161. నూట అరువది ఒకటవ అధ్యాయము
కుంతీ యుధిష్ఠిరుల సంవాదము.
వైశంపాయన ఉవాచ
కరిష్య ఇతి భీమేన ప్రతిజ్ఞాతేఽథ భారత ।
ఆజగ్ముస్తే తతస్సర్వే భైక్షమాదాయ పాండవాః ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. జనమేజయా! నేనీపని చేస్తానని భీమసేనుడు ప్రతిజ్ఞ చేశాడు. తర్వాత పాండవులందరూ భిక్షను తిసుకుని ఇంటికి తిరిగివచ్చారు. (1)
ఆకారేణైవ తం జ్ఞాత్వా పాండుపుత్రో యుధిష్ఠిరః ।
రహః సముపవిశ్యైకః తతః పప్రచ్ఛ మాతరమ్ ॥ 2
పాండుకుమారుడు యుధిష్ఠిరుడు భీమసేనుని ఆకారాన్ని చూడగానే ఏదో చేయబోతున్నాడని గ్రహించాడు. పిదప రహస్యంగా తల్లిని సమీపించి ఇలా ప్రశ్నించాడు. (2)
యుధిష్ఠిర ఉవాచ
కిం చికీర్షత్యయం కర్మ భీమో భీమపరాక్రమః ।
భవత్యనుమతే కచ్చిత్ స్వయం వా కర్తుమిచ్ఛతి ॥ 3
యుధిష్ఠిరుడన్నాడు. భయంకర పరాక్రముడు భీమసేనుడు ఏమి చేయబోతున్నాడు? ఆ పనిని నీ అనుమతితో చేస్తున్నాడా? లేక తనకు తానే చేయబోతున్నాడా? (3)
కుంత్యువాచ
మమైవ వచనాదేషః కరిష్యతి పరంతపః ।
బ్రాహ్మణార్థే మహత్ కృత్యం మోక్షాయ నగరస్య చ ॥ 4
కుంతి అన్నది. బ్రాహ్మణుని ప్రయోజనం కోసమూ, ఈ నగరానికి విముక్తిని కల్పించటానికీ, శత్రు మర్దనుడు భీమసేనుడు, నా ఆదేశంతోనే ఈ పనిని చేస్తున్నాడు. (4)
యుధిష్ఠిర ఉవాచ
కిమిదం సాహసం తీక్ష్ణం భవత్యా దుష్కరం కృతం ।
పరిత్యాగం హి పుత్రస్య న ప్రశంసంతి సాధవః ॥ 5
యుధిష్ఠిరుడన్నాడు. అమ్మా! నీవు అసాధ్యమైన, తీవ్రమైన ఈ సాహసకార్యాన్ని ఎందుకు తలపెట్టావు? సత్పురుషులు కుమారుని పరిత్యజించటాన్ని ఎంతమాత్రం ప్రశంసించరు. (5)
కథం పరసుతస్యార్థే స్వసుతం త్యక్తుమిచ్ఛసి ।
లోకవేదవిరుద్ధం హి పుత్రత్యాగాత్ కృతం త్వయా ॥ 6
అమ్మా! పరుని కుమారుని కోసం నీ సొంతకొడుకుని బలిపెట్టాలని ఎలా అనుకొన్నావు? నీవు పుత్రత్యాగం ద్వారా లోకానికి, వేదానికి విరుద్ధమైన పనిని చేస్తున్నావు కదా! (6)
యస్య బాహూ సమాశ్రిత్య సుఖం సర్వే శయామహే ।
రాజ్యం చాపహృతం క్షుద్రైః ఆజిహీర్షామహే పునః ॥ 7
మనమంతా భీమసేనుని పరాక్రమాన్ని నమ్ముకునే కదా, సుఖంగా నిద్రపోగలుగుతున్నాము. భీముని పరాక్రమం ద్వారానే కదా, నీచులు అపహరించిన రాజ్యాన్ని తిరిగి సాధించాలని కోరుకొంటున్నాము. (7)
యస్య దుర్యోధనో వీర్యం చింతయన్నమితౌజసః ।
న శేతే రజనీ స్సర్వాః దుఃఖాచ్ఛకునినా సహ ॥ 8
అసామాన్య పరాక్రమశాలి అయిన భీముని బలాన్ని తలచుకునే కదా, దుర్యోధనుడు, శకునితోపాటు, దుఃఖంతో రాత్రులన్నీ నిద్రలేకుండా గడుపుతున్నాడు. (8)
యస్య వీరస్య వీర్యేణ ముక్తా జతుగృహాద్ వయమ్ ।
అన్యేభ్యశ్చైవ పాపేభ్యః నిహతశ్చ పురోచనః ॥ 9
