145. నూటనలువది అయిదవ అధ్యాయము
పాండవులు లక్క యింట ప్రవేశించుట.
వైశంపాయన ఉవాచ
తతః సర్వాః ప్రకృతయః నగరాద్ వారణావతాత్ ।
సర్వమంగలసంయుక్తాః యథాశాస్త్రమతంద్రితాః ॥ 1
శ్రుత్వాఽఽగతాన్ పాండుపుత్రాన్ నానాయానైః సహస్రశః ।
అభిజగ్ముర్నరశ్రేష్ఠాన్ శ్రుత్వైవ పరయా ముదా ॥ 2
వైశంపాయనుడిలా అన్నాడు. పాండవులు వస్తున్నారనే వార్తను విన్న వారణావతపుర ప్రముఖులు సర్వమంగళ వాద్యాలతో మంగళద్రవ్యాలతో అలసట విడిచి, అనేక విధాలైన వాహనాల్లో వచ్చి శాస్త్రప్రకారం పాండవులకు ఎదురేగారు. వారణావతం నుండి వచ్చిన పురజనులు పాండవులను చూచి పరమానందపడ్డారు. వారంతా అక్కడకు వేల సంఖ్యలో వచ్చారు. (1, 2
తే సమాసాద్య కౌంతేయాన్ వారణావతకా జనాః ।
కృత్వా జయాశిషః సర్వే పరివార్యావతస్థిరే ॥ 3
వారణావతం నుండి వచ్చిన పురప్రముఖులు పాండవులను సమీపించి, జయ జయ ధ్వానాలు చేస్తూ, ఆశీస్సులనందిస్తూ, వారి చుట్టూ గుమిగూడారు. (3)
తైర్వృతః పురుషవ్యాఘ్రాః ధర్మరాజో యుధిష్ఠిరః ।
విబభౌ దేవసంకాశః వజ్రపాణిరివామరైః ॥ 4
పురప్రముఖలతో కూడిన పురుష శ్రేష్ఠుడు, ధర్మప్రభువు, యుదిష్ఠిరుడు, దేవతలతో పరివేష్టింపబడిన దేవేంద్రుని వలె దివ్యంగా ప్రకాశించాడు. (4)
సత్కృతాశ్చైవ పౌరైస్తే పౌరాన్ సత్కృత్య చానఘ ।
అలంకృతం జనాకీర్ణం వివిశుర్వారణావతమ్ ॥ 5
జనమేజయా! పాండవులు పురప్రముఖులచే సన్మానింపబడ్డారు. పాండవులు కూడా పురప్రముఖులను గౌరవించారు. తర్వాత వారందరూ సాలంకృతమై జనగణాలతో నిండిన వారణావత నగరంలోకి ప్రవేశించారు. (5)
తే ప్రవిశ్య పురీం వీరాః తూర్ణం జగ్మురథో గృహాన్ ।
బ్రాహ్మణానాం మహీపాల రతానాం స్వేషు కర్మసు ॥ 6
జనమేజయా! పాండవులు, వారణావతంలో ప్రవేశించి, వెంటనే తమ తమ ధార్మిక క్రియాకలాపాల్లో నిమగ్నులైన బ్రాహ్మణోత్తముల ఇళ్ళను సందర్శించారు. (6)
నగరాధికృతానాం చ గృహాణి రథినాం తదా ।
ఉపతస్థుర్నరశ్రేష్ఠాః వైశ్య శూద్రగృహాణ్యపి ॥ 7
రాజా! నరశ్రేష్ఠులయిన పాండవులు క్రమంగా నగారాధికారుల ఇళ్ళనూ, రథిక యోధుల ఇళ్ళనూ, వైశ్యుల, శూద్రుల ఇళ్ళనూ కూడా సందర్శించారు. (7)
అర్చితాశ్చ నరైః పౌరైః పాండవా భరతర్షభ ।
జగ్మురావసథం పశ్చాత్ పురోచనపురస్సరాః ॥ 8
భారతశ్రేష్ఠా! పాండవులందరూ పురప్రముఖుల పూజలందుకొని పురోచనునితో కూడి, తమకు నివాసమైన ఇంటివద్దకు వెళ్ళారు. (8)
