169. నూట అరువది తొమ్మిదవ అధ్యాయము

అర్జున చిత్రరథుల స్నేహము.

వైశంపాయన ఉవాచ
గతే భగవతి వ్యాసే పాండవాః హృష్టమానసాః ।
తే ప్రతస్థుః పురస్కృత్య మాతరం పురుషర్షభాః ॥ 1
వ్యాసభగవానుడు నిష్క్రమించిన తరువాత నరశ్రేష్ఠులయిన పాండవులు సంతుష్టమనస్కులై తల్లిని ముందు నిలుపుకొని బయలుదేరారు. (1)
ఆమంత్య్ర బ్రాహ్మణం పూర్వమ్ అభివాద్యానుమాన్య చ ।
సమైరుదఙ్ముఖైర్మార్గైః యథోద్దిష్టం పరంతపాః ॥ 2
పరంతపులయిన ఆ పాండవులు బ్రాహ్మణుని నుండి సెలవుతీసికొని ఆయనకు నమస్కరించి, అనుమతిని పొంది ఉత్తర దిక్కునకు సరాసరి వెళ్ళేమార్గాన్ని పట్టుకొని పంచాలదేశంవైపు పయనించసాగారు. (2)
తే త్వగచ్ఛన్నహోరాత్రాత్ తీర్థం సోమాశ్రయాయణమ్ ।
ఆసేదుః పురుషవ్యాఘ్రాః గంగాయాం పాండునందనాః ॥ 3
ఒక పగలూ, ఒక రాత్రీ ప్రయాణం చేసి పురుషశ్రేష్ఠులయిన ఆ పాండవులు గంగా తీరంలోని 'సోమాశ్రయ' మనే తీర్థాన్ని చేరారు. (3)
ఉల్ముకం తు సముద్యమ్య తేషామగ్రే ధనంజయః ।
ప్రకాశార్థం యయౌ తత్ర రక్షార్థం చ మహారథః ॥ 4
మహారథుడైన అర్జునుడు వారి రక్షణకొరకూ, వెలుతురు కొరకూ ఒక కొరివికట్టెను ఎత్తిపట్టుకొని వారి ముందు నడిచాడు. (4)
తత్ర గంగాజలే రమ్యే వివిక్తే క్రీడయన్ స్త్రియః ।
ఈర్ష్యుః గంధర్వరాజో వై జలక్రీడాముపాగతః ॥ 5
రమణీయమూ, ఏకాంతమూ అయిన ఆ గంగాజలంలో ఒక గంధర్వరాజు తన కాంతలతో జలక్రీడలాడుతున్నాడు. ఆయన ఈర్ష్యాళువు. జలక్రీడ కొరకే అక్కడకు వచ్చినాడు. (5)
శబ్దం తేషాం స శుశ్రావ నదీం సముపసర్పతామ్ ।
తేన శబ్దేన చావిష్టః చుక్రోధ బలవద్ బలీ ॥ 6
ఆయన నదికి దగ్గరగా వస్తున్న పాండవుల అలికిడిని విన్నాడు. బలిష్ఠుడైన గంధర్వుడు ఆ శబ్దం వలన తీవ్రంగా కోపించాడు. (6)
స దృష్ట్వా పాండవాన్ తత్ర సహ మాత్రా పరంతపాన్ ।
విస్ఫారయన్ ధనుర్ఘోరమ్ ఇదం వచనమబ్రవీత్ ॥ 7
తల్లితో సహా అక్కడున్న పరంతపులయిన ఆ పాండవులను చూచి గంధర్వరాజు భీకరమైన వింటిని ధ్వనింపజేస్తూ వారితో ఇలా అన్నాడు. (7)
సంధ్యా సంరజ్యతే ఘోరా పూర్వరాత్రాగమేషు యా ।
అశీతిభిర్లవైర్హీనం తన్ముహూర్తం ప్రచక్షతే ॥ 8
విహితం కామచారాణాం యక్షగంధర్వరక్షసామ్ ।
శేషమన్యత్ మనుష్యాణాం కర్మచారేషు వై స్మృతమ్ ॥ 9
రాత్రి ప్రారంభమయ్యే ముందు పశ్చిమ దిక్కున భయంకర సంధ్యారాగం ఏర్పడినప్పుడు ఎనభై లవాల కాలాన్ని వదలగా మిగిలిన కాలం కామచారులయిన యక్షగంధర్వ రాక్షసులకు నిశ్చయింపబడింది. రోజులో మిగిలిన భాగమంతా మనుష్యులకు వారి పనులు చేసికొనటానికి కేటాయించబడింది (8,9)
లోభాత్ ప్రచారం చరతః తాసు వేలాసు వై నరాన్ ।
ఉపక్రాంతాని గృహ్ణీమః రాక్షసైః సహ బాలిశాన్ ॥ 10
లోభం వలన ఏ మానవులయినా మాకై నిర్ణయింపబడిన ఆ సమయంలో సంచరిస్తూ సమీపిస్తే ఆ మూర్ఖులను రాక్షసులూ, మేమూ బంధిస్తాము. (10)
అతో రాత్రౌ ప్రాప్నువంతః జలం బ్రహ్మవిదో జనాః ।
గర్హయంతి నరాన్ సర్వాన్ బలస్థాన్ నృపతీనపి ॥ 11
