2. రెండవ అధ్యాయము

(పర్వసంగ్రహ పర్వము)

పర్వ సంగ్రహ విషయము - సమంతపంచక,అక్షౌహిణీప్రమాణములు - భారత శ్రవణఫలము.
ఋషయ ఊచుః
సమంత పంచకమితి యదుక్తం సూతనందన ।
ఏతత్సర్వం యథాతత్త్వం శ్రోతుమిచ్ఛామహే వయమ్ ॥ 1
ఋషులు అడిగారు - సూతపుత్రా! నీవు సమంత పంచకం గురించి ప్రస్తావించావు. అది అంతా వివరంగా మేము వినాలనుకొంటున్నాము. (1)
వి: తె: తెలుగులో నన్నయ శమంతపంచకం అన్నారు.
సౌతి రువాచ
శృణుధ్వం మమ భో విప్రాః బ్రువతశ్చ కథా శుభాః ।
సమంతపంచకాఖ్యం చ శ్రోతుమర్హథ సత్తమా ॥ 2
ఉగ్రశ్రవుడు చెప్పాడు. విప్రులారా! నేను శుభప్రదమయిన కథలు చెపుతున్నాను వినండి. ఇందులోనే శమంతపంచకం గురించి కూడా వినండి. (2)
త్రేతాద్వాపరయోః సంధౌ రామః శస్త్రభృతాం వరః ।
అసకృత్ పార్థివం క్షత్రం జఘానామర్షచోదితః ॥ 3
మహాధనుర్ధారి అయిన పరశురాముడు త్రేతా, ద్వాపర యుగాల సంధికాలంలో కోపంతో చాలాసార్లు రాజుల సముదాయాలను సంహరించాడు. (3)
స సర్వం క్షత్రముత్సాద్య స్వవీర్యేణానలద్యుతిః ।
సమంతపంచకే పంచ చకార రౌధిరాన్ హ్రదాన్ ॥ 4
అగ్నిలా జ్వలించే తన పరాక్రమంతో రాజులందరినీ చంపి పరశురాముడు అయిదు రక్తపు మడుగులు చేశాడు. ఆ క్షేత్రం శమంతపంచకం. (4)
స తేషు రుధిరాంభస్సు హ్రదేషు క్రోధమూర్ఛితః ।
పితౄన్ సంతర్పయామాస రుధిరేణేతి నః శ్రుతమ్ ॥ 5
క్రోధంతో రాముడు ఆ అయిదు రక్తపు మడుగులలోని రక్తంలో తన పితరులకు తర్పణం చేశాడని నేను విన్నాను. (5)
అథర్చీకాదయోఽభ్యేత్య పితరో రామమబ్రువన్ ।
రామ రామ మహాభాగ ప్రీతాః స్మ తవ భార్గవ ॥ 6
అనయా పితృభక్త్యా చ విక్రమేణ తవ ప్రభో ।
వరం పృణీష్వ భద్రం తే యమిచ్ఛసి మహాద్యుతే ॥ 7
అపుడు ఋచీకాదులయిన అతని పితృదేవతలు పరశురామునితో "రామా! నీ పితృభక్తికీ, పరాక్రమానికీ మేము సంప్రీతులమయ్యాము. నీకేం కావాలో వరం కోరుకో, నీకు శుభం కలుగుతుంది" అన్నారు. (6,7)
ఋచికుడు:- జమదగ్ని తండ్రి, పరశురాముని తాత.
రామ ఉవాచ
యది మే పితరః ప్రీతాః యద్యమగ్రాహ్యతా మయి ।
యచ్చ రోషాభిభూతేన క్షత్రముత్సాదితం మయా ॥ 8
అతశ్చ పాపామ్మచ్యేఽహమ్ ఏష మే ప్రార్థితో వరః ।
హ్రదశ్చ తీర్థభూతా మే భవేయుర్భువి విశ్రుతాః ॥ 9
అపుడు పరశురాముడు ఇలా అన్నాడు. నా పితరులకు ప్రీతి కలిగితే, నామీద అనుగ్రహిస్తె "నేను క్రోధంతో రాజులందరినీ చంపాను గదా. ఆ పాపం నుండి నన్ను విముక్తుని చేయండి. ఇదే నేను కోరుకునే వరం. ఈ మడుగులు అయిదూ తీర్థాలై ప్రసిద్ధి వహించాలి" అన్నాడు. (8,9)
వి: సం: బలహీనులపై అస్త్రప్రయోగం చేస్తే అదిపాపం. (నీల)
ఏవం భవిష్యతీత్యేవం పితరస్తమథాబ్రువన్ ।
తం క్షమస్వేతి నిషిషిదుః తతః స విరరామ హ ॥ 10
"అలాగే అవుతుంది." అన్నారు పితరులు. 'ఆ క్షత్రియ సమూహాన్ని క్షమించు'. అని వారిని చంపవద్దని పితరులు నిషేధించారు. అప్పటినుండి పరశురాముడు క్షత్రియులను చంపడం విరమించాడు. (10)
తేషాం సమీపే యో దేశః హ్రదానాం రుధిరాంభపామ్ ।
సమంతపంచకమితి పుణ్యం తత్ పరికీర్తితమ్ ॥ 11
ఆ రక్తపు మడుగుల సమీపప్రదేశాన్ని సమంతపంచక ప్రదేశమనీ, అది పుణ్యప్రదమనీ కీర్తించారు. (11)
యేన లింగేన యో దేశః యుక్తం సముపలక్ష్యతే ।
తేనైవ నామ్నా తం దేశం వాచ్యమాహుర్మనీషిణః ॥ 12
ఏ చిహ్నాలతో ఏ దేశం కూడి కనిపిస్తుందో ఆ దేశాన్ని ఆ పేరుతోనే ధీమంతులు పిలుస్తారు. (12)
అంతరే చైవ సంప్రాప్తే కలిద్వాపరయోరభుత్ ।
సమంతపంచకే యుద్ధం కురుపాండవసేనయోః ॥ 13
ద్వాపరయుగానికీ, కలియుగానికీ సంధికాలం వచ్చినపుడు కురుపాండవసేనలకు ఆ సమంతపంచక ప్రదేశంలో యుద్ధం జరిగింది. (13)
తస్మిన్ పరమధర్మిష్ఠే దేశే భూదోషవర్జితే ।
అష్టాదశ సమాజగ్ముః అక్షౌహిణ్యో యుయుత్సయా ॥ 14
భూసంబంధమయిన మిట్టపల్లాలు అనే దోషాలు లేని పరమధర్మప్రదేశంలో యుద్ధకాంక్షతో పదునెనిమిది అక్షౌహిణులు చేరాయి. (14)
సమేత్య తం ద్విజాస్తాశ్చ తత్రైవ నిధనం గతాః ।
ఏతన్నామాభినిర్వృత్తం తస్య దేశస్య వై ద్విజాః ॥ 15
అక్కడకు చేరిన అక్షౌహిణులూ, రాజులు అక్కడే చనిపొయారు. అందుచేత ఆ దేశానికి సమంతపంచకం అని పేరు వచ్చింది. (15)
వి: సం: 1) సమ ప్రదేశంలో అయిదు మడుగులు కల ప్రదేశం సమంతపంచకం (నీల)
(2) అక్కడ సమేతులయిన వారికి అంతం కలిగించినది సమంతము.
పుణ్యశ్చ రమణీయశ్చ స దేశో వః ప్రకీర్తితః ।
తదేతత్ కథితం సర్వం మయా బ్రాహ్మణసత్తమాః ।
యథా దేశః స విఖ్యాతః త్రిషు లోకేషు సువ్రతాః ॥ 16
ఆ ప్రదేశం పుణ్యప్రదమనీ, రమణీయమనీ కీర్తింపబడింది. విప్రోత్తములారా! ఆ ప్రదేశం మూడు లోకాల్లోను ఎలా ప్రసిద్ధిచెందిందో మీకు నేను చెప్పాను. (16)
ఋషయ ఊచుః
అక్షౌహిణ్య ఇతి ప్రోక్తం యత్త్యయా సూతనందన ।
ఏతదిచ్ఛామహే శ్రోతుం సర్వమేవ యథాతథమ్ ॥ 17
అపుడు ఋషులు ఇలా అడిగారు - "సూతపుత్రా! నీవు అక్షౌహిణులు అని చెప్పావు - ఆ మాట మరింత వివరంగా వినాలని కోరుతున్నాం" అన్నారు. (17)
అక్షౌహిణ్యాః పరీమాణం నరాశ్వరథదంతినామ్ ।
యథావచ్పైవ నో బ్రూహి సర్వం హి విదితం తవ ॥ 18
అక్షౌహిణి యొక్క పరిమాణం ఎంత? అందులో పదాతులు, గుర్రాలు, రథాలు, ఏనుగులూ ఎన్నెన్ని ఉంటాయో నీకు అన్నీ తెలుసును కదా. అవి అన్నీ మాకు చెప్పు. (18)
సౌతిరువాచ
ఏకో రథో గజశ్చైకః నరాః పంచ పదాతయః ।
త్రయశ్చ తురగాస్తద్ జ్ఞైః పత్తిరిత్యభిధీయతే ॥ 19
అపుడు ఉగ్రశ్రవుడు ఇలా చెప్పాడు. ఒక రథం, ఒక ఏనుగు, అయిదుగురు పదాతులు, మూడు గుర్రాలు కల సేన పత్తి అనబడుతుంది. (19)
పత్తిం తు త్రిగుణామేతమ్ ఆహుః సేవాముఖం బుధాః ।
త్రీణి సేనాముఖాన్యేకః గుల్మ ఇత్యభిధీయతే ॥ 20
మూడు పత్తులు కలిస్తే సేనాముఖం అవుతుంది. మూడు సేనాముఖాలను గుల్మం అంటారు. (20)
త్రయో గుల్మా గణో నామ వాహినీ తు గణాస్త్రయః ।
స్మృతాస్తిస్రస్తు వాహిన్యః పృతనేతి విచక్షణైః ॥ 21
మూడు గుల్మాలు గణం. మూడు గణాలు వాహిని. మూడు వాహినులు పృతన అవుతుంది. (21)
చమూస్తు పృతనాస్తిస్రః తిస్రశ్చమ్వస్త్వనీకినీ ।
అనీకినీం దశగుణాం ప్రాహురక్షౌహిణీం బుధాః ॥ 22
మూడు పృతనలు ఒక చమువు. మూడు చమువులు ఒక అనీకిని. పది అనీకినులు అక్షౌహిణి. (22)
అక్షౌహిణ్యాః ప్రసంఖ్యాతాః రథానాం ద్విజసత్తమాః ।
సంఖ్యాం గణితత్త్వజ్ఞైః సహస్రాణ్యేకవింశతిః ॥ 23
శతాన్యుపరిచైవాష్టౌ తథా భూయశ్చ సస్తతిః ।
గజానాం చ పరీమాణం ఏతదేవ వినిర్దిశేత్ ॥ 24
అక్షౌహిణిలో 21870(ఇరవై ఒక్కవేల ఎనిమిది వందల డెబ్బది) రథాలు ఉంటాయి. అని గణిత శాస్త్రజ్ఞులు చెప్పారు - ఏనుగులు కూడ అన్నే ఉంటాయి. (23, 24)
జ్ఞేయం శతసహస్త్రం తు సహస్రాణి నవైవ తు ।
వరాణామసి పంచాశత్ శతాని త్రీణి చానఘాః ॥ 25
లక్షా తొమ్మిదివేల మూడు వందల ఏబది మంది పదాతులుంటారు. (109350) (25)
పంచషష్టిసహస్రాణి తథాశ్వానాం శతాని చ ।
దశోత్తరాణి షట్ ప్రాహుః యథావదిహ సంఖ్యయా ॥ 26
ఆరువది అయిదు వేల ఆరువందల పది(65610) గుర్రాలు ఉంటాయి. (26)
ఏతామక్షౌహిణీం ప్రాహుః సంఖ్యాతత్త్వవిదో జనాః ।
యాం వః కథితవానస్మి విస్తరేణ తపోధనాః ॥ 27
ఈ చెప్పినవన్నీ కలిపి అక్షౌహిణి అవుతుందని సంఖ్యాశాస్త్రవిదు లంటారు. (27)
ఏతయా సంఖ్యయా హ్యాసన్ కురుపాండవసేనయోః ।
అక్షౌహిణ్యో ద్విజశ్రేష్ఠాః పిండితాష్టాదశైవ తు ॥ 28
కురు పాండవ సేనలు రెండూ కలిపి 18 (పదునెనిమిది) అక్షౌహిణులు అయ్యాయి. (28)
సమేతాస్తత్ర వై దేశే తత్రైవ నిధనం గతాః ।
కౌరవాన్ కారణం కృత్వా కాలేనాద్భుతకర్మణా ॥ 29
అద్భుతకృత్యాలు చేసే కాలం యొక్క ప్రేరణతో కౌరవులను నిమిత్తం చేసుకొని అక్కడ చేరిన రాజులంతా అక్కడే చనిపోయారు. (29)
అహాని యుయుధే భీష్మః దశైవ పరమాస్త్రవిత్ ।
అహాని పంచ ద్రోణస్తు రరక్ష కురువాహినీమ్ ॥ 30
అందులో పరమాస్త్రవేత్త అయిన భీష్ముడు పది రోజులు యుద్ధం చేశాడు. తరువాత ద్రోణుడు కౌరవసేనను అయిదురోజులు రక్షించాడు. (30)
అహనీ యుయుధే ద్వే తు కర్ణః పరబలార్దనః ।
శల్యోఽర్ధవసం చైవ గదాయుద్ధమతః పరమ్ ॥ 31
శత్రుసేనను పీడించే కర్ణుడు రెండురోజులు యుద్ధం చేశాడు. తరువాత శల్యుడు ఒకపూట యుద్ధం చేశాడు. తరువాత గదాయుద్ధం జరిగింది. (31)
తస్యైవ దివసస్యాంతే ద్రౌణిహార్దిక్య గౌతమాః ।
ప్రసుప్తం నిశి విశ్వస్తం జఘ్నుర్యౌధిష్ఠిరం బలమ్ ॥ 32
ఆ రోజు రాత్రే అశ్వత్థామ, కృతవర్మ, కృపుడూ ఆదమరిచి నిద్రిస్తున్న పాండవ సైన్యాన్ని చంపివేశారు. (32)
వి: తె: పదిదినములైదు ప్రొద్దులు
పదపడి రెన్నాళ్లు నొక్కపగలున్ రేయున్
ముదమున రణ మొనరించిరి
నదిసుత గురు కర్ణ శల్య నాగపురీశుల్
అని నన్నయ ఈ విషయాన్ని క్లుప్తంగా చెప్పాడు. (1-1-68)
యత్తు శౌనక సత్రే తే భారతాఖ్యానముత్తమమ్ ।
జనమేజయస్య తత్ సత్రే వ్యాసశిష్యేణ ధీమతా ॥ 33
కథితం విస్తరార్థం చ యశో వీర్యం మహీక్షితామ్ ।
పౌష్యం తత్ర చ పౌలోమమ్ ఆస్తీకం చాదితః స్మృతమ్ ॥ 34
శౌనక మహర్షీ! నీ విపుడు వింటున్న ఈ ఉత్తమమయిన ఇతిహాసం భారతం. జనమేజయుని సర్పయాగంలో వ్యాసశిష్యుడయిన వైశంపాయనుడు విస్తరించి చెప్పాడు. అందులో రాజులందరి పరాక్రమాలు, కీర్తులూ వర్ణింపబడినవి. అందులో మొదట పౌలోమపర్వం, ఆస్తీకపర్వం చెప్పబడినాయి. వానిని స్మరిస్తాను. (33, 34)
విచిత్రార్థపదాఖ్యానమ్ అనేకసమయాన్వితమ్ ।
ప్రతిపన్నం నరైః ప్రాజ్ఞైః వైరాగ్యమివ మోక్షిభిః ॥ 35
మోక్షం పొందాలనుకొనేవారు ముందుగా వైరాగ్యం పొందినట్లు ప్రాజ్ఞాలయిన మానవులు ఈ భారతాన్ని పొందాలి, చదవాలి. ఎందుచేతనంటే ఇది విచిత్రమయిన అర్థాలతోను, అనేక సిద్ధాంతాలతోను, ఆచరణలతోను కూడినది. (35)
ఆత్మేన వేదితవ్యేషు ప్రియేష్వివ హి జీవితమ్ ।
ఇతిహాసః ప్రధానార్థః శ్రేష్ఠః సర్వాగమేష్వయమ్ ॥ 36
తెలుసుకోదగిన వానిలో ప్రధానమయినది ఆత్మ. ప్రియమయిన వానిలో ప్రధానమయినది జీవితం. అలాగే అన్ని విజ్ఞాలలోనూ ఈ ఇతిహాసం ప్రధానమూ, శ్రేష్ఠమూ కూడా. (36)
అనాశ్రిత్యేదమాఖ్యానం కథా భువి న విద్యతే ।
ఆహారమనపాశ్రిత్య శరీరస్యేవ ధారణమ్ ॥ 37
ఆహారం విడిచిపెడితే శరీరం ధరించడం కష్టం - సాధ్యం కాదు. అలాగే ఈ భారతాన్ని విడిచిపెడితే ఏ కథా భూమి మీద నిలవదు. (అనగా అన్ని కథల నిర్మాణానికి ఈ భారతం మూలమని భావం.) (37)
తదేతద్ భారతం నామ కవిభిస్తూపజీవ్యతే ।
ఉదయప్రేప్సుభిర్భృత్యైః అభిజాత ఇవేశ్వరః ॥ 38
అభ్యుదయాన్ని కాంక్షించేవారు సత్కులీనుడయిన రాజును కోరుకున్నట్లు ఈ భారతాన్ని కవులందరూ ఆశ్రయిస్తారు. (38)
వి: సం: "వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం" అని భావం. (నీల)
ఇతిహాసోత్తమే యస్మిన్ అర్పితా బుద్ధిరుత్తమా ।
సర్వవ్యంజనయోః కృత్స్నా లోకవేదాశ్రయేవ వాక్ ॥ 39
స్వరవ్యంజనాలతో నిండిన వాక్కు అంతా లోకాన్నీ, వేదాన్నీ ఆశ్రయించినట్లు ఈ భారతేతిహాసం మీద అర్పించబడిన బుద్ధియే ఉత్తమమైనది. (39)
వి: సం: బ్రహ్మవిద్య అనే అంతఃకరణ వృత్తి అవుతుంది. (నీల)
తస్య ప్రజ్ఞాభిపన్నస్య విచిత్రపదపర్వణః ।
సూక్ష్మార్థన్యాయయుక్తస్య వేదార్థైర్భూషితస్య చ ॥ 40
భారతస్యేతిహాసస్య శ్రూయతాం పర్వసంగ్రహః ।
పర్వానుక్రమణీ పూర్వం ద్వితీయః పర్వసంగ్రహః ॥ 41
ఈ భారతేతిహాసం జ్ఞానంతో పూర్ణమయినది. విచిత్రమయిన పదాలతో, అర్థాలతో, న్యాయాలతో, వేదార్థాలతో కూడినది. దీని పర్వసంగ్రహం చెపుతాను విను. మొదటిది పర్వానుక్రమణిక - రెండవది పర్వసంగ్రహం. (40, 41)
పౌష్యం పౌలోమ మాస్తీకమ్ ఆదిరంశావతారణమ్ ।
తతః సంభవపర్వోక్తమ్ అద్భుతం రోమహర్షణమ్ ॥ 42
పౌష్యపర్వం మూడవది. తరువాతివి వరుసగా పౌలోమ పర్వం, ఆస్తీక పర్వం, అంశావతార పర్వం, సంభవ పర్వం. ఈ సంభవపర్వం చాలా అద్భుతంగా ఉండి ఒడలు పులకరిస్తుంది. (42)
దాహో జతుగృహస్యాత్ర హైడింబం పర్వ చోచ్యతే ।
తతో బకవధః పర్వ పర్వ చైత్రరథం తతః ॥ 43
తరువాతివి లాక్షౌగృహదహనం, హైడింబ పర్వం, బకవధ పర్వం, చైత్రరథ పర్వం. (43)
తతః స్వయంవరో దేవ్యాః పాంచాల్యాః పర్వ చోచ్యతే ।
క్షౌత్రధర్మేణ నిర్జిత్య తతో వైవాహికం స్మృతమ్ ॥ 44
