90. తొంబదియవ అధ్యాయము
అష్టక యయాతుల సంవాదము.
అష్టక ఉవాచ
యదావసో నందనే కామరూపే
సంవత్సరాణామయుతం శతానామ్ ।
కిం కారణం కార్తయుగప్రధాన
హిత్వా చ త్వం వసుధామన్వపద్యః ॥ 1
అష్టకుడిలా అన్నాడు - క్ఱుతయుగరాజోత్తమా! నందన వనంలో ఇచ్ఛారూపంతో పది లక్షల సంవత్సరాలు నివసించి, దానిని వదిలి ఏకారణంగా భూమి మీదికి వచ్చావు? (1)
యయాతి రువాచ
జ్ఞాతిః సుహృద్ స్వజనో వా యథేహ
క్షీణే విత్తే త్యజ్యతే మానవైర్హి ।
తథా తత్ర క్షీణపుణ్యం మనుష్యం
త్యజంతి సద్యః సేశ్వరా దేవసంఘాః ॥ 2
యయాతి ఇలా అన్నాడు - ఈ లోకంలో ధనం నశించగానే జ్ఞాతి, మిత్రుడు, తనవాడు ఎవడైనా సరే మానవులచే విడువబడినట్లే, పుణ్యం నశించగానే ఈశ్వరునితో బాటు దేవతలందరూ వెంటనే మానవుని త్యజిస్తారు. (2)
అష్టక ఉవాచ
తస్మిన్ కథం క్షీణపుణ్యా భవంతి
సమ్ముహ్యతే మేఽత్ర మనోఽతిమాత్రమ్ ।
కిం వా విశిష్టాః కస్య ధామోపయాంతి
తద్ వై బ్రూహి క్షేత్రవిత్ త్వం మతో మే ॥ 3
అష్టకుడిలా అడిగాడు - దేవలోకంలో మనుష్యుల పుణ్యం ఎలా క్షీణిస్తుంది? ఈ విషయంలో నా మనస్సు మిక్కిలి అజ్ఞానంలో ఉంది. ఎటువంటి పుణ్యవిశేషంతో ఉన్నవారు ఎవని నివాసానికి చేరుతారు? ఆ విషయాన్ని చెప్పు. నేను నిన్ను క్షేత్రజ్ఞునిగా భావిస్తున్నాను. (3)
యయాతి రువాచ
ఇమం భౌమం నరకం తే పతంతి
లాలప్యమానా నరదేవ సర్వే ।
తే కంకగోమాయుబలాశనార్థే
క్షీణా వివృద్ధిం బహుధా వ్రజంతి ॥ 4
యయాతి ఇలా చెప్పాడు. తమ పుణ్యకర్మల గురించి గొప్పలు చెప్పుకొనేవారు. ఈ భౌమ నరకమందు వచ్చిపడతారు. ఇక్కడ వారు గ్రద్ధలు, గోమాయువులు. కాకులు తినటానికి యోగ్యమైన శరీరం కోసం క్షీణిస్తారు. పుత్రపౌత్రాదిరూపంలో మిక్కిలి వృద్ధిచెందుతారు. (4)
తస్మాదేవత్ వర్జనీయం నరేంద్ర
దుష్టం లోకే గర్హణీయం చ కర్మ ।
ఆఖ్యాతం తే పార్థివ సర్వమేవ
భూయశ్చేదానీం వద కిం తే వదామి ॥ 5
నరేంద్రా! అందువల్ల ఈ లోకంలో దుష్టమై, నిందింపదగిన కర్మ చేయడం మానాలి. పార్థివా! నీకు సర్వమూ చెప్పాను. మళ్లీ ఇంకా ఏం కావాలో అడుగు. నే చెప్తాను. (5)
అష్టక ఉవాచ
యదా తు తాన్ వితుదంతే వయాంసి
తథా గృధ్రాః శితికంఠాః పతంగాః ।
కథం భవంతి కథమాభవంతి
న భౌమమన్యం నరకం శృణోమి ॥ 6
