155. నూట ఏబది అయిదవ అధ్యాయము

పాండవులు వ్యాసుని దర్శించుట - ఏకచక్రాపురమున ప్రవేశించుట.

వైశంపాయన ఉవాచ
తే వనేన గత్వా ఘ్నంతో మృగగణాన్ బహూన్ ।
అపక్రమ్య యయూ రాజన్ త్వరమాణా మహారథాః ॥ 1
వైశంపాయనుడన్నాడు. జనమేజయా! మహారథులైన పాండవులు ఒక అరణ్యం నుండి మరొక అరణ్యానికి ప్రయాణం సాగిస్తూ, మధ్యలో ఎన్నో మృగసమూహాలు హింసిస్తూ, (వ్యాస దర్శనం కోసం) త్వరపడుతూ ముందుకు సాగారు. (1)
మత్స్యాం స్త్రిగర్తాన్ పంచాలాన్ కీచకానంతరేణ చ ।
రమణీయాన్ వనోద్దేశాన్ ప్రేక్షమాణాః సరాంసి చ ॥ 2
పాండవులు, మత్స్య, త్రిగర్త, పంచాల, కీచక దేశాలకు సంబంధించిన అందమైన అరణ్యప్రదేశాలను, సరస్సులను చూసుకొంటూ ముందుకు సాగిపోయారు. (2)
జటాః కృత్వాఽఽత్మనః సర్వే వల్కలాజినవాసనః ।
సహ కుంత్యా మహాత్మానః బిభ్రతస్తాపసం వపుః ॥ 3
క్వచిద్ వహంతో జననీం త్వరమాణా మహారథాః ।
క్వచిచ్ఛందేన గచ్ఛంతః తే జగ్ముః ప్రసభం పునః ॥ 4
పాండవులు తమజుట్టును జడలుగా చుట్టుకొని, నారబట్టలను చర్మాలను ధరించారు. ఆ మహాత్ములందరూ కుంతితో సహా తాపసవేషం ధరించారు. కొన్ని చోట్ల ఆ మహారథులు తమ తల్లిని మోసుకొంటూ వేగంగా ప్రయాణించారు. కొన్ని చోట్ల ఇష్టానుసారం మెల్లగా ముందుకు వెళ్లారు. మళ్ళీ వారు కొన్ని చోట్ల వేగంగా ప్రయాణించారు. (3,4)
బ్రాహ్మం వేదమధీయానాః వేదాంగాని చ సర్వశః ।
నీతిశాస్త్రం చ సర్వజ్ఞాః దదృశుస్తే పితామహమ్ ॥ 5
పాండవులు ఉపనిషత్తులను, వేదవేదాంగాలను నిత్యం అధ్యయనం చేసేవారు. నీతిశాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్న సర్వజ్ఞులైన పాండవులు ఒకానొకరోజున తాతగారైన వ్యాసుని దర్శించారు. (5)
తేఽభివాద్య మహాత్మానం కృష్ణద్వైపాయనం తదా ।
తస్థుః ప్రాంజలయః సర్వే సహమాత్రా పరంతపాః ॥ 6
అప్పుడు శత్రుమర్దనులైన పాండవులు మహాత్ముడైన కృష్ణద్వైపాయనునికి నమస్కరించి, తల్లితో సహా అందరూ అంజలి ఘటించారు. (6)
వ్యాస ఉవాచ
మయేదం వ్యసనం పూర్వం విదితం భరతర్షభాః ।
యథా తు తైరధర్మేణ ధార్తరాష్ట్రైర్వివాసితాః ॥ 7
తద్ విదిత్వాస్మి సంప్రాప్తః చికీర్షుః పరమం హితమ్ ।
న విషాదోఽత్ర కర్తవ్యః సర్వమేతత్ సుఖాయ వః ॥ 8
వ్యాసుడన్నాడు. భరతోత్తములారా! మీకు వచ్చిన ఈ కష్టం గురించి నాకు ముందుగానే తెలిసింది. మీరు ధృతరాష్ట్ర కుమారులచేత అధర్మంగా బహిష్కరింపబడ్డారు. అది తెలిసి నేను మీకు పరమహితాన్ని కలుగచేయాలని వచ్చాని. ఈ విషయంలో మీరు విచారించవద్దు. ఇదంతా మీ యొక్క సుఖానికే వచ్చింది. (7, 8)
సమాస్తే చైవ మే సర్వే యూయం చైవ న సంశయః ।
దీనతో బాలటహ్శ్చైవ స్నేహం కుర్వంతి మానవాః ।
తస్మాదభ్యధికః స్నేహః యుష్మాసు మమ సాంప్రతమ్ ॥ 9
నాకు మీరు వారు సమానులే.అందులో సందేహం లేదు. మానవులు దైన్యాన్ని, బాలత్వాన్ని పరిగణించి స్నేహం చేస్తారు. ఆ కారణంగానే మీ యందు నాకు ఇప్పుడు ఎక్కువ స్నేహం ఏర్పడింది. (9)
స్నేహపూర్వం చికీర్షామి హితం వస్తన్నిబోధత ।
ఇదం నగరమభ్యాశే రమణీయం నిరామయమ్ ।
వసతేహ ప్రతిచ్ఛన్నాః మమాగమనకాంక్షిణః ॥ 10
ఆ స్నేహంతోనే నేను మీకొక మేలు చేయాలనుకొంటున్ణాను. దాన్ని గ్రహించండి. ఇదుగో సమీపంలోనే ఆరోగ్యకరమూ రమణీయమూ అయిన నగరం ఉన్నది. మీరందరూ మారువేషాల్లో నేను తిరిగి వచ్చేవారకు ఇచ్చటనే ఉండండి. (10)
వైశంపాయన ఉవాచ
ఏవం స తాన్ సమాశ్వాస్య వ్యాసః సత్యవతీసుతః ।
ఏకచక్రామభిగతః కుంతీమాశ్వాసయత్ ప్రభుః ॥ 11
వైశంపాయనుడన్నాడు. ఈ విధంగా సత్యవతి కుమారుడు వ్యాసుడు వారందరినీ అనునయించి , ఏకచక్రాపురం వైపు బయలుదేరుతూ కుంతిని ఇలా అనునయించాడు. (11)
వి: తె: నన్నయ ఏకచక్రపురం అని తెలుగువారికి పరిచయం చేశాడు.
