65. అరువది అయిదవ అధ్యాయము

(సంభవ పర్వము)

మరీచి, మున్నగు మహర్షుల, దక్ష కన్యకల వంశవివరణము.

వైశంపాయన ఉవాచ
అథ నారాయణేనేంద్రః చకార సహ సంవిదమ్ ।
అవతర్తుం మహీం స్వర్గాద్ అంశతః సహితః సురైః ॥ 1
వైశంపాయనుడిలా చెప్పాడు - తరువాత దేవతలందరితో బాటు ఇంద్రుడు శ్రీమహావిష్ణువుతో స్వర్గం నుండి భూమిపై అవతరించడానికి అనుజ్ఞ తీసికొన్నాడు. (1)
ఆదిశ్య చ స్వయం శక్రః సర్వానేవ దివౌకసః ।
నిర్జగామ పునస్తస్మాత్ క్షయాన్నారాయణస్య హ ॥ 2
ఇంద్రుడు దేవతలందరిని ఆదేశించి నారాయణుని నివాసం నుండి నిష్క్రమించాడు. (2)
తేఽమరారివినాశాయ సర్వలోక హితాయ చ ।
అవతేరుః క్రమేణైవ మహీమ్ స్వర్గాద్ దివౌకసః ॥ 3
ఆ దేవతలందరూ తమ శత్రువులైన అసురుల వినాశంకోసమూ, సర్వలోక హితం కోసమూ క్రమంగా స్వర్గం నుండి భూమిపై అవతరించారు. (3)
తతో బహ్మర్షివంశేషు పార్థివర్షికులేషు చ ।
జజ్ఞిరే రాజశార్దూల యథాకామం దివౌకసః ॥ 4
రాజశ్రేష్ఠా! దేవతలు వారి వారి ఇచ్ఛానుసారంగా బ్రహ్మర్షుల వంశాలలోను రాజర్షుల వంశాలలోను, జన్మించారు. (4)
దానవాన్ రాక్షసాంశ్చైవ గంధర్మాన్ పన్నగాంస్తథా ।
పురుషాదాని చాన్యాని జఘ్నుః సత్త్వాన్యనేకశః ॥ 5
దానవా రాక్షసాశ్చైవ గంధర్వాః పన్నగాస్తథా ।
న తాన్ బలస్థాన్ బాల్యేఽపి జఘ్నుః భరత సత్తమ ॥ 6
వారు దానవులను, రాక్షసులను, దుష్టగంధర్వులను, సర్పాలను, మానవులను భక్షించే ఇతర ప్రాణులను పలుమార్లు సంహరించారు. భరతశ్రేష్ఠా! బలవంతులైన బాల్యంలో ఉన్నా దానవులు, రాక్షసులు, గంధర్వులు నాగులు ఏమీ చెయ్యలేకపోయారు. (5,6)
జనమేజయ ఉవాచ
దేవదానవ సంఘానాం గంధర్వాప్సరసాం తథా ।
మానవానాం చ సర్వేషాం తథా వై యక్షరక్షసామ్ ॥ 7
శ్రోతుమిచ్ఛామి తత్త్వేన సంభవం కృత్స్నమాదితః ।
ప్రాణినాం చైవ సర్వేషాం సంభవం వక్తుమర్హసి ॥ 8
జనమేజయుడిలా అడిగాడు - దేవతలు, దానవులు, గంధర్వులు, అప్సరసలు, మానవులు, యక్షులు, రాక్షసులు మొదలయిన సర్వప్రాణుల జన్మ ప్రకారాన్ని పూర్తిగా నీవు చెపితే వినాలని ఉంది. (7,8)
వైశంపాయన ఉవాచ
హంత తే కథయిష్యామి నమస్కృత్య స్వయంభువే ।
సురాదీనామహం సమ్యగ్ లోకానాం ప్రభవాప్యయమ్ ॥ 9
వైశంపాయనుడిలా అన్నాడు - పూజ్యుడైన స్వయంభూ బ్రహ్మకు నమస్కరించి, దేవతాదుల ఉత్పత్తి వినాశాదుల గురించి సమగ్రంగా చెప్తాను. (9)
బ్రహ్మణో మానసాః పుత్రాః విదితాః షణ్మహర్షయః ।