అందువలనే రాత్రివేళలో నీటిలో ప్రవేశించిన మనుష్యులనందరనూ, వారు బలవంతులయిన రాజులైనా సరే వేదవేత్తలు నిందిస్తున్నారు. (11)
ఆరాత్ తిష్ఠత మా మహ్యం సమీపముపసర్పత ।
కస్మాన్మాం నాభిజానీత ప్రాప్తం భాగీరథీజలమ్ ॥ 12
అంగారపర్ణం గంధర్వం విత్త మాం స్వబలాశ్రయమ్ ।
అహం హి మానీ చేర్ష్యుశ్చ కుభేరస్య ప్రియః సఖా ॥ 13
దూరంగానే నిలవండి. దగ్గరకు రాకండి. నేను అంగారపర్ణుడను గంధర్వరాజును. గంగాజలంలో దిగి ఉన్న నన్ను ఎందుకు గమనించలేదు? నేను నా బలాన్నే నమ్మినవాడను, అభిమానవంతుడను. ఈర్ష్యాళువును, కుబేరుని ప్రియమిత్రుడను కూడా. (12,13)
అంగారపర్ణమిత్యేవమ్ ఖ్యాతం చేదం వనం మమ ।
అనుగంగం చరన్ కామాన్ చిత్రం యత్ర రమామ్యహమ్ ॥ 14
ఈ వనం కూడా నాదే. దీని పేరు అంగారపర్ణం. నేను గంగాతీరంలో సంచరిస్తూ ఈ వనంలో విచిత్రక్రీడలతో కాలం గడుపుతుంటాను. (14)
న కౌణపాః శృంగిణో వా న దేవా న చ మానుషాః ।
ఇదం సముపసర్పంతి తత్ కిం సమనుసర్పథ ॥ 15
నేనుండగా రాక్షసులు కానీ, యక్షులు కానీ, దేవతలు కానీ, మానవులు కానీ దగ్గరకు రాలేరు. మరి మీరు దగ్గరకెలా వస్తున్నారు? (15)
అర్జున ఉవాచ
సముద్రే హిమవత్ పార్శ్వే నద్యామస్యాం చ దుర్మతే ।
రాత్రావహని సంధ్యాయాం కస్య గుప్తః పరిగ్రహః ॥ 16
అర్జునుడు అన్నాడు. దుర్మతీ! సముద్రంలో, హిమాలయ సన్నిధిలో, గంగాతీరంలో రాత్రి అయినా, పగలయినా సంజెవేళనైనా ఎవరి అధికారం నిలిచి ఉంటుంది? (16)
భుక్తో వాప్యథవాభుక్తః రాత్రావహని ఖేచర ।
న కాలనియమో హ్యస్తి గంగాం ప్రాప్య సరిద్వరామ్ ॥ 17
గంధర్వా! నదీమతల్లి అయిన గంగను సమీపించటానికి కాలనియమం లేదు. తిని అయినా రావచ్చు. తినకుండా అయినా రావచ్చు. పగలు కావచ్చు. రాత్రి కావచ్చు. (17)
వయం చ శక్తి సంపన్నాః అకాలే త్వామధృష్ణుమ ।
అశక్తా హి రణే క్రూరః యుష్మానర్చంతి మానవాః ॥ 18
మేము శక్తి సంపన్నులము, వేళకాని వేళవచ్చినా నిన్ను అణచగలము. క్రూరుడా! యుద్ధం చేయటానికి శక్తిలేని మానవులు మిమ్ములను పూజిస్తారు. (18)
పురా హిమవతశ్చైషా హేమ శృంగాత్ వినిస్సృతా ।
గంగా గత్వా సముద్రాంభః సప్తధా సమపద్యత ॥ 19
గంగాం చ యమునాం చైవ ప్లక్షజాతాం సరస్వతీమ్ ।
రథస్థాం సరయూం చైవ గోమతీం గండకీం తథా ॥ 20
అపర్యుషితపాపాస్తే నదీః సప్త పిబంతి యే ।
ఇయం భూత్వా చైకవప్రా శుచిరాకాశగా పునః ॥ 21
దేవేషు గంగా గంధర్వ ప్రాప్నోత్యలకనందతామ్ ।
తథా పితౄన్ వైతరణీ దుస్తరా పాపకర్మభిః ।
గంగా భవతి వై ప్రాప్య కృష్ణద్వైపాయనోఽబ్రవీత్ ॥ 22
తొలుత హిమాలయం స్వర్ణశిఖరం నుండి వెలువడిన గంగ ఏడు పాయలుగా విడిపోయి కడలిలో కలిసిపోయింది. గంగ, యమున, సరస్వతి, రథస్థ, సరయు, గోమతి, గండకి - ఇవి ఆ ఏడుపాయలు. ఈ ఏడు నదులలోని నీటిని త్రాగిన వారి పాపాలు పటాపంచలవుతాయి. ఈ గంగ చాలా పవిత్రమైనది. ఆకాశమొక్కటే దాని ఒడ్డు, గంధర్వా! ఆకాశమార్గాన చరించే ఈ గంగకు దేవలోకంలో అలక అని పేరు. ఈ గంగయే వైతరణి పేరుతో పితృలోకంలో ప్రవహిస్తుంది. పాపాత్ములు దానిని దాటడం చాలా కష్టం. ఈ లోకంలో దీని పేరు గంగ. కృష్ణద్వైపాయనుడు ఈ విషయాన్ని చెప్పాడు. (19-22)
