171. నూట డెబ్బది ఒకటవ అధ్యాయము
తపతీ సంవరణుల సంభాషణము.
గంధర్వ ఉవాచ
అథ తస్యామదృశ్యాయాం నృపతిః కామమోహితః ।
పాతనః శత్రుసంఘానాం పపాత ధరణీతలే ॥ 1
ఆ రీతిగా ఆమె కనిపించకుండా పోవటంతో కామమోహితుడైన సంవరణమహారాజు శత్రుసమూహాలను పడగొట్టగల శక్తిగలవాడై కూడా తానే నేలపై పడ్డాడు. (1)
తస్మిన్ నిపతితే భూమౌ అథ సా చారుహాసినీ ।
పునః పీనాయతశ్రోణీ దర్శయామాస తం నృపమ్ ॥ 2
రాజు ఆ విధంగా నేలపై పడగానే విశాలమైన శ్రోణిభాగం గల ఆ తపతి అందంగా నవ్వుతూ మళ్లీ ఆ రాజుకు కనిపించింది. (2)
అథాబభాషే కళ్యాణీ వాచా మధురయా నృపమ్ ।
తం కురూణాం కులకరం కామాభిహతచేతసమ్ ॥ 3
ఉవాచ మధురం వాక్యం తపతీ ప్రహసన్నివ ।
ఉత్తిష్ఠోత్తిష్ఠ భద్రం తే న త్వమర్హస్యరిందమ ॥ 4
మోహం నృపతి శార్దూల గంతుమావిష్కృతః క్షితౌ ।
ఏవముక్తోఽథ నృపతిః వాచా మధురయా తదా ॥ 5
దదర్శ విపులశ్రోణీం తామేవాభిముఖే స్థితామ్ ।
అథ తామసితాపాంగీమ్ ఆబభాషే స పార్థివః ॥ 6
మన్మథాగ్నిపరీతాత్మా సందిగ్ధాక్షరయా గిరా ।
సాధు త్వమసితాపాంగి కామార్తం మత్తకాశిని ॥ 7
భజస్వ భజమానం మాం ప్రాణా హి ప్రజహంతి మామ్ ।
త్వదర్థం హి విశాలాక్షి మామయం నిశితైః శరైః ॥ 8
కామః కమలగర్భాభే ప్రతివిధ్యన్ న శామ్యతి ।
దష్టమేవమనాక్రందే భద్రే కామమహాహినా ॥ 9
కురువంశవర్ధనుడైన ఆ రాజు కామాగ్నితప్తుడై అచేతనుడయ్యాడు. ఆ సమయంలో మాటాడదగిన మధుర వచనాలతో ఆ తపతి నవ్వుతూ సంవరణునితో ఇలా అన్నది. అరిందమా! లే లే, నీకు మేలు గలుగుతుంది. రాజశ్రేష్ఠుడవుగా విశ్వవిఖ్యాతి నందిన నీవు ఈ ప్రకారంగా మోహావిష్టుడవు కారాదు. ఆమె ఆ రీతిగా మధురంగా పలికిన తరువాత రాజు కళ్ళు తెరిచాడు. ఎదురుగా విశాల నితంబంగల ఆ సుందరి కనిపించింది. రాజు అంతఃకరణంలో కామాగ్ని ప్రజ్వరిల్లుతోంది. ఆ రాజు నల్లని కనుకొనలు గల ఆ సుందరితో అస్పష్టంగా ఇలా అన్నాడు. అసితాపాంగి! మత్తకాశిని! మంచిది కామార్తుడనై నిన్ను సేవిస్తున్నాను. నన్ను స్వీకరించి సేవించు. లేనిచో నా ప్రాణాలు పోయేటట్లున్నాయి. విశాలనేత్రా! కమలగర్భం వంటి కాంతి గలదానా! నీ కోసం మదనుడు నన్ను నిశితబాణాలతో గాయపరుస్తున్నాడు. అయినా శాంతించటం లేదు. కళ్యాణి! కామసర్పం కాటువేయగా రక్షణకై ఆక్రోశిస్తున్నాను. (3-9) సా త్వం పీనాయతశ్రోణి మామాప్నుహి వరాననే ।
త్వదధీనా హి మే ప్రాణాః కిన్నరోద్గీతభాషిణి ॥ 10
సుశ్రోణీ! వరాననా! నా దగ్గరకు రా! కిన్నరుల పాటవలె మాటాడుదానా! నా ప్రాణాలు నీ వశమై ఉన్నాయి. (10)
చారుసర్వానవద్యాంగి పద్మేందుప్రతిమాననే ।
న హ్యహం త్వదృతే భీరు శక్ష్యామి ఖలు జీవితమ్ ॥ 11
అందమై నిర్దుష్టమైన శరీరావయవాలు కలిగి పద్మంవలె చంద్రునివలె ప్రకాశించే ముఖం గల నీవు లేకుండా నేను జీవించలేను. (11)
కామః కమలపత్రాక్షి ప్రతివిధ్యతి మామయమ్ ।
తస్మాత్ కురు విశాలాక్షి మయ్యనుక్రోశమంగనే ॥ 12
కమలపత్రాక్షీ! మదనుడు నన్ను గాయపరుస్తున్నాడు. కాబట్టి విశాలాక్షీ! నాపై దయచూపు. (12)
భక్తం మామసితాపాంగి న పరిత్యక్తుమర్హసి ।
త్వం హి మాం ప్రీతియోగీన త్రాతుమర్హసి భావిని ॥ 13
అసితాపాంగీ! నీకు నేను భక్తుడను. నన్ను విడువదగదు. ప్రీతిపూర్వకంగా నీవు మాత్రమే నన్ను రక్షించగలవు. (13)
త్వద్దర్శనకృతస్నేహం మనశ్చలతి మే భృశమ్ ।
