102. నూట రెండవ అధ్యాయము
విచిత్రవీర్య వృత్తాంతము.
వైశంపాయన ఉవాచ
హతే చిత్రాంగదే భీష్మః బాలే భ్రాతరి కౌరవ ।
పాలయామాస తద్రాజ్యం సత్యవత్యా మతే స్థితః ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. కౌరవా! చిత్రాంగదుడు మరణించగా విచిత్రవీర్యుడు బాలుడై ఉండగా భీష్ముడు సత్యవతి అభిప్రాయాన్ని అనుసరిస్తూ ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. (1)
సంప్రాప్తయౌవనం దృష్ట్వా భ్రాతరం ధీమతాం వరః ।
భీష్మో విచిత్రవీర్యస్య వివాహాయాకరోన్మతిమ్ ॥ 2
విచిత్రవీర్యుడు యౌవనాన్ని పొందాక సోదరుని చూచి బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన భీష్ముడు అతనికి వివాహం జరిపించ సంకల్పించాడు. (2)
అథ కాశిపతేర్భీష్మః కన్యాస్తిస్రోఽప్సరోపమాః ।
శుశ్రావ సహితా రాజన్ వృణ్వానా వై స్వయంవరమ్ ॥ 3
రాజా! ఆ తరువాత అప్సరలతో సమానమైన కాశిరాజ పుత్రికలు ముగ్గురు ఒక్కటై స్వయంవరంలో భర్తను ఎన్నుకొనబోతున్నారని భీష్ముడు విన్నాడు. (3)
తతః స రథినాం శ్రేష్ఠః రథేనైకేవ శత్రుజిత్ ।
జగామానుమతే మాతుః పురీం వారాణసీం ప్రభుః ॥ 4
ఆ తర్వాత శత్రుసంహారి, రథికశ్రేష్ఠుసూ అయిన భీష్ముడు - తల్లి అనుమతితో ఒక రథంలో వారాణసికి బయలు దేరాడు. (4)
తత్ర రాజ్ఞః సముదితాన్ సర్వతః సముపాగతాన్ ।
దదర్శ కన్యాస్తాశ్చైవ భీష్మః శాంతనునందనః ॥ 5
అక్కడ అన్ని దిక్కుల నుండి వచ్చి చేరిన రాజులనూ, ఆ కన్యలనూ కూడా శాంతనుకుమారుడైన భీష్ముడు చూచాడు. (5)
కీర్త్యమానేషు రాజ్ఞాం తు తదా నామసు సర్వశః ।
ఏకాకినం తదా భీషం వృద్ధం శాంతనునందనమ్ ॥ 6
సోద్వేగా ఇవ తం దృష్ట్వా కన్యాః పరమశోభనాః ।
అపాక్రామంత తాః సర్వాః వృద్ధ ఇత్యేన చింతయా ॥ 7
అప్పుడు అన్నివైపుల నుండి రాజుల పేర్లను పరిగ్రహించి అందరికీ పరిచయం చేయసాగారు. ఆ అందరిలో అపటికి వృద్ధుడై ఒంటరిగా వచ్చినవాడు శాంతనుసుతుడైన భీష్ముడే. మిగుల అందగత్తెలయిన ఆ కన్యలు భీష్ముని చూచి కలతపడి వృద్ధుడన్న భావంతో దూరంగా వెళ్ళారు. (6,7)
వృద్ధః పరమధర్మాత్మా వలీపలితధారణః ।
కిం కారణమిహాయాతః నిర్లజ్జో భరతర్షభః ॥ 8
మిథ్యాప్రతిజ్ఞో లోకేషు కిం వదిష్యతి భారత ।
బ్రహ్మచాఱీతి భీష్మో హి వృథైవ ప్రథితో భువి ॥ 9
ఇత్యేవం ప్రబ్రువంతస్తే హసంతి స్మ నృపాధమాః ।