మనమంతా భీముని పరాక్రమం వల్లేకదా లక్కయింటి నుండి, ఇతర పాపాత్ముల నుండి బయటపడగలిగాము. అతని చేతనే కదా దుర్మార్గుడైన పురోచనుడు చంపబడ్డాడు. (9)
యస్య వీర్యం సమాశ్రిత్య వసుపూర్ణాం వసుంధరామ్ ।
ఇమాం మన్యామహే ప్రాప్తాం నిహత్య ధృతరాష్ట్రజాన్ ॥ 10
తస్య వ్యవసితస్త్యాగః బుద్ధిమాస్థాయ కాం త్వయా ।
కచ్చిన్ను దుఃఖైర్బుద్ధిస్తే విలుప్తా గతచేతసః ॥ 11
భీముని బలం మీద నమ్మకంతోనే కదా, సంపదలతో నిండిన ఈ భూమిని, ధృతరాష్ట్రసుతులను సంహరించి తిరిగి పొందాలని భావించగల్గుతున్నాం. అటువంటి భీమసేనుని ఏమి ఆలోచించి నీవు విడిచిపెట్టాలనుకొన్నావు? అనుభవించిన దుఃఖాల వల్ల మనస్సుతోపాటు నీబుద్ధి కూడా నశించిపోలేదు కదా! (10,11)
కుంత్యువాచ
యుధిష్ఠిర న సంతాపః త్వయా కార్యో వృకోదరే ।
న చాయం బుద్ధిదౌర్బల్యాద్ వ్యవసాయః కృతో మయా ॥ 12
కుంతి అన్నది. యుధిష్ఠిరా! నీవు భీముని విషయంలో బాధపడాల్సిన పనిలేదు. ఈ నాప్రయత్నం తెలివి తక్కువతనం వల్ల చేస్తున్నది కాదు. (12)
ఇహ విప్రస్య భవనే వయం పుత్ర సుఖోషితాః ।
అజ్ఞాతా ధార్తరాష్ట్రాణాం సత్కృతా వీతమన్యవః ॥ 13
తస్య ప్రతిక్రియా పార్థ మయేయం ప్రసమీక్షితా ।
ఏతావానేవ పురుషః కృతం యస్మిన్ న నశ్యతి ॥ 14
కుమారా! ఈ బ్రాహ్మణుని ఇంటిలో మనం అందరం చాలా సుఖంగా బ్రతుకుతున్నాం. దుర్యోధనాదులకు తెలియకుండా, క్రోధాదులకు అతీతంగా, గౌరవంగా మనమంతా జీవించగల్గుతున్నాం. పార్థా! బ్రాహ్మణుని ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యాలని ఈ పనికి పూనుకున్నాను. నశించిపోని ఉపకారం చేసినవాడే నిజమైన మానవుడు. (13,14)
యావచ్చ కుర్యాదన్యో ఽస్య కుర్యాద్ బహుగుణం తతః ।
దృష్ట్వా భీమస్య విక్రాంతం తదా జతుగృహే మహత్ ।
హిడింబస్య వధా చ్ఛైవం విశ్వాసో మే వృకోదరే ॥ 15
ఉపకారాన్ని పొందినవాడు, దానికి ఎన్నో రెట్లు ప్రత్యుపకారం చెయ్యాలి. భీముని పరాక్రమం చూశాను. లక్క ఇంటిలో గొప్పపని చేశాడు. హిడింబుని సంహరించాడు. నాకు ఈ కారణాల వల్ల వృకోదరుని మీద నమ్మకం ఏర్పడింది. (15)
బాహ్వోర్బలం హి భీమస్య నాగాయుతసమం మహత్ ।
యేన యూయం గజప్రఖ్యాః నిర్వ్యూఢా వారణావతాత్ ॥ 16
భీముని యొక్క బాహుబలం చాలా గొప్పది, పదివేల ఏనుగుల బలం కలవాడు. కనుకనే ఏనుగులవంటి మిమ్మందరినీ వారణావతాన్నుండి బయటకు తీసుకొని రాగలిగాడు భీమసేనుడు. (16)
వృకోదరేణ సదృశః బలేనాన్యో న విద్యతే ।
యోఽభ్యుదీయాద్ యుధి శ్రేష్ఠం అపి వజ్రధరం స్వయమ్ ॥ 17
బలంలో వృకోదరునితో సమానుడు మరొకడు లేడు. యుద్ధంలో సాక్షాత్తు వజ్రపాణియైన ఇంద్రుడే వచ్చినా ఎదుర్కొనగల సమర్థుడు భీముడు. (17)
జాతమాత్రః పురా చైవ మమాంకాత్ పతితో గిరౌ ।
శరీరగౌరవాదస్య శిలా గాత్రైర్విచూర్ణితా ॥ 18
