75. డెబ్బది అయిదవ అధ్యాయము

దక్ష, వైవస్వతమనువుల ఉత్పత్తి; నహుష, యయాతుల చరిత్ర.

వైశంపాయన ఉవాచ
ప్రజాపతేస్తు దక్షస్య మనోర్వైవస్వతస్య చ ।
భరతస్య కురోః పూరోః ఆజమీడస్య చానఘ ॥ 1
యాదవానామిమం వంశం కౌరవాణాం చ సర్వశః ।
తథైవ భరతానాం చ పుణ్యం స్వస్త్వయనం మహత్ ॥ 2
ధన్యం యశస్యమాయుష్యం కీర్తయిష్యామి తేఽనఘ ।
వైశంపాయనుడిలా చెప్పాడు - దక్షప్రజాపతియొక్క వైవస్వతమనువుయొక్క, భరత, కురు, పూరు, అజామీఢుల యొక్క, ఆ చరితలు పుణ్యప్రదాలూ, మంగళకరాలూ, కీర్తికరాలూ, ఆయుర్ధనవర్దకాలు. (1,2 1/2)
తేజోభిరుదితాః సర్వే మహర్షిసమతేజసః ॥ 3
దశ ప్రాచేతసః పుత్రాః సంతః పుణ్యజనాః స్మృతాః ।
ముఖజేనాగ్నినా యైస్తే పూర్వం దగ్ధా మహీరుహాః ॥ 4
ప్రచేతసునికి తేజస్వులైన పదిమంది పుత్రులు పుట్టారు. వీరంతా మహర్షులలో సమానమైన తేజస్సు కలవారు. సత్పురుషులు. వీరిని పుణ్యజనులు అని అంటారు. పూర్వకాలంలో వీరినోటి నుండి వెలువడిన అగ్ని వృక్షాలను దహించివేసింది. (3,4)
తేభ్యః ప్రాచేతసో జజ్ఞే దక్షో దక్షాదిమాః ప్రజాః ।
సంభూతాః పురుషవ్యాఘ్ర స హి లోకపితామహః ॥ 5
ఆ పదిమందికి ప్రాచేతసుడైన దక్షుడు జన్మించాడు. ఆ దక్షునివల్లనే ఈ ప్రజలంతా జన్మించారు. పురుషశ్రేష్ఠా! ఆ దక్షుడు ఈలోకానికే పితామహుడు. (5)
వీరిణ్యా సహ సంగమ్య దక్షః ప్రాచేతసో మునిః ।
ఆత్మతుల్యానజనయత్ సహస్రం సంశితవ్రతాన్ ॥ 6
ముని, ప్రాచేతసుడూ అయిన దక్షుడు వీరిణితో సంగమించి తనవంటి కఠోరనియమాలు కలిగిన వేయిమందిని కన్నాడు. (6)
సహస్రసంఖ్యాన్ సంభూతాన్ దక్షపుత్రాంశ్చ నారదః ।
మోక్షమధ్యాపయామాస సాంఖ్యజ్ఞానమనుత్తమమ్ ॥ 7
వేలసంఖ్యలో ఉన్న దక్షపుత్రులకు నారదుడు శ్రేష్ఠమయిన సాంఖ్యజ్ఞాన రూపమైన మోక్షవిద్యను చెప్పాడు. (7)
తతః పంచాశతం కన్యాః పుత్రికా అభిసందధే ।
ప్రజాపతిః ప్రజా దక్షః సిసృక్షుర్జనమేజయ ॥ 8
జనమేజయా! పుత్రులు విరక్తులుకాగా, దక్షప్రజాపతి ఇంకను సంతానం కనాలనే కోరికతో ఏబదిమంది పుత్రికలను కన్నాడు. (8)
దదౌ దశ స ధర్మాయ కశ్యపాయ త్రయోదశ ।
కాలస్య నయనే యుక్తాః సప్తవింశతిమిందవే ॥ 9
వారిలో పదిమంది కన్యలను ధర్మదేవునికిచ్చాడు. పదముగ్గురు కన్యలను కశ్యపునికిచ్చాడు. కాలం నడపటంలో కూర్చబడిన ఇరువది ఏడుగురు పుత్రికలను చంద్రునికిచ్చాడు. (9)
త్రయోదశానాం పత్నీనాం యా తు దాక్షాయిణీ వరా ।
మారీచః కశ్యప స్త్వస్యామ్ ఆదిత్యాన్ సమజీజనత్ ॥ 10
ఇంద్రాదీన్ వీర్యసంపన్నాన్ వివస్వంతమథాపి చ ।
వివస్వతః సుతో జజ్ఞే యమో వైవస్వతః ప్రభుః ॥ 11
