95. తొంబది అయిదవ అధ్యాయము
పూరు, భరత, పాండు వంశముల వర్ణనము.
జనమేజయ ఉవాచ
శ్రుతస్త్వత్తో మయా బ్రహ్మన్ పూర్వేషాం సంభవో మహాన్ ।
ఉదారాశ్చాపి వంశేఽస్మిన్ రాజానో మే పరిశ్రుతాః ॥ 1
బ్రాహ్మణోత్తమా! నీవల్ల నేను మా పూర్వికుల యొక్క గొప్ప జన్మవృత్తాంతాన్ని విన్నాను. ఈ వంశంలో రాజులు ఉదారులైనట్లుగా విన్నాను. (1)
కింతు లఘ్వర్థసంయుక్తం ప్రియాఖ్యానం న మామతి ।
ప్రీణాత్యతో భవాన్ భూయః విస్తరేణ బ్రవీతు మే ॥ 2
ఏతామేవ కథాం దివ్యామ్ ఆప్రజాపతితో మనోః ।
తేషామాజననం పుణ్యం కస్య న ప్రీతిమావహేత్ ॥ 3
కాని నాకిష్టమైన వారి వృత్తాంతం సంక్షిప్తంగా వినడం వల్ల నాకు తృప్తి కలగటం లేదు. అందువల్ల విస్తరంగా చెప్పు. దక్షప్రజాపతి, మనువు మొదలుకొని రాజుల జనన వృత్తాంతం మిక్కిలి పవిత్రమైంది. అది ఎవరికి ఆనందాన్ని కలిగించదు? (2,3)
సద్ధర్మగుణమాహాత్మ్యైః అభివర్ధితముత్తమమ్ ।
విష్టభ్య లోకాంస్త్రీనేషాం యశః స్ఫీతమవస్థితమ్ ॥ 4
ఉత్తమధర్మాలతో, గుణాలతో, గొప్పదనాలతో వృద్ధిచెంది, ఉత్తమమైన వీరి యొక్క కీర్తి మూడులోకాల యందు వ్యాపించింది. (4)
గుణప్రభావవీర్యౌజః సత్త్వోత్సాహవతామహమ్ ।
న తృప్యామి కథాం శృణ్వన్ అమృతాస్వాదసమ్మితామ్ ॥ 5
సద్గుణాలు, సామర్థ్యం, పరాక్రమం, తేజస్సు, బలం, ఉత్సాహం, కలిగి అమృత సమానమైన వారికథను ఆస్వాదిస్తూ తృప్తిని పొందలేకపోతున్నాను. (5)
వైశంపాయన ఉవాచ
శృణు రాజన్ పురా సమ్యక్ మయా ద్వైపాయనాచ్ఛ్రుతమ్ ।
ప్రోచ్యమానమిదం కృత్న్సం స్వవంశజననం శుభమ్ ॥ 6
వైశంపాయనుడిలా అన్నాడు - రాజా! మునుపు వ్యాసుడు చెప్పగా విన్న మీ వంశీయుల శుభప్రదమయిన జన్మవృత్తాంతాన్నంతా నేను నీకు చెపుతాను. సావధానంగా విను. (6)
దక్షాదదితి, రదితేర్వివస్వాన్, వివస్వతోమను, ర్మనో
రిలా, ఇలాయాః పురూరవాః పురూరవస ఆయు,
రాయుషో నహుషో, నహుషాద్ యయాతిః,
యయాతేర్ద్వే భార్యే బభూవతుః ॥ 7
దక్షుని వల్ల అదితి, అదితి వల్ల వివస్వంతుడు, వివస్వంతుని వల్ల మునువు, మనువు వల్ల ఇల, ఇల యందు పురూరవుడు, పూరురవుని వల్ల ఆయువు, ఆయువు వల్ల నహుషుడు, నహుషుని వల్ల యయాతి కలిగారు. యయాతికి ఇద్దరు భార్యలున్నారు. (7)
ఉశనసో దుహితా దేవయానీ; వృషపర్వణశ్చ దుహితా
శర్మిష్ఠా నామ ॥ 8
వారిలో మొదటిది శుక్రాచార్యుని కూతురు దేవయాని, రెండవది వృషపర్వుని కూతురు శర్మిష్ఠ. (8)
అత్రానువంశశ్లోకో భవతి-
యదుం చ తుర్వసుం చైవ దేవయానీ వ్యజాయత ।
ద్రుహ్యుం చానుం చ పూరుం చ శర్మిష్ఠా వార్షపర్వణీ ॥ 9
దేవయాని యదువును, తుర్వసువును కన్నది. వృషపర్వుని కూతురు శర్మిష్ఠ ద్రుహ్యువు, అనువు, పూరువులను కన్నది. (9)
తత్ర యదోర్యాదవాః; పూరోః పౌరవాః ॥ 10
అందు యదు సంతానము యాదవులు, పురుని సంతానము పౌరవులుగా ప్రసిద్ధి చెందారు. (10)
పూరోస్తు భార్యా కౌసల్యానామ। తస్యామస్య జజ్ఞే
జనమేజయా నామ; యస్త్రీనశ్వమేధానాజహార,
విశ్వజితా చేష్ట్వా వనం వివేశ ॥ 11
పూరుని భార్య కౌసల్య. ఆమె యందు జనమేజయుడు జన్మించాడు. అతడు మూడు అశ్వమేధయాగాలను, విశ్వజిద్యాగాన్ని చేసి వనానికి వెళ్లాడు. (11)
జనమేజయః ఖల్వనంతాం నామోపయేమే మాధవీమ్ ।
తస్యామస్య జజ్ఞే ప్రాచిన్వాన్; యః ప్రాచీం
దిశం జిగాయ యావత్ సూర్యోదయాత్,
తతస్తస్య ప్రాచిన్వత్వమ్ ॥ 12