పుట్టిన వెంటనే ఒకసారి భీముడు నా ఒడినుండి జారి పర్వతం మీద పడ్డాడు. ఇతని శరీరభారం వల్ల నల్లరాయి నుగ్గయిపోయింది. కాని భీమునికి మాత్రం గాయం కాలేదు. (18)
తదహం ప్రజ్ఞయా జ్ఞాత్వా బలం భీమస్య పాండవ ।
ప్రతికార్యే చ విప్రస్య తతః కృతవతీ మతిమ్ ॥ 19
యుధిష్ఠిరా! ఈ విషయాన్నంతటినీ పర్యాలోచించే, భీముని బలాన్ని అంచనా వేసుకుని, బ్రాహ్మణునికి ప్రత్యుపకారం చెయ్యాలని నేను నిశ్చయించాను. (19)
నేదం లోభా న్నచాజ్ఞానాత్ న చ మోహాద్వినిశ్చితమ్ ।
బుద్ధిపూర్వం తు ధర్మస్య వ్యవసాయః కృతో మయా ॥ 20
ఈ నిర్ణయం లోభంచేతగాని, అజ్ఞానం చేతగాని, భ్రాంతి వల్లకాని చేసిందికాదు. బుద్ధిపూర్వకంగానే ధర్మాన్ని నిర్వహించడానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. (20)
అర్థౌ ద్వావపి నిష్పన్నౌ యుధిష్ఠిర భవిష్యతః ।
ప్రతీకారశ్చ వాసస్య ధర్మశ్చ చరితో మహాన్ ॥ 21
యుధిష్ఠిరా! ఈ పని చెయ్యటం వల్ల రెండు ప్రయోజనాలు నెరవేరుతాయి. బ్రాహ్మణునికి ప్రత్యుపకారం చెయ్యటం ఒకటి, ధర్మాన్ని ఆచరించటం రెండవది. (21)
యో బ్రాహ్మణస్య సాహాయ్యం కుర్యాదర్థేషు కర్హిచిత్ ।
క్షత్రియస్స శుభాంల్లోకాన్ ఆప్నుయాదితి మే మతిః ॥ 22
బ్రాహ్మాణునికి, అవసరమైన ప్రయోజనాన్ని సమకూర్చే క్షత్రియుడు శుభప్రదమైన లోకాలను పొందుతాడని నేను నమ్ముతున్నాను. (22)
క్షత్రియస్యైవ కుర్వాణః క్షత్రియో వధమోక్షణమ్ ।
విపులాం కీర్తిమాప్నోతి లోకేఽస్మింశ్చ పరత్ర చ ॥ 23
ఒక క్షత్రియుడు మరొక క్షత్రియుని ప్రాణాలను రక్షిస్తే, అతడు ఈ లోకంలోను, పరలోకంలోను కూడా గొప్పకీర్తిని సంపాదిస్తాడు. (23)
వైశ్యస్యార్థే చ సాహాయ్యం కుర్వాణః క్షత్రియో భువి ।
స సర్వేష్వపి లోకేషు ప్రజా రంజయతే ధ్రువమ్ ॥ 24
ఈ లోకంలో వైశ్యునకు సహాయం చేసిన క్షత్రియుడు అతడు అన్నిలోకాల్లోను ప్రజలను సంతోషింపచేస్తాడు. సందేహం లేదు. (24)
శూద్రం తు మోచయేద్రాజా శరణార్థినమాగతమ్ ।
ప్రాప్నోతీహ కులే జన్మ సద్ద్రవ్యే రాజ పూజితే ॥ 25
శరణన్న శూద్రుని ప్రాణభయం నుండి రక్షించిన రాజు తిరిగి ఈ లోకంలో ధనధన్యాలున్న, రాజులచే పూజింపబడే వంశంలో జన్మిస్తాడు. (25)
ఏవం మాం భగవాన్ వ్యాసః పురా పౌరవనందన ।
ప్రోవాచాసుకరప్రజ్ఞః తస్మాదేవం చికీర్షితమ్ ॥ 26
పురువంశప్రదీపా! దుర్లభ ప్రజ్ఞాశాలి వ్యాసభగవానుడు, నాకీ విషయాన్ని తెలియచేశాడు. కనుక ఈ విధంఘా చెయ్యాలని నేను భావించాను. (26)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి బకవధపర్వణి కుంతీయుధిష్ఠిర సంవాదే ఏకషష్ట్యధికశతతమోఽధ్యాయః ॥ 161 ॥
ఇది శ్రీమహాబారతమున ఆదిపర్వమున బకవధపర్వమను ఉపపర్వమున కుంతీ యుధిష్ఠిర సంవాదమను నూట అరువది ఒకటవ అధ్యాయము. (161)