వ్యాస ఉవాచ
జీవత్పుత్రి సుతస్తేఽయం ధర్మనిత్యో యుధిష్ఠిరః ।
ధర్మేణ పృథివీం జిత్వా మహాత్మా పురుషర్షభః ।
పృథివ్యాం పార్థివాన్ సర్వాన్ ప్రశాసిష్యతి ధర్మరాట్ ॥ 12
వ్యాసుడన్నాడు. జీవత్పుత్రీ! కుంతీ! నిత్యం ధర్మపరాయణుడైన నీకుమారుడు యుధిష్ఠిరుడు మహాత్ముడు, పురుషశ్రేష్ఠుడు. ధర్మబద్ధంగానే ఈ భూమండలాన్నంతటినీ జయుస్తాడు. సమస్తరాజులను జయించి ధర్మరాజుగా ఈ భూమినంతటినీ పాలిస్తాడు. (12)
పృథివీమఖిలాం జిత్వా సర్వాం సాగరమేఖలామ్ ।
భీమసేనార్జునబలాత్ భోక్ష్యతే నాత్ర సంశయః ॥ 13
ఇతడు సముద్రమే ఒడ్డాణమైన ఈ భూమండలాన్ని అంతటినీ భీమార్జునుల బలంతో జయించి, అనుభవిస్తాడు. ఇందులో సందేహం లేదు. (13)
పుత్రాస్తవ చ మాద్య్రాశ్చ సర్వ ఏవ మహారథాః ।
స్వరాష్ట్రే విహరిష్యంతి సుఖం సుమనసః సదా ॥ 14
కుంతీ! నీపుత్రులు, మాద్రికుమారులు, అందరూ మహారథులే అందరూ తమదైనదేశంలో ఎల్లవేళలా దేవతల్లాగా సుఖంగా విషరిస్తారు. (చక్కని మనసుతో విహరిస్తారు) (14)
యక్ష్యంతి చ నరవ్యాఘ్రాః నిర్జిత్య పృథివీమిమామ్ ।
రాజసూయాశ్వమేధాద్యైః క్రతుభిర్భూరిదక్షిణైః ॥ 15
ఈ పురుషశ్రేష్ఠులు భూమండలాన్నంతటినీ జయించడమే కాకుండా, రాజసూయ అశ్వమేధాదియాగాలను చేస్తారు. ఆ యాగాల్లో భూరిదక్షిణలను సమర్పిస్తారు. (15)
అనుగృహ్య సుహృద్వర్గం భోగైశ్వర్యసుఖేన చ ।
పితృపైతామహం రాజ్యం ఇమే భోక్ష్యంతి తే సుతాః ॥ 16
ఈ నీకుమారులు, తమ తమ మిత్రవర్గాలను అనుగ్రహిస్తారు. సమస్తభోగాలను, అధికారాలను, సుఖాలను అనుభవిస్తారు. తాతముత్తాతల నుండి వచ్చిన ఈ రాజ్యాన్ని అనుభవిస్తారు. (16)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా నివేశ్యైనాన్ బ్రాహ్మణస్య నివేశనే ।
అబ్రవీత్ పాండవశ్రేష్ఠం ఋషిర్ద్వైపాయనస్తదా ॥ 17
వైశంపాయనుడన్నాడు. రాజా! ఈ విధంగా చెప్పి వేదవ్యాసుడు, పాండవులను ఒక బ్రాహ్మణుని ఇంటిలో నివసింపచేసి, యుధిష్ఠిరునితో ఇలా అన్నాడు. (17)
ఇహ మాసం ప్రతీక్షధ్వం ఆగమిష్యామ్యహం పునః ।
దేశకాలౌ విదిత్వైవ లప్స్యధ్వం పరమాం ముదమ్ ॥ 18
ఇక్కడ ఒక్క మాసంపాటు గడపండి. నేను మళ్ళీవస్తాను. దేశకాలాలు తెలిసికొని జీవిస్తూ పరమానందాన్ని పొందండి. (18)
స తైః ప్రాంజలిభిః సర్వైః తథేత్యుక్తో నరాధిప ।
జగామ భగవాన్ వ్యాసో యథాగతమృషిః ప్రభుః ॥ 19
రాజా! పాండవులందరూ చేతులు జోడించి, వ్యాసుడు చెప్పినదానికి సమ్మతించారు. సమర్ధుడు, భగవానుడైన వ్యాసమహర్షి ఎలా వచ్చాడో అలాగే తిరిగి వెళ్ళిపోయాడు. (19)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి హిడింబవధ పర్వణి ఏకచక్రాప్రవేశే వ్యాసదర్శనే పంచపంచాశదధికశతతమోఽధ్యాయః ॥155॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున హిడింబవధ పర్వమను ఉపపర్వమున ఏకచక్రాపురప్రవేశము వ్యాససందర్శనము అను మాట యేబది అయిదవ అధ్యాయము. (155)