130. నూట ముప్పదియవ అధ్యాయము
ద్రుపదుడు ద్రోణుని తిరస్కరించుట - ద్రోణుడు హస్తిన చేరుట.
వైశంపాయన ఉవాచ
తతో ద్రుపదమాసాద్య బారద్వాజః ప్రతాపవాన్ ।
అబ్రవీత్ పార్థివం రాజన్ సఖాయం విద్ధి మామిహ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. రాజా! ఆపై ప్రతాపవంతుడైన ద్రోణుడు ద్రుపదుని దగ్గరకు పోయి "రాజా! నేను నీ మిత్రుడను. నిన్ను కలవాలని వచ్చాను" అన్నాడు. (1)
ఇత్యేవముక్తః సఖ్యా సః ప్రీతిపూర్వం జనేశ్వరః ।
భారద్వాజేన పాంచాలః నామృష్యత వచోఽస్య తత్ ॥ 2
మిత్రుడైన ద్రోణుడు ప్రేమపూర్వకంగా అలా అన్న తరువాత పాంచాలరాజు అయిన ద్రుపదుడు ఆయన మాటలను సహించలేకపోయాడు. (2)
సక్రోధామర్షజిహ్మభ్రూః కషాయీకృతలోచనః ।
ఐశ్వర్యమదసంపన్నః ద్రోణం రాజాబ్రవీదిదమ్ ॥ 3
కోపంతో అసహనంతో బొమముడివేసి, కన్నెర్రజేసి ఐశ్వర్యమదంతో ద్రుపదరాజు ద్రోణునితో ఇలా అన్నాడు. (3)
ద్రుపద ఉవాచ
అకృతేయం తవ ప్రజ్ఞా బ్రహ్మన్ నాతిసమంజసా ।
యన్మాం బ్రవీషి ప్రసభం సఖా తేఽహమితి ద్విజ ॥ 4
ద్రుపదుడిలా అన్నాడు - బ్రాహ్మణా! నీ బుద్ధి అపరిపక్వం. ద్విజా! నీకు నేను మిత్రుడనని ఇంతగట్టిగా నీవు మాటాడటం అసమంజసం. (4)
న హి రాజ్ఞాముదీర్ణానామ్ ఏవంభూతైః నరైః క్వచిత్ ।
సఖ్యం భవతి మందాత్మన్ శ్ఱియా హీనైర్ధనచ్యుతైః ॥ 5
బుద్ధిహీనుడా! పెద్ద పెద్ద రాజులకు సంపదలూ, డబ్బూలేని నీవంటి నరులతో ఎక్కడా స్నేహం కుదరదు. (5)
సాఉహృదాన్యపి జీర్యంతే కాలేన పరిజీర్యతః ।
సౌహృదం మే త్వయాహ్యాసీత్ పూర్వం సామర్థ్యబంధనమ్ । 6
కాలం గడచిపోతుంటే స్నేహాలు కూడా నశించిపోతుంటాయి. గతంలో మనమిద్దరమూ సమానులం కాభట్టి నాకు నీతో స్నేహముండేది. (6)
న సఖ్యమజరం లోకే హృది తిష్ఠతి కస్యచిత్ ।
కాలో హ్యేనం విహరతి క్రోధో వైనం హరత్యుత ॥ 7
ఈ లోకంలో ఎవ్వడికీ శాశ్వతమైన సఖ్యం మనస్సులో నిలువదు. కాలమే ఇద్దరినీ వేరు చేస్తుంది. లేదా క్రోధం స్నేహాన్ని హరిస్తుంది. (7)
మైవం జీర్ణముపాస్స్వ త్వం సఖ్యం భవత్వపాకృధి ।
ఆసీత్ సఖ్యం ద్విజశ్రేష్ఠ త్వయా మేఽర్థనిబంధనమ్ ॥ 8
ఈ విధంగా నశ్వరమయిన స్నేహం మీద నమ్మకం వద్దు. మనం మిత్రులమన్న భావాన్ని మనస్సులో నుండి తొలగించుకో. ద్విజోత్తమా! గతంలో మనం కలిసి ఆడుతూ, చదువుకొనే వారం కాబట్టి నీతో మైత్రి ఉండేది. (8)
న దరిద్రో వసుమతః నావిద్వాన్ విదుషః సఖా ।
న శూరస్య సఖా క్లీబః సఖిపూర్వం కిమిష్యతే ॥ 9
ధనవంతుడికి దరిద్రుడూ, పండితునకు పామరుడూ, పరాక్రమశాలికి పిరికివాడూ మిత్రులుగా ఉండగలరా? గతంలోని మైత్రి గురించి ఇప్పుడెందుకు? (9)
యయోరేవ సమం విత్తం యయోరేవ సమం శ్రుతమ్ ।
తయోర్వివాహః సఖ్యం చ న తు పుష్టవిపుష్టయోః ॥ 10
సమానధనం గలవారిలో ఒకరితో ఒకరికి, సమాన పాండిత్యం గల వారిలో ఒకరితో ఒకరికి వియ్యమైనా, స్నేహమైనా కుదురుతుంది. అంతేకానీ ధనికదరిద్రుల మధ్య మైత్రి కుదరదు. (10)
