63. అరువది మూడవ అధ్యాయము
ఉపరిచర మహారాజు చరిత్ర - వ్యాస జననము.
వైశంపాయన ఉవాచ
రాజోపరిచరో నామ ధర్మనిత్యో మహీపతిః ।
బభూవ మృగయాం గంతుం సదా కిల ధృతవ్రతః ॥ 1
వైశంపాయనుడిలా చెప్పాడు - జనమేజయా! నిత్యం ధర్మం ఆచరిస్తూ వేటకు వెళ్లడం నియమంగా పెట్టుకొన్న ఉపరిచరుడనే రాజు ఉండేవాడు. (1)
స చేదివిషయం రమ్యం వసుః పౌరవనందనః ।
ఇంద్రోపదేశాజ్జగ్రాహ రమణీయం మహీపతిః ॥ 2
పౌరవనందనుడైన ఆ ఉపరిచరవసువు ఇంద్రుని సలహాపై చేదిరాజ్యాన్ని స్వీకరించాడు. (2)
తమాశ్రమే న్యస్తశస్త్రం నివసంతం తపోనిధిమ్ ।
దేవాః శక్రపురోగా వై రాజానముపతస్థిరే ॥ 3
ఇంద్రత్వమర్హో రాజాయం తపసేత్యనుచింత్య వై ।
తం సాంత్వేన నృపం సాక్షాత్ తపసః సంన్యవర్తయన్ ॥ 4
శస్త్రాన్ని వదిలి ఆశ్రమంలో తపోనిష్ఠలో ఉన్న అతనిని చూసి 'ఈ రాజు తన తపస్సుతో ఇంద్రపదవికి అర్హుడౌతాడు' అని భావించి ఇంద్రాదిదేవతలంతా అతనిని సమీపించి శాంతి పూర్వకంగా అతని చేత తపస్సు మాన్పించారు. (3,4)
దేవా ఊచుః
న సంకీర్యేత ధర్మోఽయం పృథివ్యాం పృథివీపతే ।
త్వయా హి ధర్మో విధృతః కృత్స్నం ధారయతే జగత్ ॥ 5
దేవతలిలా అన్నారు - రాజా! ఈ భూమి మీద ధర్మం సంకరం కాకూడదు. నీవు ధర్మాన్ని ఆచరిస్తే ఈ లోకమంతా ధర్మాన్ని ఆచరిస్తుంది. (5)
ఇంద్ర ఉవాచ
లోకే ధర్మం పాలయ త్వం నిత్యయుక్తః సమాహితః ।
ధర్మయుక్తస్తతో లోకాన్ పుణ్యాన్ ప్రాప్స్యసి శాశ్వతాన్ ॥ 6
ఇంద్రుడిలా చెప్పాడు - రాజా! ఈ లోకంలో నిత్యం సావధానుడవై ధర్మాన్ని రక్షించు. అలా ధర్మయుక్తుడవైన నీవు శాశ్వత పుణ్యలోకాలను పొందుతావు. (6)
దివిష్ఠస్య భువిష్ఠస్త్వం సఖా భూతో మమ ప్రియః ।
రమ్యః పృథివ్యాం యో దేశః తమావస నరాధిప ॥ 7
నరాధిపా! స్వర్గంలో ఉండే నాకు భూమిపై ఉండే నీవు మిత్రుడవు. ఈ భూమిపై నీకిష్టమైన అందమైన దేశంలో నీవుండవచ్చు. (7)
పశవ్యశ్చైవ పుణ్యశ్చ ప్రభూతధనధాన్యవాన్ ।
స్వారక్ష్యశ్చైవ సౌమ్యశ్చ భోగ్యైర్భూమిగుణైర్యుతః ॥ 8
అర్థవానేష దేశో హి ధనరత్నాదిభిర్యుతః ।
వసుపూర్ణా చ వసుధా వస చేదిషు చేదిప ॥ 9
ధర్మశీలా జనపదాః సుసంతోషాశ్చ సాధవః ।
న చ మిథ్యాప్రలాపోఽత్ర స్వైరేష్వపి కుతోఽన్యథా ॥ 10
న చ పిత్రా విభజ్యంతే పుత్రాః గురుహితే రతాః ।
యుంజతే ధుర్ నో గాశ్చ కృశాన్ సంధుక్షయంతి చ ॥ 11
సర్వే వర్ణాః స్వధర్మస్థాః సదా చేదిషు మానద ।
న తేఽస్త్యవిదితం కించిత్ త్రిషు లోకేషు యద్భవేత్ ॥ 12
చేదిదేశం పశువులకు హితమైనది. పవిత్రమైనది. ధనధాన్యరాశులు కలది. స్వర్గం వలె రక్షింపదగినది. సౌమ్యమైనది. భూసంబంధమైన భోగ్యగుణాలతో కూడి ఉంది. సంపన్నమైనది. ధనరత్నాదులతో - బంగారంతో నిండినది. కావున నీవు అక్కడ నివసించు. అక్కడి పల్లెలన్నీ ధర్మశీలం కలవి. సత్పురుషులంతా సంతోషంగా ఉంటారు. స్వేచ్ఛగా సంచరించేవారు కూడా. అసత్యమాడరు. ఇక తక్కిన వారి విషయం చెప్పాలా? పెద్దవారికి హితం కోరి పుత్రులు తల్లిదండ్రుల నుండి విడిపోరు. ఎద్దులపైనే భారాన్ని మోపరు. కృశించిన ఎద్దులను దయతో పోషిస్తారు కూడ. మానద! చేది దేశంలో అందరూ వారి వారి ధర్మాలను ఆచరిస్తారు. ముల్లోకాల్లో జరిగింది నీకు తెలియనిదంటూ ఏమీ ఉండదు. (8-12)
దేవోపభోగ్యం దివ్యం త్వామ్ ఆకాశే స్ఫాటికం మహత్ ।
ఆకాశగం త్వాం మద్దత్తం విమానముపపత్స్యతే ॥ 13
ఈ విమానాన్ని నీకు ఇస్తున్నా. ఇది స్ఫటిక నిర్మితం. దేవతలు మాత్రం ఉపభోగించేది. ఇది నీకు ఆకాశంలో సదా సిద్ధంగా ఉంటుంది. (13)
త్వమేకః సర్వమర్త్యేషు విమానవరమాస్థితః ।
చరిష్యస్యుపరిస్థో హి దేవో విగ్రహవానివ ॥ 14
మానవులందరిలో నీవొక్కడవే శ్రేష్ఠమైన ఈ విమానాన్ని ఎక్కి రూపుదాల్చిన దేవుడిలా ఆకాశంలో సంచరింపగలవు. (14)
దదామి తే వైజయంతీం మాలామమ్లానపంకజామ్ ।
ధారయిష్యతి సంగ్రామే యా త్వాం శస్త్రైరవిక్షతమ్ ॥ 15
వాడని పద్మాలుండే 'వైజయంతి' అనే మాల నీకు ఇస్తున్నాను. అది యుద్ధంలో ఆయుధాల వల్ల దెబ్బతగలకుండా నిన్ను రక్షిస్తుంది. (15)
లక్షణం చైతదేవేహ భవితా తే నరాధిప ।
ఇంద్రమాలేతి విఖ్యాతం ధన్యమ ప్రతిమం మహత్ ॥ 16
రాజా! ఇంద్రమాలగా ప్రఖ్యాతిగాంచిన ఈ మాల చాలా గొప్పది. దీనిని పోలినది వేరొకటి లేదు. ఈ ఇంద్రమాలతో నిన్ను అందరూ గుర్తిస్తారు. (16)
యష్టిం చ వైణవీం తస్మై దదౌ వృత్రనిఘాదనః ।
ఇష్టప్రదానముద్దిశ్య శిష్టానాం ప్రతిపాలినీమ్ ॥ 17
