82. ఎనుబది రెండవ అధ్యాయము
దేవయానికి పుత్రుడు జన్మించుట, యయాతి శర్మిష్ఠలు ఏకాంతముగ కలుసుకొనుట.
వైశంపాయన ఉవాచ
యయాతిః స్వపురం ప్రాప్య మహేంద్రపురసంనిభమ్ ।
ప్రవిశ్యాంతఃపురం తత్ర దేవయానీమ్ న్యవేశయత్ ॥ 1
దేవయాన్యాశ్చానుమతే సుతాం తాం వృషపర్వణః ।
అశోకవనికాభ్యాశే గృహం కృత్వా న్యవేశయత్ ॥ 2
వృతాం దాసీసహస్రేణ శర్మిష్ఠాం వార్షపర్వణీం ।
వాసోభి రన్నపానైశ్చ సంవిభజ్య సుసత్కృతామ్ ॥ 3
వైశంపాయనుడిలా చెప్పాడు - యయాతి మహేంద్రపురం (అమరావతి) లా వెలుగొందుతున్న తన పురానికి వెళ్లాడు. దేవయానిని అంతఃపురంలోనికి ప్రవేశపెట్టాడు. దేవయాని అనుమతితో వృషపర్వుని కూతురైన శర్మిష్ఠను అశోకవనానికి దగ్గరలో ఇంటిని నిర్మించి, అందులో ఉంచాడు. దాసీ సహస్రంతో ఉన్న వృషపర్వుని కూతురయిన శర్మిష్ఠకు వస్త్రాలు అన్నపానాలు ఇచ్చి గౌరవించాడు. (1-3)
(అశోకవనికామధ్యే దేవయానీ సమాగతా ।
శర్మిష్ఠయా సా క్రీడిత్వా రమణీయే మనోరమే ॥
తత్రైవ తాం తు నిర్దిశ్య రాజ్ఞా సహ యయౌ గృహమ్ ।
ఏవమేవ సహ ప్రీత్యా ముముదే బహుకాలతః ॥)
దేవయాని శర్మిష్ఠతోబాటు మనోహరమైన అశోకవనంలో ఆటలాడి, ఆమె నక్కడే వదిలిపెట్టి, రాజుతోపాటు ఇంటికి వెళ్లింది. ఇలా ప్రీతితో చాలాకాలం ఆనందించింది.
దేవయాన్యా తు సహితః స నృపో నహుషాత్మజః ।
విజహార బహూనబ్దాన్ దేవవన్ముదితః సుఖీ ॥ 4
నహుషకుమారుడైన యయాతి రాజు దేవయానితో కలిసి అనేక సంవత్సరాలు దేవతలవలె ఆనందంతో సుఖంగా విహరించాడు. (4)
ఋతుకాలే తు సంప్రాప్తే దేవయానీ వరాంగనా ।
లేభే గర్భం ప్రథమతః కుమారం చ వ్యజాయత ॥ 5
ఋతుకాలం ప్రాప్తించి సుందరి దేవయాని గర్భం దాల్చింది. మొదట కుమారుని కన్నది. (5)
గతే వర్షసహస్రే తుశర్మిష్ఠా వార్షపర్వణీ ।
దదర్శ యౌవనం ప్రాప్తా ఋతుం సా చాన్వచింతయత్ ॥ 6
వేయి సంవత్సరాలు గడవగా వృషపర్వుని కూతురు శర్మిష్ఠ యౌవనం పొందింది. ఋతుకాలం వచ్చి ఆమె ఇలా ఆలోచించింది. (6)
(శుద్ధా స్నాతా తు శర్మిష్ఠా సర్వాలంకారభూషితా ।
అశోకశాఖామాలంబ్య సుపుల్లైః స్తబకై ర్వృతామ్ ॥
ఆదర్శే ముఖముద్వీక్ష్య భర్తృదర్శనలాలసా ।
శోకమోహసమావిష్టా వచనం చేదమబ్రవీత్ ॥
అశోక శోకాపనుద శోకోపహతచేతసామ్ ।
త్వన్నామానం కురు క్షిప్రం ప్రియసందర్శనాద్ధి మామ్ ॥
ఏవముక్తవతీ సా తు శర్మిష్ఠా పునరబ్రవీత్ ॥)
శర్మిష్ఠ స్నానం చేసి, పరిశుభ్రంగా, ఆభరణాలన్నీ అలంకరించుకొని వికసించిన పూల గుత్తులతో ఉన్న అశోక వృక్షం కొమ్మను పట్టుకొని, తనముఖాన్ని అద్దంలో చూసికొంది, భర్త దర్శనం మీద కోరిక గలదై శోకమోహాలు ఆవేశించి అశోక వృక్షంతో ఇలా పలికింది - 'అశోకా! దుఃఖంచే దెబ్బతిన్న మనస్సుగలవారి శోకాన్ని తొలగించేదానా! ప్రియుని చూడటం ద్వారా నన్ను నీ పేరు గలదిగా (అశోక) వేగంగా చెయ్యి. ఇలా అని శర్మిష్ఠ మరల ఇలా అనుకుంది.