జనమేజయుడు మధువంశంలో పుట్టిన అనంతను వివాహం చేసుకొన్నాడు. అతనికి ఆమె యందు ప్రాచిన్వంతుడు జన్మించాడు. అతడు సూర్యోదయం లోపల తూర్పు దిక్కునంతా జయించాడు. అందువల్లనే అతడు ప్రాచిన్వంతుడయ్యాడు. (12)
ప్రాచిన్వాన్ ఖల్వశ్మకీముపయేయే యాదవీమ్ ।
తస్యామస్య జజ్ఞే సంయాతిః ॥ 13
ప్రాచిన్వంతుడు యదువంశీయురాలైన అశ్మకిని వివాహం చేసికొన్నాడు. అతనికి ఆమెయందు సంయాతి జన్మించాడు. (13)
సంయాతిః ఖలు దృషద్వతో వరాంగీం నామోపయేమే ।
తస్యామస్య జజ్ఞే అహంయాతిః ॥ 14
సంయాతి దృషద్వంతుని కూతురయిన వరాంగిని వివాహం చేసికొన్నాడు. అతనికి ఆమె యందు అహంయాతి జన్మించాడు. (14)
అహంయాతిః ఖలు కృతవీర్యదుహితరముపయేమే
భానుమతీం నామ తస్యామస్య జజ్ఞే సార్వభౌమః ॥ 15
అహంయాతి కృతవీర్యుని కూతురగు భానుమతిని వివాహం చేసికొన్నాడు. అతనికి ఆమెయందు సార్వభౌముడనే కొడుకు పుట్టాడు. (15)
సార్వభౌమః ఖలు జిత్వా జహార కైకేయీం సునందాం నామ ।
తాముపయేమే। తస్యామస్య జజ్ఞేజయత్సేనో నామ ॥ 16
సార్వభౌముడు కేకయరాజకుమారి సునందను జయించి అపహరించి వివాహం చేసికొన్నాడు. అతనికి ఆమెయందు జయత్సేనుడు జన్మించాడు. (16)
జయత్సేనో ఖలు వైదర్భీ ముపయేమే సుశ్రవాం నామ ।
తస్యామస్య జజ్ఞే అవాచీనః ॥ 17
జయత్సేనుడు విదర్భరాజకుమారి సుశ్రవను వివాహం చేసికొన్నాడు. అతనికి ఆమె యందు అవాచీనుడు జన్మించాడు. (17)
అవాచీనోఽపి వైదర్భీమపరామేవోపయేమే మర్యాదాం నామ ।
తస్యామస్య జజ్ఞే అరిహః ॥ 18
అవాచీనుడు కూడ విదర్భరాజకుమారి మర్యాదను వివాహం చేసికొన్నాడు. అతనికి ఆంఎ యంధు అరిహుడు జన్మించాడు. (18)
అరిహః ఖల్వాఙ్గీముపయేమే ।
తస్యామస్య జజ్ఞే మహాభౌమః ॥ 19
అరిహుడు అంగదేశపు రాజకుమారిని వివాహమాడాడు. అతనికి ఆమె యందు మహాభౌముడు జన్మించాడు. (19)
మహాభౌమః ఖలు ప్రాసేనజితీముపయేమే సుయజ్ఞాం నామ ।
తస్యామస్య జజ్ఞే అయుతనాయీ;
యః పురుషమేధానామయుత మానయత్, తేనాస్యా
యుతనాయిత్వమ్ ॥ 20
మహాభౌముడు ప్రసేనజిత్తుకూతురైన సుయజ్ఞను వివాహమాడాడు. అతనికి ఆమెయందు అయుతనాయి జన్మించాడు. అతడు పదివేల (అయుత) పురుష మేధాలను చేశాడు. అందువల్లనే అయుతనాయి అయ్యాడు. (20)
అయుతనాయీ ఖలు పృథుశ్రవసో
దుహితరముపయేమే కామాం నామ
తస్యామస్య జజ్ఞే అక్రోధనః ॥ 21
అయుతనాయి పృథుశ్రవసుని కూతురు కామ అనే ఆమెను వివాహమాడాడు. అతనికి ఆమె యందు అక్రోధనుడు జన్మించాడు. (21)
స ఖలు కాలింగీం కరంభాం నామోపయేమే ।
తస్యామస్య జజ్ఞే దేవాతిథిః ॥ 22
అతడు కళింగదేశపు కరంభను వివాహమాడాడు. అతనికి ఆమె యందు దేవాతిథి జన్మించాడు. (22)
దేవాతిథిః ఖలు వైదేహీముపయేమే మర్యాదాం నామ ।
తస్యామస్య జజ్ఞే అరిహో నామ ॥ 23
దేవాతిథి విదేహరాజకుమారి మర్యాదను వివాహమాడాడు. అతనికి ఆమె యందు అరుహుడు జన్మించాడు. (23)
అరిహః ఖల్వాంగేయీముపయేమే సుదేహం నామ ।
తస్యాం పుత్రమజీజనదృక్షమ్ ॥ 24
అరిహుడు అంగదేశపు రాజకుమారి సుదేవను వివాహమాడాడు. అతనికి ఆమె యందు ఋక్షుడనే పుత్రుడు జన్మించాడు. (24)
ఋక్షః ఖలు తక్షకదుహితరముపయేమే జ్వాలాం నామ ।
తస్యాం పుత్రం మతినారం నామోత్పాదయామాస ॥ 25
ఋక్షుడు తక్షకుని కూతురగు జ్వాలను వివాహమాడాడు. ఆమె యందు మతినారుడను పుత్రుడు జన్మించాడు. (25)
మతినారః ఖలు సర్వస్వత్యాం గుణసమన్వితం
ద్వాదశవార్షికం సత్రమాహరత్ ।