తరువాతివి పాంచాలీ స్వయంవర పర్వం. (క్షాత్ర ధర్మంతో ఇతర రాజులను జయించిన) వైవాహిక పర్వం. (44)
విదురాగమనం పర్వ రాజ్యలభస్తథైవ చ ।
అర్జునస్య వనే వాసః సుభద్రాహరణం తతః ॥ 45
విదురాగమన రాజ్యలంభపర్వం, అర్జున వనవాసం, సుభద్రాహరణం. (45)
సుభద్రాహరణాదూర్ధ్వం జ్ఞేయా హరణహారికా ।
తతః ఖాండవవదాహాఖ్యం తత్రైవ మయదర్శనమ్ ॥ 46
తరువాతిది హరణహారిక, ఆపైని ఖాండవ వనదహనం, మయదర్శనం. (46)
వి: ఇంతవరకు ఆదిపర్వం (19 ఉప పర్వాలు)
సభాపర్వ తతః ప్రోక్తం మంత్రపర్వ తతః పరమ్ ।
జరాసంధవధః పర్వ పర్వ దిగ్విజయం తథా ॥ 47
తరువాతిది సభాపర్వం, తరువాతిది మంత్రపర్వం (ఇందులో సభాక్రియా పర్వం, లోకపాల సభాఖ్యాన పర్వం, రాజసూయా రంభ పర్వం ఉన్నాయి) జరాసంధవధ పర్వం, దిగ్విజయ పర్వం. (47)
పర్వ దిగ్విజయాదూర్థ్యం రాజసూయికముచ్యతే ।
తతశ్చార్ఘాభిహరణం శిశుపాలవధస్తతః ॥ 48
దిగ్విజయపర్వం తరువాతిది రాజసూయ పర్వం. తరువాతిది అర్ఘాభిహరణం, శిశుపాల వధ. (48)
ద్యూతపర్వ తతః ప్రోక్తమ్ అనూద్యూతమతఃపరమ్ ।
తత ఆరణ్యకం పర్వ కిర్మీరవధ ఏవ చ ॥ 49
తరువాతివి ద్యూతపర్వం అనుద్యూత పర్వం. (ఇలా ఇవి పది ఉప పర్వాలు) తరువాతిది ఆరణ్య పర్వం. (దీనిని వన పర్వమని కూడా అంటారు) దీనిలోని ఉప పర్వాలు ఇరువది యొకటి. (21) అందులో మొదటిది అరణ్య పర్వం 2. కిర్మీరవధ పర్వం. (49)
అర్జునస్యాభిగమనం పర్వ జ్ఞేయమతః పరమ్ ।
ఈశ్వరార్జునయోర్యుద్ధం పర్వ కైరాతసంజ్ఞితమ్ ॥ 50
తరువాతిది 3. అర్జునాభిగమన పర్వం. ఈశ్వరార్జునుల యుద్ధం కల పర్వం 4. కైరాత పర్వం. (50)
ఇంద్రలోకాభిగమనం పర్వ జ్ఞేయమతః పరమ్ ।
నలోపాఖ్యానమపి చ ధార్మికం కరుణోదయమ్ ॥ 51
తరువాతిది 5. ఇంద్రలోకాభిగమన పర్వం, తరువాతిది 6. నలోపాఖ్యానం. ఇది ధర్మప్రబోధకం కరుణరస స్ఫోరకము అయినది. (51)
తీర్థయాత్రా తతః పర్వ కురురాజస్య ధీమతః ।
జటాసురవధః పర్వ యక్షయుద్ధమతః పరమ్ ॥ 52
తరువాతిది (బుద్ధిమంతుడయిన ధర్మరాజు చేసిన 7. తీర్థయాత్రా పర్వం, 8. జటాసురవధ పర్వం. 9. యక్షయుద్ధపర్వం. (52)
నివాతకవచైర్యుద్ధం పర్వ చాజగరం తతః ।
మార్కండేయసమాస్యా చ పర్వానంతరముచ్యతే ॥ 53
10. నివాతకవచయుద్ధ పర్వం. 11. ఆజగర పర్వం, 12. మార్కండేయ సమాస్యా పర్వం. (53)
సంవాదశ్చ తతః పర్వ ద్రౌపదీసత్యభామయోః ।
ఘోషయాత్రా తతః పర్వ మృగస్వప్నోద్భవం తతః ॥ 54
వ్రీహిద్రౌణికమాఖ్యానం ఇంద్రద్యుమ్నం తథైవ చ ।
ద్రౌపదీహరణం పర్వ జయద్రథవిమోక్షణమ్ ॥ 55
తరువాతివి 13. ద్రౌపదీ సత్యభామా సంవాదపర్వం 14. ఘోషయాత్ర, 15. మృగస్వప్నోద్భవ పర్వం, 16. వ్రీహిద్రౌణికాఖ్యాన పర్వం, 17. ద్రౌపదీహరణ పర్వం, 18. జయద్రథవిమోక్షణ పర్వం. (54,55)
పతివ్రతాయా మాహాత్మ్యం సావిత్ర్యాశ్చైవమద్భుతమ్ ।
రామోపాఖ్యానమత్రైవ పర్వ జ్ఞేయమతః పరమ్ ॥ 56
19. రామోపాఖ్యానం తరువాతిది 20. పతివ్రతా మాహాత్మ్యం - ఇందులోనే సావిత్రి చరిత్ర. (56)
కుండలాహరణం పర్వ తతః పరమిహోచ్యతే ।
ఆరణేయం తతః పర్వ వైరాటం తదనంతరమ్ ।
పాండవానాం ప్రవేశశ్చ సమయస్య చ పాలనమ్ ॥ 57
తరువాతిది 21. కుండలాహరణ పర్వం. ఆ తరువాతిది 22. ఆరణేయ పర్వం. (ఇలా వనపర్వంలో ఇరవై రెండు ఉప పర్వాలున్నాయి.) తరువాతిది విరాట పర్వం. (ఇందులో 5 ఉప పర్వాలు) 1. పాండవప్రవేశ పర్వం 2. సమయ పాలన పర్వం. (57)
కీచాకానాం వధః పర్వ పర్వ గోగ్రహణం తతః ।
అభిమన్యోశ్చ వైరాట్యాః పర్వ వైవాహికం స్మృతమ్ ॥ 58
3. కీచక వధ పర్వం. 4. గోగ్రహణ పర్వం, 5. వైవాహిక పర్వం (ఇది ఉత్తరాభిమన్యుల వివాహం) (58)
ఉద్యోగపర్వ విజ్ఞేయమ్ అత ఊర్థ్యం మహాద్భుతమ్ ।
తతః సంజయయానాఖ్యం పర్వ జ్ఞేయమతః పరమ్ ॥ 59
ప్రజాగరం తథా పర్వ ధృతరాష్ట్రస్య చింతయా ।
పర్వ సానత్సుజాతం వై గుహ్యమధ్యాత్మదర్శనమ్ ॥ 60
తరువాతి పర్వం అద్భుతమైన ఉద్యోగపర్వం. (దానిలో 10 పది ఉపపర్వాలున్నాయి.) మొదటిది సేనోద్యోగ పర్వం. 2. సంజయయాన పర్వం, 3. ప్రజాగర పర్వం. (ఇది ధృతరాష్ట్రుని మానసిక వేదన వలన చెప్పబడింది). 4. సనత్సుజాత పర్వం, (ఇది రహస్యమైన అధ్యాత్యవిద్యను ప్రదర్శిస్తుంది) (59,60)
యానసంధిస్తతః పర్వ భగవద్యానమేవ చ ।
మాతలీయముపాఖ్యానం చరితం గాలవస్య చ ॥ 61
సావిత్రం వామదేవ్యం చ వైన్యోపాఖ్యానమేవ చ ।
జామదగ్న్యముపాఖ్యానం పర్వ షోడశరాజికమ్ ॥ 62
తరువాతిది 5. యానసంధిపర్వం. 6. భగవద్యాన పర్వం. ఇందులోనే మాతలి చరిత్ర, గాలవచరిత్ర, గరుడుని చరిత్ర, పరశురాముని చరిత్ర, షోడశరాజుల చరిత్ర ఉన్నాయి. (61,62)
సభాప్రవేశః కృష్ణస్య విదులాపుత్రశాసనమ్ ।
ఉద్యోగ సైన్యనిర్యాణం విశ్వోపాఖ్యానమేవ చ ॥ 63
కృష్ణుని సభాప్రవేశం, విదులావృత్తాంతం, సైన్యం రెండు పక్షాలకూ చేరడం, విశ్వోపాఖ్యానమూ ఉన్నాయి భగవద్యాన పర్వంలో. (63)
జ్ఞేయం వివాదపర్వాత్ర కర్ణస్యాపి మహాత్మనః ।
నిర్యాణం చ తతః సర్వ కురుపాండవసేనయోః ॥ 64
ఇందులోనే కర్ణునితో జరిగిన వివాదపర్వమూ ఉన్నాయి. తరువాతి 7వ ఉపపర్వం సైన్యనిర్యాణ పర్వం. (64)
రథాతిరథ సంఖ్యా చ పర్వోక్తం తదనంతరమ్ ।
ఉలూకదూతాగమనం పర్వామర్షవివర్ధనమ్ ॥ 65
అందరికీ అమర్షం కలిగించే 8. ఉలూకదూతా గమనం- ఆ తరువాతిది రథాతిరథ సంఖ్యానపర్వం(9). (65)
అంబోపాఖ్యానమత్రైవ పర్వ జ్ఞేయమతః పరమ్ ।
భీష్మాభిషేచనం పర్వ తతశ్చాద్భుతముచ్యతే ॥ 66
ఆ తరువాతిది, చివరిది అంబోపాఖ్యాన పర్వం (10) ఇది ఉద్యోగ పర్వం. భీష్ముని సైన్యాధ్యక్షునిగా అభిషేకం చేశారు కాబట్టి భీష్మపర్వం అయింది. (ఇందులో నాలుగు ఉప పర్వాలు.) (66)
జంబూఖండవినిర్మాణం పర్వోక్తం తదనంతరమ్ ।
భూమిపర్వ తతః ప్రోక్తం ద్వీపవిస్తారకీర్తనమ్ ॥ 67
1. జంబూఖండవినిర్మాణ పర్వం. 2. భూమి పర్వం. (ఇవి ద్వీపాల విశేషాలు చెపుతాయి) (67)
పర్వోక్తం భగవద్గీతా పర్వ భీష్మవధస్తతః ।
ద్రోణాభిషేచనం పర్వ సంశప్తకవధస్తతః ॥ 68
తరువాతిది 3. భగవద్గీతా పర్వం, 4. భీష్మవధ పర్వం. తరువాతి ద్రోణపర్వంలో 8 ఎనిమిది ఉప పర్వాలు. 1. ద్రోణాభిషేచన పర్వం, 2. సంశప్తకవధ. (68)
అభిమన్యువధః పర్వ ప్రతిజ్ఞాపర్వ చోచ్యతే ।
జయద్రథవధః పర్వ ఘటోత్కచవధస్తతః ॥ 69
మూడవ ఉపపర్వం అభిమన్యువధపర్వం, 4. ప్రతిజ్ఞా పర్వం, 5. జయద్రథవధ పర్వం, 6. ఘటోత్కచ వధ పర్వం. (69)
తతో ద్రోణవధః పర్వ విజ్ఞేయం లోమహర్షణమ్ ।
మోక్షో నారాయణా స్త్రస్య పర్వానంతరముచ్యతే ॥ 70
7. ద్రోణవధ పర్వం, ఇది శరీరానికి గగుర్పాటు కలిగిస్తుంది. 8. నారాయణా స్త్రమోక్ష పర్వం. (70)
కర్ణపర్వ తతో జ్ఞేయం శల్యపర్వ తతః పరమ్ ।
హ్రదప్రవేశనం పర్వ గదాయుద్ధమతః పరమ్ ॥ 71
తరువాతిది కర్ణపర్వం- దీనిలో ఉపపర్వాలు లేవు. తరువాతిది శల్య పర్వం. ఇందులో మూడు ఉపపర్వాలు, 1. శల్యపర్వం, 2. హ్రదప్రవేశ పర్వం, 3. గదా పర్వం. (71)
సారస్వతం తతః పర్వ తీర్థవంశానుకీర్తనమ్ ।
అత ఊర్థ్వం సుబీభత్సం పర్వ సౌప్తికముచ్యతే ॥ 72
సారస్వత పర్వంలో తీర్థాలు వంశాలు కీర్తింపబడినవి, తరువాతిది బీభత్సం సృష్టించిన సౌప్తిక పర్వం. ఇందులో 1. సౌప్తిక పర్వం. (72)
ఐషీకం పర్వచోద్దిష్టమ్ అత ఊర్ధ్వం సుదారుణమ్ ।
జలప్రదానికం పర్వ స్త్రీవిలాపస్తతః పరమ్ ॥ 73
రెండవది ఐషీకపర్వం - రెండే ఉపపర్వాలు, తరువాతి స్త్రీ పర్వంలో మూడు ఉపపర్వాలు 1. జలప్రదానిక పర్వం, 2. స్త్రీవిలాప పర్వం. (73)
శ్రౌద్ధ పర్వ తతో జ్ఞేయం కురూణామౌర్ధ్వదైహికమ్ ।
చార్వాకనిగ్రహః పర్వ రక్షసో బ్రహ్మరూపిణః ॥ 74
3. శ్రౌద్ధ పర్వం - ఇందులో కురువంశస్థులకు పారలౌకిక క్రియలు నిర్వర్తింపబడినవి - తరువాత చార్వాకుడు అనే రాక్షసుడు బ్రాహ్మణ రూపంలో రావడం... (74)
ఆభిషేచనికం పర్వ ధర్మరాజస్య ధీమతః ।
ప్రవిభాగో గృహాణాం చ పర్వోక్తం తదనంతరమ్ ॥ 75
ధర్మరాజుకు పట్టాభిషేకం - గృహాలను సోదరాదులకు విభజించడం - ఇందంతా శాంతి పర్వంలోని మొదటి ఉపపర్వమయిన రాజధర్మానుశాసనంలో ఉంది. (75)
శాంతిపర్వ తతో యత్ర రాజధర్మానుశాసనమ్ ।
ఆపద్ధర్మశ్చ పర్వోక్తం మోక్షధర్మస్తతః పరమ్ ॥ 76
ఇక ఆపద్ధర్మాలు కూడా శాంతిపర్వంలో రెండవదయిన ఆపద్ధర్మపర్వంలో చెప్పబడినాయి. తరువాతిది శాంతి పర్వంలో మూడవది మోక్షధర్మపర్వం. (76)
శుకప్రశ్నాభిగమనం బ్రహ్మప్రశ్నానుశాసనమ్ ।
ప్రాదుర్భావశ్చ దుర్వాసః సంవాదశ్పైవ మాయయా ॥ 77
ఇందులో శుకప్రశ్నాభిగమనం, బ్రహ్మప్రశ్నానుశాసనం, దుర్వాసుని ప్రాదుర్భావం, మాయాసంవాదం ఉన్నాయి. (77)
తతః పర్వ పరిజ్ఞేయమ్ ఆనుశాసనం పరమ్ ।
స్వర్గారోహణికం చైవ తతో భీష్మస్య ధీమతః ॥ 78
తరువాతి పర్వం ఆనుశాసనికపర్వం - ఇందులో రెండు ఉపపర్వాలు 1. దానధర్మపర్వం 2. భీష్ముని స్వర్గారోహణం. (78)
తతోఽశ్వమేధికం పర్వ సర్వపాపప్రణాశనమ్ ।
అనుగీతా తతః పర్వ జ్ఞేయమధ్యాత్మవాచకమ్ ॥ 78
ఆశ్వమేధిక పర్వంలో రెండు ఉపపర్వాలు 1. ఆశ్వమేధిక పర్వం, 2. అనుగీతాపర్వం. (ఈ పర్వం ఆధ్యాత్మపరమయినది.) (79)
పర్వ చాశ్రమవాసాఖ్యం పుత్రదర్శనమేవ చ ।
నారదాగమనం పర్వ తతః పరమిహోచ్యతే ॥ 80
ఇందులో ఆశ్రమవాస పర్వం, 2. పుత్ర దర్శన పర్వం. 3. నారదాగమన పర్వం అని మూడు ఉపపర్వాలున్నాయి. (80)
మోసలం పర్వ చోద్దిష్టం తతో ఘోరం సుదారుణమ్ ।
మహాప్రస్థానికం పర్వ స్వర్గారోహణికం తతః ॥ 81
తరువాతిది ఘోరమయిన మౌసల పర్వం. ఆ తరువాతిది మహాప్రస్థానిక పర్వం. ఆపైది స్వర్గారోహణ పర్వం. (ఈ మూడు పర్వాలలో ఉపపర్వాలు లేవు.) (81)
హరివంశస్తతః పర్వ పురాణం ఖిలసంజ్ఞితమ్ ।
విష్ణుపర్వ శిశోశ్చర్యా విష్ణోః కంసవధస్తథా ॥ 82
తరువాతిది హరివంశం (దీనిని భారత పరిశిష్టం అంటారు. దీనినే ఖిలపర్వం అని కూడా అంటారు). దీనిలో 1. హరివంశపర్వం, 2. విష్ణుపర్వం, 3. కృష్ణ లీలలు, కంసవధ మొదలగునవి. (82)
భవిష్యపర్వ చాప్యుక్తం ఖిలేష్వేవాద్భుతం మహత్ ।
ఏతత్ పర్వశతం పూర్ణం వ్యాసేనోక్తం మహాత్మనా ॥ 83
ఖిలపర్వాలలోనే భవిష్యపర్వం కూడా చెప్పబడింది. ఇలా వ్యాసమహర్షి భారతాన్ని 100 ఉపపర్వాలలో చెప్పాడు. (83)
యథావత్ సూతపుత్రేణ లౌమహర్షణినా తతః ।
ఉక్తాని వైమిషారణ్యే పర్వాణ్యష్టాదశైవ తు ॥ 84
దానినే సూతపుత్రుడయిన రౌమహర్షణి తరువాత 18 పర్వాలుగా నైమిశారణ్యంలో చెప్పాడు. (84)
సమాసో భారతస్యాయమ్ అత్రోక్తః పర్వసంగ్రహః ।
పౌష్యం పౌలోమమాస్తీకమ్ ఆదిరంశావతారణమ్ ॥ 85
సంభవో జతువేశ్మాఖ్యమ్ హిడింబబకయోర్వధః ।
తథా చైత్రరథం దేవ్యాః పాంచాల్యాశ్చ స్వయంవరః ॥ 86
క్షాత్రధర్మేణ నిర్జిత్య తతో వైవాహికం స్మృతమ్ ।
విదురాగమనం చైవ రాజ్యలంభస్తథైవ చ ॥ 87
వనవాసోఽర్జునస్యాపి సుభద్రాహరణం తతః ।
హరణాహరణం చైవ దహనం ఖాండవస్య చ ॥ 88
మయస్య దర్శనం చైవ ఆదిపర్వణి కథ్యతే ।
ఇలా భారతంలోని పర్వాల సంగ్రహం చెప్పబడింది. ఇక ఈ ఆదిపర్వంలోని కథావిశేషాలు ఇవి. పౌష్యవృత్తాంతం, పౌలోమ కథ, ఆస్తీక వృత్తాంతం, అంశావతరణం, కౌరవవంశ సంభవం, లాక్షాగృహదహనం, హిడింబ బకాసురుల వధ, చైత్రరథం, ద్రౌపదీ స్వయంవరం, వివాహవిధి, విదురాగమనం, రాజ్యలంభం, అర్జున వనవాసం, సుభద్రాహరణం, హరణాహరణం, ఖాండవదహనం, మయదర్శనం, ఇంతవరకు ఆదిపర్వంలో చెప్పబడ్డాయి. (85-88 1/2)
పౌష్యే పర్వణి మాహాత్మ్యం ఉత్తంకస్యోపవర్ణితమ్ ॥ 89
పౌలోమే భృవంశస్య విస్తారః పరికీర్తితః ।
ఆస్తీకే సర్వనాగానాం గరుడస్య చ సంభవః ॥ 90
పౌష్యపర్వంలో ఉత్తంకుని మాహాత్మ్యం వర్ణింపబడింది. పౌలోమ పర్వంలో భృగువంశం అంతా చెప్పబడింది. ఆస్తీకపర్వంలో నాగుల యొక్క, గరుడుని యొక్క పుట్టుక చెప్పబడింది. (89, 90)
క్షీరోదమథనం చైవ జన్మోచ్చైఃశ్రవసస్తథా ।
యజతః సర్వసత్రేణ రాజ్ఞః పారీక్షితస్య చ ॥ 91
కథేయమభినిర్వృత్తా భరతానాం మహాత్మనామ్ ।
వివిధాః సంభవా రాజ్ఞాం ఉక్తాః సంభవపర్వణీ ॥ 92
అన్యేషాం చైవ శూరాణాం ఋషేర్ద్వైపాయనస్య చ ।
అంశావతరణం చాత్ర దేవానాం పరికీర్తితమ్ ॥ 93
ఇందులోనే పాలసముద్రం మథించడం, ఉచ్పైఃశ్రవం పుట్టడం, సర్పయాగం చేస్తున్న జనమేజయునికి భరతవంశస్థుల కథ చెప్పడం జరిగింది. సంభవపర్వంలో రాజుల భిన్నభిన్న జన్మ సంబంధి కథలు చెప్పబడినాయి. ఇంకా శూరుల యొక్క, వ్యాసమహర్షి యొక్క కథలు తెల్పబడినాయి. ఇక్కడే దేవతల అంశాలు - వాని కథలు చెప్పబడ్డాయి. (91-93)