ఋతుకాలశ్చ సంప్రాప్తః న చ మేఽస్తి పతిర్వృతః ।
కిం ప్రాప్తం కిం ను కర్తవ్యం కిం వా కృత్వా కృతం భవేత్ ॥ 7
ఋతుకాలం ప్రాప్తమయింది. నాకు వరింపబడిన భర్తలెడు. నాకిపుడేమయింది? నేనేం చేయాలి? (ఏం చేస్తే మంచి పనిని చేసిన దాన్ని అవుతాను?) ఏం చేస్తే మంచి పని చేసినట్లు అవుతుంది? (7)
దేవయానీ ప్రజాతాసౌ వృథాహం ప్రాప్తయౌవనా ।
యథా తయా వృతో భర్తా తథైవాహం వృణోమి తమ్ ॥ 8
ఈ దేవయాని సంతానవతి అయింది. యౌవనం పొందిన నేను వృథాగా ఉన్నాను. ఆంఎ భర్తను వరించినట్లుగానే నేను కూడ అతనినే భర్తగా వరిస్తాను. (8)
రాజ్ఞా పుత్రఫలం దేయమ్ ఇతి మే నిశ్చితా మతిః ।
అపీదానీం స ధర్మాత్మా ఇయాన్మే దర్శనం రహః ॥ 9
రాజు నాకు పుత్రఫలాన్ని ఇవ్వాలి అని నా నిశ్చితాభిప్రాయం. ధర్మాత్ముడైన ఆ రాజు ఇపుడు ఏకాంతంలో నాకు దర్శనం ఇస్తాడా? (9)
అథ నిష్క్రమ్య రాజాసౌ తస్మిన్ కాలే యదృచ్ఛయా ।
అశోకవనికాభ్యాశే శర్మిష్ఠాం ప్రేక్ష్య విష్ఠితః ॥ 10
అనంతరం ఆ సమయంలో బయటకు వచ్చిన రాజు అశోకవన సమీపంలో శర్మిష్ఠను చూసి నిలుచుండిపోయాడు. (10)
తమేకం రహితే దృష్ట్వా శర్మిష్ఠా చారుహాసినీ ।
ప్రత్యుద్గమ్యాంజలిం కృత్వా రాజానం వాక్యమబ్రవీత్ ॥ 11
అందమైన చిరునవ్వు గల శర్మిష్ఠ ఏకాంతంగా, ఒంటరిగా ఉన్న అతనిని చూసి సమీపించి చేతులు జోడించి రాజుతో ఇలా అంది. (11)
శర్మిష్ఠోవాచ
సోమస్యేంద్రస్య విష్ణోర్వా యమస్య వరుణస్య చ ।
తవ వా నాహుష గృహే కః స్త్రియం ద్రష్టుమర్హతి ॥ 12
రూపాభిజనశీలైర్హి త్వం రాజన్ వేత్థ మాం సదా ।
సా త్వాం యాచే ప్రసాద్యాహమ్ ఋతుం దేహి నరాధిప ॥ 13
శర్మిష్ఠ ఇలా అంది - నహుషపుత్రా! రాజా! చంద్రుడు, ఇంద్రుడు, విష్ణువు, యముడు, వరుణుడు, నీతో సమానులు. మీ ఇంటిలో ఉన్న స్త్రీని ఎవడూ చూడలేడు. నరాధిపా, నారూపం, వంశం, నడవడి ఎల్లప్పుడూ నీవెరుగుదువు. అటువంటి నేను నిన్ను యాచిస్తున్నాను, నన్ను అనుగ్రహించి నా ఋతుకాలం సార్థకం చెయ్యి. (12,13)
యయాతిరువాచ
వేద్మి త్వాం శీలసంపన్నాం దైత్యకన్యామనిందితామ్ ।
రూపం చ తే న పశ్యామి సూచ్యగ్రమపి నిందితమ్ ॥ 14
అపుడు యయాతి ఇలా అన్నాడు - శీలసంపద వలన ప్రశంసింపదగిన దైత్యకన్యవని నిన్ను నేను ఎరుగుదును. నీ రూపంలో సూదిమొనయంత కూడా దోషం లేదు. (14)
అబ్రవీదుశనాః కావ్యః దేవయానీం యదావహమ్ ।
నేయమాహ్వయితవ్యా తే శయనే వార్షపర్వణీ ॥ 15
కవి కుమారుడు శుక్రుడు నేను దేవయానిని వివాహం చేసుకొన్నప్పుడు, నీ గురించి "ఈమెను శయనానికి నీవు ఆహ్వానింపకూడదు" అని చెప్పాడు. (15)
శర్మిష్ఠోవాచ
న నర్మయుక్తం వచనం హినస్తి
న స్త్రీషు రాజన్ న వివాహకాలే ।
ప్రాణాత్యయే సర్వధనాపహారే
పంచానృతాన్యాహు రపాతకాని ॥ 16