తేభ్యో భక్ష్యాణి పానాని శయనాని శుభాని చ ।
ఆసనాని చ ముఖ్యాని ప్రదదౌ స పురోచనః ॥ 9
పురోచనుడు వారందరికీ తినుబండారాలను, పానీయాలను, శ్రేష్ఠమైన ఆసనాలను, అందమైన తల్పాలను, సమకూర్చాడు. (9)
తత్ర తే సత్కృతా స్తేన సుమహార్హపరిచ్ఛదాః ।
ఉపాస్యమానాః పురుషైః ఊషుః పురనివాసిభిః ॥ 10
రాజా! పాండవులు పురోచనునిచే సన్మానింపబడ్డారు. విలువైన వస్తువులనుపయోగించే పాండవులు నగర జనులచే సేవింపబడి అక్కడ సుఖంగా కాలక్షేపం చేశారు. (10)
దశరాత్రోషితానాం తు తత్ర తేషాం పురోచనః ।
నివేదయామాస గృహం శివాఖ్యమశివం తదా ॥ 11
పాండవులు అక్కడే పదిరోజులు గడిపారు. పదకొండవ రోజున పురోచనుడు 'శివ'మనే పేరు గల అశుభంకరమైన ఇంటిని గూర్చి పాండవులకు నివేదించాడు. (11)
తత్ర తే పురుషవ్యాఘ్రాః వివిశుః సపరిచ్ఛదాః ।
పురోచనస్య వచనాత్ కైలాసమివ గుహ్యకాః ॥ 12
పురోచనుడు చెప్పిన మాటల్ని అనుసరించి, పురుషశ్రేష్ఠులైన పాండవులు తమ సంభారాలన్నిటితోను, గుహ్యకులు కైలాసాన్ని ప్రవేశించినట్లు ఆ కొత్త ఇంటిలో ప్రవేశించారు. (12)
తచ్చాగారమభిప్రేక్ష్య సర్వధర్మభృత్వాం వరః ।
ఉవాచాగ్నేయ మిత్యేవం భీమసేనం యుధిష్ఠిరః ॥ 13
సమస్త ధర్మాలనూ ఆచరించే వాళ్ళలో శ్రేష్ఠుడు యుధిష్ఠిరుడు. ఆ కొత్త ఇంటిని పరిశీలించి, ఇది అగ్ని గృహమని (తగలబడే స్వభావం కల వస్తువులతో నిర్మించబడ్డ ఇల్లు) భీమ సేనునికి చెప్పాడు. (13)
జిఘ్రాణోఽస్య వసాగంధం సర్పిర్జతువిమిశ్రితమ్ ।
కృతం హి వ్యక్త మాగ్నేయమ్ ఇదం వేశ్మ పరంతప ॥ 14
భీమసేనా! నెయ్యి లక్కలతో కలగలిసిన కొవ్వు వాసనను పరిశీలిస్తే, ఇది మండే లక్షణాలు గల గృహంగా తెలిసిపోతోంది అన్నాడు యుధిష్ఠిరుడు. (14)
శణసర్జరసంవ్యక్తమ్ ఆనీయ గృహకర్మణి ।
ముంజబల్వవంశాది ద్రవ్యం సర్వం ఘృతోక్షితమ్ ॥ 15
శిల్పిభిః సుకృతం హ్యాప్తైః వినీతైర్వేశ్మకర్మణి ।
విశ్వస్తం మామయం పాపః దగ్ధుకామః పురోచనః ॥ 16
తథా హి వర్తతే మందః సుయోధనవశే స్థితః ।
ఇమాం తు తాం మహాబుద్ధిః విదురో దృష్టవాంస్తథా ॥ 17
ఆపదం తేన మాం పార్థ స సంబోధితవాన్ పురా ।
తే వయం బోధితాస్తేన నిత్యమస్మద్ధితైషిణా ॥ 18
పిత్రా కనీయసా స్నేహాత్ బుద్ధిమంతోఽశివం గృహమ్ ।
అనార్యైః సుకృతం గూఢైః దుర్యోధనావశానుగైః ॥ 19