మరీచమహర్షికుమారుడైన కశ్యపుడు తన పదముగ్గురు భార్యలలో శ్రేష్ఠురాలైన అదితి యందు వీర్యసమ్పన్నులైన ఇంద్రాది ఆదిత్యులను కన్నాడు. అనంతరం అదితియందు అతడు వివస్వంతుని కన్నాడు. వివస్వంతునకు సమర్థుడైన యముడు జన్మించాడు. అతనినే వైవస్వతుడు అని అంటారు. (10,11)
మార్తండస్య మనుర్ధీమాన్ అజాయత సుతః ప్రభుః ।
యమశ్చాపి సుతో జజ్ఞే ఖ్యాత స్తస్యానుజః ప్రభుః ॥ 12
మార్తండునికి బుద్ధిమంతుడు, సమర్థుడు అయిన మనువు జన్మించాడు. మార్తండునికి మరొక కొడుకు యముడు కూడా జన్మించాడు. మనువుకి తమ్ముడైన యముడుకూడ సమర్థుడు. (12)
ధర్మాత్మా స మనుర్ధీమాన్ యత్ర వంశః ప్రతిష్ఠితః ।
మనోర్వంశో మానవానాం తతో ఽయం ప్రథితో ఽభవత్ ॥ 13
మనువు ధీమంతుడు ధర్మాత్ముడు. అతని యందే వంశం ప్రతిష్ఠితమైంది. మనువంశంలో జన్మించిన మానవులకే మానవజాతిగా ప్రసిద్ధి కలిగింది. (13)
బ్రహ్మక్షత్రాదయ స్తస్మాత్ మనోర్జాతాస్తు మానవాః ।
తతో ఽభవన్మహారాజ బ్రహ్మ క్షత్రేణ సంగతమ్ ॥ 14
మహారాజా! మనువువల్ల జన్మించిన మానవులందరూ బ్రాహ్మణక్షత్రియాదులుగా చెప్పబడ్డారు. అప్పటినుండే బ్రాహ్మణ కులం క్షత్రియులతో సంబంధం కలిగి ఉంది. (14)
బ్రాహ్మణా మానవాస్తేషాం సాంగం వేదమధారయన్ ।
వేవం ధృష్ణుం నరిష్యంతం నాభాగేక్ష్వాకుమేవ చ ॥ 15
కారూషమథ శర్యాతిం తథా చైవాష్టమీమిలామ్ ।
పృషధ్రం నవమం ప్రాహుః క్షత్రధర్మపరాయణమ్ ॥ 16
నాభాగారిష్టదశమాన్ మనోః పుత్రాన్ ప్రచక్షతే ।
పంచాశత్తు మనోః పుత్రాః తథైవాన్యే ఽభవన్ క్షితౌ ॥ 17
వారిలో బ్రాహ్మణులు వేదాన్ని సాంగంగా అధ్యయనం చేసి రక్షించారు. వేనుడు, ధృష్ణుడు, నరిష్యంతుడు, నాభాగేక్ష్వాకువు, కారూషుడు, శర్యాతి, ఇల, క్షత్ర ధర్మపరాయణుడైన పృషధ్రుడు, నాభాగారిష్టుడు అనే పదిమందీ మనువుయొక్క పుత్రులు. ఇంకా ఇతరపుత్రులతోబాటు మొత్తం ఏభైమంది మనువు యొక్క పుత్రులు భూమిపై ఉన్నారు. (15-17)
అన్యోన్యభేదాత్ సర్వే తే వినేశురితి నః శ్రుతమ్ ।
పురూరవాస్తతో విద్వాన్ ఇలాయాం సమపద్యత ॥ 18
వారందరూ పరస్పర భేదభావం వల్ల నశించారని వినికిడి. ఇలయందు పురూరవుడు జన్మించాడు. అతడు విద్వాంసుడు. (18)
సా వై తస్యాభవన్మాతా పితా చైవేతి నః శ్రుతమ్ ।
త్రయోదశ సముద్రస్య ద్వీపానశ్నన్ పురూరవాః ॥ 19
పురూరవునికి తల్లీ, తండ్రీ ఆమెయే అని విన్నాం. పురూరవుడు సముద్రసంబంధమైన పదమూడు ద్వీపాలను పాలించాడు. (19)
అమానుషైర్వృతః సత్త్వైః మానుషః సన్ మహాయశాః ।
విప్రైః స విగ్రహం చక్రే వీర్యోన్మత్తః పురూరవాః ॥ 20
జహార చ స విప్రాణాం రత్నాన్యుత్ర్కోశతామపి ।