అసంబాధా దేవనదీ స్వర్గసంపాదనీ శుభా ।
కథమిచ్ఛసి తాం రోద్ధుం నైష ధర్మః సనాతనః ॥ 23
కళ్యాణకారిణి అయిన ఈ దేవనది నిర్విఘ్నంగా స్వర్గప్రాప్తిని కల్గించగలది. అటువంటి నదిని నిరోధించతగదు. ఇది సనాతన ధర్మం కాదు. (23)
అనివార్యమసంబాధం తవ వాచా కథం వయమ్ ।
న స్పృశేమ యథాకామం పుణ్యం భాగీరథీజలమ్ ॥ 24
ఈ గంగను ఎవ్వరూ నివారించలేరు. నదీప్రవేశాన్ని ఎవ్వరూ అడ్డగించరాదు. ఇటివంటి పవిత్రగంగాజలాన్ని నీ మాటను బట్టి మేము స్వేచ్ఛగా స్పృశించకుండా ఎలా ఉండగలం? (24)
వైశంపాయన ఉవాచ
అంగారపర్ణః తత్ శ్రుత్వా క్రుద్ధ ఆనమ్య కార్ముకమ్ ।
ముమోచ బానాన్ నిశితాన్ అహీనాశీవిషానివ ॥ 25
వైశంపాయనుడిలా అన్నాడు. ఆ మాటవిని అంగార పర్ణుడు కోపించి ధనుస్సును ఎక్కుపెట్టి విషసర్పాల వంటి వాడిబానాలను విడువనారంభించాడు. (25)
ఉల్ముకం భ్రామయన్ తూర్ణం పాండవః చర్మచోత్తరమ్ ।
వ్యపోహత శరాంస్తస్య సర్వానేవ ధనంజయః ॥ 26
వెంటనే పాండుకుమారుడు అర్జునుడు కొరివికట్టెను త్రిప్పుతూ, మంచి డాలును అడ్డుపెడుతూ ఆ బాణాల నన్నింటినీ తప్పించాడు. (26)
అర్జున ఉవాచ
విభీషికా వై గంధర్వ నాస్త్రజ్ఞేషు ప్రయుజ్యతే ।
అస్త్రజ్ఞేషు ప్రయుక్తేయం ఫేనవత్ ప్రవిలీయతే ॥ 27
అర్జునుడిలా అన్నాడు. గంధర్వుడా! అస్త్రవిద్యావేత్తల దగ్గర నీ బెదిరింపులు పనికిరావు. అస్త్రవిద్యాసంపన్నులపై వినియోగిస్తే నీ మాయ నురుగులా అంతరించిపోతుంది. (27)
మానుషానతిగంధర్వాన్ సర్వాన్ గంధర్వ లక్షయే ।
తస్మాదస్త్రేణ దివ్యేన యోత్స్యేఽహం న తు మాయయా ॥ 28
గంధర్వుడా! గంధర్వులందరూ మానవులకన్న శక్తి వంతులని నేనెరుగుదును. కాబట్టి నేను దివ్యాస్త్రాలతో యుద్ధం చేస్తాను. మాయతో కాదు. (28)
పురాస్త్రమిదమాగ్నేయం ప్రాదాత్ కిల బృహస్పతిః ।
భరద్వాజాయ గంధర్వ గురుర్మాన్యః శతక్రతోః ॥ 29
గంధర్వుడా! ఈ ఆగ్నేయాస్త్రాన్ని గతంలో ఇంద్రుడు కూడా గౌరవించే బృహస్పతి భరద్వాజముని కిచ్చాడు. (29)
భరద్వాజాదగ్నివేశ్యః అగ్నివేశ్యాత్ గురుర్మమ ।
సాధ్విదం మహ్యమదదత్ ద్రోణో బ్రాహ్మణసత్తమః ॥ 30
భరద్వాజుడు అగ్నివేశ్యునకూ, అగ్నివేశ్యుడు మా గురువైన ద్రోణునకూ ఇచ్చారు. ఆ బ్రాహ్మణోత్తముడు ఈ దివ్యాస్త్రాన్ని నాకు ప్రసాదించాడు. (30)
వైశంపాయన ఉవాచ
ఇత్యుక్త్వా పాండవః క్రుద్ధః గంధర్వాయ ముమోచ హ ।
ప్రదీప్తమస్త్రమాగ్నేయం దదాహాస్య రథం తు తత్ ॥ 31
విరథం విప్లుతం తం తు స గంధర్వం మహాబలః ।
అస్త్రతేజః ప్రమూఢం చ ప్రపతంతమవాఙ్ముఖమ్ ॥ 32
శిరోరుహేషు జగ్రాహ మాల్యవత్సు ధనంజయః ।
భ్రాతౄన్ ప్రతిచకర్షాథ సోఽస్త్రపాతాదచేతసమ్ ॥ 33