వృత్రాసురుని చంపిన ఇంద్రుడు ఆ రాజుకు ఒక వేణుయష్టిని (వెదురు కర్ర) ఇచ్చాడు. అది కోరికలు తీరుస్తుంది. సజ్జనులను రక్షిస్తుంది. (17)
తస్యాః శక్రస్య పూజార్థం భూమౌ భూమిపతిస్తదా ।
ప్రవేశం కారయామాస గతే సంవత్సరే తదా ॥ 18
అపుడారాజు ఇంద్రుని గౌరవార్థం ఆ కర్రను భూమి మీద ప్రతిష్ఠించి పూజించాడు. ఒక సంవత్సరం గడచింది. (18)
తతః ప్రభృతి చాద్యాపి యష్టేః క్షితిపసత్తమైః ।
ప్రవేశః క్రియతే రాజన్ యథా తేన ప్రవర్తితః ॥ 19
అప్పటి నుండి నేటి వరకు రాజశ్రేష్ఠులు ఆ రాజు చేసినట్లు యష్టిప్రవేశం చేసేవారు. (19)
అపరేద్యుస్తతస్తస్యాః క్రియతేఽత్యుచ్ఛ్రయో నృపైః ।
అలంకృతాయాః పిటకైః గంధమాల్యైశ్చ భూషణైః ॥ 20
మాల్యదామపరిక్షిప్తా విధివత్ క్రియతేఽపి చ ।
భగవాన్ పూజ్యతే చాత్ర హంసరూపేణ చేశ్వరః ॥ 21
యష్టిప్రవేశం జరిగిన మరుసటిరోజున దానికి ఉత్సవం చేస్తారు. దానిని పిటకాలతో, గంధమాల్యాలతో, భూషణాలతో అలంకరిస్తారు. పూలదండలతో కప్పి దానిని యథావిధిగా హంసరూపంలో ఈశ్వరునిగా పూజించేవారు. (20,21)
స్వయమేవ గృహీతేన వసోః ప్రీత్యా మహాత్మనః ।
స తాం పూజాం మహేంద్రస్తు దృష్ట్వా దేవః కృతాం శుభామ్ ॥ 22
వసునా రాజముఖ్యేన ప్రీతిమానబ్రవీత్ ప్రభుః ।
యే పూజయిష్యంతి నరాః రాజానశ్చ మహం మమ ॥ 23
కారయిష్యంతి చ ముదా యథా చేదిపతిర్నృపః ।
తేషాం శ్రీర్వజయశ్చైవ సరాష్ట్రాణాం భవిష్యతి ॥ 24
మహేంద్రుడు వసురాజుపై ప్రీతితో స్వయంగా హంసరూపం దాల్చి అతడు చేసిన శుభమైన పూజను గ్రహించి, సంతుష్టుడై ఇలా అన్నాడు - "చేదిరాజు ఉపరిచరవసువు చేసిన విధంగా నా పూజ చేసి, ఉత్సవం చేసిన రాజులు, విజయ సంపన్నులవుతారు. వారి రాజ్యాలు సంపదలతో విజయాలతో విలసిల్లుతాయి. (22-24)
తథా స్ఫీతో జనపదః ముదితశ్చ భవిష్యతి ।
ఏవం మహాత్మనా తేన మహేంద్రేణ నరాధిప ॥ 25
వసుః ప్రీత్యా మఘవతా మహారాజో ఽభిసత్కృతః ।
ఉత్సవం కారయిష్యంతి సదా శక్రస్య యే నరాః ॥ 26
భూమిరత్నాదిభిర్దానైః తథా పూజ్యా భవంతి తే ।
వరదానమహాయజ్ఞైః తథా శక్రోత్సవేన చ ॥ 27
అంతేకాక ఆ రాజుల ఏలుబడిలోని జనపదాలు క్రమక్రమంగా ఉన్నతిని పొందుతాయి. ఇలా అని మహేంద్రుడు ఉపరిచరవసువును ప్రీతితో సత్కరించాడు. భూమిరత్నాది దానాలతో ఇంద్రోత్సవాన్ని చేసిన మానవులు వరదానమహాయజ్ఞాదులచే పూజనీయులౌతారు. (25-27)
సంపూజితో మఘవతా వసుశ్చేదీశ్వరో నృపః ।
పాలయామాస ధర్మేణ చేదిస్థః పృథివీమిమామ్ ॥ 28
ఇలా ఇంద్రునిచే పూజింపబడిన వసువు చేదిదేశంలో ఉండి ఈ భూమిని ధర్మంగా పరిపాలింపసాగాడు. (28)
ఇంద్రప్రీత్యా చేదిపతిః చకారేంద్రమహం వసుః ।
పుత్రాశ్చాస్య మహావీర్యాః పంచ సన్నమితౌజసః ॥ 29
ఇంద్రుని మీద ప్రీతితో చేది రాజయిన వసువు ప్రతి సంవత్సరమూ ఇంద్రోత్సవం చేశాడు. అనంతరం అతనికి మిక్కిలి బలశాలలులైన ఐదుగురు కుమారులు కలిగారు. (29)
నానారాజ్యేషు చ సుతాన్ స సమ్రాడభ్యషేచయత్ ।
మహారథో మాగధానాం విశ్రుతో యో బృహద్రథః ॥ 30
వసురాజు తన కుమారులను వివిధరాజ్యాలకు అభిషిక్తుల్ని చేశాడు. అందులో మహారథుడైన బృహద్రథుడు మగధరాజ్యానికి రాజుగా ప్రఖ్యాతి చెందాడు. (30)
ప్రత్యగ్రహః కుశాంబశ్చ యమాహుర్మణివాహనమ్ ।
మావేల్లశ్చ యదుశ్చైవ రాజన్యశ్చాపరాజితః ॥ 31
ప్రత్యగ్రహుడు రెండోవాడు. మూడవ వాడైన కుశాంబుని మణివాహనుడని కూడా అంటారు. నాల్గవవాడు మావేల్లుడు. ఐదోవాడు యదువు. ఇతడు ఎవరిచేతిలోనూ ఓడిపోలేదు. (31)
ఏతే తస్య సుతా రాజన్ రాజర్షేర్భూరితేజసః ।
న్యవాసయన్ నామభిః స్వైః తే దేశాంశ్చ పురాణి చ ॥ 32
జనమేజయా! గొప్ప తేజోవంతుడు, రాజర్షి ఐన ఉపరిచరవసువు కుమారులు తమతమ పేర్లమీదుగ నగరాలను, దేశాలను ఏర్పాటు చేసి నివసించారు. (32)
వాసవాః పంచరాజానః పృథగ్వంశాశ్చ శాశ్వతాః ।
వసంతమింద్రప్రాసాదే ఆకాశే స్ఫాటికే చ తమ్ ॥ 33
ఉపతస్థుర్మహాత్మానం గంధర్వాప్సరసో నృపమ్ ।
రాజోపరిచరేత్యేవం నామ తస్యాథ విశ్రుతమ్ ॥ 34
వసురాజుకుమారులు ఐదుగురూ వేర్వేరు రాజ్యాలను పాలిస్తూ వేరువేరుగా తమ సనాతన వంశ పరంపరను కొనసాగించారు. చేది రాజైన వసువు మాత్రం తిరుగుతూ ఆకాశంలోనే ఉండేవాడు. గంధర్వులు, అప్సరసలు ఆ మహాత్ముని సేవించడానికి వచ్చేవారు. ఆకాశంలో పై పైన చరించే అతనికి 'ఉపరిచరవసు' వనే పేరు ప్రసిద్ధి చెందింది. (33,34)
