణే ధనే తస్మిన్ బ్రాహ్మణః క్రోధమూర్ఛితః ।
ఆగమ్య ఖాండవప్రస్థముదక్రోశత్ స పాండవాన్ ॥ 6
గోధనం అపరహరణకు గురికాగా క్రోధవివశుడైన ఆ బ్రాహ్మణుడు ఖాండవప్రస్థానికి వచ్చి పాండవుల వద్ద దుఃఖించాడు. (6)
హ్రియతే గోధనం క్షుద్రైః నృశంసైరకృతాత్మభిః ।
ప్రసహ్యచాస్మద్విషయాద్ అభ్యధావత పాండవాః ॥ 7
మా గ్రామంలో నీచులు, క్రూరులు, పాపాత్ములైన కొందరు చోరులు గోధనం అపహరించారు. వాటిని మళ్ళించటానికి మీ సాయం అవసరమైంది. (7)
బ్రాహ్మణస్య ప్రశాంతస్య హవిర్ధ్వాంక్షైః విలుప్యతే ।
శార్దూలస్య గుహాం శూన్యాం నీచః క్రోష్టాభిమర్దతి ॥ 8
ప్రశాంతమనస్కుడయిన బ్రాహ్మాణుని హవిస్సును కాకులు దొంగిలించాయి. నీచమైన నక్క పెద్దపులి శూన్యగుహను ఆక్రమించింది. (8)
అరక్షితారం రాజానం బలిషడ్భాగహారిణమ్ ।
తమాహుః సర్వలోకస్య సమగ్రం పాపచారిణమ్ ॥ 9
తపస్సులోని ఆరవవంతు గైకొని లోకాన్ని రక్షించని రాజును పాపచారి అని అన్నిలోకాలు కీర్తిస్తాయి. (9)
బ్రాహ్మణస్య హృతే చౌరైః ధర్మార్థే చ విలోపితే ।
రోరూయమాణే చ మయి క్రియతామస్త్రధారణమ్ ॥ 10
బ్రాహ్మణుని ధనాన్ని చోరులు అపహరించారు. ధర్మార్థాలు లోపించిపోయాయి. దుఃఖించే నన్ను చూసి మీరు శస్త్రాస్త్రాల్ని దాల్చి వాటిని సంరక్షించండి. (10)
వైశంపాయన ఉవాచ
రోరూయమాణస్యాఖ్యానే భృశం విప్రస్య పాండవః ।
తాని వాక్యాని శుశ్రావ కుంతీపుత్రో ధనంజయః ॥ 11
శ్రుత్వైవ చ మహాబాహుః మా భైరిత్యాహ తం ద్విజమ్ ।
వైశంపాయనుడు అన్నాడు. జనమేజయా! ఆ బ్రాహ్మణుడు అర్జునుని వద్దకు వచ్చి ఇలా రోదించాడు. ఆ వాక్యాలు కుంతీ సుతుడు, అర్జునుడు విన్నాడు. ఆ ద్విజుని అర్జునుడు 'భయం వలదు' అని ఊరడించాడు. (11 1/2)
ఆయుధాని చ యత్రాసన్ పాండవానాం మహాత్మనామ్ ॥ 12
కృష్ణయా సహ తత్రాస్తే ధర్మరాజో యుధిష్ఠిరః ।
సంప్రవేశాయ చాశక్తః గమనామ చ పాండవః ॥ 13
పాండవుల ఆయుధాలు ఉన్నచోట ధర్మరాజు ద్రౌపదితో ఏకాంతంగా ఉన్నాడు. భవనప్రవేశానికి శంకించాడు అర్జునుడు. (12,13)
తస్య చారస్య తైర్వాక్యైః చోద్యమానః పునః పునః ।
ఆక్రందే తత్ర కౌంతేయః చింతయామాస దుఃఖితః ॥ 14
ఆర్తుడైన ఆ బ్రాహ్మణుని మాటలు మాటిమాటికి అర్జునుని ప్రేరేపించాయి. అతని దుఃఖానికి కౌంతేయుడు చలించిపోయి ఇలా అనుకొన్నాడు. (14)
హ్రియమాణే ధనే తస్మిన్ బ్రాహ్మణస్య తపస్వినః ।
అశ్రుప్రమార్జనం తస్య కర్తవ్యమితి నిశ్చయః ॥ 15
దీనతాపసి అయిన బ్రాహ్మణుని గోధనమ్ అపహరించబడితే అర్జునుడు అతని కన్నీరు తుడవాలి అని నిశ్చయించాడు. (15)
ఉపక్షేపణజోఽధర్మః సుమహాన్ స్యాన్మహీపతేః ।
యద్యస్య రుదతో ద్వారి న కరోమ్యద్య రక్షణమ్ ॥ 16
రాజద్వారాన విలపిస్తున్న బ్రాహ్మణుని రక్షణ నేడు చేయలేకపోతే యుధిష్ఠిరునికి ఉపేక్షాజనితమైన పాపం వస్తుంది అని ఆలోచించాడు. (16)