వైశంపాయనుడిలా అన్నాడు. ఈ మాట అని అర్జునుడు కోపంతో ఆ గంధర్వునిపై ప్రజ్వలిస్తున్న ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. అది గంధర్వుని రథాన్ని తగులబెట్టింది. రథహీనుడైన ఆ గంధర్వుడు కలతపడి, అస్త్ర శక్తి వలన దిక్కు తోచక నేల కొరగబోయాడు. అప్పుడు మహాబలుడయిన అర్జునుడు పూలమాలలతో ప్రాకాశిస్తున్న ఆ అంగారపర్ణుని జుట్టుపట్టుకొని సోదరుల దగ్గరకు తెచ్చాడు. అంగారపర్ణుడు బాణాఘాతంతో చైతన్యాన్ని కోలుపోయాడు. (31-33)
యుధిష్ఠిరం తస్య భార్యా ప్రపేదే శరణార్థినీ ।
నామ్నా కుంభీనసీ నామ పతిత్రాణమభీప్సతీ ॥ 34
ఆ అంగారపర్ణుని భార్య కుంభీనసి, ఆమె భర్తను రక్షించుకొనదలచి వినమ్రయై శరణుకోరుతూ యుధిష్ఠిరుని దగ్గరకు వచ్చింది. (34)
గంధర్వీ ఉవాచ
త్రాయస్వ మాం మహాభాగ పతిం చేమం విముంచ మే ।
గంధర్వీ శరణం ప్రాప్తా నామ్నా కుంభీనసీ ప్రభో ॥ 35
గంధర్వుని భార్య అన్నది. మహానుభావా! నన్ను కాపాడండి. నాభర్తను విడిచిపెట్టండి. స్వామీ! నేను ఈ గంధర్వుని పత్నిని. పేరు కుంభీనసి. శరణు కోరుతున్నాను. (35)
యుధిష్ఠిర ఉవాచ
యుద్ధే జితం యశోహీనం స్త్రీనాథమపరాక్రమమ్ ।
కో నిహన్యాత్ రిపుం తాత ముంచేమం రిపుసూదన ॥ 36
యుధిష్ఠిరుడు అన్నాడు - నాయనా! రిపుసూదనా! ఈ గంధర్వుడు యుద్ధంలో ఓడిపోయాడు. కీర్తిని కోలుపోయాడు. పరాక్రమహీనుడు. ఇప్పుడు భార్యయే ఈయనకు దిక్కైనది. ఇటువంటి శత్రువును చంపకూడదు. వదలిపెట్టు. (36)
అర్జున ఉవాచ
జీవితం ప్రతిపద్యస్వ గచ్ఛ గంధర్వ మా శుచః ।
ప్రదిశత్యభయం తేఽద్య కురురాజొ యుధిష్ఠిరః ॥ 37
గంధర్వ ఉవాచ
జితోఽహం పూర్వకం నామ ముంచామ్యంగారపర్ణతామ్ ।
న చ శ్లాఘే బలేనాంగ న నామ్నా జనసంసది ॥ 38
గంధర్వుడిలా అన్నాడు. నేను ఓడిపోయాను. అందువలన అంగారపర్ణుడను నా పేరును వదలివేస్తున్నాను. ఇక జనసమూహంలో నా బలాన్ని శ్లాఘించుకొనను. కనీసం పేరు కూడా చెప్పుకొనను. (38)
సాధ్విమం లబ్ధవాన్ లాభం యోఽహం దివ్యాస్త్రధారిణమ్ ।
గాంధర్వ్యా మాయయేచ్ఛామి సంయోజయితుమర్జునమ్ ॥ 39
నేనీనాడు ఓడిపోయి కూడా దివ్యాస్త్రధారి అయిన అర్జునుని మైత్రిని పొందగలిగాను. ఇది నాకు లాభమే. అర్జునునకు గంధర్వమాయను ఇవ్వదలచుకొన్నాను. (39)
అస్త్రాగ్నినా విచిత్రోఽయం దగ్ధో మే రథ ఉత్తమః ।
సోఽహం చిత్రరథో భూత్వా నామ్నా దగ్ధరథోఽభవమ్ ॥ 40
విచిత్రమూ, శ్రేష్ఠమూ అయిన నా రథం దివ్యాస్త్ర వహ్నిచే దగ్ధమైంది. చిత్రరథుడనైన నేను ఇప్పుడు దగ్ధరథుడనయ్యాను. (40)
సంభృతా చైవ విద్యేయం తపసేహ మయా పురా ।
నివేదయిష్యే తామద్య ప్రాణదాయ మహాత్మనే ॥ 41
నేను గతంలో నా తపశ్శక్తితో ఈ విద్యను పొంది ఉన్నాను. నాకు ప్రాణదానం చేసిన ఈ మహాత్మునకు ఆ విద్యను నివేదిస్తున్నాను. (41)
సంస్తంభయిత్వా తరసా జితం శరణమాగతమ్ ।
యో రిపుం యోజయేత్ ప్రాణైః కళ్యాణం కిం న సోఽర్హతి ॥ 42
వేగంగా శత్రువును నిర్వీర్యుని చేసి, అతడు శరణుకోరిన వెంటనే ప్రాణదానం చేసినవాడు ఏ శుభాలకు అర్హుడు కాడు? (42)
చాక్షుషీ నామ విద్యేయం యాం సోమాయ దదౌ మనుః ।
దదౌ చ విశ్వావసవే మమ విశ్వావసు ర్దదౌ ॥ 43