భీమసేనా! జనుము, గుగ్గిలం, వెదురు, గడ్డి, లక్క జమ్ములాంటి ద్రవ్యాలను నేతితో తడిపి ఈ గృహాన్ని నిర్మించారు. ఈ గృహనిర్మాణ శిల్పులు నిర్మాణ కళలో ఆరితేరిన వారు. పురోచనునికి పరమాప్తులు వారు. దీన్ని చాలా నేర్పుగా నిర్మించారు. సుయోధనుని వశవర్తియైన పాపాత్ముడీ పురోచనుడు నమ్మిన నన్ను అగ్నితో బూడిద చేయాలని సంకల్పంచాడు. పార్థా! ఈ విషయాన్ని ఆపదను ముందే గ్రహించిన మహాబుద్ధి విదురుడు, ముందుగానే నన్నీవిషయంలో హెచ్చరించాడు. ఎల్లవేళలా మన యోగక్షేమాలు కోరేవాడు విదురుడు. దుర్యోధన విధేయులై రహస్యంగా సంచరించే దుర్మార్గులు ఈ గృహాన్ని నిర్మించారు. (15-19)
భీమసేన ఉవాచ
యదీదం గృహమాగ్నేయం విహితం మన్యతే భవాన్ ।
తత్రైవ సాధు గచ్ఛామః యత్ర పూర్వోషితా వయమ్ ॥ 20
భీమసేనుడిలా అన్నాడు. యుధిష్ఠిరా! ఈ ఇల్లు అగ్ని సంబంధమైనదిలా నీవు భావిస్తే, మనం దీన్ని వదలి పూర్వం మనం నివసించిన ఇంటిలోకి వెళ్ళి ఉందాం! (20)
యుధిష్ఠిర ఉవాచ
ఇహ యత్తైర్నిరాకారైః వస్తవ్యమితి రోచయే ।
అప్రమత్తైర్విచిన్వద్భిః గతిమిష్టాం ధ్రువామితః ॥ 21
యుధిష్ఠిరుడిలా అన్నాడు. మనం ఇక్కడే నివసించాలని నాకు అనిపిస్తోంది. అయితే మనం దీన్ని అనుమానిస్తున్నట్లు తెలియకూడదు. అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రదేశం నుండి మనకిష్టమైన ప్రాంతానికి చేరుకోవడానికి మనం మార్గాన్ని అన్వేషిస్తూ ఉండాలి. (21)
యది విందేత చాకారం అస్మాకం స పురోచనః ।
క్షిప్రకారీ తతో భూత్వా ప్రదహ్యాదపి హేతుతః ॥ 22
మన ఆకారంలో అనుమానం కన్పిస్తే, ఆ పురోచనుడు, తొందరపాటుతో అనుకొన్న దానికంటే ముందుగానే, ఏదో ఒక వంకతో ఇంటిని తగల పెట్టవచ్చు. (22)
నాయం బిభేత్యుపక్రోశాత్ అధర్మాద్వా పురోచనః ।
తథా హి వర్తతే మందః సుయోధనవశే స్థితః ॥ 23
ఈ పురోచనుడు ధర్మానికి భయపడేవాడుకాదు, నిందకు వెరచేవాడు కాదు. ఈ మూర్ఖుడు సుయోధనుని అదుపులో ఉన్నాడు, కనుక ఏమి చెయ్యటానికైనా వెనుదీయడు. (23)
అపి చేహ ప్రదగ్ధేషు భీష్మోఽస్మాసు పితామహః ।
కోపం కుర్యాత్ కిమర్థం వా కౌరవాన్ కోపయీత సః ॥ 24
మనం ఇచట దహింపబడితే, తాతగారు భీష్ముడు కౌరవుల మీద కోపం చూపిస్తాడు. అలా కాకపోతే, తాతగారికి కౌరవుల మీద కోపం ఎందుకు కలుగుతుంది? (24)
అథవాపీహదగ్దేషు భీష్మోఽస్మాకం పితామహః ।
ధర్మ ఇత్యేవ కుప్యేరన్ యే చాన్యే కురుపుంగవాః ॥ 25