మరీచిరత్య్రంగిరసౌ పులస్త్యః పులహః క్రతుః ॥ 10
బ్రహ్మ మానస పుత్రులు మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అనే ఆరుగురు మహర్షులు ప్రసిద్ధులు. (10)
మరీచేః కశ్యపః పుత్రః కశ్యపాత్తు ఇమాః ప్రజాః ।
ప్రజజ్ఞిరే మహాభాగా దక్షకన్యాస్త్రయో దశ ॥ 11
వారిలో మరీచికి కశ్యపుడనే కుమారుడున్నాడు. ఆ కశ్యపునకే ఈ ప్రజలందరూ జన్మించారు. బ్రహ్మకు దక్షుడనే కొడుకున్నాడు. అతనికి సౌభాగ్యశీలవతులైన పదముగ్గురు కూతుళ్లున్నారు. (11)
అదితిర్దితిర్దినుః కాలా దనాయుః సింహికా తథా ।
క్రోధా ప్రాధా చ విశ్వా వినతా కపిలా మునిః ॥ 12
కద్రూశ్చ మనుజవ్యాఘ్ర! దక్షకన్యైవ భారత ।
ఏతాసాం వీర్యసంపన్నం పుత్రపౌత్రమనంతకమ్ ॥ 13
అదితి, దితి, దనువు, కాల, దనాయువు, సింహిక, క్రోధ, ప్రాధ, విశ్వ, వినత, కపిల, ముని, కద్రువ, అను పదముగ్గురు దక్షుని కూతుళ్లు. వీరికి బలపరాక్రమాలు గల పుత్రులు జన్మించారు. (12,13)
అదిత్యాం ద్వాదశాదిత్యాః సంభూతా భువనేశ్వరాః ।
యే రాజన్ నామతస్తాంస్తే కీర్తయిష్యామి భారత ॥ 14
అదితికి లోకపాలురైన పన్నెండుగురు ఆదిత్యులు జన్మించారు. వారి పేర్లు పేర్కొంటాను. (14)
ధాతా మిత్రోఽర్యమా శక్రో వరుణస్త్వంశ ఏవ చ ।
భగో వివస్వాన్ పూషా చ సవితా దశమస్తథా ॥ 15
ఏకాదశస్తథా త్వష్టా ద్వాదశో విష్ణురుచ్యతే ।
జఘన్యజస్తు సర్వేషామ్ ఆదిత్వానాం గుణాధికః ॥ 16
ధాత, మిత్రుడు, అర్యముడు, శక్రుడు, వరుణుడు, అంశుడు, భగుడు, వివస్వంతుడు, పూష, సవిత, త్వష్ట, విష్ణువు. వీరందరిలో చిన్నవాడు విష్ణువు ఆదిత్యులందరి కంటె గుణాధికుడు. (15,16)
ఏక ఏవ దితేః పుత్రః హిరణ్యకశిపుః స్మృతః ।
నామ్నాఖ్యాతాస్తు తస్యేమే పంచపుత్రా మహాత్మనః ॥ 17
దితికి హిరణ్యకశిపుడనే ఒక్కపుత్రుడు మాత్రమే కలిగాడు. అతనికి మహాత్ములైన ఐదుగురు పుత్రులు కలిగారు. (17)
ప్రహ్రాదః పూర్వజస్తేషాం సంహ్రాదస్తదనంతరమ్ ।
అనుహ్రాదస్తృతీయోఽభూత్ తస్మాచ్చ శిబిబాష్కలౌ ॥ 18
వారిలో పెద్దవాడు ప్రహ్రాదుడు. రెండవవాడు సంహ్రాదుడు. మూడవవాడు అనుహ్రాదుడు. నాల్గవవాడు శిబి. ఐదవవాడు బాష్కలుడు. (18)
ప్రహ్యాదస్య త్రయః పుత్రాః ఖ్యాతాః సర్వత్ర భారత ।
విరోచనశ్చ కుంభశ్చ నికుంభశ్చేతి భారత ॥ 19
ప్రహాదునికి విరోచనుడు, కుంభుడు, నికుంభుడు అను ముగ్గురు పుత్రులు కలిగారు. (19)