ఇది చాక్షుషి అనబడే విద్య. దీనిని మనువు సోమున కిచ్చాడు. సోముడు విశ్వావసువున కిచ్చాడు. విశ్వావసువు నాకు ఇచ్చాడు. (43)
సేయం కాపురుషం ప్రాప్తా గురుదత్తా ప్రణశ్యతి ।
ఆగమోఽస్యాః మయా ప్రోక్తః వీర్యం ప్రతినిబోధ మే ॥ 44
గురువు దానం చేసిన ఈ విద్య దుర్జనుని చేరితే నశిస్తుంది. ఇంతవరకు ఇది సంప్రాప్తించిన క్రమం వివరించాను. దీని ప్రభావం కూడా చెపుతా విను. (44)
యత్ చక్షుషా ద్రష్టుమిచ్చేత్ త్రిషు లోకేషు కించన ।
తత్ పశ్యేత్ యాదృశం చేచ్ఛేత్ తాదృశం ద్రష్టుమర్హతి ॥ 45
దీని ప్రభావంతో మూడులోకాలలో నున్న వస్తువులలో దేనినైనా ఏ రూపంలో చూడాలని కోరినా ఆ వస్తువును ఆ రూపంలో చూడవచ్చు. (45)
ఏకపాదేన షణ్మాసాన్ స్థితో విద్యాం లభేదిమామ్ ।
అనునేష్యామ్యహం విద్యాం స్వయం తుభ్యం వ్రతేఽకృతే ॥ 46
ఆరుమాసాలు ఒంటికాలిపై నిలిచి తపస్సు చేసినవాడే ఈ విద్యను పొందగలడు. ఈ వ్రతాన్ని చేయకపోయినా నీకు నేనీ విద్యను ప్రవర్తింపజేయగలను. (46)
విద్యయా హ్యనయా రాజన్ వయం నృభ్యః విశేషితాః ।
అవిశిష్టాశ్చ దేవానామ్ అనుభావప్రదర్శినః ॥ 47
రాజా! ఈ విద్య కారణంగానే మేము మానవులకన్న గొప్పవారమైనాము. దేవతలతో సమానంగా ప్రభావాన్ని ప్రదర్శించగలుగుతున్నాము. (47)
గంధర్వజానామశ్వానామ్ అహం పురుషసత్తమ ।
భ్రాతృభ్య స్తవ తుభ్యం చ పృథక్ దాతా శతం శతమ్ ॥ 48
పురుషశ్రేష్ఠా! నీకూ, నీ సోదరులకూ ఒక్కొక్కరికి వంద వంద గంధర్వజాతి హయాలను నేను కానుక చేస్తున్నాను. (48)
దేవ గంధర్వవాహాస్తే దివ్యవర్ణాః మనోజవాః ।
క్షీణాక్షీణా భవంత్యేతే న హీయంతే చ రంహసః ॥ 49
అవి దేవతలకూ, గంధర్వులకూ వాహనాలు. మహావేగమూ, దివ్యవర్ణమూ గలవి అవి అవసరాన్ని బట్టి దుర్బలాలూ, బలిష్ఠాలూ కూడా కాగలవు. (49)
పురా కృతం మహేంద్రస్య వజ్రం వృత్రనిబర్హణమ్ ।
దశధా శతధా చైవ తచ్ఛీర్ణం వృత్రమూర్ధని ॥ 50
పూర్వకాలంలో మహేంద్రుడు వృత్రాసురుని సహరించటానికి ఆయన తలపై వ్రజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అది పదిపెద్దముక్కలూ, వంద చిన్నముక్కలూ అయింది. (50)
తతో భాగీకృతో దేవైః వజ్రభాగ ఉపాస్యతే ।
లోకే యశోధనం కించిత్ సైవ వజ్రతనుః స్మృతా ॥ 51
అప్పటి నుండి ముక్కలయిన ఆ వజ్రాయుధపు ముక్కలనన్నింటినీ దేవతలు ఉపాసిస్తున్నారు. లోకంలో ఉత్కృష్టమైన కీర్తి, డబ్బు మొదలయినవన్నీ వజ్రస్వరూపాలుగానే భావింపబడుతున్నాయి. (51)
వజ్రపాణి ర్బ్రాహ్మణః స్యాత్ క్షత్రం వజ్రరథం స్మృతమ్ ।
వైశ్యా వై దాన్వజ్రా శ్చ కర్మవజ్రా యవీయసః ॥ 52
బ్రాహ్మణుని చేయి వజ్రం. క్షత్రియుని రథం వజ్రం. వైశ్యుని దానం వజ్రం. శూద్రుని పని వజ్రం. (52)
క్షత్రవజ్రస్య భాగేన అవధ్యా వాజినః స్మృతాః ।
రథాంగం బడవా సూతే శూరాశ్చాశ్వేషు యే మతాః ॥ 53
క్షత్రియుని వజ్రభాగమైన రథానికి అంగాలు కాబట్టి అశ్వాలను చంపకూడదు. గంధర్వదేశానికి చెందిన అశ్వం రథాంగాలయిన అశ్వాలకు జన్మనిస్తుంది. అవి అశ్వజాతిలో శూరులలాగా లెక్క. (53)