పురోపవాహినీం తస్య నదీం శుక్తిమతీమ్ గిరిః ।
అరౌత్సీచ్చేతనాయుక్తః కామాత్ కోలాహలః కిల ॥ 35
పూర్వం చేదిరాజ్యంలో శుక్తిమతి అనే ఉపనది ప్రవహిస్తూండేది. కోలాహలమనే పర్వతం చైతన్యం పొంది కామవశం వల్ల దివ్యరూపధారిణి ఐన ఆ నదిని అడ్డగించింది. (35)
గిరిం కోలాహలం తం తు పదా వసురతాడయత్ ।
నిశ్చక్రామ తతస్తేన ప్రహార వివరేణ సా ॥ 36
అపుడు వసురాజు ఆ కోలాహలుని తన కాలితో తన్నాడు. ఆ దెబ్బతో ఏర్పడిన రంధ్రం నుండి ఆ నది ప్రవహించింది. (36)
తస్యాం నద్యామజనయత్ మిథునం పర్వతం స్వయమ్ ।
తస్మాద్ విమోక్షణాత్ ప్రీతా నదీ రాజ్ఞా న్యవేదయత్ ॥ 37
కోలాహలుడు ఆ నదీ గర్భమందు ఒక పుత్రుని, ఒక పుత్రికను కన్నాడు. అతని నిర్బంధం నుండి విడిపించడం వల్ల ప్రసన్నురాలైన నది తన పిల్లల నిద్దరిని వసురాజుకు అప్పగించింది. (37)
యః పుమానభవత్ తత్ర తం స రాజర్షిసత్తమః ।
వసుర్వసుప్రదశ్చక్రే సేనాపతిమరిందమః ॥ 38
ధనదాత, శత్రుదమనుడూ అయిన వసురాజు వారిలో మగవానిని తన సేనాపతిగా చేశాడు. (38)
చకార పత్నీం కన్యాం తు తథా తాం గిరికాం నృపః ।
వసోః పత్నీ తు గిరికా కామకాలం న్యవేదయత్ ॥ 39
ఋతుకాలమనుప్రాప్తా ప్రాప్తా పుంసవనే శుచిః ।
తదహః పితరశ్చైనమ్ ఊచుర్జహి మృగానితి ॥ 40
తం రాజసత్తమం ప్రీతాః తదా మతిమతాం వర ।
స పితౄణాం నియోగం తమ్ అనతిక్రమ్య పార్థివః ॥ 41
చకార మృగయాం కామీ గిరికామేవ సంస్మరన్ ।
అతీవ రూపసంపన్నాం సాక్షాచ్ఛ్రియమివాపరామ్ ॥ 42
కన్య అయిన గిరికను తన భార్యగా చేసికొన్నాడు. వసురాజు భార్య గిరిక భోగార్హమైన ఋతుకాలంలో శుచిగా పుత్రసంతానాభిలాషను విన్నవించింది. అదే రోజున వసురాజు తండ్రి క్రూరమృగాలను సంహరింపుమని వసురాజును ఆదేశించాడు. తండ్రి ఆదేశాన్ని కాదనలేక చక్కని రూపసంపద గల్గి సాక్షాత్తుగా లక్ష్మీదేవి వలె ఉండే గిరికనే తలచుకొంటూ వేటాడినాడు. (39-42)
అశోకైశ్చంపకైశ్చూతైః అనేకైరతిముక్తకైః ।
పున్నాగైః కర్ణికారైశ్చ వకులైర్దివ్యపాటలైః ॥ 43
పాటలైర్నారికేలైశ్చ చందనైశ్చార్జునైస్తథా ।
ఏతై రమ్యైర్మహావృక్షైః పుణ్యైః స్వాదుఫలైర్యుతమ్ ॥ 44
కోకిలాకుల సంనాదం మత్తభ్రమరనాదితమ్ ।
వసంతకాలే తత్తస్య వనం చైత్రరథోపమమ్ ॥ 45
అది వసంతకాలం అవటంతో అశోకాలు, చంపకాలు, మామిళ్లు, మాధవీలతలు, పున్నాగలు, కర్ణికారాలు, వకుళాలు, దివ్యపాటలాలు, పాటలాలు, నారికేళాలు, చందనవృక్షాలు, అర్జున వృక్షాలు మొదలయిన వృక్షాలతో, పువ్వులతో, పళ్లతో నిండి, కోకిలల మధురస్వనంతో తుమ్మెదల ఝంకారాలతో ఆ వనం చైత్రరథంలా ఉంది. (43-45)
మన్మథాభిపరీతాత్మా నాపశ్యద్ గిరికామ్ తదా ।
అపశ్యన్ కామసంతప్తః చరమాణో యదృచ్ఛయా ॥ 46
ఆ వాతావరణంలో మన్మథాయత్తుడై బాధపడుతూ రాజు గిరికను చూడలేక ఇచ్ఛానుసారంగా తిరుగుతూ ఉన్నాడు. (46)
పుష్పసంఛన్నశాఖాగ్రం పల్లవైరుపశోభితమ్ ।
ఆశోకం స్తబకైశ్ఛన్నం రమణీయమపశ్యత ॥ 47
అలా తిరుగుతూ వసురాజు పూలతోనిండిన శాఖాగ్రాలతో, చిగురుటాకులతో శోభిల్లుతున్న ఒక అందమైన అశోకవృక్షాన్ని చూశాడు. (47)
అధస్తాత్ తస్య ఛాయాయాం సుఖాసీనో నరాధిపః ।
మధుగంధైశ్చ సంయుక్తం పుష్పగంధమనోహరమ్ ॥ 48
ఆ చెట్టుక్రింద నీడలో రాజు సుఖంగా కూర్చున్నాడు. పూలమొక్క మకరంద, సుగంధాలతో నిండిన చక్కనిగాలి అతని మనస్సుకు ఆహ్లాదం కలిగిస్తూ వీచింది. (48)
వాయునా ప్రేర్యమాణస్తు ధూమ్రాయ ముదమన్వగాత్ ।
టహ్స్య రేతః ప్రచస్కంద చరతో గహనే వనే ॥ 49
మనోహరమైన గాలి సోకగానే అతని మనస్సులో ఆనందంతో సంభోగాభిలాష కలిగింది. అక్కడ నుండి బయలుదేరి వనంలో వెళుతుండగా అతనికి రేతఃస్ఖలనం జరిగింది. (49)
స్కన్నమాత్రం చ తద్రేతః వృక్షపత్రేణ భూమిపః ।
ప్రతిజగ్రాహ మిథ్యా మే న పతేద్ రేత ఇత్యుత ॥ 50
స్ఖలితమైన ఆ రేతస్సు వ్యర్థం కాకూడదని భావించి రాజు దాన్ని ఒక ఆకుదొప్పలోకి తీసుకున్నాడు. (50)
ఇదం మిథ్యా పరిస్కన్నం రేతో మే న భవేదితి ।
ఋతుశ్చ తస్యాః పత్న్యా మే న మోఘః స్యాదితి ప్రభుః ॥ 51
సంచింత్యైవం తదా రాజా విచార్య చ పునః పునః ।
అమోఘత్వం చ విజ్ఞాయ రేతసో రాజసత్తమః ॥ 52
'స్ఖలించిన నారేతస్సు వృథా కాకూడదు. నాభార్య యొక్క ఋతుకాలం కూడా వ్యర్థం కాకూడదు' అని మళ్లీ మళ్లీ బాగా ఆలోచించి ఆ రేతస్సు నిష్ఫలం కాదని ఒక నిశ్చయానికి వచ్చాడు. (51,52)
శుక్రప్రస్థాపనే కాలం మహిష్యాః ప్రసమీక్ష్య వై ।