దైత్యానం దానవానాం చ యక్షాణాం చ మహౌజసామ్ ।
వాగానామథ సర్పాణాం గంధర్వాణాం పతత్త్రిణామ్ ॥ 94
అన్యేషాం చైవ భూతానాం వివిధానాం సముద్భవః ।
మహర్షేరాశ్రమపదే కణ్వస్య చ తపస్వినః ॥ 95
శకుంతలాయాం దుష్యంతాత్ భరతశ్ఛాపి జజ్ఞివాన్ ।
యస్య లోకేషు నామ్నేదం ప్రథితం భారతం కులమ్ ॥ 96
ఈ పర్వంలోనే దైత్య, దానవ, యక్ష, నాగ, సర్ప, గంధర్వ, పక్షి జాతుల పుట్టుక, ఇతర ప్రాణుల పుట్టుకలూ చెప్పబడినవి. కణ్వమహర్షి ఆశ్రమంలో శకుంతలకు దుష్యంతుని వలన భరతుడు పుట్టాడు. అతని పేరుతోనే ఆ వంశానికంతకూ భారతవంశమని లోకప్రసిద్ధి ఏర్పడింది. (94-96)
వసూనాం పునరుత్పత్తిః భాగీరథ్యాం మహాత్మనామ్ ।
శాంతనోర్వేశ్మని పునః తేషాం చారోహణం దివి ॥ 97
తరువాత వసువులు గంగాదేవికి శంతనుని యింట పుత్రులుగా పుట్టడం, ఏడుగురు దివికేగటం జరిగింది. (97)
తేజోఽంశానాం చ సంపాతః భీష్మస్యాప్యత్ర సంభవః ।
రాజ్యాన్నివర్తనం తస్య బ్రహ్మచర్యవ్రతే స్థితిః ॥ 98
ప్రతిజ్ఞాపాలనం చైవ రక్షా చిత్రాంగదస్య చ ।
హతే చిత్రాంగదే చైవ రక్షా భ్రాతుర్యవీయసః ॥ 99
విచిత్రవీర్యస్య తథా రాజ్యే సంప్రతిపాదనమ్ ।
ధర్మస్య వృషు సంభూతిః అణీమాండవ్యశాపజా ॥ 100
కృష్ణద్వైపాయనాచ్చైవ ప్రసూతిర్వరదానజా ।
ధృతరాష్ట్రస్య పాండోశ్చ పాండవానాం చ సంభవః ॥ 101
వసువుల తేజస్సులు భీష్మునికివ్వడం, భీష్ముడు బ్రహ్మచర్యమవలంబించడం, రాజ్యం అక్కరలేదనడం, చిత్రాంగదుని రక్షించడం, ప్రతిజ్ఞ నిర్వహించుకొనడం, చిత్రాంగదుడు చనిపోతే విచిత్రవీర్యునికి రాజ్యమివ్వడం, యమధర్మరాజు అణిమాండవ్యుని శాపంవల్ల మర్త్యలోకంలో పుట్టడం, కృష్ణద్వైపాయనుని వరంతో ధృతరాష్ట్ర, పాండురాజులు పుట్టడం, పాండవులు పుట్టడం కూడా ఇందులోనే ఉన్నాయి. (98-101)
వారణావతయాత్రాయాం మంత్రో దుర్యోధనస్య చ ।
కూటస్య ధార్తరాష్ట్రేణ ప్రేషణం పాండవాన్ ప్రతి ॥ 102
హితోపదేశశ్చ పథి ధర్మరాజస్య ధీమతః ।
విదురేణ కృతో యత్ర హితార్థం మ్లేచ్ఛభాషయా ॥ 103
దుర్యోధనుని దుర్మంత్రంతో పాండవులను వారణావతం పంపడం, దారిలో ధీమంతుడయిన విదురుడు మ్లేచ్ఛభాషలో ధర్మరాజుకు హితోపదేశం చేయడం ఉన్నాయి. (102,103)
విదురస్య చ వాక్యేన సురంగోపక్రమక్రియా ।
నిషాద్యాః పంచపుత్రాయాః సుప్తాయా జతువేశ్మని ॥ 104
పురోచనస్య చాత్రైవ దహనం సంప్రకీర్తితమ్ ।
పాండవానాం వనే ఘోరే హిడింబాయాశ్చ దర్శనమ్ ॥ 105
తత్రైవ చ హిడింబస్య వధో భీమాన్మహాబలాత్ ।
ఘటోత్కచస్య చోత్పత్తిః అత్రైవ పరికీర్తితా ॥ 106
విదురుని మాటతో సొరంగం త్రవ్వడం; లక్కయింట్లో పడుకున్న నిషాది, అయిదుగురు కొడుకులూ, పురోచనుడు, లక్కయింట్లో తగలబడిపోవడం; పాండవులు తప్పించుకొని అడవిలో హిడింబను చూడటం, భీముడు హిడింబాసురుని చంపడం, ఘటోత్కచుని పుట్టుక ఈ ఆదిపర్వంలోనే ఉన్నాయి. (104-106)
మహర్షేర్దర్శనం చైవ వ్యాసస్యామిత తేజసః ।
తదాజ్ఞయైకచక్రాయాం బ్రాహ్మణస్య నివేశనే ॥ 107
అజ్ఞాతచర్యయా వాసః యత్ర తేషాం ప్రకీర్తితః ।
బకస్య నిధనం చైవ నాగరాణాం చ విస్మయః ॥ 108
అమితతేజస్వి అయిన వ్యాసమహర్షి దర్శనమూ, వ్యాసుని ఆజ్ఞతో ఏకచక్రపురంలో బ్రాహ్మణుని యింట్లో ఎవరికీ తెలియకుండా నివసించటమూ, అచట బకుడనే రాక్షసుని భీముడు చంపడమూ, నగరవాసుల విస్మయమూ ఇందే వివరింపబడ్డాయి. (107, 108)
సంభవశ్చైవ కృష్ణాయాః ధృష్టద్యుమ్నస్య చైవ హ ।
బ్రాహ్మణాత్ సముపశ్రుత్య వ్యాసవాక్యప్రచోదితాః ॥ 109
ద్రౌపదీం ప్రార్థయంతస్తే స్వయంవరదిదృక్షయా ।
పంచాలానభితో జగ్ముః యత్ర కౌతూహలాన్వితాః ॥ 110
ద్రౌపదీ జననమూ, ధృష్టద్యుమ్నుని పుట్టుక కూడ ఇందే చెప్పబడినవి. బ్రాహ్మణుని మాటలు విని, వ్యాసుని ప్రేరణతో, స్వయంవరం చూడాలనే కోరికతో ద్రౌపదిని కాంక్షిస్తూ పాండవులు కుతూహలమ్తో పాంచాలదేశానికి బయలుదేరడమూ ఇందే ఉన్నాయి. (109, 110)
అంగారపర్ణం నిర్జిత్య గంగాకూలఽర్జునస్తదా ।
సఖ్యం కృత్వా తతస్తేన తస్మాదేవ చ శూశ్రువే ॥ 111
తాపత్యమథ వాసిష్ఠమ్ ఔర్వం చాఖ్యానముత్తమమ్ ।
భ్రాతృభిః సహితః సర్వైః పంచాలానభితో యయౌ ॥ 112
పాంచాలనగరే చాపి లక్ష్యం భీత్వా ధనంజయః ।
ద్రౌపదీం లబ్ధవానత్ర మధ్యే సర్వమహీక్షితామ్ ॥ 113
భీమసేనార్జునే యత్ర సంరబ్ధాన్ పృథివీపతీన్ ।
శల్యకర్ణౌ చ తరసా జితవంతౌ మహామృధే ॥ 114
గంగానదీ తీరంలో అర్జునుడు అంగారపర్ణుని జయించడం, వాని స్నేహంతో తాపత్యులని తెలియడం - అపుడే వశిష్ఠుని వృత్తాంతం, ఔర్వోపాఖ్యానం చెప్పబడింది - తరువాత పాండవులంతా పాంచాల నగరానికి వెళ్ళడం, అక్కడ అర్జునుడు మత్స్యయంత్రం కొట్టి అందరిరాజుల ఎదుట ద్రౌపదిని పొందటం, అక్కడే ఎదురుతిరిగిన రాజులనూ, కర్ణశల్యులనూ భీమార్జునులు జయించడం జరిగింది. (111-114)
దృష్ట్యా తయోశ్చ తద్వీర్యమ్ అప్రమేయమమానుషమ్ ।
శంకమానౌ పాండవాంస్తాన్ రామకృష్ణౌ మహామతీ ॥ 115
జగ్మతుస్తైః సమాగంతుం శాలాం భార్గవవేశ్మని ।
పంచానామేకపత్నీత్వే విమర్శో ద్రుపదస్య చ ॥ 116
బలరామకృష్ణులు భీమార్జునుల అమానుష పరాక్రమాన్ని చూచి పాండవులని శంకించడం, వారిని కలిసికొనేందుకు కుమ్మరి యింటికి రామకృష్ణులు వెళ్లడం, ద్రుపదుడు తన కుమార్తెను అయిదుగురికీ వివాహం చేయడానికి వెనుకాడటం మొదలగునవి (ఇందులో ఉన్నాయి). (115,116)
పంచేంద్రాణాముపాఖ్యానమ్ అత్రైవాద్భుతముచ్యతే ।
ద్రౌపద్యా దేవవిహితః వివాహాశ్చాపయమానుషః ॥ 117
ఇక్కడే అద్భుతమైన పంచేంద్రోపాఖ్యానం చెప్పబడింది. మనుష్యులకు విపరీతమయిన ద్రౌపదీ వివాహం కూడా చెప్పబడింది. (117)
క్షత్తుశ్చ ధృతరాష్ట్రేణ ప్రేషణం పాండవాన్ ప్రతి ।
విదురస్య చ సంప్రాప్తిః దర్శనం కేశవస్య చ ॥ 118
ధృతరాష్ట్రుడు విదురుని పాండవుల దగ్గరకు పంపడం, అక్కడకు వెళ్లి విదురుడు శ్రీకృష్ణుని కూడ దర్శించడం. (118)
ఖాండవప్రస్థవాసశ్చ తథా రాజ్యార్ధసర్జనమ్ ।
నారదస్యాజ్ఞయా చైవ ద్రౌపద్యాః సమయక్రియా ॥ 119
తరువాత ధృతరాష్ట్రుడు పాండవులకు అర్ధరాజ్యం ఇచ్చి ఖాండవ ప్రస్థానికి పంపడం - ఇంద్రప్రస్థంలో పాండవులు రాజ్యం చేయడం - నారదాగమనం - ద్రౌపదితో పాండవుల సమయం. (119)
సుందోపసుందయోస్తద్వత్ ఆఖ్యానం పరికీర్తితమ్ ।
అనంతరం చ ద్రౌపద్యా సహోసేనం యుధిష్ఠిరమ్ ॥ 120
అనుప్రవిశ్య విప్రార్థే ఫాల్గునో గృహ్య చాయుధమ్ ।
మోక్షయిత్వా గృహం గత్వా విప్రార్థం కృతనిశ్చయః ॥ 121
సమయం పాలయన్ వీరః వనం యత్ర జగామ హ ।
పార్థస్య వనవాసే చ ఉలూప్యా పథి సంగమః ॥ 122
నారదుడు సుందోపసుందుల కథ చెప్పడం, తరువాత ద్రౌపదితో కూర్చున్న యుధిష్ఠిరుని అర్జునుడు బ్రాహ్మణుని కోసం దర్శించడం, అర్జునుడు బ్రాహ్మణుని కార్యం నెరవేర్చి వచ్చి వనవాసానికి అనుజ్ఞ వేడడం, త్రోవలో ఉలూపితో సమోగమం. (120-122)
పుణ్యతీర్థానుసంయానం బభ్రువాహనజన్మ చ ।
తత్రైవ మోక్షయామాస పంచ సోఽప్సరసః శుభాః ॥ 123
శాపాద్ గ్రాహత్వమాపన్నాః బ్రాహ్మణస్య తపస్వినః ।
ప్రభాసతీర్థే పార్థేన కృష్ణస్య చ సమాగమః ॥ 124
పుణ్యతీర్థసేవనం, బభ్రువాహనుడు జన్మించడం, బ్రాహ్మణుని శాపం వల్ల మొసళ్లుగా మారిన అయిదుగురు అప్సరసలకు అర్జునుడు శాపమోక్షం కలిగించడం, ప్రభాస తీర్థంలో కృష్ణునితో అర్జునుని సమాగమం. (123,124)
ద్వారకాయాం సుభద్రా చ కామయానేన కామినీ ।
వాసుదేవస్యానుమతే ప్రాప్తా చైవ కిరీటినా ॥ 125
ద్వారకలో సుభద్రను ప్రేమించి వాసుదేవుని అనుమతితో అర్జునుడు చేపట్టడం. (125)
గృహీత్వా హరణం ప్రాప్తే కృష్ణే దేవకినందనే ।
అభిమన్యోః సుభద్రాయాం జన్మ చోత్తమతేజసః ॥ 126
కృష్ణుడు హరణం పట్టుకుని రావడం, సుభద్రకు అర్జునుని వలన ఉత్తమతేజస్వి అయిన అభిమన్యుడు పుట్టడం. (126)
ద్రౌపద్యాస్తనయానాం చ సంభవోఽనుప్రకీర్తితః ।
విహారార్థం చ గతయోః కృష్ణయోర్యమునామను ॥ 127
సంప్రాప్తిశ్చక్రధనుషోః ఖాండవస్య చ దాహనమ్ ।
మయస్య మోక్షో జ్వలనాద్ భుజంగస్య చ మోక్షణమ్ ॥ 128
ద్రౌపదికి అయిదుగురు ఉపపాండవులు పుట్టడమూ ఇక్కడే కీర్తింపబడింది. విహారంకోసం యమునా తీరానికి వెళ్లిన కృష్ణార్జునులకు అగ్నిహోత్రుడు కనపడటం, చక్రాన్ని కృష్ణునికీ, ధనుస్సును అర్జునునికీ ఇవ్వడం, ఖాండవ వనం దహించటం - అందులో మంటలనుండి మయుని, సర్పాన్ని విడిచిపెట్టడం. (127,128)
మహర్షేర్మందపాలస్య శార్ జ్గ్యాం తనయసంభవః ।
ఇత్యేతదాదిపర్వోక్తం ప్రథమం బహువిస్తరమ్ ॥ 129
మందపాల మహర్షికి శార్ జ్గి పక్షి వలన పుత్రులు పుట్టిన కథ - ఇదంతా ఆదిపర్వంలో విస్తారంగా చెప్పబడింది. (129)
అధ్యాయానాం శతం ద్వేతు సంఖ్యాతే పరమర్షిణా ।
సప్తవింశతిరధ్యాయాః వ్యాసేనోత్తమతేజసా ॥ 130
వ్యాసమహర్షి ఆదిపర్వంలో రెండువందల ఇరవై ఏడు (227) అధ్యాయాలు చెప్పాడు. (130)
అష్టౌ శ్లోకసహస్రాణి అష్టౌ శ్లోక శతాని చ ।
శ్లోకాశ్చ చతురాశీతిః మునినోక్తా మహాత్మనా ॥ 131
ఈ ఆదిపర్వంలో వ్యాసులవారు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు శ్లోకాలు(8884) చెప్పారు. (131)
ద్వితీయం తు సభాపర్వ బహువృత్తాంతముచ్యతే ।
సభాక్రియా పాండవానాం కింకరాణాం చ దర్శనమ్ ॥ 132
లోకపాలసభాఖ్యానం నారదాద్దేవదర్శినః ।
రాజసూయస్య చారంభః జరాసంధవధస్తథా ॥ 133
గిరివ్రజే నిరుద్ధానాం రాజ్ఞాం కృష్ణేన మోక్షణమ్ ।
తథా దిగ్విజయోఽత్రైవ పాండవానాం ప్రకీర్తితః ॥ 134
రెండవది సభాపర్వం. ఇందులో చాలా వృత్తాంతాల వర్ణన ఉంది. పాండవుల సభానిర్మాణం, కింకరులనే రాక్షసుల దర్శనం, దేవర్షి అయిన నారదుడు లోకపాలుర సభలను గురించి చెప్పడం, రాజసూయయాగం ఆరంభం, జరాసంధ వథ, గిరివ్రజంలో బంధింపబడిన రాజులను కృష్ణుడు విడిపించడం, పాండవుల దిగ్విజయం ఇందులో ఉన్నాయి. (132-134)
రాజ్ఞామాగమనం చైవ సార్హణానాం మహాక్రతా ।
రాజసూయేఽర్ఘసంవాదే శిశుపాలవధస్తథా ॥ 135
రాజులంతా కానుకలతో రాజసూయయాగానికి రావడం, రాజసూయంలో అర్ఘ్యానికి సంబంధించిన వివాదంలో శిశుపాలుని వధించడం. (135)
యజ్ఞే విభూతం తాం దృష్ట్వా దుఃఖామర్షాన్వితస్య చ ।
దుర్యోధనస్యావహాసః భీమేన చ సభాతలే ॥ 136
యజ్ఞవైభవం చూసి దుర్యోధనునికి దుఃఖం, అమర్షం కలగడం, మయ సభలో దుర్యోధనుని చూచి భీముడు నవ్వడం... (136)
యత్రాస్య మమ్యరుద్భూతః యేన ద్యూతమకారయత్ ।
యత్ర ధర్మసుతం ద్యూతే శకునిః కితనోఽజయత్ ॥ 137
దానితో దుర్యోధనునికి కోపం రావడం, జూదం ఏర్పాటు - దానిలో జూదగాడయిన శకుని ధర్మరాజును ఓడించడం. (137)
యత్ర ద్యూతార్ణవే మగ్నాం ద్రౌపదీం నౌరివార్ణవాత్ ।
ధృతరాష్ట్రో మహాప్రాజ్ఞః స్నుషాం పరమదుఃఖితామ్ ॥ 138
తారయామాస తాంస్తీర్ణాన్ జ్ఞాత్వా దుర్యోధనో వృపః ।
పునరేవ తతో ద్యూతే సమాహ్వయత పాండవాన్ ॥ 139
జూదం అనే సముద్రంలో మునిగిపోతున్న ద్రౌపదిని నావలాగా మహాప్రాజ్ఞుడయిన ధృతరాష్ట్రుడు ఉద్ధరించడం. అది తెలిసి దుర్యోధనుడు మళ్లీ పాండవులను ద్యూతానికి పిలవడం.. (138,139)
జిత్వా స వనవాసాయ ప్రేషయామాస తాంస్తతః ।
ఏతత్సర్వం సభాపర్వ సమాఖ్యాతం మహాత్మనా ॥ 140
అనుద్యూతంలో జయించి పాండవులను అరణ్యవాసానికి పంపడం - ఇవన్నీ సభాపర్వంలో వర్ణించాడు వ్యాసమహర్షి. (140)
అధ్యాయాస్సప్తతిర్ జ్ఞేయాః తథా చాష్టౌ ప్రసంఖ్యయా ।
శ్లోకానాం ద్వే సహస్రే తు పంచ శ్లోకశతాని చ ॥ 141
శ్లోకాశ్చైకాదశా జ్ఞేయాః పర్వణ్యస్మిన్ ద్విజోత్తమాః ।
అతః పరం తృతీయం తు జ్ఞేయమారణ్యకం మహత్ ॥ 142
డెబ్బది ఎనిమిది (78) అధ్యాయాలు - రెండువేల అయిదు వందల పదకొండు (2511) శ్లోకాలు సభాపర్వంలో ఉన్నాయి. ఇక మూడవ పర్వం ఆరణ్యపర్వం. (141,142)
వనవాసం ప్రయాతేషు పాండవేషు మహాత్మసు ।
పౌరానుగమనం చైవ ధర్మపుత్రస్య ధీమతః ॥ 143
అన్నౌషధీనాం చ కృతే పాండవేన మహాత్మనా ।
ద్విజానాం భరణార్థం చ కృతమారాధనం రవేః ॥ 144
పాండవులు వనవాసానికి బయలుదేరడం, ధీమంతుడయిన ధర్మరాజును పౌరులు అనుసరించి రావడం, బ్రాహ్మణులను అన్నౌషధులతో పోషించటానికి ధర్మరాజు సూర్యుని ఆరాధించటం. (143,144)