శర్మిష్ఠ ఇలా అన్నది - పరిహాసంగా మాట్లాడింది అసత్యమైనా అది హానికరం కాదు. రాజా! స్త్రీల విషయంలో, వివాహసమయంలో, ప్రాణాపాయసమయంలో, సర్వస్వం కోల్పోయేటపుడు - ఈ ఐదు సమయాల్లోను అసత్యాలు పాపాన్ని కలిగించవు. (16)
పృష్టం తు సాక్ష్యే ప్రవదంతమన్యథా
వదంతి మిథ్యా పతితం నరేంద్ర ।
ఏకార్థతాయాం తు సమాహితాయాం
మిథ్యా వదంతం త్వనృతం హినస్తి ॥ 17
నరేంద్రా! నిర్దోషిని రక్షించవలసినపుడు సాక్ష్యం అడిగితే అసత్యం చెప్పినవానిని పతితుడని చెప్పడం యుక్తం కాదు. కాని తన ప్రాణమో, ఇతరుని ప్రాణమో ఒక్కదానినే రక్షించవలసినపుడు తన ప్రాణం కోసమ్ అసత్యం చెప్పిన వానిని ఆ అసత్యం హింసిస్తుంది. (17)
యయాతిరువాచ
రాజా ప్రమాణం భూతానాం స నశ్యేత మృషా వదన్ ।
అర్థకృచ్ఛ్రమపి ప్రాప్య న మిథ్యా కర్తుముత్సహే ॥ 18
యయాతి ఇలా అన్నాడు - ప్రాణులన్నింటికి (ప్రజలందరికి) రాజే ప్రమాణం, అతడు అసత్యం పలికితే నశిస్తాడు. కార్యసంకటం ఏర్పడినాసరే నేను అసత్యమాడటానికి ఇష్టపడను. (18)
శర్మిష్ఠోవాచ
సమావేతౌ మతౌ రాజన్ పతిః సఖ్యాశ్చ యః పతిః ।
సమం వివాహమిత్యాహుః సఖ్యా మేఽసి వృతః పతిః ॥ 19
శర్మిష్ఠ ఇలా అంది - రాజా! తన భర్త, తన సఖురాలి భర్త ఇద్దరూ సమానులే. అలాగే వివాహం కూడా సమానమైందే. నా సఖి నిన్ను భర్తగా వరించింది. కాబట్టి నాకు కూడా నీవే పతివి. (19)
(సహ దత్తాస్మి కావ్యేన దేవయాన్యా మహర్షిణా ।
పూజ్యా పోషయితవ్యేతి న మృషా కర్తుమర్హసి ॥
సువర్ణమణిరత్నాని వస్త్రాణ్యాభరణాని చ ।
యాచితౄణాం దదాసి త్వం గోభూమ్యాదీని యాని చ ।
వాహికం దానమిత్యుక్తం న శరీరాశ్రితం నృప ।
దుష్కరం పుత్రదానం చ ఆత్మదానం చ దుష్కరమ్ ॥
శరీరదానాత్ తత్ సర్వం దత్తం భవతి నాహూష ।
యస్య యస్య యథాకామః తస్య తస్య దదామ్యహమ్ ॥
ఇత్యుక్త్వా నగరే రాజన్ త్రికాలం ఘోషితం త్వయా ॥
అనృతం తత్తు రాజేంద్ర వృథా ఘోషితమేవ చ ।
తత్ సత్యం కురు రాజేంద్ర యథా వైశ్రవణస్తథా ॥)
మహర్షి శుక్రాచార్యుడు దేవయానితో పాటుగా నన్ను కూడ నీకిచ్చాడు. గౌరవింపదగింది, పోషింపదగింది అని చెప్పాడు. ఆ మాట నీవు అబద్ధం చేయతగదు. బంగారం, మణులు, రత్నాలు, వస్త్రాలు, ఆభరణాలు, గోవులు, భూములు అడిగిన వాళ్ళకు ఇస్తున్నావు. అది బాహ్యమైన దానం. శరీరాశ్రితమైంది కాదు. పుత్రదానం, ఆత్మదానం, దుష్కరములైనవి. నహుషకుమారా! శరీరదానంకంటె పైన చెప్పినవన్నీ గొప్పవే. ఎవరెవరికి ఏఏ కోరిక ఉంటే వారివారికి ఆ కోరికను తీరుస్తానని నీవు నగరంలో త్రికాలాలలోను చాటింపు వేయిస్తావు. రాజేంద్రా! అది అసత్యమూ, వ్యర్థమూ అవుతుంది. ఆ మాటను నిజం చెయ్యి. నీవు కుబేరుని వంటివాడవు. అతనివలె నీవు ఆ మాటను నిజం చెయ్యి.