అక్కడ చేరిన నీచస్వభావం గల రాజులు పరిహసిస్తూ భీష్ముని గూర్చి ఇలా హేళనగా అనుకొనసాగారు. "ముసలివాడు పరమధర్మ స్వరూపుడు. ముడతలు పడిన దేహం, నెరసిన వెంట్రుకలు. సిగ్గు లేకుండా ఇక్కడి కెందుకు వచ్చాడో! పైగా భరతవంశశ్రేష్ఠుడు, ప్రతిజ్ఞ తప్పుతున్నాడు. ప్రజలకేం చెప్పగలడు. భీష్ముడు బ్రహ్మచారి అని లోకం మాత్రం నిరర్థకంగా ప్రసిద్ధి కల్పిస్తోంది." (8, 9 1/2)
వైశంపాయన ఉవాచ
క్షత్రియాణాం వచః శ్రుత్వా భీష్మశ్చుక్రోధ భారత ॥ 10
వైశంపాయనుడిలా అన్నాడు. ఆ రాజుల మాటలు ఆలకించి భీష్ముడు మండిపడ్డాడు. (10)
భీష్మస్తదా స్వయం కన్యాః వరయామాస తాః ప్రభుః ।
ఉవాచ చ మహీపాలాన్ రాజన్ జలదనిస్వనః ॥ 11
రథమారోప్య తాః కన్యాః భీష్మః ప్రహరతాం వరః ।
అహూయ దానం కన్యానాం గుణవద్భ్యః స్మృతం బుధైః ॥ 12
అలంకృత్య యథాశక్తి ప్రదాయ చ ధనాన్యపి ।
ప్రయచ్ఛంత్యపరే కన్యః మిథునేన గవామపి ॥ 13
భీష్ముడప్పుడు తానే స్వయంగా ఆ కన్యలను వరించాడు. వారిని తన రథంపైకి ఎక్కించుకొని యోధాగ్రగణ్యుడైన భీష్ముడు మేఘగంభీరధ్వనితో ఆ రాజులతో ఇలా అన్నాడు - కన్యలను యథాశక్తిగా అలంకరించి గుణవంతుడైన వరుని పిలిపించి ధనాదులతో పాటు కన్యాదానం చేయటం ఉత్తమమని పండితుల భావన. మరి కొందరు గోవుల జంటను స్వీకరించి కన్యాదానం చేస్తారు. (11-13)
విత్తేన కథితేనాన్యే బలేనాన్యేఽనుమాన్య చ ।
ప్రమత్తాముపయంత్యన్యే స్వయమన్యే చ విందతే ॥ 14
కొందరు నియతమయిన ధనాన్ని స్వీకరించి కన్యాదానం చేస్తారు. మరి కొందరు బలంతో కన్యల నపహరిస్తారు. కొందరు పరస్పరాంగీకారంతో దంపతులవుతారు. మరికొందరు స్పృహకోల్పోయిన స్త్రీ ని అపహరిస్తారు. మరికొందరు స్వయంగా స్త్రీ, పురుషులను ఒక చోట చేర్చి ప్రతిజ్ఞాపూర్వకంగా వివాహం జరిపిస్తారు. ఆ విధంగా భార్యను పొందుతాడు భర్త. (14)
ఆర్షం విధిం పురస్కృత్య దారాన్ విందంతి చాపరే ।
అష్టమం తమథో విత్త వివాహం కవిభిర్వృతమ్ ॥ 15
కొందరు ఆర్షమైన పద్ధతిలో భార్యను పొందుతారు. ఈ విధంగా వివాహం ఎనిమిది రకాలని పండితభావన. గ్రహించండి. (15)
స్వయంవరం తు రాజన్యాః ప్రశంసంత్యుపయాంతి చ ।
ప్రమథ్య తు హృతామాహుః జ్యాయసీం ధర్మవాదినః ॥ 16
క్షత్రియులు స్వయంవరాన్ని ప్రశంసించి పాటిస్తారు. అందులో కూడా ఇతర రాజులందరినీ ఓడించి కన్యను కొనిపోగలిగితే అదే క్షత్రియులకు గొప్పదని ధర్మవేత్తలంటారు. (16)
తా ఇమాః పృథివీపాలాః జిహీర్షామి బలాదితః ।
తే యతధ్వం పరం శక్త్యా విజయాయేతరాయ వా ॥ 17