నాశ్రోత్రియః శ్రోత్రియస్య నారథీ రథినః సఖా ।
నా రాజాపార్థివస్యాపి సఖిపూర్వం కిమిష్యతే ॥ 11
శ్రోత్రియునికి అశ్రోత్రియుడు, రథికి రథంలేనివాడూ, రాజునకు రాజుకనివాడూ మిత్రులు కాలేరు. గతంలోని మైత్రిని గురించి ఇప్పుడెందుకు? (11)
వైశంపాయన ఉవాచ
ద్రుపదేనైవముక్తస్తు భారద్వాజః ప్రతాపవాన్ ।
ముహూర్తం చింతయిత్వా తు మమ్యనాభిపరిప్లుతః ॥ 12
సవినిశ్చిత్య మనసా పాంచాలం ప్రతి బుద్ధిమాన్ ।
జగామ కురుముఖ్యానాం నగరం నాగసాహ్వయమ్ ॥ 13
ద్రుపదుడు ఇలా అనగానే ప్రతాపవంతుడైన ద్రోణుడు కోపంతో నిండి కొద్దిసేపు ఆలోచనలో పడ్డాడు. బుద్ధిమంతుడు కాబట్టి పాంచాలునిపై - ద్రుపదునిపై - ప్రతీకారం చేయటానికి మనస్సులో నిర్ణయించుకొని కౌరవరాజధాని అయిన హస్తినాపురికి బయలుదేరాడు. (12,13)
స నాగపురమాగమ్య గౌతమస్య నివేశనే ।
భారద్వాజోఽవసత్ తత్ర ప్రచ్ఛన్నం ద్విజసత్తమః ॥ 14
ద్విజసత్తముడైన ఆ ద్రోణుడు హస్తినాపురానికి వచ్చి కృపాచార్యుని ఇంటిలో అజ్ఞాతంగా నివసించసాగాడు. (14)
తతోఽస్య తనుజః పార్థాన్ కృపస్యానంతరం ప్రభుః ।
అస్త్రాణి శిక్షయామాస నాబుధ్యంత చ తం జనాః ॥ 15
ఆ తరువాత అక్కడ అశ్వత్థామ కృపుని తర్వాత తాను రాజకుమారులకు అస్త్రవిద్యను నేర్పసాగాడు. ప్రజలు అతనిని గుర్తించలేదు. (15)
ఏవం స తత్ర గూఢాత్మా కంచిత్ కాలమువాస హ ।
కుమారాస్త్వథ నిష్క్రమ్య సమేతా గజసాహ్వయాత్ ॥ 16
క్రీడంతో వీటయా తత్ర వీరాః పర్యచరన్ ముదా ।
పపాథ కూపే సా వీటా తేషాం వై క్రీడతాం తదా ॥ 17
ఈ విధంగా అక్కడ నిగూఢంగా కొంతకాలం గడిపాడు ద్రోణుడు. ఆ తరువాత ఒకసారి కౌరవ పాండవులు హస్తినాపురం నుండి దూరంగా వెళ్ళి ఎంతో ఉత్సాహంగా గూటి-బిళ్ళ ఆట ఆడుకొనసాగారు. వారు ఆట ఆడుకొనే సమయంలో ఆ బిళ్ళ నూతిలో పడిపోయింది. (16,17)
తతస్తే యత్నమాతిష్ఠన్ వీటాముద్ధర్తుమాదృతాః ।
న చ తే ప్రత్యపద్యంత కర్మ వీటోపలబ్ధయే ॥ 18
అప్పుడు వారందరూ దానిని పైకి తీయాలన్న తపనతో ఎంతో ప్రయత్నించారు. కానీ ఆ బిళ్ళను పైకి తెచ్చుకొనగల ఉపాయం వారికి తెలియలేదు. (18)
తతోఽన్యోన్యమవైక్షంత వ్రీడయావనతాననాః ।
తస్యా యోగమవిందంతః భృశం చోత్కంఠితాభవన్ ॥ 19
దానితో వారు ఒకరినొకరు చూచుకొంటూ సిగ్గుతో ముఖాలు దించుకొన్నారు. ఆ బిళ్ళను పొందే దారి తెలియక ఎంతో ఉత్కంఠకు గురి అయ్యారు. (19)
తేఽపశ్యన్ బ్రాహ్మణం శ్యామమ్ ఆపన్నం పలితం కృశమ్ ।
కృత్యవంతమదూరస్థమ్ అగ్నిహోత్రపురస్కృతమ్ ॥ 20
అప్పుడు వారు తమకు దగ్గరలోనున్న ఒక బ్రాహ్మణుని చూచారు. అతడు నల్లగా ఉన్నాడు. అతడు అగ్నిహోత్రాన్ని ముగించి అక్కడ నిలిచి ఉన్నాడు. తెల్లని వెంట్రుకలతో, కృశించిన శరీరంతో ఆపన్నునివలె కనిపిస్తున్నాడు. (20)