అష్టకుడిలా అడిగాడు - మనుష్యులు మరణించిన పిదప లక్షులు, గ్రద్దలు, నెమళ్ళు, పతంగాలు వారిని తింటాయి కదా! ఆ పక్షులు ఎలా ఏ రూపంలో వస్తాయి! భౌమమనే వేరొక నరకముందని నేనింతవరకు వినలేదు. (6)
యయాతి రువాచ
ఊర్థ్వం దేహాత్ కర్మణా జృంభమాణాద్
వ్యక్తం పృథివ్యామనుసంచరంతి ।
ఇమం భౌమం నరకం తే పతంతి
నావేక్షంతే వర్షపూగాననేకాన్ ॥ 7
యయాతి ఇలా చెప్పాడు. కర్మచేత పుట్టి, పెరిగిన దేహంతో ఈ భూమి మీదికి వచ్చిన జీవులు అందరి సమక్షంలో సంచరిస్తూ ఉంటారు. వారంతా ఈ భౌమనరకంలో పడతారు. పడిన తర్వాత వ్యర్థంగా అనేక సంవత్సరాలు చూడనే లేరు. (7)
షష్టిం సహస్రాణి పతంతి వ్యోమ్ని
తథా అశీతిం పరివత్సరాణి ।
తాన్ వై తుదంతి పతతః ప్రపాతం
భీమో భౌమా రాక్షసా స్తీక్ష్ణదంష్ట్రాః ॥ 8
ప్రాణులు కొన్ని ఆకాశంలో అరవై వేల సంవత్సరాలు పడుతూ ఉంటాయి. మరికొన్ని ఎనభై వేల సంవత్సరాలు ఉంటాయి. అనంతరం వారు భూమిపై పడతారు. అలా పడుతున్న వారిని భౌమములైన భయంకరులైన రాక్షసులు వాడియైన కోరలతో బాధిస్తారు. (8)
అష్టక ఉవాచ
యదేనసస్తే పతతస్తుదంతి
భీమా భౌమా రాక్షసాస్తీక్ష్ణదంష్ట్రాః ।
కథం భవంతి కథమాభవంతి
కథంభూతా గర్భభూతా భవంతి ॥ 9
అష్టకుడిలా అన్నాడు - పాపం వల్ల పడుతూన్న ఎటువంటి ప్రాణులను ఈ భౌముములూ, భయంకరములూ అయిన తీక్ష్ణదంష్ట్రలు గల రాక్షసులు హింసిస్తారు? వారు క్రిందపడి ఎలా జీవిస్తారు? ఎటువంటి ఇంద్రియాలతో ఉంటారు? ఎటువంటి గర్భాలలో ప్రవేశిస్తారు? (9)
యయాతి రువాచ
అస్రం రేతః పుష్పఫలానుపృక్తమ్
అన్వేతి తద్ వై పురుషేణ సృష్టమ్ ।
స వై తస్యా రజ ఆపద్యతే వై
స గర్భభూతః సముపైతి తత్ర ॥ 10
యయాతి ఇలా చెప్పాడు - అంతరిక్షం నుండి పడే ప్రాణి నీటిరూపంలో పడతాడు. ఆ నీరు నూతన శరీరానికి బీజభూతమైన రేతస్సుగా మారుతుంది. అది పుష్పఫలరూపకర్మలతో కూడి పురుషునిలో ప్రవేశిస్తుంది. పురుషుడు స్త్రీతో కలిసినపుడు వీర్యమందలి జీవుడు రజస్సుతో కలుస్తాడు. అది గర్భముగా పరిణమిస్తుంది. (10)
వనస్పతీనోషధీశ్చావిశంతి
అపో వాయుం పృథివీం చాంతరిక్షమ్ ।
చతుష్పదం ద్విపదం చాపి సర్వమ్
ఏవంభూతా గర్భభూతా భవంతి ॥ 11