అభిమంత్య్రాథ తచ్ఛుక్రమ్ ఆరాత్తిష్ఠంతమాశుగమ్ ॥ 53
సూక్ష్మధర్మార్థతత్త్వజ్ఞః గత్వా శ్యేనం తతోఽబ్రవీత్ ।
మత్ప్రియార్థమిదం సౌమ్య శుక్రం మమ గృహం నయ ॥ 54
గిరికాయాః ప్రయచ్ఛాశు తస్యా హ్యార్తవమద్యవై ।
గృహీత్వా తత్ తదా శ్యేనః తూర్ణముత్పత్య వేగవాన్ ॥ 55
భార్యకు శుక్రం పంపటానికిది సమయమని భావించి ఆ శుక్రాన్ని అభిమంత్రించి ధర్మార్థాల సూక్ష్మతత్త్వం తెలిసిన రాజు తనకు దగ్గరలో ఉన్న డేగను సమీపించి 'సౌమ్యా! నీవు ఈ శుక్రాన్ని మాయింటికి తీసుకొని వెళ్ళి గిరికకు ఇయ్యి. ఆమెకిది ఋతుకాలం' అని చెప్పాడు. అపుడా డేగ దానిని తన కాళ్లమధ్య పెట్టుకొని వేగంగా ఎగిరింది. (53-55)
జవం పరమమాస్థాయ ప్రదుద్రావ విహంగమః ।
తమపశ్యదథాయాంతం శ్యేనం శ్యేనస్తథాపరః ॥ 56
ఆ డేగ వేగంగా ఆకాశమార్గంలో ఎగురుతూంటే మరొక డేగ చూసింది. (56)
అభ్యద్రవచ్చ తం సద్యః దృష్ట్వైవామిషశంకయా ।
తుండయుద్ధమథాకాశేతావుభౌ సంప్రచక్రతుః ॥ 57
చూసిన వెంటనే మాంసమని భ్రమించి దాన్ని వెంబడించింది. ఆ రెంటికి ఆకాశంలో తుండయుద్ధం జరిగింది. (57)
యుధ్యతోరపతద్ రేతః తచ్చాపి యమునాంభసి ।
తత్రాద్రికేతి విఖ్యాతా బ్రహ్మశాపాద్ వరాప్సరాః ॥ 58
మీనభావమనుప్రాప్తా బభూవ యమునాచరీ ।
శ్యేనపాదపరిభ్రష్టం తద్ వీర్యమథ వాసవమ్ ॥ 59
జగ్రాహ తరసోపేత్య సాద్రికా మత్స్యరూపిణీ ।
కదాచిదపి మత్సీం తాం బబంధుర్మత్స్యజీవినః ॥ 60
మాసే చ దశమే ప్రాప్తే తదా భరతసత్తమ ।
ఉజ్జహ్రురుదరాత్ తస్యాః స్త్రీం పుమాంసం చ మానుషమ్ ॥ 61
ఆ రెండూ యుద్ధం చేస్తూండగా, ఆ శుక్రం కాళ్లమధ్య నుండి జారి యమునా నదీజలాల్లో పడింది. ఆ నదిలో బ్రహ్మశాపం వల్ల అద్రిక అనే అప్సర చేపరూపంలో నివసిస్తూంది. డేగకాలి నుండి జారిపడిన వసురాజు వీర్యాన్ని వేగంగా వచ్చి చేపరూపంలో ఉన్న అద్రిక స్వీకరించింది. పదినెలల తరువాత ఒకనాడు ఆ చేపను జాలరులు బంధించారు. అపుడు దాని ఉదరం నుండి ఒక కన్య, ఒక పురుషుడు బయటకు వచ్చారు. (58-61)
ఆశ్చర్యభూతం తద్ గత్వా రాజ్ఞేఽథ ప్రత్యవేదయన్ ।
కాయే మత్స్యా ఇమౌ రాజన్ సంభూతౌ మానుషావితి ॥ 62
ఆశ్చర్యకరమైన ఆ సంఘటన చూసి ఆ పల్లెవారు రాజును సమీపించి 'రాజా! ఈ చేప గర్భం నుండి ఇద్దరు మనుష్యులు జన్మించారు' అని నివేదించారు. (62)
తయోః పుమాంసం జగ్రాహ రాజోపరిచరస్తదా ।
స మత్స్యో నామ రాజాసీద్ ధార్మికః సత్యసంగరః ॥ 63
ఉపరిచరవసువు వారిలో మగశిశువును స్వీకరించాడు. అతడే మత్స్యరాజయ్యాడు. అతడు ధర్మాత్ముడు. సత్యపరిపాలకుడు కూడ. (63)
సాప్సరా ముక్తశాపా చ క్షణేన సమపద్యత ।
యా పురోక్తా భగవతా తిర్యగ్ యోనిగతా శుభా ॥ 64
మానుషౌ జనయిత్వా త్వం శాపమోక్షమవాప్స్యసి ।
తతః సా జనయిత్వా తౌ విశస్తా మధ్యగాతినా ॥ 65
సంత్యజ్య మత్స్య రూపం సా దివ్యం రూపమవాప్య చ ।
సిద్ధర్షిచారణపథం జగామాథ వరాప్సరాః ॥ 66
'పశుపక్ష్యాది జాతులలో పుట్టి మానవులిద్దరికి జన్మనిచ్చి శాపం నుండి విముక్తి పొందుతావు' అని మునుపు బ్రహ్మ చెప్పినట్లు ఆ అప్సర ఆ పిల్లలను ప్రసవించిన వెంటనే శాపవిముక్తిని పొందింది. మత్స్య రూపాన్ని విడిచి దివ్యరూపాన్ని పొంది సిద్ధచారణులు సంచరించే ఆకాశమార్గంలో వెళ్ళిపోయింది. (64-66)
సా కన్యా దుహితా తస్యాః మత్స్యా మత్స్యసగంధినీ ।
రాజ్ఞా దత్తా చ దాశాయ కన్యేయం తే భవిత్వితి ॥ 67
చేపగర్భం నుండి పుట్టి మత్స్యగంధం గల ఆ కన్యను వసురాజు దాశరాజుకిచ్చి కూతురుగా చూసుకొమ్మని చెప్పాడు. (67)
రూపసత్త్వసమాయుక్తా సర్వైః సముదితా గుణైః ।
సా తు సత్యవతీ నామ మత్స్యఘాత్యభిసంశ్రయాత్ ॥ 68
ఆసీత్ సా మత్స్యగంధైవ కంచిత్ కాలం శుచిస్మితా ।
శుశ్రూషార్థం పితుర్నావం వాహయంతీం జలే చ తామ్ ॥ 69
తీర్థయాత్రాం పరిక్రామన్ అపశ్యద్ వై పరాశరః ।
అతీవరూపసంపన్నాం సిద్ధానామపి కాంక్షితామ్ ॥ 70
చక్కనిరూపం, బలం కలిగి అన్ని మంచి గుణాలతో ఉన్న ఆ సత్యవతి చేపలు పట్టేవారితో జీవించడం వల్ల మత్స్యగంధిగా పిలువబడింది. తండ్రికి సేవ చేయడం కోసం తండ్రి నావను నడుపుతూ ఉండేది. సిద్ధులు కూడా కోరే రూపంకల ఆమెను ఒకసారి తీర్థయాత్ర చేస్తూ పరాశురుడు చూశాడు. (68-70)
దృష్ట్వైవ స చ తాం ధీమాన్ చకమే చారుహాసినీమ్ ।
దివ్యాం తాం వాసవీం కన్యాం రంభోరుం మునిపుంగవః ॥ 71