తే తం దృష్ట్వా మహాత్మానమ్ ఉపగమ్య కుమారకాః ।
భగ్నోత్సాహక్రియాత్మానః బ్రాహ్మణం పర్యవారయన్ ॥ 21
ఉత్సాహాన్ని కోల్పోయి ఏం చేయాలో తెలియని స్థితిలోనున్న ఆ కుమారులు మహాత్ముడైన ఆ బ్రాహ్మణుని చూచి దగ్గరకు చేరి చుట్టుముట్టారు. (21)
అథ ద్రోణః కుమారాంస్తాన్ దృష్ట్వా కృత్యవతస్తదా ।
ప్రహస్య మందం పైశల్యాత్ అభ్యభాషత వీర్యవాన్ ॥ 22
ఆ తరువాత పరాక్రమవంతుడైన ఆ ద్రోణుడు వారిని చూసి వారికిష్టమయినదేదో జరగలేదనీ, ఆపని కోసమే తన దగ్గరకు వచ్చారని గ్రహించి చిరునవ్వు నవ్వి నేర్పుగా ఇలా అన్నారు. (22)
అహో వో ధిగ్ బలం క్షాత్రం ధిగేతాం వః కృతాస్త్రతామ్ ।
భరతస్యాన్వయే జాతా యే వీటాం నాధిగచ్ఛత ॥ 23
అరే! ఏమి మీబలం? ఏమి మీ క్షాత్రం? ఎందుకు మీవిద్యాభ్యాసం? భరతవంశంలో పుట్టారు. కానీ బావిలో పడిన బిళ్ళను తెచ్చుకోలేక పోతున్నారు? (23)
వీటాం చ ముద్రికాం చైవ హ్యహమేతదపి ద్వయమ్ ।
ఉద్ధరేయమిషీకాభిః భోజనం మే ప్రదీయతామ్ ॥ 24
చూడండి. నేను మీ బిళ్ళనూ, ఈ నా ఉంగరాన్నీ రెండింటినీ బాణాలతో పైకి తీయగలను. నాకు ఉద్యోగ మిప్పించగలరా? (24)
ఏవముక్త్వా కుమారాంస్తాన్ ద్రోణః స్వాంగుళివేష్టనమ్ ।
కూపే నిరుదకే తస్మిన్ అపాతయదరిందమః ॥ 25
ఆ విధంగా ఆ కుమారులతో పలికి అరిందముడైన ఆ ద్రోణుడు తన వ్రేలికున్న ఉంగరాన్ని నీరులేని ఆ బావిలో పడవేశాడు. (25)
తతోఽబ్రవీత్ తదా ద్రోణం కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
అప్పుడు కుంతీకుమారుడైన యుధిష్ఠిరుడు ద్రోణునితో ఇలా అన్నాడు? (25 1/2)
యుధిష్ఠిర ఉవాచ
కృపస్యానుమతే బ్రహ్మన్ భిక్షామాప్నుహి శాశ్వతీమ్ ॥ 26
ఏవముక్తః ప్రత్యువాచ ప్రహస్య భరతానిదమ్ ।
యుధిష్ఠిరుడిలా అన్నాడు. బ్రాహ్మణా! కృపుని అనుమతిని పొంది ఇక్కడ శాశ్వతమైన ఉద్యోగాన్ని పొందవచ్చు. యుధిష్ఠిరుడు అలా అనగానే ద్రోణుడు నవ్వి ఆకుమారులతో ఇలా అన్నాడు. (26 1/2)
ద్రోణ ఉవాచ
ఏషా ముష్టిరిషీకాణాం మయాస్త్రేణాభిమంత్రితః ॥ 27
ద్రోణుడిలా అన్నాడు. ఇదిగో! ఇవి పిడికెడు బాణాలు. నేను అస్త్రమంత్రాలతో మంత్రించినవి. (27)
అస్యా వీర్యం నిరీక్షధ్వం యదన్యస్య న విద్యతే ।
భేత్స్యామీ షీకయా వీటాం తామిషీకాం తథాన్యయా ॥ 28
వీటి బలాన్ని చూడండి. మరెక్కడా ఇటువంటి బలముండదు. ఒక బాణంతో బిళ్ళను గ్రుచ్చుతాను. మరొక బాణంతో ఆ మొదటి బాణాన్ని గ్రుచ్చుతాను. (28)
తామాన్యయా సమాయోగే వీటాయా గ్రహణం మమ ।
ఆ బాణాన్ని మరొకబాణంతో గ్రుచ్చుతాను. ఈ వరుసతో బిళ్ళను నేను అందుకొనగలను. (28 1/2)
వైశంపాయన ఉవాచ
తతో యథోక్తం ద్రోణేన తత్ సర్వం కృతమంజసా ॥ 29
వైశంపాయనుడిలా అన్నాడు. ఆపై ద్రోణుడు తాను చెప్పినదంతా తేలికగా పూర్తి చేశాడు. (29)
తదవేక్ష్య కుమారాస్తే విస్మయోత్ఫుల్లలోచనాః ।