రాజులారా! ఈ కన్యలను బలవంతంగా ఇక్కడ నుండి తీసికొని పోదలచాను. మీరు సర్వశక్తులూ ఒడ్డి గెలుపుకోసమో, ఓటమి కోసమో ప్రయత్నించండి. (17)
స్థితోఽహం పృథివీపాలాః యుద్ధామ కృతనిశ్చయః ।
ఏవముక్త్వా మహీపాలాన్ కాశిరాజం చ వీర్యవాన్ ॥ 18
సర్వాః కన్యా స కౌరవ్యః రథమారోప్య చ స్వకమ్ ।
ఆమంత్య్ర చ స తాన్ ప్రాయాత్ శీఘ్రం కన్యాః ప్రహృహ్య తాః ॥ 19
రాజాలారా! యుద్ధానికి సిద్ధమై నేనున్నాను - ఆ రాజులతో, కాశిరాజుతో ఈ విధంగా చెప్పి పరాక్రమశాలి అయిన ఆ బీష్ముడు ఆ కన్యలను తన రథమెక్కించుకొని, అందరినీ వీడ్కొని, ఆ కన్యలతో వేగంగా వెళ్ళిపోయాడు. (18, 19)
తతస్తే పార్థివాః సర్వే సముత్పేతురమర్షితాః ।
సంస్పృశంతః స్వకాన్ బాహూన్ దశంతో దశనచ్ఛదాన్ ॥ 20
అప్పుడు ఆ రాజులందరూ అసహనంతో జబ్బచరుస్తూ పళ్ళు కొరుకుతూ ఒక్కపెట్టున లేచారు. (20)
తేషామాభరణాన్యాశు త్వరితానాం విముంచతామ్ ।
ఆముంచతాం చ వర్మాణి సంభ్రమః సుమహానభూత్ ॥ 21
వారు వేగంగా తమ ఆభరణాలను వీడి కవచాలను ధరించసాగారు. ఆ సమయంలో పెద్దకోలాహలం జరిగింది. (21)
తారాణామివ సంపాతః బభూవ జనమేజయ ।
భూషణానాం చ సర్వేషాం కవచానాం చ సర్వశః ॥ 22
సవర్మభిః భూషణైశ్చ ప్రకీర్యద్భిరితస్తతః ।
సక్రోధామర్షజిహ్మభ్రూకషాయీకృతలోచనాః ॥ 23
సూతోపకప్తాన్ రుచిరాన్ సదశ్వైరుపకల్పితాన్ ।
రథానాస్థాయ తే వీరాః సర్వప్రహరణాన్వితాః ॥ 24
ప్రయాంతమథ కౌరవ్యమ్ అనుసస్రురుదాయుధాః ।
తతః సమభవద్ యుద్ధం తేషాం తస్య చ భారత ।
ఏకస్య చ బహూనాం చ తుములం రోమహర్షణమ్ ॥ 25
జనమేజయా! ఆ తొందరలో వారు ధరిస్తున్న ఆభరణాలూ, కవచాలూ అటో ఇటో పడుతున్నాయి. గగనసీమలోని తారలు రాలిపడినట్లు అనిపిస్తోంది. యోధుల కవచాలూ, భూషణాలూ చెల్లాచెదరయినాయి. క్రోధం, అమర్షం వలన వారి కళ్ళు ఎఱ్ఱబడ్డాయి. సారథులు మంచిగుఱ్ఱాలను పూన్చి అందమైన రథాలను సిద్ధం చేశారు. ఆ వీరులందరూ అన్ని ఆయుధాలనూ సమీకరించుకొని రథాలనెక్కి ఆయుధాల నెత్తిపట్టి వేగంగా వెళ్తున్న బీష్ముని అనుసరించారు. అప్పుడు ఆ రాజులకూ, భీష్మునికీ మధ్య యుద్ధం జరిగింది. ఒంటరి వాడైన భీష్ముడు అంతమంది రాజులతో చేస్తున్న యుద్ధం భీకరమై, గగుర్పాటు కలిగేటట్లుంది. (22-25)
తే త్విషూన్ దశసాహస్రాన్ తస్మిన్ యుగపదక్షిపన్ ।
అప్రాప్తాంశ్చైవ తానాశు భీష్మః సర్వాంస్తథాంతరా ॥ 26
అచ్ఛినచ్ఛరవర్షేణ మహతా లోమవాహినా ।
తతస్తే పార్థివాః సర్వే సర్వతః పరివార్య తమ్ ॥ 27