జలరూపంలోని జీవుడు వనస్పహులలోను, ఓషధులలోను కూడ ప్రవేశిస్తాడు. గాలి, వాయువు, భూమి, అంతరిక్షాలలో ప్రవేశిమ్చి కర్మానుసారంగా ద్విపద, చతు ష్పదాలలో గర్భరూపం దాల్చి ఇక్కడ ప్రాణిగా జన్మిస్తాడు. భూమి మీద ప్రాణులన్నీ ఇలాగే రూపు దాలుస్తాయి. (11)
అష్టక ఉవాచ
అన్యద్ వపుర్విదధాతీహ గర్భమ్
ఉతాహోస్విత్ స్వేన కాయేన యాతి ।
ఆపద్యమానో నరయోనిమేతామ్
ఆచక్ష్వ మే సంశయాత్ ప్రబ్రవీమి ॥ 12
అష్టకుడిలా అడిగాడు - మనుష్య గర్భంలో ప్రవేశించిన జీవుడు వేరొక శరీరాన్ని ధరిస్తాడా లేక తన శరీరంతోనే వస్తాడా? సంశయం వల్ల అడుగుతున్నాను. నాకు చెప్పవలసింది. (12)
శరీరభేదాభిసముచ్ఛ్రయం చ
చక్షుః శ్రోత్రే లభతే కేన సంజ్ఞామ్ ।
ఏతత్ తత్త్వం సర్వమాచక్ష్వ పృష్టః
క్షేత్రజ్ఞం త్వాం తాత మన్యామ సర్వే ॥ 13
జీవుడు మనుష్యగర్భంలో ప్రవేశిమ్చాక భిన్న భిన్న శరీరాల వృద్ధిని, అక్న్ను, చెవి, చైతన్యాలను ఎలా పొందుతాడు? ఇదంతా నిజంగా చెప్పు. తాత! నిన్ను క్షేత్రజ్ఞునిగా భవిస్తున్నాము. (13)
యయాతి రువాచ
వాయుః సముత్కర్షతి గర్భయోనిమ్
ఋతౌ రేతః పుష్పరసానుపృక్తమ్ ।
స తత్ర తన్మాత్రకృతాధికారః
క్రమేణ సంవర్ధయతీహ గర్భమ్ ॥ 14
యయాతి ఇలా అన్నాడు - ఋతుకాలంలో పూలతేనెలో కలిసిన రేతస్సును వాయువు గర్భాశయానికి చేరుస్తుంది. అది అక్కడ (తన్మాత్ర) సూక్ష్మరూపంలో ఉండి క్రమంగా గర్భాన్ని (సంరక్షిస్తుంది) వృద్ధి చేస్తుంది. (14)
స జాయమానో విగృహీతమాత్రః
సంజ్ఞామధిష్ఠాయ తతో మనుష్యః ।
స శ్రోత్రాభ్యాం వేదయతీహ శబ్దం
స వై రూపం పశ్యతి చక్షుషా చ ॥ 15
గర్భంలో సంపూర్ణావయవాలు పొందిన ఆ జీవుడు చైతన్యంతో బయటపడి మనుష్యుడని చెప్పబడతాడు. అతడు చెవులతొ శబ్దాన్ని తెలుసుకుంటాడు. కంటితో రూపాన్ని చూస్తాడు. (15)
ఘ్రాణేన గంధం జిహ్వయాథో రసం చ
త్వచా స్పర్శం మనసా వేద భావమ్ ।
ఇత్యష్టకేహోపహితం హి విద్ధి
మహాత్మనాం ప్రాణభృతాం శరీరే ॥ 16
నాసికతో పరిమళాన్ని, నాలుకతో రుచిని, చర్మంతో స్పర్శను, మనస్సుతో భావాన్ని తెలుసుకొంటాడు. అష్టకా! ఈ విధంగా మహాత్ములైన ప్రాణధారుల శరీరంలో జీవుని స్థాపన జరుగుతుంది. (16)
అష్టక ఉవాచ
యః సంస్థితః పురుషో దహ్యతే వా
నిఖన్యతే వాపి నికృష్యతే వా ।
అభావభూతః స వినాశమేత్య
కేనాత్మనా చేతయతే పరస్తాత్ ॥ 17
