147. నూట నలుబది ఏడవ అధ్యాయము
లాక్షాగృహదహనము - పాండవులు సురంగము ద్వారా తప్పించుకొనుట.
వైశంపాయన ఉవాచ
తాంస్తు దృష్ట్వా సుమనసః పరిసంవత్సరోషితాన్ ।
విశ్వస్తానివ సంలక్ష్య హర్షం చక్రే పురోచనః ॥ 1
పురోచనే తథా హృష్టే కౌంతేయోఽథ యుధిష్ఠిరః ।
భీమసేనార్జునౌ చోభౌ యమౌ ప్రోవాచ ధర్మవిత్ ॥ 2
వైశంపాయనుడిలా అన్నాడు. దాదాపు సంవత్సరకాలం పాండవులు అక్కడ నివసించారు. వారందరూ తనను నమ్ముతున్నారని భావించి పురోచనుడు పరమానందపడ్డాడు. పురోచనుడావిధంగా సంతోషిస్తుండగా, ధర్మవిదుడు, కుంతీపుత్రుడు అయిన యుధిష్ఠిరుడు భీమార్జున నకుల సహదేవులతో ఇలా అన్నాడు. (1,2)
అస్మానయం సువిశ్వస్తాన్ వేత్తి పాపః పురోచనః ।
వంచితోఽయం నృశంసాత్మా కాలం మన్యే పలాయనే ॥ 3
పాపాత్ముడైన పురోచనుడు, మనం వానిని పరిపూర్ణంగా నమ్మినట్లు తలుస్తున్నాడు. ఈ నీచుడు చక్కగా మోసగింపబడ్డాడు. ఇది మనం పారిపోవటానికి తగిన కాలం అనుకొంటున్నాను. (3)
ఆయుధాగారమాదీప్య దగ్ధ్వా చైవ పురోచనమ్ ।
షట్ ప్రాణినో నిధాయేహ ద్రవామోఽనభిలక్షితాః ॥ 4
ఆయుధాగారాన్ని (ఇంటిని), పురోచనుని కూడా తగులబెట్టి ఆరుగురిని ఈ ఇంటిలో ఉంచి, ఎవరూ గుర్తించకుండా మనం పారిపోదాము. (4)
అథ దానాపదేశేన కుంతీ బ్రాహ్మణభోజనమ్ ।
చక్రే నిశి మహారాజ ఆజగ్ముస్తత్ర యోషితః ॥ 5
తా విహృత్య యథాకామం భుక్త్వా పీత్వా చ భారత ।
జగ్ముర్నిశి గృహానేవ సమనుజ్ఞాప్య మాధవీమ్ ॥ 6
మహారాజా! తర్వాత ఒకరాత్రి దానం నెపంగా కుంతి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టింది. అప్పుడు అక్కడకు అనేక మంది స్త్రీలు వచ్చారు. భారతా! వారందరూ స్వేచ్ఛగా తిని, తాగి రాత్రి కుంతి అనుమతితో తమ తమ ఇళ్ళకు చేరుకొన్నారు. (5-6)
నిషాదీ పంచపుత్రా తు తస్మిన్ భోజ్యే యదృచ్ఛయా ।
అన్నార్థినీ సమభ్యాగాత్ సపుత్రా కాలచోదితా ॥ 7
సా పీత్వా మదిరాం మత్తా సపుత్రా మదవిహ్వలా ।
సహ సర్వైస్సుతై రాజన్ తస్మిన్నేవ నివేశనే ॥ 8
సుష్వాప విగతజ్ఞానా మృతకల్పా నరాధిప ।
అథ ప్రవాతే తుములే నిశి సుప్తే జనే తదా ॥ 9
తదుపాదీపయద్భీమః శేతే యత్ర పురోచనః ।
తతో జతుగృహద్వారం దీపయామాస పాండవః ॥ 10
ఆ విందుభోజనానికి తన ఐదుగురు కుమారులతో కలిసి, ఒక బోయస్త్రీ అన్నం కోసం కాలచోదితురాలై వచ్చింది. ఆమె తన కుమారులతో కూడి మద్యాన్ని అతిగా సేవించింది. మత్తుచే వివశురాలై శరీర స్పృహలేనిదై ఆ గృహంలోనే నిద్రించింది. వారందరూ చచ్చిన వారి వలె పడి ఉన్నారు. జనమంతా నిద్రించిన ఆ సమయంలో పెద్ద సుడిగాలి వీచింది. అప్పుడు భీముడు పురోచనుడు నిద్రించిన ఇంటికి ముందుగా నిప్పుపెట్టాడు. తర్వాత లక్క ఇంటి ద్వారానికీ నిప్పంటించాడు. (7-10)
సమంతతో దదౌ పశ్చాత్ అగ్నిం తత్ర నివేశనే ।
జ్ఞాత్వా తు తత్ గృహం సర్వమ్ ఆదీప్తం పాండునందనాః ॥ 11
సురంగాం వివిశుస్తూర్ణం మాత్రా సార్ధమరిందమాః ।
తతః ప్రతాపస్సుమహాన్ శబ్దశ్చైవ విభావసోః ॥ 12
ప్రాదురాసీత్తదా తేన బుబుధే స జనవ్రజః ।
తదవేక్ష్య గృహం దీప్తమ్ ఆహుః పౌరాః కృశాననాః ॥ 13