వవృషుః శరవర్షేణ వర్షేణేవాద్రిమంబుదాః ।
స తం బాణమయం వర్షం శరైరావార్య సర్వతః ॥ 28
తతః సర్వాన్ మహీపాలాన్ పర్యవిధ్యాత్ త్రిభిస్త్రిభిః ।
ఏకైకస్తు తతో భీష్మం రాజన్ వివ్యాధ పంచభిః ॥ 29
ఆ రాజులు భీష్మునిపై పదివేల బాణాలను ఒక్కసారిగా ప్రయోగించారు. వాటిని తన దగ్గరకు చేరక ముందే విశాలమైన రెక్కలు గల బాణవర్షంతో మధ్యలోనే త్రుంచివేశాడు భీష్ముడు. ఆ తరువాత రాజులందరూ భీష్ముని చుట్టుముట్టి మేఘాలు వర్షంతో పర్వతాన్ని కప్పివేసినట్టు బాణవర్షంతో ఆయనను కప్పివేశారు. భీష్ముడు ఆ బాణవర్షాన్ని అన్ని వైపులా ఆపి మూడు మూడు బానాలతో ఆ రాజుల నందరినీ గాయపరిచాడు. రాజా! ఆ తరువాత ఒక్కొకరుగా అయిదు బాణాలను భీష్మునిపై ప్రయోగించారు. (26-29)
స చ తాన్ ప్రతివివ్యాధ ద్వాభ్యాం ద్వాభ్యాం పరాక్రమన్ ।
తద్ యుద్ధమాసీత్ తుములం ఘోరం దేవాసురోపమమ్ ॥ 30
పశ్యతాం లోకవీరాణాం శరశక్తిసమాకులమ్ ।
స ధనూంషి ధ్వజాగ్రాణి వర్మాణి చ శిరాంసి చ ॥ 31
చిచ్ఛేద సమరే భీష్మః శతశోఽథ సహస్రశః ।
తస్యాతి పురుషానన్యాన్ లాఘవం రథచారిణః ॥ 32
రక్షణం చాత్మనః సంఖ్యే శత్రవోఽప్యభ్యపూజయన్ ।
తాన్ వినిర్జిత్య తు రణే సర్వశస్త్రభృతాం వరః ॥ 33
కన్యాభిః సహితః ప్రాయాద్ భారతో బారతాన్ ప్రతి ।
తతస్తం పృష్ఠతో రాజన్ శాల్వరాజో మహారథః ॥ 34
అభ్యగచ్ఛదమేయాత్మా భీష్మం శాంతనవం రణే ।
వారణం జఘనే భిందన్ దంతాభ్యామపరో యథా ॥ 35
వాసితామనుసంప్రాప్తః యూథపో బలినాం వరః ।
స్త్రీకామస్తిష్ఠ తిష్ఠేతి భీష్మమాహ స పార్థివః ॥ 36
శాల్వరాజో మహాబాహుః అమర్షేణ ప్రచోదితః ।
తతః స పురుషవ్యాఘ్రః భీష్మః పరబలార్దనః ॥ 37
తద్వాక్యాకులితః క్రోధాద్ విధూమోఽగ్నిరివ జ్వలన్ ।
వితతేషుధనుష్పాణిః వికుంచితలలాటభృత్ ॥ 38
భీష్ముడు పరాక్రమించి రెండు రెండు బాణాలతో వాటిని త్రిప్పికొట్టాడు. శరశక్తి సమాకులమైన ఆ యుద్ధం దేవాసురసంగ్రామం వలె భయంకరంగా, ఘోరంగా ఉంది. లోకవిఖ్యాతులయిన ఆ వీరుల ధనుస్సులనూ, ధ్వజాగ్రభాగాలనూ, కవచాలనూ, తలలనూ వందలూ వేలుగా భీష్ముడు ఆ యుద్ధంలో పడగొట్టాడు. రణరంగంలో రథచారియై ఇతరులను మించిపోతున్న నేర్పును, ఆత్మరక్షణ విధానాన్నీ శత్రువులు కూడా అభినందించారు. మేటివిలుకాడయిన భీష్ముడు యుద్ధంలో వారినందరినీ ఓడించి ఆ బాలికలతో పాటు స్వదేశానికి వెళ్ళిపోయాడు. రాజా! ఆ తరువాత మహారథుడయిన శాల్వరాజు భీష్ముని వెన్నంటి వచ్చి యుద్ధం చేయాలని