సమాప్తే చ సత్రే సరస్వత్యభిగమ్య తం
భర్తారం వరయామాస ।
తస్యామ్ పుత్రమజీజనత్ తంసుం నామ ॥ 26
మతినారుడు సరస్వతీ నదీతీరంలో గుణసమన్వితమైన పన్నెండు సంవత్సరాల సత్రాన్ని చేశాడు. సత్త్రం పూర్తయ్యాక సరస్వతి అతనిని సమీపించి భర్తగా కోరింది. అతనికి ఆమె యందు తంసువనే పుత్రుడు జన్మించాడు. (26)
అత్రానువంశశ్లోకో భవతి -
తంసుం సరస్వతీపుత్రం మతినారాదజీజనత్ ।
ఈలినం జనయామాస కాలింగ్యాం తంసురాత్మజమ్ ॥ 27
సరస్వతి మతినారునివల్ల తంసువను పుత్రుని కన్నది. తంసువు కాలింగియందు ఈలియను కుమారుని కన్నాడు. (27)
ఈలినస్తు రథంతర్యాం దుష్యంతాద్యాన్
పంచ పుత్రానజీజనత్ ॥ 28
ఈలొ రథంతరియందు దుష్యంతుడు మున్నగు ఐదుగురు కొడుకులను కన్నాడు. (28)
దుష్యంతః ఖలు విశ్వామిత్రదుహితరం శకుంతలాం
నామోపయేమే తస్యామస్య జజ్ఞే భరతః ॥ 29
దుష్యంతుడు విశ్వామిత్రుని కూతురయిన శకుంతలను వివాహమాడాడు. అతనికి ఆమె యందు భరతుడు జన్మించాడు. (29)
అత్రానువంశ శ్లోకౌ భవతః-
భస్త్రీ మాతా పితుః పుత్రో యేన జాతః స ఏవ సః ।
భరస్వ పుత్రం దుష్యంత మావమంస్థాః శకుంతలామ్ ॥ 30
తల్లి సంరక్షించే తోలుతిత్తివంటిది. ఎవరివల్ల జన్మించాడీ ఆ తండ్రికే కొడుకౌతాడు పుట్టినవాడు. ఆ తండ్రే కొడుకుగా జన్మిస్తాడు. అందువల్ల దుష్యంతుని పుత్రునిగ భరించు. శకుంతలను అవమానించవద్దు. (30)
రేతోధాః పుత్ర ఉన్నయతి నరదేవ యమక్షయాత్ ।
త్వం చాస్య ధాతా గర్భస్య సత్యమాహ శకుంతలా ॥ 31
రాజా! గర్భాధానం చేసే తండ్రియే పుత్రునిరూపంలో జన్మిస్తాడు. పుత్రుడు తండ్రిని యమలోకం నుండి రక్షిస్తాడు. ఇతనిని గర్భాన ఉంచినవాడవు నీవు. శకుంతల నిజం పలికింది. (31)
తతోఽస్య భరతత్వమ్ ।
భరతః ఖలు కాశేయీముపయేమే సార్వసేనీం
సునందాం నామ ।
తస్యామస్య జజ్ఞే భుమన్యుః ॥ 32
అందువల్లనే ఇతడు భరతుడయ్యాడు. భరతుడు కాశీరాజు సర్వసేనుని కూతురు సునందను వివాహమాడాడు. అతనికి ఆమె యందు భుమన్యువు జన్మించాడు. (32)
భుమన్యుః ఖలు దాశార్హీముపయేమే విజయాం నామ ।
తస్యామస్య జజ్ఞే సుహోత్రః ॥ 33
భుమన్యువు దాశార్హుని కూతురైన విజయను వివాహమాడాడు. అతనికి ఆమె యందు సుహోత్రుడు జన్మించాడు. (33)
సుహోత్రః ఖల్విక్ష్వాకు కన్యాముపయేమే సువర్ణాం నామ ।
తస్యామస్య జజ్ఞే హస్తీ; య ఇదం హాస్తినపురం
స్థాపయామాస ఏతదస్య హాస్తినపురత్వమ్ ॥ 34
సుహోత్రుడు ఇక్ష్వాకురాజకుమారి సువర్ణను వివాహమాడాడు. అతనికి ఆమెయందు హస్తి జన్మించాడు. అతడే హాస్తినపురాన్ని స్థాపించాడు. ఇందువల్లనే దానికి హాస్తినపురమను పేరువచ్చింది. (34)
హస్తీ ఖలు త్రైగర్తీముపయేమే యశోధరాం నామ ।
తస్యామస్య జజ్ఞే వికుంఠనో నామ ॥ 35
హస్తి త్రిగర్త రాజకుమారి యశోధరను వివాహమాడాడు. అతనికి ఆమె యందు వికుంఠనుడు జన్మించాడు. (35)
వికుంఠనః ఖలు దాశార్హీముపయేమే సుదేవాం నామ ।
తస్యామస్య జజ్ఞే అజమీఢో నామ ॥ 36
వికుంఠనుడు దశార్హవంశీయురాలయిన సుదేవను వివాహమాడాడు. అతనికి ఆమె యందు అజమీఢుడు జన్మించాడు. (36)
అజమీఢస్య చతుర్వింశం పుత్రశతం బభువ
కైకేయ్యాం గాంధార్యాం విశాలాయాముక్షాయాం చేతి ।
పృథక్ వంశధరానృపతయః। తత్ర వంశకరః సంవరణః ॥ 37
అజమీఢునికి కైకేయి, గాంధారి, విశాల, ఉక్ష అను భార్యలయందు నూట ఇరవై నలుగురు పుత్రులు జన్మించారు. వారంతా వేరు వేరు వంశకర్తలగు రాజులయ్యారు. వారిలో సంవరణుడు కురువంశ ప్రవర్తకుడు. (37)