ధౌమ్యోపదేశాత్ తిగ్మాంశు ప్రసాదాదన్నసంభవః ।
హితం బ్రువతః క్షత్తుః పరిత్యాగోఽంబికాసుతాత్ ॥ 145
త్యక్తస్య పాండుపుత్రాణాం సమీపగమనం త్థా ।
పునరాగమనం చైవ ధృతరాష్ట్రస్య శాసనాత్ ॥ 146
కర్ణప్రోత్సాహనాచ్చైవ ధార్తరాష్ట్రస్య దుర్మతేః ।
వనస్థాన్ పాండవాన్ హంతుం మంత్రో దుర్యోధనస్య చ ॥ 147
ధౌమ్యుని ఉపదేశంతో, సూర్యుని అనుగ్రహంతో అక్షయపాత్ర ద్వారా అన్నం సంభవించడం - ధృతరాష్ట్రుడు హితముపదేశించే విదురుని పాండవుల కడకు పొమ్మనడం, అతడు పాండవుల కడకు వెళ్లడం, మళ్లీ ధృతరాష్ట్రుని ఆజ్ఞతో వెనుకకు రావడం, కర్ణుని ప్రోత్సాహంతో దుర్మార్గుడయిన దుర్యోధనుడు అరణ్యంలో ఉన్న పాండవులను చంపటానికి కుట్ర పన్నడం. (145-147)
తం దుష్టభావం విజ్ఞాయ వ్యాసస్యాగమనం ద్రుతమ్ ।
నిర్యాణప్రతిషేధశ్చ సురభ్యాఖ్యానమేవ చ ॥ 148
ఆ దుష్టభావం తెలిసి వెంటనే వ్యాసమహర్షి రావడం, అతడు ఆ పని చేయవద్దని చెప్పడం, సురభి వృత్తాంతం చెప్పడం. (148)
మైత్రేయాగమనం చాత్ర రాజ్ఞశ్చైవానుశాసనమ్ ।
శాపోత్సర్గశ్చ తేనైవ రాజ్ఞో దుర్యోధనస్య చ ॥ 149
మైత్రేయ మహర్షి వచ్చి దుర్యోధనునకు హితం చెప్పడం. అతడే దుర్యోధనునకు శాపమివ్వడం. (149)
కిర్మీరస్య వధశ్చాత్ర భీమసేనేన సంయుగే ।
వృష్ణీనామాగమశ్చాత్ర పంచాలానాం చ సర్వశః ॥ 150
భీమసేనుడు యుద్ధంలో కిర్మీరుడనే రాక్షసుని చంపడం - వృష్ణివంశస్థులూ, పాంచాలురూ పాండవులను చూడటానికి రావడం- (150)
శ్రుత్వా శకునినా ద్యూతే నికృత్యా నిర్జితాంశ్చ తాన్ ।
క్రుద్ధస్యానుప్రశమనం హరేశ్చైవ కిరీటినా ॥ 151
శకుని మోసంతో ద్యూతంలో ఓడించాడని విని శ్రీకృష్ణుడు కోపించడం, అర్జునుడు శాంతింపజేయడం. (151)
పరిదేవనం చ పాంచాల్యాః వాసుదేవస్య సంనిధౌ।
ఆశ్వాసనం చ కృష్ణేన దుఃఖార్తాయాః ప్రకీర్తితమ్ ॥ 152
కృష్ణుని ఎదుట ద్రౌపది విలపించడం, కృష్ణుడు ఓదార్చడం ఇవన్నీ కీర్తింపబడినవి. (152)
తథా సౌంభవధాఖ్యానమ్ అత్రైవోక్తం మహర్షిణా ।
సుభద్రాయాః సపుత్టాయాః కృష్ణేన ద్వారకాం పురీమ్ ॥ 153
నయనం ద్రౌపదేయానాం ధృష్టద్యుమ్నేన చైవ హ ।
ప్రవేశః పాండవేయానాం రమ్యే ద్వైతవనే తతః ॥ 154
ఇందులోనే వ్యాసుడు సౌంభవధను గురించి చెప్పాడు - పుత్రునితో సహా సుభద్రను కృష్ణుడు ద్వారకా పురికి తీసుకొని వెళ్లడం, పాండవులు రమ్యమయిన ద్వైతవనం ప్రవేశించటం. (153,154)
ధర్మరాజస్య చాత్రైవ సంవాదః కృష్ణయా సహ ।
సంవాదశ్చ తథా రాజ్ఞా భీమస్యాపి ప్రకీర్తితః ॥ 155
ద్రౌపదీ ధర్మరాజుల సంవాదం, అలాగే భీమధర్మరాజుల సంవాదమూ ఇందులోనే ఉన్నాయి. (155)
సమీపం పాండుపుత్రాణాం వ్యాసస్యాగమనం తథా ।
ప్రతిస్మృత్యాథ విద్యాయాః దానం రాజ్ఞో మహర్షిణా ॥ 156
వ్యాసుడు పాండవుల దగ్గరకు రావడం, ధర్మరాజుకు వ్యాసమహర్షి ప్రతిస్మృతివిద్యను ఉపదేశించడం. (156)
గమనం కామ్యకే చాపి వ్యాసే ప్రతిగతే తతః ।
అస్త్రహేతోర్వివాసశ్చ పార్థస్యామితతేజసః ॥ 157
వ్యాసమహర్షి వెళ్లాక పాండవులు కామ్యాక వనానికి వెళ్లడం, అమిత తేజస్వి అయిన పార్థుడు అస్త్ర సంపాదన కోసం వెళ్లడం- (157)
మహాదేవేన యుద్ధం చ కిరాతవపుషా సహ ।
దర్శనం లోకపాలానామ్ అస్త్రప్రాప్తిస్తథైవ చ ॥ 158
కిరాతరూపుడయిన మహేశ్వరునితో అర్జునుడు యుద్ధం చేయడం, లోక పాలుర దర్శనం, అస్త్రాలు లభించడం. (158)
మహేంద్రలోకగమనమ్ అస్త్రార్థే చ కిరీటినా ।
యత్ర చింతా సముత్పన్నా ధృతరాష్ట్రస్య భూయసీ ॥ 159
అస్త్రాల కోసం అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్లడం, ఈ విషయం విని ధృతరాష్ట్రుడు చాలా విచారించడం. (159)
దర్శనం బృహద్శ్వస్య మహర్షేర్భావితాత్మనః ।
యుథిష్ఠిరస్య చార్తస్య వ్యసనం పరిదేవనమ్ ॥ 160
బృహదశ్వుడనే మహర్షి ధర్మరాజు దగ్గరకు రావడం, యుధిష్ఠిరుడు తన కష్టం చెప్పుకోవడం- (160)
నలోపాఖ్యానమత్రైవ ధర్మిష్ఠం కరుణోదయమ్ ।
దమయంత్యాః స్థితిర్యత్ర నలస్య చరితం తథా ॥ 161
కరుణ స్ఫోరకమయిన నలోపాఖ్యానం ఈ సందర్భంలోనే చెప్పబడింది. నలదమయంతుల చరిత్ర- (161)
తథాక్షహృదయప్రాప్తిః తస్మాదేవ మహర్షితః ।
లోమశస్యాగమస్తత్ర స్వర్గాత్ పాండుసుతాన్ ప్రతి ॥ 162
వనవాసగతానాం చ పాండవానాం మహాత్మనామ్ ।
స్వర్గే ప్రవృత్తి రాఖ్యాతా లోమశేనార్జునస్య వై ॥ 163
ఆ మహర్షివల్ల ధర్మరాజు అక్షహృదయం పొండటం, స్వర్గం నుండి లోమశమహర్షి పాండవులకడకు రావడం, అర్జునుని గురించి స్వర్గంలో జరిగిన విశేషాలన్నీ అతడు చెప్పడం. (162,163)
సందేశాదర్జునస్యాత్ర తీర్థాభిగమనక్రియా ।
తీర్థానాం చ ఫలప్రాప్తిః పుణ్యత్వం చాపి కీర్తితమ్ ॥ 164
అర్జునుని సందేశంతో ధర్మజుడు తీర్థాభిగమనం చేయడం - తీర్థసేవనంతో పుణ్య పుణ్యఫలప్రాప్తి ఇందులో కీర్తింపబడినవి. (164)
పులస్త్య తీర్థయాత్రా చ నారదేవ మహర్షిణా ।
తీర్థయాత్రా చ తత్రైవ పాండవానాం మహాత్మనామ్ ॥ 165
కర్ణస్య పరిమోక్షోఽత్ర కుండలాభ్యాం పురందరాత్ ।
తథా యజ్ఞవిభూతిశ్చ గయస్యాత్ర ప్రకీర్తితా ॥ 166
నారదమహర్షి పులస్త్య తీర్థానికి వెళ్లమని ప్రోత్సహించడం- పాండవులు వెళ్లడం, ఇంద్రుడు కర్ణుని కుండలాలు గ్రహించడం, గయుని యజ్ఞ వైభవమూ ఇక్కడ కీర్తింపబడ్డాయి. (165,166)
ఆగస్త్యమపి చాఖ్యానం యత్ర వాతాపిభక్షణమ్ ।
లోపాముద్రాభిగమనమ్ అపత్యార్థం ఋషేస్తథా ॥ 167
ఆగస్త్యవృత్తాంతం, వాతాపిని అగస్త్యుడు భక్షించడం, సంతానంకోసం అగస్త్యుడు లోపాముద్రను వివాహమాడటం. (167)
ఋష్యశృంగస్య చరితం కౌమారబ్రహ్మచారిణః ।
జామదగ్న్యస్య రామస్య చరితం భూరితేజసః ॥ 168
తరువాత ఋష్యశృంగుని చరిత్ర, పరశురాముని చరిత్ర. (168)
కార్తవీర్యవధో యత్ర హైహయానాం చ వర్ణ్యతే ।
ప్రభాసతీర్థే పాండూనాం వృష్ణిభిశ్చ సమాగమః ॥ 169
ఇక్కడే కార్తవీర్యుని యొక్క, హైహయుల యొక్క వధ వర్ణింపబడింది- ప్రభాస తీర్థంలో పాండవులు, వృష్ణివంశస్థులూ కలవడం. (169)
సౌకన్యమపి చాఖ్యానం చ్యవనో యత్ర భార్గవః ।
శర్యాతి యజ్ఞే నాసత్యౌ కృతవాన్ సోమపీతినౌ ॥ 170
సుకన్యోపాఖ్యానం, భార్గవుడయిన చ్యవన్ మహర్షి శర్యాతి యొక్క యజ్ఞంలో అశ్వినీకుమారులకు సోమపానం చేసే అధికారం ఇవ్వడం.. (170)
తాభ్యాం చ యత్ర స మునిః యౌవనం ప్రతిపాదితః ।
మాంధాతుశ్చాప్యుపాఖ్యానం రాజోఽత్రైవ ప్రకీర్తితమ్ ॥ 171
వారివల్ల చ్యవనునికి యౌవనం రావడం, మాంధాత చరిత్ర కూడా ఇక్కడే చెప్ప బడింది. (171)
జంతూపాఖ్యాన మత్రైవ యత్ర పుత్రేణ సోమకః ।
పుత్రార్థమజయద్ రాజా లేభే పుత్రశతం చ సః ॥ 172
ఇక్కడే జంతూపాఖ్యానం చెప్పాడు - ఇందులో సోమకుడు తన పుత్రుని చేత పుత్రునికోసం యజ్ఞం చేయిస్తే అతనికి నూర్గురు పుత్రులు కలిగారు. (172)
తతః శ్యేనకపోతీయమ్ ఉపాఖ్యానమనుత్తమమ్ ।
ఇంద్రాగ్నీయత్ర ధర్మస్య జిజ్ఞాసార్థం శిబిం నృపమ్ ॥ 173
తరువాత శ్యేనకపోతీయమనే ఉపాఖ్యానం. ఇందులోనే ఇంద్రుడూ, అగ్నీ శిబిని పరీక్షించడం కోసం వచ్చారు. (173)
అష్టావక్రీయ మత్రైవ వివాదో యత్ర బందినా ।
అష్టావక్రస్య విప్రర్షేః జనకస్యాధ్యరేఽభవత్ ॥ 174
నైయాయికానాం ముఖ్యేన వరుణస్యాత్మజేన చ ।
పరాజితో యత్ర బందీ వివాదేన మహాత్మనా ॥ 175
విజిత్య సాగరం ప్రాప్తం పితరం లబ్ధవాన్ ఋషిః ।
యవక్రీతస్య చాఖ్యానం రైభ్యస్య చ మహాత్మనః ।
గంధమాదవ యాత్రా చ వాసో నారాయణాశ్రమే ॥ 176
ఈ పర్వంలోనే అష్టావక్రుని చరిత్ర వస్తుంది. జనకుని యజ్ఞంలో అష్టావక్రునికి బందితో వివాదం వచ్చింది. ఆ బంది నైయాయికులలో ముఖ్యుడు - వరుణుని కుమారుడు - ఈ వివాదంలో అష్టావక్రుడు బందిని ఓడించాడు. జయించి సాగరంలో ప్రవేశించిన తన తండ్రిని అష్టావక్రుడు పొందాడు - దీని తరువాత యవక్రీతుని చరిత్ర, రైభ్యుని చరిత్ర వస్తాయి- పాండవులు గంధమాదవ పర్వతానికి వెళ్లడం అక్కడ నారాయణాశ్రమంలో ఉండటం. (174-176)
నియుక్తో భీమసేనశ్చ ద్రౌపద్యా గంధమాదవే ।
వ్రజన్ పథి మహాబాహుః దృష్టవాన్ పవనాత్మజమ్ ॥ 177
కదలీఖండమధ్యస్థం హనూమంతం మహాబలమ్ ।
యత్రసౌగంధికారేఽసౌ నళినీం తామధర్షయత్ ॥ 178
ద్రౌపది అడిగితే భీముడు గంధమాదన పర్వతానికి వెళ్లడం, త్రోవలో అరటీవనంలో పవనాత్మజుడయిన హనుమంతుని చూడటం- అక్కడ సౌగంధిక కమలాల కోసం ఆ సరస్సును కలత పెట్టడం. (177,178)
యత్రాస్య యుద్ధమభవత్ సుమహద్రాక్షసైః సహ ।
యక్షైశ్పైవ మహావీర్యైః మణిమత్ర్పముఖైస్తథా ॥ 179
అక్కడే భీమునికి, యక్ష రాక్షసులతోను, మణిమంతుడు మొదలయిన వారితో యుద్ధం జరగడం.. (179)
జటాసురస్య చ వధః రాక్షసస్య వృకోదరాత్ ।
వృషపర్వణశ్చ రాజర్షేః తతోఽభిగమనం వాస ఏవ చ ।
ప్రోత్సాహనం చ పాంచాల్యా భీమస్యాత్ర మహాత్మనః ॥ 181
కైలాసారోహణం ప్రోక్తం యత్ర యక్షైర్బలోత్కటైః ।
యుద్ధమాసీన్మహాఘోరం మణిమత్ర్పముఖైః సహ ॥ 182
తరువాత భీముడు జటాసురుని వధించడం, వృషపర్వుడనే రాజర్షిరావడం, ఆర్షిషేణాశ్రమానికి పాండవులు వెళ్లడం, అక్కడ నివాసం, అక్కడ ద్రౌపది భీముని కైలాస పర్వతారోహణానికి ప్రోత్సహించడం, అక్కడ బలవంతు లయిన మణిమంతుడు మొదలయిన వారితో ఘోరమయిన యుద్ధం జరగటం.. (180-182)
సమాగమశ్చ పాండూనాం యత్ర వైశ్రవణేన చ ।
సమాగమశ్చార్జునస్య తత్రైవ భ్రాతృభిస్సహః ॥ 183
అక్కడే పాండవులు కుబేరుని కలుసుకోవటం, అర్జునుడు తన సోదరులను అక్కడే కలవటం.. (183)
అవాప్య దివ్యాన్యస్త్రాణి గుర్వర్థం సవ్యసాచినా ।
నివాతకవచైర్యుద్ధం హిరణ్యపురవాసిభిః ॥ 184
దివ్యాస్త్రాలు పొంది అర్జునుడు ఇంద్రునికోసం హిరణ్యపురవాసులయిన నివాతకవచులతో యుద్ధం చేయటం.. (184)
నివాతకవచైర్ఘోరైః దానవైః సురశత్రుభిః ।
పౌలోమైః కాలకేయైశ్చ యత్ర యుద్ధం కిరీటినః ॥ 185
వధశ్పైషాం సమాఖ్యాతః రాజ్ఞస్తేనైవ ధీమతా ।
అస్త్రసందర్శనారంభః ధర్మరాజస్య సన్నిధౌ ॥ 186
నివాతకవచులతోను, పౌలోమ కాలకేయులతోను అర్జునుని యుద్ధం, వారిని అర్జునుడు వధించడం - ఇదంతా అర్జునుడు ధర్మరాజుతో చెప్పడం - ధర్మరాజు దగ్గర అర్జునుడు తన దివ్యాస్త్రాలను ప్రయోగించి చూపించాలనుకోవటం... (185,186)
పార్థస్య ప్రతిషేధశ్చ నారదేవ సురర్షిణా ।
అవరోహణం పునశ్చైవా పాండూనాం గంథమాదనాత్ ॥ 187
నారదుడు వచ్చి అట్లా ప్రయోగించరాదని వారించడం - తరువాత పాండవులు గంధమాదన పర్వతం దిగడం. (187)
భీమస్య గ్రహణం చాత్ర పర్వతాభోగవర్ష్మణా ।
భుజగేంద్రేణ బలినా తస్మిన్ సుగహనే వనే ॥ 188
పర్వతమంత పెద్ద శరీరమున్న పాము వనంలో భీముని పట్టుకోవడం... (188)
అమోక్షయద్ యత్ర చైనం ప్రశ్నానుక్త్యా యుధిష్ఠిరః ।
కామ్యకాగమనం చైవ పునస్తేషాం మహాత్మనామ్ ॥ 189
అపుడు ధర్మరాజు వాని ప్రశ్నలకు సమాధానం చెప్పి భీముని విడిపించడం.. మళ్లీ పాండవులు కామ్యకవనం చేరడం.. (189)
తత్రస్థాంశ్చ పునర్ధ్రష్టుం పాండవాన్ పురుషర్షభాన్ ।
వాసుదేవస్యాగమనమ్ అత్రైవ పరికీర్తితమ్ ॥ 190
అక్కడున్న పాండవులను చూడటానికి మళ్లీ కృష్ణుడు రావడం కూడా ఇక్కడే వర్ణింపబడింది. (190)
మార్కండేయ సమాస్యాయామ్ ఉపాఖ్యానాని సర్వశః ।
పృథోర్వైన్యస్య యత్రోక్తమ్ ఆఖ్యానం పరమర్షిణా ॥ 191
మార్కండేయమహర్షి రావడం - అతడు వచ్చి పృథుచరిత్ర, వైన్యుని చరిత్ర మొదలయినవి చెప్పడం. (191)
సంవాదశ్చ సరస్వత్యాః తార్ క్ష్యర్షేః సుమహాత్మనః ।
మత్స్యోపాఖ్యానమత్రైవ ప్రోచ్యతే తదనంతరమ్ ॥ 192
ఈ సందర్భంలోనే తార్ క్ష్య మహర్షికి సరస్వతికి జరిగిన సంవాదమూ, మత్స్యోపాఖ్యానమూ కూడా చెప్పబడ్డాయి. (192)
మార్కండేయసమాస్యా చ పురాణం పరికీర్త్యతే ।
ఐంద్రద్యుమ్నముపాఖ్యానం ధౌంధుమారం తథైవ చ ॥ 193
ఈ మార్కండేయ సమాగమంలోనే చాలా పూర్వకథలు.... ఇంద్రద్యుమ్నుని చరిత్ర, ధుంధుమారుని చరిత్ర... (193)
పతివ్రతాయాశ్చాఖ్యానం తథైవాంగిరసం స్మృతమ్ ।
ద్రౌపద్యాః కీర్తితశ్చాత్ర సంవాదః సత్యభామయా ॥ 194
పతివ్రతచరిత్ర, అంగిరసుని చరిత్ర, ద్రౌపదీ సత్యభామల సంవాదమూ.. వర్ణింపబడ్డాయి. (194)
పునర్ద్వైతవనం చైవ పాండవాః సముపాగతాః ।
ఘోషయాత్రా చ గంధర్వైః యత్ర బద్ధః సుయోధనః ॥ 195
తరువాత పాండవులు మళ్లీ ద్వైతవనం చేరడం, ఘోషయాత్ర, అందులోనే దుర్యోధనుడు గంధర్వుల చేత బంధింపబడటం... (195)