అనాస్తిక్యం చ సర్వేషామస్మాకమపి రక్షణే ।
ప్రతితిష్ఠేత లోకేఽస్మిన్ అధర్మశ్చైవ నో భవేత్ ॥ 17
మేమందరం కలిసి ఆర్తుని రక్షించకపోతే ధర్మపాలనంలో అశ్రద్ధ ఏర్పడింది అని జనులు భావిస్తారు. దీనితో అధర్మఫలం మాకు కలుగుతుంది. (17)
అనాధృత్య తు రాజానం గతే మయి న సంశయః ।
అజాతశత్రోర్నృపతేః మమ చైవానృతం భవేత్ ॥ 18
నేను రాజును గౌరవించక భవనంలో ప్రవేశిస్తే నిస్సందేహంగా అజాతశత్రుని ముందు నేను చేసిన ప్రతిజ్ఞ వ్యర్థం అవుతుంది. (18)
అనుప్రవేశే రాజ్ఞస్తు వనవాసో భవేన్మమ ।
సర్వమన్యత్ పరిహృతం ధర్షణాత్ తు మహీపతేః ॥ 19
రాజు అక్కడ ఉన్నవేళ ప్రవేశిస్తే వనవాసం చేయాలి. మహారాజుని తిరస్కరించినట్లై నా మాటలు తుచ్ఛాలై నమ్మశక్యం కానివి అవుతాయి. (19)
అధర్మో వై మహానస్తు వనే వా మరణం మమ ।
శరీరస్య వినాశేన ధర్మ ఏవ విశిష్యతే ॥ 20
రాజ తిరస్కారంచే నియమభంగమై అధర్మదోషం , లేదా వనంలో మరణమ్ సంభవిస్తాయి. శరీరనాశం కంటె గోబ్రాహ్మణరక్షారూప ధర్మమే గొప్పదవుతుంది. (20)
ఏవం వినిశ్చిత్య తతః కుంతీపుత్రో ధనంజయః ।
అనుప్రవిశ్య రాజానమ్ ఆపృచ్ఛ్య చ విశాంపతే ॥ 21
దనురాదాయ సంహృష్టః బ్రాహ్మణం ప్రత్యభాషత ।
జనమేజయా! ఈ నిర్ణయంగైకొని కుంతీపుత్రుడు ధనంజయుడు రాజును అడిగి లోనికి ప్రవేశించి ధనస్సు తీసికొని ప్రసన్నంగా బ్రాహ్మణునితో అన్నాడు. (21 1/2)
బ్రాహ్మణాగమ్యతాం శీఘ్రం యావత్ పరధనైషిణః ॥ 22
న దూరే తే గతాః క్షుద్రాః తావత్ గచ్ఛావహే సహ ।
యావన్నివర్తయామ్యద్య చౌరహస్తాత్ ధనం తవ ॥ 23
బ్రాహ్మణా! మీరు నాతో రండి. పరధనాన్ని కోరే క్షుద్రులైన దొంగలు దూరంగా పోయేలోపల మనం అక్కడకు చేరాలి. నేను ఇప్పుడు ఆ అపహరింపబడిన సొత్తుని నీకప్పగిస్తాను. (22,23)
సోఽనుసృత్య మహాబాహుర్ధన్వీ వర్మీ రథీ ధ్వజీ ।
శరైర్విధ్వస్య తాంశ్చౌరాన్ అవజిత్య చ తద్ ధనమ్ ॥ 24
అని పలికి అర్జునుడు, ధనుస్సు, కవచం ధరించి ధ్వజంతో కూడిన రథాన్ని అధిరోహించి, దొంగల్ని వెంబడించి, బాణాలతో వారిని నాశనం చేసి, గోధనాన్ని జయించి, మళ్ళించాడు. (24)
బ్రాహ్మణం సముపాకృత్య యశః ప్రాప్య చ పాండవః ।
తతస్తద్ గోధనం పార్థః దత్త్వా తస్మై ద్విజాతయే ॥ 25
ఆజగామ పురం వీరః సవ్యసాచీ ధనంజయః ।
సో-భివాద్య గురూన్ సర్వాన్ సర్వైశ్చాప్యభినందితః ॥ 26
బ్రాహ్మణునకు ఆ ధనమంతా అప్పగించి కీర్తిని పొంది సవ్యసాచి అయిన అర్జునుడు తన నగరానికి తిరిగి వచ్చాడు. పెద్దలకు నమస్కరించి వారి అభినందనలు పొందాడు. (25,26)
ధర్మరాజమువాచేదం వ్రతమాదిశ మే ప్రభో ।
సమయః సమతిక్రాంతః భవత్సందర్శనే మయా ॥ 27
వనవాసో గమిష్యామి సమయో హ్యేష నః కృతః ।