మహాయశస్వి పురూరవుడు మానవుడైనప్పటికి మనుష్యేతరులైన ప్రాణులతో కలిసి ఉన్నాడు. పరాక్రమగర్వంతో పురూరవుడు బ్రాహ్మణులతో విరోధించేవాడు. బ్రాహ్మణుల యొక్క రత్నరాసులన్నింటిని వారు ఏడుస్తున్నాప్పటికీ అపహరించాడు. (20 1/2)
సనత్ కుమారస్తం రాజన్ బ్రహ్మలోకా దుపేత్య హ ॥ 21
అనుదర్శం తతశ్చక్రే ప్రత్యగృహ్ణాన్న చాప్యసౌ ।
తతో మహర్షిభిః క్రుద్ధైః సద్యః శప్తో వ్యనశ్యత ॥ 22
రాజా! బ్రహ్మలోకంనుండి సనత్కుమారుడు వచ్చి అతనిని అనునయించాడు. బ్రాహ్మణులపై అత్యాచారం మానవుని ఉపదేశించాడు. కాని అతడు ఆ ఉపదేశాన్ని స్వీకరించలేదు. క్రుద్ధులైన మహర్షులు అతనిని శపించారు. దానివల్ల అతడు నశించాడు. (21,22)
లోభాన్వితో బలమదాత్ నష్టసంజ్ఞో నరాధిపః ।
స హి గంధర్వలోకస్థాన్ ఉర్వశ్యా సహితో విరాట్ ॥ 23
ఆనినాయ క్రియార్థేఽగ్నీన్ యథావద్ విహితాం స్త్రిథా ।
షట్ సుతా జజ్ఞిరే చైలాద్ ఆయుర్ధీమానమావసుః ॥ 24
దృఢాయుశ్చ వనాయుశ్చ శతాయుశ్చోర్వశీసుతౌః ।
నహుషం వృద్ధశర్మాణం రజిం గయమనేనసమ్ ॥ 25
స్వర్భానవీసుతానేతాన్ ఆయోః పుత్రాన్ ప్రచక్షతే ।
ఆయుషో నహుషః పుత్రః ధీమాన్ సత్యపరాక్రమః ॥ 26
లోభంతోకూడి బలగర్వంవల్ల పురూరవుడు వివేకాన్ని కోల్ఫోయాడు. అతడు గంధర్వలోకంలో ఉన్న మూడు అగ్నులను, ఊర్వశిని యథావిధిగ భూమికి తీసికొని వచ్చాడు. ఇలానందనుడైన పురూరవునకు ఊర్వశియందు ఆరుగురు కుమారులు కలిగారు. వారు ఆయువు, ధీమంతుడు, అమావసువు, దృఢాయువు, వనాయువు, శతాయువు అనేవారు. వారిలో ఆయువునకు స్వర్భానువునందు నహుషుడు, వృద్ధశర్మ, రజి, గయుడు, అనేనసుడు అనే ఐదుగురు పుత్రులున్నారు. ఆయువు కొడుకు నహుషుడు మంచి బుద్ధిమంతుడు, సత్యపరాక్రముడు. (23-26)
రాజ్యం శశాస సుమహద్ ధర్మేణ పృథివీపతే ।
పితౄన్ దేవానృషీన్ విప్రాన్ గంధర్వోరగరాక్షసాన్ ॥ 27
నహుషః పాలయామాస బ్రహ్మక్షత్రమథో విశః ।
స హత్వా దస్యుసంఘాతాన్ ఋషీన్ కరమదాపయత్ ॥ 28
రాజా! అతడు చాలా పెద్దరాజ్యాన్ని ధర్మంతో పాలించాడు. పితృదేవతలను, దేవతలను, ఋషులను, పిప్రులను, గంధర్వులను, నాగులను, రాక్షసులను పరిపాలించాడు. బ్రాహ్మణ క్షత్రియ, వైశ్యులను పాలించాడు. దస్యుసంఘాలను సంహరించి ఋషులకు పన్ను ఇప్పించాడు. (27,28)
పశువచ్చైవ తాన్ పృష్ఠే వాహయామాస వీర్యవాన్ ।
కారయామాస చేంద్రత్వమ్ అభిభూయ దివౌకసః ॥ 29
తేజసా తపసా చైవ విక్రమేణౌజసా తథా ।
యతిం యయాతిం సంయాతిమ్ ఆయాతిమయతిం ధ్రువమ్ ॥ 30
నహుషో జనయామాస షట్ సుతాన్ ప్రియవాదినః ।
యతిస్తు యోగమాస్థాయ బ్రహ్మభూతో ఽభవన్మునిః ॥ 31