యయాతిరువాచ
దాతవ్యం యాచమానేభ్యః ఇతి మే వ్రతమాహితమ్ ।
త్వం చ యాచసి మాం కామం బ్రూహి కిం కరవాణి తే ॥ 20
యయాతి ఇలా అన్నాడు - యాచించినవాళ్ళకు దానం చెయ్యాలని నేను స్వీకరించిన వ్రతం. నీవు కూడ స్వేచ్ఛగా నన్ను యాచిస్తున్నావు. చెప్పు, నేను నీకేం చేయగలను. (20)
శర్మిష్ఠోవాచ
అధర్మాత్ పాహి మాం రాజన్ ధర్మం చ ప్రతిపాదయ ।
త్వత్తో ఽపత్యవతీ లోకే చరేయం ధర్మముత్తమమ్ ॥ 21
శర్మిష్ఠ ఇలా అన్నది - రాజా! నన్ను అధర్మం నుండి రక్షించు. ధర్మాన్ని ఆచరించు. నీ వల్ల సంతానవతినై నేను లోకంలో ఉత్తమమైన ధర్మాన్ని ఆచరిస్తాను. (21)
త్రయ ఏవాధనా రాజన్ భార్యా దాసస్తథా సుతః ।
యత్ తే సమధిగచ్ఛంతి యస్యైతే తస్య తద్ ధనమ్ ॥ 22
రాజా! భార్య, దాసుడు, పుత్రుడు - వీరు ముగ్గురూ ధనంపై అధికారం లేనివాళ్ళు. వారు పొందిన ధనం, వారు ఎవరికి అధీనంలో ఉంటే వారిదే. (22)
దేవయాన్యా భుజిష్యాస్మి వశ్యా చ తవ భార్గవీ ।
సా చాహం చ త్వయా రాజన్ భజనీయే భజస్వ మామ్ ॥ 23
నేను దేవయానికి దాసీని, దేవయాని నీకు (వశురాలు) అధీనురాలు. రాజా! అందువల్ల ఆమె, నేను కూడ నీకు పొందదగినవారమే. నన్ను (పొందు) సేవించు. (23)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తస్తు రాజా స తథ్యమిత్యభిజజ్ఞివాన్ ।
పూజయామాస శర్మిష్ఠాం ధర్మం చ ప్రత్యపాదయత్ ॥ 24
వైశంపాయనుడిలా అన్నాడు - శర్మిష్ఠ ఇలా చెప్పగానే రాజు అది నిజమే అని అంగీకరించాడు. శర్మిష్ఠను గౌరవించాడు. ధర్మాన్ని నిర్వహించాడు. (24)
స సమాగమ్య శర్మిష్ఠాం యథా కామమవాప్య చ ।
అన్యోన్యం చాభిసంపూజ్య జగ్మతుస్తౌ యథాగతమ్ ॥ 25
అతడు శర్మిష్ఠను సమీపించి, తనకోరికకు తగినట్లుగ పొందాడు. వారొకరినొకరు గౌరవించుకున్నారు. అనంతరం వారిరువురు (వారి వారి నివాసాలకు) వారు వచ్చిన చోటుకి వెళ్ళారు. (25)
తస్మిన్ సమాగమే సుభ్రూః శర్మిష్ఠా చారుహాసినీ ।
లేభే గర్భం ప్రథమతః తస్మాన్నృపతిసత్తమాత్ ॥ 26
ఆ యయాతితో సమాగమం పొందాక శర్మిష్ఠ, ఆ రాజశ్రేష్ఠుని వల్ల మొదటి గర్భాన్ని తాల్చింది. (26)
ప్రజజ్ఞే చ తతః కాలే రాజన్ రాజీవలోచనా ।
కుమారం దేవగర్భాభం రాజీవనిభలోచనమ్ ॥ 27
రాజా! తరువాతి కాలంలో ఆ శర్మిష్ఠ దివ్య తేజస్సు, పద్మాల వంటి కన్నులు గల పుత్రుని కన్నది. (27)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి యయాత్యుపాఖ్యానే ద్వ్యశీతితమోఽధ్యాయః ॥ 82 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున యయాత్యుపాఖ్యానమను ఎనుబది రెండవ అధ్యాయము. (82)
(దాక్షిణాత్య అధికపాఠము 11 శ్లోకాలతో కలిపి మొత్తం 38 శ్లోకాలు)