అష్టకుడిలా అడిగాడు - మనుష్యుడు మరణించిన తర్వాత శరీరం దహింపబడుతుంది, లేదా పాతిపెట్టబడుతుంది, లేదా నీటిలో విడువబడుతుంది. ఈ విధంగా స్థూలశరీరం నశిస్తుంది. అభావ రూపం పొందిన జీవాత్మ తరువాత ఏ శరీరం ద్వారా చేతనావ్యవహారం చేస్తుంది? (17)
యయాతి రువాచ
హిత్వా సోఽసూన్ సుప్తవన్నిష్టనిత్వా
పురోధాయ సుకృతం దుష్కృతం వా ।
అన్యాం యోనిం పవనాగ్రానుసారీ
హిత్వా దేహం భజతే రాజసింహ ॥ 18
యాయాతి ఇలా చెప్పాడు - రాజసింహా! జీవుడు ప్రాణాలను విడిచి నిద్రిస్తున్నవానివలె స్థూల శరీరాన్ని విడిచి, సుకృత, దృష్కృతాలను ముందుంచుకొని వాయువుకంటె వేగంగా చలిస్తూ వేరొక పుట్టుక స్థానాన్ని పొందుతాడు. (18)
పుణ్యాం యోనిం పుణ్యకృతో వ్రజంతి
పాపాం యోనిం పాపకృతో వ్రజంతి ।
కీటాః పతంగాశ్చ భవంతి పాపాః
న మే వివక్షాస్తి మహానుభావ ॥ 19
చతుష్పదా ద్విపదాః షట్పదాశ్చ
తథాభూతా గర్భభూతా భవంతి ।
ఆఖ్యాతమేతన్నిఖిలేన సర్వం
భూయస్తు కిమ్ పృచ్ఛసి రాజసింహ ॥ 20
పుణ్యాత్ములు పుణ్యజన్మను పొందుతారు. పాపాత్ములు పాపాజన్మను పొందుతారు. పాపులు కీటకాలుగా, పక్షులుగా జన్మిస్తారు. మహానుభావా! వీటన్నింటిని చెప్పాలని నాకు లేదు. రాజసింహా! గర్భాన్ని ప్రవేశించిన జీవులు చతుష్పదాలు, ద్విపదాలు, షట్పదాలుగా జన్మిస్తారు. ఇంకా మళ్లీ ఏం అడగాలనుకొంటున్నావు? (19,20)
అష్టక ఉవాచ
కిం స్విత్ కృత్వా లభతే తాత లోకాన్
మర్త్యః శ్రేష్ఠాంస్తపసా విద్యయా వా ।
తన్మే పృష్టః శంస సర్వం యథావత్
శుభాన్ లోకాన్ యేన గచ్ఛేత్ క్రమేణ ॥ 21
అష్టకుడు ఇలా అడిగాడు - తాతా! మానవుడు ఏ కర్మచేసి శ్రేష్ఠమైన లోకాలను పొందుతాడు? తపస్సు చేతనా? లేక విద్య చేతనా? నేనడగుతున్నాను. ఏ కర్మచేత క్రమంగా పుణ్యలోకాలకు వెళ్తాడు? ఉన్నదున్నట్లుగా చెప్పు. (21)
యయాతి రువాచ
తపశ్చ దానం చ శమో దమశ్చ
హ్రీరార్జవం సర్వభూతానుకంపా ।
స్వర్గస్య లోకస్య వదంతి సంతః
ద్వారాణి సప్తైవ మహాంతి పుంసామ్ ।
నశ్యంతి మానేన తమో ఽభిభూతాః
పుంసః సదైవేతి వదంతి సంతః ॥ 22
యయాతి ఇలా చెప్పాడు - తపస్సు, దానం, శమం, దమం, సిగ్గు, ఋజుత్వం, సర్వప్రాణుల పట్ల దయ అనే ఏడు మానవుడు స్వర్గాలోకానికి చేరటానికి పెద్ద ద్వారాలని సత్పురుషులు చెపుతున్నారు. మానవుని అభిమాన రూపమైన చీకటిచే ఈ ఏడు ద్వారాలు ఎల్లప్పుడూ కప్పబడినవై నశిస్తున్నాయి అని సత్పురుషులు చెపుతున్నారు. (22)