హ్రియమానస్తు మందాత్మా మోక్షితోఽసౌ కిరీటినా ।
ధర్మరాజస్య చాత్రైవ మృగస్వప్ననిదర్శనమ్ ॥ 196
మందబుద్ధియైన దుర్యోధనుడు సిగ్గుపడుతూ అర్జునుని చేత విడిపింపబడటం.. ధర్మరాజుకు కలలో మృగాలు కనిపించడం... (196)
కామ్యకే కానవశ్ఱేష్ఠే పునర్గమనముచ్యతే ।
వ్రీహిద్రౌణికమాఖ్యానమ్ అత్రైవ బహువిస్తరమ్ ॥ 197
మళ్లీ కామ్యకవనానికి పాండవులు చేరడం, ఎంతో విస్తారంగా వ్రీహిద్రోణాఖ్యానం చెప్పడం.. (197)
దుర్వాససోఽప్యుపాఖ్యానమ్ అత్రైవ పరికీర్తితమ్ ।
జయద్రథేనాపహారః ద్రౌపద్యాశ్చాశ్రమాంతరాత్ ॥ 198
దుర్వాసుని ఉపాఖ్యానం కూడా ఇక్కడే చెప్పబడింది. ఆశ్రమం నుండి ద్రౌపదిని జయద్రథుడు అపహరించడం. (198)
యత్రైనమన్వయాద్ భీమః వాయువేగసమో జవే ।
చక్రే చైనం పంచశిఖం యత్ర భీమో మహాబలః ॥ 199
వాయువేగంతో భీముడు సైంధవుని వెంటాడటం, మహాబలుడయిన భీముడు సైంధవునికి పంచశిఖలు పెట్టడం.. ఇందులోనే ఉన్నాయి. (199)
రామాయణముపాఖ్యానమ్ అత్రైవ బహువిస్తరమ్ ।
యత్ర రామేణ విక్రమ్య నిహతో రావణో యుధి ॥ 200
రామాయణం కూడ ఇక్కడ చెప్పబడింది. రాముడు పరాక్రమించి యుద్ధంలో రావణుని చంపడం విస్తారంగా చెప్పబడింది. (200)
సావిత్ర్యాశ్చాప్యుపాఖ్యానమ్ అత్రైవ పరికీర్తితమ్ ।
కర్ణస్య పరిమోక్షోఽత్ర కుండలాభ్యాం పురందరాత్ ॥ 201
ఇక్కడే సావిత్రి చరిత్ర చెప్పబడింది. కర్ణుని కుండలాలను ఇంద్రుడు గర్హించడం... (201)
యత్రాస్య శక్తిం తుష్ణోఽసౌ అదాదేకవధాయ చ ।
ఆరణేయముపాఖ్యానం యత్రధర్మోఽన్వశాత్ సుతమ్ ॥ 202
ఒకనిని చంపగల శక్తిని కర్ణుడు ఇంద్రుని నుండి గ్రహించడం. ఆరణేయోపాఖ్యానం తరువాతిది. ఇందులో యమధర్మరాజు ధర్మరాజుకు ధర్మశిక్ష చేశాడు. (202)
జగ్ముర్లబ్ధవరా యత్ర పాండవాః పశ్చిమాం దిశమ్ ।
ఏతదారణ్యకం పర్వ తృతీయం పరికీర్తితమ్ ॥ 203
అత్రాధ్యాయశతే ద్వేతు సంఖ్యయా పరికీర్తితే ।
ఏకోనసప్తతిశ్చైవ తథాధ్యాయాః ప్రకీర్తితాః ॥ 204
పాండవులు యమధర్మరాజు నుండి వరాలు పొంది పశ్చిమ దిక్కుకు వెళ్లారు - ఇదంతా ఆరణ్యపర్వమని మూడవ పర్వం చెప్పబడింది. ఇందులో రెండువందల అరువది తొమ్మిది (269) అధ్యాయాలు ఉన్నాయి. (203,204)
ఏకాదశసహస్రాణి శ్లోకానాం షట్ శతాని చ ।
చతుష్షష్టిస్తథా శ్లోకాః పర్వణ్యస్మిన్ ప్రకీర్తితాః ॥ 205
ఈ పర్వంలో పదకొండు వేల ఆరువందల్ అరవైనాలుగు (11664) శ్లోకా లున్నాయి. (205)
అతః పరం నిబోధేదం వైరాటం పర్వ విస్తరమ్ ।
విరాటనగరే గత్వా శ్మశానే విపులాం శమీమ్ ॥ 206
దృష్ట్వా సంనిదధుస్తత్ర పాండవా హ్యాయుధాన్యుత ।
యత్ర ప్రవిస్తు తే ॥ 207
తరువాతిది విరాట పర్వం - పాండవులు విరాట నగరానికి వెళ్లి శ్మశానంలోని శమీవృక్షాన్ని చూసి అక్కడ తమ ఆయుధాలు దాచుకొన్నారు. నగరంలో ప్రవేశించి రహస్యంగా పాండవులు నివసించసాగారు. (206,207)
పాంచాలీం ప్రార్థయానస్య కామోపహతచేతసః ।
దుష్టాత్మనో వధో యత్ర కీచకస్య వృకోదరాత్ ॥ 208
కామోపహత చేతస్కుడయి పాంచాలిని అడిగిన దుష్టాత్ముడయిన కీచకుని ఇక్కడే భీముడు సంహరించాడు. (208)
పాండవాన్వేషణార్థం చ రాజ్ఞో దుర్యోధనస్య చ ।
చారాః ప్రస్థాపితాశ్చాత్ర నిపుణాః సర్వతోదిశమ్ ॥ 209
పాండవులను అన్వేషించటానికి దుర్యోధనుని గూఢచారులు అన్ని దిక్కులకూ పంపబడ్డారు. (209)
న చ ప్రవృత్తిస్తైర్లబ్థా పాండవానాం మహాత్మనామ్ ।
గోగ్రహశ్చ విరాటస్య త్రిగర్తైః ప్రథమం కృతః ॥ 210
కాని పాండవుల జాడ వారికి తెలియలేదు - త్రిగర్తుల చేత విరాటుని గోవులు ముందుగా గ్రహింపబడినవి. (210)
యత్రాస్య యుద్ధం సుమహత్ తైరాసీల్లోమహర్షణమ్ ।
హ్రియమాణశ్చ యత్రాసా భీమసేనేన మోక్షితః ॥ 211
అక్కడే త్రిగర్తులతో ఒళ్లు గగుర్పొడిచే యుద్ధం జరిగింది. అందులో పట్టుబడిన విరాటుని భీమసేనుడే విడిపించాడు. (211)
గోధనం చ విరాటస్య మోక్షితం యత్ర పాండవైః ।
అనంతరం చ కురుభిః తస్య గోగ్రహణం కృతమ్ ॥ 212
విరాటుని గోధనమంతా పాండవులే విడిపించారు. ఇది దక్షిణ గోగ్రహణం. ఇక తరువాత కౌరవులు ఉత్తర గోగ్రహణం చేశారు. (212)
సమస్తా యత్ర పార్థేన నిర్జితాః కురవో యుధి ।
ప్రత్యాహృతం గోధనం చ విక్రమేణ కిరీటినా ॥ 213
అందులో కౌరవులందరినీ జయించి అర్జునుడు విరాటుని గోవులను విడిపించాడు. (213)
విరాటేనోత్తరా దత్తా స్నుషా యత్ర కిరీటినః ।
అభిమన్యుం సముద్దిశ్య సౌభద్రమరిఘాతినమ్ ॥ 214
అపుడే విరాటుడు తన పుత్రిక ఉత్తరను అర్జునునికి ఇస్తానంటే అర్జునుడు అభిమన్యునికి చేసుకొన్నాడు. (214)
చతుర్థమేతద్ విపులం నైరాటం పర్వ వర్ణితమ్ ।
అత్రాపి పరిసంఖ్యాతా అధ్యాయాః పరమర్షిణా ॥ 215
సప్తషష్టిరథో పూర్ణా శ్లోకానామపి మే శృణు ।
శ్లోకానాం ద్వే సహస్రే తు శ్లోకాః పంచాశాదేవ తు ॥ 216
ఉక్తాని వేదవిదుషా పర్వణ్యస్మిన్ మహర్షిణా ।
ఉద్యోగపర్వ విజ్ఞేయం పంచమం శృణ్వతః పరమ్ ॥ 217
ఇది నాలుగవది - విరాట పర్వం. ఇందులో 67 (అరువది ఏడు) అధ్యాయాలు - 2050 (రెండు వేల ఏబది శ్లోకాలు) ఉన్నాయి - తరువాత వినవలసినది ఉద్యోగపర్వం. (215-217)
ఉపప్లవ్యే నివిష్టేషు పాండవేషు జిగీషయా ।
దుర్యోధనోఽర్జునశ్చైవ వాసుదేవముపస్థితౌ ॥ 218
పాండవులు ఉపప్లవ్యంలో ఉండగా యుద్ధంలో జయం పొందాలని దుర్యోధనుడూ, అర్జునుడూ శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్లారు. (218)
సాహాయ్యమస్మిన్ సమరే భవాన్ నౌ కర్తుమర్హతి ।
ఇత్యుకే వచనే కృష్ణ యత్రోవాచ మహామతిః ॥ 219
రాబోయే యుద్ధంలో మీరు మాకు సహాయం చెయ్యాలని అడిగారు ఇద్దరూ. అపుడా మహామతి అయిన శ్రీకృష్ణుని ఇలా ఆన్నాడు. (219)
అయుధ్యమానమాత్మానం మంత్రిణం పురుషర్షభౌ ।
అక్షౌహిణీం వా సైన్యస్య కస్య కిం వా దదామ్యహమ్ ॥ 220
"నేను యుద్ధం చేయకుండా కేవలం సలహా మాత్రం చెపుతాను. నా సైన్యం అక్షౌహిణి ఉంది. ఏది మీకు కావాలో కోరుకొనండి" అన్నాడు. (220)
వవ్రే దుర్యోధనః సైన్యం మందాత్మా యత్ర దుర్మతిః ।
అయుధ్యమానం సచివం వవ్రే కృష్ణం ధనంజయః ॥ 221
అపుడు మందబుధి, దుర్మార్గుడు అయిన దుర్యోధనుడు సైన్యం కోరుకున్నాడు. యుద్ధం చెయ్యని కృష్ణుని అర్జునుడు మంత్రిగా కోరుకున్నాడు. (221)
మద్రరాజం చ రాజానమ్ ఆయాంతం పాండవాన్ ప్రతి ।
ఉపహారైర్వంచయిత్వా వర్త్మాన్యేవ సుయోధనః ॥ 222
వరదం తం వరం వవ్రే సాహాయ్యం క్రియతాం మమ ।
శల్యస్తస్మై ప్రతిశ్రుత్య జగామోద్దిశ్య పాండవాన్ ॥ 223
శాంతిపూర్వం చాకథయత్ యథేంద్రవిజయం నృపః ।
పురోహితప్రేషణం చ పాండవైః కౌరవాన్ ప్రతి ॥ 224
పాండవుల దగ్గరకు వస్తున్న మద్రరాజయిన్ శల్యుని దుర్యోధనుడు మార్గంలో సౌకర్యాలు కల్పించి మోసగించి శల్యుని నుండి సాహాయ్యం చేస్తానని వరం తీసికొన్నాడు. తరువాత పాండవులను చూడటానికి పాండవుల దగ్గరకు వచ్చాడు. అచ్చట ధర్మరాజును ఓదారుస్తూ ఇంద్ర విజయం కథ చెప్పాడు. ఆ తరువాత కౌరవుల దగ్గరకు పాండవులు ద్రుపద పురోహితుని పంపారు. (222-224)
వైచిత్రవీర్యస్య వచః సమాదాయ పురోధసః ।
తథేంద్రవిజయం చాపి యానం చైవ పురోధసః ॥ 225
సంజయం ప్రేషయామాస శమార్థీ పాండవాన్ ప్రతి ।
యత్ర దూతం మహారాజ ధృతరాష్ట్రః ప్రతాపవాన్ ॥ 226
ఇంద్రవిజయమూ, ద్రుపదపురోహితుని త్రిప్పి పంపడమూ అయిన తరువాత ధృతరాష్ట్రుడు పాండవుల దగ్గరకు శాంతిని కోరి సంజయుని దూతగా పంపాడు. (225,226)
శ్రుత్వా చ పాండవాన్ యత్ర వాసుదేవ పురోగమాన్ ।
ప్రజాగరః సంప్రజజ్ఞే ధృతరాష్ట్రస్య చింతౌఆ ॥ 227
విదురో యత్ర వాక్యాని విచిత్రాణి హితాని చ ।
శ్రావయామాస రాజానం ధృతరాష్ట్రం మనీషిణమ్ ॥ 228
వాసుదేవునితో సహా పాండవుల అభిప్రాయాలు తెలిసికొని సంజయుడు తిరిగి వచ్చాడు. దానితో ధృతరాష్ట్రునికి చింత ఏర్పడింది - నిద్రపట్టలేదు. విదురుడు వచ్చి చాలా నీతులు ధృతరాష్ట్రునికి వినిపించాడు. (227,228)
తథా సవత్సుజాతేన యత్రాధ్యాత్మమనుత్తమమ్ ।
మనస్తాపాన్వితో రాజా శ్రావితః శోకలాలసః ॥ 229
తరువాత సనత్సుజాతుడు వచ్చి మనస్తాపంతో నిండిన ధృతరాష్ట్రునికి అధ్యాత్మ విషయాలు చెప్పాడు. (229)
ప్రభాతే రాజసమితౌ సంజయో యత్ర వా విభోః ।
ఐకాత్మ్యం వాసుదేవస్య ప్రోక్తవానర్జునస్య చ ॥ 230
తెల్లవారింది - సంజయుడు రాజసభలో కృష్ణార్జునుల ఏకాత్మతను, అభిప్రాయాలను చెప్పాడు. (230)
యత్ర కృష్ణొ దయాపన్నః సంధిమిచ్ఛన్ మహామతిః ।
స్వయమాగాత్ శమం కర్తుం నగరం నాగసాహ్వయమ్ ॥ 231
దయాస్వభావంతో సంధిని కోరుతూ మహాధీశాలి అయిన శ్రీకృష్ణుడు స్వయంగా రాయబారానికి హస్తినాపురం వెళ్లాడు. (231)
ప్రత్యాఖ్యానం చ కృష్ణస్య రాజ్ఞా దుర్యోధనేన వై ।
శమార్థే యాచమానస్య పక్షయోరుభయోర్హితమ్ ॥ 232
సంధిని కోరి ఉభయపక్షాలకూ హితం చెప్పే కృష్ణుని మాటలను దుర్యోధనుడు తిరస్కరించాడు. (232)
దంభోద్భవస్య చాఖ్యానం అత్రైవ పరికీర్తితమ్ ।
పరాన్వేషణమత్రైవ మాతలేశ్చ మహాత్మనః ॥ 233
అపుడే గర్వితుడయిన దంభోద్భవుని వృత్తాంతం చెప్పబడింది. మాతలి వరాన్వేషణం చేయడం కూడా ఇక్కడే చెప్పబడింది. (233)
మహర్షేశ్చాపి చరితం కథితం గాలవస్య వై ।
విదులాయాశ్చ పుత్రస్య ప్రోక్తం చాప్యనుశాసనమ్ ॥ 234
గాలవ మహర్షి యొక్క చరిత్ర, విదుల తన కొడుకును యుద్ధానికి ప్రేరేపించడమూ చెప్పబడ్డాయి. (234)
కర్ణదుర్యోధనాదీనాం దుష్టం విజ్ఞాయ మంత్రితమ్ ।
యోగేశ్వరత్వం కృష్ణేన యత్ర రాజ్ఞాం ప్రదర్శితమ్ ॥ 235
కర్ణదుర్యోదనాదుల దుర్మంత్రం తెలిసికొని కృష్ణుడు తన యోగేశ్వరత్వమూ, విరాట్ స్వరూపమూ ప్రదర్శించాడు. (235)
రథమారోప్య కృష్ణేన యత్ర కర్ణోఽనుమంత్రితః ।
ఉపాయపూర్వం శౌటీర్యాత్ ప్రత్యాఖ్యాతశ్చ తేన సః ॥ 236
కృష్ణుడు కర్ణుని రథమెక్కించుకొని భేదోపాయంతో రహస్యంగా మాట్లాడడమూ, కర్ణుడు తిరస్కరించడమూ ఇందులోనే ఉన్నాయి. (236)
ఆగమ్య హస్తినపురాత్ ఉపప్లవ్యమరిందమః ।
పాండవానాం యథావృత్తం సర్వమాఖ్యాతవాన్ హరిః ॥ 237
కృష్ణుడు హస్తినాపురం నుండి ఉపప్లావ్యానికి తిరిగి వచ్చి పాండవులకు జరిగిన విషయాలన్నీ చెప్పాడు. (237)
తే తస్య వచనం శ్రుత్వా మంత్రయుత్వా చ తద్ధితమ్ ।
సాంగ్రామికం తతః సర్వం సజ్జం చక్రుః పరంతపాః ॥ 238
అతని మాటలు విని పాండవులు ఆలోచించి యుద్ధానికి సిద్ధపడ్డారు. (238)
తతో యుద్ధాయ నిర్యాతాః సరాశ్వరథదంతినః ।
నగరాద్ధాస్తేనపురాత్ బలసంఖ్యానమేవ చ ॥ 239
తరువాత హస్తినాపురం నుండి చతురంగ బలాలూ యుద్ధానికి బయలుదేరడం, ఆ బలాలను లెక్కకట్టడం.. (239)
యత్ర రాజ్ఞా హ్యులూకస్య ప్రేషణం పాండవాన్ ప్రతి ।
శ్వో భావిని మహాయుద్ధే దౌత్యేన కృతవాన్ ప్రభుః ॥ 240
"రేపు యుద్ధం, సిద్ధంగా ఉండండి" అంటూ దుర్యోధనుడు ఉలూకుని పాండవుల కడకు పంపడం... (240)
రథాతిరథసంఖ్యానమ్ అంబోపాఖ్యానమేవచ ।
ఏతత్ సుబహువృత్తాంతం పంచమం పర్వ భారతే ॥ 241
ఉభయసైన్యాలలోను రథాతిరథులను పరిగణించడం, అంబోపాఖ్యానం... ఇలా చాలా వృత్తాంతాలతో కూడిన అయిదవ పర్వం ఉద్యోగపర్వం. (241)
ఉద్యోగపర్వనిర్దిష్టం సంధివిగ్రహమిశ్రితమ్ ।
అధ్యాయానాం శతం ప్రోక్తం షడశీతిర్మహర్షిణా ॥ 242
శ్లోకానాం షట్సహస్రాణి తావంత్యేవ శతాని చ ।
శ్లోకాశ్చ నవతిః ప్రోక్తాః తథైవాష్టౌ మహాత్మనా ॥ 243
వ్యాసేనోదారమతినా పర్వణ్యస్మిన్ తపోధనాః ।
సంధి విగ్రహప్రయత్నాలతో కూడిన ఈ ఉద్యోగ పర్వంలో నూట ఎనభై ఆరు అధ్యాయాలు (186), ఆరువేల ఆరువందల తొంబది ఎనిమిది (6,698) శ్లోకాలూ వ్యాసమహర్షి చెప్పాడు. (242,243 1/2)
అతః విచిత్రార్థం భీష్మపర్వ ప్రచక్షతే ॥ 244
జంబూఖండవినిర్మాణం యత్రోక్తం సంజయేన హ ।
యత్ర యౌధిష్ఠిరం సైన్యం విషాదమగమత్ పరమ్ ॥ 245
యత్ర యుద్ధమభూత్ ఘోరం దశాహాని సుదారుణమ్ ।
కశ్మలం యత్ర పార్థస్య వాసుదేవో మహామతిః ॥ 246
మోహజం నాశాయామాస హేతుభీర్మోక్షదర్శిభిః ।
సమీక్ష్యాధోక్షజః క్షిప్రం యుధిష్ఠిరహితే రతః ॥ 247
రథాదాప్లుత్య వేగీన స్వయం కృష్ణ ఉదారధీః ।
ప్రతోదపాణిరాధావత్ భీష్మం హంతుం వ్యపేతభీః ॥ 248