ఆశ్చర్యమిదమత్యంతమ్ ఇతి మత్వా వచోఽబ్రువన్ ॥ 30
అది చూసి ఆ కుమారుల కళ్ళు ఆశ్చర్యంతో వికసించాయి. ఇది మహాద్భుతమని భావించి ఈ మాట అన్నారు. (30)
కుమారా ఊచుః
ముద్రికామపి విప్రర్షే శీఘ్రమేతాం సముద్ధర ।
కుమారులిలా అన్నారు. బ్రహ్మర్షీ! ఆ అంగుళీయకాన్ని కూడా త్వరగా పైకి తీయండి. (30 1/2)
వైశంపాయన ఉవాచ
తతః శరం సమాదాయ ధనుర్ద్రోణో మహాయశాః ॥ 31
శరేణ విద్ధ్వా ముద్రాం తామ్ ఊర్ధ్వమావాహయత్ ప్రభుః ।
స శరం సముపాదాయ కూపాదంగుళివేష్టనమ్ ॥ 32
దదౌ తతః కుమారాణాం విస్మితానామవిస్మితః ।
ముద్రికా ముద్ధృతాం దృష్ట్వా తమాహుస్తే కుమారకాః ॥ 33
వైశంపాయనుడిలా అన్నాడు. ఆపై మహాయశస్వి అయిన ద్రోణుడు ధనుర్బాణాలను తీసికొని ఆ అంగుళీయకాన్ని బాణంతో గ్రుచ్చి పైకి తీశాడు. బాణంతో పాటుగా ఆ ఉంగరాన్ని బావిలో నుండి పైకి తీసి ఆశ్చర్యచకితులైన ఆ కుమారులకు అలవోకగా ఇచ్చాడు. ఉంగరాన్ని కూడా పైకి తీసిన తర్వాత ఆ కుమారులు ద్రోణునితో ఇలా అన్నారు. (31-33)
కుమారా ఊచుః
అభివాదయామహే బ్రహ్మన్ నైతదన్యేషు విద్యతే ।
కోఽసి సస్యాసి జానీమః వయం కిం కరవామహే ॥ 34
కుమారులిలా అన్నాడు. బ్రాహ్మణా! మీకు నమస్కరిస్తున్నాము. మరెవ్వరిలోనూ ఇంత నేర్పు ఉండదు. తమరెవరు? చెప్పండి. మేమేం చేయాలో ఆదేశించండి. (34)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తస్తతో ద్రోణః ప్రత్యువాచ కుమారకాన్ ।
వైశంపాయనుడిలా అన్నాడు. కుమారకులు ఆ రీతిగా అడిగిన తర్వాత ద్రోణుడు వారితో ఇలా అన్నాడు. (34 1/2)
ద్రోణ ఉవాచ
ఆచక్షధ్వం చ భీష్మాయ రూపేణ చ గుణైశ్చ మామ్ ॥ 35
స ఏవ సుమహాతేజాః సాంప్రతం ప్రతిపత్స్యతే ।
ద్రోణుడిలా అంటున్నాడు. నా రూపాన్ని గురించి, గుణాలను గురించి భీష్మునకు వివరించండి. మహాతేజస్వి అయిన ఆయనే ఏం చేయాలో గ్రహించగలడు. (35 1/2)
వైశంపాయన ఉవాచ
తథేత్యుక్త్వా చ గత్వా చ భీష్మమూచుః కుమారకాః ॥ 36
బ్రాహ్మణస్య వచస్తథ్యం తచ్చ కర్మ తథావిధమ్ ।
భీష్మః శ్రుత్వా కుమారాణాం ద్రోణం తం ప్రత్యజానత ॥ 37
వైశంపాయనుడిలా అన్నాడు. అలాగేనని వెళ్లి కుమారులు భీష్మునితో ద్రోణుని సత్యవచనాలను అద్భుతమైన ఆ పనితనాన్ని గూర్చి చెప్ఫారు. కుమారులు చెప్పినది విని భీష్ముడు ఆయన ద్రోణాచార్యుడే అని గ్రహించాడు. (36,37)
యుక్తరూపః స హి గురుః ఇత్యేవ మనుచింత్య చ ।
అథైనమానీయ తదా స్వయమేవ సుసత్కృతమ్ ॥ 38
పరిపప్రచ్ఛ నిపుణం భీష్మః శస్త్రభృతాం వరః ।
హేతుమాగమనే తచ్చ ద్రోణః సర్వం న్యవేదయత్ ॥ 39
కుమారులకు తగిన గురువు ద్రోణుడే అని ఆలోచించి శ్రేష్ఠుడయిన భీష్ముడు తానే స్వయంగా వచ్చి చాలా నేర్పుగా ద్రోణుని రాకకు కారణాన్ని అడిగాడు. ద్రోణుడు జరిగినదంతా చెప్పాడు. (38,39)
ద్రోణ ఉవాచ
మహర్షేరగ్నివేశస్య సకాశమహమచ్యుత ।
