16. పదునారవ అధ్యాయము
కద్రూ వినతలు పుత్రులను పొందుట.
శౌనక ఉవాచ
సౌతే త్వం కథయస్వేమాం విస్తరేణ కథాం పునః ।
ఆస్తీకస్య కనేః సాధోః శుశ్రూషా పరమా హి నః ॥ 1
శౌనకుడు అన్నాడు. సూతకుమారా! ఈ ఆస్తీకుని కథను విస్తరించి ఇంకా పూర్తిగా చెప్పు. ఈ మహాత్ముని కథను వినాలని మాకు చాలా కుతూహలంగా ఉంది. (1)
మధురం కథ్యతే సౌమ్య శ్లక్ష్ణాక్షరపదం త్వయా ।
ప్రీయామహే భృశం తాత పితేవేదం ప్రభాషసే ॥ 2
మీరు చక్కగా చెపుతున్నారు. మీరు చెప్పే కథలోని ప్రతీ అక్షరం ప్రతీ పదం చాలా వినసొంపుగా ఉన్నాయి. ఈ కథాశ్రవణం వల్ల మాకు మనశ్శాంతి కల్గుతున్నది. మీరు తండ్రివలె చెపుతున్నారు. (2)
అస్మచ్ఛుశ్రూషణే నిత్యం పితా హి నిరతస్తవ ।
ఆచష్టైతద్ యథాఖ్యానం పితా తే త్వం తథా వద ॥ 3
మీ తండ్రిగారు మా సేవలతో ఆనందించారు. మీ తండ్రిగారు చెప్పిన ప్రకారం ఆ ఆస్తీకుని కథను మీరు కూడా మాకు చెప్పండి. (3)
సౌతిరువాచ
ఆయుష్మన్నిదమాఖ్యానమ్ ఆస్తీకం కథయామి తే ।
యథాశ్రుతం కథయతః సకాశాద్ వై పితుర్మయా ॥ 4
ఉగ్రశ్రవసుడు వారితో ఇట్లా చెపుతున్నాడు. ఆయుష్మంతుడా! నా తండ్రి వలన విన్న ఆస్తీకుని కథను యథాతథంగా మీకు ఇప్పుడు చెప్తాను. (4)
పురా దేవయుగే బ్రహ్మన్ ప్రజాపతిసుతే శుభే ।
ఆస్తాం భగిన్యౌ రూపేణ సముపేతేఽద్భుతేఽనఘ ॥ 5
తే భార్యే కశ్యపస్యాస్తాం కద్రూశ్చ వినతా చ హ ।
ప్రాదాత్ తాభ్యాం వరం ప్రీతః ప్రజాపతిసమః పతిః ॥ 6
కశ్యపో ధర్మపత్నీభ్యాం ముదా పరమయా యుతః ।
వరాతిసర్గే శ్రుత్వైవం కశ్యపాదుత్తమం చ తే ॥ 7
హర్షాదప్రతిమాం ప్రీతిం ప్రాపతుః స్మ వరస్త్రియౌ ।
వవ్రౌ కద్రూః సుతాన్ నాగాన్ సహస్రం తుల్యవర్చసః ॥ 8
పూర్వం సత్యయుగంలో దక్షప్రజాపతికి కద్రువ, వినత అను ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిద్దరు కశ్యప ప్రజాపతికి భార్యలయ్యారు. ఆ కశ్యపుడు తన భార్యలిద్దరికీ సంతోషపూర్వకంగా వరాలు ఇచ్చాడు. మీ ఇష్టం వచ్చిన వరాల్ని కోరుకొమ్మని చెప్పాడు. ఆ భార్యలిద్దరూ ఎంతో సంతోషపడ్డారు. కద్రువ వేయిమంది సమతేజులయిన సర్పాలు పుత్రులుగా కావాలని వరం కోరింది. (5-8)
ద్వౌ పుత్రౌ వినతా వవ్రే కద్రూపుత్రాధికౌ బలే ।
తేజసా వపుషాచైవ విక్రమేణాధికౌ చ తౌ ॥ 9
కద్రూపుత్రులకంటె అధికమైన బలపరాక్రమాలూ, శరీరమూ, తేజస్సూ కల ఇద్దరు కుమారులను ప్రసాదించవలసినదిగా వినత అడిగింది. (9)
తస్యై భర్తా వరం ప్రాదాద్ అత్యర్థం పుత్రమీప్సితమ్ ।
ఏవమస్త్వితి తం చాహ కశ్యపం వినతా తదా ॥ 10
కశ్యపప్రజాపతి తన భార్యయగు వినత కోరికను మన్నించి, ఆ విధంగా ఇద్దరు కుమారులు కలిగేటట్లు ఆమెకు వరం ఇచ్చాడు. (10)
యథావత్ ప్రార్థితం లబ్ధ్వా వరం తుష్టాభవత్ తథా ।
కృతకృత్యాతు వినతా లబ్ధ్వా వీర్యాధికౌ సుతౌ ॥ 11
ఆ వరప్రసాదానికి వినత చాలా సంతోషించింది. తన జన్మ కృతార్థత చెందిందని భావించింది. కద్రూపుత్రుల కంటె గొప్ప కుమారులు జన్మిస్తారని ఆనందించింది. (11)
కద్రూశ్చ లబ్ధ్వా పుత్రాణాం సహస్రం తుల్యవర్చసామ్ ।
ధార్యౌ ప్రయత్నతో గర్భౌ ఇత్యుక్త్వా స మహాతపాః ॥ 12
తే భార్యే వరసంతుష్టే కశ్యపో వనమావిశత్ ।
కద్రూ వినతలు వరాలననుసరించి గర్భాలు ధరించారు. కశ్యపుడు "మీ గర్భాలను యథావిధిగా రక్షించుకోండి" అని చెప్పి తపస్సుకు వనానికి వెళ్లిపోయాడు. (12 1/2)
