14. పదునాలుగవ అధ్యాయము

జరత్కారుని వివాహము.

సౌతిరువాచ
తతో నివేశాయ తదా స విప్రః సంశితవ్రతః ।
మహీం చచార దారార్థీ న చ దారానవిందత ॥ 1
ఉగ్రశ్రవసుడు ఇలా చెపుతున్నాడు. అనంతరం జరత్కారుడు తన నియమానుసారం లభించే కన్యను వివాహం చేసుకోవటం కోసం దేశాలన్నీ తిరిగాడు. కాని అతని కోరిక నెరవేరలేదు. (1)
వి: సం: నివేశం = వివాహం (దేవ)
స కదాచిత్ వనం గత్వా విప్రః పితృవచః స్మరన్ ।
చుక్రోశ కన్యాభిక్షార్థీ తిస్రో వాచః శనైరివ ॥ 2
అతడు ఒకనాడు అడవికి వెళ్లి అక్కడ పితరుల మాటలను స్మరించుకొని సనామ్ని అయిన కన్యక వివాహార్థమై నాకు లభించునట్లు చేయవలసినదని ముమ్మారు ప్రార్థించాడు. (2)
తం వాసుకిః ప్రత్యగృహ్ణాత్ ఉద్యమ్య భగినీ తదా ।
న స తాం ప్రతిజగ్రాహ న సనామ్నీతి చింతయన్ ॥ 3
ఆ మాటలను నాగరాజగు వాసుకి విని, తన చెల్లెలగు జరత్కారువును అతని కడకు తీసుకొని వచ్చి "నా చెల్లెలిని భిక్షగా స్వీకరింపుమని" కోరగా జరత్కారువు తన పేరుగల కన్యక లభిస్తే స్వీకరిస్తానని లేనిచో వివాహమాడననీ చెప్పాడు. (3)
సనామ్నీం చోద్యతాం భార్యాం గృహ్ణీయామితి తస్య హి ।
మనో నివిష్టమభవత్ జరత్కారోర్మహాత్మనః ॥ 4
నా పేరుగల కన్యకను మాత్రమే భార్యగా స్వీకరిస్తాను అని జరత్కారుడు తన మనస్సున నిశ్చయించుకొన్నాడు గదా! (4)
తమువాచ మహాప్రాజ్ఞః జరత్కారుర్మహాతపాః ।
కిం నామ్నీ భగినీయం తే బ్రూహి సత్యం భుజంగమ ॥ 5
జరత్కారువు వాసుకితో "మహానుభావా! నీ సోదరి పేరు ఏమిటి? నాకు నిజాన్ని చెప్పు" అన్నాడు. (5)
వాసుకి రువాచ
జరత్కారో జరత్కారుః స్వసేయమనుజా మమ ।
ప్రతిగృహ్ణీష్వ భార్యార్థే మయా దత్తాం సుమధ్యమామ్ ॥ 6
వాసుకి జరత్కారునితో "ఈమె నా చెల్లెలు. పేరు జరత్కారువు. ఈమెను నీవు భార్యగా స్వీకరించు" అన్నాడు. (6)
ఏవముక్త్వా తతః ప్రాదాద్ భార్యార్థే వరవర్ణినీమ్ ।
స చ తాం ప్రతిజగ్రాహా విధిదృష్టేన కర్మణా ॥ 7
ఈ విధంగా చెప్పిన తరువాత జరత్కారుడు ఆమెను శాస్త్రోక్తంగా వివాహమాడి భార్యగా స్వీకరించాడు. (7)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి వాసుకిస్వసృవరణే చతుర్దశోఽధ్యాయః ॥ 14 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున జరత్కారుడు వాసుకి చెల్లెలిని వరించుట అను పదునాల్గవ అధ్యాయము. (14)