ఆయనను ఎదిరించాడు. శాల్వరాజు అసాధారణ బలం గలవాడు. ఆడేనుగును వెన్నంటిపోతున్న గజపతిని మరొక గజరాజు వచ్చి దంతాలతో వెనుక భాగాన్ని చీల్చినట్టు బలశాలులలో శ్రేష్ఠుడైన ఆ శాల్వరాజు స్త్రీని పొందాలన్న కోరికతో భీష్ముని వెనుక వచ్చి "నిలు నిలు" అని భీష్ముని నిరోధించాడు. శత్రుసంహర్త అయిన బీష్ముడు ఆ మాటలు విని కోపంతో పొగలేని నిప్పు వలె ప్రజ్వరిల్లుతూ ధనుర్బాణాలు చేతపట్టి నుదురు చిట్లిస్తూ నిలిచాడు. (30-38)
క్షత్రధర్మం సమాస్థాయ వ్యపేతభయసంభ్రమః ।
నివర్తయామాస రథం శాల్వం ప్రతి మహారథః ॥ 39
మహారథుడయిన ఆ బీష్ముడు క్షాత్రధర్మాన్ని అనుసరించి భయసంభ్రమాలు లేకుండా రథాన్ని శాల్వుని వైపు మరలించాడు. (39)
నివర్తమానం తం దృష్ట్వా రాజానః సర్వ ఏవ తే ।
ప్రేక్షకాః సమపద్యంత భీష్మశాల్వసమాగమే ॥ 40
భీష్ముడు వెనుకకు మరలటాన్ని చూచి ఆ రాజులందరూ భీష్మశాల్వయుద్ధానికి ప్రేక్షకులయ్యారు. (40)
తౌ వృషావివ నర్దంతౌ బలినౌ వాసితాంతరే ।
అన్యోన్యమభ్యవర్తేతాం బలవిక్రమశాలినౌ ॥ 41
బలవిక్రమ సంపన్నులయిన ఆ భీష్మశాల్వులు మైథునేచ్ఛ గల బలిష్ఠాలైన వృషభాలవలె ఒకరినొకరు ఎదిరించారు. (41)
తతో భీష్మం శాంతనవం శరైః శతసహస్రశః ।
శాల్వరాజో నరశ్రేష్ఠః సమవాకిరదాశుగైః ॥ 42
ఆ తరువాత నరశ్రేష్ఠుడైన శాల్వరాజు శాంతనుసుతుడైన భీష్మునిపై వేగవంతాలయిన బాణాలను వందలు, వేలుగా కురిపించాడు. (42)
పూర్వమభ్యర్దితం దృష్ట్వా భీష్మం శాల్వేన తే నృపాః ।
విస్మితాః సమపద్యంత సాధు సాధ్వితి చాబ్రువన్ ॥ 43
ముందుగా శాల్వుడే భీష్ముని నొప్పించటాన్ని చూసిన ఆ రాజులందరూ ఆశ్చర్యచకితులై 'భళా! భలా' అని శాల్వుని అభినందించారు. (43)
లాఘవం తస్య తే దృష్ట్వా సమరే సర్వపార్థివాః ।
అపూజయంత సంహృష్టాః వాగ్భిః శాల్వం నరాధిపమ్ ॥ 44
రాజులందరూ యుద్ధంలో శాల్వుని నేర్పును చూచి ఆనందించి ఆ శాల్వరాజును మాటలతో ప్రశంసించారు. (44)
క్షత్రియాణాం తతో వాచః శ్రుత్వా పరపురంజయః ।
క్రుద్ధః శాంతనవో భీష్మః తిష్ఠ తిష్ఠేత్యబాషత ॥ 45
శత్రునగరాలను జయించగల ఆ భీష్ముడు ఆ రాజుల మాటలు ఇని కోపించి నిలు నిలు అని అరిచాడు. (45)
సారథిం చాబ్రవీత్ క్రుద్ధః యాహి యత్రైష పార్థివః ।
యావదేనం నిహన్మ్యద్య భుజంగమివ పక్షిరాట్ ॥ 46
కోపంతో సారథితో ఇలా అన్నాడు - 'ఆ రాజున్న దిక్కునకు రథాన్ని నడుపు. గరుత్మంతుడు పామును చంపినట్టు ఇతనిని చంపివేస్తాను. (46)