విరోచనస్య పుత్రోఽభూత్ బలిరేకః ప్రతాపవాన్ ।
బలేశ్చ ప్రథితః పుత్రః బాణో నామ మహాసురః ॥ 20
విరోచనుడికి ప్రతాపవంతుడైన బలి అనే ఒక పుత్రుడు జన్మించాడు. ఆ బలి కుమారుడు బాణుడు మహాసురుడని ప్రసిద్ధుడు. (20)
రుద్రస్యానుచరః శ్రీమాన్ మహాకాలేతి యం విదుః ।
చతుస్త్రింశద్ దనోః పుత్రాః ఖ్యాతాః సర్వత్ర భారత ॥ 21
శ్రీమంతుడైన అతడు రుద్రునికి అనుచరుడు. మహాకాలుడని ప్రసిద్ధుడు. ఇక దనువుకు ముప్పది నలుగురు పుత్రులు కలిగారు. (21)
తేషాం ప్రథమజో రాజా విప్రచిత్తిర్మహాయశాః ।
శంబరో నముచిశ్చైవ పులోమా చేతి విశ్రుతః ॥ 22
అసిలోమా చ కేశీ చ దుర్జయశ్చైవ దానవః ।
అయఃశిరా అశ్వశిరాః అశ్వశంకుశ్చ వీర్యవాన్ ॥ 23
తథా గగనమూర్ధా చ వేగవాన్ కేతుమాంశ్చ సః ।
స్వర్భాను రశ్వోఽశ్యపతిః వృషపర్వాజక స్తథా ॥ 24
అశ్వగ్రీవశ్చ సూక్ష్మశ్చ తుహుండశ్చ మహాబలః ।
ఇషుపాదేకచక్రశ్చ విరూపాక్షో హరాహరౌ ॥ 25
నిచంద్రశ్చ నికుంభశ్చ కుపటః కపటస్తథా ।
శరభః శలభశ్చైవ సూర్యాచంద్రమసౌ తథా ।
ఏతే ఖ్యాతా దనోర్వంశే దానవాః పరికీర్తితాః ॥ 26
రాజా! వారిలో మహాయశస్వి ఐన విప్రచిత్తి అందరికంటె పెద్దవాడు. తరువాత శంబరుడు, నముచి, పులోముడు, అసిలోముడు, కేశి, దుర్జయుడు, అయఃశిరుడు, అశ్వశిరుడు, అశ్వశంకువు, గగనమూర్ధుడు, వేగవంతుడు, కేతుమంతుడు, స్వర్భానుడు, అశ్వుడు, అశ్వపతి, వృషపర్వుడు, అజకుడు, అశ్వగ్రీవుడు, సూక్ష్ముడు, మహాబలుడయిన తుహుండుడు, ఇషుపాదుడు, ఏకచక్రుడు, విరూపాక్షుడు, హరుడు, అహరుడు, నిచంద్రుడు, నికుంభుడు, కుపటుడు, కపటుడు, శరభుడు, శలభుడు, సూర్యుడు, చంద్రుడు - ఈ ముప్పది నలుగురు దనువంశంలో జన్మించినావారు, దానవులు. (22-26)
అన్యౌ తు ఖలు దేవానాం సూర్యాచంద్రమసౌ స్మృతౌ ।
అన్యౌ దానవముఖ్యానాం సూర్యాచంద్రమసౌ తథా ॥ 27
దేవతలలోని సూర్యచంద్రులు వేరు. దానవ ముఖ్యులలోని సూర్యచంద్రులు వేరు. (27)
ఇమే చ వంశాః ప్రథితాః సత్త్వవంతో మహాబలాః ।
దనుపుత్రా మహారాజ దశ దానవ వంశజాః ॥ 28
ధైర్యవంతులు బలవంతులు అయిన ఈ దనుపుత్రుల వంశాలు ప్రసిద్ధాలు, దానవవంశంలో పుట్టిన పదిమంది దనుజులు ప్రసిద్ధులు. (28)
ఏకాక్షో మృతపా వీరః ప్రలంబ నరకావపి ।
వాతాపీ శత్రుతపనః శఠశ్చైవ మహాసురః ॥ 29
గవిష్ఠశ్చ వనాయుశ్చ దీర్ఘజిహ్వశ్చ దానవః ।
అసంఖ్యేయాః స్మృతాస్తేషాం పుత్రాః పౌత్రాశ్చ భారత ॥ 30