అందమైన చిరునవ్వూ, దివ్యమైన రూపమూ కల సత్యవతిని చూడగానే ధీమంతుడు, మునిపుంగవుడూ అయిన పరాశరునికి ఆమెపై కోరిక కలిగింది. (71)
సంగమం మమ కల్యాణి! కురుష్వేత్యభ్యభాషత ।
సాబ్రవీత్ పశ్య భగవన్ పారావారే స్థితాన్ ఋషీన్ ॥ 72
'కల్యాణీ! నాథో సంగమించు' అని తనకోర్కెను చెప్పాడు. అపుడామె ఇలా అంది - 'పూజ్యుడా! ఈ నది ఒడ్డున ఉన్న ఆ ఋషులను చూడు. (72)
ఆవయోర్దృష్టయోరేభిః కథం తు స్యాత్ సమాగమః ।
ఏవం తయోక్తో భగవాన్ నీహారమసృజత్ ప్రభుః ॥ 73
"వీరు చూస్తూండగా మన కలయిక ఎలా జరుగుతుంది?" ఆమె అలా అనగానే సమర్థుడైన పరాశరుడు మంచును సృష్టించాడు. (73)
యేన దేశః స సర్వస్తు తమోభూత ఇవాభవత్ ।
దృష్ట్వా సృష్టం తు నీహారం తతస్తం పరమర్షిణా ॥ 74
విస్మితా సాభవత్ కన్యా వ్రీడితా చ తపస్వినీ ।
దానిచేత ఆ ప్రదేశమంతా చీకటి క్రమ్మినట్లైంది. ఆ మహర్షి సృష్టించిన మంచును చూసి ఆమె ఆశ్చర్యపడింది, సిగ్గుపడింది. (74 1/2)
సత్యవత్యువాచ
విద్ధి మాం భగవన్ కన్యాం సదా పితృవశానుగామ్ ॥ 75
సత్యవతి ఇలా అంది - పూజ్యుడా! ఎల్లప్పుడూ తండ్రి అధీనంలో ఉండే కన్యను నేనని గ్రహించు. (75)
త్వత్సంయోగాచ్చ దుష్యేత కన్యాభావో మమానఘ ।
కన్యాత్వే దూషితే వాపి కథం శక్ష్యే ద్విజోత్తమ ॥ 76
గృహం గంతుమృషే! చాహం ధీమన్ న స్థాతుముత్సహే ।
ఏతత్ సంచింత్య భగవన్! విధత్స్వ యదనంతరమ్ ॥ 77
అనఘా! నీతో కలయిక వల్ల నా కన్యాత్వం దూషితమౌతుంది. ద్విజోత్తమా! కన్యాత్వం చెడిన తర్వాత ఇక నేనింటికి ఎలా వెళ్లగలను? బుద్ధిమంతుడా! అట్టి స్థితిలో నేనిక జీవించి ఉండలేను. ఇదంతా బాగా ఆలోచించి తరువాత చేయదగింది చెయ్యి. (76,77)
ఏవముక్తవతీం తాం తు ప్రీతిమానృషిసత్తమః ।
ఉవాచ మత్ప్రియం కృత్వా కన్యైవ త్వం భవిష్యసి ॥ 78
వృణీష్వ చ వరం భీరు యం త్వమిచ్ఛసి భామిని ।
వృథా హి న ప్రసాదో మే భూతపూర్వం శుచిస్మితే ॥ 79
ఇలా పలికిన సత్యవతితో ప్రసన్నుడైన పరాశరుడిలా అన్నాడు - నా ఇష్టాన్ని చేకూర్చినా నీవు కన్యగానే ఉంటావు! నీకు కావలసిన వరాన్ని కోరుకో. నిర్మల హాసినీ! నా అనుగ్రహం మునుపెన్నడూ వ్యర్థం కాలేదు. (78,79)
ఏవముక్తా వరం వవ్రే గాత్రసౌగంధ్యముత్తమమ్ ।
స చాస్యై భగవాన్ ప్రాదాత్ మనసః కాంక్షితం భువి ॥ 80
అతడలా చెప్పాక సత్యవతి తన శరీరం సుగంధభరితం కావాలని వరం కోరింది. పూజ్యుడయిన పరాశరుడు ఇహలోకంలో ఆమె కోరుకొన్న దాన్ని అనుగ్రహించాడు. (80)
తతో లబ్ధవరా ప్రీతా స్త్రీభావగుణభూషితా ।
జగామ సహ సంసర్గమ్ ఋషిణాద్భుతకర్మణా ॥ 81
తస్యాస్తు యోజనాద్ గంధమ్ ఆజిఘ్రంత నరా భువి ।
తేన గంధవతీత్యేవం నామాస్యాః ప్రథితం భువి ॥ 82
తస్యా యోజనగంధేతి తతో నామాపరం స్మృతమ్ ।
అలా వరం పొందాక ఆమె సంతోషించి స్త్రీ సహజమైన గుణాలతో నిండి అద్భుతవర్తనుడైన ఆ ఋషితో సంగమించింది. అప్పటి నుండి ఆమె లోకంలో గంధవతి అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. ఆమెకు యోజనదూరంలో ఉన్న జనులంతా ఆ శరీరసౌగంధ్యాన్ని ఆఘ్రాణించారు. అందువల్ల ఆమెకు యోజనగంధి అనే పేరు కూడా కలిగింది. (81,82 1/2)
ఇతి సత్యవతీ హృష్టా లబ్ధ్వా వరమనుత్తమమ్ ॥ 83
పరాశరేణ సంయుక్తా సద్యో గర్భం సుషావ సా ।
జజ్ఞే చ యమునాద్వీపే పారాశర్యః స వీర్యవాన్ ॥ 84
ఈ విధంగా సత్యవతి గొప్పవరాన్ని పొంది ఆ పరాశరునితో సంగమించి సద్యోగర్భంలో యమునా ద్వీపంలో తేజోవంతుడైన పుత్రుని కన్నది. (83,84)
స మాతరమనుజ్ఞాప్య తపస్యేవ మనో దధే ।
స్మృతోఽహం దర్శయుష్యామి కృత్యేష్వితి చ సోఽబ్రవీత్ ॥ 85
అతడే 'అవసరమయిన పని కలిగినపుడు తలచుకొంటే వెంటనే కనబడతాను' అని తల్లికి మాట ఇచ్చి తపస్సునందే మనస్సును లగ్నం చేశాడు. (85)
ఏవం ద్వైపాయనో జజ్ఞే సత్యవత్యాం పరాశరాత్ ।
న్యస్తో ద్వీపే స యద్ బాలః తస్మాద్ ద్వైపాయనః స్మృతః ॥ 86
ఇలా పరాశరుని వల్ల సత్యవతికి ద్వైపాయనుడు జన్మించాడు. ద్వీపంలో నివసించడం చేత అతడు ద్వైపాయనుడని పిలువబడ్డాడు. (86)
(తతః సత్యవతీ హృష్టా జగామ స్వం నివేశనమ్ ।
తస్యాస్త్వాయోజనాద్ గంధమ్ ఆజిఘ్రంతి నరా భువి ॥
దాశరాజస్తు తద్గంధమ్ ఆజిఘ్రన్ ప్రీతిమావహత్ ।)
(అనంతరం సత్యవతి ఆనందించి తన ఇంటికి వెళ్లింది. ఆమెకు యోజన దూరంలో జనులంతా ఆమె పరిమళాన్ని ఆఘ్రాణిస్తున్నారు. దాశరాజు కూడ ఆ పరిమళాన్ని ఆఘ్రాణించి ఆనందించాడు.)