కామవర్ణాః కామజవాః కామతః సముపస్థితాః ।
ఇతి గంధర్వజాః కామం పూరయిష్యంతి మే హయాః ॥ 54
నేను కానుక చేస్తున్న ఈ గంధర్వజాతికి చెందిన గుఱ్ఱాలు రంగు మార్చుకొనగలవి. వేగాన్ని సవరించుకొనగలవి కోరుకొన్న సమయంలో వచ్చి చేరగలవి. కాబట్టి ఇవి మీ కోరికలను పూర్తిచేయగలవి. (54)
అర్జున ఉవాచ
యది ప్రీతేన మే దత్తం సంశయే జీవితస్య వా ।
విద్యాధనం శ్రుతం వాపి న తత్ గంధర్వ రోచయ్ ॥ 55
అర్జునుడిలా అన్నాడు. గంధర్వుడా! నీవు ఇష్టపడియో కాక ప్రాణాలను రక్షించుకొనగోరియో విద్యనూ, ధనాన్నీ, శాస్త్రాన్నీ నాకు ఇవ్వదలచుకొన్నావు. కానీ నా కది ఇష్టం లేదు. (55)
వి: సం: ప్రీతేన - ప్రీతిలక్షణమిది
దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యమఖ్యాతి పృచ్ఛతి ।
భుంక్తే భీజయతే చైవ షడ్విధం ప్రీతిలక్షణమ్ ॥
ఇవ్వటం, తీసికోవటం, రహస్యాలు చెప్పటం, రహస్యాలు అడగటం, భోజనం చేయటం, భోజనం పెట్టటం - ఈ ఆరూ ప్రీతిలక్షణాలు. (నీల)
గంధర్వ ఉవాచ
సంయోగో వై ప్రీతికరః మహత్సు ప్రతిదృశ్యతే ।
జీవితస్య ప్రదానేన ప్రీతో విద్యాం దదామి తే ॥ 56
గంధర్వుడిలా అన్నాడు. మహాత్ములతో చెలిమి ప్రీతిని పెంపొందింపజేయగలది. నాకు జీవితాన్ని ప్రసాదించి నందువలన ఆనందించి నీకు విద్యను కానుకగా ఇస్తున్నాను. (56)
త్వత్తోఽప్యహం గ్రహీష్యామి అస్త్రమాగ్నేయముత్తమమ్ ।
తథైవ యోగ్యం బీభత్సో చిరాయ భరతర్షభ ॥ 57
నీ నుండి నేను ఉత్తమమయిన ఈ ఆగ్నేయాస్త్రాన్నిస్వీకరిస్తాను. భరతశ్రేష్ఠా! అర్జునా! ఇది మన మన సౌహార్దాన్ని శాశ్వతంగా నిలుపగలదు. (57)
అర్జున ఉవాచ
త్వత్తోఽస్త్రేణ వృణోమ్యశ్వాన్ సంయోగః శాశ్వతోఽస్తు నౌ ।
సఖే తత్ బ్రూహి గంధర్వ! యుష్మభ్యో యత్ భయం భవేత్ ॥ 58
అర్జునుడిలా అన్నాడు. గంధర్వా! నీవు చెప్పినట్లే నేను ఆగ్నేయాస్త్రాన్ని ఇచ్చి చాక్షుషీవిద్యను గ్రహిస్తాను. మన మైత్రి చిరస్థాయి కాగలదు. మిత్రమా! చెప్పు మీరంటే మానవులకు భయమెందుకు? (58)
కారణం బ్రూహి గంధర్వ కిం తత్ యేన స్మ ధర్షితాః ।
యాంతో వేదవిదః సర్వే సంతో రాత్రావరిందమాః ॥ 59
గంధర్వా! మేమందరమూ వేదవేత్తలం. శత్రుసంహారం చేయగలవారం. అయినా రాత్రిపూట ప్రయాణించే సమయంలో గంధర్వులు మాపై ఆక్రమణ చేయటానికి కారణమేమిటి? చెప్పు. (59)
అనగ్నయోఽనాహుతయః న చ విప్రపురస్కృతాః ।
యూయం తతో ధర్షితాః స్థ మయా వై పాండునందనాః ॥ 60
పాండుకుమారులారా! మీరు త్రేతాగ్నులను అర్చించటం లేదు. అనుదినమూ అగ్నికి ఆహుతుల నివ్వటం లేదు. కనీసం పురోహితుడు అయినా మీ ముందులేడు. ఆ కారణాల వలన నేను మిమ్ములను ఆక్రమింపగలిగాను. (60)
(జానతా చ మయా తస్మాత్ తేజశ్చాభిజనం చ వః ।
ఇయం మతిమతాం శ్రేష్ఠ ధర్షితుం వై కృతా మతిః ॥
కో హి వస్త్రిషు లోకేషు న వేద భరతర్షభ ।
స్వైర్గుణై ర్విస్తృతం శ్రీమద్ యశోఽగ్య్రం భూరివర్చసామ్ ॥)
యక్షరాక్షస గంధర్వాః పిశాచోరగదానవాః ।