తతోఽస్త్రం వారుణం సమ్యగ్ యోజయామాస కౌరవః ।
తేనాశ్వాంశ్చతురోఽమృందత్ శాల్వరాజస్య భూపతే ॥ 47
మహారాజా! ఆ తరువాత భీష్ముడు వారుణాస్త్రాన్ని చక్కగా ప్రయోగించి శాల్వరాజు రథాశ్వాలను నాలుగింటిని కొట్టాడు. (47)
అస్త్రైరస్త్రాణి సంవార్య శాల్వరాజస్య కౌరవః ।
భీష్మో నృపతిశార్దూల న్యవధీత్ తస్య సారథిమ్ ॥ 48
రాజోత్తమా! శాల్వరాజు ప్రయోగించిన బాణాలను తన బాణాలతో నిరోధించి కౌరవ వంశస్థుడైన భీష్ముడు శాల్వుని రథసారథిని సంహరించాడు. (48)
అస్త్రేణ చాస్యాథైంద్రేణ న్యవధీత్ తురగోత్తమాన్ ।
కన్యాహేతోర్నరశ్రేష్ఠ భీష్మః శాంతనవస్తదా ॥ 49
జిత్వా విసర్జయామాస జీవంతం నృపసత్తమమ్ ।
తతః శాల్వః స్వనగరం ప్రయయౌ భరతర్షభ ॥ 50
స్వరాజ్య మన్వశాచ్ఛైవ ధర్మేణ నృపతిస్తదా ।
రాజానో యే చ తత్రాసన్ స్వయంవరదిదృక్షవః ॥ 51
స్వాన్యేవ తేఽపి రాష్ట్రాణి జగ్ముః పరపురంజయాః ।
ఏవం విజిత్య తాః కన్యాః భీష్మః ప్రహరతాం వరః ॥ 52
ప్రయయౌ హాస్తినపురం యత్ర రాజా స కౌరవః ।
విచిత్రవీర్యో ధర్మాత్మా ప్రశాస్తి వసుధామిమామ్ ॥ 53
నరోత్తమా! ఆ తరువాత ఇంద్రసంబంధమైన అస్త్రంతో గుఱ్ఱాలను సంహరించాడు. అప్పుడు శాంతనవుడైన భీష్ముడు ఆ బాలికల కోసం శాల్వుని ఓడించి ప్రాణాలతో విడిచిపెట్టాడు. భరతశ్రేష్ఠా! ఆ తరువాత శాల్వుడు తన నగరానికి మరలిపోయాడు. ధర్మబద్ధంగా తన రాజ్యాన్ని పరిపాలించాడు. స్వయంవరాన్ని చూడటానికి అక్కడకు వచ్చిన రాజులందరూ తమ తమ రాజ్యాలకు మరలి పోయారు. మేటి యోధుడయిన భీష్ముడు ఈ విధంగా ఆ బాలికలను గెలుచుకొని హస్తినాపురానికి బయలుదేరాడు. ఆ హాస్తిననగరంలోనే ధర్మాత్ముడైన ఆ కౌరవరాజు విచిత్ర వీర్యుడు రాజ్యపాలన చేస్తుండేవాడు. (49-53)
యథా పితాస్య కౌరవ్యః శాంతనుర్నృపసత్తమః ।
సోఽచిరేణైవ కాలేన అత్యక్రామన్నరాధిప ॥ 54
వనాని సరితశ్చైవ శైలాంశ్చ వివిధాన్ ద్రుమాన్ ।
అక్షతః క్షపయిత్వారీన్ సంఖ్యేఽసంఖ్యేయవిక్రమః ॥ 55
రాజా! రాజశ్రేష్ఠుడూ, కురువంశస్థుడూ అయిన శాంతనుని వలె ఆ భీష్ముడు కూడా రాజ్యపరిపాలన సాగించాడు. స్వల్పకాలంలోనే వనాలనూ, నదులనూ, పర్వతాలనూ, వివిధవృక్షాలను అతిక్రమించి ముందుకు దూసుకొని పోయేవాడు. యుద్ధంలో అవర్ణనీయ పరాక్రమం గల ఆ భీష్ముడు తాను గాయపడకుండా శత్రువులను గాయ పరచేవాడు. (54,55)
ఆనయామాస కాశ్యస్య సుతాః సాగరగాసుతః ।
స్నుషా ఇవ స ధర్మాత్మా భగినీరివచానుజాః ॥ 56
