143. నూటనలువది మూడవ అధ్యాయము

పురోచనుడు వారణావతమున లక్క ఇల్లు నిర్మించుట.

వైశంపాయన ఉవాచ
ఏవముక్తేషు రాజ్ఞా తు పాండుపుత్రేషు భారత ।
దుర్యోధనః పరం హర్షమ్ అగచ్ఛత్ స దురాత్మవాన్ ॥ 1
స పురొచనమేకాంతమ్ ఆనీయ భరతర్షభ ।
గృహీత్వా దక్షిణే పాణౌ సచివం వాక్యమబ్రవీత్ ॥ 2
మమేయం వసుసంపూర్ణా పురోచన వసుంధరా ।
యథేయం మమ తద్వత్ తే స తాం రక్షితుమర్హసి ॥ 3
న హి మే కశ్చిదన్యోఽస్తి విశ్వాసికతరస్త్వయా ।
సహాయో యేన సంధాయ మంత్రయేయం యథా త్వయా ॥ 4
ధృతరాష్ట్రుడు పాండుకుమారులకీవిధంగా చెప్పగానే, దుర్మార్గుడైన దుర్యోధనుడు పరమానందాన్ని పొందాడు. దుర్యోధనుడు తన మంత్రియైన పురోచనుని ఏకాంతప్రదేశానికి తీసుకు వెళ్ళి, అతని కుడి చేయి పట్టుకొని, ఇలా అన్నాడు. పురోచనా! ధనధాన్యాలతో తులతూగుతున్న ఈ భూమండలం నాకు సొంతమైనట్లే నీకూ సొంతం అవుతుంది. కనుక దీన్ని మనం జాగ్రత్తగా రక్షించుకోవాలి. నాకు నీఅంత విశ్వాసపాత్రుడు మరొకడు లేడు. కనుకనే నీతో ఇంత ముఖ్యమైన విషయాన్ని సంప్రదిస్తున్నాను. నీ సహాయాన్ని అర్థిస్తున్నాను. (1-4)
సంరక్ష తాత మంత్రం చ సపత్నాంశ్చ మమోద్ధర ।
నిపుణెనాభ్యుపాయేన యద్ బ్రవీమి తథా కురు ॥ 5
పురోచనా, నారహస్యాన్ని రక్షించు. నా శత్రువులను నాశనం చెయ్యి. నేను చెప్పిన దాన్ని నీవు నేర్పుగా సాధించాలి. (5)
పాండవా ధృతరాష్ట్రేణ ప్రేషితా వారణావతమ్ ।
ఉత్సవే విహరిష్యంతి ధృతరాష్ట్రస్య శాసనాత్ ॥ 6
ధృతరాష్ట్రుని చేత పాండవులు వారణావతానికి పంపబడ్డారు. ధృతరాష్ట్రుని ఆజ్ఞ మేరకు అచట ఉత్సవాల్లో వారు విహరిస్తారు. (6)
స త్వం రాసభయుక్తేన స్యందనేనాశుగామినా ।
వారనావతమద్వైవ యథా యాసి తథా కురు ॥ 7
కంచర గాడిదలను పూన్చి వేగంగా పయనించే రథం ఎక్కి, నేడే వారణావతం చేరుకునేటట్లు ప్రయాణం సాగించు. (7)
తత్ర గత్వా చతుఃశాలం గృహం పరమసంవృతమ్ ।
నగరోపాంతమాశ్రిత్య కారయేథా మహాధనమ్ ॥ 8
అక్కడకు వెళ్ళి, నాల్గువైపులా గదులు కల్గిన సురక్షితమైన ఒక గృహాన్ని కట్టించు. అది నగరానికి సమీపంలో ఉండాలి, ఎంత ఖర్చు చేసినాసరే, మిక్కిలి అందంగా ఉండాలి. (8)
శణసర్జరసాదీని యాని ద్రవ్యాణి కానిచిత్ ।
ఆగ్నేయామ్యత సంతీహ తాని తత్ర ప్రదాపయ ॥ 9
జనుము, మద్ది చెట్టు జిగురు మొదలైన తేలికగా మండే స్వభావం ఉన్న ద్రవ్యాల నన్నిటినీ ఆ భవననిర్మాణంలో ఉపయోగించు. (9)
సర్పిస్తైలవసాభిశ్చ లాక్షయా చాప్యనల్పయా।
మృత్తికాం మిశ్రయిత్వా త్వం లేపం కుడ్యేషు దాపయ ॥ 10
నెయ్యి, నూనె, కొవ్వు, లక్క వంటి వస్తువులను అధికంగా ఉపయోగించి, వాటిని మట్టిలో కలగలిపి గోడలన్నిటి తయారీకి, పైపూతలకు ఉపయోగించు. (10)