సంవరణః ఖలు వైవస్వతీం తపతీం నామోపయేమే, తస్యామస్య జజ్ఞే కురుః ॥ 38
సంవరణుడు వివస్వంతుని కూతురయిన తపతిని వివాహమాడాడు. అతనికి ఆమె యందు కురురాజు జన్మించాడు. (38)
కురుః ఖలు దాశార్హీముపయేమే శుభాంగీం నామ ।
తస్యామస్య జజ్ఞే విదూరః ॥ 39
కురురాజు దాశార్హుని కూతురు శుభాంగిని వివాహమాడాడు. అతనికి ఆమె యందు విదూరుడు జన్మించాడు. (39)
విదూరస్తు మాధవీముపయేమే సంప్రియాం నామ ।
తస్యామస్య జజ్ఞే అనశ్వా నామ ॥ 40
విదూరుడు మధువంశీయురాలు సంప్రియను వివాహమాడాడు. అతనికి ఆమె యందు అనశ్వుడు జన్మించాడు. (40)
అనశ్వా ఖలు మాగధీముపయేమే అమృతాం నామ ।
తస్యామస్య జజ్ఞే పరిక్షిత్ ॥ 41
అనశ్వుడు మగధదేశపు అమృతను వివాహమాడాడు. అతనికి ఆమె యందు పరిక్షిత్తు జన్మించాడు. (41)
పరిక్షిత్ ఖలు బాహుదాముపయేమే సుయశాం నామ ।
తస్యామస్య జజ్ఞే భీమసేనః ॥ 42
పరిక్షిత్తు బాహుదరాజకుమారి సుయశను వివాహమాడాడు. అతనికి ఆమె యందు భీమసేనుడు జన్మించాడు. (42)
భీమసేనః ఖలు కైకేయీముపయేమే కుమారీం నామ ।
తస్యామస్య జజ్ఞే ప్రతిశ్రవా నామ ॥ 43
భీమసేనుడు కేకయరాజకుమారి కైకేయిని వివాహమాడాడు. అతనికి ఆమె యందు ప్రతిశ్రవుడు జన్మించాడు. (43)
ప్రతిశ్రవసః ప్రతీపః ఖలు శైబ్యాముపయేమే
సునందాంనామ । తస్యాం పుత్రానుత్పాదయామాస
దేవాపిం శాంతనుం బాహ్లీకంచేతి ॥ 44
ప్రతిశ్రవసుని మరోపేరు ప్రతీపుడు. అతడు శైబ్యరాజకుమారి సునందను వివాహమాడాడు. అతనికి ఆమె యందు దేవాపి, శాంతనుడు, బాహ్లీకుడనే వారు జన్మించారు. (44)
దేవాపిః ఖలు బాల్యే ఏవారణ్యం వివేశ ।
శాంతనుస్తు మహీపాలో బభూవ ॥ 45
దేవాపి బాల్యంలోనే అరణ్యానికి వెళ్లాడు. శాంతనుడు రాజయ్యాడు. (45)
అత్రానువంశ శ్లోకో భవతి-
యం యం కరాభ్యాం స్పృశతి జీర్ణం స సుఖమశ్నుతే ।
పునర్యువా చ భవతి తస్మాత్ తం శాంతనుం విదుః ॥
ఇతి తదస్య శాంతనుత్వమ్ ॥ 46
శాంతనుడు తన చేతులతో ఏ ముసలివానిని తాకినా అతడు మరల యువకుడై సుఖాన్ని పొందుతాడు. అందువల్లనే అతడు శాంతనుడయ్యాడు. (46)
శాంతనుః ఖలు గంగాం భాగీరథీముపయేమే ।
తస్యామస్య జజ్ఞే దేవవ్రతో నామ,
యమాహుర్భీష్మమితి ॥ 47
శాంతనుడు భాగీరథియగు గంగను వివాహమాడాడు. అతనికి ఆమె యందు దేవవ్రతుడు జన్మించాడు. అతడే భీష్ముడుగా ప్రసిద్ధి చెందాడు. (47)
భీష్మః ఖలు పితుః ప్రియచికీర్షయా సత్యవతీం
మాతరముదవాహయత్; యామాహుర్గంధకాలీతి ॥ 48
భీష్ముడు తండ్రికి ప్రియం చేయాలని సత్యవతితో తండ్రికి పెళ్ళిచేశాడు. ఆంఎను తల్లిగా గౌరవించాడు. ఆమెను గంధకాలి అని కూడా అంటారు. (48)
తస్యాం పూర్వం కానీనో గర్భః పరాశరాద్
ద్వైపాయనోఽభవత్
తస్యామేవ శాంతనోరన్యౌ ద్వౌపుత్రౌ బభూవతుః ॥ 49
ఆమెకు మునుపు కన్యగా ఉన్నప్పుడు పరాశరుని వల్ల ద్వైపాయనుడు జన్మించాడు. ఆంఎ యందు శాంతనునకు ఇద్దరు కుమారులు జన్మించారు. (49)
విచిత్రవీర్యశ్చిత్రాంగదశ్చ। తయోరప్రాప్తయౌవన ఏవ
చిత్రాంగదో గంధర్వేణ హతః; విచిత్రవీర్యస్తు రాజాఽఽసీత్ ॥ 50
వారు విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు. వారింకా యౌవనవంతులు కాకుండానే గంధర్వుడు చిత్రాంగదుని చంపేశాడు. తరువాత విచిత్ర వీర్యుడు రాజయ్యాడు. (50)