తరువాతిది భీష్మ పర్వం - ఇది చాలా విచిత్రార్థాలతో కూడినది. ముందుగా సంజయుడు జంబూఖండ వినిర్మాణం గురించి చెపుతాడు. తరువాత యుధిష్ఠిరుని సైన్యం విషాదం పొందడం, పదిరోజుల భీష్ముని యుద్ధం చెప్పబడింది. దీనికంటె ముందు అర్జునునికి మోహం ఆవేశించడం, మహాప్రజ్ఞావంతుడయిన వాసుదేవుడు మోక్షోపయోగి హేతువులతో అర్జునుని మోహం పోగొట్టడం, యుద్ధంలో ధర్మజుని హితం కోరి కృష్ణుడు రథం నుండి క్రిందకి దూకి, భీష్ముని చంపడానికి పూనుకొనడం... (244-248)
వాక్యప్రతోదాభిహతః యత్ర కృష్ణేన పాండవః ।
గాండీవధన్వా సమరే సర్వశస్త్రభృతాంవరః ॥ 249
ధనుర్థారులందరిలో శ్ఱేష్ఠుడయిన అర్జునుడు కృష్ణుని మాటల పగ్గాలతో కొట్టబడటమూ. (249)
శిఖండినం పురస్కృత్య యత్ర పార్థో మహాధనుః ।
వినిఘ్నన్ నిశితైర్బాణైః రథాత్ భీష్మమపాతయత్ ॥ 250
శిఖండిని ముందు పెట్టుకొని నిశితమైన బాణాలతో భీష్ముని పడగొట్టడం... (250)
శరతల్పగతశ్పైవ భీష్మో యత్ర బభూవ హ ।
షష్ఠమేతత్ సమాఖ్యాతం భారతే పర్వ విస్త్రృతమ్ ॥ 251
భీష్ముడు అంపశయ్య మీద పడిపోవడం.. ఈ విషయాలతో విస్తరించిన భీష్మపర్వం భారతంలో ఆరవ పర్వం... (251)
అధ్యాయానామ్ శతం ప్రోక్తం తథా సప్తదశాపరే ।
పంచశ్లోకసహస్రాణి సంఖ్యయాష్టౌ శతాని చ ॥ 252
శ్లోకాశ్చ చతురాశీతిః అస్మిన్ పర్వణి కీర్తితాః ।
వ్యాసేన వేదవిదుషా సంఖ్యాతా భీష్మపర్వణి ॥ 253
ఈ భీష్మపర్వంలో నూట పదునెడు (117) అధ్యాయాలూ, అయిదువేల ఎనిమిది వందల ఎనభై నాలుగు (5884) శ్లోకాలూ వ్యాసమహర్షి చెప్పాడు. (252,253)
ద్రోణపర్వ తతశ్చిత్రం బహువృత్తాంతముచ్యతే ।
సైనాపత్యేఽభిషిక్తోఽథ యత్రాచార్యః ప్రతాపవాన్ ॥ 254
తరువాతిది చిత్రమై చాలా కథలతో కూడిన ద్రోణపర్వం - ముందుగా ద్రోణాచార్యుని సైన్యాధ్యక్షునిగా అభిషేకించారు. (254)
దుర్యోధనస్య ప్రీత్యర్థం ప్రతిజజ్ఞే మహాస్త్రవిత్ ।
గ్రహణం ధర్మరాజస్య పాండుపుత్రస్య ధీమతః ॥ 255
దుర్యోధనుని ప్రీతికోసం అస్త్రవేత్త అయిన ద్రోణుడు "ధర్మరాజును పట్టుకొంటా" నని ప్రతిజ్ఞ చేశాడు. (255)
యత్ర సంశప్తకాః పార్థమ్ అపనిన్యుః రణాజిరే ।
భగదత్తో మహారాజః యత్ర శక్రసమో యుధి ॥ 256
సుప్రతీకేన నాగేన స హి శాంతః కిరీటినా ।
ఇందులోనే సంశప్తకులు యుద్ధభూమి నుండి అర్జునుని ప్రక్కకు లాగుకొనిపోయారు. భగదత్తుని, అతని ఏనుగు సుప్రతీకాన్ని అర్జునుడు సంహరించాడు. (256 1/2)
యత్రాభిమన్యుం బహవః జఘ్నురేకం మహారథాః ॥ 257
జయద్రథముఖా బాలం శూరమప్రాప్తయౌవనమ్ ।
జయద్రథుడు మొదలయిన మహారథులంతా కలిపి బాలుడయిన అభిమన్యు నొక్కని చేసి చంపారు. (257 1/2)
హతేఽభిమన్యౌ క్రుద్ధేన యత్ర పార్థేన సంయుగే ॥ 258
అక్షౌహిణీః సస్త హత్వా హతో రాజా జయద్రథః ।
అభిమన్యుడు చనిపోయాక పార్థుడు యుద్ధంలో ఒక్కరోజున ఏడు అక్షౌహిణుల సేననూ, జయద్రథుని చంపాడు. (258 1/2)
యత్ర భీమో మహాబాహుః సాత్యకిశ్చ మహారథః ॥ 259
అన్వేషణార్థం పార్థస్య యుధిష్ఠిరనృపాజ్ఞయా ।
ప్రవిష్టౌ భారతీం సేనాం అప్రధృష్యాం సురైరపి ॥ 260
అదే రోజున ధర్మరాజు ఆజ్ఞతో అర్జునుని వెదకటానికి భీముడూ, సాత్యకి బయలుదేరి దేవతలు కూడా ఎదిరింపలేని భారతసేనను ప్రవేశించారు. (259,260)
సంశస్తకావశేషం చ కృతం నిశ్శేషమాహవే ।
సంశప్తకానాం వీరాణాం కోట్యా నవ మహాత్మనామ్ ॥ 261
కిరీటినాభినిష్క్రమ్య ప్రాపితా యమసాదనమ్ ।
ధృతరాష్ట్రస్య పుత్రాశ్చ తథా పాషాణయోధినః ॥ 262
నారాయణాశ్చ గోపాలాః సమరే చిత్రయోధినః ।
అలంబుషః శ్రుత్వాయుశ్చ జలసంధశ్చ వీర్యవాన్ ॥ 263
సౌమదత్తి ర్విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ।
ఘటోత్కచాదయశ్చాన్యే నిహతా ద్రోణపర్వణి ॥ 264
మిగిలిన సంశప్తకులు తొమ్మిదికోట్ల మందిని అర్జునుడు నిశ్శేషంగా హరించాడు. ధృతరాష్ట్రుని పుత్రులు పాషాణ యోధులు, నారాయణ గోపాలురు, అలంబుషుడు. శ్రుతాయువు, జలసంధుడు, సౌమదత్తి, విరాటుడు, ద్రుపదుడు, ఘటోత్కచుడు మొదలయిన వారంతా ఈ ద్రోణపర్వంలోనే చనిపోయారు. (261-264)
అశ్వత్థామాపి చాత్రైవ ద్రోణే యుధి నిపాతితే ।
అస్త్రం ప్రాదుశ్చకారోగ్రం నారాయణమమర్షితః ॥ 265
ద్రోణుడు చనిపోతే అశ్వత్థామ కోపించి నారాయణాస్త్రం ప్రయోగించాడు. (265)
ఆగ్నేయం కీర్త్యతే యత్ర రుద్రమాహాత్మ్యముత్తతమ్ ।
వ్యాసస్య చాప్యాగమనం మాహాత్మ్యం కృష్ణపార్థయోః ॥ 266
ఆగ్నేయాస్త్ర ప్రయోగం, రుద్రమాహాత్మ్యం, వ్యాసుని రాక, కృష్ణార్జునుల మాహాత్మ్యమూ ఇందే ప్రదర్శితమయ్యాయి. (266)
సప్తమం భారతే పర్వ మహదేతదుదాహృతమ్ ।
యత్ర తే పృథివీపాలాః ప్రాయశో నిధనం గతాః ॥ 267
ద్రోణపర్వణి యే శూరాః నిర్దిష్టాః పురుషర్షభాః ।
అత్రాధ్యాయశతం ప్రోక్తం తథాధ్యాయాశ్చ సప్తతిః ॥ 268
అష్టౌ శ్లోకసహస్రాణి తథా నవ శతానిచ ।
శ్లోకా నవ తథైవాత్ర సంఖ్యాతాస్తత్వదర్శినా ॥ 269
పారాశర్యేణ మునినా సంచింత్య ద్రోణపర్వణి ।
ఏడవదయిన ఈ ద్రోణపర్వంలోనే చెప్పుకోదగిన రాజులంతా చనిపోయారు. ఈ ద్రోణ పర్వంలో నూట డెబ్బది అధ్యాయాలు (170), ఎనిమిది వేల తొమ్మిది వందల తొమ్మిది (8909) శ్లోకాలూ వ్రాశాడు వ్యాసమహర్షి. (267-269 1/2)
అతః పరం కర్ణ పర్వ ప్రోచ్యతే పరమాద్భుతమ్ ॥ 270
సారథ్యే వినియోగశ్చ మద్రరాజస్య ధీమతః ।
ఆఖ్యాతం యత్ర పౌరాణాం త్రిపురస్య నిపాతనమ్ ॥ 271
తరువాత పరమాద్భుతమయిన కర్ణపర్వం చెప్పబడింది. మద్రదేశపు రాజయిన శల్యుని సారథ్యంలో నియోగించడం - త్రిపురాసుర సంహారం. (270,271)
ప్రయాణే పరుషాశ్చాత్ర సంవాదః కర్ణశల్యయోః ।
హంసకాకీయమాఖ్యానం తత్రైవాక్షేపసంహితమ్ ॥ 272
ప్రయాణంలోనే శల్యుడు పరుషంగా మాట్లాడటం, కర్ణశల్యుల సంవాదం, హంసకాకీయోపాఖ్యానం. (272)
వధః పాండ్యస్య చ తథా అశ్వత్థామ్నా మహాత్మనా ।
దండసేనస్య చ తతః దండస్య చ వధస్తధా ॥ 273
అశ్వత్థామ పాండ్యరాజును, దండసేనుని, దండుని సంహరించడం---- (273)
ద్వైరథే యత్ర కర్ణేన ధర్మరాజో ఉధిష్ఠిరః ।
సంశయం గమితో యుద్ధే మిషతాం సర్వధన్వినామ్ ॥ 274
కర్ణునితో ద్వైరథయుద్ధంలో ధర్మరాజుకు అందరూ చూస్తూ ఉండగా ప్రాణసంశయం కలగడం ---- (274)
అన్యోన్యం ప్రతి చ క్రోధః యుధిష్ఠిరకిరీటినోః ।
యత్రైవానునయః ప్రోక్తః మాధవేనార్జునస్య హి ॥ 275
ధర్మరాజుకు అర్జునునకు పరస్పరం కోపం రావడం, అక్కడే కృష్ణుడు అర్జునుని అనునయించడం. (275)
ప్రతిజ్ఞాపూర్వకం చాపి వక్షో దుఃశాసనస్య చ ।
భిత్వా వృకోదరో రక్తం పీతవాన్ యత్ర సంయుగే ॥ 276
దుశ్శాసనుని వక్షఃస్థలం చీల్చి భీముడు యుద్ధంలో రక్తం త్రాగుతానన్న ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడం. (276)
ద్వైరథే యత్ర పార్థేన హతః కర్ణొ మహారథః ।
అష్టమం పర్వ నిర్దిష్టం ఏతత్ భారతచింతకైః ॥ 277
ద్వైరథ యుద్ధంలో కర్ణుడు అర్జునుని చేత చనిపోవడం - ఇట్లా భారతంలో కర్ణపర్వం ఎనిమిదవ పర్వం అయింది. (277)
ఏకోనసప్తతిః ప్రోక్తాః అధ్యాయాః కర్ణపర్వణి ।
చత్వార్యేవ సహస్రాణి నవశ్లోక శతాని చ ॥ 278
చతుష్టష్టిస్తధా శ్లోకాః పర్వణ్యస్మిన్ ప్రకీర్తితాః ।
ఇందులో అరవై తొమ్మిది అధ్యాయాలు (69), నాలుగువేల తొమ్మిది వందల అరవై నాలుగు (4964) శ్లోకాలూ ఉన్నాయి. (278 1/2)
అతః పరం విచిత్రార్థం శల్యపర్వ ప్రకీర్తితమ్ ॥ 279
తరువాతిది విచిత్రార్థాలతో కూడిన శల్య పర్వం (279)
హతప్రవీరే సైన్యే తు నేతా మద్రేశ్వరోఽభవత్ ।
యత్ర కౌమార మాఖ్యానం అభిషేకస్య కర్మ చ ॥ 280
ప్రసిద్ధవీరులంతా చనిపోయాక శల్యుడు సైన్యాధిపతి అయ్యాడు. ఇందులోనే కుమారస్వామి చరిత్ర, అభిషేక కర్మ చెప్పబడ్డాయి. (280)
వృత్తాని రథయుద్ధాని కీర్త్యంతే యత్ర భాగశః ।
వినాశః కురుముఖ్యానాం శల్యపర్వణి కీర్త్యతే ॥ 281
శల్యస్య నిధనం చాత్ర ధర్మరాజాన్మహాత్మనః ।
శకునేశ్చ వధోఽత్రైవ సహదేవేన సంయుగే ॥ 282
రథ యుద్ధాలు, కురుముఖ్యుల వినాశం ఈ శల్య పర్వంలో వర్ణింపబడింది. ధర్మరాజు శల్యుని చంపడమూ, సహదేవుడు యుద్ధంలో శకునిని వధించడమూ ఈ పర్వంలోనే జరిగాయి. (281,282)
సైన్యే చ హతభూయిష్ఠే కించిచ్ఛిష్టే సుయోధనః ।
హ్రదం ప్రవిశ్య యత్రాపౌ సంప్తభ్యాపో వ్యవస్థితః ॥ 283
చాలాసైన్యం చచ్చిపోయి ఇంకా కొద్దిసైన్యం మాత్రమే మిగిలి ఉంది. అపుడు దుర్యోధనుడు మడుగులో నీటిని స్తంభింపజేసి దాగుకొన్నాడు. (283)
ప్రవృత్తి స్తత్ర చాఖ్యాతా యత్ర భీమస్య లుబ్ధకైః ।
క్షేపయుక్తై ర్వచోభిశ్చ ధర్మరాజస్య ధీమతః ॥ 284
హ్రదాత్ సముత్థితో యత్ర ధార్తరాష్ట్రోఽత్యమర్షణః ।
భీమేన గదయా యుద్ధం యత్రాసౌ కృతవాన్ సహ ॥ 285
లుబ్ధకుల చేత భీమునికి దుర్యోధనుని ప్రవృత్తి ఇచ్చటనే చెప్పబడింది. ధర్మరాజు ఆక్షేపిస్తూ మాట్లాడగానే కోపంతో దుర్యోధనుడు బయటికి రావడం. అప్పుడు భీమునితో గదా యుద్ధం చెయ్యడమూ ఇందులోనే ఉంది. (284, 85)
సమవాయే చ యుద్ధస్య రామస్యాగమనం స్మృతమ్ ।
సరస్వత్యాశ్చ తీర్థానాం పుణ్యతా పరికీర్తితా ॥ 286
గదాయుద్ధం చ తుములం అత్రైవ పరికీర్తితమ్ ।
యుద్ధం చివరలో బలరాముడు రావడం, సరస్వతి మొదలయిన తీర్థాల పవిత్రత వర్ణించడం; భీమ, సుయోధనుల గదా యుద్ధమూ ఇందులోనే వర్ణించబడింది. (286 1/2)
దుర్యోధనస్య రాజ్ఞోఽథ యత్ర భీమేన సంయుగే ॥ 287
ఊరూ భగ్నౌ ప్రసహ్యాజౌ గదయా భీమవేగయా ।
నవమం పర్వ నిర్దిష్టం ఏతదద్భూత మర్థవత్ ॥ 288
ఆ గదాయుద్ధంలో భీమసేనుడు దుర్యోధనుని తొడలు విరుగగొట్టాడు. ఈ కథతో ఈ పర్వం అద్భుతమూ, అర్థవంతమూ అయింది. ఇది తొమ్మిదవ పర్వం. (287,288)
ఏకోనషష్టిరధ్యాయాః పర్వణ్యత్ర ప్రకీర్తితాః ।
సంఖ్యాతా బహువృత్తాంతాః శ్లోక సంఖ్యాత్ర కథ్యతే ॥ 289
ఈ పర్వంలో 59 ఏబది తొమ్మిది అధ్యాయాలున్నాయి. ఎన్నో వృత్తాంతాలున్న ఈ పర్వంలో..... (289)
త్రీణి శ్లోక సహస్రాణి ద్వే శతే వింశతిస్తథా ।
మునినా సంప్రణీతాని కౌరవాణాం యశోభృతా ॥ 290
(3220) మూడువేల రెండు వందల ఇరవై శ్లోకాలు వ్రాశాడు వ్యాసమహర్షి. (290)
అతః పరం ప్రవక్ష్యామి పౌప్తికం పర్వ దారుణమ్ ।
భగ్నోరూం యత్ర రాజానం దుర్యోధన మమర్షణమ్ ॥ 291
అపయాతేషు పార్థేషు త్రయస్తేఽభ్యాయయూ రథాః ।
కృతవర్మా కృపో ద్రౌణిః సాయాహ్నే రుధిరోక్షితమ్ ॥ 292
తరువాతి పర్వం దారుణమయిన సౌప్తిక పర్వం. తొడలు విరిగి నేల మీద పొర్లుతున్న దుర్యోధనుని విడిచి పాండవులు వెళ్లిపోయాక; కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ ముగ్గురూ సాయంకాలం రక్తపుమడుగులో ఉన్న దుర్యోధనుని దర్శించారు. (291,292)
సమేత్య దదృశుర్భూమౌ పతితం రణమూర్ధని ।
ప్రతిజజ్ఞే దృఢక్రోధః ద్రౌణిర్యత్ర మహారథః॥ 293
అహత్వా సర్వ పంచాలాన్ ధృష్టద్యుమ్నపురోగమాన్ ।
పాండవాంశ్చ సహామాత్యాన్ న విమోక్ష్యామి దంశనమ్ ॥ 294
కటిక నేలమీద పడి ఉన్న దుర్యోధనుని చూసి అశ్వత్థామ క్రోధంతో "ధృష్టద్యుమ్నుడూ మొదలయిన పాంచాలు రందరినీ, మంత్రి సహితంగా పాండవులనూ చంపకుండా కవచం విప్పను" అని ప్రతిజ్ఞ చేశాడు. (293,294)
యత్రైవ ముక్త్యా రాజానమ్ అపక్రమ్య త్రయో రథాః ।
సూర్యాస్తమనవేలాయాం ఆసేదుస్తే మహద్వనమ్ ॥ 295
దుర్యోధనుని అక్కడే విడిచి వారు మువ్వురూ సూర్యాస్తమయంలో వనం చేరారు. (295)
న్యగ్రోధస్యాథ మహతః యత్రాధస్తాద్ వ్యవస్థితాః ।
తతః కాకాన్ బహున్ రాత్రౌ దృష్ట్యోలూకేన హింసితమ్ ॥ 296
ద్రౌణిః క్రోధసమావిష్టః పితుర్వధమనుస్మరన్ ।
పంచాలానాం ప్రసుప్తానాం వధం ప్రతి మనో ద్ధే ॥ 297
ఆ వనంలో ఒక పెద్ద మర్రిచెట్టుక్రింద ముగ్గురూ కూర్చున్నారు. రాత్రి అయింది. ఒక గుడ్లగూబ కాకులను చంపడం చూశాడు అశ్వత్థామ. క్రోధావేశంతో అశ్వత్థామ తండ్రి వధను స్మరిస్తూ నిద్రించే పాంచాలురను వధించాలని నిశ్చయించుకొన్నాడు. (296,297)
గత్వా చ శిబిరద్వారి దుర్దశం తత్ర రాక్షసమ్ ।
ఘోరరూపమపశ్యత్ స దివమావృత్య ధిష్ఠితమ్ ॥ 298
అశ్వత్థామ శిబిర ద్వారం దగ్గర ఘోర రూపుడయిన రాక్షసుని చూశాడు. అతడు ఆకాశమంతా ఆవరించి నిలిచాడు. (298)
తేవ వ్యాఘాతమస్త్రాణాం క్రియమాణమవేక్ష్యచ ।
ద్రౌణిర్యత్ర విరూపాక్షం రుద్రమారాధ్య సత్వరః ॥ 299