శణం తైలం ఘృతం చైవ జతు దారూణి చైవ హి ।
తస్మిన్ వేశ్మని సర్వాణి నిక్షిపేథాః సమంతతః ॥ 11
యథా చ తన్నపశ్యేరన్ పరీక్షంతోఽపి పాండవాః ।
ఆగ్నేయమితి తత్కార్యమ్ అపి చాన్యేఽపి మానవాః ॥ 12
వేశ్మన్యేవం కృతే తత్ర గత్వా తాన్ పరమార్చితాన్ ।
వాసయేథాః పాండవేయాన్ కుంతీం చ ససుహృజ్జనామ్ ॥ 13
ఆగృహం అంతటా ఎక్కడ పట్టినా, జనుము, నూనె, నెయ్యి, లక్క, చెక్కలు మొదలైన మండే వస్తువులే ఉండేటట్టు చూడు. పాండవులుకానీ, ఇతరులుకానీ ఎంతపరీక్షించినా, ఆ ఇల్లు తగలబడే వస్తువులతో తయారు అయినట్లు తెలియకుండా కట్టించు. అలా కట్టించిన ఇంటిలో పాండవులు, కుంతి బంధు మిత్రులతో కూడి, నివసించే విధంగా ప్రణాళికను సిద్ధం చేయాలి. వారందరినీ నీ సపర్యలతో నమ్మింపచేయాలి. (11-13)
ఆసనాని చ దివ్యాని యానాని శయనాని చ ।
విధాతవ్యాని పాండూనామ్, యథా తుష్యేత వై పితా ॥ 14
యథా చ తన్నజానంతి నగరే వారనావతే ।
తథా సర్వం విధాతవ్యం యావత్ కాలస్య పర్యయః ॥ 15
ఆ భవనంలో కుర్చీలు, ప్రయాణసాధనాలు, తల్పాలు అన్నీ దివ్యంగా ఉండాలి. వాటిని గూర్చి విన్న నా తండ్రి పరమానందపడాలి. పాండవులు సంతోషించాలి. వారణావతనగరం లోని ప్రజలు, ఎంత మాత్రం దీన్ని గమనించ కుండా ఉండేవిధంగా పని అంతా సాగిపోవాలి, ఇదంతా అనుకున్న సమయానికి పూర్తి కావాలి. (14,15)
జ్ఞాత్వా చ తాన్ సువిశ్వస్తాన్ శయానానకుతోభయాన్ ।
అగ్నిస్త్వయా తతో దేయః ద్వారతస్తస్య వేశ్మనః ॥ 16
పాండవులు నిన్ను పరిపూర్ణంగా నమ్మిన తరువాత, వారందరూ నిర్భయంగా నిద్రించి ఉన్న సమయంలో, అన్ని ద్వారాల నుండీ లోనికి ప్రవేశించేవిధంగా నీవు ఆ ఇంటికి నిప్పు పెట్టాలి. (16)
దహ్యమానే స్వకే గేహే దగ్ధా ఇతి తతో జనాః ।
న గర్హయేయురస్మాన్ వై పాండవార్థాయ కర్హిచిత్ ॥ 17
జనులందరూ, ప్రమాదవశాత్తు పాండవులు సొంత ఇంటిలో అగ్నికి ఆహుతయ్యారని భావించాలి. పాండవుల ఆపదలో మన ప్రమేయం ఉన్నట్లు ఎవరూ భావించరాదు. మనను అసహ్యించుకోరాదు. (17)
స తథేతి ప్రతిజ్ఞాయ కౌరవాయ పురోచనః ।
ప్రాయాద్ రాసభయుక్తేన స్యందనేనాశుగామినా ॥ 18
పురోచనుడు అలానే చేస్తానని దుర్యోధనుని ముందు శపథం చెసి, కంచర గాడిదలు పూన్చిన వేగవంతమైన రథం ఎక్కి వారణావతం వెళ్ళాడు. (18)
స గత్వా త్వరితమ్ రాజన్ దుర్యోధనమతే స్థితః ।
యథోక్తం రాజపుత్రేణ సర్వం చక్రే పురోచనః ॥ 19
ఆపురోచనుడు, దుర్యోధనుని వ్యూహం ప్రకారం చెప్పింది చెప్పినట్లు అంతటిని పూర్తిచేశాడు. (19)
ఇతి శ్రీ మహాభారతే ఆదిపర్వణి జతుగృహపర్వణి పురోచనోపదేశే త్రిచత్వారింశదధికశతతమోఽధ్యాయః ॥143॥
ఇది శ్రీ మహాభారతమున ఆదిపర్వమున జతుగృహపర్వమను ఉపపర్వమున పురోచనోపదేశమను నూటనలువదిమూడవ అధ్యాయము. (143)