విస్తరం కురువంశస్య ధీమంతః కథయంతి తే ॥ 61
ధీమంతులలో శ్రేష్ఠుడా! అందువలననే నేను మీ తేజస్సునూ, వంశప్రతిష్ఠనూ ఎరిగి కూడా మీపై ఆక్రమణ చేయదలచాను. భరతశ్రేష్ఠా! మూడు లోకాలలోనూ మిమ్మెరుగని వారెవరున్నారు? మీరు మీ గుణసంపత్తితో ప్రకాశవంతమయిన విస్తృతయశస్సును పొంది ఉన్నారు. మేధావులైన యక్షులు, రాక్షసులు, గంధర్వులు, పిశాచాలు, నాగులు, దానవులు కురువంశయశస్సును విస్తృతంగా ప్రస్తావిస్తుంటారు. (61)
నారదప్రభృతీనాం తు దేవర్షీణాం మయా శ్రుతమ్ ।
గుణాన్ కథయతాం వీర! పూర్వేషాం తవ ధీమతామ్ ॥ 62
వీరుడా! నారదుడు మొదలగాగల దేవమునులు కూడా మీ పూర్వీకుల గుణాలను గానం చేస్తుంటే నేను విన్నాను. (62)
స్వయం చాపి మయా దృష్టః చరతా సాగరాంబరామ్ ।
ఇమాం వసుమతీం కృత్స్నాం ప్రభావః సుకులస్య తే ॥ 63
సాగరాలు చుట్టుముట్టి ఉన్న ఈ సమస్త భూమండలంలో సంచరిస్తూ స్వయంగా నేను కూడా మీ కులప్రతిష్ఠన్ చూచి ఉన్నాము. (63)
వేదే ధనుషి చాచార్యమ్ అభిజానామి తేఽర్జున ।
విశ్రుతం త్రిషు లోకేషు భారద్వాజం యశస్వినమ్ ॥ 64
అర్జునా! వేదవిద్యలోనూ, ధనుర్విద్యలోనూ మీకు ఆచార్యుడై త్రిలోకాలలో కీర్తిప్రతిష్ఠలుగల ద్రోణుడు కూడా నాకు తెలుసు. (64)
ధర్మం వాయుం చ శక్రం చ విజానామ్యశ్వినౌ తథా ।
పాండుం చ కురుశార్దూల షడేతాన్ కురువర్ధనాన్ ।
పితౄనేతా నహం పార్థ దేవమానుషసత్తమాన్ ॥ 65
కురుశార్దూలూ! ధర్మరాజును, వాయుదేవుని, ఇంద్రుని, అశ్వినీదేవతలను, పాండురాజును కూడా నేనెరుగుదును. వారు ఆరుగురూ కురువంశాన్ని వర్ధిల్లజేస్తున్నవారు. అర్జునా! దేవమానవ శ్రేష్ఠులయిన ఈ ఆరుగురూ మీ తండ్రులని కూడా తెలుసు. (65)
దివ్యాత్మానో మహాత్మానః సర్వశస్త్రభృతాం వరాః ।
భవంతో భ్రాతరః శూరాః సర్వే సుచరితవ్రతాః ॥ 66
సోదరులయిన మీరందరీ దేవస్వరూపులు, మహాత్ములు, సమస్తశస్త్రధారులలో శ్రేష్ఠులు, శూరులు, చక్కని బ్రహ్మచర్య దీక్షగలవారు. (66)
ఉత్తమాం చ మనోబుద్ధిం భవతాం భావితాత్మనామ్ ।
జానన్నపి చ వః పార్థ! కృతవానిహ ధర్షణామ్ ॥ 67
అర్జునా! మీ అంతఃకరణం, మనస్సు, బుద్ధి ఉత్తమమయినవి. అదంతా తెలిసి కూడా మీపై దురాక్రమణ చేశాను. (67)
స్త్రీ సకాశే చ కౌరవ్య న పుమాన్ క్షంతుమర్హతి ।
ధర్షణామాత్మనః పశ్యన్ బాహుద్రవిణమాశ్రితః ॥ 68
కురునందనా! తన బాహుబలసంపదను నమ్ముకొనిన ఏ మగవాడూ స్త్రీల సమక్షంలో తాను తిరస్కరింపబడటాన్ని సహించడు. (68)
నక్తం చ బలమస్మాకం భూయ ఏవాభివర్ధతే ।
యతస్తతో మాం కౌంతేయ సదారం మన్యురావిశత్ ॥ 69
కౌంతేయా! అంతేకాదు. రాత్రివేళలో మాబలం బాగా పెరుగుతుంది. అందువలనా, స్త్రీ సాన్నిధ్యం వలనా నాలో క్రోధావేశం కలిగింది. (69)
సోఽహం త్వయేహ విజితః సంఖ్యే తాపత్యవర్ధన ।
యేన తేనేహ విధినా కీర్త్యమానం నిబోధ మే ॥ 70
తపతీ వంశవృద్ధికరా! అర్జునా! అటువంటి నన్ను నీవు యుద్ధంలో ఓడించావు. అది ఎలా సాధించగలిగావో కూడా చెపుతా విను. (70)
బ్రహ్మచర్యం పరో ధర్మః స చాపి నియతస్త్వయి ।