అర్జునుడు ధర్మజునితో పలికాడు - ప్రభూ! నేను (మిమ్ములను ద్రౌపదితో కలిసియుండగాచూసి) ఇంతకు ముందు ఏర్పరిచిన నియమాన్ని భంగం చేశాను. మన నియమానుసారం వనవాసానికి వెడతాను. (27 1/2)
ఇత్యుక్తో ధర్మరాజస్తు సహసా వాక్యమప్రియమ్ ॥ 28
కథమిత్యబ్రవీత్ వాచా శోకార్తః సజ్జమానయా ।
యుధిష్ఠిరో గుడాకేశం భ్రాతా భ్రాతరమచ్యుతమ్ ॥ 29
ఉవాచ దీనో రాజా చ ధనంజయమిదం వచః ।
ప్రమాణమస్మి యది తే మత్తః శృణు వచోఽనఘ ॥ 30
అర్జునుని ముఖం నుంచి వెలువడిన అప్రియవచనాలు విని ధర్మజుడు శోకాతురుడై గద్గదస్వరంతో అన్నాడు. ఈ విధంగా ఎందుకు నిర్ణయించావు? అంటూ యుధిష్ఠిరుడు ధర్మమర్యాదను పాటించే తమ్మునితో దీనంగా పలికాడు. 'నీవు నామాటల్ని ఆచరించదలిస్తే ఈ విషయాన్ని విను. (28-30)
అనుప్రవెశే యద్ వీర కృతవాంస్త్వం మమ ప్రియమ్ ।
సర్వం తదనుజానామి వ్యళీకం న చ మే హృది ॥ 31
వీరుడా! నీవు నా భవనంలోనికి ప్రవేశించి నాకు ప్రియాన్ని చేశావు. దానిని నేను సమ్మతించాను. నా హృదయంలో ఏ విధమైన అప్రియమూ లేదు. (31)
గురోరనుప్రవేశో హి నోపఘాతో యవీయసః ।
యవీయసోఽనుప్రవేశః జ్యేష్ఠస్య విధిలోపకః ॥ 32
అన్న భార్యతో నున్న సమయాన చిన్నవాని ప్రవేశం ధర్మమే. తమ్ముడు భార్యతో నున్న సమయాన పెద్దవాని భవనప్రవేశం అధర్మం. (32)
నివర్తస్వ మహాబాహో కురుష్వ వచనం మమ ।
న హి తే ధర్మలోపోఽస్తి న చ తే ధర్షణా కృతా ॥ 33
నీ బుద్ధిని వనగమనం నుంచి మరలించే నా మాటలను ఆచరించు. నీలో ధర్మలోపమూ లేదు, నీవు నన్ను తిరస్కరించనూ లేదు. (33)
అర్జున ఉవాచ
న వ్యాజేన చరేద్ ధర్మమితి మే మహతః శ్రుతమ్ ।
న సత్యాత్ విచలిష్యామి సత్యేనాయుధమాలభే ॥ 34
అర్జునుడు అన్నాడు - ప్రభూ! ధర్మాచరణం నిష్కపటంగా చేయాలని నీ నుంచి విన్నాను. శస్త్రాలపై ఒట్టువేసి సత్యం నుంచి చలించనని విన్నవిస్తున్నాను. (34)
(ఆజ్ఞా తు మమ దాతవ్యా భవతా కీర్తివర్ధన ।
భవదాజ్ఞామృతే కించిత్ న కార్యమితి నిశ్చితమ్ ॥)
కీర్తివర్ధనుడా! నీచే ఆజ్ఞ నేను పొందాలి. నీ ఆజ్ఞకు భిన్నంగా ఏ పనీ నేచేయను.
వైశంపాయన ఉవాచ
సోఽభ్యనుజ్ఞాయ రాజానం వనచర్యాయ దీక్షితః ।
వనే ద్వాదశ వర్షాణి వాసాయానుజగామ హ ॥ 35
వైశంపాయనుడు పలికాడు - అర్జునుడు వనవాసానికి అనుజ్ఞ పొంది వనవాసదీక్ష పొంది, పండ్రెండు సంవత్సరాలు వనవాసానికి బయలుదేరాడు. (35)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి అర్జునవనవాస పర్వణి అర్జునతీర్థయాత్రాయాం ద్వాదశాధికద్విశతతమోఽధ్యాయః ॥ 212 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున అర్జునవనవాస పర్వమను
ఉపపర్వమున అర్జునతీర్థయాత్ర అను రెండువందల పన్నెండవ అధ్యాయము. (212)
(దాక్షిణాత్య అధికపాఠము 1 శ్లోకాలు కలిపి మొత్తం 36 శ్లోకాలు)