కాలేన మహతా కద్రూః అండానాం దశతీర్దశ ॥ 13
జనయామాస విప్రేంద్ర ద్వే చాండే వినతా తదా ।
చాలా కాలానికి కద్రువ వేయి గుడ్లను, వినత రెండు గుడ్లను కన్నారు. (13 1/2)
తయోరండాని నిదధుః ప్రహృష్టాః పరిచారికాః ॥ 14
సోపస్వేదేషు భాండేషు పంచవర్షశతాని చ ।
తతః పంచశతే కాలే కద్రూపుత్రాః వినిఃస్రుతాః ॥ 15
భాండాభ్యాం వినతాయాస్తు మిథునం న వ్యదృశ్యత ।
ఆ అండాలను వారి సేవకురాండ్రు పైకి చెమర్చే నేతికుండలలో పెట్టి కాపాడుతున్నారు. 500 సంవత్సరాల తరువాత ఆ అండాలనుండి కద్రూపుత్రులు పుట్టారు. కాని వినత అండాలు మాత్రం ఫలింపలేదు. (14,15 1/2)
తతః పుత్రార్థినీ దేవీ వ్రీడితా చ తపస్వినీ ॥ 16
అండం బిభేద వినతా తత్ర పుత్రమపశ్యత ।
పూర్వార్ధకాయసంపన్నమ్ ఇతరేణాప్రకాశతా॥ 17
తన అండాలు బ్రద్దలు కాలేదని వినత సిగ్గుపడి ఒక అండం చితుకగొట్టింది. ఆ అండం నుండి ఊర్ధ్వభాగ శరీరం మాత్రమే కలిగిన కుమారుడు ఉదయించాడు. (16,17)
స పుత్రః క్రోధసంరబ్ధః శశాపైనా మితి శ్రుతిః ।
యోఽహమేవం కృతో మాతః త్వయా లోభపరీతయా ॥ 18
శరీరణాసమగ్రేణ తస్మాద్ దాసీ భవిష్యసి ।
పంచవర్ష శతాన్యస్యాః యమా విస్పర్ధసే సహ ॥ 19
ఆ విధంగా అర్ధభాగంతో జన్మించిన కుమారుడు తల్లితో "అమ్మా! దురాశాపరురాలవై నన్ను అర్ధశరీరునిగా చేశావు. కావున నీవు నీ సవతికి 500 సంవత్సరాలు దాసిగా ఉండి సేవించు" అని శపించాడు. (18,19)
ఏష చ త్వాం సుతో మాతః దాసీత్వా న్మోచయిష్యతి ।
యద్యేనమపి మాతస్త్వం మామివాండ విభేదనాత్ ॥ 20
న కరిష్యస్యనంగం వా వ్యంగం వాపి తపస్వినమ్ ।
నీకు పుట్టబోయే రెండవ కుమారుడు నీ దాసీత్వాన్ని తొలగిస్తాడు. ఆ అండాన్ని కూడా చిదిపి అతనిని కూడా నిశ్శరీరునిగానో అర్ధశరీరునిగానో చేయకు. జాగ్రత్తగా కాపాడుకో! (20 1/2)
ప్రతిపాలయితవ్యస్తే జన్మకాలోఽస్య ధీరయా ॥ 21
విశిష్టం బలమీప్సంత్యా పంచవర్షశతాత్ పరః ।
కాబట్టి ధైర్యంగా ఉంటూ 500 సంవత్సరాలూ జాగ్రత్తగా ఈ అండాన్ని కాపాడుకో. అతని జన్మకోసం నిరీక్షించు. (21 1/2)
ఏవం శప్త్వా తతః పుత్రః వినతామంతరిక్షగః ॥ 22
అరుణో దృశ్యతే బ్రహ్మన్ ప్రభాతసమయే సదా ।
ఆదిత్య రథమధ్యాస్తే సారథ్యం సమకల్పయత్ ॥ 23
ఈ విధంగా ఆ కుమారుడు తల్లి అయిన వినతను శపించి ఆకాశమార్గాన వెళ్లిపోయాడు. బ్రాహ్మణోత్తమా! అది ప్రాతఃకాల సమయం. సూర్యదర్శనం చేసుకొన్నాడు. సూర్యరథం మధ్యలో కూర్చుండి ఆదిత్యరథానికి సారథిగా అనుగ్రహింపబడ్డాడు ఆ అనూరుడు. (22,23)
గరుడోఽపి యథాకాలం జజ్ఞే పన్నగభోజనః ।
స జాతమాత్రో వినతాం పరిత్యజ్య ఖమావిశత్ ॥ 24
ఆదాస్యన్నాత్మనో భోజ్యమ్ అన్నం విహితమస్య యత్ ।
విధాత్రా భృగుశార్దూల క్షుధితః పతగేశ్వరః ॥ 25
అనంతరకాలంలో గరుడుడు జన్మించాడు. పుట్టినవెంటనే తల్లియగు వినతను విడిచి ఆకాశానికి ఎగిరిపోయాడు. భృగువంశోత్తమా! ఆకలిగా ఉన్న అతనికి బ్రహ్మ నియతమైన ఆహారాన్ని కల్పించాడు. (24,25)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి సర్పాదీనాముత్పత్తౌ షోడశోఽధ్యాయః ॥ 16 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున సర్పాదుల జననము అను పదునారవ అధ్యాయము. (16)