అస్త్రార్థమగమం పూర్వం ధనుర్వేద జిఘృక్షయా ॥ 40
ద్రోణుడిలా అన్నాడు. అచ్యుతా! ఒకప్పుడు నేను అస్త్రవిద్యనూ, ధనుర్వేదాన్నీ అభ్యసింపగోరి అగ్నివేశ మహర్షి దగ్గరకు వెళ్ళాను. (40)
బ్రహ్మచారీ వినీతాత్మా జటిలో బహులాః సమాః ।
అవసం సుచిరం తత్ర గురుశుశ్రూషణే రతః ॥ 41
బ్రహ్మచారినై, జటాధారినై, గురు శుశ్రూషా తత్పరుడనై అక్కడ చాలా సంవత్సరాలు గడిపాను. (41)
పాంచాలో రాజపుత్రశ్చ యజ్ఞసేనో మహాబలః ।
ఇష్వస్త్రహేతోర్న్యవసత్ తస్మిన్నేవ గురౌ ప్రభుః ॥ 42
అదే సమయంలో మహాబలుడూ, పాంచాళరాజ కుమారుడూ అయిన యజ్ఞసేనుడు (ద్రుపదుడు) కూడా విలువిద్యకై ఆ గురువు దగ్గరే ఉండేవాడు. (42)
స మే తత్ర సఖా చాసీత్ ఉపకారీ ప్రియశ్చ మే ।
తేనాహం సహ సంగమ్య వర్తయన్ సుచిరం ప్రభో ॥ 43
ఆ గురుకులంలో అతడు నాకు ఎంతో ఉపకారం చేసేవాడు, ప్రియమిత్రుడయ్యాడు. రాజా! వానితో పాటు నేను అక్కడ చాలా కాలం గడిపాను. (43)
బాల్యాత్ ప్రభృతి కౌరవ్య సహాధ్యయనమేవ చ ।
స మే సఖా సదా తత్ర ప్రియవాదీ ప్రియంకరః ॥ 44
కురువంశశ్రేష్ఠా! చిన్నతనం నుండీ మేమిద్దరం సహాధ్యాయులం. అతడు అక్కడ నామిత్రుడు. నాతో ప్రియంగా మాటాడేవాడు. నాకిష్టమైన పనులు చేసేవాడు. (44)
అబ్రవీదితి మాం భీష్మ వచనం ప్రీతివర్ధనమ్ ।
అహం ప్రియతమః పుత్రః పితుర్ద్రోణ మహాత్మనః ॥ 45
భీష్మా! ఒకసారి అతడు నాకు పరమానందాన్ని కల్గించే మాట ఒకటన్నాడు - ద్రోణా! మహాత్ముడైన నా తండ్రికి నేను ప్రియతమ కుమారుడను. (45)
అభిషేక్ష్యతి మాం రాజ్యే స పాంచాలో యదా తదా ।
త్వద్భోగ్యం భవితా తాత సఖే సత్యేన తే శపే ॥ 46
మమ భోగాశ్చ విత్తం చ త్వదధీనం సుఖాని చ ।
ఏవముక్త్వాథ వవ్రాజ కృతాస్త్రః పూజితో మయా ॥ 47
నా తండ్రి నాకు రాజ్యాభిషేకం చేసిననాడు ఆరాజ్యం నీ అనుభవంలోనికి వస్తుంది. మిత్రమా! సత్యప్రమాణంగా చెప్తున్నాను. నాభోగాలు, నాధనం, నాసుఖాలూ అన్నీ నీకు లోబడినవే. ఈ విధంగా పలికి ఆ ద్రుపదుడు ఆస్త్రవిద్యను ముగించుకొని, నా సత్కరాన్ని పొంది వెళ్ళిపోయాడు. (46,47)
తచ్చ వాక్యమహం నిత్యం మనసా ధారయంస్తదా ।
సోఽహం పితృనియోగేన పుత్రలోభాద్ యశస్వినీమ్ ॥ 48
నాతికేశీం మహాప్రజ్ఞామ్ ఉపయేమే మహావ్రతామ్ ।
అగ్నిహోత్రే చ సత్రే చ దమే చ సతతం రతామ్ ॥ 49
ఆ మాటను నేను అనుదినమూ తలచుకొనేవాడిని. మాపితరుల ప్రేరణవలనా, పుత్రులు కావాలన్న కోరిక వలనా నేను యశస్విని, హ్రస్వకేశి, మహాబుద్ధిమతి, వ్రతపాలన తత్పర అయిన కృపిని పెండ్లాడాను. ఆంఎ అగ్నిహోత్రమందు, యాగాల యందు, సంయమనమందూ నిత్యమూ ఆసక్తి గలది. (48,49)
అలభద్ గౌతమీ పుత్రమ్ అశ్వత్థామానమౌరసమ్ ।
భీమవిక్రమకర్మాణమ్ ఆదిత్యసమతేజసమ్ ॥ 50
ఆకృపి సూర్యుని వంటి తేజస్సుతో భయంకరంగా పరాక్రమించ గల కుమారుని కన్నది. వాడి పేరు అశ్వత్థామ. (50)
