109. నూట తొమ్మిదవ అధ్యాయము

ధృతరాష్ట్రుని వివాహము.

భీష్మ ఉవాచ
గుణైః సముదితం సమ్యగ్ ఇదం నః ప్రథితం కులమ్ ।
అత్యన్యాన్ పృథివీపాలాన్ పృథివ్యామధిరాజ్యభాక్ ॥ 1
భీష్ముడిలా అన్నాడు. సద్గుణసంపన్నమయిన మన వంశం జగత్ప్రసిద్దినందినది. ఇతర రాజులను జయించి భూమండలంలో సామ్రాజ్యాన్ని పొందింది. (1)
రక్షితం రాజభిః పూర్వం ధర్మవిద్భిర్మహాత్మభిః ।
నోత్సాదమగచ్చేదం కదాచిదిహ నః కులమ్ ॥ 2
పూర్వం ధర్మవేత్తలూ, మహాత్ములూ అయిన రాజులు పరిపాలించినదీ రాజ్యం. అందువలననే మన వంశమెప్పుడూ నశించలేదు. (2)
మయా చ సత్యవత్యా చ కృష్ణేన చ మహాత్మనా ।
సమవస్థాపితం భూయః యుష్మాసు కులతంతుషు ॥ 3
నేనూ, సత్యవతీ, వ్యాసభగవానుడూ కలిసి మరల ఈ వంశాన్ని ఉద్ధరించాము. ఇప్పుడు సోదరులు మీరు ముగ్గురూ ఈ వంశానికి తంతువులూ, ప్రతిష్ఠాహేతువులూను. (3)
తచ్చైతద్ వర్ధతే భూయః కులం సాగరవద్ యథా ।
తథా మయా విధాతవ్యం త్వయా చైవ న సంశయః ॥ 4
మరలా ఈ వంశం సముద్రంలా వృద్ధి చెందటానికి తగిన ఏర్పాట్లను నిస్సందేహంగా నేనూ, నీవూ చేయాలి. (4)
శ్రూయతే యాదవీ కన్యా స్వునురూపా కులస్య నః ।
సుబలస్యాత్మజా చైవ తథా మద్రేశ్వరస్య చ ॥ 5
యదువంశానికి చెందిన కన్య మనవంశానికి అన్ని విధాలా తగినదని వింటున్నాం. అలాగే సుబలునికూతురు, మద్రరాజు కూతురు కూడా తగిన వారే. (5)
కులీనా రూపవత్యశ్చ తాః కన్యాః పుత్ర సర్వశః ।
ఉచితాశ్చైవ సంబంధే తేఽస్మాకం క్షత్రియర్షభాః ॥ 6
నాయనా! ఆ కన్యలు సద్వంశాలకు చెందినవారూ, రూపవతులూ. ఆ క్షత్రియశ్రేష్ఠులూ మనతో వియ్యమందటానికి అన్ని విధాలా తగిన వారు. (6)
మన్యే వరయితవ్యాస్తాః ఇత్యహం ధీమతాం వర ।
సంతానార్థం కులస్యాస్య యద్ వా విదుర మన్యసే ॥ 7
ధీమంతులలో శ్రేష్ఠుడా! మన వంశప్రతిష్ఠాపనకోసం ఆకన్యలను వరించాలని నేను అనుకొంటున్నాను. విదురా! నీ అభిప్రాయమేమి? (7)
విదుర ఉవాచ
భవాన్ పితా భవన్ మాతా భవాన్ నః పరమో గురుః ।
తస్మాత్ స్వయం కులస్యాస్య విచార్య కురు యద్ధితమ్ ॥ 8
విదురుడిలా అన్నాడు. మాకు నీవే తండ్రివి. నీవే తల్లివి. పరమగురువువు నీవే. కాబట్టి నీవే ఆలోచించి ఈ వంశాన్కి హితమైన దానిని చేయి. (8)
వైశంపాయన ఉవాచ
అథ శుశ్రావ విప్రేభ్యః గాంధారీం సుబలాత్మజామ్ ।
ఆరాధ్య వరదం దేవం భగనేత్రహరం హరమ్ ॥ 9
గాంధారీ కిల పుత్రాణాం శతం లేభే వరం శుభా ।
ఇతి శుశ్రావ తత్త్వేన భీష్మః కురుపితామహః ॥ 10
తతో గాంధారరాజస్య ప్రేషయామాస భారత ।
అచక్షురితి తత్రాసీత్ సుబలస్య విచారణా ॥ 11