ఏకాక్షుడు, మృతపుడు, ప్రలంబుడు, నరకుడు, వాతాపి, శత్రుతపనుడు,శఠుడు, గవిష్ఠుడు, వనాయువు, దీర్ఘజిహ్వుడు అనే వారు ప్రసిద్ధులు. వారికి పుత్రులు పౌత్రులు లెక్కించలేనంతమంది. (29,30)
సింహికా సుషువే పుత్రమ్ రాహుం చంద్రార్కమర్దనమ్ ।
సుచంద్రం చంద్రహర్తారం తథా చంద్రప్రమర్దనమ్ ॥ 31
దక్షకన్య సింహిక సూర్యచంద్రులను హింసించే రాహువును కన్నది. అదేవిధంగా సుచంద్రుడు, చంద్రహర్త, చంద్ర ప్రమర్దనుడు అనే పుత్రులనూ కన్నది. (31)
క్రూరస్వభావం క్రూరాయాః పుత్రపౌత్రమనంతకమ్ ।
గణః క్రోధవశో నామ క్రూరకర్మారిమర్దనః ॥ 32
క్రూరకు (క్రోధ) క్రూరస్వభావం గల పలువురు పుత్రులు, పౌత్రులు జన్మించారు. శత్రువులను అణచివేయగల క్రూరకర్ములు, క్రోధవశులు అనే సంతాన గణాన్ని కన్నది. (32)
దనాయుషః పునః పుత్రాః చత్వారోఽసురపుంగవాః ।
విక్షరో బలవీరౌ చ వృత్రశ్చైవ మహాసురః ॥ 33
దనాయువుకు విక్షరుడు, బలుడు, వీరుడు, వృత్రుడు అనే నలుగురు మహాసురులు కొడుకులు అయ్యారు. (33)
కాలాయః ప్రథితాః పుత్రాః కాలకల్పాః ప్రహారిణః ।
ప్రవిఖ్యాతా మహావీర్యాః దానవేషు పరంతపాః ॥ 34
కాలకు అస్త్రశస్త్రాల్లో ఆరితేరి కాలునితో సమానమైన పుత్రులు కలిగారు. వారు దానవులలో ప్రసిద్ధులూ, పరాక్రమవంతులూ, శత్రువులను నాశనం చేయగలవారూ అయ్యారు. (34)
వినాశనశ్చ క్రోధశ్చ క్రోధహంతా తథైవ చ ।
క్రోధశత్రుస్తథైవాన్యే కాలకేయా ఇతి శ్రుతాః ॥ 35
వారిలో వినాశనుడు, క్రోధుడు, క్రోధహంత, క్రోధశత్రువు అనేవారు ప్రసిద్ధులు. ఇంకా కాలకేయులని ప్రసిద్ధి గల అసురులు కూడ కాలయొక్క పుత్రులే. (35)
అసురాణాముపాధ్యాయః శుక్రస్త్వృషిసుతోఽభవత్ ।
ఖ్యాతాశ్చోశనసః పుత్రాః చత్వారోఽసురయాజకాః ॥ 36
అసురులకు ఉపాధ్యాయుడైన శుక్రుడు భృగు మహర్షి కుమారుడు. అతనిని ఉశనసుడని కూడా అంటారు. అతనికి నలుగురు పుత్రులున్నారు. వారు అసురులకు పురోహితులు. (36)
త్వష్టాధరస్తథాత్రిశ్చ ద్వావన్యౌ రౌద్రకర్మణౌ ।
తేజసా సూర్యసంకాశాః బ్రహ్మలోకపరాయణాః ॥ 37
తక్కిన శుక్రుని కుమారులు త్వష్టాధరుడు, అత్రి అనువారు. మిగిలిన వారిద్దరూ రౌద్రకర్మలు చేసేవారు, చేయించేవారు కూడ. ఉశనసుని కుమారులంతా సూర్యునితో సమంగా ప్రకాశించేవారు, బ్రహ్మలోక పరాయణులు కూడ. (37)
ఇత్యేష వంశప్రభవః కథితస్తే తరస్వినామ్ ।