పుత్రేణ తేన ప్రీతోఽహం భరద్వాజో మయా యథా ।
గోక్షీరం పిబతో దృష్ట్వా ధనినస్తత్ర పుత్రకాన్ ।
అశ్వత్థామారుదద్ బాలః తన్మే సందేహయద్ దిశః ॥ 51
నా పుట్టుకతో మా తండ్రి భరద్వాజుడు ఆనందించినట్లు అశ్వత్థామ పుట్టుకతో నేను సంతసించాను. ఒకసారి ధనవంతుల పిల్లలు ఆవుపాలను త్రాగుతుంటే చూచి అశ్వత్థామ ఆవుపాలకోసం ఏడవసాగాడు. నాకు దిక్కు తోచలేదు. (51)
న స్నాతకోఽవసీదేత వర్తమానః స్వకర్మసు ।
ఇతి సంచింత్య మనసా తం దేశం బహుశో భ్రమన్ ॥ 52
విశుద్ధమిచ్ఛన్ గాంగేయ ధర్మోపేతం ప్రతిగ్రహమ్ ।
అంతాదంతం పరిక్రమ్య నాధ్యగచ్ఛం పయస్వినీమ్ ॥ 53
'స్వధర్మాన్ని నిర్వహిస్తున్న స్నాతకుడెవడూ (నేనభ్యర్థించిన కారణంగా ఉన్న ఆ కొంచెం పాళనో లేదా గోవునో నాకు ఇచ్చి) తన కర్మలకు విఘాతం కల్గించుకొనకూడదు' అని భావించి నేను గోసంపద బాగా కలవారికోసం, వారి నుండి పవిత్రంగా, ధర్మబద్ధంగా గోదానాన్ని స్వీకరించాలని ఆ దేశంలో చాలా సార్లు తిరిగాను. గాంగేయా! ఆ చివర నుండీ ఈ చివర వరకూ తిరిగి కూడా నేను గోవును పొందలేకపోయాను. (52,53)
అథ పిష్టోదకేనైనం లోభయంతి కుమారకాః ।
పీత్వా పిష్టరసం బాలః క్షీరం పీతం మయాపి చ ॥ 54
ననర్తోత్థామ కౌరవ్య హృష్టో బాల్యాద్ విమోహితః ।
తం దృష్ట్వా నృత్యమానంతు బాలైః పరివృతం సుతమ్ ॥ 55
హాస్యతాముపసంప్రాప్తం కశ్మలం తత్రమేఽభవత్ ।
ద్రోణం ధిగస్త్వధనినం యో ధనం నాధిగచ్ఛతి ॥ 56
నేను తిరిగి వచ్చి అశ్వత్థామను పిండినీళ్ళతో ఏడిపిస్తున్న బాలకులను చూచాను. వారు పిండినీటిని ఇచ్చి పాలు అని చెప్పి అశ్వత్థామను ఆడిస్తున్నారు. చిన్నతనం వలన అది తెలియని అశ్వత్థామ పిండినీళ్లనే త్రాగి "నేను కూడా పాలు త్రాగాను" అని మోహంతో, ఆనందంతో ఎగరసాగాడు. చుట్టుముట్టిన బాలకుల మధ్య అలా ఎగురుతూ నవ్వుల పాలవుతున్న అశ్వత్థామను చూసి నామనస్సు కలత పడింది. డబ్బు సంపాదించని నా దరిద్రజీవితం పై రోత కలిగింది. (54-56)
పిష్టోదకం సుతో యస్య పీత్వా క్షీరస్య తృష్ణయా ।
నృత్యతిస్మ ముదావిష్టః క్షీరం పీతం మయాప్యుత ॥ 57
ఇతి సంభాషతాం వాచం శ్రుత్వా మే బుద్ధిరచ్యవత్ ।
ఆత్మానం చాత్మనా గర్హన్ మనసేదం వ్యచింతయమ్ ॥ 58
అపి చాహం పురా విప్రైః వర్జితో గర్హితో వసే ।
పరోపసేవాం పాపిష్ఠాం న చ కుర్యాం ధనేప్సయా ॥ 59
'ఈయన కొడుకే పాలకు ఆశపడి పిండినీళ్ళు త్రాగి నేను కూడా పాలుత్రాగానని ఆనందంతో గమ్తులు వేసింది' అని లోకులనుకొనే మాటలు విని నా బుద్ధి చలించింది. నన్ను నేనే నిందించికొని ఇలా ఆలోచించాను - గతంలోనే నేను దరుద్రుడనని బ్రాహ్మణులు నన్ను విడిచిపెట్టారు. నన్ను చిన్నచూపు చూస్తున్నారు. కానీ ధనప్రాప్తికైపాపిష్ఠమైన పరోపసేవను నేను అంగీకరించ లేకపోతున్నాను. (57-59)
ఇతి మత్వా ప్రియం పుత్రం భీష్మాదాయ తతోహ్యహమ్ ।
