18. పదునెనిమిదవ అధ్యాయము
విష్ణుమూర్తి మోహినీరూపమును ధరించి అమృతమును రక్షించుట.
సౌతిరువాచ
తతోఽభ్రశిఖరాకారైః గిరిశృంగైరలంకృతమ్ ।
మందరం పర్వతవరం లతాజాలసమాకులమ్ ॥ 1
నానావిహగసంఘుష్టం నానాదంష్ట్రిసమాకులమ్ ।
కిన్నరైరప్సరోభిశ్చ దేవైరపి చ సేవితమ్ ॥ 2
ఏకాదశసహస్రాణి యోజనానాం సముచ్ఛ్రితమ్ ।
అధోభూమేః సహస్రేషు తావత్స్వేవ ప్రతిష్ఠితమ్ ॥ 3
తముద్ధర్తుమశక్తా వై సర్వే దేవగణాస్తదా ।
విష్ణుమాసీన మభ్యేత్య బ్రహ్మాణం చేదమబ్రువన్ ॥ 4
ఉగ్రశ్రవుడు చెపుతున్నాడు. దేవతలందరూ మందరపర్వతం దగ్గరకు వెళ్లారు. నీలివర్ణశిఖరాలతో, అనేక లతాసమూహాలతో కూడినది ఆ మందరపర్వతం. అది అనేక పక్షులకు నివాసం. సింహాలకు వ్యాఘ్రాలకు తదితర జంతుసమూహానికి అది స్థానం. అక్కడ దేవతలు, అప్సరలు విహరిస్తూంటారు. అది 11000 యోజనాల ఎత్తూ, అంతే లోతునూ కలిగి ఉంది. వారందరూ ఎంత ప్రయత్నం చేసినా ఆ పర్వతం ఎత్తలేకపోయారు. అందరూ మరల విష్ణుని, బ్రహ్మనూ ఇలా ప్రార్థించారు. (1-4)
భవంతావత్ర కుర్వాతాం బుద్ధిం నైఃశ్రేయసీం పరామ్ ।
మందరోద్ధరణే యత్నః క్రియతాం చ హితాయ నః ॥ 5
మీరిద్దరూ సద్బుద్ధితో ఆలోచించి, మన మేలుకోసం మందరపర్వతం ఉద్ధరించడానికి ప్రయత్నం చేయండి. (5)
సౌతిరువాచ
తథేతి చాబ్రవీద్ విష్ణుఃబ్రహ్మణా సహ భార్గవ ।
అచోదయదమేయాత్మా ఫణీంద్రం పద్మలోచనః ॥ 6
ఉగ్రశ్రవసుడు అంటున్నాడు. భృగుశ్రేష్ఠా! విష్ణుమూర్తి, బ్రహ్మ కూడా 'అలాగే' అని అందుకు సిద్ధమయ్యారు. విష్ణుమూర్తి సర్పరాజైన అనంతుని ఆ పర్వతసముద్ధరణకు ప్రేరేపించాడు. (6)
తతోఽనంతః సముత్థాయ బ్రహ్మణా పరిచోదితః ।
నారాయణేన చాప్యుక్తః తస్మిన్ కర్మణి వీర్యవాన్ ॥ 7
అనంతరం విష్ణుమూర్తి బ్రహ్మదేవుల ఆజ్ఞతో మహాపరాక్రమవంతుడైన అనంతుడు లేచి కార్యసిద్ధికి పూనుకొన్నాడు. (7)
అథ పర్వతరాజానం తమనంతో మహాబలః ।
ఉజ్జహార బలాద్ బ్రహ్మన్ సవనం సవనౌకసమ్ ॥ 8
మహాబలవంతుడయిన అనంతుడు మహోత్సాహంతో వృక్షాదులతో సహా ఆ పర్వతాన్ని లేవనెత్తాడు. (8)
తతస్తేన సురాః సార్ధం సముద్రముపతస్థిరే ।
తమూచురమృతస్యార్థే నిర్మథిష్యామహే జలమ్ ॥ 9
అనంతరం అనంతునితో కలిసి దేవతలందరూ అమృతం కోసం సముద్రాన్ని మథిద్దామని అన్నారు. (9)
అపాం పతిరథోవాచ మమాప్యంశో భవేత్తతః ।
సోఢాస్మి విపులం మర్ధం మందరభ్రమణాదితి ॥ 10
అపుడు సముద్రుడు "వారితో మందరభ్రమణం వల్ల కలిగే బాధను నేనూ భరిస్తాను. ఆ అమృతంలో నాకు కూడా కొంచెం భాగం ఇవ్వండి" అని కోరాడు. (10)
