132. నూట ముప్పది రెండవ అధ్యాయము
అర్జునుడు బ్రహ్మశిరోనామకాస్త్రమును పొందుట.
వైశంపాయన ఉవాచ
తతో ధనంజయం ద్రోణః స్మయమానోఽభ్యభాషత ।
త్వయేదానీం ప్రహర్తవ్యమ్ ఏతల్లక్ష్యం విలోక్యతామ్ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. ఆ తరువాత ద్రోణుడు నవ్వుతూ అర్జునునితో ఇలా అన్నాడు - ఇప్పుడు నీవు భేదించాలి. లక్ష్యానికి గురిపెట్టు. (1)
మద్వాక్యసమకాలం తే మోక్తవ్యోఽత్ర భవేచ్ఛరః ।
వితత్య కార్ముకం పుత్ర తిష్ఠ తావన్ముహూర్తకమ్ ॥ 2
నేను చెప్పిన వెంటనే నీవు బాణాన్ని వదలాలి. నాయనా! ధనస్సు నాకర్షించి క్షణకాలం నిలువు. (2)
ఏవముక్తః సవ్యసాచీ మండలీకృతకార్ముకః ।
తస్థౌ భాసం సముద్దిశ్య గురువాక్యప్రచోదితః ॥ 3
ద్రోణుడిలా చెప్పగానే గురువాక్యప్రేరణతో అర్జునుడు ధనస్సును గోలాకారంగా లాగి గ్రద్దకు గురిపెట్టి నిలిచాడు. (3)
ముహూర్తాదివ తం ద్రోణః తథైవ సమభాషత ।
పశ్యస్యేనం స్థితం భాసం ద్రుమం మామపి చార్జున ॥ 4
క్షణకాలం తర్వాత ద్రోణుడు అంతకుముందు వలెనే 'ఆ గ్రద్దనూ, నన్నూ, చెట్టునూ కూడా చూస్తున్నవా' అని అడిగాడు. (4)
పశ్యామ్యేకం భాసమితి ద్రోణం పార్థోఽభ్యభాషత ।
న తు వృక్షం భవంతం వా పశ్యామీతి చ భారత ॥ 5
"గ్రద్దను మాత్రమే చూస్తున్నాను. చెట్టును, కానీ తమరిని కానీ చూడటం లేదు" అని అర్జునుడు ద్రోణునితో అన్నాడు. (5)
తతః ప్రీతమనా ద్రోణః ముహూర్తాదివ తం పునః ।
ప్రత్యభాషత దుర్ధర్షః పాండవానాం మహారథమ్ ॥ 6
దానితో ద్రోణుని మనస్సు ప్రసన్నమైనది. క్షణకాలం తర్వాత దుర్ధర్షుడైన ఆద్రోణుడు పాండవులలో మహారథి అయిన అర్జునునితో మరలా ఇలా అన్నాడు. (6)
భాసం పశ్యపి యద్యేనం తథా బ్రూహి పునర్వచః ।
శిరః పశ్యామి భాసస్య న గాత్రమితి సోఽబ్రవీత్ ॥ 7
గ్రద్దను చూస్తున్నట్లయితే దాని శరీరమెలా ఉన్నదో చెప్పు. ఆ మాటవిని అర్జునుడు 'తలను మాత్రమే చూస్తున్నాను. శరీరం కనిపించటం లేదు' అన్నాడు. (7)
అర్జునేనైవముక్తస్తు ద్రోణో హృష్టతనూరహః ।
ముంచస్వేత్యబ్రవీత్ పార్థం స ముమోచావిచారయన్ ॥ 8
అర్జునుడు అలా అనగానే ఆనందంతో ద్రోణునకు శరీరం పులకించింది. 'బాణాన్ని వదులు' అని అర్జునుని ఆదేశించాడు. ఆలోచించకుండా అర్జునుడు బాణం వదిలాడు. (8)
తతస్తస్య నగస్థస్య క్షురేణ నిశితేన చ ।
శిర ఉత్కృత్య తరసా పాతయామాస పాండవః ॥ 9
ఆవిధంగా అర్జునుడు వాడి అయిన బాణంతో చెట్టుపైనున్న పక్షితలను వేగంగా ఖండించి నేలగూల్చాడు. (9)
తస్మిన్ కర్మణి సంసిద్ధే పర్యష్వజత పాండవమ్ ।
మేనే చ ద్రుపదం సంఖ్యే సానుబంధం పరాజితమ్ ॥ 10
ఆపని ముగియగానే అర్జునుని కౌగిలించుకొన్నాడు ద్రోణుడు. ద్రుపదుని అనుచరులతోపాటు అర్జునుడు యుద్ధంలో ఓడించగలడని విశ్వసించాడు. (10)
కస్యచిత్ త్వథ కాలస్య సశిష్యోంగిరసాంవరః।
జగామ గంగామభితః మజ్జితుం భరతర్షభ ॥ 11
భరతర్షభా! జనమేజయా! ఆ తర్వాత కొంతకాలానికి ద్రోణుడు శిష్యులతో కలిసి స్నానానికై గంగానదికి వెళ్ళాడు. (11)
అవగాఢమథో ద్రోణం సలిలే సలిలేచరః ॥
గ్రాహో జగ్రాహ బలవాన్ జంఘాంతే కాలచోదితః ॥ 12