వానిమీద అస్త్రాలు పనిచేయలేదు. అపుడు అశ్వత్తామ విరూపాక్షుడయిన రుద్రుని ఆరాధించాడు. (299)
ప్రసుప్తాన్ నిశి విశ్వస్తాన్ ధృష్టద్యుమ్నపురోగమాన్ ।
పంచాలాన్ సపరీవారాన్ ద్రౌపదేయాంశ్చ సర్వశః ॥ 300
కృతవర్మణా చ సహితః కృపేణ చ నిజఘ్నివాన్ ।
యత్రాముచ్యంత తే పార్థాః పంచ కృష్ణ బలాశ్రయాత్ ॥ 301
సాత్యకిశ్చ మహేష్వాసః శేషాశ్చ నిధనం గతాః ।
పంచాలానాం ప్రసుప్తానాం యత్ర ద్రోణసుతాత్ వధః ॥ 302
ధృష్టద్యుమ్నస్య సూతేన పాండవేషు నివేదితః ।
ద్రౌపదీ పుత్రశోకార్తా పితృభ్రాతృవధార్దితా ॥ 303
ఆదమరచి నిద్రపోతున్న ధృష్టద్యుమ్నాది పాంచాలురనూ, ఉపపాండవులనూ అశ్వత్థామ, కృప, కృతవర్మలు చంపివేశారు. కృష్ణుని వల్ల పాండవులు సాత్యకి మాత్రం తప్పించుకొన్నారు. మిగిలిన వారంతా చనిపోయారు. అపుడు ధృష్టద్యుమ్నుని సారథి వెళ్లి ఈ విషయం పాండవులకు చెప్పాడు. పుత్రులు, తండ్రి, సోదరులూ చనిపోయినందుకు ద్రౌపది చాలా దుఃఖించింది. (300-303)
కృతానశనసంకల్పా యత్ర భర్తౄనుపావిశత్ ।
ద్రౌపదీ వచనాద్ యత్ర భీమో భీమపరాక్రమః ॥ 304
ప్రియం తస్యాః చికీర్షన్ వై గదామాదాయ వీర్యవాన్ ।
అన్వధావత్ సుసంక్రుద్ధో భారద్వాజం గురోః స్మృతమ్ ॥ 305
ద్రౌపది అపుడే నిరాహారదీక్ష చేసింది. ద్రౌపది మాటతో ఆమెకు ప్రియం చెయ్యాలని భీముడు గద పట్టుకొని అశ్వత్థామను వెంటాడాడు. (304,305)
భీమసేనభయాద్యత్ర దైవేనాభిప్రచోదితః ।
అపాండవాయేతి రుషా ద్రౌణిరస్త్ర మవాసృజత్ ॥ 306
భీముని మీది భయంతోను, దైవప్రేరణతోనూ క్రోధంతో అశ్వత్థామ "అపాండవ మగుగాక" అని అస్త్ర ప్రయోగం చేశాడు. (306)
మైవమిత్యబ్రవీత్ కృష్ణః శమయం స్తస్య తద్వచః ।
యత్రాస్త్రమస్త్రేణ చ తత్ శమ్యామాస ఫాల్గునః ॥ 307
కృష్ణుడు వద్దని వారించినా వినలేదు అశ్వత్థామ. అపుడు అర్జునుడు ఆ అశ్వత్థామ అస్త్రాన్ని మరో అస్త్రంతో శమింపజేశాడు. (307)
ద్రౌణేశ్చ ద్రోహబుద్ధిత్వం వీక్ష్య పాపాత్మనస్తదా ।
ద్రౌణిద్వైపాయనాదీనాం శాపాశ్చాన్యోన్యకారితాః ॥ 308
ద్రౌణి యొక్క ద్రోహ బుద్ధిని చూసి వ్యాసుడు శపించాడు. అశ్వత్తామ తిరిగి వ్యాసుని శపించాడు. (308)
మణిం తథా సమాదాయా ద్రోణపుత్రాన్మహారథాత్ ।
పాండవాః ప్రదదుర్హృష్టాః ద్రౌపద్యై జితకాశినః ॥ 309
అపుడు అశ్వత్థామ నుండి మణిని తీసికొనివచ్చి ద్రౌపదికి ఇచ్చి పాండవులు సంతుష్టులు అయ్యారు. (309)
ఏతద్వై దశమం పర్వ పౌప్తికం సముదాహృతమ్ ।
అష్టాదశాస్మిన్నధ్యాయాః పర్వణ్యుక్తా మహాత్మనా ॥ 310
ఇది సౌప్తిక మనే పేరుగల పదవ పర్వం. ఇందులో పదునెనిమిది (18) అధ్యాయాలున్నాయి. (310)
శ్లోకానాం కధితాన్యత్ర శతాన్యష్టౌ ప్రసంఖ్యయా ।
శ్లోకాశ్చ సప్తతిః ప్రోక్తాః మునినా బ్రహ్మవాదినా ॥ 311
ఇందులో ఎనిమిదివందల డెబ్బది (870) శ్లోకాలున్నాయి. (311)
సౌప్తికైషీకే సంబద్ధే పర్వణ్యుత్తమతేజసా ।
అత ఊర్ధ్వ మిదం ప్రాహుః స్త్రీ పర్వ కరుణోదయమ్ ॥ 312
ఇలా సౌప్తిక పర్వం ఉత్తమతేజస్సులతో నిండిపోతే తరువాతిది స్త్రీ పర్వం పరమ శోకంతో నిండి పోయింది. (312)
పుత్రశోకాభిసంతప్తః ప్రజ్ఞాచక్షుర్నరాధిపః ।
కృష్ణోపనీతాం యత్రాసౌ ఆయసీం ప్రతిమాం దృఢామ్ ॥ 313
భీమసేనద్రోహబుద్ధిః ధృతరాష్ట్రో బభంజ హ ।
తథా శోకాభితస్తస్య ధృతరాష్ట్రస్య ధీమతః ॥ 314
సంసారగహనం బుద్ధ్యా హేతుభిర్మోక్షదర్శనైః ।
విదురేణ చ యత్రాస్య రాజ్ఞః ఆశ్వాసనం కృతమ్ ॥ 315
పుత్రశోకతో పరితపించే ధృతరాష్ట్రుడు భీముని చంపాలనుకోవడం, కృష్ణుడు ఇనుపభీముని ధృతరాష్ట్రుని ముందుంచడం, దాన్ని ధృతరాష్ట్రుడు పిండి పిండిగా చేయడం, శోకించే ధృతరాష్ట్రుని మోక్ష ధర్మాలతో విదురుడు ఓదార్చడం..... (313-315)
ధృతరాష్ట్రస్య చాత్రైవ కౌరవయోధనం తథా ।
సాంతఃపురస్య గమనం శోకార్తస్య ప్రకీర్తితమ్ ॥ 316
అంతఃపుర కాంతలతోకూడి ధృతరాష్ట్రుడు చనిపోయిన వారికై విలపించడం. (316)
విలాపో వీరపత్నీనాం యత్రాతికరుణః స్మృతః ।
క్రోధావేశః ప్రమోహశ్చ గాంధారీ ధృతరాష్ట్రయోః ॥ 317
అతికరుణంగా వీరపత్నులు విలపించడం, గాంధారీధృత రాష్ట్రుల క్రోధావేశమూ, ప్రమోహమూ..... (317)
యత్ర తాన్ క్షత్రియాః శూరాన్ సంగ్రామేష్వనివర్తినః ।
పుత్రాన్ భ్రాతౄన్ పితౄంశ్చైవ దదృశుర్నిహతాన్ రణే ॥ 318
అక్కడే చనిపోయిన కౌరవ వీరులనూ, కొడుకులనూ, తండ్రులనూ రణభూమిలో చూడటం.... (318)
పుత్రపౌత్రవధార్తాయాః తథాత్రైవ ప్రకీర్తితా ।
గాంధార్యాశ్చాపి కృష్ణేన క్రోధోపశమనక్రియా ॥ 319
పుత్రులూ, పౌత్రులూ చనిపోయి దుఃఖించే గాంధారికి కృష్ణుడు క్రోధం ఉపశమింపజేయడం. (319)
యత్ర రాజా మహాప్రాజ్ఞః సర్వధర్మభృతాం వరః ।
రాజ్ఞాం తాని శరీరాణి దాహయామాస శాస్త్రతః ॥ 320
చనిపోయిన వారి శరీరాలకు శాస్త్రోక్తంగా ధృతరాష్ట్రుడు దహనక్రియలు చేయించడం. (320)
తోయకర్మాణి చారబ్ధే రాజ్ఞాముదకదానికే ।
గూఢోత్పన్నస్య చాఖ్యానం కర్ణస్య పృథయాఽఽత్మనః ॥ 321
సుతస్త్యైతదిహప్రోక్తం వ్యాసేన పరమర్షిణా ।
ఏతదేకాదశం పర్వ శోకవైక్లబ్యకారణమ్ ॥ 322
ప్రణీతం సజ్జనమనో వైక్లబ్యాశ్రుప్రవర్తకమ్ ।
సస్తవింశతిరధ్యాయాః పర్వణ్యస్మిన్ ప్రకీర్తితాః ॥ 323
శ్లోకసప్తశతీ చాపి పంచసప్తతి సంయుతా ।
సంఖ్యయా భారతాఖ్యానం ఉక్తం వ్యాసేన ధీమతా ॥ 324
చనిపోయిన వారికి ఉదక ప్రదానాలు ...... అపుడు కుంతి తనకు రహస్యంగా పుట్టిన కర్ణుని జన్మను గురించి చెప్పడం....... ఇలా పదకొండవ పర్వం శోకానికీ వైక్లబ్యానికీ నిలయమైనది. ఇందులో ఇరువది ఏడు (27) అధ్యాయాలు, (775) ఏడువందల డెబ్బది అయిదు శ్లోకాలూ ఉన్నాయి. (321-24)
అతః పరం శాంతిపర్వ ద్వాదశం బుద్ధివర్ధనమ్ ।
యత్ర నిర్వేద మాపన్నః ధర్మరాజో యుధిష్ఠిరః ॥ 325
ఘతయిత్వా పితౄన్ భ్రాతౄన్ పుత్రాన్ సంబంధి మాతులాన్ ।
శాంతిపర్వణి ధర్మాశ్చ వ్యాఖ్యాతాః శరతల్పికాః ॥ 326
తరువాతిది పన్నెండవ పర్వం శాంతిపర్వం. ఇది బుద్ధిని పెంచేది. ఇందులోనే ధర్మరాజు తండ్రులనూ, సోదరులనూ, పుత్రులనూ, బంధువులనూ మేనమామలనూ చంపుకొన్నానని నిర్వేదం పొందడమూ, శరతల్పం మీద నున్న భీష్ముని వల్ల ఎన్నో ధర్మాలు వినడమూ జరిగింది. (325,326)
రాజభిర్వేదితవ్యాస్తే సమ్యక్ జ్ఞాన బుభుత్సుభిః ।
ఆపద్ధర్మాశ్చ తత్రైవ కాలహేతుప్రదర్శినః ॥ 327
యాన్ బుద్ధ్వా పురుషః సమ్యక్ సర్వజ్ఞత్వమవాప్నుయాత్ ।
మోక్ష ధర్మాశ్చ కథితాః విచిత్రా బహువిస్తరాః ॥ 328
మొదటివి రాజధర్మాలు. ఇవన్నీ రాజులందరూ జ్ఞానం కావాలనుకొన్నవారూ తప్పక తెలుసుకోవలసినవి. తరువాతివి ఆపద్ధర్మాలు. ఆ తరువాతివి మోక్షధర్మాలు. ఇవి చాలా విచిత్రాలూ, విస్తారాలు. ఇవి తెలిస్తే మానవునికి సర్వజ్ఞత్వం సిద్ధిస్తుంది. (327,328)
ద్వాదశం పర్వ నిర్దిష్టం ఏతత్ ప్రాజ్ఞ జనప్రియమ్ ।
ఆత్ర సర్వణి విజ్ఞేయం అధ్యాయానాం శతత్రయమ్ ॥ 329
త్రింశచ్పైవ తథాధ్యాయాః నవ చైవ తపోధనాః ।
చతుర్దశసహస్రాణి తథా సప్తశతాని చ ॥ 330
సప్తశ్లోకాస్తథైవాత్ర పంచ్వింశతి సంఖ్యయా ।
అత ఊర్ధ్వంచ విజ్ఞేయం అనుశాసన ముత్తమమ్ ॥ 331
ఈ పన్నెండవ పర్వం ప్రాజ్ఞులకు ఇష్టమయినది. ఈ పర్వంలో 339 (మూడువందల ముప్పది తొమ్మిది అధ్యాయాలూ), 14732 (పదునాలుగువేల ఏడువందల ముప్పది రెండు) శ్లోకాలు ఉన్నాయి. తరువాతిది అనుశాసన పర్వం. (329-331)
యత్ర ప్రకృతిమాపన్నః శ్రుత్వా ధర్మవినిశ్చయమ్ ।
భీష్మాత్ భాగీరథీ పుత్రాత్ కురురాజో యుధిష్ఠిరః ॥ 332
గంగా పుత్రుడైన భీష్ముని వల్ల కురురాజయిన ధర్మరాజు ఇందులోనే చాలా వేదధర్మాలు విని స్వస్థుడయ్యాడు. (332)
వ్యవహారోఽత్ర కార్త్స్న్యేన ధర్మార్థీ యః ప్రకీర్తితః ।
వివిధానాం చ దావానాం ఫలయోగాః ప్రకీర్తితాః ॥ 333
ఇక్కడే సర్వ ధర్మ వ్యవహారాలు, వివిధ దానాల ఫలితాలు వివరింపబడ్డాయి. (333)
తథా పాత్రవిశేషాశ్చ దానానాం చ పరో విధిః ।
ఆచారవిధియోగశ్చ సత్యస్య చ పరా గతిః ॥ 334
మహాభాగ్యం గవాం చైవ బ్రాహ్మణానాం తథైవ చ ।
రహస్యం చైవ ధర్మాణాం దేశకాలోపసంహితమ్ ॥ 335
ఏతత్సుబహువృత్తాంతమ్ ఉత్తమం చానుశాసనమ్ ।
భీష్మస్యాత్రైవ సంప్రాప్తిః స్వర్గస్య పరికీర్తితా ॥ 336
ఇందులోనే పాత్రాపాత్రవిశేషాలు, దానాలు - వాని వైశిష్ట్యం, ఆచారవిధులు, సత్యము యొక్క వైశిష్ట్యం, గోదాన విశేషాలు, బ్రాహ్మణుల విశేషాలు, దేశకాల సమ్మితతములైన ధర్మరహస్యాలు - ఇలా బహు వృత్తాంతాలతో నిండినది ఈ అనుశాసన పర్వం. ఇందులోనే భీష్ముని స్వర్గ ప్రాప్తి కూడా చెప్పబడింది. (334-336)
ఏతత్ త్రయోదశం పర్వ ధర్మనిశ్చయకారకమ్ ।
అధ్యాయానాం శతం త్వత్ర షట్చత్వారింశదేవ తు ॥ 337
ఈ పదమూడవ పర్వం ధర్మనిశ్చయం చేస్తుంది. ఇందులో నూట నలువది ఆరు (146) అధ్యాయాలున్నాయి. (337)
శ్లోకానాం తు సహస్రాణి ప్రోక్తాన్యష్టౌ ప్రసంఖ్యయా ।
తతోశ్వమేధికం నామ పర్వ ప్రోక్తం చతుర్దశమ్ ॥ 338
(8000) ఎనిమిది వేల శ్లోకాలున్నాయి. తరువాత పదునాల్గవ పర్వం ఆశ్వమేధిక పర్వం. (338)
తత్ సంవర్త మరుత్తీయం యత్రాఖ్యానమనుత్తమమ్ ।
సువర్ణకోశసంప్రాప్తిః జన్మచోక్తం పరీక్షితః ॥ 339
ఇందులోనే సంవర్త, మరుత్తరాట్టుల చరిత్ర చెప్పబడింది. ధర్మరాజు అశ్వమేధానికి సువర్ణరాసులు దొరకడం, పరీక్షిత్తుజననమూ చెప్పబడినవి. (339)
దహ్ధస్యాస్త్రాగ్నినా పూర్వం కృష్ణాత్ సంజీవనం పునః ।
చర్యాయాం హయముత్సృష్టం పాండవస్యానుగచ్ఛతః ॥ 340
తత్ర తత్ర చ యుద్ధాని రాజపుత్రైరమర్షణైః ।
చిత్రాంగదాయాః పుత్రేణ పుత్రికాయా ధనంజయః ॥ 341
సంగ్రామే బభ్రువాహేణ సంశయం చాత్ర దర్శితః ।
అశ్వమేధే మహాయజ్ఞే నకులాఖ్యానమేవ చ ॥ 342
ఇత్యాశ్వమేధికం పర్వ ప్రోక్తమేతన్మహాద్భుతమ్ ।
అధ్యాయానాం శతం చైవ త్రయోఽధ్యాయాశ్చ కీర్తితాః ॥ 343
త్రీణి శ్లోకసహస్రాణి తావంత్యేవ శతాని చ ।
వింశతిశ్చ తథా శ్లోకాః సంఖ్యాతాస్తత్వదర్శినా ॥ 344
అశ్వత్థామ అస్త్రాగ్నితో మాడిపోకుండా పరీక్షిత్తును కృష్ణుడు రక్షించడం, అశ్వమేధ యాగంలో గుర్రాన్ని వదలడం, అర్జునుడు వెంట వెళ్లడం, అక్కడక్కడ రాజులతో అర్జునుని యుద్ధాలు, చిత్రాంగద పుత్రుడయిన బభ్రువాహనునితో యుద్ధం, నకులాఖ్యానం, ఇలా అశ్వమేధపర్వం మహాద్భుతమైనది. నూట మూడు (103) అధ్యాయాలూ, మూడు వేల మూడు వందల ఇరవై (3320) శ్లోకాలూ ఉన్నాయి. (340-344)
తతస్త్వాశ్రమహవాసాఖ్యం పర్వ పంచదశం స్మృతమ్ ।
యత్ర రాజ్యం సముత్సృజ్య గాంధార్యా సహితో నృపః ॥ 345
ధృతరాష్ట్రోఽఽశ్రమపదం విదురశ్చ జగామ హ ।
యం దృష్ట్వా ప్రస్థితం సాధ్వీ పృథాప్యనుయయౌ తదా ॥ 346
పుత్రరాజ్యం పరిత్యజ్య గురుశుశ్రూషణే రతా ।
తరువాతి పదునైదవ పర్వం ఆశ్రమవాస పర్వం. ఇందులోనే ధృతరాష్ట్రుడు రాజ్యం వదలి గాంధారితో, విదురునితో ఆశ్రమవాసానికి వెళ్లిపొతాడు. కుంతికూడా గురుశుశ్రూషణ మీది ఆసక్తితో పుత్రుని, రాజ్యం వదలి ఆశ్రమవాసానికి వెళ్లింది. (345,346 1/2)
యత్ర రాజా హతాన్ పుత్రాన్ పౌత్రానన్యాంశ్చ పార్థివాన్ ॥ 347
లోకాంతరగతాన్ వీరాన్ అపశ్యత్ పునరాగతాన్ ।
ఋషేః ప్రసాదాత్ కృష్ణస్య దృష్ట్యాశ్చర్యమనుత్తమమ్ ॥ 348
త్వక్త్వా శోకం సదారశ్చ సిద్ధిం పరమికాం గతః ।
యత్ర ధర్మం సమాశ్రిత్య విదురః సుగతిం గతః ॥ 349
సంజయశ్చ సహామాత్యః విద్వాన్ గావల్గణిర్వశీ ।
దదర్శ నారదం యత్ర ధర్మరాజో యుధిష్ఠిరః ॥ 350
ఇందులోనే ఒక ఆశ్చర్యకర సన్నివేశం వ్యాసమహర్షి చూపించాడు. చనిపొయిన రాజులనూ, పుత్ర పౌత్రులనూ తీసికొని వచ్చి ధృతరాష్ట్రునికి చూపించాడు. ధృతరాష్ట్రుడు, గాంధారి పరమసిద్ధి పొందటం, విదురుడు, ధర్ముని ఆశ్రయించి సుగతికి వెళ్లడం, సంజయుడు కూడా వెళ్లిపోవడం ధర్మరాజు నారదుని చూడటం... ఇవన్నీ ఇందులోనే ఉన్నాయి. (347-350)
నారదాచ్చైవ శుశ్రావ వృష్ణీనాం కదనం మహత్ ।
ఏతదాశ్రమవాసాఖ్యం పర్వోక్తం మహదద్భుతమ్ ॥ 351
నారదుని వల్ల వృష్ణివంశస్థుల కలహం వినడం, ఇదంతా అద్భుతమయిన ఆశ్రమవాసపర్వం. (351)
ద్విచత్వారింశదధ్యాయాః పర్వైతదభీసంఖ్యయా ।
సహస్రమేకం శ్లోకానాం పంచశ్లోకశతాని చ ॥ 352
షడేవ చ తథా శ్లోకాః సంఖ్యాతాస్తత్వదర్శినా ।
