111. నూటపదునొకండవ అధ్యాయము

కుంతీ వివాహము.

వైశంపాయన ఉవాచ
సత్త్వరూపగుణీపేతా ధర్మారామా మహావ్రతా ।
దుహితా కుంతిభోజస్య పృథా పృథులలోచనా ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. కుంతిభోజుని కుమార్తె పృథ విశాలమయిన కన్నులు కలది. సత్త్వం, రూపం, ఉత్తమగుణాలు కలది. ధర్మాన్ని ఆశ్రయించి మహావ్రతాలను పాటించేది. (1)
తాం తు తేజస్వినీం కన్యాం రూపయౌవనశాళినీమ్ ।
వ్యవృణ్వన్ పార్థివాః కేచిత్ అతీవ స్త్రీగుణైర్యుతామ్ ॥ 2
అందం, యౌవనం, తేజస్సు గలిగి, స్త్రీకి తగిన గుణాలు మిక్కుటంగా ప్రకాశిస్తున్న ఆ కన్యను ఎంతో మందిరాజులు వరించారు. (2)
తతః సా కుంతిభోజేన రాజాఽఽహూయ నరాధిపాన్ ।
పిత్రా స్వయంవరే దత్తా దుహితా రాజసత్తమ ॥ 3
రాజోత్తమా! ఆ తరువాత కుంతిభోజుడు స్వయంగా రాజులనందరినీ ఆహ్వానించి పృథ యొక్క స్వయంవరాన్ని ఏర్పాటుచేశాడు. (3)
తతః సా రంగమధ్యస్థం తేషాం రాజ్ఞాం మనస్వినీ ।
దదర్శా రాజశార్దూలం పాండుం భరతసత్తమమ్ ॥ 4
రాజశ్రేష్ఠా! అప్పుడామనస్విని ఆ రాజసమూహం మధ్యలో నున్న భర్తవంశోత్తముని పాండురాజును చూచిం ది. (4)
సింహదర్పం మహోరస్కం వృషభాక్షం మహాబలమ్ ।
ఆదిత్యమివ సర్వేషాం రాజ్ఞాం ప్రచ్ఛాద్య వై ప్రభాః ॥ 5
అతడు సింహం వలె దర్పం గలిగి విశాలమైన వక్షస్థలం వృషభనేత్రాలవంటి నేత్రాలూ గలిగి మహాబలుడై సూర్యునివలె వెలుగుతూ ఇతరరాజుల కాంతులను కప్పివేశాడు. (5)
తిష్ఠంతం రాజసమితౌ పురందరమివాపరమ్ ।
తం దృష్ట్వా సానవద్యాంగీ కుంతిభోజసుతా శుభా ॥ 6
పాండుం నరవరం రంగే హృదయేనాకులాభవత్ ।
తతః కామపరీతాంగీ సకృత్ ప్రచలమానసా ॥ 7
మరొక దేవేంద్రుని వలె రాజుల మధ్యలో నున్న నరవరుడైన ఆ పాండురాజును చూచి శుభలక్షణాలు, దోషంలేని శరీరమూ కల కుంతి మనసులో వ్యాకులపడింది. ఆమె శరీరాన్ని కామం చుట్టుముట్టింది. మనస్సు ఒక్క మాటుగా చలించింది. (6,7)
వ్రీడమానా స్రజం కుంతీ రాజ్ఞః స్కంధే సమాసజత్ ।
తం నిశమ్య వృతం పాండుం కుంత్యా సర్వే నరాధిపాః ॥ 8
యథాగతం సమాజగ్ముః గజైరశ్వైరథైస్తదా ।
తతస్తస్యాః పితా రాజన్ వివాహమకరోత్ ప్రభుః ॥ 9
ఆకుంతి సిగ్గుపడుతూ పాండురాజు మెడలో పూలమాల వెసింది. పాండురాజును ఆమె వరించిందన్న మాట విని అక్కడ రాజులంతా ఏనుగులనూ, గుఱ్ఱాలనూ, రథాలనూ ఎక్కి వచ్చిన రీతిలోనే వెళ్ళిపోయారు. రాజా! ఆతరువాత ఆమెతండ్రి కుంతి భోజుడు వివాహం జరిపించాడు. (8,9)
స తథా కుంతిభోజస్య దుహిత్రా కురునందనః ।
యుయుజేఽమితసౌభాగ్యః పౌలోమ్యా మఘవానివ ॥ 10
ఆవిధంగా అదృష్టవంతుడూ, కురునందనుడైన పాండురాజు దేవేంద్రుడు శచితో కలిసినట్టు కుంతిభోజుని కుమార్తెతో కలిశాడు. (10)
కుంత్యాః పాండోశ్చ రాజేంద్ర కుంతిభోజో మహీపతిః ।
కృత్వోద్వాహం తదా తం తు నానావసుభిరర్చితమ్ ।
స్వపురం ప్రేషయామాస స రాజా కురుసత్తమ ॥ 11
తతో బలేన మహతా నానాధ్వజపతాకినా ।
స్తూయమానః సచాశీర్భిః బ్రాహ్మణైశ్చ మహర్షిభిః ॥ 12
సంప్రాప్య నగరం రాజా పాండుః కౌరవనందనః ।
న్యవేశయత తాం భార్యాం కుంతీం స్వభవనే ప్రభుః ॥ 13
రాజేంద్రా! కుంతిభోజుడు కుంతికీ, పాండురాజుకూ వివాహం జరిపించి అనేకధనాలతో అర్చించి పాండురాజును తన నగరానికి పంపించాడు. అప్పుడు కౌరవనందనుడైన పాండురాజు నానాధ్వజ పతాకాలు గల గొప్పసేనతో కలిసి, బ్రాహ్మణుల, మహర్షుల ఆశీస్సులు పొందుతూ, అభినందింపబడుతూ తన నగరానికి వచ్చి భార్య అయిన కుంతిని తన భవనంలో ప్రవేశింపజేశాడు. (11-13)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి కుంతీవివాహే ఏకదశాధికశతతమోఽధ్యాయః ॥ 111 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున కుంతీవివాహమను నూటపదకొండవ అధ్యాయము. (111)