విచిత్ర వీర్యః ఖలు కౌసల్యాత్మజే అంభికాంబాలికే కాశిరాజ దుహితరావుపయేమే ॥ 51
విచిత్రవీర్యుడు కౌసల్యకు జన్మించిన అంబిక, అంబాలికలను వివాహం చేసికొన్నాడు. వీరిద్దరూ కాశీరాజు కూతుళ్లు. (51)
విచిత్రవీర్యస్త్వనపత్య ఏవ విదేహత్వం ప్రాప్తః ।
తతః సత్యవత్యచింతయన్మా దౌష్యంతో వంశ ఉచ్ఛేదం వ్రజేదితి ॥ 52
విచిత్రవీర్యుడు సంతానం పొందకుండానే మరణించాడు. అనంతరం సత్యవతి భరతవంశం విచ్ఛిన్నం కారాదని భవించింది. (52)
సా ద్వైపాయనమౄషిం మనసా చింతయామాస ।
స తస్యాః పురతః స్థితః, కిం కరవాణీతి ॥ 53
ఆమె ద్వైపాయనుడైన వ్యాసుని మనసా స్మరించింది. అతడు ఆమెకు ఆమెకు ఎదుట నిలిచి 'ఏమిచేయగలను' అని అడిగాడు. (53)
సా తమువాచ ఽభ్రాతా తవానపత్యఏవ స్వర్యాతః ।
విచిత్రవీర్యః సాధ్వపత్యం తస్యోత్పాదయేతి ॥ 54
ఆమె అతనితో ఇలా అంది - 'నీ సోదరుడు విచిత్రవీర్యుడు సంతానం లేకుండానే స్వర్గానికి వెళ్లాడు. అతనికి నీవు చక్కని సంతానాన్ని కలిగించు. (54)
స తథేత్యుక్త్వా త్రీన్ పుత్రానుత్పాదయామాస;
ధృతరాష్ట్రం పాండుం విదురం చేతి ॥ 55
అతడు అట్లే అని ధృతరాష్ట్రుడు, పాండుడు, విదురుడు అని ముగ్గురు పుత్రులను కలిగించాడు. (55)
తత్ర ధృతరాష్ట్రస్య రాజ్ఞః పుత్రశతం బభూవ
గాంధార్యాం వరదానాద్ ద్వైపాయనస్య ॥ 56
వారిలో ధృతరాష్ట్రస్య పుత్రాణాం చత్వారః ప్రధానా బభూవుః;
దుర్యోధనో దుఃశాసనో వికర్ణశ్చిత్రసేనశ్చేతి ॥ 57
ఆ ధృతరాష్ట్రుని కుమారులలో దుర్యోధనుడు, దుఃశాసనుడు, వికర్ణుడు, చిత్రసేనుడనే నలుగురు ప్రధానమైనవారు. (57)
పాండోస్తు ద్వే భార్యే బభూవతుః కుంతీ పృథా నామ,
మాద్రీ చ ఇత్యుభే స్త్రీ రత్నే ॥ 58
పాండురాజునకు పృథ అను పేరు గల కుంతి, మాద్రి అను ఇద్దరు స్త్రీ రత్నాలు భార్యలు. (58)
అథ పాండుర్మృగయాం చరన్
మైథునగతమృషిమపశ్య న్మృగ్యాం వర్తమానమ్ ।
తథైవాద్భుతమనాసాదిత కామరసమతృప్తంచ బాణేనాజఘాన ॥ 59
అటుపై పాండురాజు వనంలో వేటాడుతూ ఆడలేడితో లేడి రూపంలో సంగమిస్తున్న ఒక ఋషిని చూశాడు. అలా కామరసానంద తృప్తి చెందని ఆ మృగాన్ని బాణంతో చంపాడు. (59)
స బాణవిద్ధ ఉవాచ పాండుమ్-
చరతాధర్మమిమం యేన త్వయాభిజ్ఞేన
కామరసస్యా హమనవాప్తకామర సోనిహతస్తస్మాత్
త్వమప్యేతామవస్థామాసాద్యానవాప్తకామరసః
పంచత్వమాప్స్యసి క్షిప్రమేవేతి । స వివర్ణరూపస్తథా
పాండుః శాపం పరిహరమాణో నోపసర్పతి
భార్యే। వాక్యం చోవాచ- ॥ 60
బాణంతో దెబ్బతిన్న ఆ ఋషి పాండురాజుతో ఇలా అన్నాడు - 'కామసుఖానందాన్ని పొందని కాముకక్రీడలో నున్న నన్ను ధర్మాన్ని ఆచరిస్తూ, కామసుకానందం తెలిసిన నీవు కొట్టినందువల్ల నీవు కూడ ఇటువంటి మిథునక్రీడావస్థలో ఉండి, కామసుఖానందాన్ని పొందకుండానే త్వరలోనే మరణిస్తావు.' అప్పటినుండి వివర్ణభావం పొంది పాండురాజు ఋషి శాపం తప్పించుకొనేందుకు భార్యలను (కలియడం మానేశాడు) సమీపించలేదు. వారితో ఇలా అన్నాడు. (60)
స్వచాపల్యాదిదం ప్రాప్తవానహం శృణోమి చ
నానాపత్యస్య లోకాః సంతీతి ।
సా త్వం మదర్థే పుత్రానుత్పాదయేతి కుంతీమువాచ ।
సా తథోక్తా పుత్రానుత్పాదయామాస ।
ధర్మాద్ యుధిష్ఠిరం, మారుతాద్ భీమసేనం,
శక్రాదర్జునమితి ॥ 61