అతడు దేవతలను కూడ తిరస్కరించి తన తేజస్సుచేత, తపస్సుచేత, పరాక్రమంచేత, బలంచేత ఇంద్రపదవిని పొంది, బలవంతుడైన అతడు మహర్షులచేత తనను పశువువలె మోయించుకొన్నాడు. నహుషుడు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, అయతి, ధ్రువుడు అను ఆరుగురు పుత్రులను కన్నాడు. వారంతా ప్రియవాదులు. వారిలో యతి యోగంతో బ్రహ్మభావాన్ని పొందాడు. (29-31)
యయాతిర్నాహుషః సమ్రాడ్ ఆసీత్ సత్యపరాక్రమః ।
స పాలయామాస మహీమ్ ఈజే చ బహుభిర్మఖైః ॥ 32
సత్యపరాక్రముడైన నహుషకుమారుడు యయూతి సమ్రాట్టు అయ్యాడు. అతడు భూమండలాన్నంతా పాలించాడు. అనేక యజ్ఞాలు చేశాడు. (32)
అతిభక్త్యా పితౄనర్చన్ దేవాంశ్చ ప్రయతః సదా ।
అన్వగృహ్ణాత్ ప్రజాః సర్వాః యయాతిరపరాజితః ॥ 33
తస్య పుత్రా మహేష్వాసాః సర్వైః సముదితా గురైః ।
దేవయాన్యాం మహారాజ శర్మిష్ఠాయాం చ జిజ్ఞిరే ॥ 34
యయ్హాతి మిక్కిలి భక్తితో పితృదేవతలను, దేవతలను శ్రద్ధతో అర్చించాడు. ఓటమిలేనివాడై ప్రజలందరిని అనుగ్రహించాడు. అతనికి దేవయాని, శర్మిష్ఠల యందు మహాధనుర్ధారులై సద్గుణులైన పుత్రులు పుట్టారు. (33,34)
దేవయాన్యామజాయేతాం యదుస్తుర్వసురేవ చ ।
ద్రుహ్యు శ్చానుశ్చ పూరుశ్చ శర్మిష్ఠాయాం చ జిజ్ఞిరే ॥ 35
దేవయాని యందు యదువు, తుర్వసువు జన్మించారు. శర్మిష్ఠకు ద్రుహ్యుడు, అనువు, పూరుడు అనే కొడుకులు జన్మించారు. (35)
స శాశ్వతీః సమా రాజన్ ప్రజా దర్మేణ పాలయన్ ।
జరామార్ఛన్మహాఘోరాం నాహుషో రూపనాశినీమ్ ॥ 36
యయాతి అనేక సంవత్సరాలు ధర్మంగా ప్రజలను పరిపాలించాడు. కొంతకాలానికి రూపనాశిని అయిన ఘోరమైన ముసలితనాన్ని పొందాడు. (36)
జరాభిభూతః పుత్రాన్ స రాజా వచనమబ్రవీత్ ।
యదుం పూరం తుర్వసుం చ ద్రుహ్యుం చానుం చ భారత ॥ 37
ముసలితనానికి లొంగిన ఆ యయాతి పుత్రులందరితో ఇలా అన్నాడు. (37)
యౌవనేన చరన్ కామాన్ యువా యువతిభిః సహ ।
విహర్తుమహమిచ్ఛామి సాహ్యం కురుత పుత్రకాః ॥ 38
పుత్రులారా! యువకుడనై యౌవనంతో యువతులతో కూడి కోరికలనుభవిస్తూ విహరించాలని నాకు ఉంది. నాకు సాహాయ్యం చేయండి. (38)
తం పుత్రో దైవయానేయః పూర్వజో వాక్యమబ్రవీత్ ।
కిం కార్యం భవతః కార్యమ్ అస్మాకం యౌవనేన తే ॥ 39
దేవయాని పెద్దకొడుకు యదువు అతనితో ఇలా అన్నాడు- 'మా యౌవనంతో నీకు చేయదగినది ఏముంది?' (39)
యయాతిరబ్రవీత్ తం వై జరా మే ప్రతిగృహ్యతామ్ ।
యౌవనేన త్వదీయేన చరేయం విషయానహమ్ ॥ 40
అపుడు యయాతి అన్నాడు - నీయౌవనం ఇచ్చి నాముసలితనాన్ని తీసికో, నీయౌవనంతో విషయసుఖాలను నేను అనుభవిస్తాను. (40)