ఊచుశ్చ కూర్మరాజానమ్ అకూపారే సురాసురాః ।
అధిష్ఠానం గిరేరస్య భవాన్ భవితు మర్హతి ॥ 11
అనంతరం కూర్మరాజును (తాబేలును) మందర పర్వతానికి అడుగుభాగాన మట్టుగా ఉండుమని అడిగారు (11)
కూర్మేణ తు తథేత్యుక్త్వా పృష్ఠమస్య సమర్పితమ్ ।
తం శైలం తస్య పృష్ఠస్థః వజ్రేణేంద్రో న్యపీడయత్ ॥ 12
ఆ తాబేటిరాజు "అట్లే" అని తన అంగీకారం తెల్పి ఆ మందరానికి అడుగుగా ప్రవేశించినది. దేవేంద్రుడు ఆ కూర్మరాజు పై చిప్పను తన వజ్రాయుధంతో చీల్చి సవరించాడు. దానిపైన అనంతుని సహాయంతో మందరాన్ని ఉంచారు. (12)
మంథానం మందరం కృత్వా తథా నేత్రం చ వాసుకిమ్ ।
దేవా మథితుమారబ్ధాః సముద్రం నిధిమంభసామ్ ॥ 13
అమృతార్థే పురా బ్రహ్మన్ తథైవాసురదానవాః ।
ఏకమంతముపాశ్లిష్టాః నాగరాజ్ఞో మహాసురాః ॥ 14
వివిధాః సహితాః సర్వే యతః పుచ్ఛం తతః స్థితాః ।
దేవదానవులు మందరపర్వతాన్ని కవ్వంగా చేసుకొన్నారు. సర్పరాజయిన వాసుకిని తాడుగా చేసుకొని సముద్రాన్ని మథించడానికి ప్రారంభించారు. నాగరాజుయొక్క ముఖభాగాన్ని రాక్షసులు, తోకభాగాన్ని దేవతలు పట్టుకొని మథనం చేయసాగారు. (13,14 1/2)
అనంతో భగవాన్ దేవః యతో నారాయణ స్తతః ।
శిర ఉక్షిప్య నాగస్య పునః పునరవాక్షిపత్ ॥ 15
అనంతుడు ఎక్కడ ఉంటాడో శ్రీమన్నారాయణమూర్తి కూడా అక్కడే ఉంటాడు. మాటిమాటికి వాసుకి శిరస్సును పైకి ఎత్తి నిట్టూరుస్తున్నాడు. (15)
వాసుకే రథ నాగస్య సహసాఽఽక్షిప్యతః సురైః ।
సధూమాః సార్చిషో వాతాః నిష్పేతురసకృన్ముఖాత్ ॥ 16
నిరంతరం దేవతలు వేగంగా లాగుతూ ఉండటం చేత వాసుకి ముఖం నుండి ఎడతెగని మంటలతో పొగలతో కూడిన వాయువులు వెలువడుతున్నాయి. (16)
తే ధూమసంఘాః సంభూతాః మేఘసంఘాః సవిద్యుతః ।
అభ్యవర్షన్ సురగణాః శ్రమసంతాపకర్శితాన్ ॥ 17
ఆ పొగలవల్ల ఏర్పడిన మేఘసమూహాలు విద్యుత్ప్రభలతో కూడిన వర్షాన్ని కురిపించి వారి శ్రమను పోగొడుతున్నాయి. (17)
తస్మాచ్చ గిరికూటాగ్రాత్ ప్రచ్యుతాః పుష్పవృష్టయః ।
సురాసురగణాన్ సర్వాన్ సమంతాత్ సమవాకిరన్ ॥ 18
మందరం అటు ఇటు కదలుతూ ఉండటం చేత ఆ పర్వత శిఖరాగ్రం నుండి దేవదానవులపై పుష్పవర్షం కురిసింది. (18)
బభూవాత్ర మహానాదః మహామేఘరవోపమః ।
ఉదధేర్మథ్యమానస్య మందరేణ సురాసురైః॥ 19
దేవదానవులు మందరంతో సముద్రాన్ని చిలుకుతూ ఉంటే సముద్రంలో మేఘగంభీరమైన ధ్వని వినిపించింది. (19)