ద్రోణుడు నీటిలో లోతుగా వెళ్ళిన తర్వాత నీటిలో తిరుగుతున్న ఒక బలిష్ఠమైన మొసలి కాలప్రభావంతో ద్రోణుని పిక్కను పట్టుకొన్నది. (12)
స సమర్థో-పి మోక్షాయ శిష్యాన్ సర్వా నచోదయత్ ।
గ్రాహం హత్వా మోక్షయధ్వం మామితి త్వరయన్నివ ॥ 13
ఆ ద్రోణుడు స్వయంగా తనను తాను విడిపించుకొనగలిగి కూడా 'మొసలిని చంపి నన్ను విడిపించండి'అని త్వరపెడుతూ శిష్యులందరినీ ఆదేశించాడు. (13)
తద్వాక్య సమకాలంతు బీభత్సుర్నిశితైః శరైః ।
అవార్యైః పంచభిర్గ్రాహం మగ్నమంభస్యతాడయత్ ॥ 14
ఆ మాట ముగియకముందే అర్జునుడు అయిదు తిరుగులేని వాడిబాణాలతో నీటమునిగి ఉన్న ఆ మొసలిని కొట్టాడు. (14)
ఇతరే త్వథ సమ్మూఢాః తత్ర తత్ర ప్రపేదిరే ।
తం తు దృష్ట్వా క్రియోపేతం ద్రోణోఽమన్యత పాండవమ్ ॥ 15
విశిష్టం సర్వశిష్యేభ్యః ప్రీతిమాంశ్చాభవత్ తదా ।
స పార్థబాణైర్బహుధా ఖండశః పరికల్పితః ॥ 16
గ్రాహః పంచత్వమాపేదే జంఘాం త్యక్త్వా మహాత్మనః ।
అథాబ్రవీన్మహాత్మానం భారద్వాజో మహారథమ్ ॥ 17
మిగిలిన శిష్యులంతా దిక్కుతోచక ఎక్కడి వారక్కడ నిలిచిపోయారు. అర్జునుడు సమయోచితంగా ప్రవర్తించటాన్ని చూసి ద్రోణుడు అర్జునుని సర్వోత్తమశిష్యునిగా భావించి ఆనందించాడు. ఆ మొసలి అర్జునుని బాణాల తాకిడికి ముక్కలు ముక్కలై ద్రోణుని పిక్కను వీడి మరణించింది. అప్పుడు ద్రోణుడు మహారథుడైన అర్జునునితో ఇలా అన్నాడు- (16,17)
గృహాణేదం మహాబాహో విశిష్టమతిదుర్ధరమ్ ।
అస్త్రం బ్రహ్మశిరో నామ సప్రయోగనివర్తనమ్ ॥ 18
మహాబాహూ! బ్రహ్మశిరోనామకమైన ఈ అస్త్రాన్ని ప్రయోగోపసంహారాలతోపాటు నీకిస్తున్నాను. స్వీకరించు. ఇది విశిష్టమైనది. దీనిని ధారణ చేయటం కూడా చాలా కష్టం. (18)
న చ తే మానుషేష్వేతత్ ప్రయోక్తవ్యం కథంచన ।
జగద్ వినిర్దహేదేతత్ అల్పతేజసి పాతితమ్ ॥ 19
ఎట్టి పరిస్థితులలోనూ దీనిని మానవులపై ప్రయోగించరాదు. అల్పతేజస్కుల మీద దీనిని ప్రయోగిస్తే ప్రపంచాన్నే దహించివేస్తుంది. (19)
అసామాన్యమిదం తాత లోకేష్వస్త్రం నిగద్యతే ।
తద్ ధారయేథాః ప్రయతః శృణు చేదం వచో మమ ॥ 20
నాయనా! లోకంలో ఇది అసాధారణమైన అస్త్రం. మనస్సునూ, ఇంద్రియాలనూ నిగ్రహించుకొని దీనిని ధారణచేయి. మరొక మాటవిను. (20)
బాధేతామానుషః శత్రుః యది త్వాం వీర కశ్చవ ।
తద్వధాయ ప్రయుంజీథాః తదస్త్రమిదమాహవే ॥ 21
వీరుడా! యుద్ధంలో మానవుడు కాని శత్రువు ఎవరైనా నిన్ను బాధించినప్పుడు వాడిని చంపటానికి నీవీ అస్త్రాన్ని ప్రయోగించాలి. (21)
తథేతి సంప్రతిశ్రుత్య బీభత్సుః స కృతాంజలిః ।
జగ్రాహ పరమాస్త్రం తత్ ఆహచైనం పునర్గురుః ।
భవితా త్వత్సమో నాన్యః పుమాన్ లోకే ధనుర్ధరః ॥ 22
అలాగే అని మాట ఇచ్చి అర్జునుడు కృతాంజలియై ఆ మేటి అస్త్రాన్ని స్వీకరించారు. మరలా ద్రోణుడూ "లోకంలో నీసాటిరాగల విలుకాడు ఎవ్వడూ ఉండడు" అని అర్జునునితో పలికాడు. (22)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి ద్రోణగ్రాహమోక్షణే ద్వాత్రింశదధికశతతమోఽధ్యాయః ॥ 132 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున ద్రోణగ్రాహమోక్షణమను నూట ముప్పది రెండవ అధ్యాయము. (132)