(దాశ ఉవాచ)
(త్వామాహూర్మత్స్యగంధేతి కథం బాలే సుగంధతా ।
అపాస్య మత్స్యగంధత్వం కేన దత్తా సుగంధతా ॥
అపుడు దాశరాజిలా అన్నాడు - అమ్మాయీ! నిన్ను మత్స్యగంధ అంటున్నారు కదా! నీకీ సుగంధం ఎలా వచ్చింది? నీ చేపవాసన పోగొట్టి ఈ మంచివాసన నీకెవరిచ్చారు?)
(సత్యవత్యువాచ)
(శక్తే పుత్రో మహాప్రాజ్ఞః పరాశుర ఇతి స్మృతః ॥
నావం వాహయమానాయాః మమ దృష్ట్వా సుగర్హితమ్ ।
అపాస్య మత్స్యగంధత్వం యోజనాద్ గంధతాం దదౌ ॥
ఋషేః ప్రసాదం దృష్ట్వా తు జనాః ప్రీతిముపాగమన్ ।)
(సత్యవతి ఇలా చెప్పింది - నాయనా! శక్తికి మంచి పండితుడైన ఒక కొడుకున్నాడు. అతని పేరు పరాశరుడని ప్రసిద్ధి. నావను నడుపుతున్న నన్ను చూచి నా అసహ్యమైన చేపవాసన పోగొట్టి యోజనదూరం వ్యాపించే ఈ సుగంధాన్నిచ్చాడు. ఋషి యొక్క అనుగ్రహాన్ని చూచి జనులంతా సంతోషించారు.)
పాదాపసారిణం ధర్మం స తు విద్వాన్ యుగే యుగే ।
ఆయుః శక్తిం చ మర్త్యానాం యుగావస్థామవేక్ష్య చ ॥ 87
బ్రహ్మణో బ్రాహ్మాణానాం చ తథానుగ్రహకాంక్షయా ।
వివ్యాస వేదాన్ యస్మాత్ తస్మాద్ వ్యాస ఇతి స్మృతః ॥ 88
విద్యాంసుడైన ద్వైపాయనుడు యుగయుగానికి ఒక్కొక్క పాదం చొప్పున లోపిస్తున్న ధర్మాన్నీ, మానవులకు లోపిస్తున్న ఆయుశ్శక్తులనూ, యుగాల దురవస్థనూ చూచి, వేదాలను బ్రాహ్మణులను అనుగ్రహింప దలచి వేదాలను విస్తరింప చేశాడు. అందువల్లే అతడు వేదవ్యాసుడని ప్రసిద్ధి పొందాడు. (87,88)
వేదానధ్యాపయామాస మహాభారతపంచమాన్ ।
సుమంతుం జైమినిం పైలం శుకం చైవ స్వమాత్మజమ్ ॥ 89
ప్రభుర్వరిస్ఠో వరదః వైశంపాయనమేవ చ ।
సంహితాస్తైః పృథక్త్వేన భారతస్య ప్రాకాశితాః ॥ 90
మహాభారతంతో పాటు వేదాలను సుమంతుడు, జైమిని, పైలుడు, తన కుమారుడైన శుకుడు, వైశంపాయనుడు అనేవారికి నేర్పాడు. వారు వేరువేరుగా భారతసంహితను వ్యాప్తిచేశారు. (89,90)
తథా భీష్మః శాంతనవః గంగాయామమితద్యుతిః ।
వసువీర్యాత్ సమభవత్ మహావీర్యో మహాయశాః ॥ 91
అదేవిధంగా భీష్ముడు శంతనునికి గంగయందు వస్తువుల తేజస్సుతో, మహాపరాక్రమవంతునిగా మహాకీర్తిమంతునిగా జన్మించాడు. (91)
వేదార్థవిచ్చ భగవాన్ ఋషిర్విప్రో మహాయశాః ।
శూలే ప్రోతః పురాణ్ర్షిః అచౌరశ్చౌరశంకయా ॥ 92
అణీమాండవ్య ఇత్యేవం విఖ్యాతః స మహాయశాః ।
స ధర్మమాహూయ పురా మహర్షిరిదముక్తవాన్ ॥ 93
పూర్వకాలంలో వేదార్థం తెలిసిన, గొప్పకీర్తికల అణీమాండవ్యుడనే పురాతన ఋషి ఉండేవాడు. అతడు చోరుడు కాకున్నా చోరుడని ఆరోపింపబడి శూలారోపంతో మరణించాడు. పరలోకంలో అతడు ధర్ముని పిలిచి ఇలా అన్నాడు. (92,93)
ఇషీకయా మయా బాల్యాద్ విద్ధా హ్యేకా శకుంతికా ।
తత్ కిల్బిషం స్మరే ధర్మ! నాన్యత్ పాపమహం స్మరే ॥ 94
యమధర్మరాజా! బాల్యంలో తెలియక నేను ఒక ఇనుప ఊచతో చిన్న పక్షిని పొడిచాను. అంతకంటే నేనింక వేరే ఏ పాపం చేసినట్లు గుర్తులేదు. (94)
తన్మే సహస్రమమితం కస్మాన్నేహాజయత్ తపః ।
గరీయాన్ బ్రాహ్మణవధః సర్వభూతవధాద్ యతః ॥ 95
నేను వేల సంవత్సరాలు తపస్సు చేశాను. ఆ తపస్సు ఎందువల్ల ఈ పాపాన్ని జయింపలేకపోయింది? అన్ని ప్రాణుల వధకంటె బ్రాహ్మణవధ పెద్ద దోషం కదా! (95)
తస్మాత్త్వం కిల్బిషి ధర్మ శూద్రయోనౌ జనిష్యసి ।
తేన శాపేన ధర్మోఽపి శూద్రయోనావజాయత్ ॥ 96
ధర్ముడా! అందువల్ల పాపం చేసిన నీవు శూద్ర జన్మ ఎత్తుతావు అన్నాడు. అతని శాపం చేత ధర్ముడు శూద్రస్త్రీ యందు జన్మించాడు. (96)
విద్వాన్ విదురరూపేణ ధార్మీ తనురకిల్బిషీ ।
సంజయో మునికల్పస్తు జజ్ఞే సూతో గవల్గణాత్ ॥ 97
పాపరహితమైన ధర్ముడు పండితుడగు విదురుని రూపంలో ఆవిర్భవించాడు. మునివంటి సంజయుడు సూతునిగా గవల్గణుని వల్ల జన్మించాడు. (97)
సూర్యాచ్చ కుంతికన్యాయాః జజ్ఞే కర్ణో మహాబలః ।
సహజం కవచం బిభ్రత్ కుండలోద్ద్యోతితాననః ॥ 98