యజతో దీర్గసత్రైర్మే శాసాచ్చోశనసో మునేః ।
కామార్థః పరిహీణోఽయం తప్యేయం తేన పుత్రకాః ॥ 41
పుత్రులారా! అనేక దీర్గసత్రాలు చేసిన నేను శుక్రుని శాపం వల్ల కామపురుషార్థం క్షీణించిన వాడనయ్యాను. అందుచేత నేను కోరికలతో తపించిపోతున్నాను. (41)
మామకేన శరీరేణ రాజ్యమేకః ప్రశాస్తు వః ।
అహం తన్వాభినవయా యువా కామమవాప్నుయామ్ ॥ 42
మీలో ఒకరు నా ముసలిశరీరంతో ఈ రాజ్యాన్ని పరిపాలించండి. నేను నూతనశరీరంతో యువకుడినై కోరికల ననుభవిస్తాను. (42)
తే న తస్య ప్రత్యగృహ్ణాన్ యదుప్రభృతయో జరామ్ ।
తమబ్రవీత్ తతః పూరుః కనీయాన్ సత్యవిక్రమః ॥ 43
రాజంశ్చరాభినవయా తన్వా యౌవనగోచరః ।
అహం జరాం సమాదాయ రాజ్యే స్థాస్యామి తేఽఽజ్ఞయా ॥ 44
యయాతి అలా చెప్పినప్పటికిని యదువు మున్నగువారు అతని ముసలితనాన్ని స్వీకరించలేదు. అపుడు చిన్నవాడు, సత్యవిక్రముడూ అయిన పూరుడు అతనితో ఇలా అన్నాడు - 'రాజా! నూతనమైన శరీరంతో యౌవనంతో సంచరించు. నేను నీ ఆజ్ఞ ప్రకారం నీముసలితనాన్ని స్వీకరించి రాజ్యాధికారంలో ఉంటాను.' (43,44)
ఏవముక్తః స రాజర్షిః తపోవీర్యసమాశ్రయాత్ ।
సంచారయామాస జరాం తదా పుత్రే మహాత్మని ॥ 45
ఈ విధంగా చెప్పినవెంటనే రాజర్షి యయాతి తన తపోబలాన్ని ఆశ్రయించి మహాత్ముడైన తన పుత్రునియందు తన ముసలితనాన్ని ప్రసరింపచేశాడు. (45)
పౌరవేణాథ వయసా రాజా యౌవనమాస్థితః ।
యాయాతేనాపి వయసా రాజ్యం పూరురకారయత్ ॥ 46
అనంతరం పూరుని వయస్సుతో యయాతి యౌవనాన్ని పొందాడు. పూరుడు యయాతి వయస్సుతో ముసలితనం పొంది రాజ్యాన్ని పాలించాడు. (46)
తతో వర్షసహస్రాణి యయాతిరపరాజితః ।
స్థితః స నృపశార్దూలః శార్దూలసమవ్రికమః ॥ 47
ఓటమిలేని నృపశ్రేష్ఠుడు, యయాతి శార్దూల సమాన పరాక్రమంతో వేలసంవత్సరాలు యువకునిగా ఉన్నాడు. (47)
యయాతిరపి పత్నీభ్యాం దీర్ఘకాలం విహృత్య చ ।
విశ్వాచ్యా సహితో రేమే పునశ్చైత్రరథే వనే ॥ 48
యయాతి భార్యలిద్దరితో చాలాకాలం విహరించాడు. చైత్రరథవనానికి వెళ్ళి విశ్వాచి అనే అప్సరసతో కూడి ఆనందించాడు. (48)
నాధ్యగచ్ఛత్ తదా తృప్తిం కామానాం స మహాయశాః ।
అవేత్య మనసా రాజన్నిమాం గాథాం తదా జగౌ ॥ 49
రాజా! మహాయశస్వి ఐన ఆ యయాతి కామతృప్తిని పొందలేదు. మనస్సుతో విచారించి తెలిసికొని, అప్పుడు ఈ గాథను గానంచేశాడు. (49)
న జాతు కామః కామానామ్ ఉపభోగేన శామ్యతి ।
హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్ధతే ॥ 50