అధీయానః పండితం మన్యమానః
యో విద్యయా హంతి యశః పరేషామ్ ।
తస్యాంతవంతశ్చ భవంతి లోకాః
న చాస్య తద్ బ్రహ్మ ఫలం దదాతి ॥ 23
వేదాధ్యయనం చేస్తూ తానే పండితుడనని భావించేవానికి, తన విద్యతో ఇతరుల కీర్తిని నశింపజేసేవానికి పుణ్యలోకాలు నశించిపోతాయి. అతడు చదివిన వేదం కూడా అతనికా ఫలాన్ని ఇవ్వదు. (23)
చత్వారి కర్మాణ్యభయం కరాణి
భయం ప్రయచ్ఛం త్యయథాకృతాని ।
మానాగ్నిహోత్రముత మానమౌనం
మానేనాధీతముత మానయజ్ఞాః ॥ 24
అగ్నిహోత్రం, మౌనం, అధ్యయనం, యజ్ఞం అనే ఈ నాలుగు కర్మలూ అభయాన్ని కలిగించేవి. అవే యథావిధిగా చేయకపోతే భయాన్ని కలిగిస్తాయి. అభియానపూర్వకంగా అగ్నిహోత్రం, మౌనం, అధ్యయనం, యజ్ఞం చేస్తే అవి భయాన్ని కలిగిస్తాయి. (24)
న మానమాన్యో ముదమాదదీత
న సంతాపం ప్రాప్నుయాచ్ఛావమానాత్ ।
సంతః సతః పుజయంతీహ లోకే
నాసాధవః సాధుబుద్ధిం లభంతే ॥ 25
విద్వాంసుడైన పురుషుడు సమ్మానింపబడినా మిక్కిలి ఆనందాన్ని పొందడు. అవమానం వల్ల సంతాపాన్ని పొందడు. ఈ లోకంలో సత్పురుషులు సత్పురుషులను గౌరవిస్తారు. దుష్టబుద్ధులు సాధుబుద్ధిని పొందలేరు. (25)
ఇతి దద్యామితి యజ ఇత్యధీయ ఇతి వ్రతమ్ ।
ఇత్యేతాని భయాన్యాహుః తాని వర్జ్యాని సర్వశః ॥ 26
నేను ఈ విధంగా ఇస్తాను, నేనిలా యజ్ఞం చేస్తాను, ఈ విధంగా అధ్యయనం చేస్తాను, ఇది నా వ్రతం అని అహంకారంతో చేసిన ఈ కర్మలు భయాన్ని కలిగించేవి. అన్ని విధాలా అటువంటి వాటిని విడిచిపెట్టాలి. (26)
యే చాశ్రయం వేదయంతే పురాణం
మనీషిణో మానసమార్గరుద్ధమ్ ।
తద్వః శ్రేయస్తేన సంయోగమేత్య
పరాం శాంతిం ప్రాప్నుయుః ప్రేత్య చేహ ॥ 27
అందరికీ ఆశ్రయమైనదనీ, (కూటస్థమనీ) పురాతనమైన, మనోగతిని నిరోధించేదనీ విద్వాంసులు చెప్పే పరబ్రహ్మం మీకు శ్రేయస్సును కలిగిస్తుంది. ఈ విషయం తెలిసినవారు పరబ్రహ్మతో కలిసి ఇహపరలోకాలలో పరమశాంతిని పొందుతారు. (27)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి ఉత్తరయాయాతే నవతితమోఽధ్యాయః ॥ 90 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున ఉత్తర యయాతి చరిత్రమను తొంబదియవ అధ్యాయము. (90)