అతః పరం నిబోధేదం మౌసలం పర్వ దారుణమ్ ॥ 353
ఇందులో 42 (నలువది రెండు) అధ్యాయాలూ, 1506 (పదునైదు వందల ఆరు) శ్లోకాలూ ఉన్నాయి. తరువాతిది దారుణమయిన మౌసలపర్వం. (352,353)
యత్ర తే పురుషవ్యాఘ్రాః శస్త్రస్పర్శహతా యుధి ।
బ్రహ్మదండ వినిష్పిష్టాః సమీపే లవణాంభసః ॥ 354
ఇందులోనే బ్రాహ్మణశాపంతో సముద్ర సమీపంలో యదువృష్ణి వంశస్థులంతా ఒకరినొకరు యుద్ధంలో చంపుకొన్నారు. (354)
ఆపానే పానకలితాః దైవేనాభిప్రచోదితాః ।
ఏరకారూపిభిర్వజ్రైః నిజఘ్నురితరేతరమ్ ॥ 355
దైవప్రేరణతో మధుపానస్థలంలో జమ్ముగడ్డి/ఱెల్లుగడ్డి రూపమయిన వజ్రాయుధాలతో ఒకరినొకరు చంపుకొన్నారు. (355)
యత్ర సర్వక్షయం కృత్వా తావుఖౌ రామకేశనౌ ।
నాతిచక్రామతుః కాలం ప్రాప్తం సర్వహరం మహత్ ॥ 356
ఈ పర్వంలోనే బలరామకృష్ణులిద్దరు కాలప్రాప్తమయిన వినాశాన్ని తప్పించుకోలేక పోయారు. (356)
యత్రార్జునో ద్వారవతీమ్ ఏత్య వృష్ణివినాకృతామ్ ।
దృష్ట్వా విషాదమగమత్ పరాం చార్తిం నరర్షభః ॥ 357
అర్జునుడు కృష్ణుడు లేని ద్వారకకు వెళ్లి ఎంతో దుఃఖం పొందాడు. (357)
స సంస్కృత్య నరశ్రేష్ఠం మాతులం శౌరిమాత్మన ।
దదర్శ యదువీరాణామ్ ఆపానే వ్యసనం మహత్ ॥ 358
పానశాల వల్ల యదువీరులకు కలిగిన కష్టాన్ని చూసి వసుదేవుడికి అర్జునుడు అగ్ని సంస్కారాదులు చేశాడు. (358)
శరీరం వాసుదేవస్య రామస్య చ మహాత్మనః ।
సంస్కారం లంభయామాస వృష్ణీనాం చ ప్రధానతః ॥ 359
అలాగే కృష్ణబలరాముల శరీరాలకూ, వృష్ణివంశస్థుల శరీరాలకు ప్రాధాన్యాన్ని బట్టి సంస్కారం చేశాడు. (359)
స వృద్ధబాలమాదాయ ద్వారవత్యాస్తతో జనమ్ ।
దదర్శాపది కష్టాయాం గాండీవస్య పరాభవమ్ ॥ 360
అర్జునుడు ద్వారకలోని వృద్ధులనూ, బాలురనూ తీసికొని బయలుదేరి వస్తూ గాండీవం కూడా పనిచేయక పోవడం చూసాడు. (360)
సర్వేషాం చైవ దివ్యానామ్ అస్త్రాణామప్రసన్నతామ్ ।
నాశం వృష్ణికళత్రాణామ్ ప్రభావానామనిత్యతామ్ ॥ 361
దృష్ట్వా నిర్వేదమాపన్నం వ్యాసవాక్యప్రచోదితాః ।
ధర్మరాజం సమాసాద్య సంన్యాసం సమరోచయత్ ॥ 362
దివ్యాస్త్రాలన్నీ పనిచేయక పోవడం, వృష్ణి వంశస్థుల భార్యల వినాశం, శక్తులన్నీ పోవడం, ఇవన్నీ చూసి అర్జునునికి నిర్వేదం కలిగి వ్యాసుని దర్శించాడు - ధర్మరాజును చేరి సన్యాసం స్వీకరించాలనుకొన్నాడు. (361,362)
ఇత్యేతన్మౌసలం పర్వ షోడశం పరికీర్తితమ్ ।
అధ్యాయాష్టౌ సమాఖ్యాతాః శ్లోకానాం చ శతత్రయమ్ ॥ 363
శ్లోకానాం వింశతిశ్పైవ సంఖ్యాతాస్తత్త్వదర్శినా ।
మహాప్రస్థానికం తస్మాత్ ఊర్ధ్వం సప్తదశం స్మృతమ్ ॥ 364
ఇది పదునారవదయిన మౌసల పర్వం (8) ఎనిమిది అధ్యాయలూ (330) మూడువందల ముప్పదిశ్లోకాలూ కలది. తరువాతి పదునెడవ పర్వం మహాప్రస్థానిక పర్వం. (363,364)
యత్ర రాజ్యం పరిత్యజ్య పాండవాః పురుషర్షభాః ।
ద్రౌపద్యా సహితా దేవ్యా మహాప్రస్థానమాస్థితాః ॥ 365
ఈ పర్వంలోనే ద్రౌపదితో సహా పాండవులంతా రాజ్యం విడిచి మహాప్రస్థానం చేశారు. (365)
యత్ర తేఽగ్నిం దదృశిరే లౌహిత్యం ప్రాప్య సాగరమ్ ।
యత్రాగ్నినా చోదితశ్చ పార్థస్తస్మై మహాత్మనే ॥ 366
దదౌ సంపూజ్య తద్దివ్యం గాండీవం ధనురుత్తమమ్ ।
యత్ర భ్రాతౄన్ నిపతితాన్ ద్రౌపదీం చ యుధిష్ఠిరః ॥ 367
దృష్ట్వా హిత్వా జగామైవ సర్వాననవలోకయన్ ।
ఏతత్ సప్తదశం పర్వ మహాప్రస్థానికం స్మృతమ్ ॥ 368
త్రోవలో అగ్నిహోత్రుని చూశారు. అగ్ని మాటతో అర్జునుడు గాండీవాన్ని పూజించి అగ్నిహోత్రునికి ఇచ్చివేశాడు - తమ్ముళ్లందరూ, ద్రౌపదీ పడిపోయారు. వారందరినీ విడిచి ధర్మరాజు వారిని చూడకుండానే వెళ్లిపోవడం ఈ పర్వంలోనే ఉన్నాయి. (366-368)
యత్రాధ్యాయాస్త్రయః ప్రోక్తాః శ్లోకానాం చ శతత్రయమ్ ।
నింశతిశ్చ తథా శ్లోకాః సంఖ్యాతాస్తత్త్వదర్శినా ॥ 369
ఈ మహాప్రస్థానిక పర్వంలో మూడు (3) అధ్యాయాలూ మూడు వందల ఇరవై (320) శ్లోకాలూ ఉన్నాయి. (369)
స్వర్గపర్వ తతో జ్ఞేయమ్ దివ్యం యత్ తదమానుషమ్ ।
ప్రాప్తం దైవరథం స్వర్గాత్ నేష్టవాన్ యత్ర ధర్మరాట్ ॥ 370
ఆరోఢుం సుమహాప్రాజ్ఞ ఆనృశం స్యాచ్ఛునా వినా ।
తామస్యావిచలాం జ్ఞాత్వా స్థితం ధర్మే మహాత్మనః ॥ 371
శ్వరూపం యత్ర తత్ త్యక్త్వా ధర్మేణాసౌ సమన్వితః ।
స్వర్గం ప్రాప్తః స చ తథా యాతనా విపులా భృశమ్ ॥ 372
దేవదూతేన నరకం యత్ర వ్యాజేన దర్శితమ్ ।
శుశ్రాన యత్ర ధర్మాత్మా భ్రాతౄణాం కరుణా గిరః ॥ 373
నిదేశే వర్తమానానాం దేశే తత్రైవ వర్తతామ్ ।
అనుదర్శితశ్చ ధర్మేణ దేవరాజేన పాండవః ॥ 374
తరువాతిది స్వర్గారోహణ పర్వం. ఇది దివ్య వృత్తాంతాలతో అలౌకికమయినది. స్వర్గం నుండి వచ్చిన రథాన్ని ధర్మరాజు కుక్కమీది కరుణతో ఎక్కననడం - అపుడు శునక రూపం వదలి యమధర్మరాజు ప్రత్యక్ష మవడం, అతనితో స్వర్గం చేరడం, అక్కడి నరకయాతనలన్నీ దేవదూత వల్ల చూడడం, తమ్ముళ్ల కరుణ స్ఫోరకమయిన అరుపులు వినడం, వారంతా యముని ఆజ్ఞ వల్ల యాతనలు పొందడం, తరువాత ఇంద్రుడూ, యముడూ ధర్మరాజుకు తమ్ముళ్ల సద్గతి చూపించడం... ఇదంతా స్వర్గారోహణ పర్వం. (370-374)
ఆప్లుత్యాకాశగంగాయాం దేహం త్యక్త్వా స మానుషమ్ ।
స్వధర్మనిర్జితం స్థానం స్వర్గే ప్రాప్య స ధర్మరాట్ ॥ 375
ముముదే పూజితః సర్వైః సేంద్రైః సురగణైః సహ ।
ఏతదష్టాదశం పర్వ ప్రోక్తం వ్యాసేన ధీమతా ॥ 376
ఆకాశగంగలో మునిగి మనుష్య శరీరం విడిచి తన ధర్మంతో ధర్మరాజు ఉచితమయిన స్థానం పొందడం, యమధర్మరాజు, ఇంద్రుడు, దేవతలూ సంతోషించడం.. ఇలా పదునెనిమిదవ అధ్యాయం పూర్తవుతుంది. (375,376)
అధ్యాయాః పంచ సంఖ్యాతాః పర్వణ్యస్మిన్ మహాత్మనా ।
శ్లోకానాం ద్వే శతే చైవ ప్రసంఖ్యాతే తపోధనాః ॥ 377
నవశ్లోకాస్తథైవాన్యే సంఖ్యాతాః పరమర్షిణా ।
అష్టాదశైవమేతాని పర్వాణ్యుక్తాన్యశేషతాః ॥ 378
ఈ స్వర్గారోహణ పర్వంలో అయిదు (5) అధ్యాయాలూ, (209) రెండువందల తొమ్మిది శ్లోకాలూ ఉన్నాయి. ఇలా వ్యాసమహర్షి (18) పదునెనిమిది పర్వాలు చెప్పాడు. (377,378)
ఖిలేషు హరివంశశ్చ భవిష్యం చ ప్రకీర్తితమ్ ।
ద్శశ్లోకసహస్రాణి వింశచ్చ్లోకశతాని చ ॥ 379
ఖిలేషు హరివంశే చ సంఖ్యాతాని మహర్షిణా ।
ఏతత్సర్వం సమాఖ్యాతం భారతే పర్వసంగ్రహః ॥ 380
ఖిల పర్వాలని హరివంశానికి పేరు. దానిలో హరివంశపర్వం, విష్ణుపర్వం, భవిష్యపర్వం అని మూడు ఉపపర్వాలు - ఇందులో (12000) పన్నెండు వేల శ్లోకాలున్నాయి. (379,380)
అష్టాదశ సమాజగ్ముః అక్షౌహిణ్యో యుయుత్సయా ।
తన్మహాదారుణం యుద్ధం అహన్యష్టాదశాభవత్ ॥ 381
యుద్ధం చేసే కోరికతో 18 అక్షౌహిణులు వచ్చాయి. 18 రోజులు యుద్ధం జరిగింది. (381)
యో విద్యాచ్చతురో వెదాన్ సాంగోపనిషదో ద్విజః ।
న చాఖ్యానమిదం విద్యాత్ నైవ స స్యాద్ విచక్షణః ॥ 382
అంగాలతో కలిపి నాలుగు వేదాలూ, ఉపనిషత్తులూ చదివిన విప్రుడయినా ఈ భారతం తెలియకపోతే అతడు విచక్షణుడు కాదు. (382)
వి: 1) వేదాంగాలు: శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిషం, ఛందస్సు (6)
వి: సం: 2) భారతజ్ఞానం నాలుగు వేదాలూ చదివిన జ్ఞానం కంటె అధికమని భావం (దేవ)
అర్థశాస్త్రమిదం ప్రోక్తం ధర్మశాస్త్రమిదం మహత్ ।
కామశాస్త్రమిదం ప్రోక్తం వ్యాసేనామితబుద్ధినా ॥ 383
అమితమయిన బుద్ధి వైభవం కల వ్యాసమహర్షి ఈ భారతాన్ని అర్థశాస్త్రం గాను, ధర్మశాస్త్రంగానూ, కామశాస్త్రంగానూ చెప్పాడు. (383)
శ్రుత్వా త్విదముపాఖ్యానం శ్రావ్యమన్యన్న రోచతే ।
పుంస్కోకిల రుతం శ్రుత్వా రూక్షా ధ్వాంక్షస్య వాగిన ॥ 384
పుంస్కోకిల పాట విన్నాక కాకి కూతలు ఎవరూ విననట్లు ఈ కథ విన్నాక మరొకటి ఎవరూ వినటానికి ఇష్టపడరు. (384)
ఇతిహాసోత్తమాదస్మాత్ జాయంతే కవిబుద్ధయః ।
పంచఖ్య ఇవ భూతేభ్యః లోకసంవిధయస్త్రయః ॥ 385
పంచభూతాల వల్లనే లోకంలోని సంవిధానాలు ప్రవర్తిల్లినట్లు ఈ ఇతిహాసం నుండే కవుల బుద్ధులన్నీ ఉద్భవిస్తాయి. (385)
అస్యాఖ్యానస్య విషయే పురాణం వర్తతే ద్విజాః ।
అంతరిక్షస్య విషయే ప్రజా ఇవ చతుర్విధాః ॥ 386
పదునెనిమిది పురాణాల విషయాలన్నీ ఈ ఇతిహాసంలో ఉన్నాయి, ఆకాశంలోనే నాలుగు రకాల ప్రాణులూ ఉన్నట్లు. (జరాయుజములు, స్వేదజములు, అండజములు, ఉద్భిజ్జములు అని ప్రాణులు నాల్గువిధాలు) (386)
క్రియాగుణానాం సర్వేషాం ఇదమాఖ్యానమాశ్రయః ।
ఇంద్రియాణాం సమస్తానాం చిత్రా ఇవ మనఃక్రియాః ॥ 387
ఇంద్రియాలన్నిటికీ చిత్రాలయిన మనఃక్రియలు ఆశ్రయాలయినట్లు. క్రియా, గుణాలన్నిటికీ ఈ భారతం ఆశ్రయం. (387)
వి: సం॥ 1. క్రియలు = నిత్యం, నైమిత్తికం మొదలయినవి 2. గుణములు = శబ్ద విషయంలో శ్లేషలు మొ:
అర్థవిషయంలో 1) జీవాత్మకు క్షమ, మొ॥
2) పరమాత్మకు ఆనందం మొ॥ (దేవ)
అనాశ్రిత్యైతదాఖ్యానం కథా భువి న విద్యతే ।
ఆహారమనపాశ్రిత్య శరీరస్యేవ ధారణమ్ ॥ 388
ఆహారం విడిచి శరీరాన్ని ధరించలేము. అలాగే ఈ భారతాన్ని ఆశ్రయించకుండా ఏ కథా భూమి మీద కనపడదు. (388)
వి: సం: సర్వకథలకు ఈ మహాభారతం మూలమని భావం (దేవ)
ఇదం కవివరైః సర్వైః అఖ్యానముపజీవ్యతే ।
ఉదయప్రేప్సుభిర్భృత్యైః అభిజాత ఇవేశ్వరః ॥ 389
అస్య కావ్యస్య కవయః న సమర్థా విశేషణే ।
సాధోరివ గృహస్థస్య శేషాస్త్రయ ఇనాశ్రమాః ॥ 390
ఉన్నతిని కోరే సేవకులు ఆభిజాత్యం కల మహారాజును కోరుకున్నట్లు, ఉత్తమ కవీశ్వరులంతా ఈ భారత కథను ఆధారంగా తీసుకుంటారు. ఈ కావ్యాన్ని మించి కవులెవరూ విశేషంగా/గొప్పగా చెప్పలేరు. ఆశ్రమాలు నాల్గింటిలోనూ గృహస్థాశ్రమం ఉత్తమమయినట్లు ఈ భారతం సర్వోత్కృష్టమయిన గ్రంథం. (389,390)
ధర్మే మతిర్భవతు వః సతతోత్థితానాం
స హ్యేక ఏవ పరలోకగతస్య బంధుః ।
అర్థా స్త్రియస్య నిపుణైరపి సేవ్యమానాః
నైవాస్తభావముపయాంతి న చ స్థిరత్వమ్ ॥ 391
మహర్షులారా! భారత శ్రోతలారా! నిత్య ప్రయత్న పరులయిన మీకు ధర్మం మీదనే బుద్ధి నిలవాలి. నిలుచుగాక! పరలోకానికి వెళ్లేవానికి అది ఒక్కటే బంధువు. కాంతా కనకాలను నిపుణులు ఎంత సేవించినా అవి ఆప్తభావం పొందవు (ఆప్తులు కావు) - స్థిరం కావు. (391)
ద్వైపాయనోష్ఠపుటనిఃసృతమప్రమేయం
పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ ।
యో భారతం సమధిగచ్ఛతి వాచ్యమానం
కిం తస్య పుష్కరజలైభిషేచనేన ॥ 392
ఈ భారతం వ్యాసమహర్షి ముఖం నుండి ప్రవహించిన అమృతలహరి - సాటిలేనిది - పుణ్యప్రదమైనది - పవిత్రమైనది. పాపం హరిస్తుంది. శుభప్రదం (పుణ్యార్థులు భారత శ్రవణమే చేయాలి అని భావం) (392)
యదహ్నా కురుతే పాపం బ్రాహ్మణస్త్వేంద్రియైశ్చరన్ ।
మహాభారతమాఖ్యాయ సంధ్యాం ముచ్యతి పశ్చిమామ్ ॥ 393
ఇంద్రియలోలుడై చరించే విప్రుడు కూడా పగటి పూట చేసిన్ పాపాన్ని మహాభారతం చెప్పి, చదివి, సాయం సంధ్యా వందనంతో పోగొట్టుకొంటాడు. (393)
యద్రాత్రౌ కురుతే పాపం కర్మణా మనసా గిరా ।
మహాభారతమాఖ్యాయ పూర్వాం సంధ్యాం ప్రముచ్యతే ॥ 394
అలాగే మనోవాక్కాయాలతో రాత్రిచేసిన పాపం మహాభారతం పఠిస్తే ఉదయకాల సంధ్యావందన సమయానికి పోగొట్టుకొంటాడు. (394)
యో గోశనం కనకశృంగమయం దదాతి
విప్రాయ వేదవిదుషే చ బహుశ్రుతాయ ।
పుణ్యాం చ భారతకథాం శృణుయాచ్చ నిత్యం
తుల్యం ఫలం భవతి తస్య చ తస్య చైవ ॥ 395
బంగారుకొమ్ములున్న వంద ఆవులను వేదం చదువుకొన్న చక్కని పండితునికి దానం చేస్తే వచ్చే పుణ్యమూ, భారతకథను నిత్యమూ విన్నవారికి వచ్చే పుణ్యమూ సమానమే. (395)
ఆఖ్యానం తదిదమనుత్తమం మహార్థం
విజ్ఞేయం మహదిహ పర్వసంగ్రహేణ ।
శ్రుత్వాదౌ భవతి నృణాం సుఖావగాహం
విస్తీర్ణాం లవణజలం యతా ప్లవేన ॥ 396
విలువయిన బరువయిన భావాలు కల ఈ భారతేతిహాసం ముందు ఈ పర్వసంగ్రహాధ్యాయం వింటే మానవులకు సుఖంగా అవగాహనమవుతుంది. విస్తీర్ణమయిన సముద్రాన్ని చిన్న నావతో దాటినట్లు సుఖమైన అవగాహానికి తోడ్పడుతుంది. (396)
వి: అవగాహము = అర్థం చేసుకోవడం, స్నానం చేయడం అని రెండర్థాలు.
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి పర్వసంగ్రహ పర్వణి ద్వితీయోఽధ్యాయః ॥ 2 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున పర్వసంగ్రహ పర్వమను ఉపపర్వమున రెండవ అధ్యాయము. (2)