న త్వాం దృష్ట్వా పునశ్చాన్యాం ద్రష్టుం కళ్యాణి రోచతే ॥ 14
నిన్ను చూచినప్పుడే నా మనస్సు నీపై మరులుగొన్నది. నిలకడను కోల్పోయింది. కళ్యాణీ! నిన్ను చూచిన తరువాత మరెవ్వరినీ చూడాలనిపించటం లేదు. (14)
ప్రసీద వశగోఽహం భక్తం మాం భజ భావిని ।
దృష్టైవ త్వాం వరారోహే మన్మథో భృశమంగనే ॥ 15
అంతర్గతం విశాలాక్షి విధ్యతి స్మ పతత్రిభిః ।
మన్మథాగ్నిసముద్భూతం దాహం కమలలోచనే ॥ 16
ప్రీతిసంయోగయుక్తాభిః అద్భిః ప్రహ్లాదయస్వ మే ।
పుష్పాయుధం దురాధర్షం ప్రచండశరకార్ముకమ్ ॥ 17
త్వద్దర్శనసముద్భూతం విధ్వంతం దుస్సహైః శరైః ।
ఉపశామయ కళ్యాణి ఆత్మదానేన భావిని ॥ 18
దయచూపు! నేను నీకు లోబడినఽఆడను. భావినీ! నీ భక్తుడను నన్ను అంగీకరించు. వరారోహా! విశాలాక్షీ! నేను నిన్ను చూసినప్పుడే మదనుడు నా మనస్సును బాణాలతో గాయపరిచాడు. కమలాక్షీ! మన్మథుడనే అగ్నినుండి పుట్టిన తాపాన్ని ప్రీతి సంగమములతో కూడిన నీటితో చల్లబరుచుము. పుష్పశరుడు చాలా కఠినుడు. ప్రచండుడు. నీ దర్శనంతోనే పుట్టాడు. సహింపరాని బాణాలతో కొడుతున్నాడు. అందుచేత ఆత్మ ప్రదానంతో శమ్మింపజెయ్యి. (15-18)
గాంధర్వేణ వివాహేన మాముపేహి వరాంగనే ।
వివాహానాం హి రంభోరు గాంధర్వః శ్రేష్ఠః ఉచ్యతే ॥ 19
వరాంగనా గాంధర్వవివాహంతో నాకు దగ్గరకావచ్చు. రంభోరూ! వివాహాలన్నింటిలో గాంధర్వం శ్రేష్ఠమైనది. (19)
తపత్యువాచ
వాహమీశాఽత్మనో రాజన్ కన్యా పితృమతీ హ్యహమ్ ।
మయి చేదస్తి తే ప్రీతిః యాచస్వ పితరం మమ ॥ 20
తపతి అన్నది- రాజా! నేను స్వతంత్రురాలను కాను. నేను కన్యను. నా తండ్రి జీవించి ఉన్నాడు. నా మీద మక్కువ కలిగితే మా తండ్రినడుగు. (20)
యథా హి తే మయా ప్రాణాః సంగృహీతా నరేశ్వర ।
దర్శనాదేవ భూయః త్వం తథా ప్రాణాన్ మమాహరః ॥ 21
నరేశ్వరా! చూచీ చూడగానే నేను నీ ప్రాణాలను లోబరుచుకొన్నట్లు నీవు కూడా నా ప్రాణాలను అపహరించావు. (21)
న చాహమీశా దేహస్య తస్మాత్ నృపతిసత్తమ ।
సమీపం నోపగచ్ఛామి న స్వతంత్య్రా హి యోషితః ॥ 22
కా హి సర్వేషు లోకేషు విశ్రుతాభిజనం నృపమ్ ।
కన్యా నాభిలషేత్ నాథం భర్తారం భక్తవత్సలమ్ ॥ 23
రాజశ్రేష్ఠా! నా శరీరానికి నేను యాజమానిని కాను. కాబట్టి నీ దగ్గరకు రాలేను. స్త్రీలు స్వతంత్రలు కాదు. సర్వలోక ప్రసిద్ధి గల వంశంలో పుట్టిన భక్తవత్సలుడైన మహారాజును ఏ కన్య భర్తగా కోరుకొనదు. (22,23)
తస్మాదేవం గతే కాలే యాచస్వ పితరం మమ ।
ఆదిత్యం ప్రణిపాతేన తపసా నియమేన చ ॥ 24
కాబట్టి ఈ స్థితిలో నమస్కారాలతో, తపస్సుతో, నియమాలతో నా తండ్రి అయిన సూర్యభగవానుని యాచించు. (24)
స చేత్ కామయతే దాతుం తవ మామరిసూదన ।
భవిష్యామ్యద్య తే రాజన్ సతతం వశవర్తినీ ॥ 25
శత్రుసూదనా! రాజా! ఆయన నన్ను నీకు ఇవ్వటానికిష్టపడితే ఆనాడే నీకు శాశ్వతంగా వశమవుతాను. (25)
అహం హి తపతీ నామ సావిత్యవరజా సుతా ।
అస్య లోకప్రదీపస్య సవితుః క్షత్రియర్షభ ॥ 26
క్షత్రియోత్తమా! నా పేరు తపతి. లోకప్రదీపకుడైన సూర్యునకు సావిత్రి తరువాత పుట్టిన కుమార్తెను. (26)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి తపత్యుపాఖ్యానే ఏకసప్తత్యధిక శతతమోఽధ్యాయః ॥ 171 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున చైత్రరథపర్వమను ఉపపర్వమున తపత్యుపాఖ్యానమను నూట డెబ్బదియొకటవ అధ్యాయము. (171)