అసురాణాం సురాణాంచ చ పురాణే సంశ్రుతో మయా ॥ 38
రాజా! పురాణాలలో విన్నరీతిగా దేవతల యొక్క తీవ్రస్వభావులైన అసురుల యొక్క జన్మవృత్తాంతాన్ని నీకు చెప్పాను. (38)
ఏతేషాం యదపత్యం తు న శక్యం తదశేషతః ।
ప్రసంఖ్యాతుం మహీపాల గుణభూతమనంతకమ్ ॥ 39
తార్ క్ష్యశ్చారిష్టనేమిశ్చ తథైవ గరుడారుణౌ ।
ఆరుణిర్వారుణిశ్చైవ వైనతేయాః ప్రకీర్తితాః ॥ 40
రాజా! వారి సంతానాన్ని గురించి పూర్తిగ చెప్పడం సాధ్యం కాదు. అనంతమైన ఆ వృత్తాంతమంతా చెప్పడానికి అంత ప్రాధానమైంది కుడా కాదు. తార్ క్ష్యుడు, అరిష్టనేమి, గరుడుడు; అరుణుడు, ఆరుణి, వారుణి వినతాపుత్రులుగా ప్రసిద్ధులు. (39,40)
శేషోఽనంతో వాసుకిశ్చ తక్షకశ్చ భుజంగమః ।
కూర్మశ్చ కులికశ్చైవ కాద్రవేయాః ప్రకీర్తితాః ॥ 41
శేషుడు, అనంతుడు, వాసుకి, తక్షకుడు, కూర్ముడు, కులికుడు కద్రువపుత్రులు. (41)
భీమసేనోగ్రసేనౌ చ సుపర్ణో వరుణస్తథా ।
గోపతిర్ధృహరాష్ట్రశ్చ సూర్యవర్చాశ్చ సప్తమః ॥ 42
సత్యవాగర్కపర్ణశ్చ ప్రయుతశ్చాపి విశ్రుతః ।
భీమశ్చిత్రరథశ్చైవ విఖ్యాతః సర్వవిద్ వశీ ॥ 43
తథా శాలిశిరా రాజన్ పర్జన్యశ్చ చతుర్దశః ।
కలిః పంచదశస్తేషాం నారదశ్చైవ షోడశః ।
ఇత్యేతే దేవగంధర్వాః మౌనేయాః పరికీర్తితాః ॥ 44
రాజా! భీమసేనుడు, ఉగ్రసేనుడు, సుపర్ణుడు, వరుణుడు, గోపతి, ధృతరాష్ట్రుడు, సూర్యవర్చసుడు, సత్యవాక్కు, అర్కపర్ణుడు, ప్రయుతుడు, భీముడు, సర్వజ్ఞుడు, జితేంద్రియుడయిన చిత్రరథుడు, శాలిశిరుడు, పర్జన్యుడు, కలి, నారదుడు ఈ పదునార్గుగురు దేవగంధర్వ జాతులవారు మునిగర్భం నుండి జన్మించారు. (42-44)
అథ ప్రభూతాన్యన్యాని కీర్తయిష్యామి భారత ।
అనవద్యాం మనుం వంశామ్ అసురాం మార్గణప్రియామ్ ॥ 45
అరూపాం సుభగాం భాసీమ్ ఇతి ప్రాధా వ్యజాయత ।
సిద్ధః పూర్ణశ్చ బర్హిశ్చ పుర్ణాయుశ్చ మహాయశాః ॥ 46
బ్రహ్మచారీ రతిగుణః సుపర్ణశ్చైవ సప్తమః ।
విశ్వావసుశ్చ భనుశ్చ సుచంద్రో దశమస్తథా ॥ 47
ఇత్యేతే దేవగంధర్వాః ప్రాధేయాః పరికీర్తితాః ।
ఇమం త్వప్సరసాం వంశం విదితం పుణ్యలక్షణమ్ ॥ 48
ప్రాధాసూత మహాభాగా దేవీ దేవర్షితః పురా ।
అలంబుషా మిశ్రకేశీ విద్యుత్పర్ణా తిలోత్తమా ॥ 49
అరుణా రక్షితా చైవ రంభా తద్వన్మనోరమా ।
కేశినీ చ సుబాహుశ్చ సురతా సరజా తథా ॥ 50
సుప్రియా చాతిబాహుశ్చ విఖ్యాతౌ చ హాహా హూహూః ।