కోరికలు అనుభవించినంత మాత్రాన అవి ఎన్నడూ శాంతింపవు. హవిస్సుచేత అగ్నిజ్వాల వృద్ధిచెందినట్లు, అనుభవంతో కోరిక మరల అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. (50)
పృథివీ రత్నసంపూర్ణా హిరణ్యం పశవః స్త్రియః ।
నాలమేకస్య తత్ సర్వమితి మత్వా శమం వ్రజేత్ ॥ 51
కోరికతో ఉంటే రత్నసంపూర్ణమైన భూమి, బంగారం, పశువులు, స్త్రీలు సమస్తమూ ఒక్కనికి కూడ చాలదు. అని భావించి శాంతిని (ఇంద్రియనిగ్రహాన్ని) పొందాలి. (51)
యదా న కురుతే పాపం సర్వభూతేషు కర్హిచిత్ ।
కర్మణా మనసా వాచా బ్రహ్మ సంపద్యతే తదా ॥ 52
ప్రాణులన్నింటి విషయంలో ఒకప్పుడు కూడ మనసుచేకాని, వాక్కుచేకాని, కర్మచే కాని పాపం చేయనినాడు బ్రహ్మభావం పొందుతాడు. (52)
యదా చాయం న బిభేతి యదా చాస్మాన్న బిభ్యతి ।
యదా నేచ్ఛతి న ద్వేష్టి బ్రహ్మ సంపద్యతే తదా ॥ 53
తాను దేనివల్ల భయపడక, తనవల్ల ఎవరూ భయపడకుండా ఉండి, దేనినీ కోరక, ద్వేషింపక ఉండేవాడు బ్రహ్మభావం పొందుతాడు. (53)
ఇత్యవేక్ష్య మహాప్రాజ్ఞః కామానాం ఫల్గుతాం నృప ।
సమాధాయ మనో బుద్ధ్యా ప్రత్యగృహ్ణాజ్జరాం సుతాత్ ॥ 54
రాజా! మహాప్రాజ్ఞుడైన యయాతి కోరికల సారహీనతను గుర్తించి బుద్ధిచే మనస్సును సమాధానపరచి, కొడుకునుండి ముసలితనాన్ని తిరిగి తీసికొన్నాడు. (54)
దత్వా చ యౌవనం రాజా పూరం రాజ్యేఽభిషిచ్య చ ।
అతృప్త ఏవ కామానాం పూరుం పుత్ర మువాచ హ ॥ 55
యయాతి మహారాజు తిరిగి యౌవనాన్ని కొడుకుకు ఇచ్చి, పూరుని రాజ్యంలో అభిషేకించి, కామతృప్తిని చెందక తన కుమారుడు పూరునితో ఇలా అన్నాడు. (55)
త్వయా దాయాదవానస్మి త్వం మే వంశకరః సుతః ।
పౌరవో వంశ ఇతి తే ఖ్యాతిం లోకే గమిష్యతి ॥ 56
కుమారా! నీచేత నేను పుత్రవంతుడనయ్యాను. వంశకారకుడవగు కుమారుడవు నీవే. పౌరవ వంశమనే ఖ్యాతి నీకే లోకంలో కలుగుతుంది. (56)
వైశంపాయన ఉవాచ
తతః స నృపశార్దూల పూరం రాజ్యే ఽభిషిచ్య చ ।
తతః సుచరితం కృత్వా భృగుతుంగే మహాతపాః ॥ 57
కాలేన మహతా పశ్చాత్ కాలధర్మముపేయివాన్ ।
కారయిత్వా త్వనశనం సదారః స్వర్గమాప్తవాన్ ॥ 58
వైశంపాయనుడిలా అన్నాడు-పూరుడిని రాజ్యంలో అభిషేకించిన తర్వాత మహాతపస్వి యయాతి భృగుతుంగ పర్వతానికి వెళ్ళి సత్కర్మల నాచరించాడు. తర్వాత్ చాలా కాలం గడిచాక తన భార్యలతో పాటు నిరాహారవ్రతం చేసి స్వర్గాన్ని పొందాడు. (57,58)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి యయాత్యుపాఖ్యానే పంచసప్తతితమోఽధ్యాయః ॥ 75 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవ పర్వమను ఉపపర్వమున యయాతి ఉపాఖ్యానమను డెబ్బది అయిదవ అధ్యాయము. (75)