పూర్వస్నేహానురాగిత్వాత్ సదారః సౌమకిం గతః ॥ 60
భీష్మా! ఆ విధంగా ఆలోచించి నేను నా భార్యనూ, కుమారునీ తీసికొని గతంలోని స్నేహానురాగాలను దృష్టిలోనుంచుకొని ద్రుపదుని దగ్గరకు వెళ్లాను. (60)
అభిషిక్తం తు శ్రుత్వైవ కృతార్థోఽస్మీతి చింతయన్ ।
ప్రియం సఖాయం సుప్రీతః రాజ్యస్థం సముపాగమమ్ ॥ 61
ద్రుపదునికి పట్టాభిషేకం జరిగిందని విని నేను నాపని నేరవేరుతుందని తలచి ఆనందంతో రాజసింహాసనంపై ఉన్న ప్రియమిత్రుని దగ్గరకు వెళ్ళాను. (61)
సంస్మరన్ సంగమం చైవ వచనం చైవ తస్య తత్ ।
తతో ద్రుపదమాగమ్య సఖిపూర్వమహం ప్రభో ॥ 62
అబ్రువం పురుషవ్యాఘ్ర సఖాయం విద్ధిమామితి ।
ఉపస్థితస్తు ద్రుపదం సఖివచ్చాస్మి సంగతః ॥ 63
రాజా! ద్రుపదునితో ఉన్న స్నేహాన్నీ, నాడు తాను చెప్పిన మాటను మాటిమాటికీ తలచుకొంటూ ఒకనాటి మిత్రుడైన ద్రుపదుని దగ్గరకు పోయి "నరోత్తమా! నేను నీమిత్రుడను. గుర్తున్నదా" అంటూ ఒక మిత్రుని సమీపించినట్లు నేను ద్రుపదుని దగ్గరకు వెళ్ళాను. (62,63)
స మాం నిరాకారమివ రహసన్నిదమబ్రవీత్ ।
ఆకృతేయం తవ ప్రజ్ఞా బ్రహ్మన్ నాతి సమంజసా ॥ 64
ఆ ద్రుపదుడు నన్ను మనిషిగా కూడా లెక్క చేయకుండా పరిహసిస్తూ "బ్రాహ్మణా! నీబుద్ధి చాలా అసంగతంగానూ, అసమంజసంగానూ కనిపిస్తోంది. (64)
యదాత్థ మాం త్వం ప్రసభం సఖా తేఽహమితి ద్విజ ।
సంగతానీహ జీర్యంతి కాలేన పరిజీర్యతః ॥ 65
బ్రాహ్మణా! మాటిమాటికీ నేను నీ మిత్రుడనని నాతో అంటున్నావు. కాలంగడిచేకొలదీ స్నేహాలు కూడా నశించి పోతాయి. (65)
సౌహృదం మే త్వయా హ్యాసీత్ పూర్వం సామర్థ్యబంధనమ్ ।
నా శ్రోత్రియః శ్రోత్రియస్య నారథీ రథినః సఖా ॥ 66
గతంలో మనం సమానస్థాయిలో ఉన్నాం కాబట్టి నేను నీతో స్నేహం చేశాను. కానీ శ్రోత్రియునకు అశ్రోత్రియుడూ, రథికునకు రథంలేనివాడూ మిత్రులు కాలేరు. (66)
సామ్యాద్ధి సఖ్యం భవతి వైషమ్యాన్నోపపద్యతే ।
న సఖ్యమజరం లోకే విద్యతే జాతు కస్యచిత్ ॥ 67
సమానత్వంతో స్నేహమేర్పడుతుంది. అసమానతతో అది కుదరదు. లోకంలో ఎప్పుడూ ఎవరికీ శాశ్వతమైత్రి ఉండదు. (67)
కాలో వైనం విహరతి క్రోధో వైనం హరత్యుత ।
మైవం జీర్ణముపాస్స్వ త్వం సత్యం భవత్వపాకృధి ॥ 68
కాలమైనా మిత్రులను విడదీస్తుంది. క్రోధమైనా మైత్రిని నశింపజేస్తుంది. ఈ విధంగా నశ్వరమైన స్నేహం మీద నమ్మకం వద్దు. (68)
ఆసీత్ సఖ్యం ద్విజశ్రేష్ఠ త్వయా మేఽర్థ నిబంధనమ్ ।
నహ్యనాఢ్యః సఖాఢ్యస్య నావిద్వాన్ విదుషః సఖా ॥ 69
న శూరస్య సఖా క్లీబః సఖిపూర్వం కిమిష్యతే ।
న హి రాజ్ఞాముదీర్ణానామ్ ఏవంభూతైః నరైః క్వచిత్ ॥ 70
సఖ్యం భవతి మందాత్మన్ శ్రియాహీనైర్ధనచ్యుతైః ।
నాశ్రోత్రియః శ్రోత్రియస్య నారథీ రథినః సఖా ॥ 71
నా రాజా పార్థివస్యాపి సఖిపూర్వం కిమిష్యతే ।