ఆ గాంగేయుడు ధర్మాత్ముడై ఆ కాశిరాజకుమార్తెలను కోడళ్ళను వలె, సోదరులనువలె తీసికొని వచ్చాడు. (56)
యథా దుహితరశ్చైవ పరిగృహ్య యయౌ కురాన్ ।
ఆనిన్యే స మహాబాహుః భ్రాతుః ప్రియచికీర్షయా ॥ 57
సోదరునకు ప్రియాన్ని చేకూర్చాలన్న భావనతో మహాబాహువైన ఆ భీష్ముడు కాశిరాజుకూతుళ్ళను తన కుమార్తెలన్నట్లుగా తీసికొని కురురాజ్యాన్ని చేరాడు. (57)
తాః సర్వగుణసంపన్నాః భ్రాతా భ్రాత్రే యవీయసే ।
భీష్మో విచిత్రవీర్యాయ ప్రదదౌ విక్రమాహృతాః ॥ 58
తన పరాక్రమంతో తీసికొని వచ్చిన సర్వగుణసంపన్న లయిన ఆ కన్యలను భీష్ముడు చిన్నతమ్ముడయిన విచిత్ర వీర్యునకు ఇచ్చాడు. (58)
ఏవం ధర్మేణ ధర్మజ్ఞః కృత్వా కర్మాతిమానుషమ్ ।
భ్రాతుర్విచిత్రవీర్యస్య వివాహాయోపచక్రమే ॥ 59
సత్యవత్యా సహ మిథః కృత్వా నిశ్చయమాత్మవాన్ ।
వివాహం కారయిష్యంతం భీష్మం కాశిపతేః సుతా ।
జ్యేష్ఠా తాసామిదం వాక్యమ్ అబ్రవీద్ధసతీ తదా ॥ 60
జితేంద్రియుడూ, ధర్మజ్ఞుడూ, అయిన భీష్ముడు ఈ విధంగా అమానుష సాహసం చేసి తెచ్చిన ఆ కన్యలతో విచిత్ర వీర్యునకు వివాహం జరిపించ నుపక్రమించాడు. సత్యవతితో చర్చించియే ఆ నిశ్చయం చేశాడు. వివాహం జరిపించబోయే సమయంలో కాశిరాజు పెద్దకూతురు భీష్మునితో ఇలా అన్నది. (59,60)
మయా సౌభవతిః పూర్వం మనసా హి వృతః పతిః ।
తేన చాస్మి వృతా పూర్వమ్ ఏష కామశ్చ మే పితుః ॥ 61
నా మనస్సులో నేను ముందే వరించిన భర్త సౌభవతి శాల్వుడు. ఆయన కూడా నన్ను వరించాడు. మా తండ్రి కోరిక కూడా ఇదే. (61)
మయా వరయితవ్యోఽభూత్ శాల్వస్తస్మిన్ స్వయంవరే ।
ఏతద్ విజ్ఞాయ ధమజ్ఞ ధర్మతత్త్వం సమాచార ॥ 62
ఆ స్వయంవరంలో నేను శాల్వునే వరించేదాన్ని. ధర్మజ్ఞా! దీనిని గ్రహించి ధర్మానుసారంగా ఆచరించండి. (62)
ఏవముక్తస్తయా భీష్మః కన్యయా విప్రసంసది ।
చింతామభ్యగమద్ వీరః యుక్తాం తస్యైవ కర్మణః ॥ 63
బ్రాహ్మణుల సమక్షంలో ఆ విధంగా చెప్పిన ఆ కన్యమాటలు విని వీరుడైన భీష్ముడు వివాహవిషయంలో యుక్తియుక్తతను గూర్చి ఆలోచించాడు. (63)
వినిశ్చిత్య స ధర్మజ్ఞః బ్రాహ్మణైర్వేదపారగైః ।
అనుజజ్ఞే తదా జ్యేష్ఠామ్ అంబాం కాశిపతేః సుతామ్ ॥ 64
వేదవేత్తలయిన బ్రాహ్మణులతో సంప్రదించి ఆ ధర్మాత్ముడు అప్పుడు కాశిరాజు పెద్దకూతురు అంబను స్వేచ్ఛగా వెళ్ళటానికి అనుమతించాడు. (64)
అంబికాంబాలికే భార్యే ప్రాదాద్ భ్రాత్రే యవీయసే ।
భీష్మో విచిత్రవీర్యాయ విధిదృష్టేన కర్మణా ॥ 65