వైశంపాయనుడిలా అన్నాడు. జనమేజయా! ఆ తర్వాత భీష్ముడు గాంధారరాజయిన సుబలుని కూతురు గాంధారిని గురించి బ్రాహ్మణుల ద్వారా విన్నాడు. ఆమె భగనేత్రహారి అయిన శంకరుని ఆరాధించి వందమంది కుమారులను వరంగా పొందిందని తెలిసింది. అది వాస్తవమని నిరూపణ చేసికొని కురుపితామహుడైన భీష్ముడు గాంధారరాజుకు కబురు పంపాడు. గాంధాఱ రాఉ సుబులుడు - ధృతరాష్ట్రుడు అంధుడు - గదా అని శంకించాడు. (9- 11)
కులం ఖ్యాతిం చ వృత్తం చ బుద్ధ్యా తు ప్రసమీక్ష్య సః ।
దదౌ తాం ధృతరాష్ట్రాయ గాంధారీం ధర్మచారిణీమ్ ॥ 12
కానీ వంశాన్నీ, ప్రతిష్ఠను, ప్రవర్తను బుద్ధితో సమీక్షిమ్చి సుబలుడు గాంధారిని ధృతరాష్ట్రునికి ధర్మచారిణిగా చేయటానికి మాట ఇచ్చాడు. (12)
గాంధారీ త్వథ శుశ్రావ ధృతరాష్ట్రమచక్షుషమ్ ।
ఆత్మానం దిత్సితం చాస్మై పిత్రా మాత్రా చ భారత ॥ 13
తతః సా పట్టమాదాయ కృత్వా బహుగుణం తదా ।
బబంధ నేత్రే స్వే రాజన్ పతివ్రతపరాయణా ॥ 14
నాభ్యసూయాం పతిమహమ్ ఇత్యేవం కృతనిశ్చయా ।
తతో గాంధారరాజస్య పుత్రః శకుని రభ్యయాత్ ॥ 15
స్వసారం వయసా లక్ష్మ్యా యుక్తామాదాయ కౌరవాన్ ।
తాం తదా ధృతరాష్ట్రాయ దదౌ పరమసత్కృతామ్ ।
భీష్మస్యానుమతే చైవ వివాహం సమకారయత్ ॥ 16
జనమేజయా! ఆ తరువాత గాంధారి ధృతరాష్ట్రుడు అంధుడనీ, అతనికి తనను ఇవ్వాలని తల్లీ, తండ్రీ నిర్ణయించారనీ తెలిసికొని వస్త్రాన్ని తెప్పించి మడతలు పెట్టి కళ్ళకు కట్టుకొన్నది. భర్తను చూచి అతనిలోని దోషాన్ని ఎంచకూడదని ఆ పతివ్రత భావించింది. ఆ తరువాత గాంధార రాజుకొడుకు శకుని వయస్సుతో, శోభతో ప్రకాశిస్తున్న తన చెల్లెలిని తీసికొని కౌరవుల దగ్గరకు వచ్చి ఆమెను ధృతరాష్ట్రునకిచ్చాడు. సాదరంగా స్వాగతింపబడిన ఆమెకు భీష్ముని అనుమతితో వివాహం జరిపిమ్చారు. (13-16)
దత్త్వా స భగినీం వీరః యథార్హం చ పరిచ్ఛదమ్ ।
పునరాయాత్ స్వనగరం భీష్మేణ ప్రతిపూజితః ॥ 17
ఆ వీరుడు శకుని తన చెల్లెలిని ఇచ్చి, యథోచితంగా బట్టలు పెట్టాడు. భీష్ముని పూజలందుకొని, మరల తన నగరానికి వెళ్ళిపోయాడు. (17)
గాంధార్యపి వరారోహా శీలాచారవిచేష్టితైః ।
తుష్టిం కురూణాం సర్వేషాం జనయామాస భారత ॥ 18
జనమేజయా! సుందరాంగి అయిన గాంధారి కూడా తనశీలం, ఆచారం, నడవడికలతో కురువంశస్థులందరకూ ఆనందాన్ని కలిగించింది. (18)
వృత్తేనారాధ్య తాన్ సర్వాన్ గురూన్ పతిపరాయణా ।
వాచాపి పురుషానన్యాన్ సువ్రతా నాన్వకీర్తయత్ ॥ 19
సత్ ప్రవర్తనతో గురువుల నందరినీ పూజుస్తూ, పతియందే ఆసక్తి గల ఆ సువ్రత-గాంధారి- మాట మాత్రంగా కూడా పరపురుష ప్రస్తావన చేయకుండా గడిపింది. (19)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి ధృతరాష్ట్రవివాహే నవాధికశతతమోఽధ్యాయః ॥ 109 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున ధృతరాష్ట్రవివాహమను నూట తొమ్మిదవ అధ్యాయము. (109)