యస్మాత్ తస్మాత్ అహం పార్థ రణేఽస్మి విజితస్త్వయా ॥ 71
బ్రహ్మచర్యం శ్రేష్ఠధర్మం. అది కూడా నీ యందున్నది. ఆ కారణం వలన యుద్ధంలో నీవు నన్ను ఓడించగలిగావు. (71)
యస్తు స్యాత్ క్షత్రియః కశ్చిత్ కామవృత్తః పరంతప ।
నక్తం చ యుధి యుధ్యేత న స జీవేత్ కథంచన ॥ 72
పరంతపా! కామప్రవృత్తి గల ఏ క్షత్రియుడైనా రాత్రివేళ యుద్ధం చేస్తే ఎట్టిపరిస్థితిలోనూ అతను ప్రాణాలతో బయటపడలేదు. (72)
యస్తు స్యాత్ కామవృత్తోఽసి పార్థ! బ్రహ్మపురస్కృతః ।
జయేత్ నక్తంచరాన్ సర్వాన్ స పురోహితధూర్గతః ॥ 73
అర్జునా! కామప్రవృత్తి గలవాడైనా క్షత్రియుడు బ్రాహ్మణుని ముందుచుకొని యుద్ధం చేస్తే రాక్షసులనందరినీ జయించగలడు. అది పురోహితుని వలన సంక్రమించే శక్తి. (73)
తస్మాత్ తాపత్య యత్ కించిత్ నృణాం శ్రేయ ఇహేప్సితమ్ ।
తస్మిన్ కర్మణి యోక్తవ్యా దాంతాత్మానః పురోహితాః ॥ 74
తాపత్యా! కాబట్టి మానవులు ఈ లోకంలో ఏ మంచిపనినైనా చేయదలిస్తే నియతాత్ములైన పురోహితులను ఆ పనికై నియోగించాలి. (74)
వేదే షడంగే నిరతాః శుచయః సత్యవాదినః ।
ధర్మాత్మానః కృతాత్మానః స్యుర్నృపాణాం పురోహితాః ॥ 75
రాజుల పురోహితులు వేదవేదాంగాలపై ఆసక్తిగలవారు, శుద్ధవర్తనులు, సత్యవాదులు, ధర్మస్వరూపులు, జితేంద్రియులూ అయి ఉండాలి. (75)
జయశ్చ నియతో రాజ్ఞః స్వర్గశ్చ తదనంతరమ్ ।
యస్య స్యాద్ ధర్మవిద్ వాగ్మీ పురోధాః శీలవాన్ శుచిః ॥ 76
ధర్మవేత్త, వాగ్మి, శీలవంతుడు, పరిశుద్ధుడూ అయిన పురోహితుని నియమించుకొనిన రాజునకు ముందు జయమూ ఆ తరువాత స్వర్గమూ తప్పక కలుగుతాయి. (76)
లాభం లబ్ధుమలబ్ధం వా లబ్ధం వా పరిరక్షితుమ్ ।
పురోహితం ప్రకుర్వీత రాజా గుణసమన్వితమ్ ॥ 77
అప్రాప్తమైన దానిని పొందాలన్నా, లభించిన దానిని రక్షించుకోవాలన్నా రాజు గుణవంతుడైన పురోహితుని ఏర్పాటు చేసికోవాలి. (77)
పురోహితమతే తిష్ఠేత్ య ఇచ్ఛేత్ భూతిమాత్మనః ।
ప్రాప్తుం వసుమతీం సర్వాం సర్వశః సాగరాంబరామ్ ॥ 78
సాగరాంబర అయిన సమస్తభూలోకం మీదా అధికారాన్నీ, తనకు ఐశ్వర్యాన్నీ కోరుకొనే రాజు పురోహితుని ఆజ్ఞానువర్తియై ఉండాలి. (78)
న హి కేవలశౌర్యేణ తాపత్యాభిజనేన చ ।
జయేదబ్రాహ్మణః కశ్చిత్ భూమిం భూమిపతిః క్వచిత్ ॥ 79
తాపత్యా! ఏ రాజైనా పురోహిత సహకారం లేక కేవలం తనబలంతో కానీ, వంశప్రతిష్ఠతో కానీ ఇహలోకంలో గెలువలేడు. (79)
తస్మాదేవం విజానీహి కురూణాం వంశవర్ధన ।
బ్రాహ్మణప్రముఖం రాజ్యం శక్యం పాలయితుం చిరమ్ ॥ 80
కాబట్టి కురువంశవర్ధనా! ఈ విషయాన్ని గ్రహించు. బ్రాహ్మణులకు ప్రాధాన్యమిచ్చిన రాజే చిరకాలం రాజ్యపాలన చేయగలుగుతాడు. (80)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి గంధర్వపరాభవే ఏకోనసప్తత్యధిక శతతమోఽధ్యాయః ॥ 169 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున చైత్రరథపర్వమను ఉపపర్వమున గంధర్వపరాభవమను నూట అరువది తొమ్మిదవ అధ్యాయము. (169)