'నా మృగయా చాపల్యం వల్ల నేనిటువంటి స్థితిని పొందాను. సంతానం లేనివానికి పరలోకాలు లేవని నేను విన్నాను. అందువల్ల నీవు నా కొరకు పుత్రులను కను అని కుంతితో అన్నాడు. ఆమె అట్లే అని పుత్రులను కన్నది. ధర్మదేవుని వలన యుధిష్ఠిరుని, వాయువు వల్ల భీమసెనుని, ఇంద్రుని వలన అర్జునుని పొందింది. (61)
తాం సంహృష్టః పాండురువాచ-ఇయం తే సపత్య
నపత్యా; సాధ్వస్యా అపత్యముత్పాద్యతామితి ।
ఏవమస్త్వితి కుంతీ తాం విద్యాం మాద్య్రాః
ప్రాయచ్ఛత్ ॥ 62
ఆమె పట్ల ఆనందించినవాడై పాండురాజు ఇలా అన్నాడు - 'ఈనీ సవతి సంతానం లేనట్టిది. ఈమెకు కూడ మంచి సంతానాన్ని కలిగించు.' అలాగే అని కుంతి తనవిద్యను మాద్రికి ఇచ్చింది. (62)
మాద్య్రామశ్విభ్యాం నకులసహదేవావుత్పాదితౌ ॥ 63
అశ్వినీదేవతల వలన మాద్రి నకుల సహదేవులను కన్నది. (63)
మాద్రీం ఖల్వలంకృతాం దృష్ట్వా పాండుర్భావం
చక్రే చ తాం స్పృష్ట్వైవ విదేహత్వం ప్రాప్తః ॥ 64
తత్రైనం చితాగ్నిస్థం మాద్రీ సమన్వారురోహ
ఉవాచ కుంతీమ్; యమయోరప్రమత్తమా త్వయా
భవితవ్యమితి ॥ 65
అలంకరించుకొని ఉన్న మాద్రిని చూసి పాండురాజు ప్రీతితో సమీపించాడు. ఆమెను తాకగానే తనువు చాలించాడు. చితాగ్నిలోనున్న అతనిని మాద్రి అనుగమించింది. కుంతితో ఇలా చెప్పింది - 'ఈ కవలల విషయంలో అప్రమత్తంగా ఉండు' అని. (64,65)
తతస్తే పాండవాః కుంత్యా సహితా
హాస్తినపురమానీయ తాపసైర్భీష్మస్య చ విదురస్య
చ నివేదితాః । సర్వవర్ణానాం చ నివేద్యాంతర్హితాస్తపసా
బభూవుః ప్రేక్ష్యమాణానాం తేషామ్ ॥ 66
అనంతరం తాపసులు పాండవులను కుంతితోబాటు హాస్తినాపురం తీసుకువచ్చి భీష్మవిదురులకు విన్నవించారు. అన్ని వర్ణాల వారికీ విన్నవించి, వారంతా చూస్తూండగానే తమ తపస్సుచే తాపసులు అంతర్ధానమయ్యారు. (66)
తచ్చ వాక్యముపశ్రుత్య భగవతామంతరిక్షాత్
పుష్పవృష్టిః పపాత; దేవదుందుభయశ్చ ప్రణేదుః ॥ 67
పూజ్యులైన ఆ మునుల వాక్యం విని ఆకాశం నుండి పూలవాన పడింది. దేవదుందుభులు మ్రోగాయి. (67)
ప్రతిగృహీతాశ్చ పాండవాః పితుర్నిధనమావేదయన్
తస్యౌర్ధ్వదేహికం న్యాయతశ్చ కృతవంతః । తాంస్తత్ర
నివసతః పాండవాన్ బాల్యాత్ ప్రభృతి దుర్యోధనో నామర్షయత్ ॥ 68
ధృతరాష్ట్రాదులచే ఆదరింపబడిన పాండవులు తండ్రికి ధర్మబద్ధంగా ఔర్ధ్వదేహిక క్రియలు చేశారు. అక్కడ నివసిస్తున్నా పాండవులను బాల్యం నుండీ కూడ దుర్యోధనుడు సహింపలేకపోయాడు. (68)
పాపాచారో రాక్షసీం బుద్ధిమాశ్రితోఽ
నేకైరుపాయైరుద్ధర్తుం చ వ్యవసితః భావిత్వా చ్చార్థస్య
న శకితాస్తే సముద్ధర్తుమ్ ॥ 69
పాప స్వభావం గల దుర్యోధనుడు తన రాక్షసబుద్ధిని అనుసరించి అనేక ఉపాయాలతో పాండవులను బయటకి పంపడానికి ప్రయత్నించాడు. భవిష్యత్తులో జరగవలసి ఉన్నది జరుగుతుంది. అందువల్లే పాండవులను పైకి పంపడానికి వారు సమర్థులు కాలేదు. (69)
తతశ్చ ధృతరాష్ట్రేణ వ్యాజేన వారణావతమనుప్రేషితా గమనమరోచయన్ ॥ 70
అనంతరం ధృతరాష్ట్రుడు ఏదో నెపంతో వారణావతానికి పాండవులను పంపాడు. వారు కూడా వెళ్ళడానికి ఇష్టపడ్డారు. (70)
తత్రాపి జతుగృహే దగ్ధుం సమారబ్ధా న శకితా విదురమంత్రితేనేతి ॥ 71
అక్కడ కూడా లక్కయింటిలో పాండవులను దహించడానికి ప్రారంభించారు. కాని విదురుని సలహాతో ఆ పని వారికి శక్యంకాలేదు. (71)
తస్మాచ్చ హిడింబమంతరా హత్వా ఏకచక్రాం గతాః ॥ 72
అక్కడ నుండి దారిలో హిడింబుని చంపి ఏకచక్రపురానికి వెళ్లారు. (72)