తర్వాత భీముడు, ఆ ఇంటికి అన్నివైపులా నిప్పు పెట్టాడు. ఆ ఇల్లు అన్నివైపుల నుండి కాలిపోతుండటం గమనించి - శత్రుహంతకులైన పాండవులు, తల్లితో కూడి వేగంగా సురంగంలోకి ప్రవేశించారు. తర్వాత పెద్ద పెద్ద మంటలు, కాలుతున్న శబ్దాలు అంతటా వ్యాపించాయి. అప్పుడు జన సమూహమంతా మేల్కొంది. కాలుతున్న ఇంటిని చూచి దీనమైన ముఖాలతో పురజనులు ఈ విధంగా అన్నారు. (11-13)
పౌరా ఊచుః
దుర్యోధనప్రయుక్తేన పాపేనాకృతబుద్ధినా ।
గృహమాత్మవినాశాయ కారితం దాహితం చ తత్ ॥ 14
అహో ధిక్ ధృతరాష్ట్రస్య బుద్ధిర్నాతిసమంజసా ।
యః శుచీన్ పాండుదాయాదాన్ దాహయామాస శత్రువత్ ॥ 15
పౌరులన్నారు. బుద్దిహీనుడు, పాపాత్ముడు ఐన పురోచనుడు దుర్యోధనుని ప్రేరణతో ఈ ఇంటిని నిర్మించాడు. తగులబెట్టాడు. ఇది అతడి నాశనం కోసమే జరిగింది. అయ్యో! ధృతరాష్ట్రునికి మంచిబుద్ధి కలుగలేదు. అతడు విశుద్ధులైన పాండుపుత్రులను శత్రువులనువలె తగులబెట్టించాడు. (14-15)
దిష్ట్యా త్విదానీం పాపాత్మా దగ్ధోఽయమతిదుర్మతిః ।
అనాగసః సువిశ్వస్తాన్ యో దదాహ నరోత్తమాన్ ॥ 16
పాపాత్ముడూ, దుర్బుద్ధి అయిన పురోచనుడు, ఏ పాపం తెలియని పాండవులను - తనను నమ్మిన నరశ్రేష్ఠులను - తగులబెట్టాడు. దైవవశాత్తు వీడు కూడా కాలిపోయాడు. (16)
వైశంపాయన ఉవాచ
ఏవం తే విలపంతి స్మ వారణావతకా జనాః ।
పరివార్య గృహం తచ్చ తస్థూ రాత్రౌ సమంతతః ॥ 17
వైశంపాయనుడిలా అన్నాడు. వారణావతంలోని జనులందరూ, ఆ రాత్రివేళ కాలిపోయిన ఇంటిచుట్టూ గుమిగూడి ఈ విధంగా విలపించారు. (17)
పాండవాశ్చాపి తే సర్వే సహ మాత్రా సుదుఃఖితాః ।
బిలేన తేన నిర్గత్య జగ్ముర్ద్రుతమలక్షితాః ॥ 18
పాండవులందరూ కూడా తల్లితో కూడి, మిక్కిలి దుఃఖిస్తూ ఆ సురంగం ద్వారా బయటకు వచ్చి, ఎవరూ గుర్తుపట్టకుండా వెళ్ళిపోయారు. (18)
తేన నిద్రోపరోధేన సాధ్వసేన చ పాండవాః ।
న శేకుః సహసా గంతుం సహ మాత్రా పరంతపాః ॥ 19
శత్రుమర్దనులైన పాండవులు నిద్రలేక పోవటం చేత, తడబాటు వల్ల, తల్లితో కూడి వేగంగా ప్రయాణించ లేకపోయారు. (19)
భీమసేనస్తు రాజేంద్ర భీమవేగపరాక్రమః ।
జగామ భ్రాతౄనాదాయ సర్వాన్ మాతరమేవ చ ॥ 20
స్కంధ మారోప్య జననీమ్ యమావంకేన వీర్యవాన్ ।
పార్థౌ గృహీత్వా పాణిభ్యాం భ్రాతరౌ సుమహాబలః ॥ 21
రాజోత్తమా! భయంకరమైన వేగమూ, పరాక్రమమూ కల భీమసేనుడు మాత్రం తల్లినీ, సోదరులందరినీ మోసుకొనిపోయాడు. ఆ మహాబలుడు తల్లిని భుజం మీద, కవలలను తొడలమీద, యుధిష్ఠిరార్జునులను చేతుల మీద ఎక్కించుకుని అందరినీ మోసుకుపోయాడు. (20-21)
ఉరసా పాదపాన్ భంజన్ మహీం పద్భ్యాం విదారయన్ ।
స జగామాశు తేజస్వీ వాతరంహా వృకోదరః ॥ 22
పరాక్రమశాలి, వాయువేగం కల వృకోదరుడు తన రొమ్ముతో చెట్లను విరుస్తూ, పాదాలతో భూమిని చీలుస్తూ అమితవేగంతో ప్రయాణం సాగించాడు. (22)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి జతుగృహపర్వణి జతుగృహదాహే సప్తచత్వారింశదధిక శతతమోఽధ్యాయః ॥147॥
ఇది శ్రీ మహాభారతమున ఆదిపర్వమున జతుగృహపర్వమను ఉపపర్వమున జతుగృహదహనమను నూటనలుబది ఏడవ అధ్యాయము. (147)