తత్ర నానాజలచరాః వినిష్పిష్టా మహాద్రిణా ।
విలయం సముపాజగ్ముః శతశో లవణాంభసి ॥ 20
మహాపర్వతసంఘర్షణ చేత అందలి జలజంతువులన్నీ సముద్రంలోని ఉప్పు నీటిలో విలయం పొందాయి. (20)
వారుణాని చ భూతాని వివిధాణి మహీధరః ।
పాతాలతలవాసీని విలయం సముపానయత్ ॥ 21
ఆ పర్వతం వల్ల ఆ సముద్రం అడుగున ఉన్న పాతాలంలోని ప్రాణులన్నీ నశించాయి. (21)
తస్మింశ్చ భ్రామ్యమాణేఽద్రౌ సంఘృష్యంతః పరస్పరమ్ ।
వ్యపతన్ పతగోపేతాః పర్వతాగ్రాన్మహాద్రుమాః ॥ 22
ఆ మథన సమయంలో పర్వత శిఖరం పై ఉన్న వృక్షాలు, వాటితో పాటు పక్షులు అన్నీ పడిపోయాయి. (22)
తేషాం సంఘర్షజశ్చాగ్నిః అర్చిభిః ప్రజ్వలన్ ముహుః ।
విద్యుద్భిరివ నీలాభ్రమ్ ఆవృణోన్మందరం గిరిమ్ ॥ 23
ఆ పర్వతసంఘర్షణ వలన పుట్టిన అగ్నిజ్వాలలు ఆకాశంలో మెఱుపుతీగల్లాగా మందర పర్వతాన్ని ఆవరించాయి. (23)
దదాహ కుంజరాంస్తత్ర సింహాశ్చైవ వినిర్గతాన్ ।
విగతాసూని సర్వాణి సత్త్వాని వివిధాని చ ॥ 24
అక్కడ నివాసం ఉండే ఏనుగులు, సింహాలు, అనేక జంతువులు చనిపోయి, వెలికి వచ్చాయి. (24)
తమగ్నిమమరశ్రేష్ఠః ప్రదహంతమితస్తతః ।
వారిణా మేఘజేనేంద్రః శమయామాస సర్వశః ॥ 25
తతో నానావిధాస్తత్ర సుస్రువుః సాగరాంభసి ।
మహాద్రుమాణాం నిర్యాసాః బహవశ్చౌషధీరసాః ॥ 26
అపుడు ఆ పర్వతశిఖరంపై ఉన్న వృక్షాల నుండి జిగురులు ఔషధులు అన్నీ ఆ మహాసముద్రంలో పడ్డాయి. (26)
తేషా మమృతవీర్యాణాం రసానాం పయసైవ చ ।
అమరత్వం సురా జగ్ముః కాంచనస్య చ నిఃస్రవాత్ ॥ 27
వృక్షాలతో, ఓషధులతో కూడి అమృతతుల్యమైన ఆ సముద్రజలం స్వర్ణాలతో అనేక మణులతో కూడి దేవతలకు అమరత్వం పొందించినది. (27)
తతస్తస్య సముద్రస్య తజ్జాతముదకం పయః ।
రసోత్తమైర్విమిశ్రం చ తతః క్షీరాదభూద్ ఘృతమ్ ॥ 28
ఆ విధంగా అనేక రసమిశ్రితమైన సముద్రజలం నుండి పాలు, దాని నుండి ముందుగా నేయి ఉద్భవించాయి. (28)
తతో బ్రహ్మాణమాసీనం దేవా వరదమబ్రువన్ ।
శ్రాంతాః స్మ సుభృశం బ్రహ్మన్ నోద్భవత్యమృతం చ తత్ ॥ 29
వినా నారాయణం దేవం సర్వేఽన్యే దేవదానవాః ।
చిరారబ్ధమిదం చాపి సాగరస్యాపి మంథనమ్ ॥ 30
అపుడు అక్కడ కూర్చున్న వరదుడైన బ్రహ్మతో దేవతలు ఈ విధంగా అన్నారు. "నారాయణుడు తప్ప మిగిలిన దేవదానవులమందరం అలసిపోయాం. ఎంతకాలంగా మథిస్తూ ఉన్నా అమృతం పుట్టటం లేదు గదా!" (29,30)
తతో నారాయణం దేవం బ్రహ్మా వచనమబ్రవీత్ ।
విధత్స్వైషాం బలం విష్ణో భవానత్ర పరాయణమ్ ॥ 31