తుంబురుశ్చేతి చత్వారః స్మృతా గంధర్వసత్తమాః ॥ 51
భారత! ఇక తక్కిన వంశాలను గురించి చెప్తాను. దక్షకన్య అయిన ప్రాధ అనవద్య, మనువు, వంశ, అసుర, మార్గణ ప్రియ, అరూప, సుభగ, భాసి అను కన్యలను కన్నది. సిద్ధుడు, పూర్ణుడు, బర్హి, మహాయశస్వి, పూర్ణాయువు, బ్రహ్మచారి, రతిగుణుడు, సుపర్ణుడు, విశ్వావసువు, భానువు, సుచంద్రుడు అను పదిమంది దేవగంధర్వ జాతుల వారు ప్రాధకు జన్మించిన కుమారులు. ఇంతేకాక ప్రాధ కశ్యప మహర్షి వల్ల ప్రసిద్ధులైన శుభలక్షణాలున్న అప్సర స్త్రీలకు జన్మ నిచ్చింది. అలంబుష, మిశ్రకేశి, విద్యుత్పర్ణ, తిలోత్తమ, అరుణ, రక్షిత, రంభ, మనోరమ, కేశిని, సుబాహు, సురత, సరజ, సుప్రియ అనేవారు ప్రాధకు జన్మించిన వారే. అతిబాహువు, హాహా, హూహూలు తుంబురుడు ఈ నలుగురు ప్రాధ సంతానమే. (45-51)
అమృతం బ్రాహ్మణా గావః గంధర్వాప్సరసస్తథా ।
అపత్యం కపిలాయాస్తు పురాణే పరికీర్తితమ్ ॥ 52
అమృతం, బ్రాహ్మణులు, గోవులు, గంధర్వులు, అప్సరసలు కపిలయొక్క సంతానంగా పురాణ ప్రసిద్ధమైంది. (52)
ఇతి తే సర్వభూతానాం సంభవః కథితో మయా ।
యథావత్ సంపరిఖ్యాతః గంధర్వాప్సరసాం తథా ॥ 53
భుజంగానాం సుపర్ణానాం రుద్రాణాం మరుతాం తథా ।
గవాం చ బ్రాహ్మణానాం చ శ్రీమతాం పుణ్యకర్మణామ్ । 54
ఈ విధంగా గంధర్వులు, అప్సరసలు, సర్పాలు, సుపర్ణులు, రుద్రులు, మరుత్తులు, గోవులు బ్రాహ్మణులు మొదలైన సమస్త ప్రాణుల ఉత్పత్తిని ఉన్నదున్నట్లుగా చెప్పాను. (53,54)
ఆయుష్యశ్చైవ పుణ్యశ్చ ధన్యః శ్రుతిసుఖావహః ।
శ్రోతవ్యశ్చైవ సతతం శ్రావ్యశ్చైవానసూయతా ॥ 55
ఆయుర్దాయకం, పుణ్యప్రదం, ధన్యం, శ్రుతిసుఖావహం, శ్రోతవ్యం అయిన ఈ వృత్తాంతాన్ని, వినాలి, వినిపించాలి. దోషదృష్టి లేకుండా వినాలని భావం. (55)
ఇమం తు వంశం నియమేన యః పఠేత్
మహాత్మనాం బ్రాహ్మణదేవసంనిధౌ ।
అపత్య లాభం లభతే స పుష్కలమ్
శ్రియం యశః ప్రేత్య చ శోభనాం గతిమ్ ॥56
మహాత్ముల వంశోత్పత్తిని గురించి బ్రాహ్మణ దేవ సన్నిధిలో చదివినవారు సంతానం, పుష్కలమైన ధనం, కీర్తి పొందగలరు. మరణానంతరం ఉత్తమ గతిని పొందుతారు. (56)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవసర్వణి ఆదిత్యాది వంశకథనే పంచషష్టితమోఽధ్యాయః ॥ 65 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున ఆదిత్యాది వంశకథనమను అరువది ఐదవ అధ్యాయము. (65)