భీష్ముడు శాస్త్రోక్తమైన కర్మతో చిన్న తమ్ముడు విచిత్ర వీర్యునకు అంబిక, అంబాలికలను భార్యలను చేశాడు. (65)
తయోః పాణీ గృహీత్వా తు రూపయౌవనదర్పితః ।
విచిత్రవీర్యో ధర్మాత్మా కామాత్మా సమపద్యత ॥ 66
వారిని పరిగ్రహించి రూపయౌవన గర్వంతో ధర్మాత్ముడయిన విచిత్రవీర్యుడు కామాత్ముడయ్యాడు. (66)
తే చాపి బృహతీ శ్యామే నీలకుంచితమూర్ధజే ।
రక్తతుంగనఖోపేతే పీనశ్రోణిపయోధరే ॥ 67
అంబిక, అంబాలిక కూడా పదహారు సంవత్సరాల వయస్సు గలవారు. పుష్టిగా ఉన్నవారు. నల్లనికురులు గలవారు. వారి గోళ్లు ఎఱ్ఱగా ఎత్తుగా ఉన్నాయి. వారి పిరుదులూ, వక్షోజాలు బలిష్ఠంగా ఉన్నాయి. (67)
ఆత్మనః ప్రతిరూపోఽసౌ లబ్ధః పతిరితి స్థితే ।
విచిత్రవీర్యం కళ్యాణ్యౌ ఫూజయామాసతుః శుభే ॥ 68
తమకు తగిన భర్త లభించాడని ఆ శుబాంగనలు ఆ విచిత్రవీర్యుని సేవించసాగారు. (68)
స చాశ్విరూపసదృశః దేవతుల్యపరాక్రమః ।
సర్వాసామెవ నారీణాం చిత్తప్రమథనో రహః ॥ 69
ఆ విచిత్రవీర్యుడు అశ్వినీకుమారుల వంటి రూపం గలవాడు. దేవతలతో సమానమైన పరాక్రమం గలవాడు. ఏకాంతంలో స్త్రీలకందరకూ మనస్సులో మోహాన్ని కల్గించగలవాడు. (69)
తాభ్యాం సహ సమాః సప్త విహరన్ పృథివీపతిః ।
విచిత్రవీర్యస్తరుణః యక్ష్మణా సమగృహ్యత ॥ 70
ఆ బార్యలతో పాటు ఏడు సంవత్సరాలు క్రీడించిన ఆ రాజు - విచిత్రవీర్యుడు యౌవనంలోనే క్షయవ్యాధికి గురి అయ్యాడు. (70)
సుహృదాం యతమానానామ్ ఆప్తైః సహ చికిత్సకైః ।
జగామాస్తమివాదిత్యః కౌరవ్యో యమసాదనమ్ ॥ 71
అతని శ్రేయోభిలాషులు అందరూ ఆప్తులయిన వైద్యుల ద్వారా చికిత్స జరిపించినా ఆ విచిత్రవీర్యుడు సూర్యుడు అస్తమించినట్లు మరణించాడు. (71)
ధర్మాత్మా స తు గాంగేయః చింతాశోకపరాయణః ।
ప్రేతకార్యాణి సర్వాణి తస్య సమ్యగకారయత్ ॥ 72
రాజ్ఞో విచిత్రవీర్యస్య సత్యవత్యా మతే స్థితః ।
ఋత్విగ్భిః సహితో భీష్మః సర్వైశ్చ కురుపుంగవైః ॥ 73
ధర్మాత్ముడయిన ఆ భీష్ముడు చింతాశోకాలకు లోనయి తల్లి, ఆదేశాలను అనుసరిస్తూ కురువంశశ్రేష్ఠులతో, ఋత్విక్కులతో కలిసి విచిత్ర వీర్య మహారాజుకు ప్రేతకార్యాలను అన్నింటినీ చక్కగా జరిపించాడు. (72,73)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి విచిత్రవీర్యోపరమే ద్వ్యధికశతతమోఽధ్యాయః ॥ 102 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున విచిత్రవీర్యోపరమమను నూట రెండవ అధ్యాయము. (102)