కుంతిభోజుని కూతురు కుంతికి సూర్యునివల్ల మహాబలుడైన కర్ణుడు జన్మించాడు. అతడు సహజమైన కవచకుండలాలతో ప్రకాశించేవాడు. (98)
అనుగ్రహార్థం లోకానాం విష్ణుర్లోకనమస్కృతః ।
వసుదేవాత్తు దేవక్యాం ప్రాదుర్భూతో మహాయశాః ॥ 99
లోకాలన్నీ నమస్కరించే మహాయశస్వి శ్రీమహావిష్ణువు లోకానుగ్రహంకోసం వసుదేవుని ద్వారా దేవకియందు జన్మించాడు. (99)
అనాదినిధనో దేవః స కర్తా జగతః ప్రభుః ।
అవ్యక్తమక్షరం బ్రహ్మ ప్రధానం త్రిగుణాత్మకమ్ ॥ 100
అతడే ఆద్యంత రహితుడు, జగత్తునకు కర్త, సమర్థుడు, అవ్యక్తుడు, అక్షరుడు, బ్రహ్మ, కారణం, త్రిగుణాత్మకం కూడ. (100)
ఆత్మానమవ్యయం చైవ ప్రకృతిం ప్రభవం ప్రభుమ్ ।
పురుషం విశ్వకర్మాణం సత్త్వయోగం ధ్రువాక్షరమ్ ॥ 101
అనంతమచలం దేవం హంసం నారాయణం ప్రభుమ్ ।
ధాతారమజమవ్యక్తం యమాహుః పరమవ్యయమ్ ॥ 102
కైవల్యనిర్గుణం విశ్వమ్ అనాదిమజమవ్యయమ్ ।
పురుషః స విభుః కర్తా సర్వభూతపితామహః ॥ 103
అతడే ఆత్మ, అవ్యయం, ప్రకృతి, కారణం, అధిష్ఠాత, పురుషుడు, విశ్వకర్మ, సత్త్వయుక్తుడు, నిశ్చలుడు, అక్షరం, అనంతం, అచలం, హంస, నారాయణుడు, ప్రభువు, ధాత, అజుడు, అవ్యక్తం, పరం, అవ్యయం, పురుషుడు, విభుడు, కర్త, సర్వభూత పితామహుడు. (101-103)
ధర్మసంవర్థనార్థాయ ప్రజజ్ఞే ఽంధకవృష్ణిషు ।
అస్త్రజ్ఞౌ తు మహావీర్యౌ సర్వశాస్త్రవిశారదౌ ॥ 104
అంధక, వృష్ణివంశాల్లో ధర్మాన్ని వర్ధిల్లజేయడానికి అస్త్రజ్ఞానం, మహాపరాక్రమం, సర్వశాస్త్రపాండిత్యమూ కల సాత్యకి, కృతవర్మలు జన్మించారు. (104)
సాత్యకిః కృతవర్మా చ నారాయణమనువ్రతౌ ।
సత్యకాద్ధృదికాచ్చైవ జజ్ఞాతే ఽస్త్రవిశారదౌ ॥ 105
వారు నారాయణుని అనుచరులు. ఇరువురు అస్త్రవిశారదులు. సత్యకునికి సాత్యకి, హృదికునికి కృతవర్మ జన్మించారు. (105)
భరద్వాజస్య చ స్కన్నం ద్రోణ్యాం శుక్రమవర్ధత ।
మహర్షేరుగ్రతపసః తస్మాద్ ద్రోణో వ్యజాయత ॥ 106
ఉగ్రమైన తపస్సు చేసే భరద్వాజమహర్షి నుండి స్ఖలితమైన శుక్రాన్ని ద్రోణియందు భద్రపరిచారు. దాని నుండి ద్రోణుడు జన్మించాడు. (106)
గౌతమాన్మిథునం జజ్ఞే శరస్తంబాచ్ఛరద్వతః ।
అశ్వత్థామ్నశ్చ జననీ కృపశ్చైవ మహాబలః ॥ 107
గౌతమ గోత్రీయుడైన శరద్వంతునికి శరస్తంబం నుండి కవలలు జన్మించారు. అందులో ఒకరు అశ్వత్థామకు తల్లి ఐన కృపి, మరొకరు మహాబలుడైన కృపాచార్యుడూ. (107)
అశ్వత్థామా తతో జజ్ఞే ద్రోణాదేవ మహాబలః ।
తథైవ ధృష్టద్యుమ్నోఽపి సాక్షాదగ్నిసమద్యుతిః ॥ 108
వైతానే కర్మణి తతః పావకాత్ సమజాయత ।
వీరో ద్రోణవినాశాయ ధనురాదాయ వీర్యవాన్ ॥ 109
ద్రోణునివల్ల మహాబలుడైన అశ్వత్థామ జన్మించాడు. అలాగే ధృష్టద్యుమ్నుడు సాక్షాత్తూ అగ్నితో సమానమైన తేజస్సు కలవాడు. యజ్ఞకర్మమందలి అగ్నిహోత్రం నుండి ద్రోణ వినాశనం కోసం పుట్టాడు. అతడు ధనుర్ధారి, పరాక్రమవంతుడు. (108,109)
తత్రైవ వేద్యాం కృష్ణాపి జజ్ఞే తేజస్వినీ శుభా ।
విభ్రాజమానా వపుషా బిభ్రతీ రూపముత్తమమ్ ॥ 110
అదే యజ్ఞవేదిక నుండి తేజోవతి, శుభస్వారూప అయిన కృష్ణ (ద్రౌపది) ఉత్తమమైన రూపంతో ప్రకాశించే శరీరంతో జన్మించింది. (110)
ప్రహ్రాదశిష్యో నగ్నజిత్ సుబలశ్చాభవత్ తతః ।
తస్య ప్రజాధర్మహంత్రీ జజ్ఞే దేవప్రకోపనాత్ ॥ 111
గాంధారరాజపుత్రోఽభూత్ శకునిః సౌబలస్తథా ।
దుర్యోధనస్య జననీ జజ్ఞాతేఽర్థవిశారదౌ ॥ 112
ప్రహ్రాదుని శిష్యుడైన నగ్నజిత్తు సుబలునిగా జన్మించాడు. అతనికి దేవతల కోపం వల్ల ధర్మకంటకమైన సంతానం కలిగింది. గాంధారరాజైన సుబలునికి అర్థవిశారదులైన శకుని, (దుర్యోధనుని తల్లి ఐన) గాంధారి జన్మించారు. (111,112)
కృష్ణద్వైపాయనాజ్జజ్ఞే ధృతరాష్ట్రో జనేశ్వరః ।
క్షేత్రే విచిత్రవీర్యస్య పాండుశ్చైవ మహాబలః ॥ 113
ధర్మార్థకుశలో ధీమాన్ మేధావీ ధూతకల్మషః ।
విదురః శూద్రయోనౌ తు జజ్ఞే ద్వైపాయనాదపి ॥ 114
పాండోస్తు జజ్ఞిరే పంచ పుత్రా దేవసమాః పృథక్ ।