ఈ మాటలను విన్న బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణునితో "పరమాత్మా! ఈ విషయంలో మీ శక్తిని ప్రసాదించండి. మీరే మాకు దిక్కు" అన్నాడు. (31)
విష్ణురువాచ
బలం దదామి సర్వేషాం కర్మైతద్ యే సమాస్థితాః ।
క్షోభ్యతాం కలశః సర్వైః మందరః పరివర్త్యతామ్ ॥ 32
అపుడు శ్రీమన్నారాయణుడు వారితో "మీ అందరికీ అధికబలం ఇస్తున్నాను. అందరూ కలిసి పాలసముద్రాన్ని మందరంతో మథించండి". అని అభయమిచ్చాడు. (32)
సౌతిరువాచ
నారాయణ వచః శ్రుత్వా బలినస్తే మహోదధేః ।
తత్ పయః సహితా భూయః చక్రిరే భృశమాకులమ్ ॥ 33
ఉగ్రశ్రవసుడు చెపుతున్నాడు - పరమాత్ముని మాటలను విని బలిష్ఠుడైన వారంతా మరల సముద్రాన్ని మథించడానికి పూనుకొన్నారు. (33)
తతః శతసహస్రాంశుః మథ్యమానాత్తు సాగరాత్ ।
ప్రసన్నాత్మా సముత్పన్నః సోమః శీతాంశురుజ్జ్వలః ॥ 34
అప్పుడు ఆ మహాసముద్రం నుండి అనంతకిరణాలతో, చల్లని ప్రకాశంతో, శాంతరూపంతో చంద్రుడు ఉద్భవించాడు. (34)
శ్రీరనంతరముత్పన్నా ఘృతాత్ పాండురవాసినీ ।
సురాదేవీ సముత్పన్నా తురగః పాండురస్తథా ॥ 35
తదనంతరం ఆ ఘృతరూపజలం నుండి శ్వేతవస్త్రాన్ని ధరించిన లక్ష్మీదేవి ఉద్భవించింది. అనంతరం సురాదేవి, పిదప తెల్లని గుఱ్ఱమూ ఉధ్భవించాయి. (35)
కౌస్తుభస్తు మణిర్దివ్యః ఉత్పన్నో ఘృతసంభవః ।
మరీచివికచః శ్రీమాన్ నారాయణ ఉరోగతః ॥ 36
ఆ నేతితో కూడిన జలంలో నుండి దివ్యమైన కౌస్తుభరత్నం పుట్టింది. దానిని శ్రీమన్నారాయణుడు తన వక్షఃస్థలంపై అలంకరించుకొన్నాడు. (36)
(పారిజాతశ్చ తత్రైవ సురభిశ్చ మహామునే ।
జజ్ఞాతే తౌ తదా బ్రహ్మన్ సర్వకామఫలప్రదౌ ॥)
శ్రీః సురాచైవ సోమశ్చ తురగశ్చ మనోజవః ।
యతో దేవా స్తతో జగ్ముః ఆదిత్యపథమాశ్రితాః ॥ 37
మహర్షీ! పారిజాత వృక్షమూ, కామధేనువూ సర్వులు కోరిన ఫలాలనూ ఇస్తూ అక్కడ నుండే పుట్టాయి. లక్ష్మీదేవి, సురాదేవి, చంద్రుడు, ఉచ్చైఃశ్రవమనే మనోవేగం కల గుర్రమూ దేవతలను చేరాయి. (37)
ధన్వంతరిస్తతో దేవః వపుష్మానుదతిష్ఠత ।
శ్వేతం కమండలుం బిభ్రద్ అమృతం యత్ర తిష్ఠతి ॥ 38
ఆ దేవదానవులు ఇంకా ఉత్సాహంతో మథిస్తుండగా తెల్లని కమండలంలో అమృతాన్ని నింపుకొని ధన్వంతరి ఉద్భవించాడు. (38)
ఏతదత్యద్భుతం దృష్ట్వా దానవానాం సముత్థితః ।
అమృతార్థే మహాన్ నాదః మమేదమితి జల్పతామ్ ॥ 39
ఈ అద్భుతాన్ని చూచాక దానవులలోంచి అమృతం కోసం "ఇది నాది, ఇది నాది" అనే శబ్దాలు వెలువడుతున్నాయి. (39)