తస్యామప్యేక చక్రాయాం బకం నామ రాక్షసం హత్వా
పాంచాల నగరమధిగతాః ॥ 73
అక్కడ కూడ ఏకచక్రపురంలో బకుడనే రాక్షసుని చంపి, పాంచాల నగరానికి వెళ్లారు. (73)
తత్ర ద్రౌపదీం భార్యామవిందన్, స్వవిషయం చాభిజగ్ముః ॥ 74
అక్కడ ద్రౌపదిని భార్యగా పొందారు. తమదేశానికి తిరిగివచ్చారు. (74)
కుశలినః పుత్రాంశ్చోత్పాదయామాసుః ।
ప్రతివింధ్యం యుధిష్టిరః, సుతసోమం వృకోదరః,
శ్రుతకీర్తిమర్జునః, శతానీకం నకులః, శ్రుతకర్మాణం
సహదేవ ఇతి ॥ 75
నేర్పరులైన పుత్రులను కన్నారు. యుధిష్ఠిరుడు ప్రతి వింధ్యుని, భీమసేనుడు సుతసోముని, అర్జునుడు శ్రుతకీర్తిని, నకులుడు శతానీకుని, సహదేవుడు శ్రుతకర్మను కన్నారు. (75)
యుధిష్టిరస్తు గోవాసనస్య శైబ్యస్య దేవికాం నామ
కన్యాం స్వయంవరే లేభే ।
తస్యాం పుత్రం జనయామాస యౌధేయం నామ ॥ 76
యుధిష్ఠిరుడుశిబిదేశపురాజయిన గోవాసనుని కూతురు దేవికను స్వయంవరంలో పొందాడు. ఆమె యందు అతనికి యౌధేయుడనే పుత్రుడు పుట్టాడు. (76)
భీమసేనోఽపి కాశ్యాం బలంధరాం నామోపయేమే
వీర్యశుల్కామ్ ।
తస్యాం పుత్రం సర్వగ నామోత్పాదయామాస ॥ 77
భీమసేనుడు కూడ కాశీలో పరాక్రమంతో పొందదగిన బలంధర అనే ఆమెను వివాహం చేసికొన్నాడు. ఆమె యందు అతనికి సర్వగుడనే పుత్రుడు పుట్టాడు. (77)
అర్జునః ఖలు ద్వారవతీం గత్వా భగినీం వాసుదేవస్య
సుభద్రాం భద్రభాషిణీం భార్యాముదావహత్ ।
స్వవిషయం చాభ్యాజగామ కుశలీ ।
తస్యాం పుత్రమభిమన్యుమతీవ గుణసంపన్నం
దయితం వాసుదేవస్యాజనయత్ ॥ 78
అర్జునుడు ద్వారవతికి వెళ్ళి మధురభాషిణి, ఽఆసుదేవుని సోదరి అయిన సుభద్రను వివాహమాడి క్షేమంగా తన దేశానికి తిరిగి వచ్చాడు. ఆమె యందు మిక్కిలి గుణసంపన్నుడు, వాసుదేవునికి ఇష్టుడూ అయిన అభిమన్యుడనే పుత్రుని కన్నాడు. (78)
నకులస్తు చైద్యాం కరేణుమతీం నామ
భార్యాముదావహత్ ।
తస్యాం పుత్రం నిరమిత్రం నామాజనయత్ ॥ 79
నకులుడు చేదిదేశపు రాకుమారి కరేణుమతిని వివాహం చేసికొన్నాడు. ఆమె యందు నిరమిత్రుడనే పుత్రుని కన్నాడు. (79)
సహదేవోఽపియాద్రీమేవ స్వయంవరే విజయాం
నామోపయేమే మద్రరాజస్య ద్యుతిమతో
దుహితరమ్ ।
తస్యాం పుత్రమజనయత్ సుహోత్రం నామం ॥ 80
సహదేవుడు కూడ మద్రరాజు ద్యుతిమంతుని కూతురు విజయను స్వయంవరంలో వివాహమాడాడు. ఆమె యందు సుహోత్రుడనే కుమారుడు పుట్టాడు. (80)
భీమసేనస్తు పూర్వమేవ హిడింబాయాం రాక్షసం
ఘటోత్కచం పుత్రముత్పాదయామాస ॥ 81
భీమసేనుడు ఇంతకు మునుపే హిడింబయందు రాక్షసుడైన ఘ్టోత్కచుడనే పుత్రుని కన్నాడు. (81)
ఇత్యేత ఏకాదశ పాండవానాం పుత్రాః ।
తేషాం వంశకరోఽభిమన్యుః ॥ 82
ఈ పదకొండుగురు పాండవుల పుత్రులు, వీరిలో అభిమన్యుడు (కురు) వంశ కారకుడు. (82)
స విరాటస్య దుహితరముపయేమే ఉత్తరాం నామ ।
తస్యామస్య పరాసుర్గర్భోఽభవత్ ।
తముత్సంగేన ప్రతిజగ్రాహ పృథానియోగాత్
పురుషోత్తమస్య వాసుదేవస్య, షాణ్మాసికం
గర్భమహమేనం జీవయిష్యామీతి ॥ 83
ఆ అభిమన్యుడు విరాటరాజు కూతురయిన ఉత్త్రను వివాహం చేసికొన్నాడు. ఆమె యందు అతనికి మృతశిశువు జన్మించింది. పురుషోత్తముడైన వాసుదేవుని ఆదేశానుసారం కుంతి ఆశిశువును తన ఒడిలోనికి తీసికొంది. శ్రీకృష్ణుడు 'ఆరునెలల గర్భమగు ఈ శిశువును నేను బ్రతికిస్తా' నని ఆమెను ఊరడించాడు. (83)
స భగవతా వాసుదేవేనాసంజాత