ద్వమోః స్త్రియోర్గుణజ్యేష్ఠః తేషామాసీద్ యుధిష్ఠిరః ॥ 115
కృష్ణద్వైపాయనుని వల్ల విచిత్ర వీర్యుని భార్యలకు ధృతరాష్ట్రుడు, మహాబలుడైన పాండురాజు జన్మించారు. ద్వైపాయనుని వల్లనే శూదస్త్రీయందు విదురుడు జన్మించాడు. అతడు ధర్మార్థకుశలుడు, ధీమంతుడు, మేధావి, పాపరహితుడు. పాండురాజునకు భార్యలిద్దరి యందు దేవసమానులైన ఐదుగురు కుమారులు జన్మించారు. వారిలో యుధిష్ఠిరుడు పెద్దవాడు. (113-115)
ధర్మాద్ యుధిష్ఠిరో జజ్ఞే మారుతాచ్చ వృకోదరః ।
ఇంద్రాద్ ధనంజయః శ్రీమాన్ సర్వశస్త్రభృతాం వరః ॥ 116
జజ్ఞాతే రూపసంపన్నౌ అశ్విభ్యాం చ యమావపి ।
నకులః సహదేవశ్చ గురుశుశ్రూషణే రతౌ ॥ 117
ధర్మ దేవుని వల్ల యుధిష్ఠిరుడు, వాయువు వల్ల వృకోదరుడు, ఇంద్రుని వల్ల, శ్రీమంతుడూ, శస్త్రధారులందరిలో శ్రేష్ఠుడూ ఐన ధనంజయుడు కలిగారు. అశ్వినీదేవతల వల్ల రూపసంపన్నులైన కవలలు నకులసహదేవులు జన్మించారు. నకుల సహదేవులిద్దరూ పెద్దలను సేవించడంలో ఆసక్తి కలవారు. (116,117)
తథా పుత్రశతం జజ్ఞే ధృతరాష్ట్రస్య ధీమతః ।
దుర్యోధన్ప్రభృతయః యుయుత్సుః కరణస్తథా ॥ 118
తెలివిగల ధృతరాష్ట్రునికి దుర్యోధనుడు మొదలయిన నూరుగురు కుమారులు జన్మించారు. ఇంకా కరణుడైన యుయుత్సుడు జన్మించాడు. (118)
తతో దుఃశాసనశ్చైవ దుఃసహశ్చాపి భారత ।
దుర్మర్షణో వికర్ణశ్చ చిత్రసేనో వివింశతిః ॥ 119
జయః సత్యవ్రతశ్చైవ పురుమిత్రశ్చ భారత ।
వైశ్యాపుత్రో యుయుత్సుశ్చ ఏకాదశ మహారథాః ॥ 120
భారతా! దుఃశాసనుడు, దుఃసహుడు, దుర్మర్షణుడు, వికర్ణుడు, చిత్రసేనుడు, వివింశతి, జయుడు, సత్యవ్రతుడు, పురుమిత్రుడు, వైశ్యాపుత్రుడైన యుయుత్సుడు ఈ పదకొండుగురు మహారథులు. (119,120)
అభిమన్యుః సుభద్రాయామ్ అర్జునాదభ్యజాయత ।
స్వస్రీయో వాసుదేవస్య పౌత్రః పాండోర్మహాత్మనః ॥ 121
వాసుదేవుని సోదరి కుమారుడు, పాండురాజునకు మనుమడు అయిన అభిమన్యుడు అర్జునుని వల్ల సుభద్రకు జన్మించాడు. (121)
పాండవేభ్యో హి పాంచాల్యాం ద్రౌపద్యాం పంచ జజ్ఞిరే ।
కుమారా రూపసంపన్నాః సర్వశాస్త్రవిశారదాః ॥ 122
ప్రతివింధ్యో యుధిష్ఠిరాత్ సుతసోమో వృకోదరాత్ ।
అర్జునాచ్ఛ్రుతకీర్తిస్తు శతానీకస్తు నాకులిః ॥ 123
తథైవ సహదేవాచ్చ శ్రుతసేనః ప్రతాపవాన్ ।
హిడింబాయాం చ భీమేన వనే జజ్ఞే ఘటోత్కచః ॥ 124
వారిలో యుధిష్ఠిరుని వల్ల ప్రతివింధ్యుడు, భీముని వల్ల సుతసోముడు, అర్జునుని వల్ల శ్రుతకీర్తి, నకులుని వల్ల శతానీకుడు, సహదేవుని వల్ల ప్రతాపవంతుడైన శ్రుతసేనుడూ జన్మించారు. అడవిలో భీమునికి హిడింబయందు ఘటోత్కచుడు జన్మించాడు. (123,124)
శిఖండీ ద్రుపదాజ్జజ్ఞే కన్యా పుత్రత్వమాగతా ।
యాం యక్షః పురుషం చక్రే స్థూణః ప్రియచికీర్షయా ॥ 125
ద్రుపదుని వల్ల శిఖండి అను కన్య జన్మించింది. ఆమెకు మేలు చేయగోరి స్థూణుడనే యక్షుడు ఆమెను పురుషునిగా చేశాడు. (125)
కురుణాం విగ్రహే తస్మిన్ సమాగచ్ఛన్ బహూన్ యథా ।
రాజ్ఞాం శతసహస్రాణి యోత్స్యమానాని సంయుగే ॥ 126
తేషామపరిమేయానాం నామధేయాని సర్వశః ।
న శక్యాని సమాఖ్యాతుం వర్షాణామయుతైరపి ।
ఏతే తు కీర్తితా ముఖ్యా యైరాఖ్యానమిదం తతమ్ ॥ 127
నాటి కౌరవయుద్ధంలో వందలకొద్దీ, వేలకొద్దీ రాజులు వచ్చి యోధులుగా పాల్గొన్నారు. వారందరి పేర్లన్నీ పదివేల సంవత్సరాలైనా చెప్పటం శక్యం కాదు. వారిలో ముఖ్యులైన వారు మాత్రమే చెప్పబడ్డారు. వారి వల్లే ఈ కథ విస్తరించింది. (126,127)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి అంశావతార పర్వణి వ్యాసాద్యుత్పత్తౌ త్రిషష్టితమోఽధ్యాయః ॥ 63 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున అంశావతారపర్వమను ఉపపర్వమున వ్యాసాదుల ఉత్పత్తి అను అరువది మూడవ అధ్యాయము. (63)
(దాక్షిణాత్య అధికపాఠము 4 1/2 శ్లోకములు కలుపుకొని మొత్తం 13 1/2 శ్లోకాలు)