మనం ఈ లక్క యింటిలో తగల బడితే తాతగారు భీష్ముడు, ఇతర కురుప్రముఖులు, తమ ధర్మంగా భావించి, కౌరవుల మీద కోపాన్ని చూపుతారు. (25)
వయం తు యది దాహస్య బిభ్యతః ప్రదవేమహి ।
స్పశైర్నిర్ఘాతయేత్ సర్వాన్ రాజ్యలుబ్ధః సుయోధనః ॥ 26
మనం ఒకవేళ గృహదహనానికి భయపడి, బహిరంగంగా పారిపోతే, రాజ్యమోహమున్న దుర్యోధనుడు మనను గూఢ చారుల ద్వారా రహస్యంగా చంపించే ప్రయత్నాలు చేయవచ్చు. (26)
అపదస్థాన్ పదే తిష్ఠన్ అపక్షాన్ పక్షసంస్థితః ।
హీనకోశాన్ మహాకోశః ప్రయోగైర్ఘాతయేద్ ధ్రువమ్ ॥ 27
అధికారం, అనుయాయులు, ధనబలం ఉన్న సుయోధనుడు, ఆపదల్లో ఉన్న, అనుయాయులులేని, ధనరహితులైన మనను వివిధోపాయాలతో నిశ్చయంగా చంపించి తీరుతాడు. (27)
తదస్మాభిరియం పాపం తం చ పాపం సుయోధనమ్ ।
వంచయద్భిర్నివస్తవ్యం ఛన్నావాసం క్వచిత్ క్వచిత్ ॥ 28
అందువల్ల ఈ పాపి పురోచనుని, ఆ దుర్మార్గుడు సుయోధనుని, మోసగిస్తూ ఇక్కడే నివసించాలి. రహస్యంగా అక్కడక్కడ మరొక నివాసాన్ని ఆశ్రయించాలి. (28)
తే వయం మృగయాశీలాః చరామ వసుధామిమామ్ ।
తథా నో విదితా మార్గాః భవిష్యంతి పలాయతామ్ ॥ 29
కనుక మనం వేటకోసంగా భూమండలంలో సంచరిస్తూ ఉండాలి. అప్పుడు మనకు ఎక్కడ నుండి ఎక్కడకు ప్రయాణించాలన్నా అనేక మార్గాలు తెలుస్తాయి. ఆ మార్గాలు, మనం ఇక్కడ నుండి బయటపడటానికి ఉపయోగపడతాయి. (29)
భౌమం చ బిలమద్వైవ కరవామ సుసంవృతమ్ ।
గూఢశ్వాసాన్న నస్తత్ర హుతాశః సంప్రధక్ష్యతి ॥ 30
కనుక మనం భూమిలో సురక్షితమైన ఒక సొరంగాన్ని తయారు చేసుకొందాము. అక్కడ ఊపిరాడటానికి తగిన అవకాశం ఏర్పాటు చేసుకొందాం. అప్పుడు ఈ లక్క ఇల్లు తగలపడినా అగ్నిబాధ మనకు ఉండదు. (30)
వసతో-త్ర యథాచాస్మాన్ న బుధ్యేత్ పురోచనః ।
పౌరోవాపి జనః కశ్చిత్ తథా కార్యమతంద్రితైః ॥ 31
మనం ఈ పనిని రహస్యంగా సాగించాలి, పురోచనుడు కానీ, ఇతర పౌరులు కాని ఈ విషయాన్ని ఎంత మాత్రం గ్రహించకుండా ఉండేటట్లు మనం అప్రమత్తులుగా ఉండాలి. (31)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి జతుగృహపర్వణి భీమసేనయుధిష్ఠిరసంవాదే పంచచత్వారింశదధిక శతతమోఽధ్యాయః ॥145॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున జతుగృహపర్వమను ఉపపర్వమున భీమసేనయుధిష్ఠిర సంవాదమను నూటనలువది అయిదవ అధ్యాయము. (145)