అహం త్వయా న జానామి రాజ్యార్థే సంవిదం కృతామ్ ॥ 72
ద్విజోత్తమా! గతంలో నీతో నాకున్న మైత్రి స్వప్రయోజనానికి సంబంధించినది. బలవంతుడికి బలహీనుడూ, పండితునకు పామరుడూ, శూరునకూ పిరికివాడూ మిత్రులు కాలేరు. ఎప్పటిదో మన స్నేహం! ఇప్పుడు అది నిరుపయోగం. నేను నారాజ్య విషయంలో నీకేదో మాట ఇచ్చిన విషయం నాకసలు గుర్తు కూడా లేదు. (69-72)
ఏకరాత్రం తు తే బ్రహ్మన్ కామం దాస్యామి భోజనమ్ ।
ఏవముక్తస్త్వహం తేన సదారః ప్రస్థితస్తదా ॥ 73
బ్రాహ్మణా! నీకిష్టమయితే ఒకరాత్రిమాత్రం నీకు మంచిభోజనాన్ని అందించగలను - అతడామాట అనగానే నేను నా భార్యతో సహా బయలుదేరి వచ్చేశాను. (73)
తాం ప్రతిజ్ఞాం ప్రతిజ్ఞాయా యాం కర్తాస్మ్యచిరాదివ ।
ద్రుపదేనైవముక్తోఽహం మన్యునాభిపరిప్లుతః ॥ 74
మరలివచ్చే సమయంలో నేను ఒక ప్రతిజ్ఞ చేశాను. దానిని త్వరలోనే నెరవేర్చుకొంటాను. ద్రుపదుడు ఆవిధంగా తిరస్కరించగానే నేను క్షోభించాను. (74)
అభ్యాగచ్ఛం కురూన్ భీష్మ శిష్మైరర్థీ గుణాన్వితైః ।
తతో-హం భవతః కామం సంవర్ధయితుమాగతః ॥ 75
ఇదం నాగపురం రమ్యం బ్రూహి కిం కరవాణి తే ।
భీష్మా! సద్గుణాలు గల శిష్యులద్వారా నా అభీష్టాన్ని నెరవేర్చుకోవాలనుకొంటున్నాను. అందువలన నీమనోరథాన్ని తీర్చాలని పాంచాల దేశం నుండి కురుదేశంలో రమణీయమైన ఈ హస్తినాపురికి వచ్చాను. మీకోసం నేనేమి చేయాలో చెప్పండి. (75 1/2)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తస్తదా భీష్మః భారద్వాజమభాషత ॥ 76
వైశంపాయనుడిలా అన్నాడు. ద్రోణుడు అలా చెప్పగానే భీష్ముడు ఆయనతో ఈ విధంగా పలికాడు. (76)
భీష్మ ఉవాచ
అపజ్యం క్రియతాం చాపం సాధ్వస్త్రం ప్రతిపాదయ ।
భుంక్ష్వ భోగాన్ భృశం ప్రీతః పూజ్యమానః కురుక్షయే ॥ 77
భీష్ముడిలా అన్నాడు. తమధనస్సు నుండి అల్లెత్రాటిని దించండి. కౌరవపాండవులకు చక్కగా అస్త్రవిద్యను నేర్పండి. కౌరవుల ఆశ్రయంలో వారి సత్కారాలు పొందుతూ పరమానందంగా అభీష్టభోగాలను అనుభవించండి. (77)
కురూణా మస్తి యద్ విత్తం రాజ్యం చేదం సరాష్ట్రకమ్ ।
త్వమేవ పరమో రాజా సర్వే చ కురవస్తవ ॥ 78
కౌరవుల సంపదా, దేశమూ, ఈ రాజధానీ వీటికన్నింటికీ నీవే అధిపతివి. కౌరవులు అందరూ నీ అధీనంలోనివారే. (78)
యచ్చ తే ప్రార్థితం బ్రహ్మన్ కృతం తదితి చింత్యతామ్ ।
దిష్ట్యా ప్రాప్తోఽసి విప్రర్షే మహన్ మేఽనుగ్రహః కృతః ॥ 79
బ్రహ్మర్షీ! మీరు కోరుకొన్నది ఏదయినా నెరవేరినట్లే భావించండి. మాభాగ్యం కొద్దీ మీరు దొరికారు. ఇక్కడకు వచ్చి మీరు మమ్ములను అనుగ్రహించారు. (79)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి భీష్మద్రోణసమాగమే త్రింశదధికశతతమోఽధ్యాయః ॥ 130 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున భీష్మద్రోణ సమాగమమను నూట ముప్పదియవ అధ్యాయము. (130)