బలవీర్యపరాక్రమోఽకాల జాతోఽస్త్రాగ్నినా దగ్ధస్తేజసా
స్వేన సంజీవితః ।
జీవియిత్వా చైనమువాచ - పరిక్షీణే కులే జాతః
భవత్వయం పరిక్షిన్నామేతి ॥ 84
పరిక్షిత్ ఖలు మాద్రవతీం నామోపయెమే
త్వన్మాతరమ్ । తస్యాం భవాన్ జనమేజయః ॥ 85
బలవీర్యపరాక్రమాలు కలుగని, అకాలంలో పుట్టి, అస్త్రాగ్నిచే దహింపబడిన ఆ శిశువును పూజ్యుడగు శ్రీ కృష్ణుడు తనతేజస్సుచే బ్రతికించాడు. అలా అతనిని బ్రతికించి ఇలా చెప్పాడు - 'క్షీణించిన వంశంలో జన్మించిన ఇతడు పరిక్షిత్తు అనబడతాడు.' పరిక్షిత్తు నీ తల్లి ఐన మాద్రవతిని వివాహమాడాడు. అతనికామెయందు జనమేజయుడవైన నీవు జన్మించావు. (84,85)
భవతో వపుష్టమాయాం ద్వౌపుత్రౌ జజ్ఞాతే; శతానీకః
శంకుకర్ణశ్చ ।
శతానీకస్యవైదేహ్యాం పుత్ర ఉత్పన్నోఽశ్వమేధ దత్త ఇతి ॥ 86
నీకు వపుష్టమయందు శతానీకుడు, శంకుకర్ణుడను ఇరువురు పుత్రులు పుట్టారు. శతానీకునకు వైదేహియందు అశ్వమేధదత్తుడను కొడుకు జన్మించాడు. (86)
ఏష పూరోర్వంశః పాండవానాం చ కీర్తితః; ధన్యః
పుణ్యః పరమపవిత్రః సతతం శ్రోతవ్యో
బ్రాహ్మణైర్నియమవద్భిరనంతరం క్షత్రియైః
స్వధర్మనిరతైః ప్రజాపాలనతత్పరై ర్వైశ్యైరపిచ శ్రో
టహ్వ్యోఽధిగమ్యశ్చ తథా శూద్రైరపి త్రివర్ణ
శుశ్రూషుభిః శ్రద్దధానైరితి ॥ 87
ఇది పూరునివంశం, ఫాండవుల వంశం కూడ చెప్పబడింది. ధన్యం, పుణ్యం, మిక్కిలి పవిత్రం అయిన ఈ వృత్తాంతం నియమవంతులైన బ్రాహ్మణులచేత,
స్వధర్మనిరతులూ ప్రజాపాలనతత్పురులూ అయిన క్షత్రియులచేత, వైశ్యులచేతనూ ఎల్లపుడూ వినదగింది. త్రివర్ణాలను సేవించే శ్రద్ధ గల శూద్రుల చేతనూ ఇది తెలియదగింది. (87)
ఇతిహాసమిమం పుణ్యమశేషతః శ్రావయిష్యంతి యే
నరాః శ్రోష్యంతి వా నియతాత్మానో విమత్సరా
మైత్రావేదపరాస్తేఽపి స్వర్గజితః పుణ్యలోకా భవంతి
సతతం దేవబ్రాహ్మణ మనుష్యాణాం మాన్యాః
సంపూజ్యాశ్చ ॥ 88
పవిత్రమైన ఈ ఇతిహాసాన్ని పూర్తిగా ఇతరులకు వినిపించేవారు, ఇంద్రియ నిగ్రహం కల్గి, మాత్సర్యం లేక స్నేహశీలులై, వేద పరాయణులవుతారు - ఈ ఇతిహాసాన్ని విన్నవారు కూడా స్వర్గాన్ని, పుణ్యలోకాలను పొందుతారు. వారు దేవ్ బ్రాహ్మణ మనుష్యులకు ఎల్లపుడు గౌరవింపదగినవారు, పూజింపదగినవారూ కూడ. (88)
పరం హీదం భారతం భగవతా వ్యాసేన ప్రోక్తం
పావనం యే బ్రాహ్మణాదయో వర్ణాః శ్రద్దధానా
అమత్సరా మైత్రా వేదసంపన్నాః శ్రోష్యంతి,
తేఽపి స్వర్గజితః సుకృతినోఽశోచ్యాః కృతాకృతే భవంతి ॥ 89
పూజ్యుడగు వ్యాసుడు చెప్పిన ఈ భారతం మిక్కిలి గొప్పది, పవిత్రమైనదీ. చతుర్వర్ణాలవారూ మత్సరం లేనివారై, స్నేహశీలురై, వేదసంపన్నులై ఈ భారతాన్ని వింటే వారుకూడ స్వర్గాన్ని జయించినవారౌతారు. వారు పుణ్యాత్ములు, కృతాకృతాలలో దుఃఖం లేనివారు అవుతారు. (89)
భవతి చాత్ర శ్లోకః-
ఇదం హి వేదైః సమితం పవిత్రమపి చోత్తరమ్ ।
ధన్యం యశస్యమాయిష్యం శ్రోతవ్యం
నియతాత్మభిః ॥ 90
వేదాలతో సమానమైంది, పవిత్రమైంది, ఉత్తమమైంది, ధన్యమైంది, కీర్తిని కలిగించేది, ఆయువునిచ్చేది అయిన ఈ భారతాన్ని మనోనిగ్రహంతో వినాలి. (90)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి పూరువంశానుకీర్తనే పంచనవతితమోఽధ్యాయః ॥ 95 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున పూరువంశానుకీర్తనమను తొంబది ఐదవ అధ్యాయము. (95)