శ్వేతైర్ధంతైశ్చతుర్భిస్తు మహాకాయస్తతః పరమ్ ।
ఐరావతో మహానాగః అభవత్ వజ్రభృతా ధృతః ॥ 40
అనంతరం తెల్లని నాల్గుదంతాలతో కూడిన ఐరావతం అనే ఏనుగు ఉద్భవించింది. దీనిని దేవేంద్రుడు స్వీకరించాడు. (40)
అతి నిర్మథనాదేవ కాలకూటస్తతః పరః ।
జగదావృత్య సహసా సధూమోఽగ్నిరివ జ్వలన్ ॥ 41
అతిగా సముద్రాన్ని మథించడం వల్ల సముద్రం నుండి కాలకూట విషం పుట్టింది. అది పొగలతో, సెగలతో అంతటా వ్యాపించింది. (41)
త్రైలోక్యం మోహితం యస్య గంధమాఘ్రాయ తద్విషమ్ ।
ప్రాగ్రసల్లోకరక్షార్థే బ్రహ్మణో వచనాచ్ఛివః ॥ 42
ఆ విషగంధం ముల్లోకాలకూ వ్యాపించి ప్రాణికోటిని బాధిస్తున్నది. అపుడు బ్రహ్మదేవుని ప్రార్థనతో లోకరక్షణ కోసం శివుడు ఆ విషాన్ని నోటిలోకి లాక్కున్నాడు. (42)
దధార భగవాన్ కంఠే మంత్రమూర్తిర్మహేశ్వరః ।
తదాప్రభృతి దేవస్తు నీలకంఠ ఇతి శ్రుతిః ॥ 43
అపుడు మహాశివుడు ఆ విషాన్ని తన కంఠంలోనే ఉంచాడు. అప్పటినుండి పరమేశ్వరుడు నీలకంఠుడుగా పేరుపొందాడు. (43)
ఏతత్ తదద్భుతం దృష్ట్వా నిరాశా దానవాః స్థితాః ।
అమృతార్థే చ లక్ష్మ్యర్థే మహాంతం వైరమాశ్రితాః ॥ 44
ఈ అద్భుతాన్ని చూచిన దానవులు నిరాశులై అమృతం కోసం, లక్ష్మికోసం దేవతలతో వైరందాల్చి పెనగులాడుతున్నారు. (44)
తతో నారాయణో మాయాం మోహినీం సముపాశ్రితః ।
స్త్రీరూపమద్భుతమ్ కృత్వా దానవానభిసంశ్రితః ॥ 45
అపుడు శ్రీమన్నారాయణమూర్తి మాయామోహినీ రూపాన్ని ధరించి అద్భుతమైన జగన్మోహిని రూపంతో దానవులందరినీ ఆకర్షించాడు. (45)
తతస్తదమృతం తస్యై దదుస్తే మూఢచేతసః ।
స్త్రియై దానవదైతేయాః సర్వే తద్గతమానసాః ॥ 46
అపుడు మూఢులైన దానవులు అమృతాన్ని మోహపరవశులై ఆ సుందరి చేతికిచ్చారు. (46)
(సా తు నారాయణీ మాయా ధారయంతీ కమండలుమ్ ।
ఆస్యమానేషు దైత్యేషు పంక్త్యా చ ప్రతి దానవైః ।
దేవానపాయయద్ దేవీ న దైత్యాంస్తే చ చుక్రుశుః ॥)
మోహీనీ రూపంలో ఉన్న నారాయణుడు ఆ కమండలాన్ని పట్టుకొన్నాడు. దైత్యులంతా పంక్తిలో కూర్చున్నారు. మోహిని దేవతలకు అమృతం పోసింది. దైత్యులకు పోయలేదు. దానితో దైత్యులంతా గోలపెట్టారు.
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి అమృతమంథనేఽష్టాదశోఽధ్యాయః ॥ 18 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వము అను ఉపపర్వమున అమృతమంథనము అను పదునెనిమిదవ అధ్యాయము. (18)
(దాక్షిణాత్య అధికపాఠం 2 1/2 శ్లోకములు కలిపి మొత్తం 48 1/2 శ్లోకములు)